128. నూట ఇరువది యెనిమిదవ అధ్యాయము
నాగలోకము నుండి భీముడు మరలివచ్చుట.
వైశంపాయన ఉవాచ
తతస్తే కౌరవాః సర్వే వినా భీమం చ పాండవాః ।
వృత్తక్రీడావిహారాస్తు ప్రతస్థుర్గజసాహ్వయమ్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. తర్వాత భీముడు తప్ప మిగిలిన పాండవులూ, కౌరవులూ క్రీడావిహారాలను ముగించుకొని హస్తినాపురికి బయలుదేరారు. (1)
రథైర్గజైస్తథా చాశ్వైః యానైశ్చాన్యైరనేకశః ।
బ్రువంతో భీమసేనస్తు యాతో హ్యగ్రత ఏవ నః ॥ 2
తతో దుర్యోధనః పాపః తత్రాపశ్యన్ వృకోదరమ్ ।
భ్రాతృభిః సహితో హృష్టః నగరం ప్రవివేశ హ ॥ 3
వారు రథాలు, ఏనుగులూ, గుఱ్ఱాలూ, తదితరమయిన అనేక వాహనాలలో బయలుదేరారు. భీముడు తమ కన్నా ముందే వెళ్ళి ఉంటాడని చెప్పుకొంటూ పయనించారు. ఆ తర్వాత పాపాత్ముడైన దుర్యోధనుడు భీమసేనుడు కనిపించనందుకు ఆనందించి తన సోదరులతో కూడి నగరానికి వచ్చారు. (2,3)
యుధిష్ఠిరస్తు ధర్మాత్మా హ్యవిదన్ పాపమాత్మని ।
స్వేనానుమానేన పరం సాధుం సమనుపశ్యతి ॥ 4
యుధిష్ఠిరుడు ధర్మాత్ముడు. ఆయన మనస్సులో దుర్యోధనుని పాపబుద్ధి స్ఫురించలేదు. తనవలె అందరూ సాధుస్వభావులే అని భావించే వాడు. (4)
సోఽభ్యుపేత్య తదా పార్థః మాతరం భ్రాతృవత్సలః ।
అభివాద్యాబ్రవీత్ కుంతీమ్ అంబ భీమ ఇహాగతః ॥ 5
సోదరులపై వాత్సల్యం గల ఆ ధర్మరాజు కుంతి దగ్గరకు వెళ్ళి ఇలా అడిగాడు - అమ్మా! భీమసేనుడు ఇటువచ్చాడా? (5)
క్వ గతో భవితా మాతః నేహ పశ్యామి తం శుభే ।
ఉద్యానాని వనం చైవ విచితాని సమంతతః ॥ 6
తదర్థం న చ తం వీరం దృష్టవంతో వృకోదరమ్ ।
మన్యమానాస్తతః సర్వే యాథో నః పూర్వమేవ సః ॥ 7
అమ్మా! ఎక్కడకు వెళ్ళి ఉంటాడు? ఇక్కడ కూడా కనిపించటం లేదు. తోటలో, అరణ్యంలో అంతా భీమునికోసం వెదికాము. కాని కనిపించలేదు. దానితో మనకంటె ముందు వెళ్ళి ఉంటాడనుకొన్నాము. (6,7)
ఆగతాః స్మ మహాభాగే వ్యాకులేనాంతరాత్మనా ।
ఇహాగమ్య క్వ ను గతః త్వయా వా ప్రేషితః క్వను ॥ 8
మహాభాగా! కలతపడిన మనస్సులతో తిరిగి వచ్చాము. ఇక్కడకు వచ్చి ఎక్కడకైనా వెళ్లాడా? నీవు ఎక్కడికయినా పంపించావా? (8)
కథయస్వ మహాబాహుం భీమసేనం యశస్విని ।
న హి మే శుధ్యతే భావః తం వీరం ప్రతి శోభనే ॥ 9
యశస్వినీ! మహాబాహువయిన ఆ భీమసేనుడెక్కడున్నాడో చెప్పు. భీముడి విషయంలో నా మనస్సు ఏదో శంకిస్తోంది. (9)
