58. ఏబది యెనిమిదవ అధ్యాయము

పాండవ వీర పరాక్రమము - కౌరవ సేనపలాయనము - భీష్మదుర్యోధన సంవాదము.

సంజయ ఉవాచ
తతస్తే పార్థివాః క్రుద్ధాః ఫాల్గునం వీక్ష్య సంయుగే ।
రథైరనేకసాహస్రైః సమంతాత్ పర్యవారయన్ ॥ 1
సంజయుడిలా చెప్తున్నాడు. ఆ తరువాత యుద్ధంలో శత్రురాజులందరూ అర్జునుని చూసి, కోపించి, వేల వేల రథాలతో అన్ని వైపులా అతనిని నిరోధించారు. (1)
అథైనం రథవృందేన కోష్ఠకీకృత్య భారత ।
శరైః సుబహుసాహస్రైః సమంతాదభ్యవారయన్ ॥ 2
అతిరథుడైన అర్జునుడు రథసేనాపతులను చీల్చివేయసాగాడు. ప్రళయ కాలంలోని మృత్యువువలె అర్జునుడు తమసేనలను చంపుతుంటే ధార్తరాష్ట్రులు ఎంతో ప్రయత్నంతో పాండవులను ఎదుర్కొంటున్నారు. (2)
శక్తీశ్చ విమలాస్తీక్ష్ణాః గదాశ్చ పరిఘైః సహ ।
ప్రాసాన్ పరశ్వధాంశ్చైవ ముద్గరాన్ ముసలానపి ॥ 3
చిక్షిపుః సమరే క్రుద్ధాః ఫాల్గునస్య రథం ప్రతి ।
కోపంతో యుద్ధం చేస్తూ, అర్జునుని రథం మీదికి మెరిసే శక్తులను, తీక్ష్ణగదలను, పరిఘలను, ప్రాసాలను, గొడ్డళ్ళను, ముద్గరాలను, రోకళ్ళను విసిరారు. (3 1/2)
శస్త్రాణామథ తాం వృష్టిం శలభానామివాయతిమ్ ।
రురోధ సర్వతః పార్థః శరైః కనకభూషణైః ।
ఆ బాణవృష్టిని అర్జునుడు స్వర్ణభూషిత శరాలతో మిడతల దండునువలె అన్నివైపులా అడ్డగించాడు. (4 1/2)
తత్ర తల్లాఘవం దృష్ట్వా బీభత్సోరతిమానుషమ్ ॥ 5
దేవదానవగంధర్వాః పిశాచోరగరాక్షసాః ।
సాధు సాధ్వితి రాజేంద్ర ఫాల్గునం ప్రత్యపూజయన్ ॥ 6
రాజేంద్రా! మానవాతీతమైన అర్జునుని నైపుణ్యాన్ని చూసి దేవతలు, దానవులు, గంధర్వులు, పిశాచులు, నాగులు, రాక్షసులు "భళీ, భళీ" అని అర్జునుని సమ్మానించారు. (5,6)
సాత్యకిశ్చాభిమన్యుశ్చ మహత్యా సేనయా వృతౌ ।
గాంధారాన్ సమరే శూరాన్ జగ్మతుః సహసౌబలాన్ ॥ 7
తమ చుట్టూ మహాసేనను నిలుపుకొని సాత్యకి, అభిమన్యుడు యుద్ధంలో సుబల సుతులతో సహా గాంధారదేశ శూరులను ఆక్రమించారు. (7)
తత్ర సౌబలకాః క్రుద్ధాః వార్ ష్ణేయస్య రథోత్తమమ్ ।
తిలశశ్చిచ్ఛిదుః క్రోధాత్ శస్తైర్నానావిధైర్యుధి ॥ 8
అక్కడ సుబల సుతులు క్రుద్ధులై, యుద్ధభూమిలో నానావిధాయుధాలతో సాత్యకిరథాన్ని నువ్వు గింజలంత ముక్కలుగా నరికి వేశారు. (8)
సాత్యకిస్తు రథం త్యక్త్వా వర్తమానే మహాహవే ।
అభిమన్యో రథం తూర్ణమ్ ఆరురోహ పరంతపః ॥ 9
ఆ తీవ్ర సంగ్రామంలో పరంతపుడైన సాత్యకి విరిగిన తన రథాన్ని వీడి, వెంటనే అభిమన్యుని రథాన్ని ఎక్కాడు. (9)
