192. నూట తొంబది రెండవ అధ్యాయము

శిఖండి పుంస్త్వమును పొందుట.

భీష్మ ఉవాచ
శిఖండివాక్యం శ్రుత్వాథ స యక్షో భరతర్షభ।
ప్రోవాచ మనసా చింత్య దైవేనోపనిపీడితః॥ 1
భవితవ్యం తథా తద్ధి మమ దుఃఖాయ కౌరవ।
భద్రే కామం కరిష్యామి సమయం తు నిబోధ మే॥ 2
(స్వం తే పుంస్త్వం ప్రదాస్యామి స్త్రీత్వం ధారయితాస్మి తే
కించిత్ కాలాంతరే దాస్యే పుంలింగం స్వమిదం తవ।
ఆగంతవ్యం త్వయా కాలే సత్యం చైవ వదస్వ మే॥ 3
భీష్ముడు చెప్తున్నాడు. భారతశ్రేష్ఠా! శిఖండి యొక్క మాటలు విన్న తరువాత ఆ యక్షుడు దైవోపహతుడై మనసులోనే కొంత ఆలోచించుకొని ఆమెతో ఇలా అన్నాడు. "భద్రా! భవితవ్యం అలా ఉంది. ఇది నాకు దుఃఖకారణమే అయినా నీ కోరిక తీరుస్తాను. నా నియమం(షరతు) చెప్తాను. విను.(నా పుంస్త్వం నీకిస్తాను. నీ స్త్రీత్వం నేను తీసుకుంటాను.) కాని కొద్ది కాలానికి మాత్రమే నా పుంస్త్వం నీకిస్తాను. గడువులోపు నీవు రావాలి. ఇది సత్యమని, తప్పనని మాట ఇయ్యి. (1-3)
ప్రభుః సంకల్ప సిద్ధోఽస్మి కామచారీ విహంగమః।
మత్ప్రసాదాత్ పురం చైవ త్రాహి బంధూంశ్చ కేవలమ్॥ 4
నేను సమర్థుడిని, సంకల్పసిద్ధుడిని. ఇచ్చవచ్చిన రీతిలో తిరగ గలను. ఆకాశచారిని కూడా. నా అనుగ్రహం వల్ల నగరాన్ని బంధువులను కూడా రక్షించుకో. (4)
స్త్రీలింగం ధారయిష్యామి తదేవం పార్థివాత్మజే।
సత్యం మే ప్రతిజానీహి కరిష్యామి ప్రియం తవ॥ 5
రాకుమారీ! ఈ ప్రకారంగా నేను స్త్రీత్వాన్ని ధరిస్తాను. నీవు నాకు సత్యప్రతిజ్ఞ చెయ్యి "గడువు లోపల తిరిగి వచ్చి పుంస్త్వాన్ని ఇస్తా, నని. నీకు నేను ప్రియం చేస్తాను. (5)
శిఖండిన్యువాచ
ప్రతిదాస్యామి భగవన్ పుంలింగం తవ సువ్రత।
కించిత్కాలాంతరం స్త్రీత్వం ధారయస్వ నిశాచర॥ 6
శిఖండిని ఆటోంది - సువ్రతా! భగవాన్! నీకు పుంస్త్వాన్ని తిరిగి ఇస్తాను. నిశాచరా! కొద్దికాలం స్త్రీత్వాన్ని ధరించు. (6)
ప్రతియాతే దశార్ణే తు పార్థివే హేమవర్మణి।
కన్యైవ హి భవిష్యామి పురుషస్త్వం భవిష్యసి॥ 7
దశార్ణరాజు హేమవర్మ తిరిగి వెళ్లి పోగానే నేను కన్యనే అవుతాను. నీవు పురుషుడ వవుతావు. (7)
భీష్మ ఉవాచ
ఇత్యుక్త్వా సమయం తత్ర చక్రాతే తావుభౌ నృప।
అన్యోన్యస్యాభిసందేహే తే సంక్రామయతాం తతః॥ 8
స్త్రీలింగం ధారయామాస స్థూణా యక్షోఽథ భారత।
యక్షరూపం చ తద్ దీప్తం శిఖండీ ప్రత్యపద్యత॥ 9
భీష్ముడు చెప్తున్నాడు. రాజా! ఇలా అనుకొని వారిద్దరూ ఒక నియమం(ప్రతిజ్ఞ) చేసుకున్నారు. తరువాత వారిద్దరూ పరస్పరం ఒకరి చిహ్నాన్ని ఒకరు పొందారు. భారతా! యక్షుడైన స్థూణాకర్ణుడు స్త్రీ చిహ్నాన్ని ధరించాడు. శిఖండి తేజస్వంతమైన యక్ష రూపాన్ని పొందింది. (8-9)