యతః ప్రసుప్తం మన్యేఽహం భీమం నేతి హతస్తు సః ।
ఇత్యుక్తా చ తతః కుంతీ ధర్మరాజేన ధీమతా ॥ 10
హా హేతి కృత్వా సంభ్రాంతా ప్రత్యువాచ యుధిష్ఠిరమ్ ।
న పుత్ర భీమం పశ్యామి న మామభ్యేత్యసావితి ॥ 11
'భీముడు నిదురిస్తున్నాడని నేను అనుకొన్నాను? అక్కడే ఎవరైనా అతనిని చంపలేదు కదా!' ధీమంతుడు ధర్మరాజు అలా అడగగానే కలతపడ్డ కుంతి హాహాకారాలు చేసి యుధిష్ఠిరునితో ఇలా అన్నది - నాయనా! భీముడు నాకు కనిపించలేదు. నా దగ్గరకు రానే లేదు. (10,11)
శీఘ్రమన్వేషణే యత్నం కురు తస్యానుజైః సహ ।
ఇత్యుక్త్వా తనయం జ్యేష్ఠం హృదయేన విదూయతా ॥ 12
క్షత్తారమనాయ్య తదా కుంతీ వచనమబ్రవీత్ ।
క్వ గతో భగవన్ క్షత్తః భీమసేనో న దృశ్యతే ॥ 13
వెంటనే తమ్ముళ్ళతో కలిసి వెదికే ప్రయత్నం చేయండి. దుఃఖిత హృదయంతో కుంతి పెద్దకొడుకుతో అలా పలికి వెంటనే విదురుని పిలిపించి ఇలా అన్నది - పూజనీయా! భీమసేనుడు కనిపించటం లేదు. ఎక్కడకు వెళ్ళి ఉంటాడు? (12,13)
ఉద్యానాన్నిర్గతాః సర్వే భ్రాతరో భ్రాతృభిః సహ ।
తత్రైకస్తు మహాబాహుః భీమో నాభ్యేతి మామిహ ॥ 14
సోదరులందరూ ఉద్యానవనం నుండి బయలుదేరి వచ్చేశారు. కానీ మహాబాహువయిన భీముడొక్కడే నా దగ్గరకు రాలేదు. (14)
న చ ప్రీణయతే చక్షుః సదా దుర్యోధనస్య సః ।
క్రూరోఽసౌ దుర్మతిః క్షుద్రః రాజ్యలుబ్ధోఽనపత్రపః ॥ 15
భీముని చూస్తే దుర్యోధనుడికి కంటగింపుగానే ఉంటుంది. ఆ దుర్యోధనుడేమో క్రూరుడూ, దుర్మార్గుడూ, నీచుడూ, సిగ్గులేనివాడూ, రాజ్యలోభం గలవాడు. (15)
నిహన్యాదపి తం వీరం జాతమన్యుః సుయోధనః ।
తేన మే వ్యాకులం చిత్తం హృదయం దహ్యతీవ చ ॥ 16
సుయోధనుడు కోపం వచ్చి ఆ వీరుని - భీమసేనుని - చంపినా చంపవచ్చు. అందువలన నా మనస్సు కలత పడుతోంది. దహించుకొని పోతోంది. (16)
విదుర ఉవాచ
మైవం వదస్వ కళ్యాణి శేషసంరక్షణం కురు ।
ప్రత్యాదిష్టో హి దుష్టాత్మా శేషేఽపి ప్రహరేత్ తవ ॥ 17
విదురుడిలా అన్నాడు. కళ్యాణి! అలా అనవద్దు. మిగిలిన పిల్లలను చూడు. దుష్టుడైన ఆదుర్యోధనుని మనం విచారిస్తే వాడు మిగిలిన నీ కుమారులకు కూడా దెబ్బతీయవచ్చు. (17)
దీర్ఘాయుషస్తవ సుతాః యథోవాచ మహామునిః ।
ఆగమిష్యతి తే పుత్రః ప్రీతిం చోత్పాదయిష్యతి ॥ 18
