65. అరువది అయిదవ అధ్యాయము

విశ్వోపాఖ్యానము.

ధృతరాష్ట్ర ఉవాచ
భయం మే సుమహజ్జాతం విస్మయశ్చైవ సంజయ ।
శ్రుత్వా పాండుకుమారాణాం కర్మ దేవైః సుదుష్కరమ్ ॥ 1
ధృతరాష్ట్రుడిలా అడిగాడు - 'సంజయా! దేవతలకు దుష్కరమైన పాండుపుత్ర పరాక్రమాన్ని వింటుంటే మహాభయమూ, ఆశ్చర్యమూ కలుగుతున్నాయి. (1)
పుత్రాణాం చ పరాభావం శ్రుత్వా సంజయ సర్వశః ।
చింతా మే మహతీ సూత భవిష్యతి కథం త్వితి ॥ 2
సూతా! సంజయా! నా కుమారుల పరాభవాన్ని గూర్చి వింటుంటే "ఇలా ఎందుకు జరుగుతోందా?" అని నాకు చాలా చింత కలుగుతోంది. (2)
ధ్రువం విదురవాక్యాని ధక్ష్యంతి హృదయం మమ ।
యథా హి దృశ్యతే సర్వం దైవయోగేన సంజయ ॥ 3
సంజయా! విదురుని మాటలు నిశ్చితంగా నా హృదయాన్ని దహిస్తున్నాయి. దైవయాగం వల్ల విదురుడు చెప్పినట్లే అంతా జరుగుతోంది. (3)
యత్ర భీష్మముఖాన్ సర్వాన్ శస్త్రజ్ఞాన్ యోధసత్తమాన్ ।
పాండవానామనీకేషు యోధయంతి ప్రహారిణః ॥ 4
పాండవసేనలోని యోధులు దెబ్బతీయగలవారు. శస్త్ర విద్యావేత్తలయిన భీష్ముని వంటి శ్రేష్ఠయోధుల నందరినీ ఎదిరించగలుగుతున్నారు. (4)
కేనావధ్యా మహాత్మానః పాండుపుత్రా మహాబలాః ।
కేన దత్తవరాస్తాత కిం వా జ్ఞానం విదంతి తే ॥ 5
మహాత్ములు, మహాబలులు అయిన పాండవులను ఏ కారణం వలన చంపలేకపోతున్నాం? నాయనా! వారికి ఎవరు వరాలిచ్చారు? వారి జ్ఞాన మెటువంటిది? (5)
యేన క్షయం న గచ్ఛంతి దివి తారాగణా ఇవ ।
పునః పునర్న మృష్యామి హతం సైన్యం తు పాండవైః ॥ 6
గగనతలంలోని తారాగణం వలె వారు క్షీణించకుండా నిలుస్తున్నారు. పాండవులు మన సేనలను చంపుతున్నారని విని విని సహించలేకపోతున్నాను. (6)
మయ్యేవ దండః పతతి దైవాత్ పరమదారుణః ।
యథావధ్యాః పాండుసుతాః యథా వధ్యాశ్చ మే సుతాః ॥ 7
ఏతన్మే సర్వమాచక్ష్వ యాథాతథ్యేన సంజయ ।
దైవవశం వలన పరమదారుణమైన ఈ శిక్ష నాకే పడుతోంది. సంజయా! పాండవులు అవధ్యులుగా ఉన్నారు. నా కొడుకులు చనిపోతున్నారు. ఇదంతా ఉన్నదున్నట్లు నాకు చెప్పు. (7 1/2)
న హి పారం ప్రపశ్యామి దుఃఖస్యాస్య కథంచన ॥ 8
సముద్రస్యేవ మహతః భుజాభ్యాం ప్రతరన్ నరః ।
మహాసముద్రాన్ని చేతులతో ఈదే మనిషిలాగా ఈ దుఃఖసాగరం యొక్క తీరాన్ని ఏ రీతిగానూ చూడలేకపోతున్నాను. (8 1/2)
పుత్రాణాం వ్యసనం మన్యే ధ్రువం ప్రాప్తం సుదారుణమ్ ॥ 9
ఘాతయిష్యతి మే సర్వాన్ పుత్రాన్ భీమో న సంశయః ।
నా కుమారులకు అత్యంత దారుణమైన సంకటస్థితి వచ్చిందని గట్టిగా భావిస్తున్నాను. భీముడు నా బిడ్డల నందరినీ సంహరిస్తాడు. అనుమానం లేదు. (9 1/2)
న హి పశ్యామి తం వీరం యో మే రక్షేత్ సుతాన్ రణే ॥ 10
ధ్రువం వినాశః సంప్రాప్తః పుత్రాణాం మమ సంజయ ।
