64. అరువది నాలుగవ అధ్యాయము

భీమఘటోత్కచుల పరాక్రమము - నాల్గవరోజు యుద్ధసమాప్తి.

సంజయ ఉవాచ
తతో భూరిశ్రవా రాజన్ సాత్యకిం నవభిః శరైః ।
ప్రావిధ్యద్ భృశసంక్రుద్ధః తోత్రైరివ మహాద్విపమ్ ॥ 1
సంజయుడిలా చెప్తున్నాడు.
"రాజా! ఆపై భూరిశ్రవుడు తీవ్రంగా కోపించి, అంకుశాలతో ఏనుగులను పొడిచినట్లు తొమ్మిదిబాణాలతో సాత్యకిని గాయపరిచాడు. (1)
కౌరవం సాత్యకిశ్చైవ శరైః సన్నతపర్వభిః ।
అవారయదమేయాత్మా సర్వలోకస్య పశ్యతః ॥ 2
అమేయబలుడైన సాత్యకి బాగా వంగిన కణుపులు గల బాణాలతో అందరూ చూస్తుండగానే భూరిశ్రవుని నిలువరించాడు. (2)
తతో దుర్యోధనో రాజా సోదర్యైః పరివారితః ।
సౌమదత్తిం రణే యత్తః సమంతాత్ పర్యవారయత్ ॥ 3
ఆ తరువాత సుయోధనుడు తనసోదరులు చుట్టూ నిలువగా యుద్ధసన్నద్ధుడై, భూరిశ్రవుని కన్నివైపులా రక్షణగా నిలిచాడు. (3)
తం చైవ పాండవాః సర్వే సాత్యకిం రభసం రణే ।
పరివార్య స్థితాః సంఖ్యే సమంతాత్ సుమహౌజసః ॥ 4
మహాతేజస్వులయిన పాండవులందరూ రణరంగంలో వేగంగా ముందుకువెళ్తున్న సాత్యకికి అన్ని వైపులా వలయంగా, రక్షగా నిలిచారు. (4)
భీమసేనస్తు సంక్రుద్ధః గదాముద్యమ్య భారత ।
దుర్యోధనముఖాన్ సర్వాన్ పుత్రాంస్తే పర్యవారయత్ ॥ 5
భారతా! సంక్రుద్ధుడైన భీమసేనుడు గదను ఎత్తి, దుర్యోధనుడు మొదలుగా గల నీ కుమారుల నందరినీ నిరోధించాడు. (5)
రథైరనేకసాహస్త్రైః క్రోధామర్షసమన్వితః ।
నందకస్తవ పుత్రస్తు భీమసేనం మహాబలమ్ ॥ 6
వివ్యాధ విశిఖైః షడ్ భిః కంకపత్రైః శిలాశితైః ।
కోపంతోనూ, అసహనంతోనూ, కూడిఉన్న నీ కొడుకు నందకుడు ఎన్నోవేల రథికులతో వచ్చి ఆరుబాణాలతో మహాబలుడైన భీమసేనుని గాయపరిచాడు. ఆ బాణాలు గ్రద్ధ ఈకలు గలవి, పదునైనవి, రాతిపై పదును పెట్టబడినవి. (6 1/2)
దుర్యోధనశ్చ సమరే భీమసేనం మహారథమ్ ॥ 7
ఆజఘానోరసి క్రుద్ధః మార్గణైర్నవభిః శితైః ।
దుర్యోధనుడు కూడా కోపించి యుద్ధంలో తొమ్మిది పదునైన బాణాలతో మహారథుడైన భీమసేనుని వక్షఃస్థలంపై కొట్టాడు. (7 1/2)
తతో భీమో మహాబాహుః స్వరథం సుమహాబలః ॥ 8
ఆరురోహ రథశ్రేష్ఠం విశోకం చేదమబ్రవీత్ ।
ఆ పై మహాబాహువు, మహాబలుడు అయిన భీముడు రథాలలో శ్రేష్ఠమైన తన రథాన్ని ఎక్కి, విశోకునితో (సారథితో) ఇలా అన్నాడు. (8 1/2)
ఏతే మహారథాః శూరాః ధార్తరాష్ట్రాః సమాగతాః ॥ 9
మామేవ భృశసంక్రుద్ధాః హంతుమభ్యుద్యతా యుధి ।
"మహారథులు, శూరులు అయిన ఈ ధృతరాష్ట్రకుమారులు యుద్ధంలో నన్ను చంపాలనే తీవ్రకోపంతో ఇటు వస్తున్నారు. (9 1/2)
మనోరథద్రుమోఽస్మాకం చింతితో బహువార్షికః ॥ 10
సఫలః సూత చాద్యేహ యోఽహం పశ్యామి సోదరాన్ ।
సూతా! ఎన్నో సంవత్సరాల నుండి నేను తలచుకొంటున్న మా మనోరథవృక్షం నేడు సఫలం కావాలి. దుర్యోధనుని సోదరుల నందరినీ నేను చూడగలుగుతున్నాను. (10 1/2)
యత్రాశోక సముత్ క్షిప్తాః రేణవో రథనేమిభిః ॥ 11