వ్యాసమహర్షి ముందే చెప్పినట్లు నీకుమారులంతా దీర్ఘాయుష్కులు. నీ కొడుకు తప్పక వస్తాడు. నీకు ఆనందాన్ని కలిగిస్తాడు. (18)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా యయౌ విద్వాన్ విదురః స్వం నివేశనమ్ ।
కుంతీ చింతాపరా భూత్వా సహాసీనా సుతైర్గృహే ॥ 19
వైశంపాయనుడిలా అన్నాడు. విద్వాంసుడైన విదురుడు ఈ విధంగా మాటాడి తన ఇంటికి వెళ్లిపోయాడు. కుంతి చింతాక్రాంతయై తన పిల్లలతో పాటు ఇంట్లోనే ఉంది. (19)
తతో-ష్టమే తు దివసే ప్రత్యబుధ్యత పాండవః ।
తస్మింస్తదా రసే జీర్ణే సోఽప్రమేయబలో బలీ ॥ 20
ఆ తర్వాత ఎనిమిదవనాడు (నాగలోకంలో) నిదురిస్తున్న భీమసేనుడు నిదురలేచాడు. స్వతహాగా బలవంతుడైన ఆ భీముడు ఆ రసం శరీరంలో జీర్ణం కాగానే లెక్కలేనంత బలాన్ని పొందాడు. (20)
తం దృష్ట్వా ప్రతిబుధ్యంతం పాండవం తే భుజంగమాః ।
సాంత్వయామాసురవ్యగ్రాః వచనం చేదమబ్రువన్ ॥ 21
మేల్కొంటున్న ఆ భీమసేనుని చూచి నాగులందరూ ప్రసన్నులై ఆయనను కుదుటపరచి ఇలా అన్నారు. (21)
యత్ తే పీతో మహాబాహో! రసోఽయం వీర్యసంభృతః ।
తస్మాన్నాగాయుతబలః రణఽధృష్యో భవిష్యతి ॥ 22
మహాబాహూ! శక్తిసంపన్నమైన ఈ రసాన్ని నీవు త్రాగావు. దీనితో నీకు పదివేల ఏనుగుల బలం సిద్ధిస్తుంది. యుద్ధంలో నిన్నెవ్వరూ గెలవలేరు. (22)
గచ్ఛాద్య త్వం స్వగృహం స్నాతో దివ్యైరిమైర్జలైః ।
భ్రాతరస్తే-నుతప్యంతి త్వాం వినా కురుపుంగవ ॥ 23
ఈరోజు నీవు ఈ దివ్యజలంతో స్నానం చేసి ఇంటికి వెళ్ళు. కురుశ్రేష్ఠా! నీవు కనిపించనందువలన నీ సోదరులంతా బాధపడుతున్నారు. (23)
తతః స్నాతో మహాబాహుః శుచిః శుక్లాంబరస్రజః ।
తతో నాగస్య భవనే కృతకౌతుకమంగలః ॥ 24
ఓషధీభిః విషఘ్నీభిః సురభీభిర్విశేషతః ।
భుక్తవాన్ పరమాన్నం చ నాగైర్దత్తం మహాబలః ॥ 25
ఆ తరువాత మహాబాహువయిన భీమసేనుడు స్నానం చేశాడు. శుభ్రమయిన తెల్లని బట్టలను, తెల్లని పూలమాలలనూ ధరించాడు. నాగరాజు భవనంలో భీమునికై ఔత్సాహిక శుభకార్యాలను నిర్వర్తించారు. ఆపై విషాన్ని హరించ గల ఓషధులతోనూ, పరిమళద్రవ్యాలతోనూ కూడిన పరమాన్నాన్ని నాగులు భీమునకిచ్చారు. దానిని భీముడు ఆరగించాడు. (24,25)
పూజితో భుజగైర్వీరః ఆశీభిశ్చాభినందితః ।
దివ్యాభరణసంఛన్నః నాగానామంత్య్ర పాండవః ॥ 26
ఉదతిష్ఠత్ ప్రహృష్టాత్మా నాగాలోకాదరిందమః ।
ఉత్ క్షిప్తః స తు నాగేన జలాజ్జలరుహేక్షణః ॥ 27
తస్మిన్నేవ వనోద్ధేశే స్థాపితః కురునందనః ।