యుద్ధంలో నా కుమారులను రక్షించగల వీరుడెవ్వడూ కనిపించటం లేదు. సంజయా! నా కొడుకులకు నశింపక తప్పని స్థితి కలిగింది. (10 1/2)
తస్మాన్మే కారణం సూత శక్తిం చైవ విశేషతః ॥ 11
పృచ్ఛతో వై యథాతత్త్వం సర్వమాఖ్యాతుమర్హసి ।
కాబట్టి సూతా! పాండువుల శక్తిని గురించి, నా కుమారుల మరణకారణాన్ని గురించి ప్రత్యేకంగా అడుగుతున్నాను. ఉన్నదున్నట్లుగా నాకంతా చెప్పాలి. (11 1/2)
దుర్యోధనశ్చ యచ్చక్రే దృష్ట్వా స్వాన్ విముఖాన్ రణే ॥ 12
భీష్మద్రోణౌ కృపశ్చైవ సౌబలశ్చ జయద్రథః ।
ద్రౌణిర్వాపి మహేష్వాసః వికర్ణో వా మహాబలః ॥ 13
నిశ్చయో వాపి కస్తేషాం తదా హ్యాసీన్మహాత్మనామ్ ।
విముఖేషు మహాప్రాజ్ఞ మమ పుత్రేషు సంజయ ॥ 14
తన సేనలు రణవిముఖులు కావటాన్ని చూసి, దుర్యోధనుడు ఏం చేశాడు? భీష్మద్రోణులు, కృపుడు, శకుని, జయద్రథుడు, మేటివిలుకాడైన అశ్వత్థామ, మహబలుడైన వికర్ణుడు ఏం చేశారు? మహాప్రాజ్ఞా! సంజయా! నా కుమారులు విముఖులైనప్పుడు ఆ మహాత్ములు ఏం నిశ్చయించారు?' (12-14)
సంజయ ఉవాచ
శృణు రాజన్నవహితః శ్రుత్వా చైవావధారయ ।
నైవ మంత్రకృతం కించిత్ నైవ మాయాం తథావిధామ్ ॥ 15
సంజయుడిలా చెప్తున్నాడు. 'రాజా! సావధానంగా విను. విని అర్థం చేసుకో. అదేమీ మంత్ర ప్రభావమూ కాదు. మాయతో చేసినదీ కాదు. (15)
న వై విభీషికాం కాంచిద్ రాజన్ కుర్వంతి పాండవాః ।
యుధ్యంతి తే యథాన్యాయం శక్తిమంతశ్చ సంయుగే ॥ 16
రాజా! పాండవులు యుద్ధంలో ఎటువంటి బెదిరింపులు చేయరు. న్యాయబద్ధంగా యుద్ధం చేస్తారు. వారు శక్తిమంతులు. (16)
ధర్మేణ సర్వకార్యాణి జీవితాదీని భారత ।
ఆరభంతే సదా పార్థాః ప్రార్థయానా మహద్ యశః ॥ 17
భారతా! కౌంతేయులు జీవిక మొదలయిన సర్వ కార్యాలను ధర్మబద్ధంగానే ప్రారంభిస్తారు. వారు లోకంలో మంచి పేరునే కోరుకొంటారు. (17)
న తే యుద్ధాన్ని వర్తంతే ధర్మోపేతా మహాబలాః ।
శ్రియా పరమయా యుక్తాః యతో ధర్మస్తతో జయః ॥ 18
వారు యుద్ధం నుండి వెనుదిరగరు. వారు ధార్మికులు కావటం వలన మహాబలంతో, పరమసమృద్ధితో ఉంటారు. ధర్మ మున్న వైపే గెలుపుంటుంది. (18)
తేనావధ్యా రణే పార్థాః జయయుక్తాశ్చ పార్థివ ।
తవ పుత్రా దుర్మాత్మానః పాపేష్వభిరతాః సదా ॥ 19
నిష్ఠురా హీనకర్మాణః తేన హీయంతి సంయుగే ।
రాజా! ఆ ధర్మం వలననే పాండవులు యుద్ధంలో అవధ్యులు, జయశీలులై ఉన్నారు. నీ కొడుకులు దురాత్ములు. ఎప్పుడూ పాపకర్యాలపై ఆసక్తి గలవారు. దయాహీనులు. హీనకర్మలనే చేస్తుంటారు. అందుకే యుద్ధంలో హాని పొందుతున్నారు. (19)
సుబహూని నృశంసాని పుత్రైస్తవ జనేశ్వర ॥ 20
నికృతానీహ పాండూనాం నీచైరివ యథా నరైః ।
సర్వం చ తదనాదృత్య పుత్రాణాం తవ కిల్బిషమ్ ॥ 21
పాపహ్నవాః సదైవాసన్ పాండవాః పాండుపూర్వజ ।
