32. ముప్పది రెండవ అధ్యాయము

గరుడుడు యుద్ధము చేసి దేవతలను ఓడించుట.

సౌతిరువాచ
తతస్తస్మిన్ ద్విజశ్రేష్ఠ సముదీర్నే తథావిధే ।
గరుడః పక్షిరాట్ తూర్ణం సంప్రాప్తో విబుధాన్ ప్రతి ॥ 1
తం దృష్ట్వాతిబలం చైవ ప్రాకంపంత సురాస్తతః ।
పరస్పరం చ ప్రత్యఘ్నన్ సర్వప్రహరణాన్యుత ॥ 2
ఉగ్రశ్రవుడు శౌనకుడితో చెపుతున్నాడు. బ్రాహ్మణోత్తమా! దేవతలందరూ అస్త్రశస్త్రాలతో గరుడునితో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. పక్షీంద్రుడయిన గరుడుడు దేవతల్ని సమీపించాడు. దేవతలు అతిబలవంతుడయిన గరుడుని చూడగానే వణికి పోయారు. వారి ఆయుధాలు ఒక దానినొకటి డీకొన్నాయి. (1,2)
తత్ర చాసీదమేయాత్మా విద్యుదగ్నిసమప్రభః ।
భౌమనః సుమహావీర్యః సోమస్య పరిరక్షితా ॥ 3
అక్కడ అగ్నితోను, విద్యుత్తుతోను సమానంగా ప్రకాశించే తేజస్వంతుడు మహా పరాక్రమవంతుడు అయిన భౌమనుడు (విశ్వకర్మ) అమృతరక్షకభటుడుగా ఉన్నాడు. (3)
స తేన పతగేంద్రేణ పక్షతుండనఖక్షతః ।
ముహూర్తమతులం యుద్ధం కృత్వా వినిహతో యుధి ॥ 4
అతడు పక్షీంద్రునితో రెండు ఘడియల పాటు యుద్ధం చేశాడు. కాని గరుడుడు అతడిని రెక్కలతో, ముక్కుతోను, గోళ్లతోను బాధించి సంహరించాడు (4)
రజశ్చోద్ధూయ సుమహతే పక్షవాతేన ఖేచరః ।
కృత్వా లోకాన్ నిరాలోకాన్ తేన దేవానవాకిరత్ ॥ 5
గరుడుడు తనపక్షవిక్షేపంతో స్వర్గలోకం అంతా దుమ్ము వ్యాపించేటట్లు చేశాడు. ఆ విధంగా వారి చూపును మందగింప జేశాడు. (5)
తేనావకీర్ణా రజసా దేవా మోహముపాగమన్ ।
న చైవం దదృశుశ్ఛన్నాః రజసామృతరక్షిణః ॥ 6
ఆ విధంగా వ్యాపింపజేసిన దుమ్మువలన దేవతలందరు అంధకారంలో పడిపోయారు. అమృతరక్షకులు కూడా ఆ దుమ్ము వలన గరుడుని చూడలేక పోయారు. (6)
ఏవం సంలోడయామాస గరుడస్త్రిదివాలయమ్ ।
పక్షతుండప్రహారైస్తు దేవాన్ స విదదార హ ॥ 7
ఇలా గరుడుడు స్వర్గలోకాన్ని కకావికలం చేశాడు. అంతేకాదు. తన రెక్కలతోను, ముక్కుతోను దేవతల్ని చీల్చి చెండాడాడు. (7)
తతో దేవః సహస్రాక్షఃతూర్ణం వాయుమచోదయత్ ।
విక్షిపేమాం రజోవృష్టిం తవేదం కర్మ మారుత ॥ 8
అపుడు సహస్రాక్షుడైన ఇంద్రుడు వాయుదేవుని ప్రేరేపించాడు. "మారుతా! ఈ ధూళిని చెదరగొట్టడం నీ పనే సుమా" అని ఆజ్ఞాపించాడు. (8)
అథ వాయురపోవాహ తద్ రజస్తరసా బలీ ।
తతో వితిమిరే జాతె దేవాః శకునిమార్దయన్ ॥ 9
