52. ఏబది రెండవ అధ్యాయము

భీష్మార్జున యుద్ధము.

ధృతరాష్ట్ర ఉవాచ
ఏవం వ్యూఢేష్వనీకేషు మామకేష్వితరేషు చ ।
కథం ప్రహరతాం శ్రేష్ఠాః సంప్రహారం ప్రచక్రిరే ॥ 1
ధృతరాష్ట్రుడిలా అన్నాడు.
"ఈ రీతిగా నా వారూ, ఇతరులూ సేనావ్యూహరచన చేసిన తర్వాత ఆ శ్రేష్ఠయోధులు ఎలా యుద్ధం చేశారు?" (1)
సంజయ ఉవాచ
(తావకాః పాండవైః సార్థం యథా యుధ్యంత తచ్ఛృణు ।)
సమం వ్యూఢేష్వనీకేషు సన్నద్ధరుచిరధ్వజమ్ ।
అపారమివ సందృశ్య సాగరప్రతిమం బలమ్ ॥ 2
తేషాం మధ్యే స్థితో రాజన్ పుత్రో దుర్యోధనస్తవ ।
అబ్రవీత్ తావకాన్ సర్వాన్ యుద్ధ్యధ్వమితి దంశితాః ॥ 3
సంజయుడు చెప్తున్నాడు. "నీ వారు పాండవులతో ఎలా యుద్ధం చేశారో, విను. సర్వసేనల వ్యూహరచన అయిన తరువాత సేన అంతా ఒక్కటై అంతులేని మహాసాగరంలా కనిపించింది. రాజా! నీ కొడుకు దుర్యోధనుడు వారి మధ్య నిలిచి "కవచాలు ధరించి, యుద్ధాన్ని ఆరంభించండి" అని నీ వారిని ఆదేశించాడు. (2,3)
తే మనః క్రూరమాధాయ సమభిత్యక్తజీవితాః ।
పాండవానభ్యవర్తంత సర్వ ఏవోచ్ఛ్రితధ్వజాః ॥ 4
వారంతా జీవితాలపై ఆశను వీడి, మనస్సులను కఠినం చేసికొని, పతాకల నెగురవేస్తూ పాండవుల నాక్రమించారు. (4)
తతో యుద్ధం సమభవత్ తుములం లోమహర్షణమ్ ।
తావకానాం పరేషాం చ వ్యతిషకర్తథద్విపమ్ ॥ 5
అపుడు నీవారికీ, పాండవులకూ మధ్య రోమాలు నిక్క బొడుచుకొనేటట్లు ఘోరయుద్ధం జరిగింది. రెండు సేనలలోని రథాలు, ఏనుగులు కలిసిపోయాయి. (5)
ముక్తాస్తు రథిభిర్బాణాః రుక్మపుంఖాః సుతేజసః ।
సన్నిపేతురకుంఠాగ్రాః నాగేషు చ హయేషు చ ॥ 6
రథికులు విడుస్తున్న బాణాలు బంగారు రెక్కలు గలవి. పదునైనవి. అవి అమోఘంగా ఏనుగుల మీదా, గుర్రాల మీదా పడుతున్నాయి. (6)
తథా ప్రవృత్తే సంగ్రామే ధనురుద్యమ్య దంశితః ।
అభిపత్య మహాబాహుః భీష్మో భీమపరాక్రమః ॥ 7
సౌభద్రే భీమసేనే చ సాత్యకౌ చ మహారథే ।
కైకేయే చ విరాటే చ ధృష్టద్యుమ్నే చ పార్షతే ॥ 8
ఏతేషు నరవీరేషు చేదిమత్స్యేషు చాభిభూః ।
వవర్ష శరవర్షాణి వృద్ధః కురుపితామహః ॥ 9
అలా యుద్ధం జరుగుతుంటే వృద్ధుడు, కురుపితామహుడు, భీమపరాక్రముడు, మహాబాహువు అయిన భీష్ముడు కవచాన్ని ధరించి, వింటిని ఎత్తి, ముందుకు ఉరుకుతూ; అభిమన్యుడు, భీముడు, మహారథుడైన సాత్యకి, కేకయుడు, విరాటుడు, ద్రుపదుసుతుడైన ధృష్టద్యుమ్నుడు - ఈ నరవీరులపై, చేది మత్స్య యోధులపై బాణ వృష్టి కురిపించాడు. (7-9)