న చైతాన్ బహు మన్యంతే పుత్రాస్తవ విశాంపతే ॥ 22
రాజా! నీ కుమారులు హీనమానవుల వలె పాండవుల విషయంలో క్రూరమైన మోసాలను ఎన్నింటినో చేశారు. అయితే పాండవులు నీ కుమారుల పాపకర్మలను పట్టించుకోకుండా ఎప్పుడూ వాటిని కప్పిపుచ్చుతూ వచ్చారు. పాండురాజాగ్రజా! రాజా! నీ కుమారులు పాండవులను సాదరంగా చూడరు (20-22)
తస్య పాపస్య సతతం క్రియమాణస్య కర్మణః ।
సాంప్రతం సుమహద్ ఘోరం ఫలం ప్రాప్తం జనేశ్వర ॥ 23
రాజా! ఎప్పుడూ చేస్తున్న ఆ పాపకర్మల ఫలితమే ఇప్పుడు మహాఘోరంగా సంప్రాప్తమైంది. (23)
స త్వం భుంక్ష్వ మహారాజ సపుత్రః ససుహృజ్జనః ।
వావబుధ్యసి యద్ రాజన్ వార్యమాణః సుహృజ్జనైః ॥ 24
మహారాజా! ఇప్పుడు పుత్రులతో, మిత్రులతో కలిసి ఆ పాపఫలాన్ని అనుభవించు. రాజా! మంచివారు ఎంతగా నివారించే ప్రయత్నం చేసినా నీవు గ్రహించలేకపోయావు. (24)
విదురేణాథ భీష్మేణ ద్రోణేన చ మహాత్మనా ।
తథా మయా చాప్యసకృద్ వార్యమాణో న బుధ్యసే ॥ 25
విదురుడు, భీష్ముడు, మహాత్ముడైన ద్రోణుడు, నేను ఎన్నిసార్లు నిన్ను నివారించబోయినా నీవు అర్ధం చేసికోలేదు. (25)
వాక్యం హితం చ పథ్యం చ మర్త్యాః పథ్యమివౌషధమ్ ।
పుత్రాణాం మతమాజ్ఞాయ జితాన్ మన్యసి పాండవాన్ ॥ 26
మరణానికి దగ్గరైన వారు హితకరమైన ఔషధాన్ని తిరస్కరించినట్లు మావంటివారి హితకరవచనాలను కాదన్నావు. పుత్రుల అభిప్రాయాన్ని బట్టి పాండవులను గెలవగలననే అనుకొంటున్నావు. (26)
శృణు భూయో యథాతత్త్వం యన్మాం త్వం పరిపృచ్ఛసి ।
కారణం భరతశ్రేష్ఠ పాండవానాం జయం ప్రతి ॥ 27
తత్ తేహం కథయిష్యామి యథాశ్రుతమరిందమ ।
భరతశ్రేష్ఠా! పాండవుల విజయానికి కారణాన్ని నీవు నన్ను అడుగుతున్నావు. అరిందమా! నేను విన్నదాన్ని యథాతథంగా నీకు చెపుతాను. దాని యథార్థతత్త్వాన్ని విను. (27)
దుర్యోధనేన సంపృష్టః ఏతమర్థం పితామహః ॥ 28
దృష్ట్వా భ్రాతౄన్ రణే సర్వాన్ నిర్జితాంస్తు మహారథాన్ ।
శోకసమ్మూఢహృదయః నిశాకాలే స్మ కౌరవః ॥ 29
పితామహం మహాప్రాజ్ఞం వినయేనోస్పగమ్య హ ।
యదబ్రవీత్ సుతస్తేఽసౌ తన్మే శృణు జనేశ్వర ॥ 30
ఈ విషయాన్ని దుర్యోధనుడు భీష్ముని అడిగాడు. మహారథులైన తన సోదరులు యుద్ధంలో ఓడిపోవటాన్ని చూసి, శోకంతో హృదయం మోహానికి గురికాగా, రాత్రివేళ నీ కొడుకు దుర్యోధనుడు మహాప్రాజ్ఞుడైన భీష్ముని సవినయంగా సమీపించి పలికిన దానిని చెపుతాను. రాజా! విను. (28-30)
దుర్యోధన ఉవాచ
ద్రోణశ్చ త్వం చ శల్యశ్చ కృపో ద్రౌణిస్తథైవ చ ।
కృతవర్మా చ హార్దిక్యః కాంబోజశ్చ సుదక్షిణః ॥ 31
భూరిశ్రవా వికర్ణశ్చ భగదత్తశ్చ వీర్యవాన్ ।
మహారథాః సమాఖ్యాతాః కులపుత్రాస్తనుత్యజః ॥ 32
దుర్యోధనుడిలా అడిగాడు.
