33. ముప్పది మూడవ అధ్యాయము
గరుడుడు అమృతమును అపహరించుట.
సౌతిరువాచ
జాంబూనదమయో భూత్వా మరీచినికరోజ్జ్వలః ।
ప్రవివేశ బలాత్ పక్షే వారివేగ ఇవార్ణవమ్ ॥ 1
గరుడుడు కనకమయరూపుడై, కిరణసముదాయంతో ఉజ్జ్వలుడై, సముద్రంలోకి ప్రవేశించే నదీజలవేగంతో బలంగా ప్రవేశించాడు. (1)
సచక్రం క్షురపర్యంతమ్ అపశ్యదమృతాంతికే ।
పరిభ్రమంతమనిశం తీక్ష్ణధారమయస్మయమ్ ॥ 2
ఆ అమృతం దగ్గర ఒకచక్రం ఉంది. ఎవ్వరూ ప్రవేశించడానికి వీలులేకుండా అతివేగంగా తిరుగుతోంది. ఆ చక్రం వాడి అంచులు కలిగి ఉంది. దాన్ని గరుడుడు చూశాడు. (2)
జ్వలవార్కప్రభం ఘోరం భేదనం సోమహారిణామ్ ।
ఘోరరూపం తదత్యర్థే యంత్రం దేవైః సునిర్మితమ్ ॥ 3
ఆ భయంకరమైన చక్రం అగ్నివలె సూర్యునివలె జాజ్జ్వలమానంగా ఉంది. దేవతలు అమృతరక్షణార్థం ఆ చక్రాన్ని అతిభయంకరంగా నిర్మింపచేశారు. అమృతం హరించే వారిని అది ఛేదిస్తుంది. (3)
తస్యాంతరం స దృష్ట్వైవ పర్యవర్తత ఖేచరః ।
అరాంతరేణాభ్యపతత్ సంక్షిప్యాంగం క్షణేన హ ॥ 4
గరుత్మంతుడు ఆ చక్రం లోపలికి చూస్తూ ఆకాశంలో నిలిచి, క్షణంలో తన శరీరాన్ని సంకుచితం చేసి ఆ చక్రంలోని ఆకుల మధ్యలో ప్రవేశించాడు. (4)
అధశ్చక్రస్య చైవాత్ర దీప్తానలసమద్యుతీ ।
విద్యుజ్జిహ్వే మహావీర్యౌ దీప్తాస్యౌ దీస్తలోచనౌ ॥ 5
చక్షుర్విసౌ మహాఘోరౌ నిత్యం క్రుద్ధౌ తరస్వినౌ ।
రక్షార్థమేవామృతస్య దదర్శ భుజగోత్తమౌ ॥ 6
ఆ చక్రం క్రింద అమృతరక్షణ కోసం రెండు పెద్దపెద్ద పాములున్నాయి. వాటి నాలుకలు విద్యుల్లతల వలె ఉన్నాయి. మండే అగ్నుల్లా ఉన్నాయి సర్పాలు. వాటి కళ్లు విషం కక్కుతూ భయంకరంగా ఉన్నాయి. అవి సదా క్రోధంతో వేగంగా ముందుకు దూకుతున్నట్లున్నాయి. (5,6)
సదా సంరబ్ధనయనౌ సదా చానిమిషేక్షణౌ ।
తయోరేకోఽపి యం పశ్యేత్ స తూర్ణం భస్మసాద్ భవేత్ ॥ 7
ఆ సర్పాల కళ్లల్లో క్రోధాగ్ని మండుతూ ఉంటుంది. అవి రెప్పవాల్చకుండా అమృతాన్ని కాపాడుతున్నాయి. ఆ సర్పాల్లో దేన్ని చూసినా వెంటనే వారు భస్మం కావలసిందే. (7)
తయో శ్చక్షూంషి రజసా సుపర్ణః సహసా వృణోత్ ।
తాభ్యామదృష్టరూపోఽసౌ సర్వతః సమతాడయత్ ॥ 8
ఆ పరిస్థితిలో గరుడుడు వాటికి కనపడకుండా ఆ సర్పాల కళ్లల్లో దుమ్ముకొట్టి వాటిని అన్ని దిక్కులనుండి పొడిచివేశాడు. (8)
తయోరంగే సమాక్రమ్య వైనతేయోఽంతరిక్షగః ।
ఆచ్ఛినత్ తరసా మధ్యే సోమమభ్యద్రవత్ తతః ॥ 9