అభిద్యత తతో వ్యూహః తస్మిన్ వీరసమాగమే ।
సర్వేషామేవ సైన్యానామ్ ఆసీద్ వ్యతికరో మహాన్ ॥ 10
అప్పుడు వీరుల కలయికతో వ్యూహం భంగపడింది. సర్వసైనికులు అటు, ఇటు కలసిపోయారు. (10)
సాదినో ధ్వజినశ్చైవ హతాః ప్రవరవాజినః ।
విప్రద్రుతరథానీకాః సమపద్యంత పాండవాః ॥ 11
ఆశ్వికులు, ధ్వజధారులు, మంచి గుర్రాలు మరణించాయి. పాండవరథసేన పారిపోసాగింది. (11)
అర్జునస్తు నరవ్యాఘ్రః దృష్ట్వా భీష్మం మహారథమ్ ।
వార్ ష్ణేయమబ్రవీత్ క్రుద్ధః యాహి యత్ర పితామహః ॥ 12
ఏష భీష్మః సుసంక్రుద్ధః వార్ ష్ణేయ మమ వాహినీమ్ ।
నాశయిష్యతి సువ్యక్తం దుర్యోధనహితే రతః ॥ 13
మహారథుడైన భీష్ముని చూసి, కోపించి నరోత్తముడైన అర్జునుడు కృష్ణునితో ఇలా అన్నాడు. "వార్ష్ణేయా! భీష్ముని వైపు పద. దుర్యోధనుని హితం మీద ఆసక్తితో ఈ భీష్ముడు తీవ్రకోపంతో నా సేనను నాశనం చేస్తాడు. (12,13)
ఏష ద్రోణః కృపః శల్యః వికర్ణశ్చ జనార్దన ।
ధార్తరాష్ట్రాశ్చ సహితాః దుర్యోధనపురోగమాః ॥ 14
పంచాలాన్ నిహనిష్యంతి రక్షితా దృఢధన్వనా ।
సోఽహం భీష్మ వధిష్యామి సైన్యహేతోర్జనార్దన ॥ 15
జనార్దనా! దృఢంగా వింటిని పట్టగల భీష్ముని రక్షణలో ఈ ద్రోణుడు, కృపుడు, శల్యుడు వికర్ణుడు, దుర్యోధనుడు మొదలైన ధృతరాష్ట్ర కుమారులందరూ పాంచాల వీరులను చంపివేయగలరు. సైన్యాన్ని కాపాడటానికై నేను భీష్ముని వధిస్తాను." (14-15)
తమబ్రవీద్ వాసుదేవః యత్తో భవ ధనంజయ ।
ఏష త్వాం ప్రాపయిష్యామి పితామహరథం ప్రతి ॥ 16
అప్పుడు వాసుదేవుడు "ధనంజయా! సిద్ధంగా ఉండు. పితామహుని రథం దగ్గరకు నిన్ను చేర్చబోతున్నాను" అని అర్జునునితో అన్నాడు. (16)
ఏవముక్త్వా తతః శౌరీ రథం తం లోకవిశ్రుతమ్ ।
ప్రాపయామాస భీష్మస్య రథం ప్రతి జనేశ్వర ॥ 17
రాజా! శ్రీకృష్ణుడు అలా పలికి, ఆ పై లోకవిశ్రుతమైన ఆ రథాన్ని భీష్ముని రథానికి దగ్గరగా చేర్చాడు. (17)
చలద్బహుపతాకేన బలాకావర్ణవాజినా ।
సముచ్ఛ్రితమహాభీమనదద్ వానరకేతునా ॥ 18
మహతా మేఘనాదేన రథేనామితతేజసా ।
వినిఘ్నత్ కౌరవానీకం శూరసేనాంశ్చ పాండవః ॥ 19
ప్రాయాచ్ఛరణదః శీఘ్రం సుహృదాం హర్షవర్ధనః ।
