36. ముప్పది ఆరవ అధ్యాయము
ధర్మరాజు కృష్ణునకు అర్ఘ్యమిచ్చుట.
వైశంపాయన ఉవాచ
తతోఽభిషేచనీయేఽహ్ని బ్రాహ్మణా రాజభిస్సహ ।
అంతర్వేదీం ప్రవివిశుః సత్కారార్హా మహర్షయః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు - తరువాత రాజసూయయాగంలో పట్టాభిషేకం చేయవలసిన రోజున బ్రాహ్మణులు, సత్కారానికి అర్హులైన మహర్షులూ రాజులతో పాటు యజ్ఞశాలలో ప్రవేశించారు. (1)
నారదప్రముఖాస్తస్యామ్ అంతర్వేద్యాం మహాత్మనః ।
సమాసీనాః శుశుభిరే సహరాజర్షిభిస్తదా ॥ 2
సమేతా బ్రహ్మభవనే దేవా దేవర్షయస్తథా ।
కర్మాంతరముపాసంతః జజల్పురమితౌజసః ॥ 3
ఏవమేతన్నచాప్యేవమ్ ఏవం చైతన్నచాన్యథా ।
ఇత్యూచుర్బహవస్తత్ర వితండా వై పరస్పరమ్ ॥ 4
నారదుడు మున్నగు మహాత్ములు రాజర్షులతో పాటు ఆ యజ్ఞశాలలో కూర్చుండి శోభిల్లుతున్నారు.
అమితతేజస్సంపన్నులైన దేవతలు, దేవర్షులు కలిసి బ్రహ్మభవనంలో కర్మలమధ్య విరామ సమయంలో మాట్లాడుకొంటున్నారు. చర్చించుకొంటున్నారు.
"ఇది ఈవిధంగా చెయ్యాలి. దీన్ని ఈ విధంగా కాదు. ఇది కూడా ఈ విధంగానే, మరొక విధంగా కాదు" అని అక్కడి వారు చాలా మంది తార్కికులు పరస్పరం మాట్లాడుకొంటున్నారు. (2-4)
కృశానర్థాంస్తతః కేచిద్ అకృశాంస్తత్ర కుర్వతే ।
అకృశాంశ్చ కృశాంశ్చక్రుః హేతుభిః శాస్త్రనిశ్చయైః ॥ 5
అక్కడ కొందరు శాస్త్రంలో నిశ్చయింపబడిన హేతువులతో యుక్తిదౌర్బల్యం గల విషయాలను యుక్తప్రాబల్యం గలవానిగ, యుక్తిప్రాబల్యం గల విషయాలను యుక్తిదౌర్బల్యం కలవిగా చేస్తున్నారు. (5)
తత్ర మేధావినః కేచిద్ అర్థమన్యైరుదీరితమ్ ।
విచిక్షిపుర్యథా శ్యేనాః నభోగతమివామిషమ్ ॥ 6
అక్కడ మేధావులు కొందరు ఇతరులు చెప్పిన విషయాన్ని ఆకాశంలో ఉన్న మాంసాన్ని డేగలు చెల్లాచెదరు చేసినట్లుగా పక్కదారి పట్టిస్తున్నారు. చీల్చి చెండాడుతున్నారు. (6)
కేచిద్ ధర్మార్థకుశలాః కేచిత్ తత్ర మహావ్రతాః ।
రేమిరే కథయంతశ్చ సర్వభాష్యవిదాం వరాః ॥ 7
అక్కడ కొందరు ధర్మార్థకుశలలు, మరికొందరు మహానిష్ఠాపరులు, కొందరు సర్వభాష్యవేత్తలలో శ్రేష్ఠులూ ఉన్నారు. వారు అనేక విషయాలు చెపుతూ ఉండగా అందరూ ఆనందిస్తూ ఉన్నారు. (7)
