189. నూట ఎనుబది తొమ్మిదవ అధ్యాయము
భీమార్జునులు కర్ణశల్యాదులను జయించి ద్రౌపదిని తీసికొని పోవుట.
వైశంపాయన ఉవాచ
అజినాని విధున్వంతః కరకాంశ్చ ద్విజర్షభాః ।
ఊచుస్తే బీర్న కర్తవ్యా వయం యోత్స్యామహే పరాన్ ॥ 1
వైశంపాయనుడు ఇలా చెప్పాడు - బ్రాహ్మణులు తమ కృష్ణాజినాలూ, కమండలాలూ విసురుతూ " మేము శత్రువులతో యుద్ధం చేస్తాం భయపడవలసిన పనిలేదు" అంటున్నారు. (1)
తానేవం వదతో విప్రాన్ అర్జునః ప్రహసన్నివ ॥
ఉవాచ ప్రేక్షకా భూత్వా యూయం తిష్ఠథ పార్శ్వతః ॥ 2
అలా అంటున్న విప్రులతో అర్జునుడు నవ్వుతూ " మీరు ప్రేక్షకులై నా ప్రక్క నిలవండి చాలు" అన్నాడు. (2)
అహమేనానజిహ్మాగ్రైః శతశో వికిరన్ శరైః ।
వారయిష్యామి సంక్రుద్ధాన్ మంత్రైరాశీవిషానివ ॥ 3
బుసకొట్టే పాముల్ని మంత్రాలతో నివారించినట్లు నేను వందలకొద్దీ సూటి, వాడి బాణాలు ప్రయోగించి వీరిని వారిస్తాను. (3)
ఇతి తద్ధనురానమ్య శుల్కావాప్తం మహాబలః ।
భ్రాత్రా భీమేన సహితః తస్థౌ గిరిరివాచలః ॥ 4
ఇలా అని మహాబలుడయిన అర్జునుడు శుల్కంగా పొందిన ఆ ధనుస్సును వంచి, భీమునితో కూడి చలించని పర్వతంలా నిలిచాడు. (4)
తతః కర్ణముఖాన్ దృష్ట్వా క్షత్రియాన్ యుద్ధదుర్మదాన్ ।
సంపేతతురభీతౌ తౌ గజౌ ప్రతిగజానివ ॥ 5
రెండు ఏనుగులు ఏనుగులపై పడ్డట్లు భీమార్జునులు కర్ణుడు మొదలయిన వారిపై పడ్డారు. (5)
ఊచుశ్చ వాచః పరుషాః తే రాజానో యుయుత్సవః ।
ఆహవే హి ద్విజస్యాపి వధో దృష్టో యుయుత్సతః ॥ 6
యుద్ధానికి వచ్చిన రాజులు ఇలా పరుషంగా మాట్లాడారు- "యుద్ధానికి వచ్చిన ద్విజులను కూడా చంపవచ్చు" అన్నారు. (6)
ఇత్యేవ ముక్త్వా రాజానః సహసా దుద్రువు ర్ద్విజాన్ ।
తతః కర్ణో మహాతేజాః జిష్ణుం ప్రతి యయౌ రణే ॥ 7
ఇలా అని రాజులంతా బ్రాహ్మణులను పారద్రోలారు. అంతలో మహాతేజస్వి కర్ణుడు అర్జునునితో యుద్ధానికి వెళ్లాడు. (7)
యుద్ధార్థీ వాసితాహేతోః గజః ప్రతిగజం యథా ।
భీమసేనం యయౌ శల్యః మద్రాణామిశ్వరో బలీ ॥ 8
ఆడ ఏనుగు కారణంగా ఒక ఏనుగు మరో ఏనుగుతో పోరాడినట్లు యుద్ధార్థి అయిన మద్రరాజు-శల్యుడు-భీముని ఎదిరించాడు. (8)
దుర్యోధనాదయః సర్వే బ్రాహ్మణైః సహ సంగతాః ।
మృదుపూర్వమయత్నేన ప్రత్యయుధ్యం స్తదాహవే ॥ 9
ఆ యుద్ధంలో దుర్యోధనాదులంతా బ్రాహ్మణులతో అప్రయత్నంగా, మృదువుగా యుద్ధం చేశారు. (9)
తతో-ర్జువః ప్రత్యవిధ్యత్ ఆపతంతం శితైః శరైః ।
కర్ణం వైకర్తనం శ్రీమాన్ వికృష్య బలవద్ధనుః ॥ 10