ప్రయాస్యంత్యంతరిక్షం హి శరవృందైర్దిగంతరే ।
తత్ర తిష్ఠతి సన్నద్ధః స్వయం రాజా సుయోధనః ॥ 12
అశోకా! రథచక్రాలు లేపిన ధూళిరేణువులు బాణసమూహాలతో పాటు ఆకాశంలో, దిగంతాలవైపు వెళ్తున్న ప్రదేశంలోనే సుయోధనరాజు స్వయంగా యుద్ధసన్నద్ధుడై నిలిచియున్నాడు. (11,12)
భ్రాతరశ్చాస్య సన్నద్ధాః కులపుత్రా మదోత్కటాః ।
ఏతానద్య హనిష్యామి పశ్యతస్తే న సంశయః ॥ 13
తస్మాన్మమాశ్వాన్ సంగ్రామే యత్తః సంయచ్ఛ సారథే ।
సారథీ! కులపుత్రులు, మదోన్మత్తులు అయిన ఆ సుయోధనుని సోదరులు కూడా యుద్ధ సన్నద్ధులై ఉన్నారు. వీరినందరినీ ఈ రోజు నీ ఎదుటనే చంపబోతున్నాను. కాబట్టి సావధానంగా రణభూమిలో నా గుర్రాలను నడిపించు." (13 1/2)
ఏవముక్త్వా తతః పార్థః తవ పుత్రం విశాంపతేః ॥ 14
వివ్యాధ దశభిస్తీక్ ష్ణైః శరైః కనకభూషణైః ।
నందకం చ త్రిభిర్బాణైః అభ్యవిధ్యత్ స్తనాంతరే ॥ 15
రాజా! అలా పలికిన తరువాత భీమసేనుడు స్వర్ణాలంకరణలు గల పది పదునైన బాణాలతో నీకుమారుని సుయోధనుని గాయపరిచాడు. మూడు బాణాలతో నందకుని కూడా ఛాతీపై గాయపరిచాడు. (14,15)
తం తు దుర్యోధనః షష్ట్యా విద్ ధ్వా భీమం మహాబలమ్ ।
త్రిభిరన్యైః సునిశితైః విశోకం ప్రత్యవిధ్యత ॥ 16
మహాబలుడైన ఆ భీముని దుర్యోధనుడు అరవైబాణాలతో గాయపరిచి, మరో మూడు వాడి బాణాలతో విశోకుని (సారథిని) గాయపరిచాడు. (16)
భీమస్య చ రణే రాజన్ ధనుశ్చిచ్ఛేద భాసురమ్ ।
ముష్టిదేశే భృశం తీక్ ష్ణైః త్రిభిర్భల్లైర్హసన్నివ ॥ 17
రాజా! దుర్యోధనుడు రణభూమిలో బాగా పదునెక్కి ఉన్న మూడు భల్లాలతో ప్రకాశవంతమైన భీముని ధనుస్సును నవ్వుతూ మధ్యకు విరగగొట్టాడు.
సమరే ప్రేక్ష్య యంతారం విశోకం తు వృకోదరః ।
పీడితం విశిఖైస్తీక్ష్ణైః తవ పుత్రేణ ధన్వినా ॥ 18
అమృష్యమాణః సంరబ్ధః ధనుర్దివ్యం పరామృశత్ ।
పుత్రవ్య తే మహారాజ వధార్థం భరతర్షభ ॥ 19
సమాధత్త సుసంక్రుద్ధః క్షురప్రం లోమవాహినమ్ ।
తేన చిచ్ఛేద నృపతేః భీమః కార్ముకముత్తమమ్ ॥ 20
ధనుర్ధారి అయిన నీ కొడుకు మూడు వాడి బాణాలతో రణభూమిలో తన సారథిని (విశోకుని) గాయపరచటాన్ని భీముడు సహించలేకపోయాడు. మహారాజా! భరతర్షభా! నీ కుమారుని చంపటానికై కోపంగా, వేగంగా దివ్యధనుస్సును చేపట్టాడు. రెక్కలు గల క్షురప్రాన్ని ఎక్కుపెట్టి, దానితో సుయోధనుని మేటివింటిని విరిచాడు. (18-20)
సోఽ పవిద్ధ్య ధనుశ్చిన్నం పుత్రస్తే క్రోధమూర్చ్ఛితః ।
అన్యత్ కార్ముకమాదత్త సత్వరం వేగవత్తరమ్ ॥ 21
క్రోధమూర్చితుడైన నీ కొడుకు విరిగిన వింటిని విసిరి పడవేసి, అంతకన్న వేగం గల మరొక వింటిని వెంటనే స్వీకరించాడు. (21)
సందధే విశిఖం ఘోరం కాలమృత్యుసమప్రభమ్ ।
తేవాజఘాన సంక్రుద్ధః భీమసేనం స్తనాంతరే ॥ 22
ప్రళయకాల మృత్యువు వంటి కాంతి గల భయంకర బాణాన్ని ఎక్కుపెట్టాడు. దానితో కోపంగా భీమసేనుని ఱౌమ్ముపై కొట్టాడు. (22)
