34. ముప్పది నాల్గవ అధ్యాయము

ఇంద్ర గరుడుల స్నేహము, మాతృదాస్యవిముక్తి.

గరుడ ఉవాచ
సఖ్యం మేఽస్తు త్వయా దేవ యథేచ్ఛసి పురందర ।
బలం తు మమ జానీహి మహచ్చాసహ్యమేవ చ ॥ 1
గరుడుడు చెప్పాడు. దేవేంద్రా! నీవు కోరిన ప్రకారం నీతో సఖ్యానికి అంగీకరిస్తున్నాను. సహింపరాని, నా మహాబలాన్ని గురించి తెలుసుకో! (1)
కామం నైతత్ ప్రశంసంతి సంతః స్వబలసంస్తవమ్ ।
గుణసంకీర్తనం చాపి స్వయమేవ శతక్రతో ॥ 2
మహేంద్రా! తమ బలాన్ని కానీ, గుణాలను కానీ తామే పొగడుకొనటాన్ని సత్పురుషులెవ్వరూ గొప్పగా ప్రశంసించరు. (2)
సఖేతి కృత్వా తు సఖే సృష్టో వక్ష్యామ్యహం త్వయా ।
న హ్యాత్మస్తవసంయుక్తం వక్తవ్యమనిమిత్తతః ॥ 3
నీవు స్నేహం చేయాలని కోరావు కాబట్టి చెప్పక తప్పదు. ఇది ఆత్మస్తుతి కాదు. అవసరం కదా! (3)
సపర్వతవనాముర్వీం ససాగరజలామిమామ్ ।
వహే పక్షేణ వై శక్ర త్వామప్యత్రావలంబినమ్ ॥ 4
పర్వతాలతో అడవులలో కూడిన భూమినంతటినీ, అపారమైన సముద్రాలనూ, నిన్ను నీ దేవలోకాన్ని కూడా ఒక్క రెక్కతో మోయగల బలం నాది. (4)
పర్వాన్ పంపిండితాన్ వాపి లోకాన్ సస్థాణుజంగమాన్ ।
వహేయమపరిశ్రాంతః విద్ధీదం మే మహద్ బలమ్ ॥ 5
స్థావర జంగమాత్మకమైన ఈ బ్రహ్మాండాన్ని అంతటిని ఒక్కరెక్కతో అనాయాసంగా మోయగల బలం నాది అని తెలుసుకో. (5)
సౌతిరువాచ
ఇత్యుక్తవచనం వీరం కిరీటీ శ్రీమతాం వరః ।
ఆహ శౌనక దేవేంద్రః సర్వలోకహితః ప్రభుః ॥ 6
ఏవమేవ యథాత్థ త్వం సర్వం సంభావ్యతే త్వయి ।
సంగృహ్యతామిదానీం మే సఖ్యమత్యంతముత్తమమ్ ॥ 7
అపుడు ఉగ్రశ్రవుడు అంటున్నాడు. శౌనకమహర్షీ! గరుడుని పరాక్రమాన్ని విన్న సర్వలోక హితుడైన దేవేంద్రుడు పక్షీంద్రునితో "మిత్రమా! నీవు చెప్పింది అంతా సత్యమే. అది సాధ్యమే, అందుచేత నాతో మైత్రిని స్వీకరించు" అని కోరాడు. (6,7)
న కార్యం యది సోమేన మమ సోమః ప్రదీయతామ్ ।
అస్మాంస్తే హి ప్రబాధేయుః యేభ్యో దద్యాద్ భవానిమమ్ ॥ 8
నీకు అమృతం అక్కరలేదుకదా! కావున నాకు అమృతకలశాన్ని తిరిగి ఇచ్చేయవలసింది. నీవు దీన్ని ఎవరికయినా ఇస్తే వారు మమ్మల్ని బాధించవచ్చు. (8)
గరుడ ఉవాచ
కించిత్ కారణముద్దిశ్య సోమోఽయం నీయతే మయా ।
న దాస్యామి సమాదాతుం సోమం కస్మైచిదప్యహమ్ ॥ 9
యత్రేమం తు సహస్రాక్ష నిక్షేపేయమహం స్వయమ్ ।
త్వమాదాయ తతస్తూర్ణం హరేథాస్త్రిదివేశ్వర ॥ 10
అపుడు గరుత్మంతుడు చెప్పాడు. "దేవేంద్రా! ఒకానొక కారణంచేత ఈ అమృతాన్ని తీసుకొని వెళ్తున్నాను. దీనిని త్రాగటానికి ఎవ్వరికీ ఇవ్వను. నేను స్వయంగా ఎక్కడ దీనిని ఉంచుతానో, అక్కడ నుండి వెంటనే దానిని నీవు హరించి తీసుకొని వెళ్లు. (9,10)