అర్జునుడు ధనుస్సును బాగా లాగి, వంచి మీదపడుతున్న కర్ణుని వాడిబాణాలతో కొట్టాడు. (10)
తేషాం శరాణాం వేగేన శితానాం తిగ్మతేజసామ్ ।
విముహ్యమానో రాధేయః యత్నాత్ తమనుధావతి ॥ 11
తీక్ష్ణమయిన తేజస్సు కల బాణాల వేగంతో ఒడలు తెలియక కర్ణుడు అతికష్టం మీద అర్జునుని ఎదిరిస్తున్నాడు. (11)
తావుభావప్యనిర్దేశ్యౌ లాఘవాజ్జయతాం వరౌ ।
అయుధ్యేతాం సుసంరబ్ధౌ అన్యోన్యవిజిగీషిణౌ ॥ 12
వారిద్దరూ వర్ణింపరాని నేర్పు కలవారు. ఒకరినొకరు జయించాలని క్రోధంతో యుద్ధం చేస్తున్నారు. (12)
కృతే ప్రతికృతం పశ్య పశ్య బాహుబలం చ మే ।
ఇతి శూరార్థవచనైః అభాషేతాం పరస్పరమ్ ॥ 13
'నీ బాణానికి సమాధానం చూశావా' 'నా బాహుబలం ఎంతటిదో చూడు' అంటూ వీరోక్తులు పల్కుతూ వారు యుద్ధం చేస్తున్నారు. (13)
తతోఽర్జునస్య భుజయోః వీర్యమప్రతిమం భువి ।
జ్ఞాత్వా వైకర్తనః కర్ణః సంరబ్ధః సమయోధయత్ ॥ 14
అర్జునుని భుజపరాక్రమం ఈ భూమి మీద సాటిలేనిదని గ్రహించి కర్ణుడు కోపంతో యుద్ధం చేశాడు. (14)
అర్జునేన ప్రయుక్తాంస్తాన్ బాణాన్ వేగవతస్తదా ।
ప్రతిహత్య ననాదోచ్చైః సైన్యాని తదపూజయన్ ॥ 15
అర్జునుడు ప్రయోగించిన వేగవంతములయిన బాణాలను కర్ణుడు ఖండించి బిగ్గరగా అరిచాడు. దానిని సైనికులు ప్రశంసించారు. (15)
కర్ణ ఉవాచ
తుష్యామి తే విప్రముఖ్య భుజవీర్యస్య సంయుగే ।
అవిషాదస్య చైవాస్య శస్త్రాస్త్రవిజయస్య చ ॥ 16
కర్ణుడు ఇలా అన్నాడు. విప్రోత్తమా! "యుద్ధంలో నీ భుజపరాక్రమానికి సంతోషిస్తున్నాను. దుఃఖం చెందకుండా శస్త్రాస్త్రాలతో విజయం పొందుతున్నందుకు కూడా సంతోషిస్తున్నాను. (16)
కిం త్వం సాక్షాద్ ధనుర్వేదః రామో వా విప్రసత్తమ ।
అథ సాక్షాద్ధరిహయః సాక్షాద్వా విష్ణురచ్యుతః ॥ 17
విప్రోత్తమా! నీవు సాక్షాత్తు ధనుర్వేదవేత్త అయిన పరశురాముడివా? లేక ఇంద్రుడవా? లేదా సాక్షాత్తు ఉపేంద్రుడివా? (17)
ఆత్మప్రచ్ఛాదనార్థం వై బాహువీర్యముపాశ్రితః ।
విప్రరూపం విధాయేదం మన్యే మాం ప్రతియుధ్యసే ॥ 18
నిన్ను కప్పిపుచ్చుకొనటానికి విప్రరూపం ధరించి బాహుపరాక్రమంతో నాతో ప్రతియుద్ధం చెస్తున్నావనుకొంటున్నాను. (18)
న హి మామాహవే క్రుద్ధమ్ అన్యః సాక్షాత్ శచీపతేః ।
పుమాన్ యోధయితుం శక్తః పాండవాద్యా కిరీటినః ॥ 19
కోపించిన నన్ను యుద్ధంలో ఎదిరించాలంటే సాక్షాత్తు ఇంద్రుడైనా కావాలి, లేదా అర్జునుడయినా కావాలి. అంతేకాని మరొకనికి సాధ్యం కాదు. (19)
తమేవం వాదినం తత్ర ఫాల్గునః ప్రత్యభాషత ।