'నీవు, ద్రోణుడు, శల్యుడు, కృపుడు, అశ్వత్థామ, హృదికుని కొడుకయిన కృతవర్మ, కాంబోజరాజు సుదక్షిణుడు, భూరిశ్రవుడు, వికర్ణుడు, పరాక్రమశాలి అయిన భగదత్తుడు వీరంతా మహారథులుగా పేరుగన్న వారు. అందరూ కులీనులు. నాకోసం యుద్ధంలో శరీరాన్ని త్యజించేవారు. (31,32)
త్రయాణామపి లోకానాం పర్యాప్తా ఇతి మే మతిః ।
పాండవానాం సమస్తాశ్చ నాతిష్ఠంత పరాక్రమే ॥ 33
మూడులోకాలకు కూడా వారు చాలినవారని నా అభిప్రాయం. కానీ వీరంతా పాండవుల పరాక్రమం ముందు నిలువలేకపోయారు. (33)
తత్ర మే సంశయో జాతః తన్మమాచక్ష్వ పృచ్ఛతః ।
యం సమాశ్రిత్య కౌంతేయః జయంత్యస్మాన్ క్షణే క్షణే ॥ 34
ఇక్కడ నాకొక సందేహముంది. అడుగుతున్నాను చెప్పు. యుధిష్ఠిరుడు దేనినాశ్రయించి ప్రతిక్షణమూ మనలను గెలవగలుగుతున్నాడు?' (34)
భీష్మ ఉవాచ
శృణు రాజన్ వచో మహ్యం యథా వక్ష్యామి కౌరవ ।
బహుశశ్చ మయోక్తోఽసి న చ మే తత త్వయా కృతమ్ ॥ 35
భీష్ముడిలా చెప్తున్నాడు. 'రాజా! కౌరవా! నా మాట విను. యథార్థాన్ని చెపుతాను. నేను ఇంతకు ముందే చాలాసార్లు చెప్పాను. కానీ దానిని నీవు పాటించలేదు. (35)
క్రియతాం పాండవైః సార్థం శమో భరతసత్తమ ।
ఏతత్ క్షేమమహం మన్యే పృథివ్యాస్తవ నా విభో ॥ 36
భరతసత్తమా! రాజా! పాండవులతో సంధి చేసుకో. ఇది నీకూ, లోకానికీ క్షేమమని భావిస్తున్నాను. (36)
భుంక్ష్వేమాం పృథివీం రాజన్ భ్రాతృభిః సహితః సుఖీ ।
దుర్హృదస్తాపయన్ సర్వాన్ నందయంశ్చాపి బాంధవాన్ ॥ 37
రాజా! సోదరులతో కలిసి దుష్టులను తపింపజేతూ, బంధువులను ఆనందింపజేస్తూ సుఖంగా ఈ రాజ్యాన్ని అనుభవించు. (37)
న చ మే క్రోశతస్తాత శ్రుతవానసి వై పురా ।
తదిదం సమనుప్రాప్తం యత్ పాండూనవమన్యసే ॥ 38
నాయనా! నేనెంత మొత్తుకొన్నా గతంలో నా మాట వినలేదు. పాండవులను పరాభవించిన ఫలితం - ఇదిగో ఇలా సంభవించింది. (38)
యశ్చ హేతురవధ్యత్వే తేషామక్లిష్టకర్మణామ్ ।
తం శృణుష్వ మహాబాహో మమ కీర్తయతః ప్రభో ॥ 39
మహాబాహూ! వారు అనాయాసంగా కార్యాన్ని సాధించగలవారు. వారు మనకు అలవికాక పోవటానికి కారణాన్ని వివరిస్తాను. రాజా! విను. (39)
నాస్తి లోకేషు తద్ భూతం భవితా నో భవిష్యతి ।
యో జయేత్ పాండవాన్ సర్వాన్ పాలితాన్ శార్ ఙ్గధన్వనా ॥ 40
(ససురాసురమర్త్యేషు యో విద్యాత్ తత్తతో హరిమ్) ।