తావేకరథసంయుక్తౌ సౌబలేయస్య వాహినీమ్ ।
వ్యధమేతాం శితైస్తూర్ణం శరైః సన్నతపర్వభిః ॥ 10
ఒకే రథం మీద నిలిచిన సాత్యకి, అభిమన్యులు వెంటనే వంగిన కణుపులు గల వాడిబాణాలతో శకుని సేనను చంపనారంభించారు. (10)
ద్రోణభీష్మౌ రణే యత్తౌ ధర్మరాజస్య వాహినీమ్ ।
నాశయేతాం శరైస్తీక్ ష్ణైః కంకపత్రపరిచ్ఛదైః ॥ 11
యుద్ధానికి సన్నద్ధులై ఉన్న ద్రోణ భీష్ములు డేగరెక్కలతో అలంకరించిన తీక్ష్ణబాణాలతో ధర్మరాజుసేనను నాశనం చేయసాగారు. (11)
తతో ధర్మసుతో రాజా మాద్రీపుత్రౌ చ పాండవౌ ।
మిషతాం సర్వసైన్యానాం ద్రోణానీకముపాద్రవన్ ॥ 12
ఆ తరువాత మహారాజు యుధిష్ఠిరుడు, మాద్రి కొడుకులు నకుల సహదేవులు సమస్తసేనలు చూస్తూ ఉండగానే ద్రోణసేనపై దాడి చేశారు. (12)
తత్రాసీత్ సుమహద్ యుద్ధం తుములం లోమహర్షణమ్ ।
యథా దేవాసురం యుద్ధం పూర్వమాసీత్ సుదారుణమ్ ॥ 13
గతంలో దేవాసురుల మధ్య భీకరయుద్ధం జరిగినట్టు అక్కడ రోమాంచం కలిగించే ఘోరయుద్ధం జరిగింది. (13)
కుర్వాణౌ సుమహత్ కర్మ భీమసేనఘటోత్కచౌ ।
(దుర్యోధనస్య మహతీం ద్రావయామాస వాహినీమ్ ।)
దుర్యోధనస్తతోఽభ్యేత్య తావుభావప్యవారయత్ ॥ 14
భీమసేన ఘటోత్కచులు మహాపరాక్రమంతో దుర్యోధనుని మహాసేనను తరిమివేయసాగారు. అప్పుడు దుర్యోధనుడు వచ్చి వారిద్దరినీ వారించాడు. (14)
తత్రాద్భుతమపశ్యామ హైడింబస్య పరాక్రమమ్ ।
అతీత్య పితరం యుద్ధే యదయుధ్యత భారత ॥ 15
భారతా! అక్కడ ఘటోత్కచుని అద్భుత పరాక్రమం కనిపించింది. తండ్రిని మించిపోయి తాను యుద్ధం చేస్తున్నాడు. (15)
భీమసేనస్తు సంక్రుద్ధః దుర్యోధనమమర్షణమ్ ।
హృద్యవిధ్యత్ పృషత్కేన ప్రహసన్నివ పాండవః ॥ 16
పాండురాజకుమారుడు భీమసేనుడు కోపించి, హేళనగా నవ్వుతూ, అమర్షశీలుడైన దుర్యోధనుని ఛాతిపై బాణంతో గాయం చేశాడు. (16)
తతో దుర్యోధనో రాజా ప్రహారవరపీడితః ।
నిషసాద రథోపస్థే కశ్మలం చ జగామ హ ॥ 17
అంతట ఆ బాణపు దెబ్బతిన్న దుర్యోధన మహారాజు రథం మీది ఆసనంపై స్పృహతప్పి కూర్చుండిపోయాడు. (17)
తం విసంజ్ఞం విదిత్వా తు త్వరమాణోఽస్య సారథిః ।
అపోహవా రణాద్ రాజన్ తతః సైన్యమభజ్యత ॥ 18
రాజా! ఆయన స్పృహ తప్పాడని గ్రహించి, రథసారథి వేగంగా రణభూమి నుండి వెలుపలికి కొనిపోయాడు. ఆ తర్వాత ఆ సేన చెదిరిపోయింది. (18)
తతస్తాం కౌరవీం సేనాం ద్రవమాణాం సమంతతః ।
