69. అరువది తొమ్మిదవ అధ్యాయము
కౌరవుల మకరవ్యూహము - పాండవుల శ్యేనవ్యూహము - అయిదవరోజు యుద్ధారంభము.
సంజయ ఉవాచ
వ్యుషితాయాం తు శర్వర్యామ్ ఉదితే చ దివాకరే ।
ఉభే సేనే మహారాజ యుద్ధాయైవ సమీయతుః ॥ 1
సంజయుడిలా చెప్తున్నాడు.
'మహారాజా! రాత్రి తెలవారి, సూర్యుడు ఉదయించగానే ఉభయసేనలు యుద్ధానికై దగ్గరయ్యాయి. (1)
అభ్యధావంత సంక్రుద్ధాః పరస్పరజిగీషవః ।
తే సర్వే సహితా యుద్ధే సమాలోక్య పరస్పరమ్ ॥ 2
పాండవా ధార్తరాష్ట్రాశ్చ రాజన్ దుర్మంత్రితే తవ ।
వ్యూహౌ చ వ్యూహ్య సంరబ్ధాః సంప్రహృష్టాః ప్రహారిణః ॥ 3
రాజా! పరస్పరజిగీషతో అత్యంత కోపంగా పరాక్రమించాయి. నీ దురాలోచన ఫలంగా పాండవులు, ధార్తరాష్ట్రులు ఒకరినొకరు చూసికొని కోపోద్రిక్తులై సహాయకులతో కలిసి రణానికి సిద్ధమయ్యారు. వ్యాహాలను తయారు చేసికొని ఉత్సాహంగా దెబ్బతీయడానికి ఉద్యమించారు. (2,3)
అరక్షన్మకరవ్యూహం భీష్మో రాజన్ సమంతతః ।
తథైవ పాండవా రాజన్ అరక్షన్ వ్యూహమాత్మనః ॥ 4
రాజా! భీష్ముడు మకరవ్యూహాన్ని నిర్మించి, అన్నివైపుల రక్షణ కల్పించాడు. అదేవిధంగా పాండవులు తమ వ్యుహాన్ని రక్షించుకొన్నారు. (4)
(అజాతశత్రుః శత్రూణాం మనాంసి సమకంపయత్ ।
శ్యేనవద్ వ్యూహ్య తం వ్యూహం ధౌమ్యస్య వచనాత్ స్వయమ్ ॥
స హి తస్య సువిజ్ఞాతః అగ్నిచిత్యేషు భారత ।
మకరస్తు మహావ్యూహః తవ పుత్రస్య ధీమతః ॥
స్వయం సర్వేణ సైన్యేన ద్రోణేనానుమతస్తదా ।
యథావ్యూహం శాంతనవః సోన్వవర్తత తత్ పునః) ॥
స నిర్యయౌ మహారాజ పితా దేవవ్రతస్తవ ।
మహతా రథవంశేన సంవృతో రథినాం వరః ॥ 5
అజాథశత్రువయిన యుధిష్ఠిరుడు ధౌమ్యుని మాట మేరకు స్వయంగా శ్యేనవ్యూహాన్ని పన్ని, శత్రువుల మనస్సులను వణికించాడు. భారతా! అగ్నిచయన కార్యపరిచయం వలన శ్యేనవ్యూహం ధర్మరాజుకు బాగా తెలుసు. బుద్ధుమంతుడైన నీ కొడుకు మకరవ్యూహాన్ని పన్నాడు. ద్రోణుని అనుమతితో, సర్వసేనతో ఆ వ్యూహాన్ని రచించాడు. భీష్ముడు కూడా ఆ మహావ్యూహాన్ని అనుసరించాడు. మహారాజా! మహారథుడైన నీ తండ్రి - దేవవ్రతుడు పెద్ద రథసేనను చుట్టూ నిలుపుకొని యుద్ధానికి బయలుదేరాడు. (5)
ఇతరేతరమన్వీయుః యథాభాగమవస్థితాః ।
రథినః పత్తయశ్చైవ దంతినః సాదినస్తథా ॥ 6
తమ తమ స్థానాలలో నిలిచిన రథికులు, కాల్బలం, ఏనుగులు, గుర్రాలు ఒకదానివెంట ఒకటి నడువసాగాయి. (6)
తాన్ దృష్ట్వాభ్యుద్యతాన్ సంఖ్యే పాండవా హి యశస్వినః ।
శ్యేనేన వ్యూహరాజేన తేనాజయ్యేన సంయుగే ॥ 7
అశోభిత ముఖే తస్య భీమసేనో మహాబలః ।
నేత్రే శిఖండీ దుర్ధర్షః ధృష్టద్యుమ్నశ్చ పార్షతః ॥ 8
