181. నూట ఎనుబదియొకటవ అధ్యాయము
భీష్మ పరశురాముల యుద్ధము - 2.
భీష్మ ఉవాచ
సమాగతస్య రామేణ పునరేవాతిదారుణమ్।
అన్యేద్యుస్తుములం యుద్ధం తదా భరతసత్తమ॥ 1
భీష్ముడు చెప్తున్నాడు - భరతశ్రేష్ఠా! మరుసటి దినం రాముడికి ఎదురుపడగానే తిరిగి అతిదారుణమైన తుముల యుద్ధం జరిగింది. (1)
తతో దివ్యాస్త్రవిచ్ఛూరః దివ్యాన్యస్త్రాణ్యనేకశః।
అయోజయత్ స ధర్మాత్మా దివసే దివసే విభుః॥ 2
దివ్యాస్త్రవిదుడు, శూరుడు, ధర్మాత్ముడు అయిన భగవంతుడు పరశురాముడు ప్రతిదినం దివ్యాస్త్రాలను పెక్కింటిని ప్రయోగించసాగాడు. (2)
తాన్యహం తత్ప్రతీఘాతైః అస్త్రైరస్త్రాణి భారత।
వ్యధమం తుములే యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా సుదుస్త్వజాన్॥ 3
భారతా! ఆ తుములయుద్ధంలో అస్త్రాలనన్నింటినీ వాటిని అరికట్టగల అస్త్రాలతో విడువశక్యంకాని ప్రాణాలను సైతం లెక్కించక నిరోధించాను. (3)
అస్త్రైరస్త్రేషు బహుధా హతేష్వేవ చ భారత।
అక్రుధ్యత మహాతేజాః త్యక్తప్రాణ స సంయుగే॥ 4
ఈ రీతిగా అస్త్రాలన్నీ అస్త్రాలతో అనేక విధాల నిర్వీర్యం కావడం చూసి మహాపరాక్రమవంతుడైన పరశురాముడు కోపంతో ప్రాణాలకు తెగించి యుద్ధం చేశాడు. (4)
తతః శక్తిం ప్రాహిణోద్ ఘోరరూపాం
అస్త్రే రుద్ధే జామదగ్న్యో మహాత్మా।
కాలోత్సృష్టాం ప్రజ్వలితామివోల్కాం
సందీప్తాగ్రాం తేజసా వ్యాప్య లోకమ్॥ 5
అప్పుడు ఇలా అస్త్రాలన్నీ నిరోధింపబడగా మహాత్ముడయిన ఆ జమదగ్ని కుమారుడు భయంకరాకారం గల ఒక శక్తిని విడిచిపెట్టాడు. అది కాలపురుషుడు వదిలితే మిరుమిట్లు గొలిపే ఉల్కలా ఉంది. దాని అగ్రభాగం మెరుగులు కక్కుతూ ఉంది. దాని తేజస్సు లోకమంతా వ్యాపించింది. (5)
తతోఽహం తామిషుభిర్దీప్యమానం
సమాయాంతీమంతకాలార్కదీప్తామ్।
ఛిత్వా త్రిథా పాతయామాస భూమౌ
తతో వవౌ పవనః పుణ్యగంధిః॥ 6
ప్రళయకాలసూర్యుడిలా వెలుగొందుతూ, మెరుగులు కక్కుతూ వస్తున్న ఆ శక్తిని నేను బాణాలతో మూడు ముక్కలుగా ఖండించి భూమిమీద పడవేశాను. అప్పుడు సుగంధంతో కూడిన వాయువు వీచింది. (6)
తస్యాం ఛిన్నాయాం క్రోధదీప్తోఽథ రామః।
శక్తీర్ఘోరాః ప్రాహిణోద్ ద్వాదశాన్యాః।
తాసాం రూపం భారత నోత శక్యం
తేజస్విత్వాల్లాఘవాచ్చైవ వక్తుమ్॥ 7
అది అలా ముక్కలు కాగానే క్రోధంతో మండి పడిన రాముడు ఇంకొక విధమయిన ఘోరశక్తులను పన్నెండింటిని ప్రయోగించాడు. ప్రకాశంలో, వేగంలో అవి చెప్పశక్యంకానట్లు ఉన్నాయి. (7)
కిం త్వేవాహం విహ్వలః సంప్రదృశ్య
దిగ్భ్యః సర్వాస్తా మహోల్కా ఇవాగ్నేః।
నానారూపాస్తేజపోగ్రేణ దీప్తా
యథాఽఽదిత్యా ద్వాదశ లోకసంక్షయే॥ 8
లోకసంహారం కోసం ఉదయించిన ద్వాదశాదిత్యుల లాగా అనేకరూపాలతో ఉగ్రమైన తేజస్సుతో ప్రకాశిస్తూ, అగ్నిజ్వాలల్లా వ్యాపిస్తూ అన్ని దిక్కులనుండి వచ్చిపడుతున్న ఆ శక్తులను చూసి చలించిపోయాను. (8)
తతో జాలం బాణమయం వివృత్తం
సందృశ్య భిత్త్వా శరజాలేన రాజన్।
ద్వాదశేషూన్ ప్రాహిణవం రణేఽహం
తతః శక్తీరప్యధమం ఘోరరూపాః॥ 9