వి॥సం॥ "అన్యోన్యస్యానభిద్రోహే" అని పాఠాంతరం ఉంది. పరస్పరం బాధలేనిరీతిగా అని అర్థం(అర్జు) అనభిద్రోహసమయం పరస్పరం ఒకరినొకరు చేసుకున్నారు. స్థూణాకర్ణుడు శపథం(నియమం) చేస్తే శిఖండి అంగీకరించింది అని అర్థం(సర్వ)
తతః శిఖండీ పాంచాల్యః పుంస్త్వమాసాద్య పార్థివ।
వివేశ నగరం హృష్టః పితరం చ సమాసదత్॥ 10
రాజా! అనంతరం పాంచాలరాజకుమారుడు శిఖండి పుంస్త్వాన్ని పొంది సంతోషంతో నగరాన్ని ప్రవేశించి తండ్రిని కలిసికొన్నాడు. (10)
యథావృత్తం తు తత్ సర్వమ్ ఆచఖ్యే ద్రుపదస్య తత్।
ద్రుపదస్తస్య తచ్ఛ్రుత్వా హర్షమాహారయత్ పరమ్॥ 11
జరిగిన వృత్తాంతం యావత్తు ద్రుపదునికి చెప్పాడు. అది విని ద్రుపదుడు మిక్కిలి సంతోషించాడు. (11)
వి॥సం॥ హర్షమ్ ఆహారయత్ హర్షసూచకమైన ధ్వజాన్ని పైకెత్తించడం లాంటి పనులు చేశాడని అర్థం(అర్జు)
సభార్యస్తచ్చ సస్మార మహేశ్వరవచస్తదా।
తతః సంప్రేషయామాస దశార్ణాధిపతేర్నృపః॥ 12
పురుషోఽయం మమ సుతః శ్రద్ధతాం మే భవానితి॥
ద్రుపదుడు అతని భార్య కూడా అప్పుడు మహేశ్వరుని మాటలను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. అనంతరం ద్రుపదుడు దశార్ణాధిపతి దగ్గరకు "ఈ నా సుతుడు పురుషుడే. మీరు నా మాటను విశ్వసించ వచ్చును" అని చెప్పి దూతను పంపించాడు. (12 1/2)
అథ దాశార్ణకో రాజా సహసాభ్యాగమత్ తదా॥ 13
పంచాలరాజం ద్రుపదం దుఃఖశోకసమన్వితః।
అయితే దుఃఖశోకాలను పొందిన దశార్ణరాజు వెంటనే పాంచాల రాజు ద్రుపదునిపైకి వచ్చిపడ్డాడు. (13 1/2)
తతః కాంపిల్య మాసాద్య దశార్ణాధిపతిస్తతః॥ 14
ప్రేషయామాస సత్కృత్య దూతం బ్రహ్మవిదాం వరమ్।
కాంపిల్యనగర సమీపానికి వచ్చిన వెంటనే దశార్ణాధిపతి బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడైన వానిని ఒక్కనిని సత్కరించి దూతగా పంపాడు. (14 1/2)
బ్రూహి మద్వచనాత్ దూత పాంచాల్యం తం నృపాధమమ్॥ 15
యన్మే కన్యాం స్వకన్యార్థే వృతవానసి దుర్మతే।
ఫలం తస్యావలేపస్య ద్రక్ష్యస్యద్య న సంశయః॥ 16
దూతా! ఆ రాజాధముడైన పాంచాలునికి నా మాటగా ఇలా చెప్పు. "దుర్మతీ! నా కూతురిని నీ కూతురికి భార్యగా చేశావు. నేడు ఆ గర్వానికి తగిన ఫలాన్ని చూస్తావు. సందేహం లేదు." (15-16)
ఏవముక్త శ్చ తేనాసౌ బ్రాహ్మణో రాజసత్తమ।
దూతః ప్రయాతో నగరం దాశార్ణనృపచోదితః॥ 17
రాజోత్తమా! ఇలా చెప్పి పంపగా బ్రాహ్మణుడైన ఆ దూత దశార్ణరాజుచేత ప్రేరితుడై నగరానికి బయలు దేరాడు. (17)
తత ఆసాదయామాస పురోధా ద్రుపదం పురే।
తస్మై పాంచాలకో రాజా గామర్ఘ్యం చ సుసత్కృతమ్॥ 18
ప్రాపయామాస రాజేంద్ర సహ తేన శిఖండినా।
తాం పూజాం నాభ్యనందత్ స వాక్యం చేదమువాచ హ॥ 19
