230. రెండువందల ముప్పదియవ అధ్యాయము
జరిత - ఆమె పిల్లల సంవాదము.
జరితోవాచ
అస్మాద్ బిలాన్నిష్పతితమ్ ఆఖుం శ్యేనో జహార తమ్ ।
క్షుద్రమ్ పద్భ్యాం గృహీత్వా చ యాతో నాత్ర భయం హి వః ॥ 1
జరిత పలికింది - పిల్లలారా! ఈ బిలం నుండి బయటకు వచ్చిన ఎలుకను డేగ తన్నుకుపోయింది. డేగ తన కాళ్ళతో గట్టిగా పట్టి ఎగిరింది. అందువల్ల మీ కీ బిలంలో భయం ఉండదు. (1)
శార్ ఙ్గకా ఊచుః
న హృతం తం వయం విద్మః శ్యేనేనాఖుం కథంచన ।
అన్యేఽపి భవితారోఽత్ర తేభ్యోఽపి భయమేవ నః ॥ 2
పక్షులు పలికాయి - డేగ తన్నుకుపోయిన ఎలుకను గూర్చి మాకు తెలియదు. అయినా ఇక్కడ ఇంకా ఎలుకలు ఉండవచ్చు. వాటి వల్ల భయం ఉండనే ఉంది. (2)
సంశయో వహ్నిరాగచ్ఛేద్ దృష్టం వాయోర్నివర్తనమ్ ।
మృత్యుర్నో బిలవాసిభ్యః బిలే స్యాన్నాత్ర సంశయః ॥ 3
అగ్ని ఇంతవరకు వస్తుందనే విషయం సందేహం. వాయువేగంతో అగ్ని మరొకవైపుకు పోవచ్చు. బిలంలోనున్న ప్రాణులచే మాకు మృత్యువు కలగటంలో సందేహం లేదు. (3)
నిస్సంశయాత్ సంశయితః మృత్యుర్మాతర్విశిష్యతే ।
చర కే త్వం యథాన్యాయం పుత్రానాప్స్యసి శోభవాన్ ॥ 4
తల్లీ! సంశయరహితమైన చావుకంటె సంశయాత్మకమైన చావు మంచిది. కావున నీవు ఆకాశంలోనికి ఎగురు నీవు తిరిగి మంచి పుత్రులను పొందగలవు. (4)
జరితోవాచ
అహం వేగేన తం యాంతమ్ అద్రాక్షమ్ పతతాం వరమ్ ।
బిలాదాఖుం సమాదాయ శ్యేనం పుత్రా మహాబలమ్ ॥ 5
తం పతంతం మహావేగాత్ త్వరితా పృష్ఠతోఽన్వగామ్ ।
ఆసిషోఽస్య ప్రయుంజానా హరతో మూషికం బిలాత్ ॥ 6
జరిత అంది - నేను వేగంగా పోతూ బిలం నుంచి ఎలుకను తీసుకొని పోయే ఆ డేగను అనుసరించి వెళ్లాను. బిలం నుండి ఎలుకను తీసికొని పొయినందున ఆశీర్వాదాలిచ్చాను. (5,6)
యో నో ద్వేష్టారమాదాయ శ్యేనరాజ ప్రధావసి ।
భవ త్వం దివమాస్థాయ నిరమిత్రో హిరణ్మయః ॥ 7
శ్యేనరాజా! మాకు శత్రువైన ఎలుకను తీసికొనిపోతూ ఉన్నందున నీకు స్వర్గప్రాప్తి కలిగి శత్రువులు లేనివాడవై బంగారు శరీరం కలవాడవు అవుతావు. (7)
స యదా భక్షితస్తేన శ్యేనేనాఖుః పతిత్త్రిణా ।
తదాహం తమనుజ్ఞాప్య ప్రత్యుపాయాం పునర్గృహమ్ ॥ 8
అపుడా డేగ ఎలుకను తినివేసింది. పిమ్మట ఆ డేగకు వీడ్కోలు చెప్పి తిరిగి ఇంటికి వచ్చాను. (8)
ప్రవిశధ్వం బిలం పుత్రాః విస్రబ్ధా నాస్తి వో భయమ్ ।
శ్యేనేన మమ పశ్యంత్యా హృత ఆఖుర్మహాత్మనా ॥ 9
పిల్లలారా! బిలంలో ప్రవేశించండి. నిస్సంశయంగా మీకు భయం లేదు. నేను చూస్తుండగనే డేగ ఎలుకను చంపింది. (9)
శార్ ఙ్గకా ఊచుః
న విద్మహే హృతం మాతః శ్యేనేనాఖుం కథంచన ।
అవిజ్ఞాయ న శక్యామః ప్రవేష్టుం వివరం భువః ॥ 10