నాస్మి కర్ణ ధనుర్వేదః నాస్మి రామః ప్రతాపవాన్ ॥ 20
ఇలా అంటున్న కర్ణునితో అర్జునుడిలా అన్నాడు. కర్ణా! ధనుర్వేత్త, ప్రతాపవంతుడూ అయిన పరశురాముడిని కాను. (20)
బ్రాహ్మణోఽస్మి యుధాం శ్రేష్ఠః సర్వశస్త్రభృతాం వరః ।
బ్రాహ్మే పౌరందరే చాస్త్రే నిష్ఠితో గురుశాసనాత్ ॥ 21
స్థితోస్మ్యద్య రణే జేతుం త్వాం వై వీర స్థిరో భవ ।
యుద్ధంలో శ్రేష్ఠుడనై శస్త్రాలు తెలిసిన బ్రాహ్మణుడను. బ్రహ్మాస్త్రం, ఐంద్రాస్త్రం, నిష్ఠగా గురూపదేశంతో పొందాను. నిన్ను జయించడానికి యుద్ధంలో నిలిచాను. వీరా! స్థిరపడు. (21 1/2)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తు రాధేయః యుద్ధాత్కర్ణో న్యవర్తత ॥ 22
బ్రాహ్మం తేజస్తదాజయ్యం మన్యమానో మహారథః ।
వైశంపాయనుడు ఇలా చెపుతున్నాడు. అర్జునుడు ఇలా అనగానే కర్ణుడు "బ్రాహ్మతేజస్సు జయింపశక్యం కాని" దని భావించి యుద్ధం నుండి వెనుదిరిగాడు. (22 1/2)
అపరస్మిన్ వనోద్దేశే వీరౌ శల్యవృకోదరౌ ॥ 23
బలినౌ యుద్ధసంపన్నౌ విద్యయా చ బలేన చ ।
అన్యోన్యమాహ్వయంతౌ తు మత్తావివ మహాగజౌ ॥ 24
మరోచోట వీరులయిన శల్య భీమసేనులు తలపడ్డారు. ఇద్దరీ బలవంతులు. యుద్ధం బాగా తెలిసినవారు. విద్యా, బలమూ రెండూ పుష్కలంగా కలవారు. వారిద్దరూ ఒకరినొకరు ఆహ్వానించుకొని మదపుటేనుగులవలె తలపడ్డారు. (23,24)
ముష్టిభిర్జానుభిశ్చైవ నిఘ్నంతావితరేతరమ్ ।
ప్రకర్షణాకర్షణయోః అభ్యాకర్ షవికర్షణైః ॥ 25
పిడికిళ్లతో, మోకాళ్లతో ఒకరినొకరు పొడుచుకొంటూ, లాక్కుంటూ, విసురుకుంటూ, త్రోసుకుంటూ, పీక్కుంటూ యుద్ధం చేస్తున్నారు. (25)
ఆచకర్షతురన్యోన్యం ముష్టిభిశ్చాపి జఘ్నతుః ।
తతశ్చటచటాశబ్దః సుఘోరోహ్యభవత్తయోః ॥ 26
పాషాణసంపాతనిభైః ప్రహారై రభిజఘ్నతుః ।
ముహూర్తం తౌ తదాన్యోన్యం సమరే పర్యకర్షతామ్ ॥ 27
ఒకరినొకరు లాక్కున్నారు-పిడికిళ్లతో పొడుచుకొన్నారు-దానితో భయంకరంగా ఛట్ ఛట్ మని ధ్వని వస్తోంది. పెద్ద బండరాయి పడినంత దెబ్బలతో పరస్పరం కొట్టుకొన్నారు. అలా కొంతసేపు ఒకరినొకరు కొట్టుకొన్నారు. (26,27)
తతో భీమః సముత్ క్షిప్య బాహుభ్యాం శల్యమాహవే ।
అపాతయత్ కురుశ్రేష్ఠః బ్రాహ్మణా జహసుస్తదా ॥ 28
అంతలో భీముడు చేతులతో శల్యుని ఎత్తిపట్టి నేలమీద కొట్టాడు. బ్రాహ్మణులంతా నవ్వుకొన్నారు. (28)
తత్రాశ్చర్యం భీమసేనః చకార పురుషర్షభః ।
యచ్ఛల్యం పాతితం భూమౌ నావధీద్బలినం బలీ ॥ 29
ఇందులో ఆశ్చర్యమేమంటే-పురుషశ్రేష్ఠుడయిన భీముడు బలిష్ఠుడయిన శల్యుని నేలకు కొట్టాడే కాని చంపలేదు. (29)