రాజేంద్రా! పురోహితుడు పట్టణంలో ద్రుపదుని కలుసుకున్నాడు. అతనికి పాంచాలరాజు గోవును, అర్ఘ్యమూ ఇచ్చి సత్కరించాడు. శిఖండిని కూడా అక్కడే కలుసుకున్నాడు. రాజు చేసిన ఆ సత్కారాన్ని స్వీకరించక అతడు ఇలా అన్నాడు. (18,19)
యదుక్తం తేన వీరేణ రాజ్ఞా కాంచనవర్మణా।
యత్ తేఽహమధమాచార దుహిత్రాస్మ్యభివంచితః॥ 20
తస్య పాపస్య కరణాత్ ఫలం ప్రాప్నుహి దుర్మతే।
దేహి యుద్ధం నరపతే మమాద్య రణమూర్ధని॥ 21
ఉద్ధరిష్యామి తే సద్యః సామాత్యసుతబాంధవమ్।
వీరుడైన ఆ రాజు కాంచనవర్మ చెప్పినది వినండి. పాపాచారుడా! దుర్మతీ! రాజా! నీ కూతురు నన్ను వంచించింది. ఆ పాప కార్యానికి ఫలాన్ని అనుభవించు యుద్ధరంగంలో నిలిచి నాతో యుద్ధం చేయి. వెంటనే (ఇప్పుడే) మంత్రులు, సుతులు, బంధువులతో కూడా అందరినీ పెకలించివేస్తాను. (20,21 1/2)
తదుపాలంభసంయుక్తం శ్రావితః కిల పార్థివః॥ 22
దశార్ణపతినా చోక్తః మంత్రిమధ్యే పురోధసా।
ఈ రీతిగా పురోహితుడు మంత్రులమధ్యలో ఉన్న రాజునకు దశార్ణపతి పలికిన నిందాయుక్తమయిన మాటలను వినిపించాడు. (22 1/2)
అభవత్ భరతశ్రేష్ఠ ద్రుపదః ప్రణయానతః॥ 23
యదాహ మాం భవాన్ బ్రహ్మన్ సంబంధివచనాద్ వచః।
అస్యోత్తరం ప్రతివచః దూతో రాజ్ఞే వదిష్యతి॥ 24
భరతశ్రేష్ఠా! ద్రుపదుడు అది విని ప్రేమతో అవనతుడయ్యాడు. (అతనితో ఇలా అన్నాడు) బ్రహ్మన్! మా సంబంధీకుడు(వియ్యంకుడు) చెప్పమన్నట్లుగా మీరు ఏమయితే చెప్తారో దానికి ప్రత్యుత్తరంగా మా దూత ఆ రాజుకు సమాధానం చెప్తాడు. (23-24)
వి॥సం॥ ఉత్తరం - ఉత్కృష్టతరమైన ప్రతివచనం(నీల)
తతః సంప్రేషయామాస ద్రుపదోఽపి మహాత్మనే।
హిరణ్యవర్మణే దూతం బ్రాహ్మణం వేదపారగమ్॥ 25
ఇలా అని ద్రుపదుడు వెంటనే మహాత్ముడైన హిరణ్యవర్మ దగ్గరకు వేదపారగుడైన బ్రాహ్మణుని దూతగా పంపాడు. (25)
తమాగమ్య తు రాజానం దశార్ణాధిపతిం తదా।
తద్ వాక్యమాదదే రాజన్ యదుక్తం ద్రుపదేన హ॥ 26
రాజా! అప్పుడు దశార్ణాధిపతి అయిన ఆహేమవర్మ దగ్గరకు వచ్చి ఆ దూత ద్రుపదుడు చెప్పిన మాటలను చెప్పాడు. (26)
ఆగమః క్రియతాం వ్యక్తః కుమారోఽయం సుతో మమ।
మిథ్యైతదుక్తం కేనాపి తదశ్రద్ధేయ మిత్యుత॥ 27
ఈ నా పుత్రుడు కుమారుడే(కుమార్తె కాదు) స్పష్టంగా పరీక్షించుకోవచ్చును. ఎవరో చెప్పినది అబద్ధం, దానిని మీరు నమ్మనక్కరలేదు. (27)
తతః స రాజా ద్రుపదస్య శ్రుత్వా
విమర్షయుక్తో యువతీర్వరిష్ఠాః।
సంప్రేషయామాస సుచారురూపాః
శిఖండినం స్త్రీ పుమాన్ వేతి వేత్తుమ్॥ 28
ద్రుపదుని సందేశాన్ని విని రాజు ఆలోచనలో పడి చక్కని అందమైన రూపాలు గల శ్రేష్ఠమైన యువతులను "శిఖండి స్త్రీయా పురుషుడా" అని తెలుసుకోవడానికి పంపాడు. (28)
తాః ప్రేషితాస్తత్త్వభావం విదిత్వా
