188. నూట ఎనుబది ఎనిమిదవ అధ్యయము
ద్రుపదుని రక్షించుటకై భీమార్జునులు రాజుల నెదుర్కొనుట.
వైశంపాయన ఉవాచ
తస్మై దిత్సతి కన్యాం తు బ్రాహ్మణాయ తదా నృపే ।
కోప ఆసీన్మహీపానామ్ ఆలోక్యాన్యోన్యమంతికాత్ ॥ 1
వైశంపాయనుడు ఇలా చెప్పాడు - ద్రుపదుడు తనకన్యను బ్రాహ్మణునికి ఇవ్వాలని అనుకొంటున్నట్లు తెలిసి రాజులంతా ఒకరిమొగాలు ఒకరు చూసుకొన్నారు. వారందరికీ చాలా కోపం వచ్చింది. (1)
అస్మానయమతిక్రమ్య తృణీకృత్య చ సంగతాన్ ।
దాతు మిచ్ఛతి విప్రాయ ద్రౌపదీం యోషితాం వరామ్ ॥ 2
స్వయంవరానికి వచ్చిన మనలనందరినీ తృణీకరించి, కాదని ఒక బ్రాహ్మణునికి కన్యారత్నాన్ని ఇవ్వాలనుకొంటున్నాడు. (2)
అవరోప్యేహ వృక్షం తు ఫలకాలే నిపాత్యతే ।
నిహన్మైనం దురాత్మానం యోయమస్మాన్న మన్యతే ॥ 3
చెట్టును చాలాకాలం పెంచి ఫలించే సమయానికి పడగొట్టినట్లు ఉంది. వీడు మనలను లెక్కచేయటం లేదు. ఈ దురాత్ముని చంపివేద్దాం. (3)
న హ్యర్హత్యేష సమ్మానం నాపి వృద్ధక్రమం గుణైః ।
హన్మైనం సహపుత్రేణ దురాచారం నృపద్విషమ్ ॥ 4
గుణాలను బట్టి కాని, పెద్దతనచేత గాని వీరికి గౌరవం ఇవ్వనక్కరలేదు. రాజద్వేషి అయిన ఈ ద్రుపదుని పుత్రునితో సహా చంపివేద్దాం. (4)
అయం హి సర్వానాహూయ సత్కృత్య చ నరాధిపాన్ ।
గుణవద్ భోజయిత్వాన్నం తతః పశ్చాన్న మన్యతే ॥ 5
ఇతడు అందరినీ పిలిచాడు. రాజులందరినీ సత్కరించాడు. మృష్టాన్నభోజనం పెట్టాడు. చివరికి మనలను లెక్కచేయటం లేదు. (5)
అస్మిన్ రాజసమావాయే దేవానామివ సంనయే ।
కి మయం సదృశం కంచిత్ నృపతిం నైవ దృష్టవాన్ ॥ 6
దేవసభలా ఉన్న ఈ రాజసభలో అర్హుడయిన రాజే కనపడలేదా వీడికి? (6)
న చ విప్రేష్వధీకారః విద్యతే వరణం ప్రతి ।
స్వయంవరః క్షత్రియాణామ్ ఇతీయం ప్రథితా శ్రుతిః ॥ 7
అసలు స్వయంవరంలో విప్రులకు అధికారం లేదు. రాజులకు స్వయంవరం అని కదా వేదం చపుతోంది. (7)
అథవా యది కన్యేయం న చ కంచిద్బుభూషతి ।
అగ్నావేనాం పరిక్షిప్య యామ రాష్ట్రాణి పార్థివాః ॥ 8
లేక ఈ కన్య రాజులనెవరినీ వరించకపోతే మనమంతా ఈమెను అగ్నిలో పడవేసి మనదేశాలకు పోదాం. (8)
బ్రాహ్మణో యది చాపల్యాద్ లోభాద్వా కృతవానిదమ్ ।
విప్రయం పార్థివేంద్రాణాం నైష వధ్యః కథంచన ॥ 9
ఒకవేళ ఈ బ్రాహ్మణుడు చాపల్యం చేతనో, లోభం చేతనో రాజులకు అప్రియం చేసి ఉంటాడు. అపుడు అతడు వధింపతగినవాడు కాదు. (9)
బ్రాహ్మణార్థం హి నో రాజ్యం జీవితం హి వసూని చ ।
పుత్రపౌత్రం చ యచ్చాన్యద్ అస్మాకం విద్యతే ధనమ్ ॥ 10
మనరాజ్యం, జీవితం, సంపద, పుత్రపౌత్రాదులూ, ఇంకా ఇతరధనాలూ బ్రాహ్మణుల కోసమే కదా! (10)
అవమానభయాచ్చైవ స్వధర్మస్య చ రక్షణాత్ ।
స్వయంవరాణామన్యేషాం మా భూదేవం విధా గతిః ॥ 11