ఆ రథం మీద చాలా పతాకలు రెపరెపలాడుతున్నాయి. దానికి కట్టిన గుర్రాలు కొంగల వలె తెల్లగా ఉన్నాయి. బాగా ఎత్తుగా నున్న ఆ ధ్వజంపై ఒక వానరం భీకరంగా అరుస్తోంది. రథగమన శబ్దం గొప్ప మేఘగర్జనలా ఉంది - ఆ రథం కాంతిమంతం. అందరకు శరణునిస్తూ, మిత్రులకు ఆనందం కలిగించే అర్జునుడు ఆ రథంపై నిలిచి కౌరవ సేననూ, శూరసేనులను చంపుతూ భీష్ముని దగ్గరకు వచ్చాడు. (18, 19 1/2)
తమాపతంతం వేగేన ప్రభిన్నమివ వారణమ్ ॥ 20
త్రాసయంతం రణే శూరాన్ మర్దయంతం చ సాయకైః ।
సైంధవప్రముఖైర్గుప్తః ప్రాచ్యసౌవీరకేకయైః ॥ 21
సహసా ప్రత్యుదీయాయ భీష్మః శాంతనవోఽర్జునమ్ ।
మదజలాన్ని స్రవిస్తున్న ఏనుగులా పడుతూ, రణ భూమిలో శూరులను భయపెడుతూ, బాణాలతో పీడిస్తూ వస్తున్న అర్జునుని చూసి, సైంధవాది రాజులు, ప్రాచ్య సౌవీర కేకయ దేశయోధుల రక్షణలో నున్న శంతనుసుతుడు - భీష్ముడు వెంటనే అర్జునుని ఎదిరించాడు. (20, 21 1/2)
కో హి గాండీవధన్వానమ్ అన్యః కురుపితామహాత్ ॥ 22
ద్రోణవైకర్తనాభ్యాం వా రథీ సంయాతుమర్హతి ।
గాండీవధారి అయిన అర్జునుని కురుపితామహుడు, ద్రోణుడు, కర్ణుడు తప్ప మరెవరు ఎదుర్కొనగలరు? (22 1/2)
తతో భీష్మో మహారాజ సర్వలోకమహారథః ॥ 23
అర్జునం సప్తసప్తత్యా నారాచానాం సమాచినోత్ ।
ద్రోణశ్చ పంచవింశత్యా కృపః పంచాశతా శరైః ॥ 24
దుర్యోధనశ్చతుఃషష్ట్యా శల్యశ్చ నవభిః శరైః ।
సైంధవో నవభిశ్చైవ శకునిశ్చాపి పంచభిః ॥ 25
వికర్ణో దశభిర్భల్లైః రాజన్ వివ్యాధ పాండవమ్ ।
మహారాజా! సర్వలోక మహారథుడైన భీష్ముడు అప్పుడు డెబ్బదియేడు బాణాలను అర్జునునిపై ప్రయోగించాడు. ద్రోణుడు ఇరవై అయిదు బాణాలను, కృష్ణుడు ఏబై బాణాలను, దుర్యోధనుడు అరవై బాణాలను, శల్యుడు తొమ్మిది బాణాలను, సైంధవుడు తొమ్మిది బాణాలను, శకుని అయిదు బాణాలను వికర్ణుడు పది బాణాలను ప్రయోగించి, అర్జునుని గాయపరిచారు. (23-25 1/2)
స తైర్విద్ధో మహేష్వాసః సమంతాన్నిశితైః శరైః ॥ 26
న వివ్యథే మహాబాహుః భిద్యమాన ఇవాచలః ।
మేటి విలుకాడు, మహాబాహువు అయిన అర్జునుడు నలువైపులా బాణాలతో గాయపడి కూడా కలతపడలేదు. ఆ కృత్యం కొండను బ్రద్దలు చేసే ప్రయత్నంలా ఉంది. (26 1/2)
స భీష్మం పంచవింశత్యా కృపం చ నవభిః శరైః ॥ 27
ద్రోణం షష్ట్యా నరవ్యాఘ్రః వికర్ణం చ త్రిభిః శరైః ।
శల్యం చైవ త్రిభిర్బాణైః రాజానం చైవ పంచభిః ॥ 28
ప్రత్యవిధ్యదమేయాత్మా కిరీటీ భరతర్షభ ।
