182. నూట ఎనుబదిరెండవ అధ్యాయము

భీష్మ పరశురాముల యుద్ధము - 3.

భీష్మ ఉవాచ
తతః ప్రభాతే రాజేంద్ర సూర్యే విమలతాం గతే।
భార్గవస్య మయా సార్ధం పునర్యుద్ధమవర్తత॥ 1
భీష్ముడు చెప్తున్నాడు. - రాజేంద్రా! తెల్లవారి సూర్యుడు బాగా ప్రకాశించే సమయంలో భార్గవునికీ, నాకూ తిరిగి యుద్ధం ప్రారంభం అయింది. (1)
తతోఽభ్రాంతే రథే తిష్ఠన్ రామః ప్రహరతాం వరః।
వవర్ష శరజాలాని మయి మేఘ ఇవాచలే॥ 2
వీర శ్రేష్ఠుడయిన పరశురాముడు మేఘ మండలమంత ఎత్తయిన రథం మీద నిలబడి మేఘం కొండ మీద కురిసినట్లుగా నామీద బాణవర్షాన్ని కురిపించాడు. (2)
తతః సూతో మమ సుహృత్ శరవర్షేణ తాడితః।
అపయాతో రథోపస్థాత్ మనో మమ విషాదయన్॥ 3
స్నేహితుడయిన నా సూతుడు ఆ బాణాలు తగిలి నాకు విషాదం కలిగిస్తూ రథం మీదనుండి క్రిందకు పడిపోయాడు. (3)
తతః సూతో మమాత్యర్థం కశ్మలం ప్రావిశన్మహత్।
పృథివ్యాం చ శరాఘాతాత్ నిపపాత ముమోహ చ॥ 4
నా సూతుడికి మిక్కుటంగా మూర్ఛ వచ్చింది. బాణాల తాకిడికి మూర్ఛపోయి భూమిమీద పడిపోయాడు. (4)
తతః సూతో ఽజహాత్ ప్రాణాన్ రామబాణప్రపీడితః।
ముహూర్తాదివ రాజేంద్ర మాం చ భీరావిశత్ తదా॥ 5
రాజేంద్రా పరశురాముని బాణాలు తగిలి సూతుని ప్రాణాలు పోయాయి. ఒక్కక్షణం నాకు కూడా భయం కలిగింది. (5)
తతః సూతే హతే తస్మిన్ క్షపతస్తస్య మే శరాన్।
ప్రమత్తమనసో రామః ప్రాహిణోన్మృత్యుసమ్మితమ్॥ 6
సూతుడు చనిపోగానే వ్యగ్రమనస్కుడనై రాముని బాణాలను ఛేదిస్తున్నాను. ఇంతలోకే అతడు మృత్యు సన్నిభమైన ఒక బాణాన్ని వేశాడు. (6)
తతః సూతవ్యసనినం విప్లుతం మాం స భార్గవః।
శరేణాభ్యహనద్ గాఢః వికృష్య బలవద్ధనుః॥ 7
సూతుని మరణంతో విలవిలలాడుతున్న నన్ను ఆ భార్గవరాముడు ధనుస్సును బాగా లాగి ఒక బాణంతో గాఢంగా కొట్టాడు. (7)
స మే భుజాంతరే రాజన్ నిపత్య రుధిరాశనః।
మయైవ సహ రాజేంద్ర జగామ వసుధాతలమ్॥ 8
రాజా! రక్తాన్ని తాగే ఆ బాణం నా వక్షఃస్థలంలో గ్రుచ్చుకొంది. రాజేంద్రా! అది నాతో పాటే భూమిమీద పడింది. (8)
మత్వా తు నిహతం రామః తతో మాం భరతర్షభ।
మేఘవద్ విననాదోచ్పైః జహృషే చ పునః పునః॥ 9
భరతశ్రేష్ఠుడా! నేను చనిపోయాననే అనుకొని రాముడు మేఘంలా గట్టిగా గర్జించాడు. అతని శరీరం మాటిమాటికీ పులకించిపోయింది. (9)