శక్ర ఉవాచ
వాక్యేనానేవ తుష్టోఽహం యత్ త్వయోక్తమిహాండజ ।
యమిచ్ఛసి వరం మత్తః తం గృహాణ ఖగోత్తమ ॥ 11
అపుడు ఇంద్రుడు ఇలా అన్నాడు. పక్షీంద్రా! ఇపుడు నీ మాటలకు సంతోషం కలిగింది. నీకు నా నుండి ఏ వరం కావాలో కోరుకో. (11)
సౌతిరువాచ
ఇత్యుక్తః ప్రత్యువాచేదం కద్రూపుత్రాననుస్మరన్ ।
స్మృత్వా చైవోపధికృతం మాతుర్దాస్యనిమిత్తతః ॥ 12
ఈశోఽహమపి సర్వస్య కరిష్యామి తు తేఽర్థితామ్ ।
భవేయుర్భుజగాః శక్ర మమ భక్ష్యా మహాబలాః ॥ 13
ఉగ్రశ్రవుడు ఇలా అంటున్నాడు. ఇంద్రుడు ఆ విధంగా వరం కోరుకొమ్మని అనడంతో గరుడుడు కద్రూపుత్రులను స్మరించాడు. తన తల్లిని వారు మోసగించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకొన్నాడు. అపుడు ఇంద్రునితో గరుడుడు "దేవేంద్రా! నాకు అసాధ్యం లేకపోయినప్పటికీ ఈ కోరిక కోరుతున్నాను. అమృతాన్ని ఇతరులకు ఇవ్వను. మహాబలవంతులైన సర్పాలు నాకు ఆహారంగా అగుగాక." (12,13)
తథేత్యుక్త్వాన్వగచ్ఛత్ తం తతో దానవసూదనః ।
దేవదేవం మహాత్మానం యోగినామీశ్వరం హరిమ్ ॥ 14
ఇంద్రుడు 'అట్లాగే' అన్నాడు. యోగీశ్వరుడు దేవాధిదేవుడు పరమాత్ముడు అయిన శ్రీహరి వెంట ఇంద్రుడు వెళ్లిపోయాడు. (14)
స చాన్వమోదత్ తం చార్థం యథోక్తం గరుడేవ వై ।
ఇదం భూయో వచః ప్రాహ భగవాంస్త్రిదశేశ్వరః ॥ 15
హరిష్యామి వినిక్షిప్తం సోమమిత్యనుభాష్య తమ్ ।
ఆజగామ తతస్తూర్ణం సుపర్ణో మాతురంతికమ్ ॥ 16
శ్రీహరి కూడా గరుడుని మాటకు సంతోషించాడు. మరల ఇంద్రుడు ఖగేంద్రుని దగ్గర "నీవు అమృతకలశాన్ని అక్కడ ఉంచగానే నేను తీసుకుని వెళ్తాను" అని మాట తీసుకొన్నాడు. అనంతరం గరుత్మంతుడు తన తల్లి దగ్గరకు వెళ్లిపోయాడు. (15,16)
అథ సర్పానువాచేదం సర్వాన్ పరమహృష్టవత్ ।
ఇదమానీతమమృతం నిక్షేప్స్యామి కుశేషు వః ॥ 17
స్నాతా మంగలసంయుక్తాః తతః ప్రాశ్నీత పన్నగాః ।
భవద్భిరిదమాసీనైః యదుక్తం తద్వచస్తథా ॥ 18
అదాసీ చైవ మాతేయమ్ అద్యప్రభృతి చాస్తు మే ।
యథోక్తం భవతామేతద్ వచో మే ప్రతిపాదితమ్ ॥ 19
గరుడుడు సంతోషంతో సర్పాలను అందరినీ పిలిచి వారితో "నాగులారా! నేను మీరు కోరిన విధంగా అమృతాన్ని తీసుకొని వచ్చాను. ఈ దర్భలపైన ఉంచుతాను. మీరు స్నానం చేసి శుచులై వచ్చి ఈ అమృతాన్ని పానం చేయండి. అమృతం తీసుకొని వచ్చి ఇస్తే మా తల్లి దాసీత్వం నుండి విముక్తి పొందుతుందని చెప్పారు గదా! ఆ మాట ప్రకారం అమృతం తెచ్చాను. నా తల్లి మీ దాసీత్వం నుండి నేటికి విముక్తురాలయినది. మీరు చెప్పినట్లు చేశానుగదా!" (17-19)
