194. నూట తొంబది నాల్గవ అధ్యాయము
అర్జునుడు ధర్మజునకు తమవారియొక్క శక్తులను వివరించుట.
వైశంపాయన ఉవాచ
ఏతచ్ఛ్రుత్వా తు కౌంతేయః సర్వాన్ భ్రాతౄనుపహ్వరే।
ఆహూయ భరతశ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు. భరతశ్రేష్ఠుడవైన జనమేజయా! ఇది విన్న యుధిష్ఠిరుడు తన తమ్ములందరినీ ఏకాంతంగా పిలిచి ఇలా అన్నాడు. (1)
యుధిష్ఠిర ఉవాచ
ధార్తరాష్ట్రస్య సైన్యేషు యే చారపురుషా మమ।
తే ప్రవృత్తిం ప్రయచ్ఛంతి మమేమాం వ్యుషితాం నిశామ్॥ 2
దుర్యోధనః కిలాపృచ్ఛిత్ ఆపగేయం మహావ్రతమ్।
కేన కాలేన పాండూనాం హన్యాః సైన్యమితి ప్రభో॥ 3
దుర్యోధనుని సైన్యంలో ఉన్న నా గూఢచారులు ఈ ప్రభాతసమయంలో అక్కడి వార్తను నాకు తెల్పారు. దుర్యోధనుడు మహావ్రతుడైన భీష్ముని "ప్రభూ! పాండవులసైన్యాన్ని ఎంత కాలంలో చంపగల్వు?" అని అడిగాడుట. (2,3)
మాసేనేతి చ తేనోక్తః ధార్తరాష్ట్రః సుదుర్మతిః।
తావతా చాపి కాలేన ద్రోణోఽపి ప్రతిజజ్ఞివాన్॥ 4
గౌతమో ద్విగుణం కాలమ్ ఉక్తవానితి నః శ్రుతమ్।
ద్రౌణిస్తు దశరాత్రేణ ప్రతిజజ్ఞే మహాస్త్రవిత్॥ 5
ధృతరాష్ట్రసుతుడైన ఆ దుర్మతికి నెలరోజులు అని సమాధానం చెప్పాడుట(భీష్ముడు). అంతేకాలం అని ద్రోణుడు నొక్కి చెప్పాడు. రెట్టింపుకాలం అని గౌతముడైన కృపాచార్యుడు చెప్పాడని నాకు తెలిసింది. మహాస్త్రకోవిదుడైన అశ్వత్థామ పదిరోజులని ప్రతిజ్ఞ చేశాడు. (4-5)
తథా దివ్యాస్త్రవిత్ కర్ణః సంపృష్టః కురుసంసది।
పంచభిర్దివసైర్హంతుం ససైన్యం ప్రతిజజ్ఞివాన్॥ 6
అనంతరం కురుసభలో అడిగిన వెంటనే కర్ణుడు ఐదురోజులలో ససైన్యంగా చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. (6)
తస్మాదహమపీచ్ఛామి శ్రోతుమర్జున తే వచః।
కాలేన కియతా శత్రూన్ క్షపయేరితి ఫాల్గున॥ 7
అర్జునా! కాబట్టి నేను కూడా నీ మాటలను వినాలనుకుంటున్నాను. ఎంతకాలంలో శత్రువులను సంహరించగలవు? (7)
ఏవముక్తో గుడాకేశః పార్థివేన ధనంజయః।
వాసుదేవం సమీక్ష్యేదం వచనం ప్రత్యభాషత॥ 8
రాజు ఇలా అడగగానే గుడాకేశుడు అయిన ధనంజయుడు వాసుదేవునివైపు చూసి ఇలా బదులిచ్చాడు. (8)
సర్వ ఏతే మహాత్మానః కృతాస్త్రాశ్చిత్రయోధినః।
అసంశయం మహారాజ హన్యురేవ న సంశయః॥ 9
మహారాజా! నిస్సంశయంగా ఈ మహాత్ములందరూ అస్త్రవిద్యలో ఆరితేరినవారు. చిత్రవిచిత్రంగా యుద్ధం చేయగలిగినవారు. చంపగలరు. సందేహం లేదు. (9)
అపైతు తే మనస్తాపః యథా సత్యం బ్రవీమ్యహమ్।
హన్యామేకరథేనైవ వాసుదేవసహాయవాన్॥ 10
సామరానపి లోకాంస్త్రీన్ సర్వాన్ స్థావరజంగమాన్।
భూతం భవ్యం భవిష్యం చ నిమేషాదితి మే మతిః॥ 11
నీవు మనసులో దిగులుపడకు. నేను ఉన్న నిజాన్ని చెపుతున్నాను. వాసుదేవుని సహాయంతో ఒకే ఒక్క రథంతో దేవతలతో సహితంగా ముల్లోకాలను, సమస్త చరాచర ప్రాణులను, భూతవర్తమాన భవిష్యత్తులను కూడా నిమేషమాత్రకాలంలోనే మట్టుపెట్టగలనని నా నిశ్చయం. (10-11)
యత్ తద్ ఘోరం పశుపతిః ప్రాదాదస్త్రం మహాన్మమ।
కైరాతే ద్వంద్వయుద్ధే తు తదిదం మయి వర్తతే॥ 12