ఇంద్రుని ఆజ్ఞప్రకారం వాయుదేవుడు ఆ ధూళిని చెదరగొట్టాడు. అంధకారం తొలగిపోయింది. దేవతలు పక్షిరాజును తమ అస్త్రశస్త్రాలతో బాధింప సాగారు. (9)
ననాదోచ్చైః స బలవాన్ మహామేఘ ఇవాంబరే ।
వధ్యమానః సురగణైః సర్వభూతాని భీషయన్ ॥ 10
దేవతల ప్రహారాలను సహిస్తూ ఆకాశానికి ఎగిరి మేఘం లాగా భయంకరంగా అట్టహాసం చేస్తూ అందరిని భయ భ్రాంతులను చేస్తున్నాడు గరుడుడు. (10)
ఉత్పపాత మహావీర్యః పక్షిరాట్ పరవీరహా ।
సముత్పత్యాంతరిక్షస్థం దేవానాముపరిస్థితమ్ ॥ 11
వర్మిణో విబుధాః సర్వే నానాశస్త్రైరవాకిరన్ ।
పట్టిశైః పరిఘైః శూలైః గదాభిశ్చ సవాసవాః ॥ 12
శత్రు వీరులను సంహరిస్తూ పక్షీంద్రుడు తన పరాక్రమం చూపిస్తున్నాడు. ఆకాశంలోని కెగిరి దేవతలతో పోరాడుతున్నాడు. దేవతలందరు ఇంద్రుడితో సహా అతని పైకి పట్టిశం, పరిఘ, శూలం, గద మొదలైన అనేకాయుధాలను ప్రయోగిస్తున్నారు. (11,12)
క్షురప్రైర్జ్వలితైశ్చాపి చక్రైరాదిత్యరూపిభిః ।
నానాశస్త్రవిసర్గైస్తైః వధ్యమానః సమంతతః ॥ 13
అగ్నితో సమానంగా ప్రజ్వరిల్లే అర్థ చంద్రాకార బాణాలు (క్షురములు), సూర్యునితో సమానంగా ప్రకాశించే చక్రాయుధాలు, ఇంకా అనేకాయుధాలు గరుడునిపై ప్రయోగిస్తూ యుద్ధం చేస్తున్నారు. (13)
కుర్వన్ సుతుములం యుద్ధం పక్షిరాణ్ణ వ్యకంపత ।
నిర్దహన్నివ చాకాశే వైనతేయః ప్రతాపవాన్ ।
పక్షాభ్యామురసా చైవ సమంతాద్ వ్యక్షిపత్ సురాన్ ॥ 14
వారందరూ కలసి పోరాడుతున్నా గరుడుడు ఏ మాత్రం చలింప లేదు. ప్రతాపవంతుడైన వినతాసుతుడు ఆకాశం నుండే తన రెక్కలతోను, ఱొమ్ముతోను వాళ్లను ఎదుర్కొంటూ అంతటా తానై విజృంభిస్తున్నాడు. (14)
తే విక్షిప్తాస్తతో దేవాః దుద్రువుర్గరుడార్దితాః ।
నఖతుండక్షతాశ్చైవ సుస్రువుః శోణితం బహు ॥ 15
గరుడుని చేత బాధింపబడిన దేవతలందఱు చెల్లాచెదరు అయ్యారు. గరుడుని దెబ్బలకు రక్తం కార్చుకొంటూ అటూ ఇటూ పరువు లెత్తారు. (15)
సాధ్యాః ప్రాచీం సగంధర్వాః వసవో దక్షిణాం దిశమ్ ।
ప్రజగ్ముః సహితౌ రుద్రః పతగేంద్రప్రధర్షితాః ॥ 16
గరుడని దెబ్బలకు తట్టుకోలేక సాధ్యులు, గంధర్వులు తూర్పు దిక్కుకు పారిపోయారు. వసువులు దక్షిణదిశకు పారిపోయారు. రుద్రులు కూడా దక్షిణ దిక్కుకు పారిపోయారు. (16)
దిశం ప్రతీచీమాదిత్యాః నాసత్యావుత్తరాం దిశమ్ ।
ముహుర్ముహుః ప్రేక్షమాణాః యుధ్యమానా మహౌజసః ॥ 17
ఆదిత్యులు పడమటి దిక్కుకు, అశ్వినీదేవతలు ఉత్తర దిక్కుకు పారిపోయారు. మహాపరాక్రమవంతుని ధాటికి భయపడుతూ మాటి మాటికి వెను దిరిగి చూస్తూ భయంతో పారిపోతున్నారు. (17)