భరతర్షభా! అమేయబలుడు, నరోత్తముడు అయిన ఆ కిరీటి ఇరవై అయిదు బాణాలతో భీష్ముని, తొమ్మిది బాణాలతో కృపుని, అరవై బాణాలతో ద్రోణుని, మూడు బాణాలతో వికర్ణుని, మరో మూడు బాణాలతో శల్యుని అయిదు బాణాలతో సుయోధనుని గాయపరిచాడు. (27,28 1/2)
తం సాత్యకిర్విరాటశ్చ ధృష్టద్యుమ్నశ్చ పార్షతః ॥ 29
ద్రౌపదేయాఽభిమన్యుశ్చ పరివవ్రుర్ధనంజయమ్ ।
అపుడు సాత్యకి, విరాటుడు, ద్రుపదసుతుడు ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది కొడుకులు, అభిమన్యుడు అర్జునుని చుట్టి నిలిచారు. (29 1/2)
తతో ద్రోణం మహేష్వాసం గాంగేయస్య ప్రియే రతమ్ ॥ 30
అభ్యవర్తత పాంచాల్యః సంయుక్తః సహ సోమకైః ।
ఆ తరువాత మేటివిలుకాడై, భీష్మునికి ప్రియాన్ని సమకూర్చగోరిన ద్రోణుని; సోమకులతో కూడి ధృష్టద్యుమ్నుడు ఆక్రమించాడు. (30 1/2)
భీష్మస్తు రథినాం శ్రేష్ఠః రాజన్ వివ్యాధ పాండవమ్ ॥ 31
అశీత్యా నిశితైర్బాణైః తతోఽక్రోశంత తావకాః ।
రాజా! రథిక శ్రేష్ఠుడైన భీష్ముడు పదునైన ఎనభై బాణాలతో అర్జునుని వ్యథకు లోను చేశాడు. నీ వారంతా దానితో హర్షధ్వనులు చేశారు. (31 1/2)
తేషాం తు నినదం శ్రుత్వా సహితానాం ప్రహృష్టవత్ ॥ 32
ప్రవివేశ తతో మధ్యం నరసింహః ప్రతాపవాన్ ।
తేషాం మహారథానాం సః మధ్యం ప్రాప్య ధనంజయః ॥ 33
చిక్రీడ ధనుషా రాజన్ లక్ష్యం కృత్వా మహారథాన్ ।
తతో దుర్యోధనో రాజా భీష్మమాహ జనేశ్వరః ॥ 34
పీడ్యమానం స్వకం సైన్యం దృష్ట్వా పార్థేన సంయుగే ।
ఆనందంతో వారంతా కలిసి అరిచిన అరుపులు విని, ప్రతాపవంతుడైన అర్జునుడు వారి మధ్యలో ప్రవేశించాడు. ఆ మహారథులలో దూరిన ధనంజయుడు మహారథులనే లక్ష్యంగా చేసికొని వింటితో ఆడుకొన్నాడు. అప్పుడు యుద్ధంలో అర్జునుడు తనసేనను బాధించటం చూసి, దుర్యోధనరాజు భీష్మునితో ఇలా అన్నాడు. (32-34 1/2)
ఏష పాండుసుతస్తాత కృష్ణేన సహితో బలీ ॥ 35
యతతాం సర్వసైన్యానాం మూలం నః పరికృంతతి ।
త్వయి జీవతి గాంగేయ ద్రోణే చ రథినాం వరే ॥ 36
"తాతా! నీవూ రథిక శ్రేష్ఠుడైన ద్రోణుడూ బ్రతికియుండగానే, బలవంతుడైన ఈ అర్జునుడు కృష్ణునితో కలిసి, మన సేనలన్నీ ఎంతగా ప్రయత్నిస్తున్నా మనలను మొదలంటా నరికివేస్తున్నాడు. (35,36)
త్వత్కృతే చైవ కర్ణోఽపి న్యస్తశస్త్రో విశాంపతే ।
న యుధ్యతి రణే పార్థం హితకామః సదా మమ ॥ 37
స తథా కురు గాంగేయ యథా హన్యేత ఫాల్గునః ।
