53. ఏబది మూడవ అధ్యాయము

ద్రోణ,ధృష్టద్యుమ్నుల యుద్ధము.

ధృతరాష్ట్ర ఉవాచ
కథం ద్రోణో మహేష్వాసః పాంచాల్యశ్చాపి పార్షతః ।
ఉభౌ సమీయతుర్యత్తౌ తన్మమాచక్ష్వ సంజయ ॥ 1
ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు.
"సంజయా! మేటివిలుకాడైన ద్రోణుడు, ద్రుపదసుతుడైన ధృష్టద్యుమ్నుడు సమాయత్తులై ఎలా పోరాడుతున్నారు? నాకు చెప్పు. (1)
దిష్టమేవ పరం మన్యే పౌరుషాదితి మే మతిః ।
యత్ర శాంతనవో భీష్మః నాతరద్ యుధి పాండవమ్ ॥ 2
పౌరుషం కన్న అదృష్టమే గొప్పదని నాకనిపిస్తోంది. అందుకనే శంతనుసుతుడు - భీష్ముడు యుద్ధంలో అర్జునుని మించలేకపోయాడు. (2)
భీష్మో హి సమరే క్రుద్ధః హన్యాల్లోకాంశ్చరాచరాన్ ।
స కథం పాండవం యుద్ధే నాతరత్ సంజయౌజసా ॥ 3
భీష్ముడు కోపిస్తే చరాచరలోకాల నన్నింటినీ రణంలో చంపగలడు. సంజయా! అటువంటివాడు పరాక్రమంతో అర్జునుని ఎందుకు అతిక్రమించలేకపోయాడు?" (3)
సంజయ ఉవాచ
శృణు రాజన్ స్థిరో భూత్వా యుద్ధమేతత్ సుదారుణమ్ ।
న శక్యాః పాండవా జేతుం దేవైరపి సవాసవైః ॥ 4
సంజయుడు చెపుతున్నాడు.
"రాజా! స్థిరంగా ఉండి ఈ దారుణ యుద్ధ వృత్తాంతాన్ని విను. ఇంద్రునితో సహా దేవతలంతా వచ్చినా పాండవులను గెలవలేరు. (4)
ద్రోణస్తు నిశితైర్బాణైః ధృష్టద్యుమ్నమవిధ్యత ।
సారథిం చాస్య భల్లేన రథనీడాదపాతయత్ ॥ 5
ద్రోణుడు వాడిబాణాలతో ధృష్టద్యుమ్నుని గాయపరిచాడు. అతని సారథిని భల్లంతో రథసారథిస్థానం నుండి క్రిందకు పడద్రోశాడు. (5)
తథాస్య చతురో వాహాన్ చతుర్భిః సాయకోత్తమైః ।
పీడయామాస సంక్రుద్ధః ధృష్టద్యుమ్నస్య మారిష ॥ 6
మారిషా! ఆ తరువాత కోపంతో నాలుగు గొప్పబాణాలతో ధృష్టద్యుమ్నుని నాలుగు గుర్రాలను పీడించాడు. (6)
ధృష్టద్యుమ్నస్తతో ద్రోణం నవత్యా నిశితైః శరైః ।
వివ్యాధ ప్రహసన్ వీరః తిష్ఠ తిష్ఠేతి చాబ్రవీత్ ॥ 7
ఆ పై ధృష్టద్యుమ్నుడు నవ్వుతూ పదునైన తొంభై బాణాలతో ద్రోణుని గాయపరిచి,"నిలు నిలు" అని అన్నాడు. (7)
తతః పునరమేయాత్మా భారద్వాజః ప్రతాపవాన్ ।
శరైః ప్రచ్ఛాదయామాస ధృష్టద్యుమ్నమమర్షణమ్ ॥
ఆ తరువాత అమేయబలుడు, ప్రతాపవంతుడు అయిన ద్రోణుడు అసహనశీలి అయిన ధృష్టద్యుమ్నుని బాణాలతో కప్పివేశాడు. (8)
ఆదదే చ శరం ఘోరం పార్షతాంతచికీర్షయా ।
శక్రాశనిసమస్పర్శం కాలదండమివాపరమ్ ॥ 9
ధృష్టద్యుమ్నుని అంతం చేయాలని వజ్రాయుధం వలె కఠిన స్పర్శ గలిగి, రెండవ యమదండంలా ఉన్న ఘోరబాణాన్ని చేతబట్టాడు. (9)
హాహాకారో మహానాసీత్ సర్వసైన్యేషు భారత ।
తమిషుం సంధితం దృష్ట్వా భారద్వాజేన సంయుగే ॥ 10
భారతా! యుద్ధంలో ద్రోణుడు ఆ బాణాన్ని సంధించగానే సర్వసేనలలో హాహాకారం పెద్దగా చెలరేగింది. (10)
