92. తొంబది రెండవ అధ్యాయము

అష్టక యయాతుల సంవాదము, యయాతి చేయు పుణ్యదానములు ఇతరులు స్వీకరింపకపోవుట.

అష్టక ఉవాచ
కతరస్త్వనయోః పూర్వం దేవానామేతి సాత్మతామ్ ।
ఉభయోర్ధావతో రాజన్ సూర్యాచంద్రమసోరివ ॥ 1
అష్టకుడిలా అడిగాడు - రాజా! సూర్యచంద్రులవలె బ్రహ్మభావం పొందటానికి పరుగిడుతున్న వానప్రస్థ సన్యాసులలో ఎవరు ముందుగా దేవతల ఆత్మ భావాన్ని (బ్రహ్మభావాన్ని) పొందుతారు? (1)
యయాతి రువాచ
అనికేతో గృహస్థేషు కామవృత్తేషు సంయతః ।
గ్రామ ఏవ వసన్ భిక్షుః తయోః పూర్వతరం గతః ॥ 2
యయాతి ఇలా చెప్పాడు - విషయవాంఛా ప్రవృత్తి గల గృహస్థులు - గ్రామంలోనే ఉంటూ గృహం లేకుండా జితేంద్రియుడై ఉన్న సన్యాసి - వీరిరువురిలో ముందుగా సన్యాసి బ్రహ్మభావాన్ని పొందుతాడు (2)
అవాస్య దీర్ఘమాయుస్తు యః ప్రాప్తో వికృతిం చరేత్ ।
తప్యతే యది తత్ కృత్వా చరేత్ సోఽన్యత్ తపస్తతః ॥ 3
దీర్ఘమైన ఆయువును పొంది కూడా మనోవికారాలకు లోనై సంచరించినవాడు తరువాత పశ్చాత్తాపం చెందిన వానప్రస్థుడు మరల వేరొక తపస్సును ఆచరించాలి. (3)
పాపానాం కర్మణాం నిత్యం బిభియాద్ యస్తు మానవః ।
సుఖమప్యాచరన్ నిత్యం సోఽత్యంతం సుఖమేధత్ ॥ 4
పాపకర్మల పట్ల నిత్యం భయపడుతూ నిత్యం తన ధర్మాన్ని ఆచరించేవాడు అత్యంతసుఖమైన మోక్షాన్ని పొందుతాడు. (4)
తద్వై నృశంసం తదసత్యమాహుః
యః సేవతేఽర్థమనర్థబుద్ధిః ।
అర్థోఽప్యనీశస్య తథైవరాజన్
తదార్జవం స సమాధిస్తదార్యమ్ ॥ 5
రాజా! పాప బుద్ధికలవాడై అధర్మాన్ని ఆచరించేవాని పనిని పాపమని, అసత్యమని చెప్పారు. ఇంద్రియనిగ్రహంలేని ధనం కూడా అటువంటిదే. వానప్రస్థుని ధర్మపాలన ఋజువైనది. అదే సమాది. అదే శ్రేష్ఠమైంది కూడ. (5)
వి: సం: ఆర్యమ్ = ఆరాత్ దూరే గచ్ఛతి పాపమ్ అస్మాత్ ఇది ఆర్యః, తస్య భావః ఆర్యమ్.
అష్టక ఉవాచ
కేనాసి హూతః ప్రహితోఽసి రాజన్
యువా స్రగ్వీ దర్శనీయః సువర్చాః ।
కుత ఆయాతః కతరస్యాం దిశి త్వమ్
ఉతాహోస్విత్ పార్థివం స్థానమస్తి ॥ 6
అష్టకుడిలా అన్నాడు - రాజా! నిన్ను ఎవరు ఆహ్వానించారు? ఎవరు పంపారు? యువకుడవు, పుష్పమాల ధరించినవాడవు, అందమైనవాడవు, తేజస్సుకలవాడవు, ఎక్కడ నుండి వచ్చావు? ఏ దిక్కునకు వెళుతున్నావు? లేదా నీకొరకు రాజుస్థానం ఎక్కడైనా ఉందా? (6)
యయాతి రువాచ
ఇమం భౌమం నరకం క్షీణపుణ్యః
ప్రవేష్టుముర్వీం గగనాద్ విప్రహీణః ।
ఉక్త్వాహం వః ప్రపతిష్యామ్యనంతరం
త్వరంతి మాం లోకపా బ్రహ్మణో యే ॥ 7
యయాతి ఇలా చెప్పాడు - పుణ్యం క్షీణించిన నేను ఈ భౌమనరకాన్ని - భూమిని - ప్రవేశించడానికై ఆకాశం నుండి త్రోయబడ్డాను. బ్రహ్మయొక్క లోకపాలురు నన్ను తొందర పెడుతున్నారు. మీ అనుమతి పొందిన పిమ్మట భూమిపై పడతాను. (7)
సతాం సకాశే తు వృతః ప్రపాతః
తే సంగతా గుణవంతస్తు సర్వే ।
శక్రాచ్చ లబ్ధో హి వరో మయైషః
పతిష్యతా భూమితలం నరేంద్ర ॥ 8