రాజా! నీ వలననే కర్ణుడు కూడా అస్త్ర సన్యాసం చేసి, ఎప్పుడూ నాహితాన్ని కోరేవాడైనా అర్జునునితో యుద్ధం చేయటం లేదు. గాంగేయా! అర్జునుని చంపివేయటానికి అనుగుణంగా నీవు ప్రయత్నించాలి." (37 1/2)
ఏవముక్తస్తతో రాజన్ పితా దేవవ్రతస్తవ ॥ 38
ధిక్ క్షాత్రం ధర్మమిత్యుక్త్వా ప్రాయాత్ పార్థరథం ప్రతి ।
రాజా! దుర్యోధనుడలా అనగానే నీ తండ్రి దేవవ్రతుడు "ఛీ! ఏం క్షత్రియధర్మం" అంటూ అర్జునుని రథం వైపు వెళ్ళాడు. (38 1/2)
ఉభౌ శ్వేతహయౌ రాజన్ సంసక్తౌ ప్రేక్ష్య పార్థివాః ॥ 39
సింహనాదాన్ భృశం చక్రుః శంఖాన్ దధ్ముశ్చ మారిష ।
రాజా! ఆ ఇద్దరి రథాలకూ తెల్లటి గుర్రాలున్నాయి. అది చూసి రాజులంతా పెద్దగా సింహనాదాలు చేశారు. శంఖాలు పూరించారు. (39 1/2)
ద్రౌణిర్దుర్యోధనశ్చైవ వికర్ణశ్చ తవాత్మజః ॥ 40
పరివార్య రణే భీష్మం స్థితా యుద్ధాయ మారిష ।
ఆర్యా! అశ్వత్థామ, దుర్యోధనుడు, నీ కొడుకు వికర్ణుడు రణభూమిలో భీష్ముని చుట్టూ నిలిచి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. (40 1/2)
తథైవ పాండవాః సర్వే పరివార్య ధనంజయమ్ ॥ 41
స్థితా యుద్ధాయ మహతే తతో యుద్ధమవర్తత ।
అదే విధంగా పాండవులంతా అర్జునుని చుట్టూ నిలిచి మహాయుద్ధానికి నిలిచారు. ఆ పై యుద్ధం జరిగింది. (41 1/2)
గాంగేయస్తు రణే పార్థమ్ ఆనర్చ్ఛన్నవభిః శరైః ॥ 42
తమర్జునః ప్రత్యవిధ్యద్ దశభిర్మర్మభేదిభిః ।
రణంలో భీష్ముడు తొమ్మిది బాణాలతో అర్జునుని గాయపరిచాడు. అర్జునుడు మర్మభేదకాలైన పదిబాణాలతో భీష్ముని గాయపరిచాడు. (42 1/2)
తతః శరసహస్రేణ సుప్రయుక్తేన పాండవః ॥ 43
అర్జునః సమరశ్లాఘీ భీష్మస్యావారయద్ దిశః ।
ఆ పై పాండుకుమారుడు, సమరశ్లాఘి అయిన అర్జునుడు వందబాణాలను చక్కగా ప్రయోగించి, అన్ని వైపులా భీష్ముని నిలువరించాడు. (43 1/2)
శరజాలం తతస్తత్ తు శరజాలేన మారిష ॥ 44
వారయామాస పార్థస్య భీష్మః శాంతనవస్తదా ।
ఆ మారిషా! అర్జునుని ఆ బాణసమూహాన్ని, శంతను సుతుడైన భీష్ముడు బాణసమూహంతోనే నివారించాడు. (44 1/2)
ఉభౌ పరమసంహృష్టౌ ఉభౌ యుద్ధాభినందినౌ ॥ 45
నిర్విశేషమయుధ్యేతాం కృతప్రతికృతైషిణౌ ।
ఇద్దరూ ఆనందించారు. ఇద్దరూ యుద్దాన్ని అభినందించేవారే. ఇద్దరూ చర్యకు ప్రతిచర్య చేయదలచినవారే. కాబట్టి సమానస్థాయిలో యుద్ధం చేశారు. (45 1/2)
భీష్మచాపవిముక్తాని శరజాలాని సంఘశః ॥ 46
శీర్యమాణాన్యదృశ్యంత భీన్నాన్యర్జునసాయకైః ।
