57. ఏబది యేడవ అధ్యాయము

ఉభయ సేనల ఘోరయుద్ధము.

సంజయ ఉవాచ
తతో వ్యూఢేష్వనీకేషు తావకేషు పరేషు చ ।
ధనంజయో రథానీకమ్ అవధీత్ తవ భారత ॥ 1
సంజయుడిలా చెప్తున్నాడు. 'భారతా! నీ సేనలు,శత్రుసేనలు వ్యూహాత్మకంగా నిలవగా అర్జునుడు నీరథసేనను చంప నారంభించాడు. (1)
శరైరతిరథో యుద్ధే దారయన్ రథయూథపాన్ ।
తే వధ్యమానాః పార్థేన కాలేనేవ యుగక్షయే ॥ 2
ధార్తరాష్ట్రా రణే యత్నాత్ పాండవాన్ ప్రత్యయోధయన్ ।
అతిరథుడైన అర్జునుడు రథసేనాపతులను చీల్చివేయసాగాడు. ప్రళయకాలంలోని మృత్యువువలె అర్జునుడు తమసేనలను చంపుతుంటే ధార్తరాష్ట్రులు ఎంతో ప్రయత్నంతో పాండవులను ఎదుర్కొంటున్నారు. (2 1/2)
ప్రార్థయానా యశో దీప్తం మృత్యుం కృత్వా నివర్తనమ్ ॥ 3
ఏకాగ్రమనసో భూత్వా పాండవానాం వరూథినీమ్ ।
బభంజుర్బహుశో రాజన్ తేచాసజ్జంత సంయుగే ॥ 4
రాజా! ఉజ్జ్వల కీర్తిని కోరుతూ మృత్యువు మాత్రమే తమను యుద్ధవిముఖులను చేస్తుందని భావిస్తూ, ఏకాగ్రచిత్తులై పాండవసేనను మాటిమాటికీ భంగపరచగలిగేటట్లు యుద్ధాసక్తులయ్యారు. (3,4)
ద్రవద్భిరథ భగ్నైశ్చ పరివర్తద్భిరేవ చ ।
పాండవైః కౌరవేయైశ్చ న ప్రాజ్ఞాయత కించన ॥ 5
ఆపై పారిపోతూ, భంగపడుతూ, మరలవచ్చి ఎదిరిస్తూ ఉన్న పాండవ కౌరవసేనలకు ఏమీ తెలియటం లేదు. (5)
ఉదతిష్ఠద్ రజో భౌమం ఛాదయానం దివాకరమ్ ।
న దిశః ప్రదిశో వాపి తత్ర హన్యుః కథం నరాః ॥ 6
నేల నుండి ఎగిసిన దుమ్ము సూర్యుని కప్పివేసింది. దిక్కు, విదిక్కు ఏమీ తెలియటం లేదు. ఇక సైనికులు ఎలా యుద్ధం చేస్తారు. (6)
అనుమానేన సంజ్ఞాభిః నామగోత్రైశ్చ సంయుగే ।
వర్తతే చ తథా యుద్ధం తత్ర తత్ర విశాంపతే ॥ 7
రాజా! ఆ యుద్ధంలో అనుమానం వలననో, సంకేతాల వల్లనో, నామగోత్రాలను చెప్పుకొనటం వల్లనో శత్రువులను గుర్తించిన చోట మాత్రమే యుద్ధం జరుగుతోంది. (7)
న వ్యూహో భిద్యతే తత్ర కౌరవాణాం కథంచన ।
రక్షితః సత్యసంధేన భారద్వాజేన సంయుగే ॥ 8
అక్కడ సత్యసంధుడైన ద్రోణాచార్యునిచే రక్షింపబడుతున్న ఆ కౌరవవ్యూహం యుద్ధంలో ఏ పాటీ చెక్కుచెదరలేదు. (8)
తథైవ పాండవానాం చ రక్షితః సవ్యసాచినా ।
నాభిద్యత మహావ్యూహః భీమేన చ సురక్షితః ॥ 9
అదేరీతిగా అర్జునునిచేత, భీమసేనుని చేత రక్షింపబడుతున్న పాండవమహావ్యూహం కూడా భంగపడలేదు. (9)
సేనాగ్రాదపి నిష్పత్య ప్రాయుధ్యంస్తత్ర మానవాః ।
ఉభయోః సేనయో రాజన్ వ్యతిషక్తరథద్విపాః ॥ 10
రాజా! అక్కడి సైనికులు వ్యూహాన్ని విడిచికూడా పోరాడుతున్నారు. రెండు సేనలలోని రథాలు, ఏనుగులు కలిసిపోయాయి. (10)