వ్యాపించే బాణమయమయిన వలను చూసి శరసమూహంతో దానిని ఖండించాను. ఆయుద్ధంలో నేను పన్నెండు బాణాలను ప్రయోగించాను. ఘోరాకృతి గల ఆ శక్తులన్నీ అప్పుడు అణగిపోయాయి. (9)
తతో రాజన్ జామదగ్న్యో మహాత్మా
శక్తీర్ఘోరా వ్యాక్షిపద్ధేమదండాః।
విచిత్రితాః కాంచనపట్టనద్ధాః
యథా మహోల్కా జ్వలితాస్తథా తాః॥ 10
రాజా! మహాత్ముడయిన జమదగ్ని సుతుడు అప్పుడు భయంకరమైన శక్తులను ప్రయోగించాడు. అవి చూడ్డానికి చిత్రంగా ఉన్నాయి. బంగారు పిడులు కలిగి బంగారు రేకులు తాపడం చేయబడి ఉన్నాయి. అవి మండుతున్న పెద్ద పెద్ద ఉల్కల్లాగ ఉన్నాయి. (10)
తాశ్చాప్యుగ్రాశ్చర్మనా వారయిత్వా
ఖడ్గేనాజౌ పాతయిత్వా నరేంద్ర।
బాణైర్దివ్యైర్జామదగ్న్యస్య సంఖ్యే
దివ్యానశ్వానభ్యవర్షం ససూతాన్॥ 11
రాజా! వాటినన్నిటిని డాలుతో వారించి కత్తితో యుద్ధభూమిలో పడేలా చేశాను. ఆ యుద్ధంలోనే దివ్యమైన బాణాలతో పరశురాముని దివ్యాశ్వాలను సూతులతో సహితంగా ముంచెత్తాను. (11)
నిర్ముక్తానాం పన్నగానాం సరూపా
దృష్ట్వా శక్తీర్హేమచిత్రా నికృత్తాః।
ప్రాదుశ్చక్రే దివ్యమస్త్రం మహాత్మా
క్రోధావిష్టో హైహయేశప్రమాథీ॥ 12
కుబుసం విడిచిన పాముల్లాంటి బంగారుమయమైన చిత్రమైన శక్తులన్నీ ఖండింపబడడం చూసి కార్తవీర్యార్జునుని చంపిన ఆ మహాత్ముడు క్రోధావిష్టుడై దివ్యాస్త్రాన్ని పుట్టించాడు. (12)
తతః శ్రేణ్యః శలభావామివోగ్రాః
సమాపేతుర్విశిఖానాం ప్రదీప్తాః।
సమాచినోచ్చాపి భృశం శరీరం
హయాన్ సూతం సరథం చైవ మహ్యమ్॥ 13
ఆ దివ్యాస్త్రం నుండి మిడుతల దండులా బాణపంక్తులు వచ్చి పడ్డాయి. అవి భయంకరంగా మెరుగులు చిమ్ముతూ ఉన్నాయి. అవి నా శరీరాన్ని కప్పి గుర్రాలు, సూతునితో సహితంగా రథాన్ని కూడా కప్పి వేశాయి. (13)
రథః శరైర్మే నిచితః సర్వతోఽభూత్
తథా వాహాః సారథిశ్పైవ రాజన్।
యుగం రథేషాం చ తథైవ చక్రే
తథైవాక్షః శరకృత్తోత భగ్నః॥ 14
రాజా! ఆ బాణాలతో నా రథం అన్నివైపుల నుండి కప్పివేయబడింది. అలాగే గుర్రాలు, సారథి కూడా; నొగలు, రథ దండం కూడా అలాగే అయిపోయాయి. ఇరుసు బాణాల చేత భిన్నమై భగ్నమైపోయింది. (14)
తతస్తస్మిన్ బాణవర్షం వ్యతీతే
శరౌఘేణ ప్రత్యవర్షం గురుం తమ్।
స విక్షతో మార్గణైర్బ్రహ్మరాశిః
దేహాదసక్తం ముముచే భూరి రక్తమ్॥ 15
అప్పుడా బాణవర్షం తగ్గిన తరువాత నేను కూడా శరవర్షాన్ని గురువుపై కురిపించాను. బ్రహ్మరూపుడయిన ఆ మహాత్మునికి నా బాణాలు తగిలి శరీరంనుండి ఎంతో రక్తం కారింది. (15)
యథా రామో బాణజాలాభితప్తః
తథైవాహం సుభృశం గాఢవిద్ధః।
తతో యుద్ధం వ్యరమచ్చాపరాహ్ణే
భానావస్తం ప్రతి యాతే మహీధ్రమ్॥ 16
పరశురాముడు బాణసమూహం వల్ల బాధపడినట్లు గానే నేను కూడా బాగా గాయపడ్డాను. సాయం కాలమయి సూర్యుడు అస్త్రాద్రి చేరుకోగానే యుద్ధం ఆపివేయబడింది. (16)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి ఏకాశీత్యధిక శతతమోఽధ్యాయః॥ 181
ఇది శ్రీ మాహాభారతమున ఉద్యోగపర్వమున అంబోపాఖ్యాన పర్వమను ఉపపర్వమున నూట ఎనుబది ఒకటవ అధ్యాయము. (181)