67. అరువది యేడవ అధ్యాయము

శ్రీకృష్ణ మహిమ.

దుర్యోధన ఉవాచ
వాసుదేవో మహద్ భూతం సర్వలోకేషు కథ్యతే ।
తస్యాగమం ప్రతిష్ఠాం చ జ్ఞాతుమిచ్ఛే పితామహ ॥ 1
దుర్యోధనుడిలా అడిగాడు.
"పితామహా! వాసుదేవుడు సమస్తలోకాలలోనూ మహాత్ముడన్నావు గదా! ఆయన పుట్టుకను, స్థితిని తెలిసికోవాలని ఉంది." (1)
భీష్మ ఉవాచ
వాసుదేవో మహద్ భూతం సర్వదైవతదైవతమ్ ।
న పరం పుండరీకాక్షాద్ దృశ్యతే భరతర్షభ ॥ 2
భీష్ముడిలా చెప్తున్నాడు. "భరతర్షభా! వాసుదేవుడు మహాత్ముడు, సర్వదేవతలకూ దేవత, పుండరీకాక్షుని మించినది ఏదీ కనిపించదు. (2)
మార్కండేయశ్చ గోవిందే కథయత్యద్భుతం మహత్ ।
సర్వభూతాని భూతాత్మా మహాత్మా పురుషోత్తమః ॥ 3
ఆపో వాయుశ్చ తేజశ్చ త్రయమేతదకల్పయత్ ।
మార్కండేయుడు గోవిందుని గూర్చి మహాద్భుతంగా చెప్పగలడు. ఆయన సర్వభూత స్వరూపుడు, సర్వాత్మ స్వరూపుడు, మహాత్ముడు, పురుషోత్తముడు. సృష్టి ప్రారంభంలో నీటిని, గాలిని, తేజస్సును, ఈ ప్రాణులన్నింటినీ సృష్టించాడు. (3 1/2)
స సృష్ట్వా పృథివీం దేవీం సర్వలోకేశ్వరః ప్రభుః ॥ 4
అప్సు వై శయనం చక్రే మహాత్మా పురుషోత్తమః ।
సర్వతేజోమయో దేవః యోగాత్ సుష్వాప తత్ర హ ॥ 5
సర్వలోకేశ్వరుడు, ప్రభువు, మహాత్ముడు అయిన ఆ పురుషోత్తముడు భూమిని సృష్టించి, నీటిలో శయనించాడు. సర్వతేజః స్వరూపుడైన ఆ దేవుడు యోగశక్తితో ఆ నీటిపై నిదురించాడు. (4,5)
ముఖతః సోఽగ్నిమసృజత్ ప్రాణాద్ వాయుమథాపి చ ।
సరస్వతీం చ వేదాంశ్చ మనసః ససృజేఽచ్యుతః ॥ 6
ఆ అచ్యుతుడు ముఖం నుండి అగ్నిని, ప్రాణం నుండి వాయువును, మనస్సు నుండి సరస్వతిని, వేదాలను సృష్టించాడు. (6)
ఏష లోకాన్ ససర్జాదౌ దేవాంశ్చ ఋషిభిః సహ ।
నిధనం చైవ మృత్యుం చ ప్రజానాం ప్రభవాప్యయౌ ॥ 7
ఈయనయే తొలుత దేవతలు, ఋషులతో సహా సర్వలోకాలను సృష్టించాడు. ప్రళయాన్ని, మృత్యువును, ప్రాణుల ఉత్పత్తి వినాశాలను కూడా సృష్టించాడు. (7)
ఏష ధర్మశ్చ ధర్మజ్ఞః వరదః సర్వకామదః ।
ఏష కర్తా చ కార్యం చ పూర్వదేవః స్వయంప్రభుః ॥ 8
ఈయనయే ధర్మం, ధర్మజ్ఞుడు, వరదుడు, సర్వకామదుడు. కర్త, కార్యమూ ఈయనయే. ఆదిదేవుడు, స్వయంసమర్థుడు ఈయనయే. (8)
భూతం భవ్యం భవిష్యచ్చ పూర్వమేతదకల్పయత్ ।
ఉభే సంధ్యే దిశః ఖం చ నియమాంశ్చ జనార్దనః ॥ 9