అశ్వక్రందేన వీరేణ రేణుకేన చ పక్షిరాట్ ।
క్రథనేన చ శూరేణ తపనేన చ ఖేచరః ॥ 18
ఉలూకశ్వసనాభ్యాం చ నిమేషేణ చ పక్షిరాట్ ।
ప్రరుజేన చ సంగ్రామం చకార పులినేన చ ॥ 19
ఆకాశంలో అశ్వక్రందుడు, రేణుకుడు, తపనుడు, ఉలూకుడు, శ్వసనుడు, ప్రరుజుడు, పులినుడు అనే యక్షులతో ఖగేంద్రుడు భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. (18,19)
తాన్ పక్షనఖతుండాగ్రైః అభినద్ వినతాసుతః ।
యుగాంతకాలే సంక్రుద్ధః పినాకీవ పరంతపః ॥ 20
కాని వారినందరినీ తానొక్కడే గోళ్ళతోను, రెక్కలతోను, ముక్కులతోను, గరుడుడు ప్రళయ కాలంలోని రుద్రుడు లాగా బాధించి ఓడించాడు. (20)
మహాబలా మహోత్సాహాః తేన తే బహుధా క్షతాః ।
రేజురభ్రఘనప్రఖ్యాః రుధిరౌఘప్రవర్షిణః ॥ 21
ఆ యక్షులందరు మహాబలాఢ్యులు. ఉత్సాహంతో పోరాడారు. అట్టివారు గరుడని దెబ్బలతో రక్తం కార్చుకొంటూ మేఘాల్లాగా చెల్లాచెదరయ్యారు. (21)
తాన్ కృత్వా పతగశ్రేష్ఠః సర్వానుత్క్రాంత జీవితాన్ ।
అతిక్రాంతో ఽమృతస్యార్థే సర్వతోఽగ్నిమపశ్యత ॥ 22
ఆ విధంగా వాళ్లను అందరినీ సంహరించి గరుడుడు అమృతాన్ని తీసుకొని వెళ్లడానికి ఆ ప్రదేశానికి వచ్చాడు. అక్కడ దాని చుట్టూ ప్రజ్వరిల్లుతున్న అగ్నిని చూశాడు. (22)
ఆవృణ్వానం మహాజ్వాలమ్ అర్చిభిః సర్వతోఽంబరమ్ ।
దహంతమివ తీక్ష్ణాంశుం చండవాయుసమీరితమ్ ॥ 23
ఆ అగ్నికి తోడుగా వాయువు వీచింది. ప్రళయాగ్నిలాగా మండుతూ ఆకాశం అంతా అగ్ని జ్వాలలు వ్యాపించాయి. (23)
తతో నవత్యా నవతీర్ముఖానామ్
కృత్వా మహాత్మా గరుడస్తపస్వీ ।
నదీః సపాపీయముఖైస్తతస్తైః
సుశీఘ్రమాగమ్య పునర్జవేన ॥ 24
జ్వలంతమగ్నిం తమమిత్రతాపనః
సమాస్తరత్పత్రరథో నదీభిః ।
తతః ప్రచక్రే వపురన్యదల్పం
ప్రవేష్టుకామోఽగ్ని మభిప్రశామ్య ॥ 25
మహావేగశాలియైన గరుడుడు ఎనిమిదివేల వంద ముఖాల్ని కల్పించుకొని అనేకనదులలోని జలాన్ని పీల్చి అమితవేగంతో అమృతం ఉన్నచోటికి వచ్చి పూత్కరించి, నీటిని అంతటా వెదజల్లి అగ్నిని చల్లార్చాడు. తరువాత తన శరీరాన్ని బాగా కుంచింప జేశాడు. (24,25)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి సౌపర్ణే ద్వాత్రింశోఽధ్యాయః ॥ 32 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున సౌపర్ణోపాఖ్యానము అను ముప్పది రెండవ అధ్యాయము. (32)