యుద్ధ సన్నద్ధులైన కౌరవులను చూసి కీర్తిమంతులయిన పాండవులు యుద్ధంలో గెలువవీలుకాని మహావ్యూహాన్ని - శ్యేన వ్యూహాన్ని పన్నారు. దానికి ముందు మహాబలుడైన భీమసేనుడు నిలిచాడు. దుర్ధర్షుడైన శిఖండి, ద్రుపదసుతుడు ధృష్టద్యుమ్నుడు కళ్ళుగా నిలిచారు. (7,8)
శీర్షే తస్యాభవద్ వీరః సాత్యకిః సత్యవిక్రమః ।
విదున్వన్ గాండివం పార్థః గ్రీవాయానుభవత్ తదా ॥ 9
సత్యవిక్రముడు, వీరుడు అయిన సాత్యకి దాని శీర్షస్థానంలో నిలిచాడు. అప్పుడు అర్జునుడు ధనుష్టంకారం చేస్తూ మెడభాగంలో నిలిచాడు. (9)
అక్షౌహిణ్యా సమం తత్ర వామపక్షోఽభవత్ తదా ।
మహాత్మా ద్రుపదః శ్రీమాన్ సహ పుత్రేణ సంయుగే ॥ 10
మహాత్ముడు, శ్రీమంతుడు అయిన ద్రుపదుడు పుత్రునితో సహా ఒక అక్షౌహిణిసేనతో యుద్ధంలో ఆ వ్యూహానికి ఎడమరెక్కగా నిలిచాడు. (10)
దక్షిణశ్చాభవత్ పక్షః కైకేయోఽక్షౌహిణీపతిః ।
పృష్ఠతో ద్రౌపదేయాశ్చ సౌభద్రశ్చాపి వీర్యవాన్ ॥ 11
ఒక అక్షౌహిణిసేనకు అధిపతి అయిన కేకయుడు కుడిరెక్కగా నిలిచాడు. ద్రౌపది కొడుకులు, పరాక్రమవంతుడైన అభిమన్యుడు వెనుక ప్రక్క నిలిచారు. (11)
పృష్ఠే సమభవచ్ఛ్రీమాన్ స్వయం రాజా యుధిష్ఠిరః ।
భ్రాతృభ్యాం సహితో వీరః యమాభ్యాం చారువిక్రమః ॥ 12
శ్రీమంతుడు, వీరుడు, చారువిక్రముడు అయిన యుధిష్ఠిర నరపాలుడు కూడా నకుల సహదేవులతో కలిసి వెనుకవైపు నిలిచాడు. (12)
ప్రవిశ్య తు రణే భీమః మకరం ముఖతస్తదా ।
భీష్మమాసాద్య సంగ్రామే ఛాదయామాస సాయకైః ॥ 13
అప్పుడు భీముడు రణరంగంలో ప్రవేశించి, మకరవ్యూహానికి ముందు భాగాన నిలిచియున్న భీష్ముని సమీపించి, బాణాలతో ఆయనను కప్పివేశాడు. (13)
తతో భీష్మో మహాస్త్రాణి పాతయామాస భారత ।
మోహయన్ పాండుపుత్రాణాం వ్యూఢం సైన్యం మహాహవే ॥ 14
భారతా! ఆపై భీష్ముడు ఆ మహాసంగ్రామంలో పాండవుల సైన్యవ్యూహాన్ని మోహింపజేస్తూ, మహాస్త్రాలను ప్రయోగించాడు. (14)
సమ్ముహ్యతి తదా సైన్యే త్వరమాణో ధనంజయః ।
భీష్మం శరసహస్రేణ వివ్యాధ రణమూర్ధని ॥ 15
తన సేన మోహానికి గురికావటం గమనించి, అర్జునుడు వేగంగా వేయిబాణాలతో రణశీర్షంలో భీష్ముని గాయపరిచాడు. (15)
ప్రతిసంవార్య చాస్త్రాణి భీష్మముక్తాని సంయుగే ।
స్వేనానీకేన హృష్టేన యుద్ధాయ సముపస్థితః ॥ 16
యుద్ధంలో భీష్ముడు ప్రయోగించిన అస్త్రాల నన్నింటిని నివారించి, తనసేనను ఆనందపరిచి, యుద్ధానికి సన్నద్ధమయ్యాడు అర్జునుడు. (16)
తతో దుర్యోధనో రాజా భారద్వాజమభాషత ।
పూర్వం దృష్ట్వా వధం ఘోరం బలస్య బలినాం వరః ॥ 17
భ్రాతౄణాం చ వధం యుద్ధే స్మరమాణో మహారథః ।
ఆచార్య సతతం హి త్వం హితకామో మమానఘ ॥ 18
