171. నూట డెబ్బది యొకటవ అధ్యాయము

పాండవ రథాతిరథ సంఖ్యానము - 3.

భీష్మ ఉవాచ
పాంచాలరాజస్య సుతః రాజన్ పరపురంజయః।
శిఖండీ రథముఖ్యో మే మతః పార్థస్య భారత॥ 1
భీష్ముడిలా అన్నాడు. రాజా! పాంచాల రాజయిన ద్రుపదుని కుమారుడు శిఖండి శత్రువుల నగరాలపై విజయాన్ని పొందేవాడు. యుధిష్ఠిరుని సేనలో శిఖండి ఒక ప్రముఖరథికుడని నే ననుకొంటున్నాను. (1)
ఏష యోత్స్యతి సంగ్రామే నాశయన్ పూర్వసంస్థితమ్।
పరం యశో విప్రథమన్ తవ సేనాసు భారత॥ 2
భారతా! అతడు మీ సేనలో ప్రవేశించి తన పూర్వపు అపకీర్తి పోగొట్టుకొని, మంచి పేరును విస్తరిస్తూ గొప్ప ఉత్సాహంతో యుద్ధం చేస్తాడు. (2)
విశేః నాశయన్ పూర్వసంస్థితమ్ = పూర్వం తాను స్త్రీగా ఉండుటను చూపకుండా పౌరుషాన్ని చూపుతూ అని అర్థం లేదా పూర్వవ్యూహాలను నాశం చేస్తూ, సైన్యాలను తరుముతీ అని భావం (నీల) మహియసో విప్రథయన్ అని పాఠం - తన కంటె యువకులను ముందుకు రానివ్వకుండా నిలువరించుచు నని భావం(అర్జు)
ఏతస్య బహులాః సేనాః పంచాలా శ్చ ప్రభద్రకాః।
తేనాసౌ రథవంశేన మహత్ కర్మ కరిష్యతి॥ 3
ఇతని వెంట చాలా పాంచాలసైన్యం ప్రభద్రసైన్యం ఉంది. అతడారథికుల సముహం ద్వారా మహా యుద్ధం చేస్తాడు. (3)
ధృష్టద్యుమ్నశ్చ సేనానీః సర్వసేనాసు భారత।
మతో మేఽతిరథో రాజన్ ద్రోణశిష్యో మహారథః॥ 4
పాండవుల సైన్యాని కంతటికీ అధిపతి, ద్రోణాచార్యుని మహారథికశిష్యుడు అయిన ధృష్టద్యుమ్నుడు నా అభిప్రాయంలో అతిరథుడు. (4)
ఏష యోత్స్యతి సంగ్రామే సూదయన్ వై పరాన్ రణే।
భగవానివ సంక్రుద్ధః పినాకీ యుగసంక్షయే॥ 5
పినాక ధనుస్సును ధరించిన భగవంతుడయిన రుద్రుడు ప్రళయకాలంలో కోపించి ప్రజాసంహారం చేసినట్లుగా ఇతడు రణరంగంలో శత్రువులను చంపుతూ యుద్ధం చేస్తాడు. (5)
ఏతస్య తద్ రథానీకం కథయంతి రణప్రియాః।
బహుత్వాత్ సాగరప్రఖ్యం దేవానామివ సంయుగే॥ 6
ఇతని దగ్గర దేవసేనతో సమానమయిన విశాల రథికసేన ఉంది. ఆ సేన చాలా ఉన్నందువల్ల యుద్ధప్రియులయిన సైనికులు రణంలో అతని సేన సాగరం వంటి దంటారు. (6)
క్షత్రధర్మా తు రాజేంద్ర మతో మేఽర్దరథో నృప।
ధృష్టద్యుమ్నస్య తనయః బాల్యాన్నాతికృతశ్రమః॥ 7
రాజేంద్రా! ధృష్టద్యుమ్నుని కుమారుడు క్షత్రధర్ముడు నా అభిప్రాయంలో అర్ధరథుడు. బాల్యావస్థలో ఉన్నందున అతడు అస్త్ర విద్యలో అధిక పరిశ్రమ చేయలేదు. (7)
శిశుపాలసుతో వీరః చేదిరాజో మహారథః।
ధృష్టకేతుర్మహేష్వాసః సంబంధీ పాండవస్య హ॥ 8
శిశుపాలుని కుమారుడు చేదిరాజు ధృష్టకేతువు. మహాధనుర్ధరుడు, వీరుడు, యుధిష్ఠిరుని బంధువు, మహారథుడు. (8)
ఏష చేదిపతి శ్శూరః సహ పుత్రేణ భారత।
మహారథానాం సుకరం మహత్ కర్మ కరిష్యతి॥ 9
భారతా! ఈ శౌర్యసంపన్నుడయిన చేదిరాజు తమ పుత్రులతో కూడా వచ్చి మహారథికులకు సహజమైన పరాక్రమం చూపి యుద్ధం చేస్తారు. (9)
