180. నూట ఎనుబదియవ అధ్యాయము
భీష్మ పరశురాముల యుద్ధము.
భీష్మ ఉవాచ
ఆత్మనస్తు తతః సూతః హయానాం చ విశాంపతే।
మమ చాపనయామాస శల్యాన్ కుశలసమ్మతః॥ 1
భీష్ముడు చెప్తున్నాడు. రాజా! అనంతరం నేర్పుకల సూతుడు గుర్రాలకు, తనకు, నాకు గుచ్చుకొన్న బాణపుములుకులను పెరికివేశాడు. (1)
స్నాతాపవృత్తైస్తురగైః లబ్ధతోయై రవిహ్వలైః।
ప్రభాతే చోదితే సూర్యే తతో యుద్ధమవర్తత॥ 2
గుర్రాలకు స్నానం చేయించి, నేలమీద విశ్రాంతి కలిగేలా పొర్లనిచ్చి, నీళ్లు త్రాగించి అవి స్వస్థత, శాంతి పొందేలా చేశాడు సూతుడు. తెల్లవారి సూర్యోదయం కాగానే మళ్లీ యుద్ధం మొదలయింది. (2)
దృష్ట్వా మాం తూర్ణమాయాంతం దంశితం స్యందనే స్థితమ్।
అకరోద్ రథమత్యర్థం రామః సజ్జం ప్రతాపవాన్॥ 3
కవచం ధరించి, రథమెక్కి, శీఘ్రంగా వస్తున్న నన్ను చూసి ప్రతాపశాలి అయిన పరశురాముడు తన రథాన్ని ఎంతో చక్కగా సిద్ధం చేశాడు. (3)
తతోఽహం రామమాయాంతం దృష్ట్వా సమరకాంక్షిణమ్।
ధనుఃశ్రేష్ఠం సముత్సృజ్య సహసావతరం రథాత్॥ 4
యుద్ధకాంక్షతో వస్తున్నా రాముని చూసి నేను శ్రేష్ఠమైన నా ధనుస్సును వదిలి వెంటనే రథాన్నుండి దిగాను. (4)
అభివాద్య తథైవాహం రథమారుహ్య భారత।
యుయుత్సుర్జామదగ్న్యస్య ప్రముఖే వీతభీః స్థితః॥ 5
పూర్వంలాగే నేను నమస్కరించి, రథం ఎక్కి, రణోత్సాహంతో జామదగ్న్యునిముందర భయం లేకుండా నిలిచాను. (5)
తతోఽహం శరవర్షేణ మహతా సమవాకిరమ్।
స చ మాం శరవర్షేణ వర్షంతం సమవాకిరత్॥ 6
అప్పుడు నేను గొప్ప బాణవర్షంతో ఆయనను ముంచెత్తాను. ఆయనకూడా నన్ను తన బాణవర్షంతో ముంచెత్తాడు. (6)
సంకృద్ధో జామదగ్న్యస్తు పునరేవ సుతేజితాన్।
సంప్రైషీన్మే శరాన్ ఘోరాన్ దీప్తాస్యానురగానివ॥ 7
క్రుద్ధుడైన జమదగ్నికుమారుడు తిరిగి నా మీద భయంకరంగా మండుతున్న అగ్రభాగాలతో పాములవలె ఉన్న వాడి బాణాలను ప్రయోగించాడు. (7)
తతోఽహం నిశితైర్భల్లైః శతశోఽథ సహస్రశః।
అచ్ఛిదం సహసా రాజన్నంతరిక్షే పునః పునః॥ 8
రాజా! అప్పుడే నేను వాడి భల్లాలనే బాణవిశేషాలతో వాటిని అంతరిక్షంలోనే వందలు వేలు తునుకలుగా ఖండింపచేశాను. ఇలా చాలాసార్లు జరిగింది. (8)
తతస్త్వస్త్రాణి దివ్యాని జామదగ్న్యః ప్రతాపవాన్।
మయి ప్రయోజయామాస తాన్యహం ప్రత్యషేధయమ్॥ 9
అస్త్రైరేవ మహాబాహో చికీర్షన్నధికాం క్రియామ్।
తరువాత పరాక్రమశాలి అయిన జమదగ్ని కుమారుడు దివ్యాస్త్రాలను నామీద ప్రయోగించాడు. నేనుకూడా నా అధికపరాక్రమాన్ని ప్రకటించాలనే కోరికతో దివ్యాస్త్రాలతోనే వాటిని వారించాను. (9)
