129. నూట ఇరువది తొమ్మిదవ అధ్యాయము

కృప-ద్రోణ-అశ్వత్థామల జననము-ద్రోణుడు పరశురాముని నుండి శస్త్రాస్త్రముల పొందుట.

జనమేజయ ఉవాచ
కృపస్యాపి మమ బ్రహ్మన్ సంభవం వక్తుమర్హసి ।
శరస్తంబాత్ కథం జజ్ఞే కథం వాస్త్రాణ్యవాప్తవాన్ ॥ 1
జనమేజయుడిలా అన్నాడు. బ్రాహ్మణోత్తమా! కృపుడెలా జన్మించాడు? దానిని వివరించవలసినది. ఱెల్లుపొదలో ఎలా పుట్టాడు? శస్త్రాస్త్రవిద్యల నెలా అభ్యసించాడు? (1)
వైశంపాయన ఉవాచ
మహర్షేర్గౌతమస్యాసీత్ శరద్వాన్ నామ గౌతమః ।
పుత్రః కిల మహారాజ జాతః సహ శరైర్విభో ॥ 2
న తస్య వేదాధ్యయనే తథా బుద్ధిరజాయత ।
యథాస్య బుద్ధిరభవత్ ధనుర్వేదే పరంతప ॥ 3
వైశంపాయనుడిలా అన్నాడు. గౌతమమహర్షికి శరద్వద్ గౌతముడను పేరుగల కుమారుడుండేవాడు. మహారాజా! ఆ కుమారుడు రెల్లుతో పాటు జన్మించాడు. పరంతపా! ఆ శరద్వద్ గౌతమునకు ధనుర్వేదాధ్యయనంపై ఉన్న ఆసక్తి వేదాధ్యయనం పై లేదు. (2,3)
అధిజగ్ముర్యథా వేదాన్ తపసా బ్రహ్మచారిణః ।
తథా స తపసోపేతః సర్వాణ్యస్త్రాణ్యవాప హ ॥ 4
బ్రహ్మచారులు తపస్సు ద్వారా వేదజ్ఞానాన్ని పొందినట్లు ఆ శరద్వద్ గౌతముడు తపస్సు ద్వారా సర్వశాస్త్రాలనూ పొందగలిగాడు. (4)
ధనుర్వేదపరత్వాచ్చ తపసా విపులేన చ ।
భృశం సంతాపయామాస దేవరాజం స గౌతమః ॥ 5
తన ధనుర్విద్యాపారంగతత్వం చేతా, విస్తరమైన తపస్సు చేతా ఆయన దేవేంద్రునకు ఎంతో ఖేదాన్ని కల్గించాడు. (5)
తతో జానపదీం నామ దేవకన్యాం సురేశ్వరః ।
ప్రాహిణోత్ తపసో విఘ్నం కురు తస్యేతి కౌరవః ॥ 6
కౌరవా! ఆ తరువాత దేవేంద్రుడు జానపది అను పేరు గల ఒక దేవకన్యను ఆ శరద్వద్ గౌతముని తపస్సునకు విఘ్నం కలిగించమని పంపించాడు. (6)
సా హి గత్వాఽశ్రమం తస్య రమణీయం శరద్వతః ।
ధనుర్బాణధరం బాలా లోభయామాస గౌతమమ్ ॥ 7
ఆ జానపది అందమైన ఆ శరద్వద్ గౌతముని ఆశ్రమానికి పోయి ధనుర్బాణాలు ధరించి ఉన్న ఆ గౌతమునిలో లోభాన్ని రేకిత్తించింది. (7)
తామేకవసనాం దృష్ట్వా గౌతమోఽప్సరసం వనే ।
లోకే-ప్రతిమసంస్థానాం ప్రోత్ఫుల్లనయనోఽభవత్ ॥ 8
గౌతముడు ఆ వనంలో ఏకవస్త్రధారిణి అయిన ఆమెను చూచి, అసాధారణమైన ఆమె సౌందర్యానికి ఆశ్చర్యపోయాడు. ఆయన కన్నులు వికసించాయి. (8)
ధనుశ్చ హి శరాస్తస్య కరాభ్యామపతన్ భువి ।
