195. నూట తొంబది అయిదవ అధ్యాయము
కౌరవసేన యుద్ధమునకు బయలుదేరుట.
వైశంపాయన ఉవాచ
తతః ప్రభాతే విమలే ధార్తరాష్ట్రేణ చోదితాః।
దుర్యోధనేన రాజానః ప్రయయుః పాండవాన్ ప్రతి॥ 1
వైశంపాయనుడు చెప్తున్నాడు - తదనంతరం బాగా తెల్లవారాక ధృతరాష్ట్రసుతుడైన దుర్యోధనుడు ప్రేరేపించగా రాజులందరూ పాండవులమీదికి బయల్దేరారు. (1)
ఆప్లావ్య శుచయః సర్వే స్రగ్విణః శుక్లవాససః।
గృహీతశస్త్రా ధ్వజినః స్వస్తివాచ్య హుతాగ్నయః॥ 2
వారందరూ స్నానం చేసి శుచులై పుష్పమాలలు, తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నారు. బ్రాహ్మణులచేత స్వస్తివాచకాలు చెప్పించుకున్నారు. అగ్నులలో హోమాలు చేశారు. పతాకాలు కట్టుకున్నారు. శస్త్రాలు ధరించారు. (2)
సర్వే బ్రహ్మవిదః శూరాః సర్వే సుచరితవ్రతాః।
సర్వే వర్మభృతశ్చైవ సర్వే చాహవ లక్షణాః॥ 3
వాళ్లంతా బ్రహ్మవిద్యావేత్తలు. పరాక్రమవంతులు. వ్రతనియమాలను చక్కగా పాటించేవారు. అందరూ కవచధారులు. అందరూ యుద్ధలక్షణాలు కలిగినవారు. (3)
ఆహవేషు పరాంల్లోకాన్ జిగీషంతో మహాబలాః।
ఏకాగ్రమనసః సర్వే శ్రద్దధానాః పరస్పరమ్॥ 4
వారంతా మహాబలవంతులు. యుద్ధాలలో శత్రు సమూహాలను గెలవాలనుకునేవారు. ఏకాగ్రమనస్కులు పరస్పర విశ్వాసం కలిగినవారు. (4)
విందానువిందావావంత్యౌ కేకయా బాహ్లికైస్సహ।
ప్రయయుః సర్వ ఏవైతే భారద్వాజపురోగమాః॥ 5
అవంతీరాకుమారులు విందుడు, అనువిందుడు, బాహ్లికులతో పాటు కేకయులు వీరందరూ భరద్వాజ వంశీయుడైన ద్రోణుని ముందుచుకొని బయల్దేరారు. (5)
అశ్వత్థామా శాంతనవః సైంధవోఽథ జయద్రథః।
దాక్షిణాత్యాః ప్రతీచ్యాశ్చ పర్వతీయాశ్చ యే నృపాః॥ 6
గాంధారరాజః శకునిః ప్రాచ్యోదీచ్యాశ్చ సర్వశః।
శకాః కిరాతా యవనాః శిబయోఽథ వసాతయః॥ 7
స్వైః స్వైరనీకైః సహితాః పరివార్య మహారథమ్।
ఏతే మహారథాః సర్వే ద్వితీయే నిర్యయుర్బలే॥ 8
అశ్వత్థామ, భీష్ముడు, సింధురాజు, జయద్రథుడు, దక్షిణదిక్కు నుండి, పడమటిదిక్కునుండి వచ్చిన రాజులు, పర్వతీయులైన రాజులు, గాంధారరాజు శకుని, తూర్పున ఉత్తరానగల రాజులు, శకులు, కిరాతులు, యవనులు, శిబి, వసాతి వంశస్థులు ఈ మహారథులందరూ తమ తమ సేనలతో సహితంగా మహారథికుడైన భీష్ముని చుట్టూ కూడి ద్వితీయదళంగా బయలుదేరారు. (6-8)
కృతవర్మా సహానీకః త్రిగర్తశ్చ మహారథః।
దుర్యోధనశ్చ నృపతిః భ్రాతృభిః పరివారితః॥ 9
శలో భూరిశ్రవాః శల్యః కౌసల్యోఽథ బృహద్రథః।
ఏతే పశ్చాదనుగతాః ధార్తరాష్ట్రపురోగమాః॥ 10
