70. డెబ్బదియవ అధ్యాయము
భీష్మ భీమభీకర సంగ్రామము.
సంజయ ఉవాచ
అకరోత్ తుములం యుద్ధం భీష్మః శాంతనవస్తదా ।
భీమసేనభయాదిచ్ఛన్ పుత్రాంస్తారయితుం తవ ॥ 1
సంజయుడిలా చెప్తున్నాడు.
'భీమసేనుని వలన కలిగిన భయం నుండి నీ కొడుకులను బయటపడవేయాలని సంకల్పించి శంతనుసుతుడైన భీష్ముడు భీకరంగా పోరాడాడు. (1)
పూర్వాహ్ణే తన్మహారౌద్రం రాజ్ఞాం యుద్ధమవర్తత ।
కురూణాం పాండవానాం చ ముఖ్యశూరవినాశనమ్ ॥ 2
పూర్వాహ్ణకాలంలో కురు, పాండవ సేనలలోని రాజుల మధ్య ఆ మహాభయంకర సంగ్రామం జరిగింది. ముఖ్యులైన శూరులెందరో మరణించారు.(2)
తస్మిన్నాకులసంగ్రామే వర్తమానే మహాభయే ।
అభవత్ తుములః శబ్దః సంస్పృశన్ గగనం మహత్ ॥ 3
మహాభయంకరమైన ఆ వ్యాకుల సంగ్రామం జరుగుతుంటే ఆకాశమంటుతూ మహాకోలాహలం చెలరేగింది. (3)
నదద్భిశ్చ మహానాగైః హ్రేషమాణైశ్చ వాజిభిః ।
భేరీశంఖనినాదైశ్చ తుములం సమపద్యత ॥ 4
మదపుటేనుగుల ఘీంకారాలతో, గుర్రాల సకిలింపులతో, భేరీశంఖధ్వనులతో భయంకర కోలాహలం ఏర్పడింది. (4)
యుయుత్సవస్తే విక్రాంతాః విజయాయ మహాబలాః ।
అన్యోన్యమభిగర్జంతః గోష్ఠేష్వివ మహర్షభాః ॥ 5
విజయాన్ని కోరుతూ, ఆ మహాబలులు యుద్ధ సంకల్పంతో ఆవులమందలో ఆబోతుల వలె పరస్పరం రంకెలు వేయసాగారు. (5)
శిరసాం పాత్యమానానాం సమరే నిశితైః శరైః ।
అశ్మవృష్టిరివాకాశే బభూవ భరతర్షభ ॥ 6
భరతర్షభా! పదునైన బాణాలతో రణభూమిలో తలలు తెగి పడుతుంటే ఆకాశం నుండి రాళ్ళ (వడగళ్ళ) వాన కురింసినట్టుంది.(6)
కుండలోష్ణీషధారీణి జాతరూపోజ్జ్వలాని చ ।
పతితాని స్మ దృశ్యంతే శిరాంసి భరతర్షభ ॥ 7
భరతశ్రేష్ఠా! కుండలాలను, తలపాగాలను ధరించి, బంగారవలె ప్రకాశిస్తున్న ఆ తలలు నేలగూలి, కనిపిస్తున్నాయి. (7)
విశిఖోన్నథితైర్గాత్రైః బాహుభిశ్చ సకార్ముకైః ।
సహస్తాభరణైశ్చాన్యైః అభవచ్ఛాదితా మహీ ॥ 8
బాణాలతో చితికిపోయిన శరీరాలతోనూ; వింటితోనూ, హస్తాభరణాలతోనూ కూడిన బాహువులతో భూమి అంతా కప్పబడిపోయింది. (8)
కవచోపహితైర్గాత్రైః హస్తైశ్చ సమలంకృతైః ।
ముఖైశ్చ చంద్రసంకాశైః రక్తాంతనయనైః శుభైః ॥ 9
గజవాజిమనుష్యాణాం సర్వగాత్రైశ్చ భూపతే ।
ఆసీత్ సర్వా సమాస్తీర్ణా ముహూర్తేన వసుంధరా ॥ 10
రాజా! రెండు ఘడియలలోనే కవచాలు కప్పిన శరీరాలతో, సమలంకృత హస్తాలతో, కొనలెర్రబడ్డ చంద్రసమాన ముఖాలతో, ఏనుగులు, గుర్రాలు, మనుష్యుల వివిధావయవాలతో రణరంగమంతా విస్తరించింది. (9,10)
రజోమేఘశ్చ తుములైః శస్త్రవిద్యుత్ప్రకాశిభిః ।