వేపథుశ్చాపి తాం దృష్ట్వా శరీరే సమజాయత ॥ 9
ఆయన చేతి నుండి ధనుర్బాణాలు నేలపడిపోయాయి. ఆమెను చూచి ఆ గౌతముని శరీరం కూడా కంపించింది. (9)
స తు జ్ఞానగరీయస్త్వాత్ తపసశ్చ సమర్థనాత్ ।
అవతస్థే మహాప్రాజ్ఞః ధైర్యేణ పరమేణ హ ॥ 10
ఆయన జ్ఞానం చేత గొప్పవాడు. తపశ్శక్తి గలవాడు. కాబట్టి ఆ మహాప్రాజ్ఞుడు అత్యంత ధైర్యంతోనే నిలువ గలిగాడు. (10)
యస్తస్య సహసా రాజన్ వికారః సమదృశ్యత ।
తేన సుస్రావ రేతోఽస్య స చ తన్నాన్వబుధ్యత ॥ 11
కానీ రాజా! ఆయన మనస్సులో వికారం కలిగిన వెంటనే వీర్యపతనం జరిగింది. అయితే ఆయన దానిని గమనించలేదు. (11)
ధనుశ్చ సశరం త్యక్త్వా తథా కృష్ణాజినాని చ ।
స విహాయాశ్రమం తం చ తాం చైవాప్సరసం మునిః ॥ 12
జగామ రేతస్తత్ తస్య శరస్తంబే పపాత చ ।
శరస్తంబే చ పతితం ద్విధా తదభవన్నృప ॥ 13
ఆ ముని ధనుర్బాణాలను వీడి, కృష్ణాజినాన్ని త్యజించి ఆ ఆశ్రమాన్నీ, అప్సరసను వీడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాజా! ఆయన వీర్యం ఱెల్లుపొదలో పడింది. శరస్తంబంలో పడిన ఆవీర్యం రెండు ముక్కలయింది. (12,13)
తస్యాథ మిథునం జజ్ఞే గౌతమస్య శరద్వతః ।
మృగయాం చరతో రాజ్ఞః శంతనోస్తు యదృచ్ఛయా ॥ 14
కశ్చిత్ సేనాచరోఽరణ్యే మిథునం తదపశ్యత ।
ధనుశ్చ సశరం దృష్ట్వా తథా కృష్ణాజినాని చ ॥ 15
జ్ఞాత్వా ద్విజస్య చాపత్యే ధనుర్వేదాంతగస్య హ ।
స రాజ్ఞే దర్శయామాస మిథునం సశరం ధనుః ॥ 16
స తదాదాయ మిథునం రాజా చ కృపయాన్వితః ।
ఆజగామ గృహానేవ మమ పుత్రావితిబ్రువన్ ॥ 17
ఆ రీతిగా ఆ శరద్వద్ గౌతమునకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ సమయంలో శంతనుమహారాజు యాదృచ్ఛికంగా అక్కడ వేటాడుతున్నాడు. ఆయన సేనలలో ఒకడు ఆ పిల్లలను చూచాడు. అక్కడ ధనుర్బాణాలనూ, కృష్ణాజినాన్నీ గమనించి ధనుర్వేద పారంగతుడైన ఏ మహర్షికో పుట్టిన పిల్లలని వారిని భావించి ఆ పిల్లలనూ, ధనుర్బాణాలనూ మహారాజునకు చూపించాడు. దయాళువయిన ఆ మహారాజునకు చూపించాడు. దయాళువయిన ఆ మహారాజు ఆ పిల్లల జంటను తీసికొని ఇంటికి వచ్చి వారు తన బిడ్డలే అని చెప్పసాగాడు. (14-17)
తతః సంవర్ధయామాస సంస్కారైశ్చాప్యయోజయత్ ।
ప్రాతీపేయో నరశ్రేష్ఠః మిథునం గౌతమస్య తత్ ॥ 18