భీష్ముడు మూకుమ్మడిగా ప్రయోగించిన బాణాలు, అర్జునుని బాణాలతో ముక్కలై చెల్లా చెదరు కావటం కనిపిస్తోంది. (46 1/2)
తథైవార్జునముక్తాని శరజాలాని సర్వశః ॥ 47
గాంగేయశరనున్నాని ప్రాపతంత మహీతలే ।
అలాగే అర్జునుడు ప్రయోగించిన బాణాలు, భీష్ముని బాణాలచే ఛిన్నాభిన్నం చేయబడి నేలమీద అన్ని వైపులా పడుతున్నాయి. (47 1/2)
అర్జునః పంచవింశత్యా భీష్మమార్చ్ఛచ్ఛితైః శరైః ॥ 48
భీష్మోఽపి సమరే పార్థం వివ్యాధ నిశితైః శరైః ।
అర్జునుడు ఇరవై అయిదు పదునైన బాణాలతో భీష్ముని పీడించాడు. భీష్ముడు కూడా యుద్ధంలో అర్జునుని నిశితశరాలతో గాయపరిచాడు. (48 1/2)
అన్యోన్యస్య హయాన్ విద్ధ్వా ధ్వజౌ చ సుమహాబలౌ ॥ 49
రథేషాం రథచక్రే చ చిక్రీడతురరిందమౌ ।
మహాబలులు, అరిందములు అయిన ఆ ఇద్దరూ ఒకరి గుర్రాల నొకరు, ఒకరి ధ్వజాన్ని ఒకరు, ఒకరి రథచక్రాలను, నొగలను మరొకరు భంగపరచి, ఆడుకొనసాగారు. (49 1/2)
తతః క్రుద్ధో మహారాజ భీష్మః ప్రహరతాం వరః ॥ 50
వాసుదేవం త్రిభిర్బాణైః ఆజఘాన స్తనాంతరే ।
మహారాజా! అపుడు శ్రేష్ఠయోధుడైన భీష్ముడు కోపంతో మూడు బాణాలతో వాసుదేవుని చాతీపై కొట్టాడు. (50 1/2)
భీష్మచాపచ్యుతైస్తైస్తు నిర్విద్ధో మధుసూదనః ॥ 51
విరరాజ రణే రాజన్ సపుష్ప ఇవ కింశుకః ।
రాజా! భీష్ముడు విడిచిన బాణాల గాయంతో మధుసూదనుడు యుద్ధంలో పుష్పించిన కింశుకంలా ప్రకాశించాడు. (51 1/2)
తతోఽర్జునో భృశం క్రుద్ధః నిర్విద్ధం ప్రేక్ష్య మాధవమ్ ॥ 52
సారథిం కురువృద్ధస్య నిర్బభేద శితైః శరైః ।
అటు తర్వాత గాయపడిన శ్రీకృష్ణుని చూసి, అర్జునుడు తీవ్రంగా కోపించి, వాడిబాణాలతో భీష్ముని సారథిని చీలగొట్టాడు. (52 1/2)
యతమానౌ తు తౌ వీరౌ అన్యోన్యస్య వధం ప్రతి ॥ 53
న శక్నుతాం తదాన్యోన్యమ్ అభిసంధాతుమాహవే ।
ఆ వీరులిద్దరూ ఒకరినొకరు చంపాలని ఎంత ప్రయత్నించినా యుద్ధంలో ఎవరూ ఎవ్వరిని గాయపరచలేకపోయారు. (53 1/2)
తౌ మండలాని చిత్రణి గతప్రత్యాగతాని చ ॥ 54
అదర్శయేతాం బహుధా సూతసామర్థ్యలాఘవాత్ ।
ఆ ఇద్దరూ రథసారథుల సామర్థ్యం వలన, నైపుణ్యం వలన చిత్రమండలాకారాలను, ముందు వెనుకలకు రాకపోకలను అనేక విధాలుగా ప్రదర్శించారు. (54 1/2)
అంతరం చ ప్రహారేషు తర్కయంతౌ పరస్పరమ్ ॥ 55
రాజన్నంతరమార్గస్థౌ స్థితావాస్తాం ముహుర్ముహుః ।
