68. అరువది యెనిమిదవ అధ్యాయము

బ్రహ్మభూత స్తోత్రము - శ్రీ కృష్ణార్జున మహిమ.

భీష్మ ఉవాచ
శృణు చేదం మహారాజ బ్రహ్మభూతం స్తవం మమ ।
బ్రహ్మర్షిభిశ్చ దేవైశ్చ యః పురా కథితో భువి ॥ 1
భీష్ముడిలా చెప్తున్నాడు. "మహారాజా! గతంలో భూతలంలో బ్రహ్మర్షులు, దేవతలు కలిసి ఈ వాసుదేవుని బ్రహ్మభూతునిగా స్తుతించారు. అది చెపుతాను. విను. (1)
సాధ్యానామపి దేవానాం దేవదేవేశ్వరః ప్రభుః ।
లోకభావనభావజ్ఞః ఇతి త్వాం నారదోఽబ్రవీత్ ॥ 2
"నీవు సాధ్యులకు, దేవతలకు కూడా, ప్రభువువు. దేవ దేవేశ్వరుడవు. లోకుల మనోభావనల నెరిగినవాడవు" అని నారదుడు నీ గురించి చెప్పాడు. (2)
భూతం భవ్యం భవిష్యం చ మార్కండేయాఽభ్యువాచ హ ।
యజ్ఞం త్వాం చైవ యజ్ఞానాం తపశ్చ తపసామపి ॥ 3
మార్కండేయ మహర్షి భూత భవిష్య ద్వర్తమానాలు నీవే అన్నాడు. యజ్ఞాలకు యజ్ఞానివి. తపస్సులకు తపస్సువు నీవు. (3)
దేవానామపి దేవం చ త్వామాహ భగవాన్ భృగుః ।
పురాణాం చైవ పరమం విష్ణో రూపం తవేతి చ ॥ 4
పూజ్యుడైన భృగువు నిన్ను దేవతలకే దేవత అన్నాడు. నీ రూపం పరమప్రాచీనమనీ, ఉత్కృష్ట మనీ చెప్పాడు. (4)
వాసుదేవో వసూనాం త్వం శక్రం స్థాపయితా తథా ।
దేవ దేవోఽసి దేవానామ్ ఇతి ద్వైపాయనోఽబ్రవీత్ ॥ 5
"నీవు వసువులకు వాసుదేవుడవు. అలాగే ఇంద్రుని స్వర్గంపై ప్రతిష్ఠించినవాడవు. దేవా! నీవు దేవదేవుడవు" అని ద్వైపాయన మహర్షి అన్నాడు. (5)
పూర్వే ప్రజానిసర్గే చ దక్షమాహుః ప్రజాపతిమ్ ।
స్రష్టారం సర్వలోకానామ్ అంగిరాస్త్వాం తథాబ్రవీత్ ॥ 6
తొలి సృష్టివేళలో నిన్నే దక్షప్రజాపతి అన్నారు. నీవే సర్వలోక సృష్టికర్త వని అంగిరసుడు నీ గురించి చెప్పాడు. (6)
అవ్యక్తం తే శరీరోత్థం వ్యక్తం తే మనసి స్థితమ్ ।
దేవాస్త్వత్సంభవాశ్చైవ దేవలస్త్వసితోఽబ్రవీత్ ॥ 7
అవ్యక్తం నీ శరీరం నుండి పుట్టినది. వ్యక్తం నీ మనస్సు నందున్నది. దేవతలు కూడా నీ నుండి పుట్టినవారే - అని అసిత దేవలుడు పలికాడు. (7)
శిరసా తే దివం వ్యాప్తం బాహుభ్యాం పృథివీ తథా ।
జఠరం తే త్రయో లోకాః పురుషోఽసి సనాతనః ॥ 8
ఏవం త్వామభిజానంతి తపసా భావితా నరాః ।
ఆత్మదర్శనతృప్తానామ్ ఋషీణాం చాపి సత్తమః ॥ 9
నీ తల ఆకాశమంతా నిండి ఉన్నది. నీ బాహువులు భూతలమంతా వ్యాపించి ఉన్నాయి. మూడులోకాలూ నీ ఉదరంలో ఉన్నాయి. నీవు సనాతన పురుషుడవు. తపస్సుచే పవిత్రమైన మనస్సు గల నరులు నిన్ను ఇలాగే గ్రహిస్తారు. ఆత్మసాక్షాత్కారంల్తో తృప్తి నందిన ఋషులు కూడా నిన్ను సర్వశ్రేష్ఠుడవంటారు. (8,9)
రాజర్షీణాముదారాణామ్ ఆహవేష్వనివర్తినామ్ ।
సర్వధర్మప్రధానానాం త్వం గతిర్మధుసూదన ॥ 10
మధుసూదనా! సర్వధర్మాలయందూ ప్రధానులై, రణ భూమిలో వెనుకంజవేయని ఉదారరాజర్షులకు నీవే గతి. (10)
ఇతి నిత్యం యోగవిద్భిః భగవాన్ పురుషోత్తమః ।