అప్పుడు బలవంతులలో శ్రేష్ఠుడూ, మహారథుడూ అయిన దుర్యోధనుడు గతంలో తన సేన ఘోరంగా చనిపోవటాన్ని, యుద్ధంలో తన సోదరులు మరణించటాన్ని తలచుకొంటూ ద్రోణునితో ఇలా అన్నాడు. 'అనఘా! ఆచార్యా! నీవు ఎప్పుడూ నా హితాన్ని కోరేవాడవు. (17,18)
వయం హి త్వాం సమాశ్రిత్య భీష్మం చైవ పితామహమ్ ।
దేవానపి రణే జేతుం ప్రార్థయామో న సంశయః ॥ 19
కిము పాండుసుతాన్ యుద్ధే హీనవీర్యపరాక్రమాన్ ।
స తథా కురు భద్రం తే యథా వధ్యంతి పాండవాః ॥ 20
మేము కూడా నిన్ను, పితామహుడైన భీష్ముని ఆశ్రయించి, దేవతలనైనా యుద్ధంలో గెలవాలని కోరుకొనే వాళ్ళం. అందులో సందేహం లేదు. ఇక బలహీనులు, పరాక్రమహీనులు అయిన పాండవులను యుద్ధంలో గెలవటమేపాటి? నీకు మేలు జరుగుతుంది. యుద్ధంలో పాండవులు మరణించేటట్లు ప్రయత్నించు." (19,20)
ఏవముక్తస్తతో ద్రోణః తవ పుత్రేణ మారిష ।
(ఉవాచ తత్ర రాజానం సంక్రుద్ధ ఇవ నిఃశ్వసన్ ।
మారిషా! నీ కుమారుడు అలా అనగానే ద్రోణుడు కోపంతో నిట్టూర్పులు విడుస్తూ దుర్యోధనునితో ఇలా అన్నాడు.
ద్రోణ ఉవాచ
బాలిశస్త్వం న జానీషే పాండవానాం పరాక్రమమ్ ।
న శక్యా హి యథా జేతుం పాండవా హి మహాబలాః ॥
యథాబలం యథావీర్యం కర్మ కుర్యామహం హి తే ।
ద్రోణుడు అంటున్నాడు. "నీవు మూర్ఖుడవు. పాండవుల పరాక్రమం నీ వెరుగవు. మహాబలులయిన పాండవులను గెలవటం తేలికకాదు. నా బలానికి, నా పరాక్రమానికి తగినట్టుగానే నీ పని చేసిపెడుతున్నాను."
సంజయ ఉవాచ
ఇత్యుక్త్వా తే సుతం రాజన్ అభ్యపద్యత వాహినీమ్) ।
అభినత్ పాండవానీకం ప్రేక్షమాణస్య సాత్యకేః ॥ 21
సంజయుడిలా చెప్తున్నాడు. 'రాజా! నీ కొడుకుతో అలా అని (ద్రోణుడు) పాండవసేనను ఎదిరించాడు. సాత్యకి చూస్తుండగానే పాండవసేనను చెదరగొట్టాడు. (21)
సాత్యకిస్తు తతో ద్రోణం వారయామాస భారత ।
తయోః ప్రవవృతే యుద్ధం ఘోరరూపం భయావహమ్ ॥ 22
భారతా! ఆ తరువాత సాత్యకి ద్రోణుని నిలువరించాడు. వారిద్దరి మధ్య ఘోరంగా, భయంకరంగా యుద్ధం జరిగింది. (22)
శైనేయం తు రణే క్రుద్ధః భారద్వాజః ప్రతాపవాన్ ।
అవిధ్యన్నిశితైర్బాణైః జత్రుదేశే హసన్నివ ॥ 23
ప్రతాపవంతుడైన ద్రోణుడు యుద్ధభూమిలో కోపించి, నవ్వుతూ వాడియైన బాణాలతో సాత్యకి మెడక్రింది ఎముకమీద కొట్టాడు. (23)
భీమసేనస్తతః క్రుద్ధః భారద్వాజమవిధ్యత ।
సంరక్షన్ సాత్యకిం రాజన్ ద్రోణాచ్ఛస్త్రభృతాం వరాత్ ॥ 24
రాజా! అప్పుడు భీమసేనుడు క్రుద్ధుడై, మేటివిలుకాడైన ద్రోణుని నుండి సాత్యకిని కాపాడుతూ ద్రోణుని గాయపరిచాడు. (24)
తతో ద్రోణశ్చ భీష్మశ్చ తథా శల్యశ్చ మారిష ।
భీమసేనం రణే క్రుద్ధాః ఛాదయాంచక్రిరే శరైః ॥ 25
మారిషా! ఆ తరువాత ద్రోణుడు, భీష్ముడు, శల్యుడు ఒక్కటై కోపంతో యుద్ధంలో భీమసేనుని బాణాలతో కప్పివేశారు. (25)
