191. నూట తొంబది ఒకటవ అధ్యాయము

శిఖండి స్థూణాకర్ణుడను యక్షుని కలిసికొనుట.

భీష్మ ఉవాచ
తతః శిఖండినో మాతా యథాతత్త్వం నరాధిప।
ఆచచక్షే మహాబాహో భర్త్రే కన్యాం శిఖండినీమ్॥ 1
భీష్ముడు చెప్తున్నాడు. మహాబాహూ! అప్పుడు శిఖండియొక్క తల్లి "శిఖండి కన్యయే" అనే యథార్థ విషయాన్ని భర్తకు చెప్పసాగింది. (1)
అపుత్రయా మయా రాజన్ సపత్నీనాం భయాదిదమ్।
కన్యా శిఖండినీ జాతా పురుషో వై నివేదితా॥ 2
రాజా! పుత్రులు లేని నేను సవతులకు భయపడి ఆడపిల్లగా పుట్టిన శిఖండిని మగపిల్లవాడుగా చెప్తాను. (2)
త్వయా చైవ నరశ్రేష్ఠ తన్మే ప్రీత్యానుమోదితమ్।
పుత్రకర్మ కృతం చైవ కన్యాయాః పార్థివర్షభ॥ 3
రాజోత్తమా! నీవు కూడా సంతోషంతో దానిని అంగీకరించావు. ఆ పిల్లకు పుత్రునికి చేసే విధంగానే జాతకర్మలు జరిపించావు. (3)
భార్యా చోఢా త్వయా రాజన్ దశార్ణాధిపతేః సుతా।
మయా చ ప్రత్యభిహితం దేవవాక్యార్థ దర్శనాత్॥
కన్యా భూత్వా పుమాన్ భావీత్యేవం చైతదుపేక్షితమ్॥ 4
రాజా! దశార్ణాధిపతి హిరణ్యవర్మయొక్క కూతురిని నీవు భార్యగా చేశావు. భగవంతుని మాటలపై నమ్మకం ఉంచి నేను కూడా అలాగే చెప్పాను. ముందు కన్యగా పుట్టి తరువాత పురుషుడవుతాడని దైవం చెప్పడం వలన కూడ ఈ విషయమై ఉపేక్షించడం జరిగింది. (4)
ఏతచ్ఛ్రుత్వా ద్రుపదో యజ్ఞసేనః
సర్వం తత్త్వం మంత్రవిద్భ్యో నివేద్య।
మంత్రం రాజా మంత్రయామాస రాజన్
యథాయుక్తం రక్షణే వై ప్రజానామ్॥ 5
ఇది విని యజ్ఞసేనుడైన ద్రుపదుడు సమస్త విషయాన్ని మంత్రులకు నివేదించాడు. రాజా! తరువాత ప్రజారక్షణ విషయంలో తగినరీతిగా మంత్రులతో ఆలోచన చేశాడు. (5)
సంబంధకం చైవ సమర్థ్య తస్మిన్
దాశార్ణకే వై నృపతౌ నరేంద్ర।
స్వయం కృత్వా విప్రలంభం యథావత్
మంత్రైకాగ్రో నిశ్చయం వై జగామ॥ 6
నరేంద్రా! దాశార్ణ రాజుతో తాను నెరపిన వియ్యాన్ని సమర్థించుకొని, తాను స్వయంగా అతనిని వంచించినప్పటికీ, ఏకాగ్రచిత్తుడై ఆలోచించి అతనితో మృదువుగా వ్యవహరించడానికి ఒక నిశ్చయానికి వచ్చాడు. (6)
వి॥సం॥ సంబంధాన్ని సమర్థించుకోవడం అంటే తాను అతనిని మోసం చేయలేదని, ఈ వివాహం ఉచితమేనని నిర్ణయించు కోవడం అని అర్థం(నీల)
స్వభావగుప్తం నగరమ్ ఆపత్కాలే తు భారత।
గోపయామాస రాజేంద్ర సర్వతః సమలంకృతమ్॥ 7
భరతకుల రాజేంద్రా! నగరం స్వతహాగానే ఆపత్కాలం వస్తే సురక్షితంగా ఉండేలా చేయబడినదే అయినా మరల అంతటా కట్టుదిట్టంగా సురక్షితం చేయబడింది. (7)
ఆర్తిం చ పరమాం రాజా జగామ సహ భార్యయా।
దశార్ణపతినా సార్ధం విరోధే భరతర్షభ॥ 8
భరత శ్రేష్ఠా! దశార్ణదేశపు రాజుతో విరోధం వచ్చినందుకు భార్యాసహితంగా ఆ రాజు మిక్కిలి వ్యథ చెందాడు. (8)
కథం సంబంధినా సార్ధం న మే స్యాద్ విగ్రహో మహాన్।
ఇతి సంచింత్య మనసా దేవతామర్చయత్ తదా॥ 9