తే చాంతర్దధిరే నాగాః పాండవస్యైన పశ్యతః ॥ 28
నాగులు ఆ వీరుని (భీముని) అర్చించి ఆశీస్సులతో అభినందించారు. దివ్యాభరణాలు దాల్చి అరిందముడైన ఆ భీమసేనుడు నాగులను వీడ్కొని ప్రసన్న హృదయుడై లేచాడు. కురునందనా! పద్మనయనుడైన ఆ భీమసేనుని ఒకానొక పాము నీటి నుండి పైకి లేపి ఆ వనప్రాంతంలోనే దింపింది. భీముడు చూస్తుండగానే నాగులందరూ అంతర్ధాన మయ్యారు. (26-28)
తత ఉత్థాయ కౌంతేయః భీమసేనో మహాబలః ।
ఆజగామ మహాబాహుః మాతురంతికమంజసా ॥ 29
ఆపై మహాబాహువూ, మహాబలుడూ అయిన భీముడు లేచి వెంటనే తల్లి దగ్గరకు వచ్చాడు. (29)
తతోఽభివాద్య జననీం జ్యేష్ఠం భ్రాతరమేవ చ ।
కనీయసః సమాఘ్రాయ శిరఃస్వరివిమర్దనః ॥ 30
ఆపై అరివిమర్దనుడయిన భీమసేనుడు తల్లికీ, అన్నకూ నమస్కరించి తమ్ముళ్ళను మూర్కొన్నాడు. (30)
తైశ్చాపి సంపరిష్వక్తః సహ మాత్రా నరర్షభైః ।
అన్యోన్యగతసౌహార్దాద్ దిష్ట్యా దిష్ట్యేతి చాబ్రువన్ ॥ 31
కుంతీ, నరశ్రేష్ఠులయిన సోదరులూ భీముని కౌగిలించు కొన్నారు. ఒకరిపై ఒకరినున్న సౌహార్దం కారణంగా భీమసేనుని రాకను తమ భాగధేయంగా చెప్పుకొన్నారు. (31)
తతస్తత్ సర్వమాచష్ట దుర్యోధనవిచేష్టితమ్ ।
భ్రాతౄణాం భీమసేనశ్చ మహాబలపరాక్రమః ॥ 32
మహాబలపరాక్రముడయిన భీముడు అప్పుడు తన సోదరులకు దుర్యోధనుని దుశ్చేష్టను సాంతంగా వివరించారు. (32)
నాగలోకే చ యద్ వృత్తం గుణదోషమశేషతః ।
తచ్చ సర్వమశేషేణ కథయామాస పాండవః ॥ 33
నాగలోకంలో జరిగిన మంచి చెడూ అంతా కొరవలేకుండా భీమసేనుడు వివరించాడు. (33)
తతో యుధిష్ఠిరో రాజా భీమమాహ వచోఽర్థవత్ ।
తూష్ణీం భవ న తే జల్ప్యమ్ ఇదం కార్యం కథంచన ॥ 34
అప్పుడు ధర్మరాజు "భీమా! మౌనంగా ఉండు. ఈ విషయాన్ని ఎవ్వరికీ, ఏవిధంగా కూడా చెప్పవద్దు" అని అర్థవంతంగా సూచించాడు. (34)
ఏవముక్త్వా మహాబాహుర్ధర్మరాజో యుధిష్ఠిరః ।
భ్రాతృభిః సహితః సర్వైః అప్రమత్తోఽభవత్ తదా ॥ 35
అప్పుడు యుధిష్ఠిరుడైన ధర్మారాజు భీమునితో ఆవిధంగా పలికి సోదరులతో సహ అప్రమత్తుడయ్యాడు. (35)
సారథిం చాస్య దయితమ్ అపహస్తేన జఘ్నివాన్ ।
ధర్మాత్మా విదురస్తేషాం పార్థానాం ప్రదదౌ మతిమ్ ॥ 36
ఆ భీమసేనుని ప్రియసారథిని కూడా దుర్యోధనుడు పెడచేతిదెబ్బతో చంపివేశాడు. ధర్మాత్ముడైన విదురుడు ఆపాండవులకు స్థైర్యాన్ని అందజేశాడు (మౌనంగా అంతా సహించవలసినదిగా సూచించాడు). (36)
