91. తొంబది ఒకటవ అధ్యాయము

యయాతి అష్టకుల ఆశ్రమధర్మ సంవాదము.

అష్టక ఉవాచ
చరన్ గృహస్థః కథమేతి ధర్మాన్
కథం భిక్షుః కథమాచార్యకర్మా ।
వానప్రస్థః సత్పథే సంనివిష్టః
బహూన్యస్మిన్ సంప్రతి వేదయంతి ॥ 1
అష్టకుడిలా అడిగాడు - మహారాజా! ఆచార్యుని సేవచేసే బ్రహ్మచారి, గృహస్థుడు, భిక్షువు (సన్యాసి), మంచి మార్గంలో ఉన్న వానప్రస్థుడు వారి వారి ధర్మాల నాచరిస్తూ ఏవిధంగా ఉత్తమలోకాలను పొందగలరు? ఈ విషయంలో పండితులు అనేక మార్గాలను తెలియజేస్తున్నారు. (1)
యయాతి రువాచ
ఆహూతాధ్యాయీ గురుకర్మస్వచోద్యః
పూర్వోత్థాయీ చరమం చోపశాయీ ।
మృదుర్దాంతో ధృతిమానప్రమత్తః
స్వాధ్యాయశీలః సిద్ధ్యతి బ్రహ్మచారీ ॥ 2
యయాతి ఇలా చెప్పాడు - గురువు పిలుపందుకొని అధ్యయనం చేసేవాడు, గురుసేవలో స్వయంగానే ప్రవర్తించేవాడు, గురువుకంటె ముందుగా నిద్రలేచి, గురువు నిద్రించిన పిమ్మట నిద్రించేవాడు, మృదుస్వభావుడు, ఇంద్రియనిగ్రహం ధైర్యంకలవాడు, జాగరూకుడు, స్వాధ్యాయశీలుడూ అయిన బ్రహ్మచారి సిద్ధిని పొందుతాడు. (2)
ధర్మాగతం ప్రాప్య ధనం యజేత
దద్యాత్ సదైవాతిథీన్ భోజయేచ్చ ।
అనాదదానశ్చ పరైరదత్తం
సైషా గృహస్థోపనిషత్ పురాణీ ॥ 3
గృహస్థుడు ధర్మప్రకారం వచ్చిన ధనాన్ని పొంది యజ్ఞం చేయాలి. దానం చేయాలి. ఎల్లపుడు అతిథులకు భోజనం పెట్టాలి. ఇతరులచే ఇవ్వబడనిది స్వీకరించకూడదు. ఇది ప్రాచీనమైన గృహస్థుల సాధనమార్గం. (3)
స్వవీర్యజీవీ వృజినాన్నివృత్తః
దాతా పరేభ్యో న పరోపతాపీ ।
తాదృఙ్మునిః సిద్ధిముపైతి ముఖ్యాం
వసన్నరణ్యే నియతాహారచేష్టః ॥ 4
వానప్రస్థుడు స్వశక్తితో జీవించేవాడు, పాపం చేయనివాడు, ఇతరులకు దానం చేసేవాడు, ఇతరులకు బాధను కలిగింపనివాడు అయి ఉండాలి. నియతమైన ఆహారం, చేష్టలు కల్గి అరణ్యంలో నివసిస్తున్న ముని ముఖ్యసిద్ధిని పొందుతాడు. (4)
అశిల్పిజీవీ గుణవాంశ్చైవ నిత్యం
జితేంద్రియః సర్వతో విప్రయుక్తః ।
అనోకశాయీ లఘురల్పప్రచారః
చరన్ దేశానేకచరః స భిక్షుః ॥ 5
శిల్పకళచే జీవించనివాడు, గుణవంతుడు, జితేంద్రియుడు, అన్నింటికి దూరంగా ఉన్నవాడు, గృహస్థుని ఇంటియందు నిద్రింపనివాడు, పరిగ్రహభారం లేనివాడు, తక్కువ ప్రచారం కలవాడు, అనేకప్రదేశాలను ఒంటరిగా తిరిగేవాడు నిజమైన భిక్షువు. అట్టివాడు సిద్ధిని పొందుతాడు. (5)
రాత్య్రా యయా వాభిజితాశ్చ లోకాః
భవంతి కామాభిజితాః సుఖాశ్చ ।
తామేవ రాత్రిం ప్రయతేత విద్వాన్
అరణ్య సంస్థో భవితుం యాతాత్మా ॥ 6
లోకంలో ఏ రాత్రి విషయవాంఛలు, సుఖవాంఛలు జయింపబడతాయో ఆరాత్రే విద్వాంసుడు నిగ్రహంకలవాడై అరణ్యంలో ఉండడానికి ప్రయత్నించాలి. (6)
దశైవ పూర్వాన్ దశ చాపరాంశ్చ
జ్ఞాతీ నథాత్మాన మథైకవింశమ్ ।
అరణ్యవాసీ సుకృతే దధాతి
విముచ్యారణ్యే స్వశరీరధాతూన్ ॥ 7
అరణ్యవాసి అయిన ముని వనంలో తనపంచ భూతాత్మక శరీరాన్ని పరిత్యాగం చేస్తే పది ముందు తరాలను, పది తరువాతి తరాలను, ఇరువది యొక్క పుణ్యలోకాలను రక్షింపగలుగుతాడు. (7)
అష్టక ఉవాచ
కతిస్విదేవ మునయః కతి మౌనాని చాప్యుత ।
భవంతీతి తదాచక్ష్వ శ్రోతుమిచ్ఛామహే వయమ్ ॥ 8
అష్టకుడిలా అడిగాడు - మునులు ఎన్నిరకాలు? మౌనాలెన్నిరకాలున్నాయి? నాకు వినాలని ఉంది. చెప్పండి. (8)