స గాఢవిద్ధో వ్యథితః స్యంధనోపస్థ ఆవిశత్ ।
స విషణ్ణో రథోపస్థే మూర్చ్ఛామభిజగామ హ ॥ 23
భీమసేనుడు తీవ్రంగా గాయపడి, బాధతో రథం మీది ఆసనంపై కూలబడ్డాడు. కూలబడుతూనే మూర్ఛిల్లాడు. (23)
తం దృష్ట్వా వ్యథితం భీమమ్ అభిమన్యుపురోగమాః ।
నామృష్యంత మహేష్వాసాః పాండవానాం మహారథాః ॥ 24
భీముడు గాయపడటాన్ని చూసి, మేటి విలుకాండ్రు, మహారథులు అయిన అభిమన్యుడు మొదలగు పాండవులు దానిని సహించలేకపోయారు. (24)
తతస్తు తుములాం వృష్టిం శస్త్రాణాం తిగ్మతేజసామ్ ।
పాతయామాసు రవ్యగ్రాః పుత్రస్య తవ మూర్ధని ॥ 25
ఆ పై వారందరూ నీ కుమారుని తలపై నిర్భయంగా మహాతేజస్సు గల బాణాలను ఒక్కుమ్మడిగా భయంకరంగా కురిపించారు. (25)
ప్రతిలభ్య తతః సంజ్ఞాం భీమసేనో మహాబలః ।
దుర్యోధనం త్రిభిర్విద్ ధ్వా పునర్వివ్యాధ పంచభిః ॥ 26
ఆ తరువాత మహాబలుడైన భీమసేనుడు మూర్ఛనుండి తేరుకొని మూడు బాణాలతో దుర్యోధనుని చీల్చి మరల అయిదు బాణాలతో గాయపరిచాడు. (26)
శల్యం చ పంచవింశత్యా శరైర్వివ్యాధ పాండవః ।
రుక్మపుంఖైర్మహేష్వాసః స విద్ధో వ్యపయాద్ రణాత్ ॥ 27
మేటి విలుకాడైన భీమసేనుడు బంగారు రెక్కలు గల ఇరవై అయిదు బాణాలతో శల్యుని గాయపరిచాడు. దెబ్బతిన్న శల్యుడు రణభూమి నుండి పారిపోయాడు. (27)
ప్రత్యుద్యయుస్తతో భీమం తవ పుత్రాశ్చతుర్దశ ।
సేనాపతిః సుషేణశ్చ జలసంధః సులోచనః ॥ 28
ఉగ్రో భీమరథో భీమః వీరబాహురలోలుపః ।
దుర్ముఖో దుష్ప్రధర్దశ్చ వివిత్సుర్వికటః సమః ॥ 29
విసృజంతో బహూన్ బాణాన్ క్రోధసంరక్తలోచనాః ।
భీమసేనమభిద్రుత్య వివ్యధుః సహితా భృశమ్ ॥ 30
రాజా! ఆ తరువాత నీ కొడుకులు పదునలుగురు సేనాపతి, సుషేణుడు, జలసంధుడు, సులోచనుడు, ఉగ్రుడు, భీమరథుడు, భీముడు, వీరబాహువు, అలోలుపుడు, దుర్ముఖుడు, దుష్ప్రధర్షుడు, వివిత్సుడు, వికటుడు, సముడు - కోపంతో కన్నెర్రజేసి, అందరూ ఒక్కటై అనేక బాణాలను ప్రయోగిస్తూ, భీమసేనునిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. (28-30)
పుత్రాంస్తు తవ సంప్రేక్ష్య భీమసేనో మహాబలః ।
సృక్కిణీ విలిహన్ వీరః పశుమధ్యే యథా వృకః ॥ 31
అభిపత్య మహాబాహుః గరుత్మానివ వేగితః ।
సేనాపతేః క్షురప్రేణ శిరశ్చిచ్ఛేద పాండవః ॥ 32
నీ కుమారులను గమనించి మహాబాహువు మహాబలుడు, వీరుడు అయిన భీమసేనుడు పశువుల మధ్యలో తోడేలులా నిలిచి, తన పెదవుల కొనలను నాకుతూ, వేగంగా దూకుతున్న గరుత్మంతుని వలె వెళ్ళి, సేనాపతి శిరస్సును క్షురప్రంతో ఖండించాడు. (31,32)
సంప్రహస్య చ హృష్టాత్మా త్రిభిర్బాణైర్మహాభుజః ।
జలసంధం వినిర్భిద్య సోఽనయద్ యమసాదనమ్ ॥ 33
దానితో ఆనందించి, పెద్దపెట్టున నవ్వి, మహాభుజుడైన భీమసేనుడు మూడు బాణాలతో జలసంధుని చీల్చి, అతనిని యమలోకానికి పంపాడు. (33)
సుషేణం చ తతో హత్వా ప్రేషయామాస మృత్యవే ।