రాజా! ఒకరు కొట్టిన దెబ్బలలో మరొకరు ఛిద్రాలు వెతుకుతున్నారు. ఇలా రంధ్రాన్వేషణలో పడి మాటిమాటికి వారు తటస్థంగా నిలుస్తున్నారు. (55 1/2)
ఉభౌ సింహరవోన్మిశ్రం శంఖశబ్దం చ చక్రతుః ॥ 56
తథైవ చాపనిర్ఘోషం చక్రతుస్తౌ మహారథౌ ।
ఆ ఇద్దరు మహారథులూ సింహనాదాలతో కలిపి, శంఖాలను పూరిస్తున్నారు. అలాగే ధనుష్టంకారాలు చేస్తున్నారు. (56 1/2)
తయోః శంఖనినాదేన రథనేమిస్వనేన చ ॥ 57
దారితా సహసా భూమిః చకంపే చ ననాద చ ।
వారి శంఖధ్వనులతో, రథపు ఇరుసుల ధ్వనులతో వెంటనే భూమి బ్రద్దలై, కంపిస్తూ ఆర్తనాదాలు చేసింది. (57 1/2)
నోభయోరంతరం కశ్చిద్ దదృశే భరతర్షభ ॥ 58
బలినౌ యుద్ధదుర్ధర్షౌ అన్యోన్యసదృశావుభౌ ।
భరతర్షభా! ఆ ఇద్దరిలో ఏ తేడా కన్పించటం లేదు. ఇద్దరూ బలవంతులు, యుద్ధంలో దుర్జయులు. ఒకరికొకరు తగినవారు. (58 1/2)
చిహ్నమాత్రేణ భీష్మం తు ప్రజజ్ఞుస్తత్ర కౌరవాః ॥ 59
తథా పాండుసుతాః పార్థం చిహ్నమాత్రేణ జజ్ఞిరే ।
కేవలం ధ్వజాది చిహ్నాలతో మాత్రమే కౌరవులు భీష్ముని గుర్తింపగలుగుతున్నారు. పాండవులూ అంతే. కపిధ్వజాది చిహ్నాలతోనే అర్జునుని గుర్తింపగలుగుతున్నారు. (59 1/2)
తయోర్నృవరయోర్దృష్ట్వా తాదృశం తం పరాక్రమమ్ ॥ 60
విస్మయం సర్వభూతాని జగ్ముర్భారత సంయుగే ।
భారతా! యుద్ధంలో నరోత్తములయిన ఆ ఇద్దరి పరాక్రమాన్ని చూసి, సర్వప్రాణులు ఆశ్చర్యానికి గురి అయ్యాయి. (60 1/2)
న తయోర్వివరం కశ్చిద్ రణే పశ్యతి భారత ॥ 61
ధర్మే స్థితస్య హి యథా న కశ్చిద్ వృజినం క్వచిత్ ।
భారతా! ధర్మనిష్ఠునిలో ఏ పాపమూ కనిపించనట్టు యుద్ధంలో ఆ ఇద్దరిలో ఏ దోషమూ కనిపించటం లేదు. (61 1/2)
ఉభౌ చ శరజాలేన తావదృశ్యౌ బభూవతుః ॥ 62
ప్రకాశౌ చ పునస్తూర్ణం బభూవతురుభౌ రణే ।
బాణాలు కప్పి ఆ ఇద్దరూ అదృశ్యమయిపోతున్నారు. మరల వెంటనే యుద్ధంలో ఇద్దరూ కనిపిస్తున్నారు. (62 1/2)
తత్ర దేవాః సంగధర్వాః చారణాశ్చర్షిభిః సహ ॥ 63
అన్యోన్యం ప్రత్యభాషంత తయోర్దృష్ట్వా పరాక్రమమ్ ।
న శక్యౌ యుధి సంరబ్ధౌ జేతుమేతౌ కథంచన ॥ 64
సదేవాసురగంధర్యైః లోకైరపి మహారథౌ ।
దేవతలు, గంధర్వులు, చారణులు, ఋషులు అక్కడ చేరి భీష్మార్జునుల పరాక్రమాన్ని చూసి, పరస్పరం ఇలా చెప్పుకొంటున్నారు - ఇద్దరూ కోపంతో ఉన్నారు. దేవతలతో, అసురులతో, గంధర్వులతో కలిసి సమస్తలోకాలు ఏకమైనా ఈ మహారథులను యుద్ధంలో గెలవటం కష్టం. (63, 64 1/2)