సైన్యసహితుడైన కృతవర్మ, మహారథుడైన త్రిగర్తుడు, తమ్ముళ్లతో పరివేష్టింపబడిన రాజు దుర్యోధనుడు, శలుడు, కోసలదేశరాజు, బృహద్రథుడు వీరంతా దుర్యోధనుని ముందుంచుకొనొ వెనుకనే అనుసరించారు. (9-10)
తే సమేత్య యథాన్యాయం ధార్తరాష్ట్రా మహాబలాః।
కురుక్షేత్రస్య పశ్చార్థే వ్యవాతిష్ఠంత దంశితాః॥ 11
మహాబలులైన ధృతరాష్ట్రపుత్రులందరూ కలిసి యథోచితంగా కవచధారులై, కురుక్షేత్రానికి పశ్చిమ దిక్కున నిలిచిఉన్నారు. (11)
దుర్యోధనస్తు శిబిరం కారయామాస భారత।
యథైవ హాస్తినపురం ద్వితీయం సమలంకృతమ్॥ 12
న విశేషం విజానంతి పురస్య శిబిరస్య వా।
కుశలా అపి రాజేంద్ర నరా నగరవాసినః॥ 13
భారతా! చక్కగా అలంకరింపబడిన రెండవ హస్తినా పురమా అనిపించేటట్లు దుర్యోధనుడు శిబిరాన్ని ఏర్పాటు చేయించాడు. నగరవాసులైన, నేర్పరులైన నరులు కూడా పట్టణానికి, శిబిరానికి తేడా ఏమిటో తెలుసుకోలేకపోయారు. (12-13)
తాదృశాన్యేవ దుర్గాణి రాజ్ఞామపి మహీపతిః।
కారయామాస కౌరవ్యః శతశోఽథ సహస్రశః॥ 14
కౌరవ్యుడైన దుర్యోధన మహారాజు ఇతరరాజులకు కూడా అటువంటివే వందల వేలకొద్దీ దుర్గాలు శిబిరాలు నిర్మింప చేశాడు. (14)
పంచయోజనముత్సృజ్య మండలం తద్రణాజిరమ్।
సేనానివేశాస్తే రాజన్నావిశన్ శతసంఘశః॥ 15
రాజా! ఆ రణభూమికి చుట్టూ ఐదుయోజనాల దూరం వదిలివేసి, వందలకొద్ది సేనా శిబిరాలను వేయించాడు. (15)
తత్ర తే పృథివీపాలాః యథోత్సాహం యథాబలమ్।
వివిశుః శిబిరాణ్యత్ర ద్రవ్యవంతి సహస్రశః॥ 16
అక్కడి ఆ రాజులందరూ తగిన ఉత్సాహంతో, తగిన బలంతో సామగ్రితో నిండిన ఆ వేల కొద్దీ శిబిరాలలోకి యుద్ధసన్నద్ధులై ప్రవేశించారు. (16)
తేషాం దుర్యోధనో రాజా ససైన్యానాం మహాత్మనామ్।
వ్యాదిదేశ సవాహ్యానాం భక్ష్యభోజ్యమమత్తమమ్॥ 17
సనాగాశ్వమనుష్యాణాం యే చ శిల్పోపజీవినః।
యేచాన్యేఽనుగతాస్తత్ర సూతమాగధవందినః॥ 18
దుర్యోధనమహారాజు సైన్యసమేతులైన ఆ మహాత్ములకు వారి గుఱ్ఱాలకు, ఏనుగులు, గుఱ్ఱాలు, మనుష్యులు అందరికీ, శిల్పకర్ములకు, ఇంకా అనుసరించివచ్చిన సూతమాగధ వంది జనాలకు అత్యుత్తమమైన భక్ష్యభోజ్యాలు ఆదేశించాడు. (17-18)
వణిజో గణికాశ్చారాః యే చైవ ప్రేక్షకా జనాః।
సర్వాంస్తాన్ కౌరవో రాజా విధివత్ ప్రత్యవైక్షత॥ 19
వణిజులు, గణికలు, గూఢచారులు ఇంకా జనులందరిని కౌరవరాజు శాస్త్రోక్తంగా పరిశీలించాడు. (19)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణీ కౌరవసైన్యనిర్యాణే పంచనవత్యధికశతతమోఽధ్యాయః॥ 195 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున అంబోపాఖ్యాన పర్వమను ఉపపర్వమున కౌరవసేన యుద్ధమునకు బయలుదేరుట అను నూట తొంబది అయిదవ అధ్యాయము (195)