హయారోహైర్హయారోహాః పాత్యంతే స్మ మహాహవే ।
ఋష్టిభిర్విమలాభిశ్చ ప్రాసైరపి చ సంయుగే ॥ 11
ఆ మహాసంగ్రామంలో ఆశ్వికులు నిర్మలమైన ఋష్టులను, ప్రాసాలను ప్రయోగించి, ఆశ్వికులను పడగొడుతున్నాడు. (11)
రథీ రథినమాసాద్య శరైః కనకభూషణైః ।
పాతయామాస సమరే తస్మిన్నతిభయంకరే ॥ 12
అతిభయంకరమైన ఆ యుద్ధంలో రథి రథిని ఆక్రమించి, కనకభూషణాలు గల బాణాలతో పడగొడుతున్నారు. (12)
గజారోహా గజారోహాన్ నారాచశరతోమరైః ।
సంసక్తాన్ పాతయామాసుః తవ తేషాం చ సర్వశః ॥ 13
నీ సేనలోను, వారి సేనలోనూ ఉన్న గజయోధులు నారాచాలు, శరాలు, తోమరాలు వాడి తమను సమీపించిన గజయోధులను పడగొడుతున్నారు. (13)
కశ్చిదుత్పత్య సమరే పరవారణమాస్థితః ।
కేశపక్షే పరామృశ్య జహార సమరే శిరః ॥ 14
కొందరు సైనికులు పైకెగసి ఏనుగుల పైనున్న శత్రువీరులను యుద్ధంలో జుట్టుపట్టుకొని, తలలు తెగనరుకుతున్నారు. (14)
అన్యే ద్విరదదంతాగ్రనిర్భిన్నహృదయా రణే ।
వేముశ్చ రుధిరం వీరాః నిఃశ్వసంతః సమంతతః ॥ 15
మరికొందరు యుద్ధంలో ఏనుగుల దంతాగ్రాలచే హృదయాలు బ్రద్దలు చేయబడగా అన్ని వైపులా నిట్టూర్పులు విడుస్తూ, నెత్తురు క్రక్కుతున్నారు. (15)
కశ్చిత్ కరివిషాణస్థః వీరో రణవిశారదః ।
ప్రావేపచ్ఛక్తినిర్భిన్నః గజశిక్షాస్త్రవేదినా ॥ 16
రణవిశారదుడైన వీరుకొడొకడు ఏనుగు దంతం మీద నిలిచి యుద్ధం చేస్తున్నాడు. గజశిక్ష, అస్త్రవిద్య తెలిసిన మరొకడు శక్తితో అతనిని చీల్చివేశాడు. అతడు వణుకుతున్నాడు. (16)
పత్తిసంఘా రణే పత్తీన్ భిందిపాలపరశ్వధైః ।
న్యపాతయంత సంహృష్టాః పరస్పరకృతాగసః ॥ 17
ఉల్లాసంగా పరస్పరం తప్పులు చేస్తున్న కాల్బలాలు భిందిపాల, పరశ్వధాలతో ఒకరినొకరు రణభూమిలో పడగొడుతున్నారు. (17)
రథీ చ సమరే రాజన్ ఆసాద్య గజయూథపమ్ ।
సగజం పాతయామాస గజీ చ రథినాం వరమ్ ॥ 18
రాజా! యుద్ధంలో రథి గజసేనాపతిని సమీపించి, ఏనుగుతోపాటు పడగొట్టాడు. గజారోహకుడు ఆ శ్రేష్ఠరథిని పడగొట్టాడు. (18)
రథినం చ హయారోహః ప్రాసేన భరతర్షభ ।
పాతయామాస సమరే రథీ చ హయసాదినమ్ ॥ 19
భరతర్షభా! ఆశ్వికుడు ప్రాసంతో రథిని పడగొట్టాడు. రథి యుద్ధంలో ఆశ్వికుని పడగొట్టాడు. (19)
పదాతీ రథినం సంఖ్యే రథీ చాపి పదాతినమ్ ।
న్యపాతయచ్ఛితైః శస్త్రైః సేనయోరుభయోరపి ॥ 20
రణభూమిలో ఉభయసేనలోనూ కాల్బలం రథికులను, రథికులు కాల్బలాన్ని వాడిబాణాలతో పడగొడుతున్నారు. (20)
గజారోహా హయారోహాన్ పాతయాంచక్రిరే తదా ।