క్షత్రధర్మరతో మహ్యం మతః పరపురంజయః।
క్షత్రదేవస్తు రాజేంద్ర పాండవేషు రథోత్తమః॥ 10
రాజేంద్రా! శత్రునగరాలను జయించే క్షత్రియ ధర్మపరాయణుడు క్షత్రదేవుడు. నా అభిప్రాయంలో పాండవసైన్యంలో ఒక శ్రేష్ఠరథికుడు. (10)
జయంతశ్చామితౌజాశ్చ పత్యజిచ్చ మహారథః।
మహారథా మహాత్మానః సర్వే పాంచాల సత్తమాః॥ 11
యోత్స్యంతే సమరే తాత సంరబ్ధా ఇవ కుంజరాః।
జయంతుడు, అమితౌజుడు, మహారథుడయిన సత్యజిత్తు వీరందరూ పాంచాలురలో శ్రేష్ఠులు, మహాత్ములు, మహా రథికులు. నాయనా! వీరు అందరూ కోపంతో నిండిన గజరాజుల్లా రణరంగంలో యుద్ధం చేస్తారు. (11 1/2)
అజో భోజశ్చ విక్రాంతౌ పాండవార్థే మహారథౌ॥ 12
యోత్స్యేతే బలినౌ శూరౌ పరం శక్త్యా క్షయిష్యతః।
పాండవుల కోసం గొప్ప పరాక్రమం చూపేవారు, బలవంతులు, శూరవీరులూ అయిన అజుడు, భోజుడు మహారథికులు. వారు సంపూర్ణ శక్తితో యుద్ధం చేస్తారు. (12 1/2)
విః క్షయిష్యతః = తమ సామర్థ్యాన్ని చూపుతూ అని అర్థం. ఇక్కడ ఈ ధాతువునకు ఐశ్వర్యం = సామర్థ్యం అర్థం.
శీఘ్రాస్త్రాశ్చిత్రయోద్ధారః కృతినో దృఢవిక్రమాః॥ 13
కేకయాః పంఛ రాజేంద్ర భ్రాతరో దృఢవిక్రమాః।
సర్వే చైవ రథోదారాః సర్వే లోహితకధ్వజాః॥ 14
రాజేంద్రా! వేగంగా అస్త్రాల్ని ప్రయోగిస్తూ విచిత్రంగా యుద్ధం చేసే సమరంలో నిపుణులు, దృఢపరాక్రమం కలవారు, అయిదుగురు కేకయరాజకుమారులు. వారందరూ గొప్ప రథికులు. వారందరి జెండాలు ఎర్రనివి. (13,14)
కాశికః సుకుమారశ్చ నీలో యశ్చాపరో నృపః।
సూర్యదత్తశ్చ శంఖశ్చ మదిరాశ్వశ్చ నామతః॥ 15
సర్వ ఏవ రథోదారాః సర్వే చాహవలక్షణాః।
సర్వాస్త్రవిదుషస్సర్వే మహాత్మానో మతా మమ॥ 16
సుకుమారుడు, కాశికుడు, నీలుడు, సూర్యదత్తుడు, శంఖుడు, మదిరాశ్వుడు వీరందరూ ఉదారులయిన రథికులు. యుద్ధం వీరి కందరికీ శౌర్యాన్ని సూచించే లక్షణం. వీరందరూ అన్ని అస్త్రాలను ఎరిగిన వారు. మహా మనస్వులు అని నేను భావిస్తున్నాను. (15,16)
వి॥ సుకుమారుడు = పాండవపక్షంలో ఒక రథోదారుడు
కాశికుడు = పాండవ పక్షంలో ఒక రథోదారుడు
నీలుడు = పాండవ పక్షంలో ఒక రథోదారుడు
సూర్యదత్తుడు = విరాటుని సోదరుడు
శంఖుడు = విరాటుని కొడుకు
మదిరాశ్వుడు = విరాటుని కొడుకు
వార్ధక్షేమిర్మహారాజ మతో మమ మహారథః।
చిత్రాయుధశ్చ నృపతిః మతో మే రథసత్తమః॥ 17
మహారాజా! వార్ధక్షేమి మహారథికుడని నే ననుకుంటున్నాను. చిత్రాయుధరాజు నా అభిప్రాయంలో శ్రేష్ఠరథికుడు. (17)
స హి సంగ్రామశోభీ చ భక్తశ్చాపి కిరీటినః।
చేకితానః సత్యధృతిః పాండవానాం మహారథౌ।
ద్వావిమౌ పురుషవ్యాఘ్రౌ రథోదారౌ మతౌ మమ॥ 18