తత్రాభిమన్యుః సంక్రుద్ధః ద్రౌపదేయాశ్చ మారిష ।
వివ్యధుర్నిశితైర్బాణైః సర్వాంస్తామద్యతాయుధాన్ ॥ 26
మారిషా! అక్కడ కోపించిన అభిమన్యుడు, ద్రౌపది కొడుకులు కలిసి పదునైన బాణాలతో ఆయుధాల నెక్కుపెట్టిన ద్రోణాదులను గాయపరిచారు. (26)
ద్రోణభీష్మౌ తు సంక్రుద్ధౌ ఆపతంతౌ మహాబలౌ ।
ప్రత్యుద్యయౌ శిఖండీ తు మహేష్వాసో మహాహవే ॥ 27
తీవ్రకోపంతో మీదకు వస్తున్న మహాబలులైన ద్రోణభీష్ములను ఆ మహాసంగ్రామంలో మేటివిలుకాడైన శిఖండి ఎదిరించాడు. (27)
ప్రగృహ్య బలవద్ వీరః ధనుర్జలదనిః స్వనమ్ ।
అభ్యవర్షచ్ఛరైస్తూర్ణం ఛాదయానో దివాకరమ్ ॥ 28
మేఘాల వలె గర్జించే తన ధనుస్సును బలమంతా వాడి, లాగి, వేగంగా సూర్యుని కప్పివేస్తూ, బాణ వృష్టిని కురిపించాడు. (28)
శిఖండినం సమాసాద్య భరతానాం పితామహః ।
అవర్జయత సంగ్రామం స్త్రీత్వం తస్యానుసంస్మరన్ ॥ 29
భరతకుల పితామహుడైన భీష్ముడు శిఖండిని సమీపించి, అతనిలోని స్త్రీత్వాన్ని తలచి యుద్ధాన్ని విరమించాడు. (29)
తతో ద్రోణో మహారాజ అభ్యద్రవత తం రణే ।
రక్షమాణస్తదా భీష్మం తవ పుత్రేణ చోదితః ॥ 30
మహారాజా! అప్పుడు నీ కుమారుని ప్రేరణచే ద్రోణుడు భీష్ముని రక్షిస్తూ, యుద్ధంలో ముందుకురికాడు. (30)
శిఖండీ తు సమాసాద్య ద్రోణం శస్త్రభృతాం వరమ్ ।
అవర్జయత సంత్రస్తః యుగాంతాగ్నిమివోల్బణమ్ ॥ 31
ప్రళయకాలంలోని అగ్నివలె ప్రచండంగా కనిపిస్తున్నమేటి శస్త్రధారి అయిన ద్రోణుని సమీపించి, శిఖండి భయంతో యుద్ధాన్ని మానాడు. (31)
తతో బలేన మహతా పుత్రస్తవ విశాంపతే ।
జుగోప భీష్మమాసాద్య ప్రార్థయానో మహద్ యశః ॥ 32
రాజా! ఆ తరువాత మహాయశస్సు కోరుతున్న నీ కొడుకు పెద్దసేనతో భీష్ముని సమీపించి ఆయనను కాపాడాడు. (32)
తథైవ పాండవా రాజన్ పురస్కృత్య ధనంజయమ్ ।
భీష్మమేవాభ్యవర్తంత జయే కృత్వా దృఢాం మతిమ్ ॥ 33
రాజా! అలాగే పాండవులు కూడా గెలుపుమీదనే మనస్సును తీవ్రంగా నిలిపి, అర్జునుని ముందు నిలుపుకొని, భీష్ముని కెదురువచ్చారు. (33)
తద్ యుద్ధమభవద్ ఘోరం దేవానాం దానవైరివ ।
జయమాకాంక్షతాం సంఖ్యే యశశ్చ సుమహాద్భుతమ్ ॥ 34
యుద్ధంలో విజయాన్ని, అద్భుతయశస్సును కాంక్షించే పాండవులకు - దేవతలకు దానవులతో జరిగినట్లు - కౌరవులతో భీకరంగా పోరు జరిగింది." (34)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి పంచమదివసయుద్ధారంభే ఏకోనసప్తతితమోఽధ్యాయః ॥ 69 ॥
ఇది శ్రీ మహాభారతమున భీష్మపర్వమున భీష్మవధపర్వమను ఉపపర్వమున పంచమదివస యుద్ధారంభమను అరువది తొమ్మిదవ అధ్యాయము. (69)
(దాక్షిణాత్య అధిపపాఠం 5 1/2 శ్లోకాలతో కలిపి 39 1/2 శ్లోకాలు)