అవమానభయం వల్ల కాని, స్వధర్మరక్షణ వల్ల కాని, స్వయంవరానికి వచ్చిన ఇతరులకు మరోసారి అయినా ఇటువంటి గతి పట్టకూడదు. (11)
ఇత్యుక్త్వా రాజశార్దూలాః హృష్టాః పరిఘభాహవః ।
ద్రుపదం తు జిఘాంసంతః సాయుధాః సముపాద్రవన్ ॥ 12
ఇలా అనుకొని రాజులంతా ఉత్సాహంతో ద్రుపదుని సంహరించటానికి సాయుధులై బయలుదేరారు. (12)
తాన్ గృహీతశరావాపాన్ క్రుద్ధానాపతతో బహూన్ ।
ద్రుపదో వీక్ష్య సంత్రాసాద్ బ్రాహ్మణాన్ శరణం గతః ॥ 13
ధనుర్బాణాలు ధరించి కోపంతో ఎంతోమంది రాజులు మీద పడటాన్ని చూసి భయంతో ద్రుపదుడు బ్రాహ్మణుల శరణుజొచ్చాడు. (13)
వేగేనాపతతస్తాంస్తు ప్రభిన్నానివ వారణాన్ ।
పాండుపుత్రౌ మహేష్వాసౌ ప్రతియాతావరిందమౌ ॥ 14
మదించిన ఏనుగుల వలె వేగంగా మీద పడుతున్న రాజులను మహాధనుర్ధారులయిన భీమార్జునులు ఎదిరించి అడ్డుకొన్నారు. (14)
తతః సముత్పేతు రుదాయుధాస్తే
మహీక్షితో బద్ధగోధాంగుళిత్రాః ।
జిఘాంసమానాః కురురాజపుత్రౌ
అమర్షయంతోఽర్జున భీమసేనౌ ॥ 15
రాజులంతా కవచాలూ, శిరస్త్రాణాలు ధరించి ఆయుధాలు పైకెత్తుకొని కోపంతో భీమార్జునులను చంపాలని మీద పడ్డారు. (15)
తతస్తు భీమోఽద్భుతభీమకర్మా
మహాబలో వజ్రసమానసారః ।
ఉత్పాట్య దోర్భ్యాం ద్రుమమేకవీరః
నిష్పత్రయామాస యథా గజేంద్రః ॥ 16
వెంటనే మహాబలుడైన భీముడు వజ్రసమానమయిన బలంతో గజేంద్రునివలె ఒకచెట్టును పెకలించి ఆకులు దూశాడు. (16)
తం వృక్షమాదాయ రిపుప్రమాథీ
దండీవ దండం పితృరాజ ఉగ్రమ్ ।
తస్థౌ సమీపే పురుషర్షభస్య
పార్థస్య పార్థః పృథుదీర్ఘబాహుః ॥ 17
శత్రుసంహారకుడయిన భీముడు దండం ధరించిన యమునివలె ఉగ్రుడయ్యాడు. నరోత్తముడయిన అర్జునుని సమీపంలో ఆ చెట్టును పట్టుకొని దీర్ఘబాహువయిన భీముడు నిలిచాడు. (17)
తత్ ప్రేక్ష్య కర్మాతిమనుష్యబుద్ధిః
జిష్ణుః స హి భ్రాతురచింత్యకర్మా ।
విసిష్మియే చాపి భయం విహాయ
తస్థౌ ధనుర్గృహ్య మహేంద్రకర్మా ॥ 18
మానవాతీతమయిన తెలివికల అర్జునుడు భీముని యొక్క అద్భుతకృత్యం చూసి ఆశ్చర్యపడ్డాడు కాని భయం లేకుండా ధనుస్సు గ్రహించి ఇంద్రుని వలె నిలిచాడు. (18)
తత్ప్రేక్ష్య కర్మాతిమనుష్యబుద్ధిః
జిష్ణోః సహభ్రాతురచింత్యకర్మా ।
దామోదరో భ్రాతరముగ్రవీర్యమ్
హలాయుధం వాక్యమిదం బభాషే ॥ 19
దివ్యజ్ఞానంతొ ఊహింపరాని కృత్యాలు చేసే కృష్ణుడు అర్జునునీ, భీమునీ చూసి ఉగ్రపరాక్రముడయిన బలరామునితో ఇలా అన్నాడు. (19)
స ఏష సింహర్షభఖేలగామీ
మహద్ధనుః కర్షతి తాలమాత్రమ్ ।
ఏషోఽర్జునో నాత్ర విచార్యమస్తి
యద్యస్మి సంకర్షణ వాసుదేవః ॥ 20
యస్త్వేష వృక్షం తరసావభజ్య
రాజ్ఞాం నికారే సహసా ప్రవృత్తః ।
వృకోదరాన్నాన్య ఇహైతదద్య
కర్తుం సమర్థః సమరే పృథివ్యామ్ ॥ 21
సింహంలా, వృషభంలా విలాసంగా ఠీవిగా నడుస్తూ తాటి చెట్టంత వింటిని లాగుతున్న వాడే అర్జునుడు. సందేహం లేదు బలరామా!