సా వేదిర్వేదసంపన్నైః దేవద్విజమహర్షిభిః ।
ఆబభాసే సమాకీర్ణా నక్షత్రైర్ద్యౌరివాయతా ॥ 8
నక్షత్రాలతో నిండియున్న విశాలమైన ఆకాశంలా ఆ యజ్ఞశాల వేదసంపన్నులైన దేవతలతో, బ్రాహ్మణులతో, మహర్షులతో ప్రకాశించింది. (8)
న తస్యాం సంనిధౌ శూద్రః కశ్చిదాసీన్నచావ్రతీ ।
అంతర్వేద్యాం తదా రాజన్ యుధిష్ఠిరనివేశనే ॥ 9
రాజా! యుధిష్ఠిరుడున్న ఆ శాలయందు శూద్రుడు/వేదవేత్తకానివాడు ఒక్కడు కూడా లేడు. నియమనిష్ఠలు లేనివా డొక్కడూ లేడు. (9)
తాం తు లక్ష్మీవతే లక్ష్మీం తదా యజ్ఞవిధానతామ్ ।
తుతోష నారదః పశ్యన్ ధర్మరాజస్య ధీమతః ॥ 10
ధీమంతుడు, లక్ష్మీవంతుడూ అయిన ధర్మరాజు యొక్క యజ్ఞనిర్వహణ సామర్థ్యాన్ని, సంపదను చూచి నారదుడు ఆనందించాడు. (10)
అథ చింతాం సమాపేదే స మునిర్మనుజాధిప ।
నారదస్తు తదా పశ్యన్ సర్వక్షత్రసమాగమమ్ ॥ 11
రాజా! ఆ నారదమహర్షి అక్కడకు వచ్చిన క్షత్రియ సమూహాన్ని చూచి ఆలోచనలో పడ్డాడు. (11)
సస్మార చ పురా వృత్తాం కథాం తాం పురుషర్షభ ।
అంశావతరణే యాసౌ బ్రహ్మణో భవనేఽభవత్ ॥ 12
పురుషశ్రేష్ఠా! అంశావతరణ సందర్భంలో బ్రహ్మభవనంలో పూర్వం జరిగిన వృత్తాంతాన్ని నారదుడు గుర్తుకుతెచ్చుకొన్నాడు. (12)
దేవానాం సంగమం తం తు విజ్ఞాయ కురునందన ।
నారదః పుండరీకాక్షం సస్మార మనసా హరిమ్ ॥ 13
కురునందనా! ఈ నాటి రాజుల సమూహాన్ని ఆనాటి దేవతల సమాగమంగా భావించి నారదుడు మనస్సులో పుండరీకాక్షుడైన విష్ణువును స్మరించాడు. (13)
సాక్షాత్ స విబుధారిఘ్నః క్షత్రే నారాయణో విభుః ।
ప్రతిజ్ఞాం పాలయంశ్చేమాం జాతః పరపురంజయః ॥ 14
సర్వవ్యాపకుడు, దేవతా శత్రుసంహారకుడూ అయిన నారాయణుడు తన ప్రతిజ్ఞను పాలిస్తూ సాక్షాత్తుగా క్షత్రవంశంలో జన్మించాడు. (14)
సందిదేశ పురా యోఽసౌ విబుధాన్ భూతకృత్ స్వయమ్ ।
అన్యోన్యమబినిఘ్నంతః పునర్లోకానవాప్స్యథ ॥ 15
పూర్వకాలంలో సర్వప్రాణి సృష్టికర్త అయిన మహావిష్ణువు దేవతలనుద్దేశించి స్వయంగా 'మీరు భూలోకంలో జన్మించి పరస్పరం కలహించి సంహరించుకొని మరల ఈ లోకాలను పొందగలరు' అని ఉపదేశించాడు. (15)
ఇతి నారాయణః శంభుః భగవాన్ భూతభావనః ।