నిఘ్నన్ భీమః శరైస్తీక్ష్ణైః అనువవ్రాజ పృష్ఠతః ॥ 19
ఆపై అన్నిదిక్కులకు పారిపోతున్న ఆ కౌరవసేనను భీముడు పదునైన బాణాలతో హింసిస్తూ, వెంటబడి తరిమాడు. (19)
పార్షతశ్చ రథశ్రేష్ఠః ధర్మపుత్రశ్చ పాండవః ।
ద్రోణస్య పశ్యతః సైన్యం గాంగేయస్య చ పశ్యతః ॥ 20
జఘ్నతుర్విశిఖైస్తీక్ష్ణైః పరానీకవినాశనైః ।
మహారథులైన ధృష్టద్యుమ్నుడు, ధర్మసుతుడైన యుధిష్ఠిరుడు ద్రోణభీష్ములు చూస్తుండగానే శత్రుసేనా వినాశకాలైన తీక్ష్ణబాణాలతో సైన్యాన్ని పీడిస్తూ వెంటబడ్ఢారు. (20 1/2)
ద్రవమాణం తు తత్ సైన్యం తవ పుత్రస్య సంయుగే ॥ 21
నాశక్నుతాం వారయితుం భీష్మద్రోణౌ మహారథౌ ।
రణభూమి నుండి పారిపోతున్న నీ కుమారుని సేనను మహారథులైన భీష్మద్రోణులు ఆపలేకపోయారు. (21 1/2)
వార్యమాణం చ బీష్మేణ ద్రోణేన చ మహాత్మనా ॥ 22
విద్రవత్యేవ తత్ సైన్యం పశ్యతోర్ద్రోణభీష్మయోః ।
మహాత్ములైన భీష్మద్రోణులు ఎంత వారిస్తున్నా వారి కళ్ళముందే ఆ సైన్యం పారిపోతోంది. (22 1/2)
తతో రథసహస్రేషు విద్రవత్సు తతస్తతః ॥ 23
తావాస్థితావేకరథం సౌభద్రశినిపుంగవౌ ।
సౌబలీం సమరే సేనాం శాతయేతాం సమంతతః ॥ 24
అటు వేలకొలదిగ రథులు అటూ - ఇటూ పారిపోతుంటే ఒకే రథాన్ని ఎక్కి ఉన్న అభిమన్యుసాత్యకులు సమరంలో సుబలసేనను అన్ని వైపుల నుండి సంహరించసాగారు. (23,24)
శుశుభాతే తదా తౌ తు శైనేయకురుపుంగవౌ ।
అమావాస్యాం గతౌ యద్వత్ సోమసూర్యౌ నభస్తలే ॥ 25
ఆ సమయంలో ఒకే రథం పైనున్న సాత్యకి, అభిమన్యులు అమావాస్య రోజు ఆకాశంలో ఒకే స్థానంలో నున్న సూర్యచంద్రుల వలె శోభించారు. (25)
అర్జునస్తు తతః క్రుద్ధః తవ సైన్యం విశాంపతే ।
వవర్ష శరవర్షేణ ధారాభిరివ తోయదః ॥ 26
రాజా! ఆ పై కోపించిన అర్జునుడు మేఘం వర్ష ధారలను కురిసినట్లు నీ సేనపై శరవృష్ఠిని కురిపించాడు. (26)
వధ్యమానం తతస్తత్ర శరైః పార్థస్య సంయుగే ।
దుద్రావ కౌరవం సైన్యం విషాదభయకంపితమ్ ॥ 27
పార్థుని బాణాలచే యుద్ధంలో పీడింపబడుతున్న కౌరవసేన విషాదంతో, భయంతో వణికి పోతూ పరుగులు పెట్టింది. (27)
ద్రవతస్తాన్ సమాలక్ష్య భీష్మద్రోణౌ మహారథౌ ।
న్యవారయేతాం సంరబ్ధౌ దుర్యోధనహితైషిణౌ ॥ 28
పారిపోతున్న సేనలను చూసి, మహారథులైన భీష్మద్రోణులు పూనికొని, దుర్యోధనుని హితాన్ని కోరుతూ వారిని నివారించారు. (28)
తతో దుర్యోధనో రాజా సమాశ్వస్య విశాంపతే ।
న్యవర్తయత తత్ సైన్యం ద్రవమాణం సమంతతః ॥ 29