తథా తు పతితే రాజన్ మయి రామో ముదా యుతః।
ఉదక్రోశన్మహానాదం సహ తై రనుయాయిభీః॥ 10
రాజా! నేను అలా పడిపోగానే సంతోషించిన రాముడు తన అనుయాయులతో కలిసి మహానాదం చేశాడు. (10)
మమ తత్రాభవన్ యే తు కురవః పార్శ్వతః స్థితాః।
ఆగతా అపి యుద్ధం తత్ జనాస్తత్ర దిదృక్షవః।
ఆర్తిం పరమికాం జగ్ముః తే తదా పతితే మయి॥ 11
నేను పడిపోగానే నా ప్రక్కన ఉన్నటువంటి కౌరవరాజులు, యుద్ధాన్ని చూడగోరి అక్కడకు వచ్చిన జనులూ కూడా మిక్కిలి ఆర్తిని పొందారు. (11)
తతోఽహంపశ్యం పతితో రాజసింహ
ద్విజానష్టౌ సూర్యహుతాశనాభాన్।
తే మాం సమంతాత్ పరివార్య తస్థుః
స్వబాహుభిః పరిధార్యాజిమధ్యే॥ 12
రాజసింహా! నేను పడిపోగానే సూర్యునివంటి, అగ్నివంటి తేజస్సు కలిగిన ఎనిమిదిమంది బ్రాహ్మణులను(వసువులను) చూశాను. వారు నా చుట్టూ నిలిచి యుద్ధ భూమి మధ్యలోనే తమ చేతులతో నన్ను పొదివి పట్టుకొన్నారు. (12)
రక్ష్యమాణశ్చ తైర్విప్రైః నాహం భూమిముపాస్పృశమ్।
అంతరిక్షే ధృతోఽహ్యస్మి తైర్విప్రైర్బాంధవైరివ॥ 13
ఆ విప్రుల చేత రక్షింపబడిన నేను భూమిని తాకలేదు. అంతరిక్షంలోనే బంధువుల్లాగా ఆ విప్రులు నన్ను పట్టుకొన్నారు. (13)
శ్వసన్నివాంతరిక్షే చ జలబిందురుక్షితః।
తతస్తే బ్రాహ్మణాః రాజన్ అబ్రువన్ పరిగృహ్య మామ్॥ 14
రాజా! అంతరిక్షంలో ఊపిరి తీస్తున్నట్లున్న నామీద నీటి బిందువులు చిలకరించి ఆ బ్రాహ్మణులు నన్ను పట్టుకొని ఇలా అన్నారు. (14)
మా భైరితి సమం సర్వే స్వస్తి తేఽస్త్వితి చాసకృత్।
తతస్తేషామహం వాగ్భిః తర్పితః సహసోత్థితః।
మాతరం సరితాం శ్రేష్ఠామ్ అపశ్యం రథమాస్థితామ్॥ 15
వారంతా ఒక్కుమ్మడిగా "భయపడకు. నీకు శుభమగుగాక" అని అనేక పర్యాయా లన్నారు. నేను వారి మాటలకు సంతృప్తి పడి వెంటనే లేచాను. రథం మీద సారథిగా ఉన్న నదీమతల్లి గంగను చూశాను. (15)
హయాశ్చ మే సంగృహీతాస్తయాసన్
మహానద్యా సంయతి కౌరవేంద్ర।
పాదౌ జనన్యాః ప్రతిగృహ్య చాహం
తథా పితౄణాం రథమభ్యరోహమ్॥ 16
కౌరవేంద్రా! మహానది అయిన ఆ గంగాదేవి నా రథం యొక్క పగ్గాలు పట్టుకొని గుర్రాలను అదుపు చేసింది. నేను నా తల్లి పాదాలు స్పృశించి పితరులు(వంటి విప్రులను) స్మరించి రథాన్ని ఎక్కాను. (16)