ఆపై ప్రతీపుని కుమారుడయిన ఆ శంతనుమహారాజు గౌతముని ఆ బిడ్డలను పెంచుతూ, సమయోచిత సంస్కారాలను కూడా జరిపించసాగాడు. (18)
గౌతమోఽపి తతోఽభ్యేత్య ధనుర్వేదపరోఽభవత్ ।
కృపయా యన్మయా బాలౌ ఇమౌ సంవర్ధితావితి ॥ 19
తస్మాత్ తయోర్నామ చక్రే తదేవ స మహీపతిః ।
గోపితౌ గౌతమస్తత్ర తపసా సమవిందత ॥ 20
శరద్వద్ గౌతముడు ఆ ఆశ్రమం నుండి వెళ్లి మరొక చోట ధనుర్వేదాన్ని అభ్యసించసాగాడు. కృపతో తాను ఆ పిల్లలను పెంచాడు కాబట్టి శంతనుమహఱఝూ కృపుడు - కృపి అని వారికి ఆ పేర్లనే పెట్టాడు. శరద్వద్ గౌతముడు తన తపశ్శక్తి చేత తన బిడ్డలను శంతనుడు రక్షించినట్లు గ్రహించగలిగాడు. (19,20)
ఆగత్యతస్మై గోత్రాది సర్వమాఖ్యాతవాంస్తదా ।
చతుర్విధం ధనుర్వేదం శాస్త్రాణి వివిధాని చ ॥ 21
నిఖిలేనాస్య తత్ సర్వం గుహ్యమాఖ్యాతవాంస్తదా ॥
సోఽచిరేణైవ కాలేన పరమాచార్యతాం గతః ॥ 22
ఆ తరువాత రహస్యంగా వచ్చి తన కుమారునకు తన గోత్రంతో పాటు మొత్తం విషయాన్ని చెప్పాడు. నాల్గువిధాలయిన (ముక్త, అముక్తం, ముక్తాముక్తం, మంత్రముక్తం) ధనుర్వేదాన్నీ వివిధ శస్త్రాలనూ, వాటి నిగూఢ రహస్యాలను కూడా సంపూర్ణంగా తెలియజేశాడు. స్వల్పవ్యవధిలోనే ఆకృపుడు ధనుర్వేదంలో గొప్ప ఆచార్యుడు కాగలిగాడు. (21,22)
తతోఽధిజగ్ముః సర్వే తే ధనుర్వేదం మహారథాః ।
ధృతరాష్ట్రాత్మజా శ్చైవ పాండవాః సహ యాదవైః ॥ 23
ఆ కృపుని నుండియే మహారథులైన ధార్తరాష్ట్రులూ, పాండవులూ, యాదవులూ అందరూ ధనుర్వేదాన్ని నేర్చుకొన్నారు. (23)
వృష్ణయశ్చ నృపాశ్చాన్యే నానాదేశసమాగతాః ।
వృష్ణివంశస్థులు వివిధ దేశాల నుండీ వచ్చిన ఇతర రాజులు కూడా కృపుని దగ్గర ధనుర్విద్య నభ్యసించారు. (23 1/2)
వైశంపాయన ఉవాచ
విశేషార్థీ తతో భీష్మః పౌత్రాణాం వినయేప్సయా ॥ 24
ఇష్వస్త్రజ్ఞాన్ పర్యపృచ్ఛత్ ఆచార్యాన్ వీర్యసమ్మతాన్ ।
నాల్పధీర్నామహాభాగః తథానానాస్త్రకోవిదః ॥ 25
నాదేవసత్త్వో వినయేత్ కురూనస్త్రే మహాబలాన్ ।
ఇతి సంచింత్య గాంగేయః తదా భరతసత్తమః ॥ 26
ద్రోణాయ వేదవిదుషే భారద్వాజాయ ధీమతే ।
పాండవాన్ కౌరవాంశ్చైవ దదౌ శిష్యాన్ నరర్షభ ॥ 27