కిరాతవేషంలో ద్వంద్వయుద్ధసమయంలో పశుపతి నాకు ఇచ్చిన ఘోరమైన మహాస్త్రం నా దగ్గర ఉంది. (12)
యద్ యుగాంతే పశుపతిః సర్వభూతాని సంహరన్।
ప్రయుంక్తే పురుషవాఘ్ర తదిదం మయి వర్తతే॥ 13
మనుజోత్తమా! యుగాంతంలో పశుపతి సర్వ భూతసంహారం చేస్తూ ప్రయోగించే ఆ అస్త్రం నా దగ్గర ఉంది. (13)
తన్న జానాతి గాంగేయః న ద్రోణో న చ గౌతమః।
న చ ద్రోణసుతో రాజన్ కుత ఏవ తు సూతజః॥ 14
రాజా! ఆ అస్త్రాన్ని గూర్చి గాంగేయుడు గాని, ద్రోణుడు గాని, ద్రోణసుతుడైన అశ్వత్థామ గాని ఎరుగరు. ఇక సూతపుత్రుడు కర్ణుడెక్కడ? (14)
న తు యుక్తం రణే హంతుం దివ్యైరస్రైః పృథగ్జనమ్।
ఆర్జవేనైవ యుద్ధేన విజేష్యామో వయం పరాన్॥ 15
అయినా యుద్ధంలో ఇతర సాధారణజనాన్ని దివ్యాస్త్రాలతో చంపడం ఉచితం కాదు. మేము సరళంగా చేసే యుద్ధంతోనే శత్రువులను జయించగలం. (15)
తథేమే పురుషవ్యాఘ్రాః సహాయాస్తవ పార్థివ।
సర్వే దివ్యాస్త్రవిద్వాంసః సర్వే యుద్ధాభికాంక్షిణః॥ 16
రాజా! అలాగే ఈ పురుషసింహులందరూ నీకు సహాయం చేయడం కోసమే ఉన్నారు. అందరూ దివ్యాస్త్రకోవిదులు. అందరూ యుద్ధం మీద మక్కువ కలవారు. (16)
వేదాంతావబృథస్నాతాః సర్వ ఏతేఽపరాజితాః।
నిహమ్యః సమరే సేనాం దేవానామపి పాండవ॥ 17
పాండుపుత్రా! ఈ అందరూ వేదాధ్యయనం చేసి చివర అవబృథస్నానం (పవిత్రస్నానం) చేసినవారు. యుద్ధంలో పరాజయం ఎరుగరు. దేవతల సైన్యాన్ని కూడా యుద్ధంలో నాశనం చేయగలరు. (17)
శిఖండీ యుయుధానశ్చ ధృష్టద్యుమ్నశ్చ పార్షతః।
భీమసేనో యమౌ చోభౌ యుధామన్యూత్తమౌజసౌ॥ 18
విరాటద్రుపదౌ చోభౌ భీష్మద్రోణసమౌ యుధి।
శిఖండి, సాత్యకి, ద్రుపదుని కొడుకు ధృష్టద్యుమ్నుడు, భీమసేనుడు, కవలలిద్దరు (నకులసహదేవులు) యుధామన్యుడు, ఉత్తమౌజుడు, విరాట ద్రుపదులిద్దరూ యుద్ధంలో భీష్మద్రోణులతో సమానులు (18 1/2)
శంఖశ్చైవ మహాబాహుః హైడింబశ్చ మహాబలః॥ 19
పుత్రోఽస్యాంజనపర్వా తు మహాబలపరాక్రమః।
శైనేయశ్చ మహాబాహుః సహాయో రణకోవిదః॥ 20
మహాబాహువైన శంఖుడు, మహాబలుడైన ఘటోత్కచుడు, మహాబలపరాక్రమ వంతుడైన(అతని కొడుకు) అంజనపర్వుడు, మహాబాహువు యుద్ధకుశలుడు అయిన సాత్యకి నీకు సహాయులుగా ఉన్నారు. (19-20)
అభిమన్యుశ్చ బలవాన్ ద్రుపద్యాః పంచ చాత్మజాః।
స్వయం చాపి సమర్థోఽసి త్రైలోక్యోత్సాదనేఽపి చ॥ 21
బలవంతుడైన అభిమన్యుడు, ద్రుపది యొక్క ఐదుగురు కుమారులు నీవెంట ఉన్నారు. స్వయంగానే నీవు ముల్లోకాలను నాశనం చేయగల సమర్థుడవు. (21)
క్రోధాద్ యం పురుషం పశ్యేః తథా శక్రసమద్యుతే।
స క్షిప్రం న భవేద్ వ్యక్తమ్ ఇతి త్వాం వేద్మి కౌరవ॥ 22
ఇంద్ర సమాన తేజస్సు కల కురుపుంగవా! నీవు క్రోధంతో ఎవరిని చూస్తే అతడు వెంటనే నశిస్తాడు. నీలో ఉన్న ఈ శక్తిని నేను ఎరుగుదును. (22)
శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి అర్జునవాక్యే
చతుర్నవత్యధికశతతమోఽధ్యాయః॥ 194 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున అంబోపాఖ్యాన పర్వమను ఉపపర్వమున అర్జునవాక్యమను నూటతొంబదినాల్గవ అధ్యాయము (194)