రాజా! ఆ పై ఊరడిల్లిన దుర్యోధన మహారాజు నాల్గువైపులకూ పారిపోతున్న తన సైన్యాన్ని నివారించాడు. (29)
యత్ర యత్ర సుతస్తుభ్యం యం యం పశ్యతి భారత ।
తత్ర తత్ర న్యవర్తంత క్షత్రియాణాం మహారథాః ॥ 30
భారతా! నీ కుమారుని దృష్టి పడగానే మహారథులైన క్షత్రియులు కూడా అక్కడికక్కడే వెనుకకు మరలసాగారు. (30)
తాన్ నివృత్తాన్ సమీక్ష్యైవ తతోఽన్యేఽపీతరే జనాః ।
అన్యోన్యస్పర్ధయా రాజన్ లజ్ఞయా చావతస్థిరే ॥ 31
రాజానా! మరలుతున్న వారిని చూసి, ఇతరులు కూడా పోటీ వల్లనో, సిగ్గువల్లనో పారిపోకుండా నిలిచిపోయారు. (31)
పునరావర్తతాం తేషాం వేగ ఆసీద్ విశాంపతే ।
పూర్యతః సాగరస్యేవ చంద్రస్యోదయనం ప్రతి ॥ 32
రాజా! వెనుకకు తిరిగి వస్తున్న వారివేగం చంద్రోదయ సమయంలో పోటెత్తే సముద్రుని వేగంలా ఉంది. (32)
సన్నివృత్తాంస్తతస్తాంస్తు దృష్ట్వా రాజా సుయోధనః ।
అబ్రవీత్ త్వరితో గత్వా భీష్మం శాంతనవం వచః ॥ 33
వెనుకకు తిరిగివచ్చిన వారిని చూసి, సుయోధన నరపాలుడు వేగంగా శంతునుసుతుడైన భీష్ముని దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు. (33)
పితామహ నిబోధేదం యత్ త్వాం వక్ష్యామి భారత ।
వానురూపమహం మన్యే త్వయి జీవతి కౌరవ ॥ 34
ద్రోణే చాస్త్రవిదాం శ్రేష్ఠే సపుత్రే ససుహృజ్ఞనే ।
కృపే చైవ మహేష్వాసే ద్రవతే యద్ వరూథినీ ॥ 35
"భారతా! పితామహా! నేను చెప్పబోయే మాట వినండి. కౌరవా! నీవు, అస్త్రవేత్తలలో శ్రేష్ఠుడైన ద్రోణుడు, మేటి విలుకాడైన కృపాచార్యుడు పుత్రమిత్ర సహితంగా జీవించి ఉండగానే మనసేన పారిపోవటం అంత బాగా లేదని నాకనిపిస్తోంది. (34,35)
న పాండవాన్ ప్రతిబలాన్ తవ మన్యే కథంచన ।
తథా ద్రోణస్య సంగ్రామే ద్రౌణేశ్చైవ కృపస్య చ ॥ 36
సంగ్రామంలో పాండవులు నీతో కానీ, ద్రోణునితో కానీ, అశ్వత్థామతో కానీ, కృపునితో కానీ సమాన బలవంతులు అని నేననుకొనటం లేదు (36)
అనుగ్రాహ్యాః పాండుసుతాః తవ నూనం పితామహ ।
యథేమాం క్షమసే వీర వధ్యమానాం వరూథినీమ్ ॥ 37
వీరా! పితామహా! మనసేనను ఇలా చంపుతున్నా కూడా సహిస్తున్నావంటే పాండవులు తప్పక నీ అనుగ్రహానికి పాత్రులై ఉంటారు. (37)
సోఽస్మి వాచ్యస్త్వయా రాజన్ పూర్వమేవ సమాగమే ।
న యోత్స్యే పాండవాన్ సంఖ్యే నాపి పార్షతసాత్యకీ ॥ 38
రాజా! ఆ విషయం - యుద్ధంలో పాండవులతో కానీ, ధృష్టద్యుమ్న సాత్యకులతో కానీ యుద్ధం చేయనన్నమాట - నాకు యుద్ధానికి ముందే చెప్పవలసినది. (38)