హయారోహా గజస్థాంశ్చ తదద్భుతమివాభవత్ ॥ 21
అప్పుడు ఏనుగునెక్కిన వారు గుర్రమెక్కిన వారిని చంపుతున్నారు. గుర్రమెక్కిన వారు ఏనుగునెక్కిన వారిని చంపుతున్నారు. అది అద్భుత మనిపించింది. (21)
గజారోహవరైశ్చాపి తత్ర తత్ర పదాతయః ।
పాతితాః సమదృశ్యంత తైశ్చాపి గజయోధినః ॥ 22
ఏనుగుల నెక్కిన శ్రేష్ఠయోధులు అక్కడక్కడ కాల్బలాన్ని పడగొడుతున్నారు. కాల్బలం పడగొట్టిన గజయోధులు కూడా కనపిస్తున్నారు. (22)
పత్తిసంఘా హయారోహైః సాదిసంఘాశ్చ పత్తిభిః ।
పాత్యమానా వ్యదృశ్యంత శతశోఽథ సహస్రశః ॥ 23
పదాతిదళాలు ఆశ్వికుల చేత, ఆశ్వికులు పదాతి దళాల చేత పడగొట్టబడి వందలు, వేలు కనిపిస్తున్నారు. (23)
ధ్వజైస్తత్రాపవిద్ధైశ్చ కార్ముకైస్తోమరైస్తథా ।
ప్రాసైస్తథా గదాభిశ్చ పరిఘైః కంపనైస్తథా ॥ 24
శక్తిభిః కవచైశ్చిత్రైః కణపైరంకుశైరపి ।
నిస్త్రింశైర్విమలైశ్చాపి స్వర్ణపుంఖైః శరైస్తథా ॥ 25
పరిస్తోమైః కుథాభిశ్చ కంబలైశ్చ మహాధనైః ।
భూర్భాతి భరతశ్రేష్ఠ స్రగ్దామైరివ చిత్రితా ॥ 26
భరతశ్రేష్ఠా! అక్కడ అటూ - ఇటూ పడి ఉన్న ధ్వజాలు, కార్ముకాలు, తోమరాలు, ప్రాసాలు, గదలు, పరిఘలు, కంపనాలు శక్తులు, చిత్రకవచాలు, కణపాలు, అంకుశాలు, నిర్మల ఖడ్గాలు, బంగారు రెక్కల బాణాలు, శూలాలు, బొంతలు, విలువైన కంబళ్ళతో రణరంగం పూలమాలలతో అలంకరింపబడినట్లు కనిపిస్తోంది. (24-26)
నరాశ్వకాయైః పతితైః దంతిభిశ్చ మహాహవే ।
అగమ్యరూపా పృథివీ మాంసశోణితకర్దమా ॥ 27
మహాసంగ్రామంలో సైనికులు, గుర్రాల శరీరాలు, ఏనుగులు పడి ఉన్నాయి. వాటి రక్తమాంసాలు బురదలా ఉన్నాయి. ఆ నేలపై అడుగుపెట్టడం కూడా కష్టంగా ఉంది. (27)
ప్రశశామ రజో భౌమం వ్యుక్షితం రణశోణితైః ।
దిశశ్చ విమలాః సర్వాః సంబభూవుర్జనేశ్వర ॥ 28
రాజా! యుద్ఢంలో పారుతున్న నెత్తుటితో నేల మీద నుండి దుమ్మురేగటం ఆగిపోయింది. సర్వదిక్కులూ నిర్మలమయ్యాయి. (28)
ఉత్థితాన్యగణేయాని కబంధాని సమంతతః ।
చిహ్నభూతాని జగతః వినాశార్థాయ భారత ॥ 29
భారతా! జగద్వినాశ సూచనగా లెక్కలేనన్ని కబంధాలు అంతటా ఎగిసిపడుతున్నాయి. (29)
తస్మిన్ యుద్ధే మహారౌద్రే వర్తమానే సుదారుణే ।
ప్రత్యదృశ్యంత రథినః ధావమానాః సమంతతః ॥ 30
దారుణంగా, రౌద్రంగా మహాసంగ్రామం జరుగుతుంటే రథికులు అన్నివైపులా పారిపోతూ కనిపిస్తున్నారు. (30)
తతో భీష్మశ్చ ద్రోణశ్చ సైంధవశ్చ జయద్రథః ।
పురుమిత్రో జయో భోజః శల్యశ్చాపి ససౌబలః ॥ 31
ఏతే సమరదుర్ధర్షాః సింహతుల్యపరాక్రమాః ।