రాజా! భూతలం మీద పడబోతున్న నేను గుణవంతులైన సత్పురుషుల దగ్గర పడటాన్ని కోరుకొని ఇంద్రుని వరాన్ని పొందాను. (8)
అష్టక ఉవాచ
పృచ్ఛామి త్వాం మా ప్రపత ప్రపాతం
యది లోకాః పార్థివ సంతి మేఽత్ర ।
యద్యంతరిక్షే యది వా దివి స్థితాః
క్షేత్రజ్ఞం త్వాం తస్య ధర్మస్య మన్యే ॥ 9
అష్టకుడిలా అడిగాడు - పార్థివా! ఒక విషయం నిన్ను అడుగుతున్నాను. అంతరిక్షంలోగాని, స్వర్గంలోకాని నేను పొందదగిన పుణ్యలోకా లున్నాయా! ఉన్నట్లయితే క్రిందపడవద్దు. మీకు పతనం జరుగదు. పౌరలౌకిక ధర్మాన్ని బాగా తెలిసినవాడవుగా నిన్ను నేను భావిస్తున్నాను. (9)
యయాతి రువాచ
యావత్ పృథివ్యాం విహితం గవాశ్వం
సహారణ్యైః పశుభిః పార్వతైశ్చ ।
తావల్లోకా దివి తే సంస్థితా వై
తథా విజానీహి నరేంద్రసింహ ॥ 10
యయాతి ఇలా చెప్పాడు - రాజశ్రేష్ఠా! ఈ భూమిపై గోవులు, అశ్వాలు, పర్వతాలలోని పశువులతో బాటు అరణ్యాలు ఉన్నంతకాలం స్వర్గంలో ఆ పుణ్యలోకాలు ఉంటాయి అని గ్రహించు. (10)
అష్టక ఉవాచ
తాంస్తే దదామి మా ప్రపత ప్రపాతం
యే మే లోకా దివి రాజేంద్ర సంతి ।
యద్యంతరిక్షే యది వా దివి శ్రితాః
తానాక్రమ క్షిప్ర మపేతమోహః ॥ 11
అపుడు అష్టకుడిలా అన్నాడు - రాజేంద్రా! నాకు లభించే ఆ పుణ్యలోకాలు నేను నీకు ఇస్తున్నాను. నీవు ఈ లోకంలో పడకు. మోహం తొలగి, తొందరగా అంతరిక్షంలో గాని, స్వర్గంలో గాని ఉన్న ఆ లోకాలను ఆక్రమించుకో. (11)
యయాతి రువాచ
నాస్మద్విధో బ్రాహ్మణో బ్రహ్మవిచ్చ
ప్రతిగ్రహే వర్తతే రాజముఖ్య ।
యథా ప్రదేయం సతతం ద్విజేభ్యః
తథాదదం పూర్వామహం నరేంద్ర ॥ 12
యయాతి ఇలా అన్నాడు - రాజముఖ్యా! నావంటి బ్రాహ్మణుడు, బ్రహ్మవేత్త దానం పట్టడు. పూర్వం నేను బ్రాహ్మణులకు ఇవ్వవలసినతీరులో ఎల్లపుడూ ఇచ్చేవాడిని. (12)
నా బ్రాహ్మణః కృపణో జాతు జీవేద్
యాచ్ఞాపి స్యాద్ బ్రాహ్మణీ వీరపత్నీ ।
సోఽహం నైవాకృతపూర్వం చరేయం
విధిత్సమానః కిము తత్ర సాధు ॥ 13
అ బ్రాహ్మణుడు (క్షత్రియుడు) యాచిస్తూ దీనుడై ఎప్పుడూ జీవించకూడదు. యాచన మనేది బ్రాహ్మణునికి పత్నివంటిది. నేను మునుపు ఎన్నడూ చేయని పనిని ఇపుడెలా చేయగలను. అందులో ఔచిత్యం ఏముంది? (13)
ప్రతర్దన ఉవాచ
పృచ్ఛామి త్వాం స్పృహణీయరూప
ప్రతర్దనోఽహం యది మే సంతి లోకాః ।
యద్యంతరిక్షే యది వా దివి శ్రితాః
క్షేత్రజ్ఞం త్వాం తస్య ధర్మస్య మన్యే ॥ 14
ప్రతర్దనుడిలా అన్నాడు - కోరదగిన రూపం కలవాడా! ప్రతర్దనుడనగు నేను నిన్ను అడుగుతున్నాను - అంతరిక్షంలో కాని, స్వర్గంలోకంలోగాని నాకు చెందదగిన లోకాలు ఉన్నాయా. నిన్ను ఈ పారలౌకిక ధర్మాన్ని బాగా తెలిసినవాడిగ భావిస్తున్నాను. (14)
యయాతి రువాచ
సంతి లోకా బహవస్తే నరేంద్ర
అప్యేకైకః సప్త సప్తాప్యహాని ।
మధుచ్యుతో ఘృతపృక్తా విశోకాః
తే నాంతవంతః ప్రతిపాలయంతి ॥ 15