తత్రాద్భుతమపశ్యామ ధృష్టద్యుమ్నస్య పౌరుషమ్ ।
యదేకః సమరే వీరః తస్థౌ గిరిరివాచలః ॥ 11
యుద్ధంలో ఒంటరిగా, కొండలా, నిశ్చలంగా, నిలిచిన ఆ ధృష్టద్యుమ్నుని పౌరుషం అద్భుతంగా కనిపించింది. (11)
తం చ దీప్తం శరం ఘోరమ్ ఆయాంతం మృత్యుమాత్మనః ।
చిచ్ఛేద శరవృష్టిం చ భారద్వాజే ముమోచ హ ॥ 12
మండుతూ మృత్యువులా మీదపడబోతున్న ఆ ఘోర బాణాన్ని ధృష్టద్యుమ్నుడు ఖండించి, ద్రోణునిపై శరవృష్టి కురిపించాడు. (12)
తత ఉచ్చుక్రుశుః సర్వే పంచాలాః పాండవైః సహ ।
ధృష్టద్యుమ్నేన తత్ కర్మ కృతం దృష్ట్వా సుదుష్మరమ్ ॥ 13
ఆ పై ధృష్టద్యుమ్నుడు చేసిన ఆ దుష్కర కర్మను చూసి పాండవులూ, పాంచాలదేశస్థులు అందరూ పెద్దగా అరిచి కోలాహలం చేశారు. (13)
తతః శక్తిం మహావేగాం స్వర్ణ వైదూర్యభూషితామ్ ।
ద్రోణస్య నిధనాకాంక్షీ చిక్షేప స పరాక్రమీ ॥ 14
ఆ తరువాత పరాక్రమశాలి అయిన ధృష్టద్యుమ్నుడు స్వర్ణ, వైడూర్యాలు అలంకరించిన, మహావేగం గల శక్తిని ద్రోణుని మరణాన్ని ఆశిస్తూ విసిరాడు. (14)
తామాపతంతీం సహసా శక్తిం కనకభూషితామ్ ।
త్రిధా చిచ్ఛేద సమరే భారద్వాజో హసన్నివ ॥ 15
మీదపడబోతున్న ఆ బంగారు శక్తిని వెంటనే నవ్వుతూ ద్రోణుడు రణభూమిలో మూడు ముక్కలు చేశాడు. (15)
శక్తిం వినిహతాం దృష్ట్వా ధృష్టద్యుమ్నః ప్రతాపవాన్ ।
వవర్ష శరవర్షాణి ద్రోణం ప్రతి జనేశ్వర ॥ 16
రాజా! శక్తి నిరుపయోగం కావటం చూసి ప్రతాపవంతుడైన ధృష్టద్యుమ్నుడు ద్రోణుని మీద శరవృష్టిని కురిపించాడు. (16)
శరవర్షం తతస్తత్ తు సన్నివార్య మహాయశాః ।
ద్రోణో ద్రుపదుపుత్రస్య మధ్యే చిచ్ఛేద కార్ముకమ్ ॥ 17
మహాయశస్వి అయిన ద్రోణుడు ఆ శరవృష్టిని నివారించి, దృష్టద్యుమ్నుని ధనుస్సును మధ్యకు ఖండించాడు. (17)
స చ్ఛిన్నధన్వా సమరే గదాం గుర్వీం మహాయశాః ।
ద్రోణాయ ప్రేషయామాస గిరిసారమయీం బలీ ॥ 18
విల్లు విరిగిపోగానే మహాయశస్వి, బలవంతుడు అయిన ధృష్టద్యుమ్నుడు లోహనిర్మితమైన గొప్పగదను ద్రోణుని మీదకు విసిరాడు. (18)
సా గదా వేగవన్ము క్తా ప్రాయాద్ ద్రోణజింఘాంసయా ।
తత్రాద్భుతమపశ్యామ భారద్వాజస్య విక్రమమ్ ॥ 19
ద్రోణుని చంపదలచి వేగంగా విసిరిన ఆ గద మీదకు వస్తోంది. అప్పుడు ద్రోణుని అద్బుత పరాక్రమం కనిపించింది. (19)
లాఘవాద్ వ్యంసయామాస గదాం హేమవిభూషితామ్ ।
వ్యంసయుత్వా గదాం తాం చ ప్రేషయామాస పార్షతమ్ ॥ 20
భల్లాన్ సునిశితాన్ పీతాన్ రుక్మపుంఖాన్ సుదారుణాన్ ।
తే తస్య కవచం భిత్త్వా పపుః శోణితమాహవే ॥ 21
స్వర్ణభూషితమైన ఆ గదను ద్రోణుడు నేర్పుగా వ్యర్థం చేసి, బంగారు రెక్కలు, పచ్చనివన్నె కలిగి వాడియైన భయంకర భల్లాలను ధృష్టద్యుమ్నుని పైకి వేశాడు. అవి అతని కవచాన్ని రణభూమిలో భేదించి నెత్తురు త్రాగసాగాయి. (20,21)