రరక్ష సా మాం సరథం హయాంశ్చోపస్కరాణి చ।
తామహం ప్రాంజలిర్భూత్వా పునరేవ వ్యసర్జయమ్॥ 17
ఆమె నా రథంతో సహా గుర్రాలను, ఇతర ఉపకరణాలను రక్షించింది. తిరిగి ఆమెకు నేను అంజలి ఘటించి ఆమెను వీడ్కొలిపాను. (17)
తతోఽహం స్వయముద్యమ్య హయాంస్తాన్ వాతరంహసః।
అయుధ్యం జామదగ్న్యేన నివృత్తేఽహని భారత॥ 18
భారత! అనంతరం నేను వాయువేగం గల ఆ గుర్రాలను స్వయంగా నడుపుతూ జమదగ్ని సుతునితో ప్రొద్దు తిరిగే వరకూ యుద్ధం చేశాను. (18)
తతోఽహం భరతశ్రేష్ఠ వేగవంతం మహాబలమ్।
అముంచం సమరే బాణం రామాయ హృదయచ్ఛిదమ్॥ 19
అప్పుడా యుద్ధంలో దృఢమై వేగవంతమై హృదయాన్ని చీల్చివేసే ఒకబాణాన్ని రామునిపై వదిలాను. (19)
తతో జగామ వసుధాం మమ బాణప్రపీడితః।
జానుభ్యాం ధనురుత్సృజ్య రామో మోహవశం గతః॥ 20
నా బాణం చేత బాగా గాయపడిన పరశురాముడు మూర్ఛ వచ్చి ధనుస్సు వదిలివేసి మోకాళ్లమీద కూలబడి నేలపై పడిపోయాడు. (20)
తతస్తస్మిన్ నిపతితే రామే భూరిసహస్రదే।
ఆవవ్రుర్జలదా వ్యోమ క్షరంతో రుధిరం బహు॥ 21
వేలమంది బ్రాహ్మణులకు భూరిదానాలిచ్చిన ఆ పరశురాముడు పడిపోగానే మేఘాలు రక్తాన్ని వర్షిస్తూ ఆకాశమంతా వ్యాపించాయి. (21)
వి॥సం॥ 'భూరిసహస్రదే - 'భూరి' నపుంసకలింగం అయినపుడు బంగారమని అర్థం. సువర్ణాన్ని అనేకవేలమందికి ఇచ్చినవాడని అర్థం. 'భూరి' పుంలింగమయినపుడు నరులని అర్థం. అనేకులకు వేలకొద్దీ ఇచ్చినవాడు అని అర్థం. అనేకులలో వసుదేవుడు, శివుడు, బ్రహ్మకూడా ఉన్నారు. (నీల)
ఉల్కాశ్చ శతశః పేతుః సనిర్ఘాతాః సకంపనాః।
అర్కం చ సహసా దీప్తం స్వర్భానురభిసంవృణోత్॥ 22
పిడుగులతో, మెఱుపులతో కూడిన ఉల్కలు వందలకొద్దీ రాలాయి. చక్కగా ప్రకాశిస్తున్న సూర్యుడిని అప్పటికప్పుడు రాహువు కబళించివేశాడు. (22)
వపుశ్చ వాతాః పరుషాః చలితా చ వసుంధరా।
గృధ్రా బలాశ్చ కంకాశ్చ పరిపేతుర్ముదా యుతాః॥ 23
గాలి తీవ్రంగా వీచసాగింది. భూమి కంపించి పోయింది. గ్రద్దలు, బలాక పక్షులు, రాబందులు సంతోషంగా ఎగరసాగాయి. (23)
దీప్తాయాం దిశి గోమాయుః దారుణం ముహురున్నదత్।
అనాహతా దుందుభయః వినేదుర్భృశనిఃస్వనాః॥ 24
దిక్కులు మండసాగాయి. నక్కలు దారుణంగా పదే పదే అరవసాగాయి. దుందుభులు వాటంతట అవే మ్రోగసాగాయి. (24)