శార్ ఙ్గధన్వి అయిన శ్రీకృష్ణుడు రక్షిస్తున్నంతకాలం పాండవులను గెలవగలవాడు ఇప్పుడు లేడు. గతంలోనూ లేడు, భవిష్యత్తులోనూ కలగడు. దేవదానవమానవులలో వాస్తవంగా శ్రీకృష్ణుని తెలిసినవాడు లేడు. (40)
యత్ తు మే కథితం తాత మునిభిర్భావితాత్మభిః ।
పురాణగీతం ధర్మజ్ఞ తచ్ఛృణుష్వ యథాతథమ్ ॥ 41
నాయనా! ధర్మజ్ఞా! పవిత్ర హృదయులైన మునులు పురాణోక్తమైన విషయాన్ని నాకు చెప్పారు. దాన్ని యథాతథంగా చెపుతా విను. (41)
పురా కిల సురాః సర్వే ఋషయశ్ఛ సమాగతాః ।
పితామహముపాసేదుః పర్వతే గంధమాదనే ॥ 42
గతంలో దేవత లందరూ, ఋషులూ ఒక్కటై గంధమాదన పర్వతంపై బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు. (42)
తేషాం మధ్యే సమాసీనః ప్రజాపతిరపశ్యత ।
విమానం ప్రజ్వలద్ భాసా స్థితం ప్రవరమంబరే ॥ 43
వారి మధ్య కూర్చొనియున్న ప్రజాపతి ఆకాశంలో కాంతితో ప్రజ్వలిస్తున్న శ్రేష్ఠవిమానాన్ని చూశాడు. (43)
ధ్యానేనావేద్య తద్ బ్రహ్మా కృత్వా చ నియతోఽంజలిమ్ ।
నమశ్చకార హృష్టాత్మా పురుషం పరమేశ్వరమ్ ॥ 44
ధ్యానంతో దానిని తెలుసుకొని, బ్రహ్మ ఆనందించి, పరమేశ్వరుడైన ఆ పురుషునికి నియమబద్ధంగా చేతులు జోడించి, నమస్కరించాడు. (44)
ఋషయస్త్వథ దేవాశ్చ దృష్ట్వా బ్రహ్మాణముత్థితమ్ ।
స్థితాః ప్రాంజలయః సర్వే పశ్యంతో మహదద్భుతమ్ ॥ 45
అప్పుడు ఋషులు, దేవతలు కూడా లేచి, నిలిచిన బ్రహ్మను చూసి, ఆ మహాద్భుతాన్ని గమనిస్తూ అందరూ అంజలించి, నిలిచారు. (45)
యథావచ్చ తమభ్యర్చ్య బ్రహ్మా బ్రహ్మవిదాం వరః ।
జగాద జగతః స్రష్టా పరం పరమధర్మవిత్ ॥ 46
బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు, జగత్ స్రష్ట, పరమధర్మవేత్త అయిన బ్రహ్మ యథావిధిగా ఆయనను అర్చించి, ఇలా స్తుతించాడు. (46)
విశ్వావసుర్విశ్వమూర్తిర్విశ్వేశో
విష్వక్సేనో విశ్వకర్మా వశీ చ ।
విశ్వేశ్వరో వాసుదేవోఽసి తస్మాద్
యోగాత్మానం దైవతం త్వాముపైమి ॥ 47
'నీవు విశ్వావసువువు, విశ్వమూర్తివి, విశ్వేశుడవు, విష్వక్సేనుడవు, విశ్వకర్మవు, వశివి, విశ్వేశ్వరుడవు, వాసుదేవుడవు. కాబట్టి యోగాత్ముడవు, దైవతానివి అయిన నిన్ను శరణుగోరుతున్నాను. (47)
జయ విశ్వ మహాదేవ జయ లోకహితే రత ।
జయ యోగీశ్వర విభో జయ యోగపరావర ॥ 48
విశ్వరూపా! మహాదేవా! నీకు జయం. లోకహితాసక్తా! నీకు జయం. యోగీశ్వరా! విభో! జయం. యోగం యొక్క ఆద్యంత రూపుడవు. నీకు జయం. (48)
పద్మగర్భ విశాలాక్ష జయ లోకేశ్వరేశ్వర ।
భూతభవ్యభవన్నాథ జయ సౌమ్యాత్మజాత్మజ ॥ 49