ఉగ్రస్య సశిరస్త్రాణం శిరశ్చంద్రోపమం భువి ॥ 34
పాతయామాస భల్లేన కుండలాభ్యాం విభూషితమ్ ।
ఆపై సుషేణుని చంపి మృత్యువు దగ్గరకు పంపాడు. కుండలాలతో అలంకరింపబడిన ఉగ్రుని తలను ఒక భల్లంతో శిరస్త్రాణంతో సహా నేలగూల్చాడు. (34 1/2)
వీరబాహుం చ సప్తత్యా సాశ్వకేతుం ససారథిమ్ ॥ 35
నినాయ సమరే వీరః పరలోకాయ పాండవః ।
ఆపై భీమసేనుడు డెబ్బయి బాణాలతో గుర్రాలతో, సారథితో, ధ్వజంతో సహా వీరబాహువును రణభూమి నుండి పరలోకానికి పంపాడు. (35 1/2)
భీమభీమరథౌ చోభౌ భీమసేనో హసన్నివ ॥ 36
పుత్రౌ తే దుర్మదౌ రాజన్ అనయద్ యమసాదనమ్ ।
రాజా! యుద్ధ దుర్మదులైన నీ కొడుకులు-భీమ, భీమరథుల-నిద్దరినీ భీమసేనుడు నవ్వుతూ యమసదనానికి పంపాడు. (36 1/2)
తతః సులోచనం భీమః క్షురప్రేణ మహామృధే ॥ 37
మిషతాం సర్వసైన్యానామ్ అనయద్ యమసాదనమ్ ।
ఆ తరువాత ఆ మహాసంగ్రామంలో భీమసేనుడు ఒక క్షురప్రంతో సర్వసేనలు చూస్తుండగానే సులోచనుని యమలోకానికి పంపించాడు. (37 1/2)
పుత్రాస్తు తవ తం దృష్ట్వా భీమసేనపరాక్రమమ్ ॥ 38
శేషా యేఽన్యేఽభవంస్తత్ర తే భీమస్య భయార్దితాః ।
విప్రద్రుతా దిశో రాజన్ వధ్యమానా మహాత్మనా ॥ 39
రాజా! అక్కడ మిగిలి ఉన్న నీ కొడుకు లందరూ భీమసేన పరాక్రమాన్ని చూసి భయపీడితులై, మహాత్ముడైన ఆ భీమసేనుని బాణాల దెబ్బలు తింటూ దిక్కుల వెంట పారిపోయారు. (38,39)
తతోఽబ్రవీచ్ఛాంతనవః సర్వానేవ మహారథాన్ ।
ఏష భీమో రణే క్రుద్ఢః ధార్తరాష్రాన్ మహారథాన్ ॥ 40
యథా ప్రాగ్య్రాన్ యథా జ్యేష్ఠాన్ యథా శురాంశ్చ సంగతాన్ ।
నిపాతయత్యుగ్రధన్వా తం ప్రగృహ్ణీత మా చిరమ్ ॥ 41
అప్పుడు భీష్ముడు తన మహారథులందరితో ఇలా అన్నాడు - "మేటి విలుకాలుడైన ఈ భీముడు క్రుద్ధుడై తన నెదిరించిన శ్రేష్ఠ, జ్యేష్ఠ, శూర, మహారథులయిన ధృతరాష్ట్ర కుమారులను చంపి వేస్తున్నాడు. ఆలస్యం చేయకుండా చుట్టుముట్టండి!" (40,41)
ఏవముక్తాస్తతః సర్వే ధార్తరాష్ట్రస్య సైనికాః ।
అభ్యద్రవంత సంక్రుద్ధాః భీమసేనం మహాబలమ్ ॥ 42
భీష్ముడిలా చెప్పగానే ధార్తరాష్ట్రుని సైనికులందరూ కోపంతో మహాబలుడైన భీమసేనుని మీదకు వచ్చారు. (42)
భగదత్తః ప్రభిన్నేవ కుంజరేణ విశాంపతే ।
అభ్యయాత్ సహసా తత్ర యత్ర భీమో వ్యవస్థితః ॥ 43
రాజా! భగదత్తుడు మదపుటేనుగు నెక్కి భీముడున్న చోటికి వెంటనే వచ్చాడు. (43)
ఆపతన్నేవ చ రణే భీమసేనం శిలీముఖైః ।
అదృశ్యం సమరే చక్రే జీమూత ఇవ భాస్కరమ్ ॥ 44
యుద్ధంలోనికి వస్తూనే మేఘం సూర్యుని కప్పినట్లు తన బాణాలతో భీముని కనిపించకుండా చేశాడు. (44)
అభిమన్యుముఖాస్తత్ తు నామృష్యంత మహారథాః ।
భీమస్యాచ్ఛాదనం సంఖ్యే స్వబాహుబలమాశ్రితాః ॥ 45
త ఏనం శరవర్షేణ సమంతాత్ పర్యవారయన్ ।
గజం చ శరవృష్ట్యా తు బిభిదుస్తే సమంతతః ॥ 46