పాతితే భీమసేనేన శల్యే కర్ణే చ శంకితే ।
శంకితాః సర్వరాజానః పరివవ్రుర్వృకోదరమ్ ॥ 30
భీమసేనుడు శల్యుని నేలకు కొట్టేసరికి శల్యునికీ, కర్ణునికీ, అనుమానం కలిగింది. శంకించిన రాజులంతా భీముని చుట్టుముట్టారు. (30)
ఊచుశ్చ సహితాస్తత్ర సాధ్విమౌ బ్రాహ్మణర్షభౌ ।
విజ్ఞాయేతాం క్వజన్మానౌ క్వనివాసౌ తథైవ చ ॥ 31
అందరూ కలిసి ఇలా అన్నారు-ఈ విప్రోత్తములిద్దరూ సాధువులు. వీరు ఎవరిపుత్రులో, ఎక్కడ ఉంటారో తెలుసుకోండి. (31)
కో హి రాధాసుతం కర్ణం శక్తో యోధయితుం రణే ।
అన్యత్ర రామాద్ ద్రోణాద్వా పాండవాద్యా కిరీటినః ॥ 32
పరశురాముడు, ద్రోణుడూ, అర్జునుడూ తప్ప ఎవరయినా యుద్ధంలో కర్ణుని ఎదిరించగలరా? (32)
కృష్ణాద్వా దేవకీపుత్రాత్ కృపాద్వాపి శరద్వతః ।
కో వా దుర్యోధనం శక్తః ప్రతియోధయితుం రణే ॥ 33
కృష్ణుడు, కృపుడు తప్ప దుర్యోధనుని ఎదుట యుద్ధంలో నిలవగల వాడెవడు? (33)
తథైవ మద్రాధిపతిం శల్యం బలవతాం వరమ్ ।
బలదేవాదృతే వీరాత్ పాండవాద్యా వృకోదరాత్ ॥ 34
వీరాద్దుర్యోధనాద్వాన్యః శక్తః పాతయితుం రణే ।
క్రియతా మవహారోఽస్మాద్ యుద్ధాద్ర్బాహ్మణ సంవృతాత్ ॥ 35
బలవంతులలో ఉత్తముడయిన మద్రరాజు శల్యుని యుద్ధంలో పడగొట్టడానికి బలరాముడో, భీముడో, దుర్యోధనుడో కావాలి. ఇతరులకు సాధ్యం కాదు. బ్రాహ్మణులతో యుద్ధం ముగించండి. (34,35)
బ్రాహ్మణా హి సదా రక్ష్యాః సాపరాధాపి నిత్యదా ।
అథైనానుపలభ్యేహ పునర్యోత్స్యామ హృష్టవత్ ॥ 36
అపరాధం చేసినా బ్రాహ్మణులు నిత్యమూ రక్షింపదగినవారు. అందుచేత ముందు వారిని ప్రసన్నులను చేసికొని మళ్లీ కావాలంటే వారితో సంతోషంగా యుద్ధం చేద్దాం. (36)
తాం స్తథావాదినః సర్వాన్ ప్రసమీక్ష్య క్షితీశ్వరాన్ ।
అథాన్యాన్ పురుషాంశ్చాపి కృత్వా తత్కర్మ సంయుగే ॥ 37
అలా అంటున్న రాజులను మిగిలిన వారందరినీ చూసి, యుద్ధంలో వారి పరాక్రమాన్నీ చూసి భీమార్జునులు ప్రసన్నులయ్యారు. (37)
వైశంపాయన ఉవాచ
తత్కర్మ భీమస్య సమీక్ష్య కృష్ణః
కుంతీసుతౌ తౌ పరిశంకమానః ।
నివారయామాస మహీపతీంస్తాన్
ధర్మేణ లబ్ధేత్యనునీయ సర్వాన్ ॥ 38
వైశంపాయనుడు చెపుతున్నాడు. భీముని అద్భుతకృత్యం చూసి వారిద్దరినీ కుంతీసుతులని ఊహిస్తున్న కృష్ణుడు ఆ రాజులను "ధర్మపూర్వకంగా లభించింది ఆమె" అని అనునయించి యుద్ధం నివారించాడు. (38)
ఏవం తే వినివృత్తాస్తు యుద్ధాద్ యుద్ధవిశారదాః ।
యథావాసం యయుః సర్వే విస్మితా రాజసత్తమాః ॥ 39