అసంఖ్యేయగుణాధార అయ సర్వపరాయణ ।
నారాయణ సుదుష్పార జయ శార్ ఙ్గధనుర్ధర ॥ 50
పద్మగర్భా! విశాలాక్షా! లోకేశ్వరేశ్వరా! నీకు జయం. భూతభవ్య భవన్నాథా! సౌమ్యా! ఆత్మజాత్మజా! నీకు జయం. లెక్కింపవీలుగాని గుణాలకు ఆధారం నీవే! సర్వపరాయణుడవు. నీకు జయం. నారాయణా! సుదుష్పారా! శార్ ఙ్గధనుర్ధరా! నీకు జయం. (49,50)
జయ సర్వగుణోపేత విశ్వమూర్తే నిరామయ ।
విశేశ్వర మహాబాహో జయ లోకార్థతత్పర ॥ 51
సర్వగుణోపేతా! విశ్వమూర్తీ! నిరామయా! నీకు జయం. విశ్వేశ్వరా! మహాబాహో! లోకార్థ తత్పరా! నీకు జయం. (51)
మహోరగ వరాహాద్య హరికేశ విభో జయ ।
హరివాస దిశామీశ విశ్వవాసామితావ్యయ ॥ 52
మహోరగా! ఆదివరాహా! హరికేశా! విభూ! నీకు జయం. హరివాస! దిగీశా! విశ్వవాసా! అమితా! అవ్యయా! నీకు జయం. (52)
వ్యక్తావ్యక్తామితస్థాన నియతేంద్రియ సత్క్రియ ।
అసంఖ్యేయాత్మభావజ్ఞ జయ గంభీర కామద ॥ 53
వ్యక్తావ్యక్తా! అమితస్థానా! నియతేంద్రియా! సత్క్రియా! అసంఖ్యేయా! ఆత్మభావజ్ఞా! గంభీరా! కామదా! నీకు జయం. (53)
అనంతవిదిత బ్రహ్మాన్ నిత్య భూతవిభావన ।
కృతకార్య కృతప్రజ్ఞ ధర్మజ్ఞ విజయావహ ॥ 54
అనంతవిదితా! బ్రహ్మరూపా! నిత్యా! భూతవిభావనా! కృతకార్యా! కృతప్రజ్ఞా! ధర్మజ్ఞా! విజయావహా! (54)
గుహ్యాత్మన్ సర్వయోగాత్మన్ స్ఫుటం సంభూతసంభవ ।
భూతాద్య లోకతత్త్వేశ జయ భూతవిభావన ॥ 55
గుహ్యాత్మా! సర్వయోగాత్మా! స్ఫుటా! సంభూతసంభవా! భూతాద్యా! లోకతత్త్వ! ఈశా! భూతవిభావనా! నీకు జయం. (55)
ఆత్మయోనే మహాభాగ కల్పసంక్షేప తత్పర ।
ఉద్భావనమనోభావ జయ బ్రహ్మ జనప్రియ ॥ 56
ఆత్మయోనీ! మహాభాగా! కల్పసంక్షేపా! తత్పరా! ఉద్భావనమనోభావా! బ్రహ్మస్వరూపా! జనప్రియా! నీకు జయం. (56)
నిసర్గసర్గనిరత కామేశ పరమేశ్వర ।
అమృతోద్భవ సద్భావ ముక్తాత్మన్ విజయప్రద ॥ 57
నిసర్గసర్గనిరతా! కామేశా! పరమేశ్వరా! అమృతోద్భవా! సద్భావా! ముక్తాత్మా! విజయప్రదా! (57)
ప్రజాపతిపతే దేవ పద్మనాభ మహాబల ।
ఆత్మభూత మహాభూత సత్త్వాత్మన్ జయ సర్వదా ॥ 58
ప్రజాపతి పతీ దేవా! పద్మనాభా! మహాబలా! ఆత్మభూత! మహాభూత! సత్త్వస్వరూపా! నీకు సదా విజయం. (58)
పాదౌ తవ ధరా దేవీ దిశో బాహూ దివం శిరః ।
మూర్తిస్తేహం సురాః కాయః చంద్రాదుత్యౌ చ చక్షుషీ ॥ 59
భూదేవి నీ పాదాలు. దిక్కులు నీ బాహువులు. ఆకాశం నీ శిరస్సు. నేను నీ శరీరం. దేవతలు అంగాలు. చంద్రసూర్యులు కన్నులు. (59)
