190. నూట తొంబదియవ అధ్యాయము
ద్రుపదుడు భయపడి తన రాణిని ఉపాయమడుగుట.
భీష్మ ఉవాచ
ఏవముక్తస్య దూతేన ద్రుపదస్య తదా నృప।
చోరస్యేవ గృహీతస్య చ ప్రావర్తత భారతీ॥ 1
భీష్ముడు చెప్తున్నాడు - రాజా! దూత ఇలా అనగానే పట్టుబడిన దొంగలాగా ద్రుపదునికి నోటమాట రాలేదు. (1)
స యత్నమకరోత్ తీవ్రం సంబంధిన్యనుమాననే।
దూతైర్మధురసంభాషైః న తదస్తీతి సందిశన్॥ 2
మధురంగా సంభాషించగల దూతల ద్వారా సంశయం కలిగిన సంబంధీకునికి(వియ్యంకునకు) అటువంటిదేమీ లేదని సందేశం పంపుతూ అతనిని నమ్మించడానికి తీవ్రమైన ప్రయత్నం చేశాడు ద్రుపదుడు. (2)
స రాజా భూయ ఏవాథ జ్ఞాత్వా తత్త్వమథాగమత్।
కన్యేతి పాంచాలసుతాం త్వరమాణో వినిర్యయౌ॥ 3
ఆ హిరణ్యవర్మ మళ్లీ విచారించి తెలుసుకొని పాంచాలరాజు కూతురు స్త్రీయే అని నిర్ధారించుకొన్నాడు. కోపంతో తొందరగా ద్రుపదునిపైకి బయల్దేరాడు. (3)
తతః సంప్రేషయామాస మిత్రాణామమితౌజసామ్।
దుహితుర్విప్రలంభం తం ధాత్రీణాం వచనాత్ తదా॥ 4
దాదుల మాటలద్వారా తన కూతురికి జరిగిన మోసాన్ని గురించి మిక్కిలి పరాక్రమవంతులైన మిత్రులకు సమాచారం పంపాడు. (4)
తతః సముదయం కృత్వా బలానాం రాజసత్తమః।
అభియానే మతిం చక్రే ద్రుపదం ప్రతి భారత॥ 5
భారతా! ఆ రాజశ్రేష్ఠుడు బలాలనన్నిటినీ పోగుచేసు కొని ద్రుపదుని మీదికి దండెత్తడానికి నిశ్చయించుకున్నాడు. (5)
తతః సంమంత్రయామాస మంత్రిభిః స మహీపతిః।
హిరణ్యవర్మా రాజేంద్ర పాంచాల్యం పార్థివం ప్రతి॥ 6
రాజేంద్రా! ఆ రాజు హిరణ్యవర్మ "పాంచాలరాజైన ద్రుపదునితో ఎలా వ్యవహరించాలి" అని మంత్రులతో కూడి ఆలోచించాడు. (6)
తత్ర వై నిశ్చితం తేషామ్ అభూద్ రాజ్ఞాం మహాత్మనామ్।
తథ్యం భవతి చేదేతత్ కన్యా రాజన్ శిఖండినీ॥ 7
బద్ధ్వా పాంచాలరాజానమ్ ఆనయిష్యామహే గృహమ్।
అన్యం రాజానమాధాయ పంచాలేషు నరేశ్వరమ్॥ 8
ఘాతయిష్యామ నృపతిం పాంచాలం సశిఖండినమ్॥ 9
ఆ మహాత్ములైన మిత్రరాజులందరూ తమ నిశ్చితాభిప్రాయాన్ని ఇలా వినిపించారు. "రాజా! ద్రుపద రాజు సంతానం శిఖండిని స్త్రీ అవడం నిజమయితే పాంచాలరాజును బంధించి మన ఇంటికి తీసుకువస్తాం. ఆ పాంచాల సింహాసనం మీద ఇతరుని రాజుగా తెచ్చి కూర్చుండ పెడతాం. ఆ ద్రుపదుని శిఖండితో సహితం చంపివేస్తాం." (7-9)
తత్ తథాభూతమాజ్ఞాయ పునర్దూతాన్నరాధిపః।
ప్రాస్థాపయత్ పార్షతాయ నిహన్మీతి స్థిరో భవ॥ 10
ఆ రాజోత్తముడు మళ్లీ దూతలను ఆజ్ఞాపించి ఆ విషయం అలాగే అని(పురుషుడు కాదు స్త్రీయే- అని) నిర్ధారించుకుని "నిన్ను సంహరిస్తాను. ధైర్యంగా ఉండు" అని ద్రుపదుని వద్దకు దూతను పంపాడు. (10)
భీష్మ ఉవాచ
స హి ప్రకృత్యా వై భీతః కిల్బిషీ చ నరాధిపః।
భయం తీవ్రమనుప్రాప్తః ద్రుపదః పృథివీపతిః॥ 11
భీష్ముడు చెప్తున్నాడు - ఆ ద్రుపదమహారాజు సహజంగానే భీరువు. పైగా తప్పు చేసి ఉన్నాడు. కనుక తీవ్రమైన భయాన్ని పొందాడు. (11)
విసృజ్య దూతాన్ దాశార్ణే ద్రుపదః శోకమూర్ఛితః।
సమేత్య భార్యాం రహితే వాక్యమాహ నరాధిపః॥ 12
ద్రుపదరాజు దశార్ణరాజు దగ్గరకు దూతలను పంపి, శోకంతో ఓళ్లు తెలియనివాడై ఏకాంతంలో భార్యతో ఇలా అన్నాడు. (12)