అయితే తమ బాహుబలాన్ని ఆశ్రయించుకొనియున్న మహారథులు అభిమన్యుడు మొదలగువారు యుద్ధంలో భీముడు బాణాలచే కప్పబడటాన్ని సహించలేకపోయారు. వారు అన్ని దిక్కులా బాణ వృష్టితో భగదత్తుని నిరోధించారు. శరవృష్టితో భగదత్తుని ఏనుగును కూడా సర్వదిక్కులా భేదించారు. (46)
స శస్త్రవృష్ట్యాభిహతః సమస్తైస్తైర్మహారథైః ।
ప్రాగ్జ్యోతిషగజో రాజన్ నానాలింగైః సుతేజనైః ॥ 47
సంజాతరుధిరోత్పీడః ప్రేక్షణీయోఽభవద్ రణే ।
గభస్తిభిరివార్కస్య సంస్యూతో జలదో మహాన్ ॥ 48
రాజా! వివిధ చిహ్నాలను ధరించిన తేజస్వులు అయిన ఆ మహారథుల బాణవృష్టిచే దెబ్బతిన్న భగదత్తుని ఏనుగు రణభూమిలో రక్తరంజితమై తను వంతా సూర్యకిరణాలు తగిలిన మహామేఘంలా దర్శనీయంగా కనిపించింది. (47,48)
సంచోదితో మదస్రావీ భగదత్తేన వారణః ।
అభ్యధావత తాన్ సర్వాన్ కాలోత్సృష్ట ఇవాంతకః ॥ 49
ద్విగుణం జవమాస్థాయ కంపయంశ్చరణైర్మహీమ్ ।
అంతగా నెత్తురోడుతూ కూడా భగదత్తుని ప్రేరణచే ఆ ఏనుగు రెట్టింపు వేగంతో అడుగులతో నేలను కంపింపజేస్తూ, కాలం కల్పించిన యమునిలా ఆ మహారథులందరి మీదకూ దాడిచేసింది. (49 1/2)
తస్య తత్ సుమహద్ రూపం దృష్ట్వా సర్వే మహారథాః ॥ 50
అసహ్యం మన్యమానాశ్చ నాతిప్రమనసోభవన్ ।
ఆ ఏనుగు యొక్క ఆ మహారూపాన్ని చూసిన మహారథులందరూ దానిని నివారించటం తమ వల్ల కాదని భావించి, నిరుత్సాహానికి గురి అయ్యారు. (50 1/2)
తతస్తు నృపతిః క్రుద్ధః భీమసేనం స్తనాంతరే ॥ 51
ఆజఘాన మహారాజ శరేణానతపర్వణా ।
మహారాజా! ఆ పై భగదత్తమహారాజు కోపంతో వంగిన కణుపులు గల బాణంతో భీమసేనుని ఛాతీపై కొట్టాడు. (51 1/2)
సోఽతివిద్ధో మహేష్వాసః తేన రాజ్ఞా మహారథః ॥ 52
మూర్చ్ఛయాభిపరీతాత్మా ధ్వజయష్టిం సమాశ్రయత్ ।
మేటి విలుకాడు, మహారథుడు అయిన ఆ భీమసేనుడు భగదత్తునిచే తీవ్రంగా గాయపడి, సొమ్మసిల్లి, జెండాకర్రను ఆసరాగా ఆశ్రయించాడు. (52 1/2)
తాంస్తు భీతాన్ సమాలక్ష్య భీమసేనం చ మూర్చ్ఛితమ్ ॥ 53
ననాద బలవన్నాదం భగదత్తః ప్రతాపవాన్ ।
సేనలంతా భయపడ్డారని, భీమసేనుడు మూర్ఛిల్లాడని గమనించి ప్రతాపశాలి అయిన భగదత్తుడు పెద్దపెట్టున సింహనాదం చేశాడు. (53 1/3)
తతో ఘటోత్కచో రాజన్ ప్రేక్ష్య భీమం తథాగతమ్ ॥ 54
సంక్రుద్ధో రాక్షసో ఘోరః తత్రైవాంతరధీయత ।
రాజా! తరువాత ఆ స్థితిలో నున్న భీమసేనుని చూసి, ఘోరారక్షసుడైన ఘటోత్కచుడు కోపంతో అక్కడే అదృశ్యమయ్యాడు. (54 1/2)
స కృత్వా దారుణాం మాయాం భీరూణాం భయవర్థినీమ్ ॥ 55
అదృశ్యత నిమేషార్ధాద్ ఘోరరూపం సమాస్థితః ।
ఐరావణం సమారూఢః స వై మాయాకృతం స్వయమ్ ॥ 56
కైలాసగిరిసంకాశం వజ్రపాణిరివాభ్యయాత్) ।
ఆ ఘటోత్కచుడు పిరికివారి భయాన్ని పెంచే దారుణమైన మాయను ఆశ్రయించి, అర్ధ నిమేషకాలంలో ఘోరరూపాన్ని ధరించాడు. తన మాయతో కైలాసపర్వతం వంటి ఏనుగును సృష్టించుకొని, ఐరావతాన్ని ఎక్కిన ఇంద్రునిలా అక్కడకు వచ్చాడు. (55,56 1/2)