ఇలా నివారింపబడిన యుద్ధవిశారదులైన రాజు ఆశ్చర్యంతో తమతమ్ నివాసాలకు వెళ్లారు. (39)
వృత్తో బ్రహ్మోత్తరో రంగః పాంచాలీ బ్రాహ్మణైర్వృతా ।
ఇతి బ్రువంతః ప్రయయుః యే తత్రాసన్ సమాగతాః ॥ 40
"బ్రహ్మోత్తరంగా రంగం సమాప్తమయింది. (బ్రాహ్మణప్రధానంగా) ద్రౌపది బ్రాహ్మణుల చేత వరింపబడింది" అని అక్కడకు వచ్చిన వారంతా చెప్పుకొంటూ వెళ్లారు. (40)
బ్రాహ్మణైస్తు ప్రతిచ్ఛన్నౌ రౌరవాజినవాసిభిః ।
కృచ్ఛ్రేణ జగ్మతుస్తౌ తు భీమసేన ధనంజయౌ ॥ 41
రౌరవాజినాలు దాల్చిన బ్రాహ్మణులతో పరివేష్టింపబడి బీమార్జునులిరువురూ కష్టం మీద వెళ్లారు. (41)
విముక్తౌ జనసంబాధాత్ శత్రుభిః పరివీక్షితౌ ।
కృష్ణయానుగతౌ తత్ర నృవీరౌ తౌ విరేజతుః ॥ 42
జనసమ్మర్దం నుండి విముక్తులై, శత్రువులు చూస్తూ ఉండగా ఆ భీమార్జునులిరువురూ ద్రౌపదిని వెంట తీసుకొని వెళ్లారు. (42)
పౌర్ణమాస్యాం ఘనైర్ముక్తౌ చంద్రసూర్యావివోదితౌ ।
తేషాం మాతా బహువిధం వినాశం పర్యచింతయత్ ॥ 43
అనాగచ్ఛత్సు పుత్రేషు భైక్షకాలేఽభిగచ్ఛతి ।
ధార్తరాష్ట్రెర్హతా న స్యుః విజ్ఞాయ కురుపుంగవాః ॥ 44
మాయాన్వితైర్వా రక్షోభిః సుఘోరైర్దృఢవైరిభిః ।
విపరీతం మతం జాతం వ్యాసస్యాపి మహాత్మనః ॥ 45
అపుడు వారిద్దరూ పూర్ణిమనాడు మేఘాల నుండి విడవడి ఉదయించిన చంద్రసూర్యుల్లా శోభించారు. కాని వారితల్లి భిక్షాకాలమయినా పుత్రులు రాకపోయేసరికి కీడును శంకిస్తూ పరిపరివిధాల చింతించింది. కౌరవులు వీరిని తెలుసుకొని చంపివేయలేదుకదా! మాయావులయిన రాక్షసులు చంపలేదు కదా! మహాత్ముడైన వ్యాసుని మాటలు కూడా విపరీతాలయ్యాయా? (43-45)
ఇత్యేవం చింతయామాస సుతస్నేహావృతా పృథా ।
తతః సుప్తజనప్రాయే దుర్దినే మేఘసంప్లుతే ॥ 46
మహత్యథాపరాహ్ణే తు ఘనైః సూర్య ఇవావృతః ।
బ్రాహ్మణైః ప్రావిశత్తత్ర జిష్ణుర్భార్గవవేశ్మ తత్ ॥ 47
కొడుకుల మీది ప్రేమతో అలా అనుకొంటోంది. మేఘాలతో నిండిన దుర్దినమ్ లాగా ప్రజలంతా సద్దుమణిగి నిద్రపోసాగారు. అపుడు మధ్యాహ్న మేఘాలతో ఆవరింపబడిన సూర్యునివలె బ్రాహ్మణులతో పరివృతుడై అర్జునుడు కుమ్మరియింటిలో ప్రవేశించాడు. (46,47)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి స్వయంవరపర్వణి పాండవ ప్రత్యాగమనే ఏకోన నవత్యధిక శతతమోఽధ్యాయః ॥ 189 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున స్వయంవర పర్వమను
ఉపపర్వమున పాండప్రత్యాదమన మను నూట ఎనుబది తొమ్మిదవ అధ్యాయము. (189)