సనత్కుమారప్రముఖైః స్తూయతేఽభ్యర్చ్యతే హరిః ॥ 11
ఈ రీతిగా సనత్కుమారుడు మొదలుగాగల యోగవేత్తలు పాపాలను హరించే పూజ్య పురుషోత్తముని నిత్యమూ స్తుతిస్తారు, పూజిస్తారు. (11)
ఏష తే విస్తరస్తాత సంక్షేపశ్చ ప్రకీర్తనః ।
కేశవస్య యథాతత్త్వం సుప్రీతో భజ కేశవమ్ ॥ 12
నాయనా! ఈ రీతిగా విస్తారంగానూ, సంక్షిప్తంగానూ నేను నీకు కేశవుని వాస్తవతత్త్వాన్ని తెలిపాను. ఆనందంతో కేశవుని భజించు." (12)
పుణ్యం శ్రుత్వైతదాఖ్యానం మహారాజ సుతస్తవ ।
కేశవం బహు మేనే సః పాండవాంశ్చ మహారథాన్ ॥ 13
సంజయుడిలా చెప్తున్నాడు. "మహారాజా! పవిత్రమైన ఈ ఆఖ్యానాన్ని విని నీ కుమారుడు శ్రీకృష్ణునీ, మహారథులైన పాండవులను గొప్పగా భావించాడు. (13)
తమబ్రవీన్మహారాజ భీష్మః శాంతనవః పునః ।
మాహాత్మ్యం తే శ్రుతం రాజన్ కేశవస్య మహాత్మనః ॥ 14
నరస్య చ యథాతత్త్వం యన్మాం త్వం పృచ్ఛసే నృప ।
మహారాజా! శంతనుసుతుడు భీష్ముడు నీ కుమారునితో మరలా ఇలా అన్నాడు. 'రాజా! మహాత్ముడైన కేశవుని మాహాత్మ్యాన్ని, నరుడైన అర్జునుని వాస్తవిక రూపాన్ని నీ వడిగినట్లుగా, నా ద్వారా విన్నావు. (14 1/2)
యదర్థం నృషు సంభూతౌ నరనారాయణావృషీ ॥ 15
అవధ్యౌ చ యథా వీరౌ సంయుగేష్వపరాజితౌ ।
యథా చ పాండవా రాజన్ అవధ్యా యుధి కస్యచిత్ ॥ 16
రాజా! నరనారాయణ ఋషులు ఏ కార్యం కోసం మానవులలో జనించారో, అపరాజితులైన ఆ వీరులిద్దరూ యుద్ధంలో ఎలా చంపనలవి కానివారో, పాండవులు రణభూమిలో ఎవ్వరికీ ఎలా అలవికానివారో నీకు చెప్పాను. (16)
ప్రీతిమాన్ హి దృఢం కృష్ణః పాండవేషు యశస్విషు ।
తస్మాద్ బ్రవీమి రాజేంద్ర శమో భవతు పాండవైః ॥ 17
రాజేంద్రా! కీర్తిమంతులైన పాండవులపై కృష్ణుడు పూర్తిగా ప్రసన్నుడు. అందుకే చెపుతున్నాను. పాండవులతో సంధి చేసుకో. (17)
పృథివీం భుఙ్ క్ష్వా సహితః భ్రాతృభిర్బలిభిర్వశీ ।
నరనారాయణౌ దేవౌ అవజ్ఞాయ నశిష్యసి ॥ 18
నిన్ను నీవు నిగ్రహించుకొని, బలిష్ఠులైన నీ సోదరులతో కలిసి, భూమిని అనుభవించు. దివ్యులయిన నరనారాయణులను అవహేళన చేస్తే నశిస్తావు." (18)
ఏవముక్త్వా తవ పితా తూష్ణీమాసీద్ విశాంపతే ।
వ్యసర్జయచ్చ రాజానం శయనం చ వివేశ హ ॥ 19
రాజా! అలా పలికి నీ తండ్రి మౌనంగా ఉన్నాడు. దుర్యోధనుని వీడ్కొలిపి పక్క మీద చేరాడు.(19)
రాజా చ శిబిరం ప్రాయాత్ ప్రణిపత్య మహాత్మనే ।
శిశ్యే చ శయనే శుభ్రే రాత్రిం తాం భరతర్షభ ॥ 20
భరతర్షభా! దుర్యోధనుడు కూడా ఆ మహాత్మునకు నమస్కరించి, శిబిరానికి వెళ్ళాడు. శుభ్రమైన పక్కపై ఆ రాత్రి శయనించాడు.' (20)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి విశ్వోపాఖ్యానే అష్టషష్టితమోఽధ్యాయః ॥ 68 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భీష్మవధపర్వమను ఉపపర్వమున విశ్వోపాఖ్యాన అరువది యెనిమిదవ అధ్యాయము. (68)