చిత్రాయుధుడు సంగ్రామంలో శోభించేవాడు, అర్జునుని పట్ల భక్తి భావం కలవాడు. చేకితానుడు సత్యధృతి ఈ పురుషశ్రేష్ఠులు పాండవ సైన్యంలో మహారథికులు. నేను వీరిని శ్రేష్ఠరథికులని భావిస్తాను. (18)
వ్యాఘ్రదత్తశ్చ రాజేంద్ర చంద్రసేనశ్చ భారత।
మతౌ మమ రథోదారౌ పాండవానాం న సంశయః॥ 19
మహారాజా! వ్యాఘ్రదత్తుడు, చంద్రసేనుడు అనే యిద్దరు రాజులూ నా అభిప్రాయంలో పాండవసేనలో శ్రేష్ఠరథికులు. సంసయం లేదు. (19)
సేనాబిందుశ్చ రాజేంద్ర క్రోధహంతా చ నామతః।
యస్సమో వాసుదేవేన భీమసేనేన వా విభో॥ 20
స యోత్స్యతి హి విక్రమ్య సమరే తవ సైనికైః।
రాజేంద్రా! సేనాబిందురాజు రెండవ పేరు క్రోధహంత. ప్రభూ! అతడు భగవంతుడయిన శ్రీకృష్ణునితో, భీమసేనునితో సమానుడు. అతడు రణరంగంలో పరాక్రమించి నీ సైన్యంతో యుద్ధం చేస్తాడు. (20 1/2)
మాం చ ద్రోణం కృపం చైవ యథా సమ్మన్యతే భవాన్॥ 21
తథా స సమరశ్లాఘీ మంతవ్యో రథసత్తమః।
కాశ్యః పరమశీఘ్రాస్త్రః శ్లాఘనీయో నరోత్తమః॥ 22
నీవు నన్ను ద్రోణాచార్యుని, కృపాచార్యుని ఎలా భావిస్తావో అలా భావించదగినవాడు కాశిరాజు. అతడు రణంలో చాలా వేగంగా అస్త్ర శస్త్రాలను ప్రయోగిస్తాడు. ప్రశంసింపదగిన వాడు, ఉత్తమ రథికుడు, నరశ్రేష్ఠుడు. (21,22)
రథ ఏకగుణో మహ్యం జ్ఞేయః పరపురంజయః।
అయం చ యుధి విక్రాంతః మంతవ్యోఽష్టగుణో రథః॥ 23
శత్రు నగరాలను జయించే సమయంలో కాశీరాజు నా దృష్టిలో రథికుడు. కాని యుద్ధంలో విక్రమించే సమయంలో అతడు ఎనమండుగురు రథికులతో సమానుడు. (23)
సత్యజిత్ సమరశ్లాఘీ ద్రుపదస్యాత్మజో యువా।
గతస్సోఽతిరథత్వం హి ధృష్టద్యుమ్నేన సమ్మితః॥ 24
పాండవానాం యశస్కామః పరం కర్మ కరిష్యతి।
ద్రుపదుని కుమారుడు సత్యజిత్తు యువకుడు. అతడెప్పుడూ యుద్ధాన్ని కోరుతాడు. అతడు ధృష్టద్యుమ్నునితో సమానంగా అతిరథత్వం పొందదగిన వాడు. అతడు పాండవుల యశస్సును కోరి గొప్ప యుద్ధం చేస్తాడు. (24 1/2)
అనురక్తశ్చ శూరశ్చ రథోఽయమపరో మహాన్॥ 25
పాండ్యరాజో మహావీర్యః పాండవానాం ధురంధరః।
దృఢధన్వా మహేష్వాసః పాండవానాం మహారథః॥ 26
పాండవ పక్షభారం వహించేవాడు, మహాపరాక్రమ వంతుడూ అయిన పాండ్యరాజొక మహారథుడు. పాండవుల యెడ అనురాగం కల యితడు శూరుడు. దృఢమైన పెద్దవిల్లు దాల్చిన ఇతడు పాండవసేనలో గౌరవింపదగిన మహారథికుడు. (25-26)
శ్రేణిమాన్ కౌరవశ్రేష్ఠ వసుదానశ్చ పార్థివః।
ఉభావేతావతిరథౌ మతౌ పరపురంజయౌ॥ 27
కౌరవశ్రేష్ఠ! శ్రేణిమంతుడు, వసుదాసుడు ఇద్దరూ అతిరథులయిన వీరులు. వీరు శత్రు పట్టణాలను జయించడంలో సమర్థులు. (27)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణీ రథాతిరథసంఖ్యాన పర్వణి ఏకసప్తత్యధిక శతతమోఽధ్యాయః ॥ 171 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున రథాతిరథసంఖ్యాన పర్వమను ఉపపర్వమున నూట డెబ్బది యొకటవ ఆధ్యాయము. (171)