తతః స్నాతుం గతాః సర్పాః ప్రత్యుక్త్వా తం తథేత్యుత ।
శక్రోఽ ప్యమృతమాక్షిప్య జగామ త్రిదివం పునః ॥ 20
సర్పాలు ఆ మాటను అంగీకరించి స్నానం చేయటానికి వెళ్లాయి. ఆ సమయంలో ఇంద్రుడు ఆ అమృతకలశాన్ని తీసుకొని స్వర్గలోకానికి వెళ్లిపోయాడు. (20)
అథాగతాస్తముద్దేశం సర్పాః సోమార్థివస్తధా ।
స్నాతాశ్చ కృతజప్యాశ్చ ప్రహృష్టాః క్ఱ్రుతమంగలాః ॥ 21
యత్రైతదమృతం చాపి స్థాపితం కుశసంస్తరే ।
తద్ విజ్ఞాయ హృతం సర్పాః ప్రతిమాయాకృతం చ తత్ ॥ 22
అమృతం త్రాగాలనే కోరికతో స్నానాన్ని జపతపాలను కూడా చేసుకుని సంతోషంగా శుచిగా అమృతస్థానం దగ్గరకు సర్పాలు వచ్చాయి. దర్భలపైన అమృతకలశం లేకపోవడం గమనించాయి. ఎవరో అపహరించారని గ్రహించాయి. ఎవరో మోసగించారని తెలుసుకొన్నాయి. (21,22)
సోమస్థానమిదం చేతి దర్భాంస్తే లిలిహుస్తదా ।
తతో ద్విధాక్ఱ్రుతా జిహ్వాః సర్పాణాం తేన కర్మణా ॥ 23
ఈ దర్భలపైననే గదా అమృతకలశం ఉంచబడింది అని ఆ సర్పాలు దర్భల్ని నాకటం మొదలుపెట్టాయి. ఆ దర్భల వల్ల వాటి నాలుకలు రెండుగా చీలాయి. (23)
అభవంశ్చామృతస్పర్శాద్ దర్భాస్తేఽథ పవిత్రిణః ।
ఏవం తదమృతం తేన హృతమాహృతమేవ చ ।
ద్విహిహ్వాశ్చ కృతాః సర్పాః గరుడేన మహాత్మనా ॥ 24
అమృతస్పర్శచేత దర్భలు పవిత్రమైనాయి. ఈ విధంగా మహాపరాక్రమవంతుడైన గరుత్ముంతుడు అమృతాపహరణం చేసి సర్పాలకివ్వడం జరిగింది. సర్పాలు ద్విజిహ్వులు అయ్యేటట్లు చేశాడు గరుడుడు. (24)
తతః సుపర్ణ పరమప్రహర్షవాన్
విహృత్య మాత్రా సహ తత్ర కావనే ।
భుజంగభక్షః పరమార్చితః ఖగైః
అహీనకీర్తిర్వినతామనందయత్ ॥ 25
ఆనాటి నుండి సుపర్ణుడు సంతోషం పొంది తన తల్లితో స్వేచ్ఛగా వనంలో విహరిస్తున్నాడు. సర్పాలను భుజిస్తూ, ఇతర పక్షులచేత గౌరవింపబడుతూ తన మహోజ్జ్వలకీర్తితో తల్లిని ఆనందపరుస్తున్నాడు. (25)
ఇమాం కథాం యః శృణుయాన్నరః సదా
పఠేత వా ద్విజగణముఖ్యసంపది ।
అసంశయం త్రిదివమియాత్ స పుణ్యభాక్
మహాత్మనః పతగపతేః ప్రకీర్తనాత్ ॥ 26
బ్రాహ్మణగోష్ఠిలో ఈ కథను విన్నా, చదివిన ఆ పక్షీంద్రుని గుణాలను గానం చేసినా, తప్పక పుణ్యం కలుగుతుంది. అతడు స్వర్గసౌఖ్యాన్ని అనుభవిస్తాడు. (26)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి సౌపర్ణే చతుస్త్రింశోఽ ధ్యాయః ॥ 34 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమును ఉపపర్వమున సౌపర్ణోపాఖ్యానము అను ముప్పది నాలుగవ అధ్యాయము. (34)