వైశంపాయనుడిలా అన్నాడు. రాజా! కృపాచార్యుని దగ్గర కౌరవపాండవులు ధనుర్విద్య నభ్యసించిన తరువాత భీష్ముడు తన పౌత్రులను అధ్యాపనం ద్వారా విశేషజ్ఞులను చేయదలచి విలువిద్యలో మేటియై పరాక్రమవంతుడయిన ఆచార్యుని కొరకు విచారణ ప్రారంభించాడు. బుద్ధిమంతుడూ, మహాభాగ్యశాలీ, నానాస్త్ర కోవిదుడూ, దేవతాశక్తిశాలి మాత్రమే తనవారిని అస్త్రవిద్యలో గొప్పవారిని చేయదలచి భావించి భరతశ్రేష్ఠుడైన గాంగేయుడు భరద్వాజవశస్థుడై వేదవేత్త అయిన ద్రోణునకు పాండవకౌరవులను శిష్యులను చేశాడు. (24-27)
శాస్త్రతః పూజితశ్చైవ సమ్యక్ తేన మహాత్మనా ।
స బీష్మేణ మహాభాగః తుష్ణోఽస్త్రవిదుషాం వరః ॥ 28
మహాత్ముడైన భీష్మునిచే యథావిధిగా అర్చించబడి ధనుర్విద్యావేత్తలలో శ్రేష్ఠుడైన ఆ మహానీయుడు-ద్రోణుడు ఎంతో సంతోషించాడు. (28)
ప్రతిజగ్రాహ తాన్ సర్వాన్ శిష్యత్వేన మహాయశాః ।
శిక్షయామాస చ ద్రోణః ధనుర్వేదమశేషతః ॥ 29
మహాయశస్వి అయిన ద్రోణుడు వారినందరినీ శిష్యులుగా స్వీకరించి ధనుర్వేదాన్ని సంపూర్ణంగా బోధించాడు. (29)
తేఽచిరేణైవ కాలేన సర్వశస్త్రవిశారదాః ।
బభూవుః కౌరవా రాజన్ పాండవాశ్చామితౌజసః ॥ 30
రాజా! మహాతేజస్సు గల ఆ కౌరవపాండవులు అచిరకాలంలోనే సమస్త శస్త్రాలతో నేర్పుగడించారు. (30)
జనమేజయ ఉవాచ
కథం సమభవద్ ద్రోణః కథం చాస్త్రాణ్యవాప్తవాన్ ।
కథం చాగాత్ కురూన్ బ్రహ్మన్ కస్య పుత్రః స వీర్యవాన్ ॥ 31
జనమేజయుడిలా అన్నాడు. బ్రాహ్మణోత్తమా! ద్రోణుడు ఎలా జన్మించాడు? అస్త్రవిద్యనెలా నేర్చుకొన్నాడు? కౌరవదేశానికి ఎలా వెళ్ళాడు? అసలాయన ఎవరికొడుకు? (31)
కథం చాస్య సుతో జాతః సోఽశ్వత్థామాస్త్రవిత్తమః ।
ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం విస్తరేణ ప్రకీర్తయ ॥ 32
విలుకాండ్రలో మేటి అయిన అశ్వత్థామ - ఆయన కొడుకు - ఎలా పుట్టాడు? ఇదంతా వినాలని ఉంది. విస్తరంగా చెప్పు. (32)
వైశంపాయన ఉవాచ
గంగాద్వారం ప్రతి మహాన్ బభూవ భగవానృషిః ।
భరద్వాజ ఇతి ఖ్యాతః సతతం సంశితవ్రతః ॥ 33
సోఽభిషేక్తుం తతో గంగాం పూర్వమేవాగమన్నదీమ్ ।
మహర్షిభిః భరద్వాజః హవిర్ధానే చరన్ పురా ॥ 34
దదర్శాప్సరసం సాక్షాత్ ఘృతాచీమాప్లుతామ్ ఋషిః ।
రూపయౌవనసంపన్నాం మదదృప్తాం మదాలసామ్ ॥ 35
తస్యాః పునర్నదీతీరే వసనం పర్యవర్తత ।
వ్య్పకృష్టాంబరాం దృష్ట్వా తామృషిశ్చకమే తతః ॥ 36