భోజనే భీమసేనస్య పునః ప్రాక్షేపయద్ విదమ్ ।
కాలకూటం నవం తీక్ష్ణం సంభృతం లోమహర్షణమ్ ॥ 37
దుర్యోధనుడు మరలా భీమసేనుని భోజనపదార్థాలలో కాలకూటవిషాన్ని కలిపించాడు. అది క్రొత్తది, తీవ్రమయినదీ, సత్త్వరూపంగా పరిణమించి రోమాలు నిక్కబొడుచుకొనేటట్లు చేయగలది. (37)
వైశ్యాపుత్రస్తదాచష్ట పార్థానాం హితకామ్యయా ।
తచ్చాపి భుక్త్వాజరయత్ అవికారం వృకోదరః ॥ 38
వైశ్యాపుత్రుడైన యుయుత్సుడు పాండవుల మేలుకోరి ఆ విషయాన్ని వారికి తెలియజేశాడు. భీమసేనుడు దానిని కూడా తిని ఏ వికారాన్నీ పొందకుండా జీర్ణంచేసికొనగలిగాడు. (38)
వికారం నహ్యజనయత్ సుతీక్ష్ణమపి తద్ విషమ్ ।
భిమ సంహనన్ భీమే అజీర్యత వృకోదరే ॥ 39
ఆ విషం ఎంత తీవ్రమైనదైనా భీమునిలో ఎటువంటి మార్పునూ తేలేకపోయింది. భీకరమైన శరీరం గల ఆ భీమునిలో అది కూడా జీర్ణమైపోయింది. (39)
ఏవం దుర్యోధనః కర్ణః శకునిశ్చాపి సౌబలః ।
అనేకై రభ్యుపాయైస్తాన్ జిఘాంసంతి స్మ పాండవాన్ ॥ 40
ఈ విధంగా దుర్యోధనుడూ, కర్ణుడూ, సుబలపుత్రుడైన శకునీ వివిధోపాయాళతో పాండవులను చంపాలని కోరుకొనేవారు. (40)
పాండవాశ్చాపి తత్ సర్వం ప్రత్యజానన్నమర్షితాః ।
ఉద్భావనమకుర్వంతః విదురస్య మతే స్థితాః ॥ 41
పాండవులు కూడా ఇదంతా తెలిసినప్పటికీ, కోపం వచ్చినప్పటికీ విదురుడు చేసిన సూచనను పాటిస్తూ వారి కోపాన్ని వెడలగ్రక్కలేదు. (41)
కుమారాన్ క్రీడమానాంస్తాన్ దృష్ట్వా రాజాతిదుర్మదాన్ ।
గురుం శిక్ష్యార్థమన్విష్య గౌతమం తాన్ న్యవేదయత్ ॥ 42
శరస్తంబే సముద్భూతం వేదశాస్త్రార్థపారగమ్ ।
అధిజగ్ముశ్చ కురవః ధనుర్వేదం కృపాత్ తు తే ॥ 43
ఈ రీతిగా ఆటలపై ఆసక్తితో దుడుకుతనాన్ని పెంచుకొంటున్న కుమారులను చూచి ధృతరాష్ట్రుడు వారికి శిక్షణ నిప్పించటానికి కృపాచార్యున కప్పగించాడు. ఆ కృపాచార్యుడు గౌతమగోత్రీయుడు. ఱ్ఱెల్లుపొదలో పుట్టినవాడూ, వేదశాస్త్రాలలో గొప్పవాడు, పండితుడూ. కౌరవపాండవులు ఆకృపుని దగ్గర ధనుర్వేదాన్ని అభ్యసించసాగారు. (42,43)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి భీమప్రత్యాగమనే అష్టావింశత్యధిక శతతమోఽధ్యాయః ॥ 128 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున భీమప్రత్యాగమనమను నూట ఇరువది యెనిమిదవ అధ్యాయము. (128)