ప్రీత్యా రాజ్ఞే తచ్ఛశంసుర్హి సర్వమ్।
శిఖండినం పురుషం కౌరవేంద్ర
దాశార్ణరాజాయ మహానుభావమ్॥ 29
కౌరవేంద్రా! అలా పంపబడిన వారు వాస్తవికవిషయాన్ని తెలుసుకుని ఆనందంగా రాజుకు అంతా వివరించి చెప్పారు. దాశార్ణరాజు హేమవర్మకు శిఖండి మహానుభావుడైన పురుషుడని విన్నవించారు. (29)
తతః కృత్వా తు రాజా స ఆగమం ప్రీతిమావథ।
సంబంధినా సమాగమ్య హృష్టో వాసమువాస హ॥ 30
ఆ రాజు పరీక్షించిన తరువాత ప్రీతిని(తృప్తిని) పొందాడు. బంధువుతో కలిసి ఆనందంగా అక్కడ ఉండి పోయాడు. (30)
శిఖండినే చ ముదితః ప్రాదాద్ విత్తం జనేశ్వరః।
హస్తినోఽశ్వాంశ్చ గాశ్చైవ దాస్యోఽథ బహులాస్తథా॥ 31
ఆ నరేశ్వరుడు సంతోషించి శిఖండికి ధనం, ఏనుగులు, గుఱ్ఱాలు, గోవులు దాసీలు మిక్కిలిగా సమర్పించాడు. (31)
పూజితశ్చ ప్రతియయౌ నిర్భర్త్స్య తనయాం కిల।
వినీత కిల్బిషే ప్రీతే హేమవర్మణి పార్థివే।
ప్రతియాతే దశార్ణే తు హృష్టరూపా శిఖండినీ॥ 32
కూతురిని నిందించి(అబద్ధపువార్త పంపినందుకు) వారిచేత సత్కారాలు పొంది తిరిగి వెళ్లాడు. దశార్ణరాజు హేమవర్మ కోపం పోయి సంతోషంగా తిరిగివెళ్లగానే శిఖండి కూడా సంతోషించింది. (32)
కస్యచిత్ త్వథ కాలస్య కుబేరో నరవాహనః।
లోకయాత్రాం ప్రకుర్వాణః స్థూణస్యాగాన్నివేశనమ్॥ 33
అక్కడ కొంతకాలానికి నరవాహనుడైన కుబేరుడు లోకసంచారం చేస్తూ స్థూణాకర్ణుని ఇంటికి వచ్చాడు. (33)
వి॥సం॥ లోకానుయానం కుర్వాణః అనే పాఠాంతరం ఉంది(అర్జు)
స తద్గృహస్యోపరి వర్తమానః
ఆలోకయామాస ధనాధిగోప్తా।
స్థూణస్య యక్షస్య వివేశ వేశ్మ
స్వలంకృతం మాల్యగుణైర్విచిత్రైః॥ 34
లాజ్యైశ్చ గంధైశ్చ తథా వితానైః
అభ్యర్చితం ధూపనధూపితం చ।
ధ్వజైః పతాకాభిరలంకృతం చ
భక్ష్యాన్నపేయామిషదంతహోమమ్॥ 35
కుబేరుడు ఆ గృహానికి పైభాగాన(ఆకాశంలో) ఉండి పరికించాడు. ఆ భవనం విచిత్రమైన హారాలతో బాగా అలంకరింపబడి ఉంది. పేలాల పరిమళాలు, ఇతరసువాసనలు వ్యాపించి ఉన్నాయి. పైన చాందినీలు కట్టబడి ఉన్నాయి. ధూపాలతో పొగవేయబడి ఉంది. ధ్వజాలతో, పతాకాలతో అలంకరింపబడి ఉంది. దంతాలనే అగ్నిహోత్రునికి ఆహుతి చేయాలని అనిపించే భక్ష్యాన్నాలతో పానీయాలతో, ఆమిషంతో (మాంసంతో) నిండి ఉంది. అటువంటి స్థూణాకర్ణుని గృహాన్ని ప్రవేశించాడు కుబేరుడు. (34-35)
వి॥సం॥ 'లాజైరుశీరైశ్చ - అని పాఠాంతరం - పేలాల, వట్టివేళ్ల సువాసనలు. భక్ష్యం = లడ్డూలు చెఱకుగడలు మొదలైనవి పళ్లకు పని కల్పించేవి. అన్నం = తినదగినది, అన్నం పాయసం ఖండశర్కర మొదలైనవి. భోజ్యం = లేహ్యరూపమైనది. పేయం = సుర, ఆసవం మొదలైనవి. ఆమిషం = మాంసం, ప్రత్యేకంగా కోరదగినది కాబట్టి భక్ష్యాదులకంటే వేరుగా చెప్పబడింది.