ఒక్కపెట్టున చెట్టును పెల్లగించి రాజులనెదిరించి సాహసంతో నిలిచిన వాడే భీమసేనుడు. ఈ భూమిమీద అలా చేయగలవాడు భీముడు తప్ప మరొకడు లేడు. (20,21)
యోఽసౌ పురస్తాత్ కమలాయతాక్షః
తనుర్మహాసింహగతిర్వినీతః ।
గౌరః ప్రలంబోజ్జ్వలచారుఘోణః
వినిఃసృతః సోఽచ్యుత ధర్మపుత్రః ॥ 22
ఇంతకు ముందు అక్కడ విశాలనేత్రాలూ, సింహంలాంటి శరీరమూ నడకతో వినయంతో కూర్చున్నాడే... పచ్చగా/తెల్లగా ఉండి పొడవైన అందమైన ముక్కు ఉన్నవాడు- అతడే ధర్మరాజు ఇపుడు వెళ్లిపోయాడు. (22)
యౌ తౌ కుమారావివ కార్తికేయౌ
ద్వావశ్వినేయావితి మే వితర్కః ।
ముక్తా హి తస్మాజ్జతువేశ్మదాహాత్
మయా శ్రుతాః పాండుసుతాః పృథా చ ॥ 23
అతని ప్రక్కనే ఉన్న వాళ్లిద్దరూ నకులసహదేవులని నా భావం. లాక్షాగృహదహనం నుండి ఎలాగో పాండవులూ, కుంతీ బయటపడ్డారని విన్నాను. (23)
(యథా నృపాః పాండవమాజిమధ్యే
తం ప్రాబ్రవీచ్చక్రధరో హలాయుధమ్ ।
బలం విజానన్ పురుషోత్తమస్తదా
న కార్యమార్యేణ చ సంభ్రమస్త్వయా ॥
భీమానుజో యోధయితుం సమర్థః
ఏకో హి పార్థః ససురాసురాన్ బహూన్ ।
అల విజేతుం కిము మానుషాన్ నృపాన్
సాహాయ్యమస్మాన్ యది సవ్యసాచీ ।
స వాంఛతిస్మ ప్రయతామ వీర
పరాభవః పాండుసుతే న చాస్తి ॥)
రాజులంతా యుద్ధంలో అర్జునునితో ఏమన్నారో కృష్ణుడు బలరామునితో చెప్పాడు. కృష్ణునికి అర్జునుని బలం తెలుసును గనుక అతడు బలరామునితో "నీవు తొందరపడనవసరం లేదు. అర్జునుడు ఒక్కడే సురాసురులంతా ఎత్తివచ్చినా జయిస్తాడు. ఈ మానవమాత్రులొకలెక్కా? ఒకవేళ అర్జునుడే మనలను సాయం అడిగితే చేద్దాం - అయినా పాండుసుతునికి పరాజయం కల్గదు ఎప్పుడూ" ... అన్నాడు కృష్ణుడు.
తమబ్రవీ న్నిర్జలతోయదాభః
హలా యుధోనంతరజం ప్రతీతః ।
ప్రీతోఽస్మి దృష్ట్వాహి పితృష్వసారం
పృథాం విముక్తాం సహకౌరవాగ్ర్యైః ॥ 24
అపుడు నీరులేని మేఘంలా ఉన్న బలరాముడు కృష్ణునితో ఇలా అన్ణాడు - "మన మేనత్త కుంతి, కొడుకులతో సహా లాక్షాగృహం నుండి బయటపడిందని తెలిసి చాలా ప్రీతి చెందాను. (24)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి స్వయంవరపర్వణి కృష్ణవాక్యే అష్టాశీత్యధిక శతతమోఽధ్యాయః ॥ 188 ॥
ఉపపర్వమున కృష్ణవాక్యమను నూట ఎనుబది ఎనిమిదవ అధ్యాయము. (188)
(దాక్షిణాత్య అధికపాఠము 2 1/2 శ్లోకములతో కలిపి మొత్తం 26 1/2 శ్లోకములు)