తతో దివి మహాన్నాదః ప్రాదురాసీత్ సమంతతః॥ 10
తతోఽహంహమస్త్రం వాయవ్యం జామదగ్న్యే ప్రయుక్తవాన్।
ప్రత్యాజఘ్నే చ తద్ రామః గుహ్యకాస్త్రేణ భారత॥ 11
అప్పుడు ఆకాశంలో అంతటా గొప్ప కోలాహలం పుట్టింది. నేను పరశురాముని మీద వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాను. రాముడు గుహ్యకాస్త్రంతో దాన్ని నిర్వీర్యం చేశాడు. (10,11)
తతోఽహమస్త్రమాగ్నేయమ్ అనుమంత్ర్య ప్రయుక్తవాన్।
వారుణేనైవ తద్ రామః వారయామాస మే విభుః॥ 12
వెంటనే నేను ఆగ్నేయాస్త్రాన్ని అభిమంత్రించి ప్రయోగించాను. ప్రభువైన రాముడు వారుణాస్త్రంతో దానిని నివారించాడు. (12)
ఏవమస్త్రాణి దివ్యాని రామస్యాహమవారయమ్।
రామశ్చ మమ తేజస్వీ దివ్యాస్త్రవిదరిందమః॥ 13
ఇలా రాముడి దివ్యాస్త్రాలను నేను అడ్డుకున్నాను. నా అస్త్రాలను శత్రుమర్దనుడు, పరాక్రమవంతుడు, దివ్యాస్త్ర వేత్త అయిన రాముడు అడ్డుకున్నాడు. (13)
తతో మాం సవ్యతో రాజన్ రామః కుర్వన్ ద్విజోత్తమః।
ఉరస్యవిధ్యత్ సంక్రుద్ధః జామదగ్న్యః ప్రతాపవాన్॥ 14
అప్పుడు మిక్కిలి క్రుద్ధుడై పరాక్రమశాలి, బ్రాహ్మణోత్తముడు, జమదగ్ని కుమారుడు అయిన రాముడు నాకు ఎడమ వైపు వచ్చి నన్ను వక్షఃస్థలం మీద కొట్టాడు. (14)
తతోఽహం భరతశ్రేష్ఠ సంన్యషీదం రథోత్తమే।
తతో మాం కశ్మలావిష్టం సూతస్తూర్ణముదావహత్॥ 15
భరతశ్రేష్ఠుడా! అప్పుడు నేను నా శ్రేష్ఠమైన రథం మీద కూలబడిపోయాను. మూర్ఛపోయిన నన్ను సూతుడు వెంటనే దూరంగా తీసుకుపోయాడు. (15)
గ్లాయంతం భరతశ్రేష్ఠ రామబాణప్రపీడితమ్।
తతో మామపయాతం వై భృశం విద్ధమచేతసమ్॥ 16
రామస్యానుచరా హృష్టాః సర్వే దృష్ట్వా విచుక్రుశుః।
అకృతవ్రణప్రభృతయః కాశికన్యా చ భారత॥ 17
రాముని బాణంతో పీడింపబడిన నేను మిక్కిలి వ్యాకులపడ్డాను. బాగా గాయపడి అచేతనావస్థలో యుద్ధభూమికి దూరంగా కానిపోబడ్డాను. అది చూసి రాముని అనుచరులైన అకృతవ్రణుడు మొదలైన వారు, కాశీకన్య అంబా అందరూ సంతోషంతో కోలాహలం చేశారు. (16,17)
తతస్తు లబ్ధసంజ్ఞోఽహం జ్ఞాత్వా సూతమథాబ్రువమ్।
యాహి సూత యతో రామః సజ్జోఽహం గతవేదనః॥ 18
అంతలో తెలివి వచ్చి నేను జరిగినది తెలుసుకుని సూతునితో "సూతా! నాకు బాధపోయింది. నేను సిద్ధంగా ఉన్నాను. రాముడు ఉన్న చోటికి నడు" అన్నాను. (18)
తతో మామవహత్ సూతః హయైః పరమశోభితైః।