శ్రుత్వా తు వచనం తుభ్యమ్ ఆచార్యస్య కృపస్య చ ।
కర్ణేన సహితః కృత్యం చింతయానస్తదైవ హి ॥ 39
అప్పుడే మీ మాటను, ద్రోణ కృపులమాటను విని, నేను కర్ణునితో కలిసి ఆలోచించి, కర్తవ్యాన్ని నిశ్చయించి యుండేవాడను. (39)
యది నాహం పరిత్యాజ్యః యువాభ్యామిహ సంయుగే ।
విక్రమేణానురూపేణ యుధ్యేతాం పురుషర్షభౌ ॥ 40
పురుషోత్తములైన మీ ఇద్దరూ నన్ను వదలకూడదనుకొంటే రణభూమిలో మీ పరాక్రమానికి తగినట్లు పోరాడండి." (40)
ఏతచ్ఛ్రుత్వా వచో భీష్మః ప్రహసన్ వై ముహుర్ముహుః ।
అబ్రవీత్ తనయం తుభ్యం క్రోధాదుద్ వృత్య చక్షుషీ ॥ 41
ఈ మాట విని, భీష్ముడు పదేపదే నవ్వి, కోపంతో కన్నులు పైకెత్తి, నీ కొడుకుతో ఇలా అన్నాడు. (41)
బహుశోఽసి మయా రాజన్ తథ్యముక్తో హితం వచః ।
అజేయాః పాండవా యుద్ధే దేవైరపి సవాసవైః ॥ 42
"రాజా! యుద్ధంలో దేవేంద్రునితో కలిసి దేవతలే వచ్చినా రణంలో పాండవులను గెలవలేరని సత్యమైన హితవచనాన్ని నేను చాలా సార్లు చెప్పాను. (42)
యత్ తు శక్యం మయా కర్తుం వృద్ధేనాద్య నృపోత్తమ ।
కరిష్యామి యథాశక్తి ప్రేక్షేదానీం సబాంధవః ॥ 43
రాజా! ఇప్పుడు ముసలివాడను నేను చేయగలిగిన దంతా చేస్తాను. బాంధవులతో కలిసి ఇక చూడు. (43)
అద్య పాండుసుతానేకః ససైన్యాన్ సహ బంధుభిః ।
సోఽహం నివారయిష్యామి సర్వలోకస్య పశ్యతః ॥ 44
ఈనాడు లోకమంతా చూస్తుండగానే పాండు కుమారులను సేనలతో, బంధువులతో సహా ఒంటరిగానే నిలవరిస్తాను." (44)
ఏవముక్తే తు భీష్మేణ పుత్రాస్తవ జనేశ్వర ।
దధ్ముః శంఖాన్ ముదా యుక్తాః భేరీః సంజఘ్నిరే భృశమ్ ॥ 45
రాజా! భీష్ముడిలా అనగానే నీ కొడుకులు ఆనందంతో శంఖాలు పూరించారు. జోరుగా రణభేరులు మ్రోగించారు. (45)
పాండవా హి తతో రాజన్ శ్రుత్వా తం నినదం మహత్ ।
దధ్ముః శంఖాంశ్చ భేరీశ్చ మురజాంశ్చాప్యనాదయన్ ॥ 46
రాజా! ఆ పై పాండవులు ఆ మహానాదాన్ని విని, శంఖాలను పూరించి, భేరులను నగారాలను మ్రోగించారు.(46)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి తృతీయ యుద్ధదివసే భీష్మదుర్యోధనసంవాదే అష్టపంచాశత్తమోఽధ్యాయః ॥ 58 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భీష్మవధ పర్వమను ఉపపర్వమున తృతీయ యుద్ధదివసమున భీష్మదుర్యోధన సంవాదమను ఏబది యెనిమిదవ అధ్యాయము. (58)
(దాక్షిణాత్య అధికపాఠం 1/2 శ్లోకంతో కలిపి 46 1/2 శ్లోకాలు)