దంతహోమం = దంతాలతో ఆహుతి చేయడం. తినాలనిపించే శ్రేష్ఠమైన పదార్థాలు
"అమిషమప్రమేయం" - అనే పాఠాంతరం మూర్ఖులు కల్పించినది.(నీల)
తత్ స్థాపం తస్య దృష్ట్వా తు సర్వతః సమలంకృతమ్।
మణిరత్నసువర్ణానాం మాలాభిః పరిపూరితమ్॥ 36
నానాకుసుమగంధాఢ్యం సిక్తసంమృష్టశోభితమ్।
అథాబ్రవీద్ యక్షపతిః తాన్ యక్షాననుగ్రాంస్తదా॥ 37
స్వలంకృతమిదం వేశ్మ స్థూణస్యామితవిక్రమాః।
నోపసర్పతి మాం చైవ కస్మాదద్య స మందధీః॥ 38
అన్నివైపుల చక్కగా అలంకరింపబడి, మణిరత్న సువర్ణహారాలతో పరిపూర్ణమై ఆ భవనం అనేక విధాల పూలసువాసనలతో కూడి ఉంది. గంధాదులతో తడిసి, వస్త్రాదులతో సమృద్ధి పొందింది. లేఖన చిత్రాలతో శోభిస్తూ ఉన్న స్థూణుని ఆ నివాసస్థానం చూచి, యక్షపతి అనుచరులతో అప్పుడిలా అన్నాడు. "మిక్కిలి పరాక్రమవంతుడైన స్థూణుని యొక్క ఈ గృహం చక్కగా అలంకరింపబడిఉంది. కాని ఆ మందబుద్ధి ఇప్పుడు ఎందుకు నా దగ్గరకు రావడం లేదు? (36-38)
యస్మాజ్జానన్ స మందాత్మా మామసౌ నోపసర్పతి।
తస్మాత్ తస్మై మహాదండః ధార్యః స్యాదితి మే మతిః॥ 39
ఈ మందబుద్ధి నా గురించి తెలిసి కూడా రాలేదు కనుక అతనికి గొప్ప శిక్షను విధించాలని అనుకుంటున్నాను. (39)
యక్షా ఊచుః
ద్రుపదస్య సుతా రాజన్ రాజ్ఞో జాతా శిఖండినీ।
తస్యా నిమిత్తే కస్మింశ్చిత్ ప్రాదాత్ పురుషలక్షణమ్॥ 40
అగ్రహీల్లక్షణం స్త్రీణాం స్త్రీభూతో తిష్ఠతే గృహే।
నోపసర్పతి తేనాసౌ సవ్రీడః స్త్రీసరూపవాన్॥ 41
యక్షులు అన్నారు. రాజా! ద్రుపదరాజుకు శిఖండిని అనే కూతురు కలిగింది. ఒకానొక కారణంగా ఆమె కొఱకు తను పురుషలక్షణాన్ని ఇతడు ఇచ్చాడు. ఆమె యొక్క స్త్రీ లక్షణాన్ని తాను గ్రహించి స్త్రీ రూపంతో గృహంలోనే ఉంటున్నాడు. ఆ కారణంగా స్త్రీరూపధారియైన అతడు సిగ్గుతో మీ దగ్గరకు రాలేదు. (40,41)
ఏతస్మాత్ కారణాద్ రాజన్ స్థూణో న త్వాద్య సర్పతి।
శ్రుత్ఽఆ కురు యథాన్యాయం విమానమిహ తిష్ఠతామ్॥ 42
రాజా! ఈ కారణంగానే స్థూణుడు ఈనాడు మిమ్మల్ని సమీపించలేదు. ఇది విన్న తరువాత ఏది న్యాయమో అది చేయండి. మీ విమానం ఇక్కడే ఉండనివ్వండి. (42)
ఆనీయతాం స్థూణ ఇతి తతో యక్షాధిపోఽబ్రవీద్।
కర్తాస్మి నిగ్రహం తస్య ప్రత్యువాచ పునః పునః॥ 43
అప్పుడు కుబేరుడు స్థూణుని తీసుకురండి అన్నాడు. అతనికి నేను దండన విధిస్తాను, అని పదే పదే పలికాడు. (43)
సోఽభ్యగచ్ఛత యక్షేంద్రమ్ ఆహూతః పృథివీపతే।
స్త్రీ సరూపో మహారాజ తస్థౌ వ్రీడాసమన్వితః॥ 44
అలా పిలిచిన మీదట అతడు కుబేరుని దగ్గరకు వెళ్లాడు. స్త్రీరూపంలో ఉండడం చేత సిగ్గుతో నిలబడ్డాడు. (44)