వైశంపాయనుడిలా అన్నాడు. గంగాద్వారంలో పూజ్యుడయిన ఒక మహర్షి ఉండేవాడు. ఆయనపేరు భరద్వాజుడు. నిత్యమూ వ్రతదీక్షలో ఉండేవాడు. ఒకసారి ఒక విశేషయజ్ఞాన్ని ఆచరిస్తూ ఆ భరద్వాజుడు ఇతరమహర్షులను వెంటబెట్టుకొని స్నానానికై గంగానది దగ్గరకు వెళ్లాడు. అక్కడ అద్భుతరూపవతీ, రూపయౌవనసంపన్నురాలు, యౌవనమదంతో గర్వించినదీ అయిన ఘృతాచి అనే అప్సరసను చూచాడు. ఆ నదీతీరంలో ఆమె స్నానాంతరం బట్టలను మార్చుకొంటోంది. ఆమె బట్ట తొలగిన సమయంలో ఆ ఋషి ఆమెను చూచి కామించాడు. (33-36)
తత్ర సంసక్తమనసః భరద్వాజస్య ధీమతః ।
తతోఽస్య రేతశ్చస్కంద తదృషిర్ద్రోణ ఆదధే ॥ 37
ఆమె పై మనస్సు తగుల్కొని ఆ ధీమంతుడైన భరద్వాజునకు వీర్యపతనమైనది. ఆ ముని దానిని యజ్ఞ కలశంలో ఉంచాడు. (37)
తతః సమభవద్ ద్రోణః కలశే తస్య ధీమతః ।
అధ్యగీష్ట స వేదాంశ్చ వేదాంగాని చ సర్వశః ॥ 38
ఆ తరువాత ఆ మహాత్మునకు కలశం నుండి ద్రోణుడు జన్మించాడు. ఆ ద్రోణుడు వేదవేదాంగాలను పూర్తిగా అభ్యసించాడు. (38)
అగ్నివేశం మహాభాగం భరద్వాజః ప్రతాపవాన్ ।
ప్రత్యపాదయదాగ్నేయమ్ అస్త్రమస్త్రవిదాం వరః ॥ 39
ప్రతాపవంతుడైన భరద్వాజమహర్షి అస్త్రవిద్యావంతులలో మేటి. ఆయన మహనీయుడైన అగ్ని వేశునకు ఆగ్నేయాస్త్రాన్ని ఉపదేశించాడు. (39)
అగ్నేస్తు జాతః స మునిః తతో భరతసత్తమ ।
భారద్వాజం తదాగ్నేయం మహాస్త్రం ప్రత్యపాదయత్ ॥ 40
భరతవంశశ్రేష్ఠా! అగ్నివేశముని అగ్ని కుమారుడు. ఆ అగ్నివేశుడు తన గురుపుత్రుడైన ద్రోణునకు గొపదైన ఆ ఆగ్నేయాస్త్రాన్ని బోధించాడు. (40)
భరద్వాజ సఖా చాసీత్ పృషతో నామ పార్థివః ।
తస్యాపి ద్రుపదో నామ తదా సమభవత్ సుతః ॥ 41
పృషతుడు అనేరాజు భరద్వాజునకు మిత్రుడు. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. వాడిపేరు ద్రుపదుడు. (41)
స నిత్యమాశ్రమం గత్వా ద్రోణేన సహ పార్థివః ।
చిక్రీడాధ్యయనం చైవ చకార క్షత్రియర్షభః ॥ 42
క్షత్రియశ్రేష్ఠుడైన ఆ ద్రుపదుడు అనుదినమూ ఆశ్రమానికి వెళ్ళి ద్రోణునితో పాటు ఆడుకొనేవాడూ, అధ్యయనం చేసేవాడు. (42)
తతో వ్యతీతే పృషతే స రాజా ద్రుపదోఽభవత్ ।
పంచాలేషు మహాబాహుః ఉత్తరేషు నరేశ్వర ॥ 43