యయాతి ఇలా అన్నాడు - నరేంద్రా! నీకు చాలా లోకాలున్నాయి. ఒక్కొక్కలోకంలో ఏడు ఏడు రోజులు చొప్పున ఉన్నప్పటికిని వాటికి అంతముండదు. అవి అన్నీ అమృతాన్ని స్రవిస్తూన్నవి. నేతి (తేజస్సు) తో కూడియున్నవి, శోకంలేనివి కూడ, ఆ లోకాలన్నీ మీ గురించి నిరీక్షిస్తున్నాయి. (15)
ప్రతర్దన ఉవాచ
తాంస్తే దదాని మా ప్రపత ప్రపాతం
యే మే లోకాస్తవ తే వై భవం తు ।
యద్యంతరిక్షే యది వా దివి శ్రితాః
తానాక్రమ క్షిప్రమపేతమోహః ॥ 16
ప్రతర్దనుడిలా అన్నాడు - ఆ లోకాలన్నింటిని నీకు ఇస్తాను. నేను పొందదగిన లోకాలన్నీ నీవి కాగలవు. నీవు క్రింద పడవద్దు. నీవు క్రిందపడవు. మోహం లేకుండా అంతరిక్షంలోగాని, స్వర్గంలోగాని ఉన్న ఆ లోకాలను వేగంగా ఆక్రమించు. (16)
యయాతి రువాచ
న తుల్యతేజాః సుకృతం కామయేత
యోగక్షేమం పార్థివ పార్థివః సన్ ।
దైవాదేశాదాపదం ప్రాప్య విద్యాన్
చరేన్నృశంసం న హి జాతు రాజా ॥ 17
యయాతి ఇలా చెప్పాడు - పార్థివా! రాజు సమానమైన తేజస్సు కలవాడై ఎదుటవాని సుకృతాన్నికాని, యోగక్షేమాలను కాని కోరకూడదు. విద్వాంసుడైన రాజు దైవయాగం వల్ల ఆపదను పొందనప్పటికి ఎప్పుడూ ఏ పాపకర్యం చేయకూడదు. (17)
ధర్మ్యం మార్గం యతమానో యశస్యం
కుర్యాన్నృపో ధర్మమవేక్షమాణః ।
న మద్విధో ధర్మబుద్ధిః ప్రజానన్
కుర్యాదేవం కృపణం మాం యథాఽఽత్థ ॥ 18
ధర్మం పట్ల దృష్టి గల రాజు ప్రయత్నపూర్వకంగా ధర్మబద్ధము, కీర్తికరమూ అయిన మార్గాన్ని అనుసరించి కార్యం చెయ్యాలి. ధర్మబుద్ధిగల నావంటివాడు గుణదోషాలు తెలిసినవాడై నీవు చెప్పిన విధంగా దైన్యమైన పనిచేయకూడదు. (18)
కుర్యాదపూర్వం న కృతం యదన్యైః
విధిత్సమానః కిము తత్ర సాధు ।
(ధర్మాధర్మౌ సువినిశ్చిత్య సమ్యక్
కార్యాకార్యే ష్వప్రమత్తశ్చరేద్ యః ।
స వై ధీమాన్ సత్యసంధః కృతాత్మా
రాజా భవేల్లోకపాలో మహిమ్నా ॥
యదా భవేత్ సంశయో ధర్మకార్యే
కామార్థే వా యత్ర విందంతి సమ్యక్ ।
కార్యం తత్ర ప్రథమం ధర్మకార్యం
న తౌ కుర్యాదర్థకామౌ స ధర్మః ॥)
బ్రువాణమేనం నృపతిం యయాతిం
నృపోత్తమో వసుమా నబ్రవీత్ తమ్ ॥ 19
మంచి పనిని చేయదలచినవాడు ఇతరులు చేయని పనిని చేయాలి. ధర్మాధర్మాలను బాగుగ నిశ్చయించుకొని, కార్యాకార్యములందు అప్రమత్తుడై వ్యవహరించాలి. అటువంటి రాజు బుద్ధిమంతుడు, సత్యసంధుడు, మనస్వి. అతడు తన మహిమచే లోకపాలుడౌతాడు. ధర్మార్థకామాల విషయంలో సంశయం కలిగినపుడు, బాగా తెలిసికొని ధర్మకార్యాన్ని ముందుగా చేయాలి. అర్థకామాలను కాదు, అదే ధర్మం. ఈ విధంగా చెపుతున్న యయాతి రాజుతో రాజశ్రేష్ఠుడు వసువు ఇలా పలికాడు. (19)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ఉత్తరయాయాతే ద్వినవతితమోఽధ్యాయః ॥ 92 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున ఉత్తర యయాతి చరిత్రమను తొంబది రెండవ అధ్యాయము. (92)