పాండవానామనీకాని బభంజుః స్మ పునః పునః ॥ 32
ఆ తరువాత సింహతుల్య పరాక్రములూ, రణదుర్జయులు అయిన భీష్ముడు, ద్రోణుడు, సింధురాజు జయద్రథుడు, పురుమిత్రుడు, జయుడు, భోజుడు, శల్యుడు, శకుని మాటిమాటికి పాండవసేనలను భంగపరచారు. (31,32)
తథైవ భీమసేనోపి రాక్షసశ్చ ఘటోత్కచః ।
సాత్యకిశ్చేకితానశ్చ ద్రౌపదేయాశ్చ భారత ॥ 33
తావకాంస్తవ పుత్రాంశ్చ సహితాన్ సర్వరాజభిః ।
ద్రావయామాసురాజౌ తే త్రిదశా దానవానివ ॥ 34
భారతా! అదే రీతిగా భీమసేనుడు, రాక్షసుడైన ఘటోత్కచుడు, సాత్యకి, చేకితానుడు, ద్రౌపది కొడుకులు సర్వనరపాలురతో కూడిన నీ కుమారులను దేవతలు దానవులను తరిమికొట్టినట్టు రణరంగం నుండి పారద్రోలారు. (33,34)
తథా తే సమరేఽన్యోన్యం నిఘ్నంతః క్షత్రియర్షభాః ।
రక్తోక్షితా ఘోరరూపాః విరేజుర్దానవా ఇవ ॥ 35
ఆ రీతిగా యుద్ధంలో పరస్పరం చంపుకొంటున్న క్షత్రియ శ్రేష్ఠులు నెత్తుటితో తడిసి రాక్షసుల వలె ఘోరంగా వెలిగిపోతున్నారు. (35)
వినిర్జిత్య రిపూన్ వీరాః సేనయోరుభయోరపి ।
వ్యదృశ్యంత మహామాత్రాః గ్రహా ఇవ నభస్తలే ॥ 36
రెండు సేనలలోని వీరులూ శత్రువులను ఓడించి, ఆకాశతలంలోని విశాలగ్రహాల వలె కనిపిస్తున్నారు. (36)
తతో రథసహస్రేణ పుత్రో దుర్యోధనస్తవ ।
అభ్యయాత్ పాండవం యుద్ధే రాక్షసం చ ఘటోత్కచమ్ ॥ 37
ఆ పై నీ కొడుకు దుర్యోధనుడు వేయిరథాలతో పాండవ వంశీయుడైన ఘటోత్కచుని మీదకు యుద్ధానికి వెళ్ళాడు. (37)
తథైవ పాండవాః సర్వే మహత్వా సేనయా సహ ।
ద్రోణభీష్మౌ రణే యత్తౌ ప్రత్యుద్యయురరిందమౌ ॥ 38
అలాగే పాండవులంతా పెద్ద సేనతో అరిందములై, యుద్ధాయత్తులై ఉన్న ద్రోణభీష్ములను ఎదిరించారు. (38)
కిరీటీ చ యయౌ క్రుద్ధః సమంతాత్ పార్థివోత్తమాన్ ।
ఆర్జునిః సాత్యకిశ్చైవ యయతుః సౌబలం బలమ్ ॥ 39
అర్జునుడు కోపంతో అంతటా నిలిచి ఉన్న రాజు శ్రేష్ఠుల మీదకు వెళ్ళాడు. అభిమన్యుడు, సాత్యకి శకునిసేనపై దాడిచేశారు. (39)
తతః ప్రవవృతే భూయః సంగ్రామో లోమహర్షణః ।
తావకానాం పరేషాం చ సమరే విజయైషిణామ్ ॥ 40
పరస్పరం గెలువగోరుతున్న నీ వారికి, శత్రువులకు మధ్య మరల రోమాంచజనకంగా యుద్ధం మొదలైంది. (40)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి తృతీయే యుద్ధదివసే సంకుల యుద్ధే సప్తపంచాశత్తమోఽధ్యాయః ॥ 57 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భీష్మవధ పర్వమను ఉపపర్వమున తృతీయ యుద్ధదివసమున సంకుల యుద్ధమను ఏబది యేడవ అధ్యాయము. (57)