తస్య చాన్యేపి దిఙ్ నాగాః బభూవురనుయాయినః ।
అంజనో వామనశ్చైవ మహాపద్మశ్చ సుప్రభః ॥ 57
త్రయ ఏతే మహానాగాః రాక్షసైః సమధిష్ఠితాః ।
ఆ ఏనుగు వెనుక మరో మూడు దిగ్గజాలు - అంజనం, వామనం, కాంతిమంతమైన మహాపద్మం కూడా వచ్చాయి. ఆ మహానాగాలపై రాక్షసులు ఎక్కిఉన్నారు. (57 1/2)
మహాకాయాస్త్రిధా రాజన్ ప్రస్రవంతో మదం బాహు ॥ 58
తేజోవీర్యబలోపేతాః మహాబలపరాక్రమాః ।
రాజా! మహాశరీరం గల ఆ దిగ్గజాలు మూడుతావుల నుండి మదజలాన్ని స్రవిస్తున్నాయి. అవి తేజస్సు, వీర్యం, బలం కలవి. మహాశక్తి, పరాక్రమం కలవి. (58 1/2)
ఘటోత్కచస్తు స్వం నాగం చోదయామాస తం తదా ॥ 59
సగజం భగదత్తం తు హంతుకామః పరంతపః ।
అప్పుడు పరంతపుడైన ఘటోత్కచుడు ఏనుగుతో సహా భగదత్తుని చంపదలచి, తన ఏనుగును భగదత్తుని వైపు నడిపాడు. (59 1/2)
తే చాన్యే చోదితా నాగాః రాక్షసైస్తైర్మహాబలైః ॥ 60
పరిపేతుః సుసంరబ్ధాః చతుర్ధంష్ట్రాశ్చతుర్దిశమ్ ।
మహాబలులైన ఆ రాక్షసులు నడపగా మిగిలిన ఆ ఏనుగులు కూడా కోపంతో నాలుగు దిక్కుల మీదా పడ్డాయి. అవన్నీ నాలుగు దంతాలు గలవి. (60 1/2)
భగదత్తస్య తం నాగం విషాణైరభ్యపీడయన్ ॥ 61
స పీడ్యమానస్తైర్నాగైః వేదనార్తః శరాహతః ।
అనదత్ సుమహానాదమ్ ఇంద్రాశనిసమస్వనమ్ ॥ 62
ఈ ఏనుగులన్నీ భగదత్తుని ఏనుగును దంతాలతో పీడించసాగాయి. అసలే బాణాల గాయాలతో నున్న ఆ భగదత్తుని ఏనుగు వీటి పీడతో తీవ్రవేదనకు గురియై, ఘోరంగా ఆర్తనాదాలు చేసింది. ఆ నాదం ఇంద్రుని వజ్రధ్వనిలా ఉంది. (61,62)
తస్య తం నదతో నాదం సుఘోరం భీమనిఃస్వనమ్ ।
శ్రుత్వా భీష్మోఽబ్రవీద్ ద్రోణం రాజానం చ సుయోధనమ్ ॥ 63
భీకరధ్వనితో దారుణంగా ఆ ఏనుగు చేస్తున్న ఆర్తనాదాలు విని, భీష్ముడు ద్రోణునితోను, సుయోధననరపాలునితోను ఇలా అన్నాడు. (63)
ఏష యుధ్యతి సంగ్రామే హైడింబేన దురాత్మనా ।
భగదత్తో మహేష్వాసః కృచ్ఛ్రే చ పరివర్తతే ॥ 64
"ఇదిగో! మేటివిలుకాడైన భగదత్తుడు దురాత్ముడైన ఘటోత్కచునితో యుద్ధం చేస్తూ కష్టాల పాలవుతున్నాడు. (64)
రాక్షసశ్చ మహాకాయః స చ రాజాతికోపనః ।
ఏతౌ సమేతౌ సమరే కాలమృత్యుసమావుభౌ ॥ 65
ఆ రాక్షసుడి శరీరం పెద్దది. ఆ రాజుకు కోపమెక్కువ. కాలమృత్యువుల వంటి వీరిద్దరూ యుద్ధంలో కలబడుతున్నారు. (65)
శ్రూయతే చైవ హృష్టానాం పాండవానాం మహాస్వనః ।
హస్తినశ్చైవ సుమహాన్ భీతస్య రుదితధ్వనిః ॥ 66
ఆనందించిన పాండవుల కోలాహలం వినిపిస్తోంది. బెదిరిన ఆ ఏనుగు తీవ్రంగా ఆర్తనాదం చేసే ధ్వని కూడా వినిపిస్తోంది. (66)
తత్ర గచ్ఛామ భద్రం వః రాజానం పరిరక్షితుమ్ ।
అరక్ష్యమాణః సమరే క్షిప్రం ప్రాణాన్ విమోక్ష్యతి ॥ 67
మీకు మేలు కలగాలి! ఆ రాజును రక్షించటానికై అక్కడకు వెళదాం. రక్షించకపోతే యుద్ధంలో త్వరలో ప్రాణాలు వదిలివేస్తాడు. (67)
తే త్వరధ్వం మహావీర్యాః కిం చిరేణ ప్రయామహే ।