సముత్పాట్యామృతం తత్ర వైనతేయస్తతో బలీ ।
ఉత్పపాత జవేనైవ యంత్రమున్మథ్య వీర్యవాన్ ॥ 10
ఆకాశంలో చరించే పక్షీంద్రుడు ఆ సర్పాలను పట్టుకొని వాటిని మధ్యకు రెండు ముక్కలు చేశాడు. తరువాత వెంటనే అమృతపాత్ర గ్రహించాడు. బలిష్టుడయిన గరుత్మంతుడు వేగంగా అమృతపాత్ర పైకెత్తి, ఆ యంత్రాన్ని బ్రద్దలు గొట్టి వెంటనే వేగంగా పాత్రతో పైకెగిరాడు. (9,10)
అపీత్వైవామృతం పక్షీ పరిగృహ్యాశు నిఃసృతః ।
ఆగచ్ఛదపరిశ్రాంతః ఆవార్యార్కప్రభాం తతః ॥ 11
అతడు అమృతం లభించినా త్రాగలేదు. త్వరగా ఆ చోటునుండి వెళ్లిపోవాలనే కోరికతో సూర్యకాంతిని తిరస్కరిస్తూ అలసట లేకుండా వచ్చేశాడు. (11)
విష్ణునా చ తదాకాశే వైనతేయః సమేయివాన్ ।
తస్య నారాయణస్తుష్టః తేనాలౌల్యేన కర్మణా ॥ 12
అపుడు శ్రీమన్నారాణుడు అతని అలోలుపత్వానికి సంతోషించి ఆకాశంలో అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతని కార్యదీక్షకు సంతోషించాడు. (12)
తమువాచావ్యయో దేవః వరదోఽస్మీతి ఖేచరమ్ ।
స వన్రే తవ తిష్ఠేయమ్ ఉపరీత్యంతరిక్షగః ॥ 13
అందుచేత అవ్యయుడయిన విష్ణుమూర్తి గరుడునితో "నీకు వరమివ్వాలని అనుకొంటున్నాను" అన్నాడు. ఆకాశంలో చరించే గరుడుడు "మీపైన (ధ్వజం మీద) ఉంటాను" అని కోరాడు. (13)
ఉవాచ చైవం భూయోఽపి నారాయణమిదం వచః ।
అజరశ్చామరశ్చ స్యామ్ అమృతేన వినాప్యహమ్ ॥ 14
ఇంకా "అమృతం త్రాగకుండానే నాకు ముసలితనమూ, మరణమూ లేకుండా వరం ఇవ్వవలసినదిగా ప్రార్థిస్తున్నాను" అని విష్ణుమూర్తిని గరుడుడు ప్రార్థించాడు. (14)
ఏవమస్త్వివి తం విష్ణుః ఉవాచ వినతాసుతమ్ ।
ప్రతిగృహ్య వరౌ తౌ చ గరుడో విష్ణుమబ్రవీత్ ॥ 15
'అలాగే అని విష్ణుమూర్తి గరుడుడునికి వరం ఇచ్చాడు, ఇలా రెండు వరాలు పొంది మళ్లీ గరుడుడు విష్ణువుతో ఇలా అన్నాడు. (15)
భవతేఽపి వరం దద్యాం వృణోతు భగవానపి ।
తం వవ్రే వాహనం విష్ణుః గరుత్మంతం మహాబలమ్ ॥ 16
దేవా! నేను కూడా నీకు వరం ఇవ్వాలని అనుకొంటున్నాను. అని అనగానే "నీవు నాకు ఎప్పుడూ వాహనంగా ఉండు" అని గరుడుని విష్ణువు కోరాడు. (16)
ధ్వజం చ చక్రే భగవాన్ ఉపరి స్థాస్యతీతి తమ్ ।
ఏవమస్త్వితి తం దేవమ్ ఉక్త్వా నారాయణం ఖగః ॥ 17
వవ్రాజ తరసా వేగాద్ వాయుం స్పర్ధన్ మహాజనః ।
తం వ్రజంతం ఖగశ్రేష్ఠం వజ్రేణేంద్రోఽభ్యతాడయత్ ॥ 18