ఈయనయే తొలుత భూత, భవిష్య, ద్వర్తమానాలను కల్పించాడు. ఈ జనార్దనుడే ఉభయ సంధ్యలను, దిక్కులను, ఆకాశాన్ని, నియమాలను ఏర్పరిచాడు. (9)
ఋషీంశ్చైవ హి గోవిందః తపశ్చైవాభ్యకల్పయత్ ।
స్రష్టారం జగతశ్చాపి మహాత్మా ప్రభురవ్యయః ॥ 10
ఈ గోవిందుడే ఋషులను, తపస్సును కల్పించాడు. అవ్యయుడు, ప్రభువు అయిన ఈ మహాత్ముడే జగత్ సృష్టికర్తను కూడా సృష్టించాడు. (10)
అగ్రజం సర్వభూతానాం సంకర్షణమకల్పయత్ ।
తస్మాన్నారాయణో జజ్ఞే దేవదేవః సనాతనః ॥ 11
సర్వప్రాణుల కన్న ముందుపుట్టిన సంకర్షణుని ఈయనయే కల్పించాడు. సంకర్షణుని నుండియే దేవదేవుడు, సనాతనుడు అయిన నారాయణుడు జన్మించాడు. (11)
నాభౌ పద్మం బభూవాస్య సర్వలోకస్య సంభవాత్ ।
తస్మాత్ పితామహో జాతః తస్మాజ్జాతాస్త్విమాః ప్రజాః ॥ 12
ఈయన నాభి నుండి పద్మం పుట్టింది. సర్వలోకాలకు ఉత్పత్తి స్థానమైన దాని నుండి పితామహుడు పుట్టాడు. ఆయన నుండి ఈ ప్రజలు పుట్టారు.
శేషం చాకల్పయద్ దేవమ్ అనంతం విశ్వరూపిణమ్ ।
యో ధారయతి భూతాని ధరాం చేమాం సపర్వతామ్ ॥ 13
సర్వప్రాణులను, పర్వతాలతో సహా ఈ భూమిని భరించే శేషుని కూడా ఈయనయే కల్పించాడు. శేషుడు అనంతదేవుడు, విశ్వరూపుడు. (13)
ధ్యానయోగేన విప్రాశ్చ తం విదంతి మహౌజసమ్ ।
కర్ణస్రోతోద్భవం చాపి మధుం నామ మహాసురమ్ ॥ 14
తముగ్రముగ్రకర్మాణమ్ ఉగ్రాం బుద్ధిం సమాస్థితమ్ ।
బ్రహ్మణోఽపచితం కుర్వన్ జఘాన పురుషోత్తమః ॥ 15
మహాతేజస్వి అయిన ఈ వాసుదేవుని విప్రులు ధ్యానంతో గ్రహించగలుగుతున్నారు. నారాయణుని చెవి గుబిలి నుండి మధు వనే మహారాక్షసుడు పుట్టాడు. వాడు క్రూరచేష్టలు, క్రూరబుద్ధి గలవాడు. బ్రహ్మమీది ఆదరంతో ఈ పురుషోత్తముడు మధువును చంపాడు. (14,15)
తస్య తాత వధాదేవ దేవదానవమానవాః ।
మధుసూదనమిత్యాహుః ఋషయశ్చ జనార్దనమ్ ॥ 16
నాయనా! మధువును చంపినంధువలననే దేవతలు, దానవులు, మానవులు, ఋషులు జనార్దమని మధుసూదనుడన్నారు. (16)
వరాహశ్చైవ సింహశ్చ త్రివిక్రమగతిః ప్రభుః ।
ఏష మాతా పితా చైవ సర్వేషాం ప్రాణినాం హరిః ॥ 17
ఈయనయే వరాహ, సింహ, వామనరూపాలు ధరించినవారు. ఈ హరియే సమస్త ప్రాణులకు తల్లి, తండ్రి. (17)
పరం హి పుండరీకాక్షాత్ న భూతం న భవిష్యతి ।
ముఖతః సోఽసృజద్ విప్రాన్ బాహుభ్యాం క్షత్రియాంస్తథా ॥ 18
