170. నూట డెబ్బదియవ అధ్యాయము
పాండవ రథాతిరథ సంఖ్యానము - 2
భీష్మ ఉవాచ
ద్రౌపదేయా మహారాజ సర్వే పంచ మహారథాః।
వైరాటిరుత్తరశ్చైవ రథోదారో మతో మమ॥ 1
భీష్ముడు చెప్పాడు.
మహారాజా! ద్రౌపదీ కుమారులయిదుగురూ మహారథికులే. విరాట పుత్రుడయిన ఉత్తరుని గొప్పరథికుడని తలుస్తాను. (1)
అభిమన్యుర్మహాబాహూ రథయూథపయూథపః।
సమః పార్థేన సమరే వాసుదేవేన చారిహా॥ 2
లబ్ధాస్త్రశ్చిత్రయోధీ చ మనస్వీ చ దృఢవ్రతః।
సంస్మరన్ వై పరిక్లేశం స్వపితుర్వీక్రమిష్యతి॥ 3
మహాబాహువయిన అభిమన్యుడు రథయూథ నాయకులను గూడ యూథపతి. శత్రువులను నాశం చేసే ఆ వీరుడు సమరభూమిలో అర్జునునితోను, శ్రీకృష్ణునితోను సమానుడు. అతడు అస్త్రవిద్యలో శాస్త్రీయ పద్ధతిలో శిక్షణను పొందాడు. అతడు యుద్ధానికి చెందిన విచిత్ర కళల నెరుగును. దృఢ దీక్షకల మనస్వి అభిమన్యుడు. తన తండ్రి పొందిన కష్టాలను గుర్తుచేసికొని పరాక్రమిస్తాడు. (2,3)
సాత్యకిర్మాధనఃశూరః రథయూథపయూథపః।
ఏష వృష్ణిప్రవీరాణామ్ అమర్షీ జితసాధ్వసః॥ 4
మధువంశంలో పుట్టిన వీరుడయిన సాత్యకి రథయూథ పతులకు గూడ యూథపతి. వృష్ణివంశ వీరులలో సాత్యకి అమర్షశీలం కలవాడు. ఇతడు భయం ఎరగడు. (4)
ఉత్తమౌజాస్తథా రాజన్ రథోదారో మతో మమ।
యుధామన్యుశ్చ విక్రాంతః రథోదారో మతో మమ॥ 5
రాజా! ఉత్తమౌజుని కూడా గొప్ప రథికుడని భవిస్తాను. పరాక్రమవంతుడయిన యుధామన్యువు నా అభిప్రాయంలో శ్రేష్ఠుడయిన రథికుడు. (5)
ఏతేషాం బహుసాహస్రాః రథా నాగా హయాస్తథా।
యోత్స్యంతే తే తనూం స్త్యక్త్వా కుంతీపుత్ర ప్రియేప్సయా॥ 6
ఇతనికి చాలా వేల రథాలు, ఏనుగులు, గుర్రాలు ఉన్నాయి. ఇతడు యుధిష్ఠిరునకు ప్రియం కలిగించాలనే కోరికతో తన శరీరాన్ని వదిలి అయినా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. (6)
పాండవై స్సహ రాజేంద్ర తవ సేనాసు భారత।
అగ్నిమారుతవద్ రాజన్ ఆహ్వయంతః పరస్పరమ్॥ 7
రాజేంద్రా! వారు పాండవులతో కలిసి మీ సైన్యంలో ప్రవేశించడం కోసం ఒకరినొకరు ఆహ్వానించుకుంటూ అగ్ని వాయువులవలె సంచరిస్తారు. (7)
అజేయౌ సమరే వృద్ధౌ విరాటద్రుపదౌ తథా।
మహారథౌ మహావీర్యౌ మతౌ మే పురుషర్షభౌ॥ 8
వృద్ధరాజులయిన విరాటుడు, ద్రుపదుడు యుద్ధంలో అజేయులు, నరశ్రేష్ఠులు, మహాపరాక్రమవంతులూ అయిన ఆ యిద్దరినీ మహారథులుగా తలుస్తున్నాను. (8)
వయోవృద్ధా వపి హి తౌ క్షత్రధర్మపరాయణౌ।
యతిష్యేతే పరం శక్త్వా స్థితౌ వీరగతే పథి॥ 9
వయస్సు దృష్టిలో ముసలివారైనా వారు క్షత్రియధర్మాన్ని ఆశ్రయించి, వీరులబాటలో ఉండి తమ శక్తి మేరకు యుద్ధప్రయత్నం చేస్తారు. (9)
సంబంధకేన రాజేంద్ర! తౌ తు వీర్యబలాన్వయాత్।
ఆర్యవృత్తౌ మహేష్వాసౌ స్నేహపాశసితావుభౌ॥ 10
రాజేంద్రా! వీరిద్దరూ వీర్యం, బలం, శ్రేష్ఠవంశం గల పురుషులతో సమానంగా సదాచారం కలవారు, గొప్ప ధనుర్ధరులు, పాండవులతో బంధుత్వం ఉన్న కారణంగా వారు స్నేహబంధంలో బంధింపబడి ఉన్నారు. (10)
కారణం ప్రాప్య తు నరాః సర్వ ఏవ మహాభుజాః।
శూరా వా కాతరా వాపి భవంతి కురుపుంగవ॥ 11
కురుశ్రేష్ఠా! ఏదో కారణం వల్ల తరచుగా మహాబాహువులయిన మానవులు శూరులుగానో, పిరికివారు గానో అవుతూ ఉంటారు. (11)
ఏకాయనగతావేతౌ పార్థివౌ దృఢధన్వినౌ।
ప్రాణాం స్త్యక్త్వా పరం శక్త్యా ఘట్టితారౌ పరంతప॥ 12
పరంతపా! దృఢంగా ధనుస్సు ధరించే విరాట ద్రుపదులు వీరమార్గాన్ని మాత్రమే ఆశ్రయించారు. వారు ప్రాణాలను లెక్క చేయకుండా తమ పూర్ణబలంతో మీ సేనతో యథాశక్తిగా యుద్ధం చేస్తారు. (12)
పృథగక్షౌహిణీభ్యాం తౌ ఉభౌ సంయతి దారుణౌ।
సంబంధిభావం రక్షంతౌ మహత్ కర్మ కరిష్యతః॥ 13
వారిద్దరూ యుద్ధంలో మహా భయంకరులు. తమ బంధువుల రక్షణం కోసం ఒక్కొక్క అక్షౌహిణితో బాగా పరాక్రమిస్తారు. (13)
లోకవీరౌ మహేష్వాసౌ త్యక్తాత్మానౌ చ భారత।
ప్రత్యయం పరిరక్షంతౌ మహత్ కర్మ కరిష్యతః॥ 14
భారతా! మహాధనుర్ధరులు, జగత్తులో సుప్రసిద్ధ వీరులూ అయిన ఆ యిద్దరు నరేశ్వరులూ, తమ పట్ల గల విశ్వాసాన్ని, గౌరవాన్ని రక్షించుకొంటూ యుద్ధభూమిలో ప్రాణాలకు తెగించి గొప్ప యుద్ధం చేస్తారు. (14)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణీ రథాతిరథసంఖ్యాన పర్వణి సప్తత్యధిక శతతమోఽధ్యాయః ॥ 170 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున రథాతిరథసంఖ్యాన పర్వమను ఉపపర్వమున నూట డెబ్బదియవ ఆధ్యాయము. (170)