బలం తపశ్చ సత్యం చ కర్మ ధర్మాత్మకం తవ ।
తేజోగ్నిః పవనః శ్వాసః ఆపస్తే స్వేదసంభవాః ॥ 60
తపస్సు, సత్యమూ నీ బలం. కర్మధర్మాలు నీ స్వరూపం. అగ్ని నీ తేజస్సు. గాలి నీ శ్వాస. నీరు నీ స్వేదం నుండి పుట్టింది. (60)
అశ్వినౌ శ్రవణౌ నిత్యం దేవీ జిహ్వా సరస్వతీ ।
వేదాః సంస్కారనిష్ఠా హి త్వయీదం జగదాశ్రితమ్ ॥ 61
అశ్వినులు నీ చెవులు. సరస్వతీదేవి నీ నాలుక. వేదాలు నీసంస్కారంతో నిలుస్తాయి. ఈ జగత్తు నిన్ను ఆశ్రయించి ఉంటుంది. (61)
న సంఖ్యానం పరీమాణం న తేజో న పరాక్రమమ్ ।
న బలం యోగయోగీశ జానీమస్తే న సంభవమ్ ॥ 62
యోగయోగీశా! నీ వయస్సును గానీ, నీ పరిమాణాన్ని కానీ, నీ తేజస్సును కానీ, నీ పరాక్రమాన్ని కానీ, నీ బలాన్ని కానీ, నీ పుట్టుకను కానీ మేమెరుగము. (62)
త్వద్భక్తినిరతా దేవ నియమైస్త్వాం సమాశ్రితాః ।
అర్చయామః సదా విష్ణో పరమేశం మహేశ్వరమ్ ॥ 63
ఋషయో దేవగంధర్వాః యక్షరాక్షసపన్నగాః ।
పిశాచా మానుషాశ్చైవ మృగపక్షిసరీసృపాః ॥ 64
ఏవమాది మయా సృష్టం పృథివ్యాం త్వత్ప్రసాదజమ్ ।
దేవా! నీ మీదిభక్తిలో ఆసక్తులం. నియమపూర్వకంగా నిన్ను ఆశ్రయించాం. విష్ణూ! పరమేశుడవు, మహేశ్వరుడవు అయిన నిన్ను సదా అర్చిస్తాం. ఋషులు, దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, పన్నగులు, పిశాచాలు, మనుష్యులు, మృగాలు, పక్షులు, పాములు - ఇవన్నీ నేల మీద నేను సృష్టించినది నీ అనుగ్రహం వలననే. (63, 64 1/2)
పద్మనాభ విశాలాక్ష కృష్ణ దుఃఖప్రణాశన ॥ 65
త్వం గతిః సర్వభూతానాం త్వం నేతా త్వం జగద్గురుః ।
త్వత్ప్రసాదేన దేవేశ సుఖినో విబుధాః సదా ॥ 66
పద్మనాభా! విశాలాక్షా! కృష్ణా! దుఃఖప్రణాశనా! సర్వ ప్రాణులకు నీవే గతి. నీవే నడిపించేవాడవు. జగద్గురువువు నీవే. దేవేశా! నీ అనుగ్రహం వలననే దేవతలు ఎప్పుడూ సుఖంగా ఉండగలుగుతున్నారు. (65,66)
పృథివీ నిర్భయా దేవ త్వత్ప్రసాదాత్ సదాభవత్ ।
తస్మాద్ భవ విశాలాక్ష యదువంశవివర్ధనః ॥ 67
దేవా! నీ అనుగ్రహం వలననే పృథివి ఎప్పుడూ సుఖంగా నిలువగలిగింది. అందువలన విశాలాక్షా! యదువంశవర్ధనుడవు కమ్ము. (67)
ధర్మసంస్థాపనార్థాయ దైత్యానాం చ వధాయ చ ।
జగతో ధారణార్థాయ విజ్ఞాప్యం కురు మే విభో ॥ 68
విభూ! ధర్మసంస్థాపన కోసం, రాక్షస సంహారం కోసం, జగద్ధారణకోసం నా విన్నపాన్ని పాటించు. (68)
యత్ తత్ పరమకం గుహ్యం త్వత్ప్రసాదాదిదం విభో ।
వాసుదేవ తదేతత్ తే మయోద్గీతం యథాతథమ్ ॥ 69