అథాన్యద్ ధనురాదాయ ధృష్టద్యుమ్నో మహారథః ।
ద్రోణం యుధి పరాక్రమ్య శరైర్వివ్యాధ పంచభిః ॥ 22
మహారథుడైన ధృష్టద్యుమ్నుడు మరొక వింటిని చేతబట్టి యుద్ధంలో పరాక్రమించి, అయిదు బాణాలతో ద్రోణుని గాయపరిచాడు. (22)
రుధిరాక్తౌ తతస్తౌ తు శుశుభాతే నరర్షభౌ ।
వసంతసమయే రాజన్ పుష్పితావివ కింశుకౌ ॥ 23
రాజా! ఆ నరోత్తము లిద్దరూ నెత్తుటితో తడిసి వసంతకాలంలో పుష్పించిన కింశుకాల వలె శోభిల్లారు. (23)
అమర్షితస్తతో రాజన్ పరాక్రమ్య చమూముఖే ।
ద్రోణో ద్రుపదపుత్రస్య పునశ్చిచ్ఛేద కార్ముకమ్ ॥ 24
రాజా! అప్పుడు సేనకు ముందు నిలిచి ఉన్న ద్రోణుడు అసహనంతో పరాక్రమించి, ద్రుపదపుత్రుని వింటిని మరలా ఖండించాడు. (24)
అథైనం ఛిన్నధన్వానం శరైః సన్నతపర్వభిః ।
అభ్యవర్షదమేయాత్మా వృష్ట్యా మేఘ ఇవాచలమ్ ॥ 25
ఆపై విల్లు విరిగిపోయిన ఆ ధృష్టద్యుమ్నునిపై అమేయబలుడైన ద్రోణుడు వంగిన కణుపులు గల బాణాలతో కొండపై మేఘం కురిసినట్లుగా వర్షించాడు. (25)
సారథిం చాస్య భల్లేన రథనీడాదపాతయత్ ।
అథాస్య చతురో వాహాన్ చతుర్భిర్నిశితైః శరైః ॥ 26
పాతయామాస సమరే సింహనాదం ననాద చ ।
తతోఽపరేణ భల్లేన హస్తాచ్చాపమథాచ్ఛినత్ ॥ 27
ధృష్టద్యుమ్నుని సారథిని కూడా నొగల మీద నుండి పడగొట్టాడు. ఆపై నాలుగు వాడి బాణాలతో నాలుగు గుర్రాలను పడగొట్టి, రణభూమిలో సింహంలా గర్జించాడు. ఆపై మరొక భల్లంతో ధృష్టద్యుమ్నుని చేతనున్న వింటిని ఖండించాడు. (26,27)
స చ్ఛిన్నధన్వా విరథః హతాశ్వో హతసారథిః ।
గదాపాణిరవారోహత్ ఖ్యాపయన్ పౌరుషం మహత్ ॥ 28
తామస్య విశిఖైస్తూర్ణం పాతయామాస భారత ।
రథాదనవరూఢస్య తదద్భుతమివాభవత్ ॥ 29
విల్లు విరిగి, గుర్రాలు మరణించి, సారథి చనిపోగా విరథుడైన ధృష్టద్యుమ్నుడు మహాపౌరుషాన్ని ప్రకటిస్తూ, గదను చేతబట్టి, క్రిందకు దిగాడు. భారతా! ఆయన రథం నుండి దిగకముందే ద్రోణుడు నిశితబాణాలతో ఆ గదను పడగొట్టాడు. అది అద్భుతమనిపించింది. (28,29)
తతః స విపులం చర్మ శతచంద్రం చ భానుమత్ ।
ఖడ్గం చ విపులం దివ్యం ప్రగృహ్య సుభుజో బలీ ॥ 30
అభిదుద్రావ వేగేన ద్రోణస్య వధకాంక్షయా ।
ఆమిషార్థీ యథా సింహః వనే మత్తమివ ద్విపమ్ ॥ 31
ఆ తరువాత సుబాహువు, బలశాలి అయిన ధృష్టద్యుమ్నుడు డాలు, కత్తి చేతబట్టాడు. ఆ డాలు నూరుచంద్రుల అమరికతో ప్రకాశిస్తోంది. విశాలమైనది. ఆ కత్తి దివ్యమూ, విశాలమూ, ఆ రెండింటినీ తీసికొని, వనంలో మాంసం కోసం సింహం మదపుటేనుగు మీదకు దూకినట్లు ద్రోణుని చంపటం కోసం వేగంగా ఆయన వైపు పరుగెత్తాడు. (30,31)
