173. నూట డెబ్బది మూడవ అధ్యాయము
క్షత్రియులకు బ్రాహ్మణబలము కావలెననుట.
వైశంపాయన ఉవాచ
స గంధర్వవచః శ్రుత్వా తత్ తదా భరతర్షభ ।
అర్జునః పరయా భక్త్యా పూర్ణచంద్రః ఇవాబభౌ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
భరతశ్రేష్ఠా! అప్పుడు ఆ రీతిగా పలికిన ఆ గంధర్వుని మాట విని అర్జునుడు పరమభక్తితో పూర్ణచంద్రుని వలె ప్రకాశించాడు. (1)
ఉవాచ చ మహేష్వాసః గంధర్వం కురుసత్తమః ।
జాత కౌతూహలోఽతీవ వసిష్ఠస్య తపోబలాత్ ॥ 2
అప్పుడు మేటి విలుకాడైన అర్జునుడు గంధర్వునితో ఇలా అన్నాడు.
వసిష్ఠుని తపోబలాన్ని గురించి వినటానికి నాలో ఎంతో కుతూహలం కలుగుతోంది. (2)
వసిష్ఠః ఇతి తస్యైతత్ ఋషేః నామ త్వయేరితమ్ ।
ఏత దిచ్ఛామ్యహం శ్రోతుం యథావత్ తత్ వదస్వ మే ॥ 3
నీవు ఆ మహర్షి పేరు వసిష్ఠుడన్నావు. ఆ పేరెలా వచ్చిందో వినాలనుకొంటున్నాను. ఉన్నదున్నట్లుగా నాకు చెప్పు. (3)
య ఏష గంధర్వపతే పూర్వేషాం నః పురోహితః ।
ఆసీదేతత్ మమాచక్ష్వ క ఏష భగవాన్ ఋషిః ॥ 4
గంధర్వ రాజా! మా పూర్వీకులకు పురోహితుడైన పూజ్యుడు, వసిష్ఠమహర్షి ఎవరు? ఇది నాకు చెప్పు. (4)
గంధర్వ ఉవాచ
బ్రహ్మణో మానసః పుత్రః వసిష్ఠోఽరుంధతీపతిః ।
తపసా నిర్జితౌ శశ్వత్ అజేయావమరైరపి ॥ 5
కామక్రోధావుభౌ యస్య చరణౌ సంవవాహతుః ।
ఇంద్రియాణాం వశకరః వసిష్ఠ ఇతి చోచ్యతే ॥ 6
గంధర్వుడిలా అన్నాడు.
వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుడు, అరుంధతి భర్త. దేవతలకు కూడా జయింపరాని కామక్రోధాలను తన తపస్సుతో జయించాడు. అవి శాశ్వతంగా ఆయన పాదసేవ చేస్తున్నాయి. ఇంద్రియాలను అదుపులో నుంచినవాడు కాబట్టి ఆయన వసిష్ఠుడు. (5,6)
యస్తు నోచ్ఛేదనం చక్రే కుశికానాముదారధీః ।
విశ్వామిత్రాపరాధేన ధారయన్ మన్యుముత్తమమ్ ॥ 7
విశ్వామిత్రుడు చేసిన అపరాధం వలన తీవ్రకోపం వచ్చినా ఆ వసిష్ఠుడు ఉదారబుద్ధి గలవాడు కాబట్టి కుశికవంశ నాశనానికి ఒడిగట్టలేదు. (7)
పుత్రవ్యసనసంతప్తః శక్తిమానప్యశక్తివత్ ।
విశ్వామిత్రవినాశాయ న చక్రే కర్మదారుణమ్ ॥ 8
విశ్వామిత్రుడు తనకుమారులను సంహరించినా, దానికి ప్రతీకారం చేయగల శక్తి ఉండికూడా ఆశక్తుని వలె నిలిచి విశ్వామిత్ర వినాశానికి ఎటువంటి ఘోరకృత్యాన్నీ చేయలేదు. (8)