ఆశ్చర్యభూతం లోకేషు యుద్ధమేతన్మహాద్బుతమ్ ॥ 65
నైతాదృశాని యుద్ధాని భవిష్యంతి కథంచన ।
న హి శక్యో రణే జేతుం భీష్మః పార్థేన ధీమతా ॥ 66
సధనుః సరథః సాశ్వః ప్రవపన్ సాయకాన్ రణే ।
ఈ మహాద్భుతయుద్ధం లోకాలలో ఆశ్చర్య జనకమైనది. ఇటువంటి యుద్ధాలు ఇక ఎప్పుడూ జరగబోవు. ధనుస్సు, రథం, గుర్రాలతో కూడి రణంలో బాణ వృష్టిని కురిపిస్తున్న భీష్ముని అర్జునుడెంత మేధావి అయినాసరే గెలవటం కష్టం. (65, 66 1/2)
తథైవ పాండవం యుద్ధే దేవైరపి దురాసదమ్ ॥ 67
న విజేతుం రణే భీష్మః ఉత్సహేత ధనుర్ధరమ్ ।
ఆలోకాదపి యుద్ధం హి సమమేతద్ భవిష్యతి ॥ 68
అలాగే యుద్ధంలో దేవతలకైనా గెలవవీలుకాని అర్జునుడు, గాండీవాన్ని పట్టి నిలబడితే భీష్ముడు యుద్ధంలో గెలవలేడు. లోక మున్నంతకాలం ఇది ఇలాగే సమంగా సాగుతుంటుంది. (67,68)
ఇతి స్మ వాచోశ్రూయంత ప్రోచ్ఛరంత్యస్తతస్తతః ।
గాంగేయార్జునయోః సంఖ్యే స్తవయుక్తా విశాంపతే ॥ 69
రాజా! ఈ రీతిగా యుద్ధంలో భీష్మార్జునుల పరాక్రమాన్ని స్తుతిస్తూ, పలుకుతున్న మాటలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. (69)
త్వదీయాస్తు తదా యోధాః పాండవేయాశ్చ భారత ।
అన్యోన్యం సమరే జఘ్నుః తయోస్తత్ర పరాక్రమే ॥ 70
భారతా! భీష్మార్జునులు అలా పరాక్రమిస్తున్నప్పుడు రణంలో నీ సేనలు, పాండవసేనలు ఒకరినొకరు చంపుకొంటున్నాయి. (70)
శితధారైస్తథా ఖడ్గైః విమలైశ్చ పరశ్వధైః ।
శరైరన్యైశ్చ బహుభిః శస్త్రైర్నానావిధైరపి ॥ 71
ఉభయోః సేనయోః శూరాః న్యకృంతంత పరస్పరమ్ ।
మంచివాదరగల కత్తులతో, మెరిసే గొడ్డళ్ళతో, రకరకాల బాణాలతో నానావిధ శస్త్రాలతో రెండు పక్షాలలోని శూరులు పరస్పరం చంపుకొంటున్నారు. (71 1/2)
వర్తమానే తథా ఘోరే తస్మిన్ యుద్ధే సుదారుణే ।
ద్రోణపాంచాల్యయో రాజన్ మహానాసీత్ సమాగమః ॥ 72
రాజా! ఈ రీతిగా భీష్మార్జునుల మధ్య ఘోరభీకరయుద్ధం జరుగుతుంటే ద్రోణునకు, ధృష్టద్యుమ్నునకు మధ్య కూడా గొప్ప పోరాటం జరిగింది. (72)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి భీష్మార్జునయుద్ధే ద్విపంచాశత్తమోఽధ్యాయః ॥ 52 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భీష్మవధ పర్వమను ఉపపర్వమున భీష్మార్జున యుద్ధమను ఏబది రెండవ అధ్యాయము. (52)
(దాక్షిణాత్య అధికపాఠం 1/2 శ్లోకంతో కలిపి 72 1/2 శ్లోకాలు)