నృత్యద్భిరివ కౌరవ్య మారుత ప్రతిమైర్గతౌ॥ 19
అంతట సూతుడు చక్కగా శోభిస్తూ వాయువేగంతో నృత్యం చేస్తున్నట్లున్న గుర్రాలతో నన్ను యుద్ధభూమికి తీసుకుపోయాడు. (19)
తతోఽహం రామమాసాద్య బాణవర్షైశ్చ కౌరవ।
అవాకరం సుసంరబ్ధః సంరబ్ధం చ జిగీషయా॥ 20
కౌరవా! అప్పుడు సంసిద్ధుడై ఉన్న రాముని నేను సమీపించి జయకాంక్షతో మిక్కిలి కుపితుడనై బాణవర్షంతో ముంచెత్తాను. (20)
తానాపతత ఏవాసా రామో బాణానజిహ్మగాన్।
బాణైరేవాచ్చినత్ తూర్ణమేకైకం త్రిభిరాహవే॥ 21
సూటిగా పడుతూఉండగానే ఆ బాణాలను ఒక్కొక్కదానిని మూడింటితో పరశురాముడు వెంటనే ఖండించివేశాడు. (21)
తతస్తే సూదితాః సర్వే మమ బాణాః సుసంశితాః।
రామబాణైర్ద్విధా ఛిన్నాః శతశోఽథ సహస్రశః॥ 22
వందలు వేలకొద్దీ వాడి బాణాలను నేను ప్రయోగించాను. వాటినన్నిటినీ రాముడు రెండు రెండు ముక్కలుగా ఖండించివేశాడు. (22)
తతః పునః శరం దీప్తం సుప్రభం కాలసమ్మితమ్।
అసృజం జామదగ్న్యాయ రామాయాహం జిఘాంసయా॥ 23
అప్పుడు నేను పరశురాముడిని అంతం చేయాలని కాలాగ్నివంటి తీక్ష్ణమైనమెఱుగులు చిమ్మే బాణాన్ని ప్రయోగించాను. (23)
తేన త్వభిహతో గాఢం బాణవేగవశం గతః।
ముమోహ సమరే రామః భూమౌ చ నిపపాత హ॥ 24
ఆ బాణం వేగంతో గాయపడిన పరశురాముడు యుద్ధంలో మూర్ఛపోయి నేలమీద పడిపోయాడు. (24)
తతో హాహాకృతం సర్వం రామే భూతలమాశ్రితే।
జగద్ భారత సంవిగ్నం యథార్కపతనే భవేత్॥ 25
రాముడు భూమిమీద పడిపోగానే సూర్యుడు తెగిపడినట్లుగా జగత్తంగా క్షోభించి హాహాకారాలు చేసింది. (25)
తత ఏవం సముద్విగ్నాః సర్వ ఏవాభిదుద్రువుః।
తపోధనాస్తే సహసా కాశ్యా చ కురునందన॥ 26
తత ఏవం పరిష్వజ్య శనైరాశ్వాసయంస్తదా।
పాణిభిర్జలశీతైశ్చ జయాశీర్భిశ్చ కౌరవ॥ 27
కురునందనా! అప్పుడు ఆ మునులు, అంబ అందరూ ఎంతో దుఃఖంతో అతని వద్దకు పరుగెత్ర్హుకువచ్చారు. కౌరవా! అతనిని పొదివి పట్టుకొని చేతులతో వీస్తూ చల్లని నీళ్లతో జయాశీస్సులతో అతనిని సేద తీర్చారు. (26,27)
తతః స విఇహ్వలం వాక్యం రామ ఉత్థాయ చాబ్రవీత్।
తిష్ఠ భీష్మ హతోఽసీతి బాణం సంధాయ కార్ముకే॥ 28
తేరుకున్న రాముడు లేచి వింటికి బాణం సంధించి విహ్వలస్వరంతో "నిలు భీష్మా! చచ్చావులే" అన్నాడు. (28)
స ముక్తో న్యపతత్ తూర్ణం సవ్యే పార్శ్వే మహాహవే।
యేనాహం భృశద్విగ్నః వ్యాఘార్ణిత ఇవ ద్రుమః॥ 29
వేగంగా విడిచిన ఆ బాణం యుద్ధంలో నాకు ఎడమవైపు పడింది. దానితో నేను పెకలింపబడిన చెట్టులాగ అల్లాడిపోయాను. (29)