హరంతమమృతం రోషాద్ గరుడం పక్షిణాం వరమ్ ।
విష్ణుమూర్తి గరుడునికి తన ధ్వజంలో స్థానం ఇచ్చాడు. ఆ విధంగానే ఉంటానని గరుడుడు నారాయణునితో అని, అతనిని విడిచి వాయువేగంతో కదలిపోతూంటే ఇంద్రుడు అమృతాన్ని అపహరించుకొని వెళ్తున్నాడనే రోషంతో గరుడునిపై వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. (17-18 1/2)
తమువాచేంద్రమాక్రందే గరుడః పతతాం వరః ॥ 19
ప్రహసన్ శ్లక్ష్ణయా వాచా తథా వజ్రసమాహతః ।
ఋషేర్మానం కరిష్యామి వజ్రం యస్యాస్థిసంభవమ్ ॥ 20
వజ్రస్య చ కరిష్యామి తవైవ చ శతక్రతో ।
ఏతత్ పత్రం త్యజామ్యేకం యస్యాంతం నోపలప్స్యసే ॥ 21
వజ్రంచేత అడ్డగింపబడిన ఖగేంద్రుడు ఇంద్రునితో పరిహాసంగా నవ్వుతూ మధురంగా ఇట్లా అన్నాడు. "దేవరాజా! నీ వజ్రాయుధం దధీచి మహర్షి వెన్నెముకతో తయారయింది. కాబట్టి ఈ ఆయుధాన్ని అవమానిస్తే మహర్షిని అవమానించినట్లే. ఆ మహనీయుని యందలి గౌరవంతో ఒక్క ఈకను మాత్రం ఇస్తున్నాను. దాన్నికూడా నీవు ఏమీ చేయలేవు. (19-21)
న చ వజ్రనిపాతేన రుజా మేఽస్తీహ కాచన ।
ఏవముక్త్వా తతః పత్రమ్ ఉత్ససర్జ స పక్షిరాట్ ॥ 22
నీ వజ్రప్రహారం వల్ల నా శరీరానికి ఎటువంటి బాధ కలుగదు సుమా!" అని ఇంద్రునితో పలికి ఆ పక్షీంద్రుడు ఒక్క ఈకను వదిలాడు. (22)
తదుత్సృష్టమభిప్రేక్ష్య తస్య పర్ణమనుత్తమమ్ ।
హృష్టాని సర్వభూతాని నామ చక్రుర్గరుత్మతః ॥ 23
ఈవిధంగా ఈకను విడవటం చూచిన సంతోషించిన జనులు.----- (23)
సురూపం పత్రమాలక్ష్య సుపర్ణోఽ యం భవత్వితి ।
తద్ దృష్ట్యా మహదాశ్చర్యం సహస్రాక్షః పురందరః ।
ఖగో మహిదిదం భూతమ్ ఇతి మత్వాభ్యభాషత ॥ 24
అతని సుందరమయిన ఆ ఈకను చూచి "ఇతడు సుపర్ణుడు అగుగాక!" అని పేరు పెట్టారు. ఈ ఆశ్చర్యకర సంఘటనను ఇంద్రుడు గుర్తించి ఈ పక్షి సామాన్యుడు కాడని మహాఖగేంద్రుడని తలచి అతనితో ఇలా అన్నాడు. (24)
శక్ర ఉవాచ
బలం విజ్ఞాతుమిచ్ఛామి యత తే పరమనుత్తమమ్ ।
సఖ్యం చానంతమిచ్ఛామి త్వయా సహ ఖగోత్తమ ॥ 25
ఖగోత్తమా! నీమహత్తరమైన బలాన్ని గూర్చి వినవలెనని అనుకొంటున్నాను. నీతో స్నేహం చేయాలని కోరుకొంటున్నాను. (25)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి సౌపర్ణే త్రయస్త్రింశోఽధ్యాయః ॥ 33 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున సౌపర్ణొపాఖ్యానము అను ముప్పది మూడవ అధ్యాయము. (33)