మృతాన్ చ పునరాహర్తుం శక్తః పుత్రాన్ యమక్షయాత్ ।
కృతాంతం నాతిచక్రామ వేలామివ మహోదధిః ॥ 9
చనిపోయిన తన కుమారులను యమసదనం నుండి తిరిగి తీసికొనిరాగల శక్తి కలవాడైనా, సముద్రం హద్దునతిక్రమించనట్లు యమధర్మరాజశాసనాన్ని తాను ఉల్లంఘించలేదు. (9)
యం ప్రాప్య విజితాత్మానం మహాత్మానం నరాధిపాః ।
ఇక్ష్వాకవో మహీపాలాః లేభిరే పృథివీమిమామ్ ॥ 10
విజితాత్ముడు, మహాత్ముడూ అయిన ఆ వసిష్ఠుని పురోహితునిగా పొందియే ఇక్ష్వాకు రాజులు ఈ భూమిని పరిపాలించారు. (10)
పురోహితమిమం ప్రాప్య వసిష్ఠం ఋషిసత్తమమ్ ।
ఈజిరే క్రతుభిశ్చైవ నృపాస్తే కురునందన ॥ 11
కురుకుమారా! ఆ రాజులు ఋషిశ్రేష్ఠుడైన వసిష్ఠుని పురోహితునిగా స్వీకరించిన తరువాత ఎన్నో యజ్ఞాలు కూడా చేశారు. (11)
స హి తాన్ యాజయామాస సర్వాన్ నృపతిసత్తమాన్ ।
బ్రహ్మర్షిః పాండవశ్రేష్ఠ బృహస్పతిరివామరాన్ ॥ 12
పాండవశ్రేష్ఠా! బృహస్పతి దేవతలచే యాగాలు చేయించినట్టు ఆ బ్రహ్మర్షి-వసిష్ఠుడు-సమస్తరాజవరులచేతా యాగాలు చేయించారు. (12)
తస్మాత్ ధర్మప్రధానాత్మా వేదధర్మవిదీప్సితః ।
బ్రాహ్మణో గుణవాన్ కశ్చిత్ పురోధాః ప్రతిదృశ్యతామ్ ॥ 13
కాబట్టి నీవు కూడా ధర్మానికే ప్రాధాన్యమిచ్చేవాడు, వేదధర్మమెరిగినవాడు, గుణవంతుడు అయి నీకు నచ్చిన ఎవరినైనా పురోహితునిగా ఏర్పాటు చేసుకో. (13)
క్షత్రియేణాభిజాతేన పృథివీం జేతుమిచ్ఛతా ।
పూర్వం పురోహితః కార్యః పార్థ! రాజ్యాభివృద్ధయే ॥ 14
పార్థా! భూమండలాన్ని జయించదలచుకొనే ఉత్తమ క్షత్రియుడు రాజ్యాభివృద్ధి కోసం ముందుగా పురోహితుని నియోగించుకోవాలి. (14)
మహీం జిగీషతా రాజ్ఞా బ్రహ్మ కార్యం పురస్సరమ్ ।
తస్మాత్ పురోహితః కశ్చిత్ గుణవాన్ విజితేంద్రియః ।
విద్వాన్ భవతు వో విప్రః ధర్మకామార్థతత్త్వవిత్ ॥ 15
భూమిని గెలవదలచినరాజు బ్రాహ్మణుని ముందు నిలుపుకోవాలి. కాబట్టి జితేంద్రియుడు, గుణవంతుడు, పండితుడు అయి ధర్మకామార్థాల నెరిగిన విప్రుని ఎవరినయినా పురోహితునిగా చేసుకో. (15)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి పురోహితకరణ కథనే త్రిసప్తత్యధిక శతతమోఽధ్యాయః ॥ 173 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున చైత్రరథపర్వమను
ఉపపర్వమున పురోహితకరణ కథనమను నూట డెబ్బది మూడవ అధ్యాయము. (173)