తత్రాద్భుతమపశ్యామ భారద్వాజస్య పౌరుషమ్ ।
లాఘవం చాస్త్రయోగం చ బలం బాహ్వోశ్చ భారత ॥ 32
భారతా! అక్కడ ద్రోణుని పౌరుషం, నైపుణ్యం, అస్త్రప్రయోగం, బాహుబలం అద్భుతంగా కనిపించాయి. (32)
యదేనం శరవర్షేణ వారయామాస పార్షతమ్ ।
న శశాక తతో గంతుం బలవానపి సంయుగే ॥ 33
ద్రోణుడు శరవృష్టితో నివారించగానే, ధృష్టద్యుమ్నుడు బలవంతుడైనా కూడా యుద్ధంలో ద్రోణుని సమీపించలేకపోయాడు. (33)
నివారితస్తు ద్రోణేన ధృష్టద్యుమ్నో మహారథః ।
న్యవారయచ్ఛరౌఘాంస్తాన్ చర్మణా కృతహస్తవత్ ॥ 34
మహారథుడైన ధృష్టద్యుమ్నుడు ద్రోణునిచే నివారింపబడి సిద్ధహస్తునివలె డాలుతో ఆ బాణసమూహాన్ని ఆపాడు. (34)
తతో భీమో మహాబాహుః సహసాభ్యపతద్ బలీ ।
సాహాయ్యకారీ సమరే పార్షతస్య మహాత్మనః ॥ 35
అంతటితో మహాబాహువు, బలవంతుడు అయిన భీముడు యుద్ధంలో మహాత్ముడైన ధృష్టద్యుమ్నునకు సాయం చెయ్యాలని వేగంగా వచ్చిచేరాడు. (35)
స ద్రోణం నిశితైర్బాణై రాజన్ వివ్యాధ సప్తభిః ।
పార్షతం చ రథం తూర్ణం స్వకమారోహయత్ తదా ॥ 36
రాజా! ఆ భీముడు పదునైన బాణాలు ఏడింటితో ద్రోణుని గాయపరిచాడు. అప్పుడు వేగంగా ధృష్టద్యుమ్నుని తన రథం మీదకు ఎక్కించాడు. (36)
తతో దుర్యోధనో రాజన్ భానుమంతమచోదయత్ ।
సైన్యేన మహతా యుక్తం భారద్వాజస్య రక్షణే ॥ 37
రాజా! అంతట దుర్యోధనుడు ద్రోణుని రక్షణకై పెద్దసేనతో భానుమంతుని నియోగించాడు. (37)
తతః సా మహతీ సేనా కలింగానాం జనేశ్వర ।
భీమమభ్యుద్యయౌ తూర్ణం తవ పుత్రస్య శాసనాత్ ॥ 38
రాజా! అప్పుడు దుర్యోధనుని శాసనాన్ని అనుసరించి, కళింగదేశానికి చెందిన ఆ పెద్దసేన భీముని ఎదిరించింది. (38)
పాంచాల్యమథ సంత్యజ్య ద్రోణోఽపి రథినాం వరః ।
విరాటద్రుపదౌ వృద్ధౌ వారయామాస సంయుగే ॥ 39
రథికశ్రేష్ఠుడైన ద్రోణాచార్యుడు రణభూమిలో ధృష్టద్యుమ్నుని విడిచి పెట్టి వృద్ధులైన విరాటుని, ద్రుపదుని వారించాడు. (39)
ధృష్టద్యుమ్నోఽపి సమరే ధర్మరాజానమభ్యయాత్ ।
తతః ప్రవవృతే యుద్ధం తుములం లోమహర్షణమ్ ॥ 40
కలింగానాం చ సమరే భీమస్య చ మహాత్మనః ।
జగతః ప్రక్షయకరం ఘోరరూపం భయావహమ్ ॥ 41
ధృష్టద్యుమ్నుడు కూడా రణరంగంలో ఉన్న ధర్మరాజు దగ్గరకు వెళ్ళాడు. ఆ తరువాత కళింగదేశీయులకు, మహామనస్వి అయిన భీమసేనునకు మధ్య రోమాంచాన్న్ కల్గించే మహాభయంకర యుద్ధం జరిగింది. అది జగద్వినాశకంగా కనిపించింది." (40,41)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి ధృష్టద్యుమ్నద్రోణయుద్ధే త్రిపంచాశత్తమోఽధ్యాయః ॥ 53 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భీష్మవధపర్వమను ఉపపర్వమున ధృష్టద్యుమ్న, ద్రోణ యుద్ధ మను ఏబదిమూడవ అధ్యాయము. (53)