ఏతదౌత్పాతికం సర్వం ఘోరమాసీద్ భయంకరమ్।
విసంజ్ఞకల్పే ధరణీం గతే రామే మహాత్మని॥ 25
మహాత్ముడయిన రాముడు అచేతనంగా భూమి మీద పడగానే ఇంత మహాభయంకరమైన ఉత్పాతం సంభవించింది. (25)
తతో వై సహసోత్థాయ రామో మా మభ్యవర్తత।
పునర్యుద్ధాయ కౌరవ్య విహ్వలః క్రోధమూర్ఛితః॥ 26
అంతలో పరశురాముడు వెంటనే లేచి కోపంతో ఒళ్లు తెలియనివాడై వ్యాకులచిత్తంతో మరల యుద్ధం చేయడానికి నన్ను సమీపించాడు. (26)
ఆదదానో మహాబాహుః కార్ముకం తాలసంనిభమ్।
తతో మయ్యాదదానం తం రామమేవ న్యవారయన్॥ 27
మహర్షయః కృపాయుక్తాః క్రోధావిష్ణోఽథ భార్గవః।
స మేఽహరదమేయాత్మా శరం కాలానలోపమమ్॥ 28
మహాబాహువైన పరశురాముడు తాడి చెట్టంత విల్లు తీసుకున్నాడు. దానితో కాలాగ్ని సదృశమైన బాణాన్ని నామీద ప్రయోగించబోతుంటే కృపాళువులైన మహర్షులు ఆ రాముని వారించారు.(వారి మాట విని) అమేయాత్ముడైన రాముడు దానిని ఉపసంహరించాడు. (27-28)
వి॥సం॥ "బలసంనిభమ్' అని పాఠాంతరం, బలమంటే గంధక రసమని అర్థం. గంధక రసం లాంటి ధనుస్సు అని అర్థం. (నీల)
తతో రవిర్మందమరీచిమండలః
జగామాస్తం పాంసుపుంజావగూఢః।
నిశా వ్యగాహత్ సుఖశీతమారుతా
తతో యుద్ధం ప్రత్యవహారయావః॥ 29
వాడి తగ్గిన కిరణాలతో సూర్యదేవుడు ధూళి పుంజంచేత కప్పబడి అస్తంగతుడయ్యాడు. రాత్రి అయింది. సుఖకరమైన చల్లని గాలి వీచింది. అప్పుడు ఏమిద్దరం యుద్ధాన్ని ముగించాము. (29)
వి॥సం॥ 'రవిర్మంత్రమరీచిమండలం' అని పాఠాంతరం. మంత్రాలే కిరణమండలంగా కలవాడని అర్థం. 'త్రయీ' అంటే వేదాలే కిరణాలుగా కలవాడని శ్రుతి. (నీల)
ఏవం రాజన్నవహారో బభూవ
తతః పునర్విమలేఽభూత్ సుఘోరమ్।
కల్యం కల్యం వింశతిం వై దినాని
తథైవ చాన్యాని దినాని త్రీణి॥ 30
రాజా! ప్రతిదినం ఇలాగే యుద్ధం ముగింపు జరుగుతోంది. మళ్లీ తెల్లవారగానే మిక్కిలి ఘోరమైన యుద్ధం జరుగుతోంది ప్రతి ఉదయం. ఇలా ఇరవై మూడు రోజులు గడిచాయి. (30)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి రామభీష్మయుద్ధే ద్వ్యశీత్యధిక శతతమోఽధ్యాయః॥ 182
ఇది శ్రీ మాహాభారతమున ఉద్యోగపర్వమున అంబోపాఖ్యాన పర్వమను ఉపపర్వమున రామభీష్ముల యుద్ధమను నూట ఎనుబది రెండవ అధ్యాయము. (182)