ఆదిత్యవిబుధాన్ సర్వాన్ అజాయత యదుక్షయే ॥ 16
ఈ విధంగా ప్రాణులను భావించే, శుభకరుడైన భగవంతుడు నారాయణుడు దేవతలకుపదేశించి, తాను కూడా యదుకులంలో జన్మించాడు. (16)
క్షితావంధకవృష్ణీనాం వంశే వంశభృతాం వరః ।
పరయా శుశుభే లక్ష్మ్యా నక్షత్రాణామివోడురాట్ ॥ 17
నక్షత్రములలో చంద్రుడు ప్రకాశిస్తున్నట్లు, భూమిపై అంధకవృష్ణి వంశాలలో, వంశాధారులలో శ్రేష్ఠుడై గొప్పకాంతితో ప్రకాశించాడు. (17)
యస్య బాహుబలం సేంద్రాః సురాః సర్వ ఉపాసతే ।
సోఽయం మానుషవన్నామ హరిరాస్తేఽరిమర్దనః ॥ 18
ఇంద్రునితో పాటు దేవతలందరూ ఎవని బాహుబలాన్ని సేవించేవారో అట్టి శత్రుమర్దనుడైన శ్రీహరి మనుష్యునివలె భూమిపై జన్మించాడు. (18)
ఆహో బత మహద్ భూతం స్వయంభూర్యదిదం స్వయమ్ ।
ఆదాస్యతి పునః క్షత్రమ్ ఏవం బలసమన్వితమ్ ॥ 19
ఆహా! ఎంత ఆశ్చర్యం! స్వయంభువు అయిన మహావిష్ణువు స్వయంగా బలసమన్వితమైన క్షత్రసమూహాన్ని మళ్లీ విచ్ఛిన్నం చేస్తాడు. (19)
ఇత్యేతాం నారదశ్చింతాం చింతయామాస సర్వవిత్ ।
హరిం నారాయణం ధ్యాత్వా యజ్ఞైరీజ్యమ్తమీశ్వరమ్ ॥ 20
తస్మిన్ ధర్మవిదాం శ్రేష్ఠః ధర్మరాజస్య ధీమతః ।
మహాధ్వరే మహాబుద్ధిః తస్థౌ స బహూమానతః ॥ 21
ఈవిధంగా సర్వజ్ఞుడైన నారదుడు ఆలోచించసాగాడు. యజ్ఞాలచే ఆరాధనీయుడు, అయిన శ్రీమన్నారాయణుని ధ్యానించి ధర్మవేత్తలలో శ్రేష్ఠుడై, బుద్ధిమంతుడైన ఆ ధర్మరాజు యొక్క మహాయజ్ఞంలో మహాబుద్ధిమంతుడైన దేవర్షి నారదుడు సగౌరవంగా కూర్చున్నాడు. (20,21)
తతో భీష్మోఽబ్రవీద్ రాజన్ ధర్మరాజం యుధిష్ఠిరమ్ ।
క్రియతామర్హణం రాజ్ఞాం యథార్హమితి భారత ॥ 22
భారతా! తరువాత భీష్ముడు ధర్మరాజుతో "రాజా! వచ్చిన రాజులను వారికి తగినట్లుగ సత్కరించు" అని పలికాడు. (22)
ఆచార్యమృత్విజం చైవ సంయుజం చ యుధిష్ఠిర ।
స్నాతకం చ ప్రియం ప్రాహుః షడర్ఘ్యార్హాన్ నృపం తథా ॥ 23
యుధిష్ఠిరా! ఆచార్యుడు, ఋత్విక్కు, సంయోక్త, స్నాతకుడు, ప్రియమిత్రుడు, రాజు - ఈ ఆరుగురినీ పూజింపదగినవారని చెపుతారు. (23)
ఏతానర్ఘ్యానభీగతాన్ ఆహుః సంవత్సరోషితాన్ ।
త ఇమే కాలపూగస్య మహతోఽస్మానుపాగతాః ॥ 24