మహాన్ హి వర్తతే రౌద్రః సంగ్రామో లోమహర్షణః ॥ 68
మహావీరులారా! త్వరపడండి. ఆలస్యం చేయదగదు. వెళదాం. రోమాలు నిక్కపొడుచుకొనేటట్లు మహారౌద్రంగా యుద్ధం జరుగుతోంది. (68)
భక్తశ్చ కులపుత్రశ్చ శూరశ్చ పృతనాపతిః ।
యుక్తం తస్య పరిత్రాణం కర్తుమస్మాభిరచ్యుత ॥ 69
భగదత్తుడు కులీనుడు, శూరుడు, మనపై భక్తిభావం గలవాడు, మన సేనాపతికూడా. కాబట్టి ఆచార్యా! అతనిని రక్షించటం మన కర్తవ్యం." (69)
భీష్మస్య తద్ వచః శ్రుత్వా సర్వ ఏవ మహారథాః ।
ద్రోణభీష్మౌ పురస్కృత్య భగదత్తపరీప్సయా ॥ 70
ఉత్తమం జవమాస్థాయ ప్రయయుర్యత్ర సోఽభవత్ ।
భీష్ముని ఆ మాట విని, మహారథులందరూ భగదత్తుని రక్షణకై, భీష్మద్రోణులను ముందుంచుకొని, మహావేగంతో భగదత్తుడున్న తావుకు వెళ్ళారు. (70 1/2)
తాన్ ప్రయాతాన్ సమాలోక్య యుధిష్ఠిరపురోగమాః ॥ 71
పంచాలాః పాండవైః సార్థం పృష్ఠతోఽనుయయుః పరాన్ ।
వారు అలా బయలుదేరటం చూసి, పాంచాలదేశీయులు యుధిష్ఠిరుని ముందుంచుకొని, పాండవులతో కలిసి ఆ శత్రువుల వెన్నంటి వెళ్ళారు. (71 1/2)
తాన్యనీకాన్యథాలోక్య రాక్షసేంద్రః ప్రతాపవాన్ ॥ 72
ననాద సుమహానాదం విస్ఫోటమశనేరివ ।
ఆ సేనలను చూసి, ప్రతాపవంతుడైన రాక్షసరాజు ఘటోత్కచుడు వజ్రం బ్రద్దలయినట్లుగా పెద్దగా సింహనాదం చేశాడు. (72 1/2)
తస్య తం నినదం శ్రుత్వా దృష్ట్వా నాగాంశ్చ యుధ్యతః ॥ 73
భీష్మః శాంతనవో భూయః భారద్వాజమభాషత ।
ఘటోత్కచుని ఆ సింహనాదాన్ని విని, యుద్ధం చేస్తున్న ఏనుగులను చూసి, శంతనుసుతుడైన భీష్ముడు మరల ద్రోణునితో ఇలా అన్నాడు. (73 1/2)
న రోచతే మే సంగ్రామః హైడింబేన దురాత్మనా ॥ 74
బలవీర్యసమావిష్టః ససహాయశ్చ సాంప్రతమ్ ।
"దురాత్ముడైన ఘటోత్కచునితో ఇప్పుడు నాకు యుద్ధం చేయాలనిపించటం లేదు. అతడు బలపరాక్రమ సంపన్నుడు కూడా సహాయకులు కూడా ఉన్నారు. (74 1/2)
నైష శక్యో యుధా జేతుమ్ అపి వజ్రభృతా స్వయమ్ ॥ 75
లబ్ధలక్ష్యః ప్రహారీ చ వయం చ శ్రాంతవాహనాః ।
పాంచాలైః పాండవేయైశ్చ దివసం క్షతవిక్షతాః ॥ 76
వజ్రాన్ని ధరించి ఇంద్రుడే స్వయంగా వచ్చినా యుద్ధంలో ఇతనిని గెలవలేడు. అతడు లక్ష్యాన్ని భేదించగలవాడు.దెబ్బ తీయగలడు. మన వాహనాలేమో అలిసిపోయి ఉన్నాయి. పాంచాలురచేత, పాండవేయులచేత రోజంతా దెబ్బతిని యున్నాం. (75,76)
తన్న మే రోచతే యుద్ధం పాండవైర్జితకాశిభిః ।
ఘుష్యతామవహారోద్య శ్వో యోత్స్యామః పరైః సహ ॥ 77
కాబట్టి విజయంతో ప్రకాశిస్తున్న పాండవులతో ఇప్పుడు యుద్ధం చేయటం నా కిష్టం లేదు. నేటికి యుద్ధవిరామాన్ని ప్రకటించండి. రేపు శత్రువులతో యుద్ధం చేద్దాం." (77)
పితామహవచః శ్రుత్వా తథా చక్రుః స్మ కౌరవాః ।
ఉపాయేనాపయానం తే ఘటోత్కచభయార్దితాః ॥ 78
పితామహుని ఆదేశాన్ని విని, ఘటోత్కచ భయపీడితులై ఉన్న కౌరవులు వ్యూహాత్మకంగా సేనలను వెనుకకు మళ్ళించారు.