తం శశాపాథ సంక్రుద్ధః ధనదః కురునందన।
ఏవమేవ భవత్వద్య స్త్రీత్వం పాపస్య గుహ్యకాః॥ 45
అతనిని చూడగానే మిక్కిలి కోపించిన కుబేరుడు అతనిని శపించాడు. "గుహ్యకులారా! ఈ పాపికి స్త్రీత్వం ఇప్పుడిక ఇలాగే ఉండుగాక! (45)
తతోఽబ్రవీద్ యక్షపతి ర్మహాత్మా
యస్మాదదాస్త్వవమన్యే హ యక్షాన్।
శిఖండినే లక్షణం పాపబుద్ధే
స్త్రీలక్షణం చాగ్రహీః పాపకర్మన్॥ 46
అప్రవృత్తం సుదుర్బుద్ధే యస్మాదేతత్ త్వయా కృతమ్।
తస్మాదద్య ప్రభృత్యేవ స్త్రీ త్వం సా పురుషస్తథా॥ 47
తరువాత మహాత్ముడైన కుబేరుడు అతనితో ఇలా అన్నాడు. పాపకర్మ! యక్షులను అవమానపరచి శిఖండికి నీ పురుష లక్షణాన్ని ఇచ్చి వేశావు. స్త్రీ లక్షణాన్ని గ్రహించావు. దుర్బుద్ధీ! జరగకూడని ఈపని నీవు చేశావు. ఈ కారణంగా ఈనాడు మొదలుకొని నీవు స్త్రీగానే, ఆమె పురుషునిగానే ఉంటారు. (46,47)
తతః ప్రసాదయామాసుః యక్షా వైశ్రవణం కిల।
స్థూణస్యార్థే కురుష్వాంతం శాపస్యేతి పునః పునః॥ 48
అప్పుడు యక్షులందరూ కుబేరుని శాపాంతాన్ని చెప్పమని స్థూణునికోసం పదే పదే ప్రార్థించారు. (48)
తతో మహాత్మా యక్షేంద్రః ప్రత్యువాచానుగామినః।
సర్వాన్ యక్షగణాంస్తాత శాపస్యాంతచికీర్షయా॥ 49
నాయనా! అప్పుడు మహాత్ముడైన యక్షేంద్రుడు శాపాంతం చేయాలనే కోరికతో తన అనుచరులైన సమస్త యక్ష సమూహానికి ఇలా బదులిచ్చాడు. (49)
శిఖండిని హతే యక్షాః స్వం రూపం ప్రతిపత్స్యతే।
స్థూణో యక్షో నిరుద్వేగః భవత్వితి మహామనాః॥ 50
ఇత్యుక్త్వా భగవాన్ దేవః యక్షరాజః సుపూజితః।
ప్రయయౌ సహితః సర్వైః నిమేషాంతరచారిభిః॥ 51
"యక్షులారా! శిఖండి చనిపోయాక స్థూణుడు తన రూపాన్ని పొందుతాడు. కనుక అతడు ఇప్పుడు నిర్భయంగా ఉండును గాక" అని పలికి మహాత్ముడు, భగవంతుడు అయిన యక్షరాజు వారిచే చక్కగా పూజితుడై నిమేషకాలంలోనే స్వస్థానానికి చేరుకోగల తన సమస్తపరివారంతో కూడి బయల్దేరాడు. (50-51)
స్థూణస్తు శాపం సంప్రాప్య తత్రైవ న్యవసత్ తదా।
సమయే చాగమత్ తూర్ణం శిఖండి తం క్షపాచరమ్॥ 52
శాపాన్ని పొందిన స్థూణుడు అక్కడే నివసించసాగాడు. సమయం కాగానే శిఖండి వెంటనే ఆ నిశాచరుని దగ్గరకు వచ్చాడు. (52)
సోఽభిగమ్యాబ్రవీద్ వాక్యం ప్రాప్తోఽస్మి భగవన్నితి।
తమబ్రవీత్ తతః స్థూణః ప్రీతోఽస్మీతి పునః పునః॥ 53
అతడు సమీపించి "భగవన్! నేను వచ్చేశాను "అని చెప్పాడు అంతట స్థూణుడు" సంతోషించాను" అని పదే పదే అతనితో అన్నాడు. (53)
ఆర్జవే నాగతం దృష్ట్వా రాజపుత్రం శిఖండినమ్।