సంబంధీకునితో కయ్యం తనకు ఎలా తప్పిపోతుందా అని మనసులోనే ఆలోచిస్తూ దేవతలను పూజించడం మొదలుపెట్టాడు. (9)
తం తు దృష్ట్వా తదా రాజన్ దేవీ దేవపరం తదా।
అర్చాం ప్రయుంజాన మథో భార్యా వచనమబ్రవీత్॥ 10
రాజా! దేవతారాధనలో తత్పరుడై పూజలు చేస్తున్న అతనిని చూచి అప్పుడు భార్య ఇలా అంది. (10)
దేవానాం ప్రతిపత్తిశ్చ సత్యా సాధుమతా సదా।
కిము దుఃఖార్ణవం ప్రాప్య తస్మాదర్చయతాం గురూన్॥ 11
దైవతాని చ సర్వాణి పూజ్యంతాం భూరిదక్షిణమ్।
అగ్నయశ్చాపి హూయంతాం దాశార్ణప్రతిషేధనే॥ 12
శుభాలు కావాలని కోరుకునే సత్పురుషులకు దేవతలను పూజించడం ఎప్పుడూ ఉత్తమమే. ఇక శోక సముద్రంలో మునిగినపుడు చెప్పవలసినదేముంది? కాబట్టి నీవు గురువులను, సమస్త దేవతలను భురిదక్షిణ ఇచ్చి పూజించు. దశార్ణరాజుతో యుద్ధాన్ని ఆపడానికి అగ్నులలో హోమం చేయి. (11-12)
ఆయుద్ధేన నివృత్తిం చ మనసా చింతయ ప్రభో।
దేవతానాం ప్రసాదేన సర్వమేతద్ భవిష్యతి॥ 13
ప్రభూ! దశార్ణరాజు యుద్ధం చేయకుండానే మరలి పోవాలని మనసులోనే కోరుకో. దేవతల అనుగ్రహంచేత ఇదంతా జరుగుతుంది. (13)
మంత్రిభిర్మంత్రితం సార్ధం త్వయా పృథులలోచన।
పురస్యాస్యావినాశాయ యచ్చ రాజంస్తథా కురు॥ 14
రాజా! విశాలనేత్రుడా! ఈ నగరం వినాశం పొందకుండా ఉండేందుకు నీవు మంత్రులతో ఏమంత్రాంగం చేశావో అది పాటించు. (14)
దైవం హి మానుషోపేతం భృశం సిద్ధ్యతి పార్థివ।
పరస్పరవిరోధాద్ధి సిద్ధిరస్తి న చైతయోః॥ 15
పార్థివా! దైవం కూడా పురుషయత్నంతో కూడినపుడే బాగా సిద్ధిస్తుంది. ఆ దైవమానుషాలు రెండూ పరస్పరం విరోధించుకుంటే అవి సిద్ధిని పొందజాలవు. (15)
తస్మాద్ విధాయ నగరే విధానం సచివైః సహ।
అర్చయస్వ యథాకామం దైవతాని విశాంపతే॥ 16
కాబట్టి రాజా! మంత్రులతో కలిసి నగరంలో కావలసిన ఏర్పాట్లు చేసి నా కోరికకు తగ్గట్టుగ దేవతలను అర్చించు. (16)
ఏవం సంభాషమాణౌ తు దృష్ట్వా శోకపరాయణౌ।
శిఖండినీ తదా కన్యా వ్రీడితేవ తపస్వినీ॥ 17
తతః సా చింతయామాస మత్కృతే దుఃఖితావుభౌ।
ఇమావితి తతశ్చక్రే మతిం ప్రాణవినాశనే॥ 18
శోకమగ్నులై ఇలా మాట్లాడుకుంటూ ఉన్న వారిద్దరినీ చూచి తపస్విని అయిన వారి కూతురు శిఖండిని సిగ్గుతో నా గురించే కదా వీరుద్దరూ దుఃఖాన్ని పొందుతున్నారు అనుకొని చింతించింది. అప్పుడామే ప్రాణత్యాగం చేయడానికి నిశ్చయించుకొంది. (17-18)
ఏవం సా నిశ్చయం కృత్వా భృశం శోకపరాయణా।
నిర్జగామ గృహం త్యక్త్వా గహనం నిర్జనం వనమ్॥ 19
ఇలా నిశ్చయించుకొని మిక్కిలి దుఃఖంతో ఆమె ఇల్లు వదిలి నిర్జనమైన అడవికి వెళ్లింది. (19)
యక్షేణర్థిమతా రాజన్ స్థూణాకర్ణేన పాలితమ్।
తద్భయాదేవ చ జనః విసర్జయతి తద్ వనమ్॥ 20
రాజా! ఆ వనాన్ని సంపన్నుడైన స్థూణాకర్ణుడనే యక్షుడు రక్షిస్తున్నాడు. అతని భయం చేతనే జనులు అక్కడికి వెళ్లడం మానేశారు. (20)
తత్ర చ స్థూణభవనం సుదామృత్తికలేపనమ్।