ఆయుధానాం చ నిర్ఘోషః స్తనయిత్నుసమోభవత్ ॥ 11
భీకర ధూళిమేఘాలు క్రమ్ముకొన్నాయి. శస్త్రాలనే మెరుపు తీగలతో అవి ప్రకాశిస్తున్నాయి. ఆయుధాల ఘోష మేఘగర్జనవలె ఉన్నది. (11)
స సంప్రహారస్తుములః కటుకః శోణితోదకః ।
ప్రావర్తత కురూణాం చ పాండవానాం చ భారత ॥ 12
భారతా! కౌరవపాండవుల ఆ పోరాటం భీకరంగా, అప్రియంగా ఉంది. నెత్తురు నీళ్ళవలె ప్రవహిస్తోంది. (12)
తస్మిన్ మహాభయే ఘోరే తుములే లోమహర్షణే ।
వవృషుః శరవర్షాణి క్షత్రియా యుద్ధదుర్మదాః ॥ 13
యుద్ధం భయావహంగా, ఘోరంగా, మహోద్రిక్తంగా సాగుతోంది. రోమాలు నిక్కబొడుచుకొనేటట్లుంది. యుద్ధోన్మాదులైన క్షత్రియులు శరవర్షాన్ని కురిపించారు. (13)
ఆక్రోశన్ కుంజరాస్తత్ర శరవర్షప్రతాపితాః ।
తావకానాం పరేషాం చ సంయుగే భరతర్షభ ॥ 14
భరతర్షభా! నీ కొడుకులకు, శత్రువులకు మధ్య జరుగుతున్న పోరాటంలో ఉభయసేనలలోని ఏనుగులు శరవృష్టి బాధతో ఆక్రోశిస్తున్నాయి. (14)
సంరబ్దానాం చ వీరాణాం ధీరాణామమితౌజసామ్ ।
ధనుర్జ్యాతలశబ్దేన న ప్రాజ్ఞాయత కించన ॥ 15
అమిత తేజస్సు గల ధీరవీరులు కోపంతో ధనుష్టంకారం చేస్తుంటే, ఆ చప్పుడులో ఏమీ తెలియటం లేదు. (15)
ఉత్థితేషు కబంధేషు సర్వతః శోణితోదకే ।
సమరే పర్యధావంత నృపా రివువధోద్యతాః ॥ 16
మొండాలు నిలిచి ఉన్నాయి. నెత్తురు ప్రవహిస్తోంది. శత్రువులను చంపటానికి ఉద్యమించిన రాజులు రణభూమి అంతటా పరుగులు పెడుతున్నారు. (16)
శరశక్తిగదాభిస్తే ఖడ్గైశ్చామితతేజసః ।
నిజఘ్నుః సమరేఽన్యోన్యం శూరాః పరిఘబాహవః ॥ 17
తలుపుగడియలవలె బలిష్ఠమైన బాహువులు గలిగి, అమిత పరాక్రమంతో ఆ శూరులు బాణాలు, శక్తులు, గదలు, కత్తులతో సంగ్రామంలో ఒకరినొకరు చంపుతున్నారు. (17)
బభ్రముః కుంజరాశ్చాత్ర శరైర్విద్ధా నిరంకుశాః ।
అశ్వాశ్చ పర్యధావంత హతారోహా దిశో దశ ॥ 18
బాణాల దెబ్బలు తిన్న ఏనుగులు అంకుశాలకు లొంగకుండా తిరుగుతున్నాయి. ఆశ్వికులు చనిపోగా గుర్రాలు పది దిక్కులవైపు పరుగెత్తుతున్నాయి. (17,18)
ఉత్పత్య నిపతంత్యన్యే శరఘాతప్రపీడితాః ।
తావకానాం పరేషాం చ యోధా భరతసత్తమ ॥ 19
భరతసత్తమా! నీ యోధులు, శత్రువుల యోధులు కొందరు బాణపుదెబ్బల పీడతో ఎగిరి ఎగిరి పడుతున్నారు. (19)
వాహానాముత్తమాంగానాం కార్ముకాణాం చ భారత ।
గదానాం పరిఘాణాం చ హస్తానాం చోరుభిః సహ ॥ 20
పాదానాం భూషణానాం చ కేయూరాణాం చ సంఘశః ।
రాశయస్తత్ర దృశ్యంతే భీష్మభీమసమాగమే ॥ 21