కౌరవేషు నివృత్తేషు పాండవా జితకాశినః ।
సింహనాదాన్ భృశం చక్రుః శంఖాన్ దధ్ముశ్చ భారత ॥ 79
భారతా! కౌరవులు మరలిపోగానే విజయవికాసంతో పాండవులు పదేపదే సింహనాదాలు చేశారు. శంఖాలు పూరించారు. (79)
ఏవం తదభవద్ యుద్ధం దివసం భరతర్షభ ।
పాండవానాం కురూణాం చ పురస్కృత్య ఘటోత్కచమ్ ॥ 80
భరతర్షభా! ఈ రీతిగా ఘటోత్కచుని పురస్కరించుకొని పాండవ కౌరవుల మధ్య రోజంతా యుద్ధం జరిగింది. (80)
కౌరవాస్తు తతో రాజన్ ప్రయయుః శిబిరం స్వకమ్ ।
వ్రీడమానా నిశాకాలే పాండవేయైః పరాజితాః ॥ 81
రాజా! ఆ పై పాండవులచే పరాజితులైన కౌరవులు సిగ్గుపడుతూ ఆ రాత్రి వేళలో తమ శిబిరాలకు వెళ్ళిపోయారు. (81)
శరవిక్షతగాత్రాస్తు పాండుపుత్రా మహారథాః ।
యుద్ధే సుమనసో భూత్వా జగ్ముః స్వశిబిరం ప్రతి ॥ 82
మహారథులైన పాండుపుత్రులు బాణాల దెబ్బలతో శరీరాలు గాయపడినా, యుద్ధ పరిణామంతో ప్రసన్న చిత్తులై, తమ శిబిరానికి వెళ్లిపోయారు. (82)
పురస్కృత్య మహారాజ భీమసేనఘటోత్కచౌ ।
పూజయంతస్తదాన్యోన్యం ముదా పరమయా యుతాః ॥ 83
నదంతో వివిధాన్ నాదాన్ తూర్యస్వనవిమిశ్రితాన్ ।
సింహనాదాంశ్చ కుర్వంతః విమిశ్రాన్ శంఖనిః స్వనైః ॥ 84
మహారాజా! భీమసేన ఘటోత్కచులను ముందు నిలుపుకొని, పరమానందంతో పరస్పరం అభినందించుకొంటూ, నానాప్రకారాలుగా అరుస్తున్నారు. తూర్యధ్వనులతో అవి కలుస్తున్నాయి. శంఖధ్వానాలు చేస్తున్నారు. సింహనాదాలతో అవి మిళితమవుతున్నాయి. (83,84)
వినదంతో మహాత్మానః కంపయంతశ్చ మేదినీమ్ ।
ఘట్టయంతశ్చ మర్మాణి తవ పుత్రస్య మారిష ॥ 85
ప్రయాతాః శిబిరాయైవ నిశాకాలే పరంతప ।
మారిషా! పరంతపా! ఆ మహాత్ములంతా సింహనాదాలు చేస్తూ భూమిని కంపింపజేస్తూ నీ కుమారుని మనస్సును గాయపరుస్తూ, ఆ రాత్రివేళలో శిబిరానికి వెళ్ళిపోయారు. (85 1/2)
దుర్యోధనస్తు నృపతిః దీనో భ్రాతృవధేన చ ॥ 86
ముహూర్తం చింతయామాస బాష్పశోకసమాకులః ।
సోదరుల మరణంతో దీనుడైన దుర్యోధన నరపతి శోకంతో కన్నీటితో కలతపడి ముహూర్తకాలం చింతించాడు. (86 1/2)
తతః కృత్వా విధిం సర్వం శిబిరస్య యథావిధి ।
ప్రదధ్యౌ శోకసంతప్తః భ్రాతృవ్యసనకర్శితః ॥ 87
ఆ తరువాత శిబిరానికి సంబంధించిన వ్యవస్థను యథావిధిగా పూర్తిచేసి దుర్యోధనుడు భ్రాతృమరణ దుఃఖంతో శోకసంతప్తుడై ఆలోచనలో పడ్డాడు." (87)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి చతుర్థదివసావహారే చతుఃషష్టితమోఽధ్యాయః ॥ 64 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భీష్మవధపర్వమను ఉపపర్వమున చతుర్ధదివసావహారమను అరువది నాలుగవ అధ్యాయము. (64)
(దాక్షిణాత్య అధికపాఠం 1/2 శ్లోకంతో కలిపి 87 1/2 శ్లోకాలు)