యయాతి రువాచ
అరణ్యే వసతో యస్య గ్రామో భవతి పృష్ఠతః ।
గ్రామే వా వసతోఽరణ్యం స మునిః స్యాజ్జనాధిప ॥ 9
యయాతి ఇలా చెప్పాడు - అరణ్యంలో నివసించే వాని వెనుక గ్రామం ఉంటే, గ్రామంలో ఉన్నా వాని వెనుక అరణ్యముంటే అట్టివాడు ముని అవుతాడు. (9)
అష్టక ఉవాచ
కథంస్విద్ వసతోఽరణ్యే గ్రామో భవతి పృష్ఠతః ।
గ్రామే వా వసతోఽరణ్యం కథం భవతి పృష్ఠతః ॥ 10
అష్టకుడిలా అడిగాడు - అరణ్యంలో ఉన్నవానికి వెనుక గ్రామం ఎలా ఉంటుంది? గ్రామంలో ఉన్నవాని వెనుక అరణ్యం ఎలా ఉంటుంది? (10)
యయాతి రువాచ
న గ్రామ్యముపయుంజీత య ఆరణ్యో మునిర్భవేత్ ।
తథాస్య వసతోఽరణ్యే గ్రామో భవతి పృష్ఠతః ॥ 11
యయాతి ఇలా చెప్పాడు - అరణ్యంలో వానప్రస్థునిగా ఉన్న ముని గ్రామంలోని వస్తువులను ఉపయోగించకూడదు. అపుడు అరణ్యంలో నివసించే ఆముని వెనుక గ్రామమంతా ఉన్నట్లు ఉంటుంది. (11)
అనగ్ని రనికేత శ్చాప్యగోత్రచరణో మునిః ।
కౌపీనాచ్ఛాదనం యావత్ తావదిచ్ఛేచ్చ చీవరమ్ ॥ 12
యావత్ ప్రాణాభిసంధానం తావదిచ్ఛేచ్చ బోజనం ।
తథాస్య వసతోగ్రామే ఽరణ్యం భవతి పృష్ఠతః ॥ 13
అగ్నిని, ఇంటిని వదిలిపెట్టి, స్వవేదశాఖాది సంబంధాన్నివిడిచి, మౌనం వహించి, కౌపీనాచ్ఛాదనమాత్రానికి సరిపడిన వస్త్రాన్ని మాత్రమే స్వీకరించేవాడు, ప్రాణం నిలబెట్టడానికి కావలసినంత భోజనం మాత్రమే తీసికొనేవాడు గ్రామంలో నివసిస్తున్నా, అతని వెనుక అరణ్యం ఉన్నట్లే ఉంటుంది. (12,13)
యస్తు కామాన్ పరిత్యజ్య త్యక్తకర్మా జితేంద్రియః ।
ఆతిష్ఠేచ్చ మునిర్మౌనం స లోకే సిద్ధిమాప్నుయాత్ ॥ 14
విషయవాంఛలను విడిచి, కర్మప్రవృత్తిని మాని, జితేంద్రియుడై, మౌనాన్ని వహించి ఉండే ముని ఈ లోకంలో సిద్ధిని పొందుతాడు. (14)
ధౌతదంతం కృత్తనఖం సదా స్నాతమలంకృతమ్ ।
అసితం సితకర్మాణం కస్తమర్హతి నార్చితుమ్ ॥ 15
స్వచ్ఛమైన దంతాలు కలవాడు, గోళ్ళు కత్తిరించుకొన్నవాడు, ఎల్లపుడు స్నానం చేసి, అలంకరించు కొన్నవాడు, శీతోష్ణాలను సహించటం చేత నల్లని శరీరం కలవాడు, స్వచ్ఛమైన కర్మకలవాడు... ఇటువంటి మానవుని పూజించడానికి ఎవరికి అర్హత ఉండదు? అందరూ అర్హులే. (15)
తపసా కర్శితః క్షామః క్షీణమాంసాస్థిశోణితః ।
స చ లోకమిమం జిత్వా లోకం విజయతే పరమ్ ॥ 16
తపస్సుచే కృశించినవాడు, వడలిన శరీరం కలవాడు, మాంసం, ఎముకలు, రక్తం క్షీణించినవాడు ఈ లోకాన్ని జయించి, పరలోకాన్నికూడా జయిస్తాడు. (16)
యదా భవతి నిర్ద్వంద్వః మునిర్మౌనం సమాస్థితః ।
అథ లోకమిమం జిత్వా లోకం విజయతే పరమ్ ॥ 17
సుఖదుఃఖ రాగద్వేషాది ద్వంద్వాలకు అతీతుడై, మౌనాన్ని పాటించే ముని ఈ లోకాన్ని పరలోకాన్ని కూడా జయిస్తాడు. (17)
ఆస్యేన తు యదాహారం గోవన్మృగయతే మునిః ।
అథాస్య లోకః సర్వోఽయం సోఽమృతత్వాయ కల్పతే ॥ 18
గోవువలె ముఖంతో మాత్రమే ఎవడు ఆహారాన్ని గ్రహిస్తాడో హస్తాదులు ఉపయోగించడో (అనగా ఆహారాన్ని కూడ బెట్టడో) అట్టి మునికి ఈ లోకమంతా మోక్షానికి సమర్థమవుతుంది. (18)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ఉత్తరయాయాతే ఏకనవతితమోఽధ్యాయః ॥ 91 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున ఉత్తర యయాతి చరిత్రమను తొంబది ఒకటవ అధ్యాయము. (91)