భారతా! భీష్మభీములు కలబడుతుంటే వాహనాలు, తలలు, ధనుస్సులు, గదలు, పరిఘలు, చేతులు, తొడలు, కాళ్ళు, ఆభరణాలు, కేయీరాలు కుప్పలు కుప్పలుగా రణభూమిలో కనిపిస్తున్నాయి. (20,21)
అశ్వానాం కుంజరాణాం చ రథానాం చానివర్తినామ్ ।
సంఘాతాః స్మ ప్రదృశ్యంతే తత్ర తత్ర విశాంపతే ॥ 22
రాజా! అక్కడక్కడ యుద్ధం నుండి మరలిపోని రథాలు, గుర్రాలు, ఏనుగుల సమూహాలు కనిపిస్తున్నాయి. (22)
గదాభిరసిభిః ప్రాసైః బాణైశ్చ నతపర్వభిః ।
జఘ్నుః పరస్పరం తత్ర క్షత్రియాః కాల ఆగతే ॥ 23
కాలం సమీపించిన క్షత్రియులు రణరంగంలో గదలతో, కత్తులతో, ప్రాసాలతో, వంగిన కణుపులు గల బాణాలతో ఒకరి నొకరు చంపుకొంటున్నారు. (23)
అపరే బాహుభిర్వీరాః నియుద్ధకుశలా యుధి ।
బహుధా సమసజ్జంత ఆయసైః పరిఘైరివ ॥ 24
మల్లయుద్ధంలో నేర్పరులైన మరికొందరు లోహపు గడియల వంటి బాహువులతో వివిధ ప్రకారాలుగా రణంలో పోరాడుతున్నారు. (24)
ముష్టిభిర్జానుభిశ్చైవ తలైశ్చైవ విశాంపతే ।
అన్యోన్యం జఘ్నిరే వీరాః తావకాః పాండవైః సహ ॥ 25
రాజా! నీ వీరులు, పాండవ వీరులు కూడా పిడికిళ్ళతో, మోకాళ్ళతో, అరచేతులతో పరస్పరం కొట్టుకొంటున్నారు. (25)
పతితైః పాత్యమానైశ్చ విచేష్టద్భిశ్చ భూతలే ।
ఘోరమాయోధనం జజ్ఞే తత్ర తత్ర జనేశ్వర ॥ 26
రాజా! కొందరు నేలగూలారు. మరికొందరు నేలగూలుతున్నారు. కొందరు నేలగూలి గిలగిల కొట్టుకొంటున్నారు. ఇలా అక్కడక్కడ ఘోరయుద్ధం జరుగుతోంది. (26)
విరథా రథినశ్చాత్ర నిస్త్రింశవరధారిణః ।
అన్యోన్యమభిధావంతః పరస్పరవధైషిణః ॥ 27
ఎంతోమంది రథికులు రథహీనులై గట్టికత్తులు చేతబట్టి, ఒకరినొకరు చంపగోరి ఒకరిమీది కొకరు దూకుతున్నారు. (27)
తతో దుర్యోధనో రాజా కలింగైర్బహుభిర్వృతః ।
పురస్కృత్య రణే భీష్మం పాండవానభ్యవర్తత ॥ 28
అప్పుడు దుర్యోధన నరపాలుడు చాలామంది కళింగ సైనికులతో కూడి, రణంలో భీష్ముని ముంచుంచుకొని పాండవులపై దాడిచేశాడు. (28)
తథైవ పాండవాః సర్వే పరివార్య వృకోదరమ్ ।
భీష్మమభ్యద్రవన్ క్రుద్ధాః తతో యుద్ధమవర్తత ॥ 29
అదే రీతిగా కోపించిన పాండవులందరూ వృకోదరుని చుట్టూ నిలిచి భీష్మునిపై దాడి చేశారు. అప్పుడు పోరు ఘోరమయింది.' (29)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి సంకులయుద్ధే సప్తతితమోఽధ్యాయః ॥ 70 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భీష్మవధపర్వమున ఉపపర్వమున సంకులయుద్ధ మను డెబ్బదియవ అధ్యాయము. (70)