హత్వా హయంస్తతో రామః శీఘ్రాస్త్రేణ మహాహవే।
అవాకిరన్మాం విస్రబ్ధః బాణైస్తైర్లోమవాహిభిః॥ 30
అప్పుడు ఆ మహాయుద్ధంలో పరశురాముడు శీఘ్రాస్త్రంతో గుర్రాలను చంపి, నిర్భయంగా లోమాలు(రోమాలు) ఉన్న బాణాలతో నన్ను కొట్టాడు. (30)
తతోఽహమపి శీఘ్రాస్త్రం సమరప్రతివారణమ్।
అవాసృజం మహాబాహో తేఽంతరాధిష్ఠితాః శరాః॥ 31
రామస్య మమ చైవాశు వ్యోమావృత్య సమంతతః।
అప్పుడు నేను కూడా యుద్ధంలో శత్రువుల బాణాలను అడ్డగించగల శీఘ్రాస్త్రాన్ని వేశాను. మహాబాహూ! మా ఇద్దరియొక్క ఆ బాణాలు ఆకాశం అంతా ఆవరించి పరస్పరం డీకొన్నాయి. (31)
న స్మ సూర్యః ప్రతపతి శరజాలసమావృతః॥ 32
మాతరిశ్వా తతస్తస్మిన్ మేఘరుద్ధ ఇవాభవత్।
ఆ సమయంలో బాణాల చేత కప్పబడి సూర్యుడు ప్రకాశించలేదు. మేఘాలచేత అడ్డగింపబడినట్లుగా గాలి స్తంభించిపోయింది. (32)
తతో వాయోః ప్రకంపాచ్చ సూర్యస్య చ గభస్తిభిః॥ 33
అభిఘాతప్రభావాచ్చ పావకః సమజాయత్।
వాయుప్రకంపనాలతో, సూర్యకిరణాలతో, బాణాలు రాపిడి పొంది నిప్పు రగిలింది. (33)
తే శరాః స్వసముత్థేన ప్రదీప్తాశ్చిత్రభానునా॥ 34
భూమౌ సర్వే తదా రాజన్ భస్మభూతాః ప్రపేదిరే।
రాజా! అప్పుడు ఆ బాణాలన్నీ తమలో పొందిన రాపిడివల్ల పుట్టిన అగ్నిలో మండిపోయి బూడిదగా మారి భూమిమీద పడిపోయాయి. (34)
తదా శతసహస్రాణి ప్రయుతాన్యర్బుదాని చ॥ 35
అయుతాన్యథ ఖర్వాణి నిఖర్వాణి చ కౌరవ।
రామః శరాణాం సంక్రుద్ధః మయి తూర్ణం న్యపాతయత్॥ 36
కురునందనా! అప్పుడు మిక్కిలి క్రుద్ధుడయిన పరశురాముడు నామీద వేగంగా లక్షలు, పదిలక్షలు, కోటి, పదికోట్లు, వందలకోట్లు, వేలకోట్లు బాణాలను వేశాడు. (35,36)
తతోఽహం తానపి రణే శరైరాశీవిషోపమైః।
సంఛిద్య భూమౌ నృపతే పాతయేయం నగానివ॥ 37
రాజా! నేను వాటిని కూడా ఆ యుద్ధంలో విషసర్పాల వంటి బాణాలతో ఖండించి చెట్లను వలె భూమిమీద పడేశాను. (37)
ఏవం తదభవద్ యుద్ధం తదా భరతసత్తమ।
సంధ్యాకాలే వ్యతీతే తు వ్యపాయాత్ స చ మే గురుః॥ 38
భరతశ్రేష్ఠుడా! అలా ఆ యుద్ధం జరిగింది. సంధ్యాకాలం గడిచిపోతుంటే నా గురువు యుద్ధ భూమినుండి తొలగిపోయాడు. (38)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యాన పర్వణి రామభీష్మయుద్ధే అశీత్యధికశతతమోఽధ్యాయః॥ 180
ఇది శ్రీ మాహాభారతమున ఉద్యోగపర్వమున అంబోపాఖ్యాన పర్వమను ఉపపర్వమున పరశురామ భీష్మయుద్ధము అనే నూట ఎనుబదియవ అధ్యాయము. (180)