లాజోల్లాపిక ధూమాఢ్యమ్ ఉచ్చప్రాకారతోరణమ్॥ 21
ఆ అడవిలో స్థూణాకర్ణుని భవనం ఉంది. అది సున్నం వంటి మట్టితో మెత్తబడింది. ఎత్తయిన ప్రాకారాలతో గృహద్వారాలు కలిగి ఉంది. లాజలు(పేలాలు) వట్టి వేళ్లు కలిపి వేసిన సుగంధ భరితమైన ధూమంతో నిండి ఉంది. (21)
తత్ ప్రవిశ్య శిఖండీ సా ద్రుపదస్యాత్మజా నృప।
అనశ్నానా బహుతిథం శరీరముదతోషయత్॥ 22
రాజా! ద్రుపదుని కూతురయిన ఆ శిఖండి అందులో ప్రవేశించి, చాలా రోజులు తిండి తినకుండా శరీరాన్ని కృశింపచేసుకుంది. (22)
దర్శయామాస తాం యక్షః స్థూణో మార్దవసంయుతః।
కిమర్థోఽయం తవారంభః కరిష్యే బ్రూహి మా చిరమ్॥ 23
యక్షుడైన స్థూణాకర్ణుడు ఆమెను చూశాడు. అతని మనసు మెత్తబడింది. అమ్మాయి! ఈ నీ ఉపవాడప్రయత్నం ఎందుకోసం? వెంటనే చెప్పు చేస్తాను. అన్నాడు. (23)
అశక్యమితి సా యక్షం పునః పునరువాచ హ।
కరిష్యామీతి వై క్షిప్రం ప్రత్యువాచాథ గుహ్యకః॥ 24
ఇది అశక్యమని ఆమె పదే పదే యక్షునికి చెప్పింది. అయినా ఆ యక్షుడు 'వెంటనే చేయగలను' అని బదులు చెప్పాడు. (24)
ధనేశ్వరస్యాఽనుచరః వరదో ఽస్మి నృపాత్మజే।
అదేయమపి దాస్యామి బ్రూహి యత్తే వివక్షితమ్॥ 25
"రాజకుమారీ! ధనేశ్వరుడయిన కుబేరుని అనుచరుడను. వరాలు ఇవ్వగలను. ఇవ్వరానిది కూడా ఇవ్వగలను. చెప్పు నీకేం కావాలో" అన్నాడు. (25)
తతః శిఖండీ తత్ సర్వమ్ అఖిలేన న్యవేదయత్।
తస్మై యక్షప్రధానాయ స్థూణాకర్ణాయ భారత॥ 26
భారత! అప్పుడు శిఖండి యావత్ వృత్తాంతాన్ని ఆ యక్షముఖ్యుడైన స్థూణాకర్ణునికి నివేదించింది. (26)
శిఖండిన్యువాచ
అపుత్రో మే పితా యక్ష న చిరాన్నాశమేష్యతి।
అభియాస్యతి స క్రోధః దశార్ణాధిపతిర్హి తమ్॥ 27
శిఖండి చెప్తోంది "యక్షా! నా తండ్రికి కొడుకులు లేరు. అచిరకాలంలోనే నాశాన్ని పొందబోతున్నాడు. దశార్ణాధిపతి క్రోధంతో అతని మీదికి వస్తున్నాడు. (27)
మహాబలో మహోత్సాహః స హేమకవచో నృపః।
తస్మాద్ రక్షస్వ మాం యక్ష మాతరం పితరం చ మే॥ 28
ఆ హేమవర్ముడు అనే రాజు మహాబలవంతుడు. కలవాడు. కాబట్టి యక్షా! నా తల్లిదండ్రులను అతని బారినుండి రక్షించు. (28)
ప్రతిజ్ఞాతో హి భవతా దుఃఖప్రతిశమో మమ।
భవేయం పురుషో యక్ష త్వత్ప్రసాదాదనిందితః॥ 29
యావదేవ స రాజా వై నోపయాతి పురం మమ।
తావదేవ మహాయక్ష ప్రసాదం కురు గుహ్యక॥ 30
యక్షుడా! నా దుఃఖాన్ని తీరుస్తానని మాట ఇచ్చిఉన్నావు. నీ అనుగ్రహంచేత నేను ఏలోపంలేని పురుషుడిని కావాలి. గుహ్యకా! మహాయక్షా! ఆ రాజు మా నగరాన్ని సమీపించకముందే నన్ను అనుగ్రహించు (29-30)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి స్థూణాకర్ణసమాగమే ఏకనవత్యధికశతతమోఽధ్యాయః॥ 191 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున అంబోపాఖ్యానపర్వము అను ఉపపర్వమున శిఖండినీ స్థూణాకర్ణుల సమాగమము అను నూటతొంబది ఒకటవ అధ్యాయము (191)