విభూ! వాసుదేవా! పరమరహస్యమైన నీ తత్త్వాన్ని నీ అనుగ్రహం వలననే నేను ఇలా యథాతథంగా కీర్తిస్తున్నాను. (69)
సృష్ట్వా సంకర్షణం దేవం స్వయమాత్మానమాత్మనా ।
కృష్ణ త్వమాత్మనాస్రాక్షీః ప్రద్యుమ్నం చాత్మసంభవమ్ ॥ 70
కృష్ణా! నీవు స్వయంగా నిన్ను సంకర్షణుడవుగా సృష్టించుకొన్నావు. నీ ద్వారానే ఆత్మజరూపంగా ప్రద్యుమ్నుని సృష్టించావు. (70)
ప్రద్యుమ్నాదనిరుద్ధం త్వం యం విదుర్విష్ణుమవ్యయమ్ ।
అనిరుద్ధోఽసృజన్మాం వై బ్రహ్మాణం లోకధారిణమ్ ॥ 71
ప్రద్యుమ్నుని ద్వారా అనిరుద్ధుని సృష్టించావు. అనిరుద్ధునే అవ్యయవిష్ణు స్వరూపంగా జ్ఞానులు భావిస్తారు. ఆ అనిరుద్ధుడే లోకవిధాత నయిన బ్రహ్మను - నన్ను సృష్టించాడు. (71)
వాసుదేవమయః సోఽహం త్వయైవాస్మి వినిర్మితః ।
(తస్మాద్ యాచామి లోకేశ చతురాత్మానమాత్మనా) ।
విభజ్య భాగశోఽఽత్మానం వ్రజ మానుషతాం విభో ॥ 72
ప్రభూ! నన్ను నీవే సృష్టించావు కాబట్టి నేను కూడా వాసుదేవమయుడనే. లోకేశా! అందువలననే ప్రార్థిస్తున్నాను. నిన్ను నీవు నాలుగు రూపాలుగా విభజించుకొని మానవరూపాన్ని ధరించు. (72)
తత్రాసురవధం కృత్వా సర్వలోకసుఖాయవై ।
ధర్మం ప్రాప్య యశః ప్రాప్య యోగం ప్రాప్స్యసి తత్త్వతః ॥ 73
అక్కడ సర్వలోక సుఖాన్ని కోరి రాక్షసులను సంహరించి ధర్మాన్ని, కీర్తిని విస్తరింపజేయగలవు. మరలా నీ యథార్థరూపంలో కలిసిపోగలవు. (73)
త్వాం హి బ్రహ్మర్షయో లోకే దేవాశ్చామితవిక్రమ ।
తైస్తైర్హి నామభిర్యుక్తాః గాయంతి పరమాత్మకమ్ ॥ 74
అమిత పరాక్రమా! లోకంలోని బ్రహ్మర్షులు, దేవతలు సావధానులై ఆయా నామాలతో పరమాత్మవైన నిన్ను స్తుతిస్తారు.
స్థితాశ్చ సర్వే త్వయి భూతసంఘాః
కృత్వాఽఽశ్రయం త్వాం వరదం సుబాహో
అనాదిమధ్యాంతమపారయోగం
లోకస్య సేతుం ప్రవదంతి విప్రాః ॥ 75
సుబాహూ! వరదుడవైన నిన్ను ఆశ్రయించి, సమస్త ప్రాణిసంఘాలు నీలోనే నిలిచి ఉన్నాయి. ఆది మధ్యాంత రహితుడవని, ఏ హద్దులూ లేనివాడవని, లోక మర్యాదలకు, సేతువు వంటివాడవని విప్రులు నీ గురించి చెపుతారు.' (75)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి విశ్వోపాఖ్యానే పంచషష్టితమోఽధ్యాయః ॥ 65 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భీష్మవధపర్వమను ఉపపర్వమున విశ్వోపాఖ్యానమను అరువది అయిదవ అధ్యాయము. (65)
(దాక్షిణాత్య అధికపాఠం 1 శ్లోకంతో కలిపి 76 శ్లోకాలు)