పక్షులు పలికాయి - తల్లీ! డేగచే చంపబడిన ఎలుకను గూర్చి మేము ఎఱుగం. అది తెలియక కన్నంలో ప్రవేశించలేం. (10)
జరితోవాచ
అహం తమభిజానామి హృతం శ్యేనేన మూషికమ్ ।
నాస్తి వోఽత్ర భయం పుత్రాః క్రియతాం వచనం మమ ॥ 11
జరిత పలికింది - పిల్లల్లారా! డేగ చంపిన మూషికాన్ని గురించి నేను తెలుసుకొన్నాను. మీకు భయంలేదు. నా మాటలను పాటించండి. (11)
శార్ ఙ్గకా ఊచుః
న త్వం మిథ్యోపచారేణ మోక్షయేథా భయాద్ధి నః ।
సమాకులేషు జ్ఞానేషు న బుద్ధికృతమేవ తత్ ॥ 12
పక్షులు పలికాయి - నీవు అసత్యవృత్తంతో మమ్మల్ని భయం నుంచి దూరం చేయాలని ప్రయత్నం చేయవద్దు. సందిగ్ధకార్యాలు చేయటం బుద్ధిమంతుల పనికాదు. (12)
న చోపకృతమస్మాభిః న చాస్మాన్ వేత్థ యే వయమ్ ।
పీడ్యమానా బిభర్ష్యస్మిన్ కా సతీ కే వయం తవ ॥ 13
మేం నీకు ఉపకారం చేయలేదు. ముందు మేమెవరమో కూడ నీకు తెలియదు. ఈ విషయం నీవు గుర్తించలేదు. నీవు కష్టాలను సహించి ఎందుకు మమ్ములను రక్షించాలి అని తలంచావు? నీవు మాకు ఏమవుతావు? మేము నీకు ఏమవుతాం? (13)
తరుణీ దర్శనీయాసి సమర్థా భర్తురేషణే ।
అనుగచ్ఛ పతిం మాతః పుత్రానాప్స్యసి శోభనాన్ ॥ 14
అమ్మా! నీవు యౌవనంలో ఉండి, చూడముచ్చటగా ఉన్నావు. పతిని అన్వేషించటంలో సమర్థురాలివి. నీవు నీపతిని అనుసరించు. (14)
వయమగ్నిం సమావిశ్య లోకానాప్స్యామ శోభనాన్ ।
అథాస్మాన్ న దహేదగ్నిః ఆయాస్త్వం పునరేవ నః ॥ 15
మేమీ అగ్నిలో పడి దగ్ధులమై ఉత్తమలోకాలను పొందుతాము. మేం ఒకవేళ అగ్నిలో దహనం కాకుంటే నీవు మా దగ్గరకు రా. (15)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తాః తతః శారీ పుత్రానుత్సృజ్య ఖాండవే ।
జగామ త్వరితా దేశం క్షేమమగ్నేరనామయమ్ ॥ 16
వైశంపాయనుడు అన్నాడు - పిల్లల మాటల్ని విన్న జరిత వేగంగా ఖాండవవనాన్ని వీడి అగ్ని చొరబడని కుశలమైన ప్రదేశానికి చేరింది. (16)
తతస్తీక్షార్చిరభ్యగాత్ త్వరితో హవ్యవాహనః ।
యత్ర శారా బభూవస్తే మందపాలస్య పుత్రకాః ॥ 17
అటుపైన తీక్ష్ణజ్వాలలు గల అగ్ని వేగంగా మందపాలుని పుత్రులైన పక్షులు ఎక్క్డ ఉన్నాయో అక్కడికి చేరాడు. (17)
తతస్తం జ్వలితం దృష్ట్వా జ్వలనం తే విహంగమాః ।
జరితారిస్తతో వాక్యం శ్రావయామాస పావకమ్ ॥ 18
మండే అగ్నిని చూచి ఆ పక్షులు పరస్పరం వార్తాలాపాలు సాగించాయి. జరితారి అగ్నిదేవునితో ఇట్లు పలికాడు. (18)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి మయదర్శనపర్వణి శార్ ఙ్గకోపాఖ్యానే త్రింశదధిక శతతమోఽధ్యాయః ॥ 230 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున మయదర్శనపర్వమను
ఉపపర్వమున శార్ ఙ్గకోపాఖ్యానమున రెండువందల ముప్పదియవ అధ్యాయము. (230)