రాజా! ఆపృషతుడు మరణించిన తరువాత మహాబాహు వయిన ద్రుపదుడు ఉత్తరపాంచాల దేశానికి రాజు అయ్యాడు. (43)
భరద్వాజోఽపి భగవాన్ ఆరురోహ దివం తదా ।
తత్రైవ చ వసన్ ద్రోణః తపస్తేపే మహాతపాః ॥ 44
కొంతకాలానికి భరద్వాజ మహర్షి కూడా మరణించాడు. ద్రోణుడు ఆ ఆశ్రమంలోనే ఉంటూ ఘోరతపస్సు చేశాడు. (44)
వేదవేదాంగవిద్వాన్ సః తపసా దగ్ధకిల్బిషః ।
తతః పితృనియుక్తాత్మా పుత్రలోభాన్మహాయశాః ॥ 45
శారద్వతీం తతో భార్యాం కృపీం ద్రోణోఽన్వవిందత ।
అగ్నిహోత్రే చ ధర్మేచ దమే చ సతతం రతామ్ ॥ 46
వేదవేదాంగ పారంగతుడయిన ఆ ద్రోణుడు తన తపస్సుతో పాపాలనన్నింటినీ పోగొట్టుకొన్నాడు. కీర్తిమంతుడయ్యాడు. ఒకసారి పితరుల ఆదేశంగా భావించి పుత్రులను కనాలన్న ఆశతో శరద్వద్ గౌతముని పుత్రిక అయిన కృపిని ద్రోణుడు పెండ్లాడాడు. ఆ కృపి సంతతమూ అగ్నిహోత్రం మీదనూ, ధర్మాచరణం మీదనూ, సంయమనం మీదనూ ఆసక్తి గలది. (45,46)
అలభద్ గౌతమీ పుత్రమ్ అశ్వత్థామానమేవ చ ।
స జాతమాత్రో వ్యనదత్ యథైవోచ్చైఃశ్రవా హయః ॥ 47
గౌతమి అయిన కృపి కొడుకును కన్నది. వాడే అశ్వత్థామ. వాడు పుట్టిన వెంటనే ఉచ్చైఃశ్రవం సకిలించినట్లు అరిచాడు. (47)
తచ్ఛ్రుత్వాంతర్హితం భూతమ్ అంతరిక్షస్థమబ్రవీత్ ।
అశ్వస్యేవాస్య యత్ స్థామ నదతః ప్రదిశో గతమ్ ॥ 48
అశ్వత్థామైన బాలోఽయం తస్మాన్నామ్నా భవిష్యతి ।
సుతేన తేన సుప్రీతః భారద్వాజస్తతోఽభవత్ ॥ 49
ఆ సకిలింతను విని అదృశ్యంగా ఉన్న అశరీరవాణి ఇలా పలికింది - ఈ బాలుడు శబ్దం చేస్తుంటే అది అన్ని దిక్కులా గుఱ్ఱపు సకిలింతలా వినిపిస్తోంది. కాబట్టి ఇతనికి అశ్వత్థామ అనియే పేరు. ఆ కుమారుని చూచి ద్రోణుడు ఆనందించాడు. (48,49)
తత్రైవ చ వసన్ ధీమాన్ ధనుర్వేదపరోఽభవత్ ।
స శుశ్రావ మహాత్మానం జామదగ్న్యం పరంతపమ్ ॥ 50
సర్వజ్ఞానవిదం విప్రం సర్వశస్త్రభృతాం వరమ్ ।
బ్రాహ్మణేభ్యస్తదా రాజన్ దిత్సంతం వసు సర్వశః ॥ 51
బుద్ధిమంతుడైన ద్రోణుడు ఆ ఆశ్రమంలోనే నివసిస్తూ ధనుర్వేదంలో నిష్ణాతుడయ్యాడు. రాజా! ఆ సమయంలోనే ఆ ద్రోణుడు పరశురాముని గూర్చి విన్నాడు. ఆ పరశురాముడు మహాత్ముడూ, పరంతపుడూ, సర్వమూ తెలిసినవాడూ, శస్త్రధారులలో శ్రేష్ఠుడూ, బ్రాహ్మణుడూను, తన సంపదనంతా అప్పుడు బ్రాహ్మణులకు ఇవ్వగోరుతున్నాడు. (50,51)