సర్వమేవ యథావృత్తమ్ ఆచచక్షే శిఖండినే॥ 54
రాజపుత్రుడు శిఖండి నిజాయితీగా రావడం చూసి అతనికి జరిగిన సమస్తాన్ని ఉన్నదున్నట్లుగా చెప్పాడు. (54)
యక్ష ఉవాచ
శప్తో వైశ్రవణేనాహం త్వత్కృతే పార్థివాత్మజ।
గచ్ఛేదానీం యథాకామం చర లోకాన్ యథాసుఖమ్॥ 55
యక్షుడు చెప్తున్నాడు. రాకుమారా! నీ గురించి నేను కుబేరుని చేత శాపాన్ని పొందాను. ఇప్పుడు నీవు స్వేచ్ఛగా వెళ్లవచ్చు. సుఖంగా లోకాలన్నీ తిరుగు. (55)
దిష్టమేతత్ పురా మన్యే న శక్యమతివర్తితుమ్।
గమనం తవ చేతో హి పౌలస్త్యస్య చ దర్శనమ్॥ 56
ఇది నా పురాతన ప్రారబ్ధం అనుకుంటున్నాను. నీవు ఇక్కడినుండి అటు వెళ్లగానే కుబేరుడు ఇటు వచ్చి కనిపించడం దాటశక్యం కానిది. (56)
భీష్మ ఉవాచ
ఏవముక్తః శిఖండీ తు స్థూణయక్షేణ భారత।
ప్రత్యాజగామ నగరం హర్షేణ మహతా వృతః॥ 57
భీష్ముడు చెప్తున్నాడు. భారతా! స్థూణయక్షుడు ఇలా చెప్పగానే శిఖండి పట్టరాని సంతోషంతో నగరానికి తిరిగి వచ్చాడు. (57)
పూజయామాస వివిధైః గంధమాల్యైర్మహాధనైః।
ద్విజాతీన్ దేవతాశ్చైవ చైత్యానథ చతుష్పథాన్॥ 58
ద్రుపదః సహ పుత్రేణ సిద్ధార్థేన శిఖండినా।
ముదం చ పరమాం లేభే పాంచాల్యః సహ బాంధవైః॥ 59
కోరిక సిద్ధించిన కొడుకు శిఖండితో కలిసి ద్రుపదుడు బ్రాహ్మణులను, దేవతలను, గ్రామమధ్యంలో పూజింపబడే రావివంటి చెట్లను, కూడళ్లను వివిద రకాలైన గంధమాల్యాదుల చేత, ధనరాసుల చేత పూజించాడు. ఆ పాంచాలరాజు బంధువులతో కలసి పరమానందాన్ని పొందాడు. (58-59)
శిష్యార్థం ప్రదదౌ చాథ ద్రోణాయ కురుపుంగవ।
శిఖండినం మహారాజ పుత్రం స్త్రీపూర్విణం తథా॥ 60
కురుపుంగవా! మహారాజా! పూర్వం స్త్రీగా ఉండి కొడుకుగా మారిన శిఖండిని శిష్యరికం కోసం ద్రోణునికి అప్పగించాడు. (60)
ప్రతిపేదే చతుష్పాదం ధనుర్వేదం నృపాత్మజః।
శిఖండీ సహ యుష్మాభిః ధృష్టద్యుమ్నశ్చ పార్షతః॥ 61
ద్రుపదరాజు కొడుకు అయిన శిఖండి, ధృష్టద్యుమ్నుడు కూడా మీతో కలిసి చతుష్పాదమైన ధనుర్వేదాన్ని నేర్చుకున్నారు. (61)
వి॥సం॥ చతుష్పాదం 1. గ్రహణం 2. ధారణం 3. ప్రయోగం 4. ప్రతీకారం అనే నాలుగు పాదాలు గలది. (నీల)
మమ త్వేతచ్చరాస్తాత యథావత్ ప్రత్యవేదయన్।
జడాంధబధిరాకారా యే ముక్తా ద్రుపదే మయా॥ 62
నాయనా! ద్రుపదుని నగరానికి నేను పంపిన గూఢచారులు జడులులాగ, గ్రుడ్డివారులాగ, చెవిటివారు వలె ఆకారాలు ధరించి సంచరిస్తూ ఈ వృత్తాంతాన్ని జరిగినది జరిగినట్లుగ నాకు నివేదించారు. (62)
ఏవమేష మహారాజ స్త్రీపుమాన్ ద్రుపదాత్మజః।