భయేన మహతాఽఽవిష్టః హృది శోకేన చాహతః।
పాంచాలరాజో దయితాం మాతరం వై శిఖండినః॥ 13
పాంచాలరాజుకు గొప్ప భయం ఆవహించింది. హృదయం శోకంతో పీడింపబడుతోంది. అప్పుడు(శిఖండి తల్లి అయిన) తన ప్రియభార్యతో ఇలా అన్నాడు. (13)
అభియాస్యతి మాం కోపాత్ సంబంధీ సుమహాబలః।
హిరణ్యవర్మా నృపతిః కర్షమాణో వరూథినీమ్॥ 14
మన సంబంధి గొప్ప బలవంతుడు అయిన హిరణ్యవర్మ కోపంతో సైన్యాన్ని కూడదీసుకొని నామీదికి దండెత్తి వస్తాడు. (14)
కిమిదానీం కరిష్యావః మూఢౌ కన్యామిమాం ప్రతి।
శిఖండీ కిల పుత్రస్తే కన్యేతి పరిశంకితః॥ 15
ఈ కన్య గురించి ఏం చేయాలో మనిద్దరికీ పాలుపోవడం లేదు. నీ కొడుకు శిఖండి కన్యయే అని శంకించాడు హిరణ్యవర్మ. ఇప్పుడేమి చేద్దాం ఇద్దరం? (15)
ఇతి సంచింత్య యత్నేన సమిత్రః సబలానుగః।
వంచితోఽస్మీతి మన్వానః మాం కిలోద్ధర్తుమిచ్ఛతి॥ 16
కిమత్ర తథ్యం సుశ్రోణి మిథ్యా కిం బ్రూహి శోభనే।
శ్రుత్వా త్వత్తః శుభం వాక్యం సంవిధాస్యామ్యహం తథా॥ 17
ఈ విషయమై ఆలోచించి, మోసపోయానని తలుస్తూ హిరణ్యవర్మ మిత్రులతో, సైన్యంతో కలిసి నన్ను పెకలించి వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. సుశ్రోణి! శోభనా! ఇందులో నిజమేమిటి? భగవంతుడు అబద్ధం ఎందుకు చెప్తాడు? నీవు చెప్పిన మంచి మాటను విని నేను అలాగే చేస్తాను. (16-17)
అహం హి సంశయం ప్రాప్తః బాలా చేయం శిఖండినీ।
త్వం చ రాజ్ఞి మహత్ కృచ్ఛ్రం సంప్రాప్తా వరచర్ణిని॥ 18
వరవర్ణిని! నాకు కూడా సందేహంగానే ఉంది. ఈ శిఖండిని స్త్రీగానే ఉంటుంది. మహారాణీ! నీకు కూడా గొప్ప కష్టమే వచ్చింది. (18)
సా త్వం సర్వవిమోక్షాయ తత్త్వమాఖ్యాహి పృచ్ఛతః।
తథా విదధ్యాం సుశ్రోణి కృత్యమాశు శుచిస్మితే॥ 19
కాబట్టి నీవు ఈ సంకటాలన్నీ తీరేలాగ ఒక ఉపాయాన్ని చెప్పు. నేను అడుగుతున్నాను. సుశ్రోణి! తెలినవ్వు కలదానా! నీవు చెప్పినది వెంటనే చేస్తాను. (19)
శిఖండిని చ మా భైస్త్వం విధాస్యే తత్ర తత్త్వతః।
కృపయాహం వరారోహే వంచితః పుత్రధర్మతః॥ 20
వరారోహా! శిఖండివిషయంలో నీవు భయపడకు. ఆ విషయంలో నేను నిజానికి దయతోనే వ్యవహరిస్తాను. నేను పుత్రధర్మాన్నుండి వంచింపబడ్డాను. (20)
మయా దాశార్ణకో రాజా వంచితః స మహీపతిః।
తదాచక్ష్వ మహాభాగే విధాస్యే తత్ర యుద్ధితమ్॥ 21
నేను దశార్ణరాజును వంచించాను. కాబట్టి సౌభాగ్యవతీ! మహాభాగా! ఈ విషయంలో ఏది మేలో అది చెప్పు. దానిని చేస్తాను. (21)
జానతా హి నరేంద్రేణ ఖ్యాపనార్థం పరస్య వై।
ప్రకాశం చోదితా దేవీ ప్రత్యువాచ మహీపతిమ్॥ 22
ద్రుపదునికి విషయం అంతా తెలిసినా, ఇతరుల దృష్టిలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి పైకి అలా అన్నాడు. రాణి అతనికి ఇలా బదులిచ్చింది. (22)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి ద్రుపదప్రశ్నే నవత్యధికశతతమోఽధ్యాయః॥ 190 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున అంబోపాఖ్యాన పర్వమను ఉపపర్వమున ద్రుపదుని ప్రశ్న అను నూట తొంబదియవ అధ్యాయము. (190)