స రామస్య ధనుర్వేదం దివ్యాన్యస్త్రాణి చైవ హ ।
శ్రుత్వా తేషు మనశ్చక్రే నీతిశాస్త్రే తథైవ చ ॥ 52
ఆ ద్రోణుడు పరశురాముని ధనుర్వేద దివ్యాస్త్రాలను గూర్చి విని వాటిపై మనసుపడ్డాడు. ఆయన దగ్గర నీతిశాస్త్రాన్ని నేర్చుకోవాలని కూడా ఉబలాటపడ్డాడు. (52)
తతః సవ్రతిభిః శిష్యైః తపోయుక్తైర్మహాతపాః ।
వృతః ప్రాయాన్మహాబాహుః మహేంద్రం పర్వతోత్తమమ్ ॥ 53
ఆ తరువాత మహాబాహువూ, మహాతపస్వీ అయిన ఆద్రోణుడు తపస్సంపన్నులూ, బ్రహ్మచర్యవ్రత నిష్ఠులూ అయిన శిష్యులతో కలిసి మహేంద్ర పర్వతానికి వెళ్ళాడు. (53)
తతో మహేంద్రమాసాద్య భారద్వాజో మహాతపాః ।
క్షాంతం దాంతమమిత్రఘ్నమ్ అపశ్యద్ భృగునందనమ్ ॥ 54
ఆపై మహాతపస్వి అయిన ద్రోణుడు మహేంద్ర పర్వతాన్ని చేరి అక్కడ దమాది గుణాలకు ఆశ్రయుడూ, శత్రుసంహర్త అయిన పరశురాముని చూచారు. (54)
తతో ద్రోణో వృతః శిష్యైః ఉపగమ్య భృగూద్వహమ్ ।
ఆచఖ్యావాత్మనో నామ జన్మ చాంగిరసః కులే ॥ 55
ఆపై శిష్యులతో కలిసి ద్రోణుడు పరశురాముని సమీపించి తన పేరున ఆంగీరసవంశంలో తనపుట్టుకనూ తెలియజేశాడు. (55)
నివేద్య శిరసా భూమౌ పాదౌ చైవాభ్యవాదయత్ ।
తతస్తం సర్వముత్సృజ్య వనం జిగమిషుం తదా ॥ 56
జామదగ్న్యం మహాత్మానం భారద్వాజోఽబ్రవీదిదమ్ ।
భరద్వాజాత్ సముత్పన్నం తథా త్వం మామయోనిజమ్ ॥ 57
ఆగతం విత్తకామం మాం విద్ధి ద్రోణం ద్విజర్షభ ।
నేలపై తలను వాల్చి పాదాలకు నమస్కరించి ఆ సమయంలోనే అన్నింటినీ పరిత్యజించి వనాలకు వెళ్లగోరుతున్న మహాత్ముడైన ఆ పరశురామునితో ద్రోణుడిలా అన్నాడు. బ్రాహ్మణశ్రేష్ఠా! నేను భరద్వాజునకు పుట్టిన కొడుకును. అయోనిజుడను. ధనాన్ని కోరి నీ దగ్గరకు వచ్చినవాడను, ద్రోణుడను. (56,57 1/2)
తమబ్రవీన్మహాత్మా సః సర్వక్షత్రియ మర్దనః ॥ 58
అప్పుడు సర్వక్షత్రియులనూ మర్దించిన ఆ మహాత్ముడు - పరశురాముడు - ఇలా అన్నాడు. (58)
స్వాగతం తే ద్విజశ్రేష్ఠ యదిచ్ఛసి వదస్వ మే ।
ఏవముక్తస్తు రామేణ భారద్వాజోఽబ్రవీద్ వచః ॥ 59
రామం ప్రహరతాం శ్రేష్ఠం దిత్సంతం వివిధం వసు ।
అహం ధనమనంతం హి ప్రార్థయే విపులవ్రత ॥ 60
ద్విజోత్తమా! స్వాగతం. నీకేమి కావలెనో చెప్పు. పరశురాముడలా అడగగానే ద్రోణుడు మేటిశూరుడూ, సమస్తధనాన్నీ దానం చేయసంకల్పించిన వాడైన పరశురామునితో ఇలా అన్నాడు - విపులవ్రతా! నేను అనంతధనాన్ని కోరుతున్నాను. (59,60)