వైశ్యాంశ్చాప్యూరుతో రాజన్ శూద్రాన్ వై పాదతస్తథా ।
పుండరీకాక్షుని మించినది ఇంతకు ముందు లేదు. ఇక ఉండదు. రాజా! ఈయనయే ముఖం నుండి బ్రాహ్మణులను, బాహువుల నుండి క్షత్రియులను, ఊరువుల నుండి వైశ్యులను, పాదాల నుండి శూద్రులను సృష్టించాడు. (18 1/2)
తపసా నియతో దేవం విధానం సర్వదేహినామ్ ॥ 19
బ్రహ్మభూతమమావాస్యాం పౌర్ణమాస్యాం తథైవ చ ।
యోగభూతం పరిచరన్ కేశవం మహదాప్నుయాత్ ॥ 20
తపస్సుతోనూ; నియమపూర్వక వ్రతపాలనతోనూ; అమావాస్య, పూర్ణిమలయందు ఆరాధించటంతోనూ; సర్వప్రాణులకు ఆశ్రయమై, యోగస్వరూపుడైన ఈ కేశవుని సేవించినవాడు పరమపదాన్ని పొందగలడు. (19,20)
కేశవః పరమం తేజః సర్వలోకపితామహః ।
ఏతమాహుర్హృషీకేశం మునయో వై నరాధిప ॥ 21
నరాధిపా! కేశవుడే పరమతేజస్సు, సర్వలోకపితామహుడు. మునులు ఈయననే హృషీకేశుడన్నారు. (21)
ఏవమేనం విజానీహి ఆచార్యం పితరం గురుమ్ ।
కృష్ణో యస్య ప్రసీదేత లోకాస్తేనాక్షయా జితాః ॥ 22
ఇలా ఈయనను ఆచార్యునిగా, తండ్రిగా, గురువుగా గ్రహించు. కృష్ణుని అనుగ్రహముంటే అక్షయలోకాలను జయించగలిగినట్లే. (22)
యశ్చైవైనం భయస్థానే కేశవం శరణం వ్రజేత్ ।
సదా నరః పఠంశ్చేదం స్వస్తిమాన్ స సుఖీ భవేత్ ॥ 23
భయంకలిగినప్పుడు కేశవుని శరణుకోరి, నిత్యమూ ఈ స్తుతిని పఠించినవాడు సుఖాన్ని, శుభాన్ని పొందగలడు. (23)
యే చ కృష్ణం ప్రపద్యంతే తే న ముహ్యంతి మానవాః ।
భయే మహతి మగ్నాంశ్చ పాతి నిత్యం జనార్దనః ॥ 24
కృష్ణుని ఆశ్రయించిన మానవులు మోహానికి లోనుకారు. మహాభయంలో మునిగినవారిని కూడా జనార్దనుడెప్పుడూ కాపాడుతాడు. (24)
స తం యుధిష్ఠిరో జ్ఞాత్వా యాథాతధ్యేన భారత ।
సర్వాత్మనా మహాత్మానం కేశవం జగదీశ్వరమ్ ।
ప్రపన్నః శరణం రాజన్ యోగానాం ప్రభుమీశ్వరమ్ ॥ 25
రాజా! భారతా! ఆయనను యథాతథంగా తెలిసికొనియే ఆ యుధిష్ఠిరుడు మహాత్ముడు, జగదీశ్వరుడు, యోగవిధాత, ఈశ్వరుడు అయిన ఆ కేశవుని సర్వాత్మనా శరణు కోరాడు." (25)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి విశ్వోపాఖ్యానే సప్తషష్టితమోఽధ్యాయః ॥ 67 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భీష్మవధపర్వమను ఉపపర్వమున విశ్వోపాఖ్యాన మను అరువది యేడవ అధ్యాయము. (67)