స సంభూతః కురుశ్రేష్ఠ శిఖండీ రథసత్తమః॥ 63
మహారాజా! కురుశ్రేష్ఠా! ఈ రీతిగా ద్రుపదాత్మజుడు రథికశ్రేష్ఠుడు అయిన ఈ శిఖండి స్త్రీగా పుట్టి పురుషుడయ్యాడు. (63)
జ్యేష్ఠా కాశిపతేః కన్యా అంబానామేతి విశ్రుతా।
ద్రుపదస్య కులే జాతా శిఖండీ భరతర్షభ॥ 64
భరతకులశ్రేష్ఠా! అంబ అనే పేరుతో ప్రఖ్యాతి చెందిన కాశీరాజు పెద్ద కూతురు ద్రుపదుని వంశంలో శిఖండిగా పుట్టింది. (64)
నాహమేనం ధనుష్పాణిం యుయుత్సుం సముపస్థితమ్।
ముహూర్తమపి పశ్యేయం ప్రహరేయం న చాప్యుత॥ 65
ధనుస్సు చేతితో పట్టుకొని యుద్ధం చేయాలనే కోరికతో ఎదుటికి వచ్చి నిలిచిన ఇతనిని ముహూర్తకాలం కూడా చూడను. కొట్టనుకూడా కొట్టను. (65)
వ్రతమేతన్మను సదా పృథివ్యామపి విశ్రుతమ్।
సియాం స్త్రీపూర్వకే చైవ స్త్రీనామ్ని స్త్రీస్వరూపిణి॥ 66
న ముంచేయమహం బాణమ్ ఇతి కౌరవనందన।
కౌరవనందనా! స్త్రీ మీద గాని, పూర్వం స్త్రీగా ఉన్నవాని మీద గాని, స్త్రీ పేరు ఉన్నవాని మీదగాని స్త్రీ రూపం గలవాని మీదగాని నేను బాణం విడువను - ఇది ఎల్లప్పుడూ నేను పాటించే వ్రతం. ఇది లోకంలో అందరికీ తెలిసినదే. (66 1/2)
న హన్యామహమేతేన కారణేన శిఖండినమ్॥ 67
ఏతత్ తత్త్వమహం వేద జన్మ తాత శిఖండినః।
తతో నైనం హనిష్యామి సమరేష్వాతతాయినమ్॥ 68
నాయనా! ఈ కారణంగానే శిఖండిని నేను చంపను. శిఖండి యొక్క ఈ జన్మ వాస్తవాన్ని నేను ఎరుగుదును. కాబట్టి యుద్ధరంగంలో అతడు చంపడానికి సిద్ధమై వచ్చినా నేను అతనిని చంపను. (67-68)
యది భీష్మః స్త్రియం హన్యాత్ పంతః కుర్యుర్విగర్హణమ్।
నైనం తస్మాద్ధనిష్యామి దృష్ట్వాపి సమరే స్థితమ్॥ 69
భీష్ముడు స్త్రీని చంపాడంటే సత్పురుషులు నిందిస్తారు. అందువల్ల యుద్ధంలో నిలవడం చూచినా గాని నేను అతనిని చంపను. (69)
వైశంపాయన ఉవాచ
ఏతచ్ఛ్రుత్వా తు కౌరవ్యః రాజా దుర్యోధనస్తదా।
ముహూర్తమివ స ధ్యాత్వా భీష్మే యుక్తమమన్యత॥ 70
వైశంపాయనుడు అంటున్నాడు. ఇది విని కౌరవరాజు అయిన దుర్యోధనుడు అప్పుడు ముహూర్తకాలం మనసులో ఆలోచించుకొని 'భీష్మునిపట్ల ఇది యుక్తమే' (శిఖండిని చంపకపోవడం) అనుకొన్నాడు. (70)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి శిఖండి పుంస్త్వప్రాప్తౌ ద్వినవత్యధిక శతతమోఽధ్యాయః॥ 192 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున అంబోపాఖ్యానపర్వమను ఉపపర్వమున
శిఖండి పురుషత్వప్రాప్తి అను నూటతొంబది రెండవ అధ్యాయము(192)
(దాక్షిణాత్య అధికపాఠం 1/2 శ్లోకం కలుపుకుని మొత్తం 70 1/2 శ్లోకాలు)