రామ ఉవాచ
హిరణ్యం మమ యచ్చాన్యత్ వసు కించిదిహ స్థితమ్ ।
బ్రాహ్మణేభ్యో మయా దత్తం సర్వమేతత్ తపోధన ॥ 61
తథైవేయం ధరా దేవీ సాగరాంతా సపత్తనా ।
కశ్యపాయ మయా దత్తా కృత్స్నా నగరమాలినీ ॥ 62
రాముడిలా అన్నాడు - తపోధనా! నా దగ్గరున్న బంగారాన్నీ, ఇతర ధనాన్నీ బ్రాహ్మణుల కిచ్చి వేశాను. అలాగే గ్రామనగరాలతో సముద్రపర్యంతమై ప్రకాశిస్తున్న నా ఈ భూమండలాన్నంతా కశ్యపునకు ఇచ్చాను. (61,62)
శరమాత్రమేవాద్య మమేదమవశేషితమ్ ।
అస్త్రాణి చ మహార్హాణి శస్త్రాణి వివిధాని చ ॥ 63
ఇప్పుడు నా శరీరమూ, గొప్ప అస్త్రాలు, వివిధ శస్త్రాలు మాత్రం మిగిలి ఉన్నాయి. (63)
అస్త్రాణి వా శరీరం వా వరయైతన్మయోద్యతమ్ ।
వృషీష్వ కిం ప్రయచ్ఛామి తుభ్యం ద్రోణ వదాశు తత్ ॥ 64
కాబట్టి నీవు అస్త్రపరిజ్ఞానాన్నో, నా శరీరాన్నో కోరుకో. ఈ రెండు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ద్రోణా! త్వరగా చెప్పు. నేనేమిచ్చేది? (64)
ద్రోణ ఉవాచ
అస్త్రాణి మే సమగ్రాణి ససంహారాణి భార్గవ ।
సప్రయోగరహస్యాని దాతుమర్హస్యశేషతః ॥ 65
ద్రోణుడిలా అన్నాడు. భార్గవా! ప్రయోగరహస్యాలతో, ఉపసంహారవిశేషాలతో అస్త్రాల నన్నింటినీ నాకీయవలసినది. (65)
తథేత్యుక్త్వా తతస్తస్మై ప్రాదాదస్త్రాణి భార్గవః ।
సరహస్యవ్రతం చైవ ధనుర్వేదమశేషతః ॥ 66
అలాగే అని పరశురాముడు ద్రోణునకు సమస్తాస్త్రాలను ఇచ్చి రహస్యాలతో, వ్రతపాలన నియమాలతో సహా ధనుర్వేదాన్ని సంపూర్ణంగా ఉపదేశించాడు. (66)
ప్రతిగృహ్య తు తత్సర్వం కృతాస్త్రో ద్విజసత్తమః ।
ప్రియం సఖాయం సుప్రీతః జగామ ద్రుపదం ప్రతి ॥ 67
వాటిని గ్రహించి ద్విజశ్రేష్ఠుడైన ద్రోణుడు అస్త్రవిద్యలో నిష్ణాతుడయ్యాడు. పరమానందంతో తన ప్రియమిత్రుడైన ద్రుపదుని దగ్గరకు వెళ్ళాడు. (67)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ద్రోణస్య భార్గవాదస్త్ర ప్రాప్తౌ ఊనత్రింశదధిక శతతమోఽధ్యాయః ॥ 129 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున ద్రోణుడు భార్గవుని నుండి అస్త్రములు పొందుట అను నూట ఇరువది తొమ్మిదవ అధ్యాయము. (129)