ఒక సంవత్సరకాలం తర్వాత వస్తేనే పూజింపదగిన వీరు ఎంతో కాలం తర్వాత ఇక్కడకు వచ్చారు. (24)
ఏషామేకైకశో రాజన్ అర్ఘ్యమానీయతామితి ।
అథ చైషాం వరిష్ఠాయ సమర్థాయోపనీయతామ్ ॥ 25
రాజా! వీరిలో ఒక్కొక్కరికి వేరువేరుగ అర్ఘ్యం తీసికొనిరా. వీరిలో శ్రేష్ఠుడైన, సమర్థుడైనవారికి ముందుగా అర్ఘ్యమిమ్ము. (25)
యుధిష్ఠిర ఉవాచ
కస్మై భవాన్ మన్యతేఽర్ఘ్యమ్ ఏకస్మై కురునందన ।
ఉపనీయమానం యుక్తం చ తన్మే బ్రూహి పితామహ ॥ 26
యుధిష్ఠిరుడిలా అన్నాడు - కురునందనా! భీష్మపితామహా! ముందుగా అర్ఘ్యమీయదగినవాడొక్కడూ ఎవరిని నీవు భావిస్తున్నావో నాకు చెప్పు. (26)
వైశంపాయన ఉవాచ
తతో భీష్మః శాంతనవః బుద్ధ్యా నిశ్చిత్య వీర్యవాన్ ।
అమన్యత తదా కృష్ణమ్ అర్హనీయతమం భువి ॥ 27
వైశంపాయనుడిలా అన్నాడు - అనంతరం శంతనుకుమారుడైన భీష్ముడు తన బుద్ధిచే నిశ్చయించి లోకంలో పూజింపదగిన వారిలో కృష్ణుడే మిక్కిలి తగినవాడని భావించాడు. (27)
భీష్మ ఉవాచ
ఏష హ్యేషాం సమస్తానాం తేజోబలపరాక్రమైః ।
మధ్యే తపన్నివాభాతి జ్యోతిషామివ భాస్కరః ॥ 28
అసూర్యమివ సూర్యేణ నిర్వాతమివ వాయునా ।
భాసితం హ్లాదితం చైవ కృష్ణేనేదం సదో హి నః ॥ 29
భీష్ముడిలా అన్నాడు - ఈ రాజులందరిలో తేజోబలపరాక్రమాల చేత కాంతిగోళాల్లో ప్రకాశిస్తున్న సూర్యునివలె, గాలిలేనిచోట వాయువు వలె శ్రీకృష్ణునిచే ఈ సదస్సు ఇపుడు భాసిల్లుతోంది. ఆనందిస్తోంది. (28,29)
తస్మై భీష్మాభ్యనుజ్ఞాతః సహదేవః ప్రతాపవాన్ ।
ఉపజహ్రేఽథ విధివద్ వార్ష్ణేయాయార్ఘ్యముత్తమమ్ ॥ 30
వెంటనే బీష్మునిచే అనుమతింపబడి, ప్రతాపవంతుడైన సహదేవుడు యథావిధిగా కృష్ణునికోసం ఉత్తమమైన అర్ఘ్యాన్ని తీసికొనివచ్చాడు. (30)
ప్రతిజగ్రాహ తత్ కృష్ణః శాస్త్రదృష్ణేన కర్మణా ।
శిశుపాలస్తు తాం పూజాం వాసుదేవే న చక్షమే ॥ 31
ప్రతిజగ్రాహ తత్ కృష్ణః శాస్త్రదృష్ణేన కర్మణా ।
శిశుపాలస్తు తాం పూజాం వాసుదేవే న చక్షమే ॥ 31
కృష్ణుడు దానిని శాస్త్రోక్తమయిన కర్మగా స్వీకరించాడు. ఆ గౌరవం వాసుదేవునికి చేయటం శిశుపాలుడు సహింపలేకపోయాడు. (31)
స ఉపాలభ్య భీష్మం చ ధర్మరాజం చ సంసది ।
ఉపాక్షిపద్ వాసుదేవం చేదిరాజో మహాబలః ॥ 32
చేదిరాజు, మహాబలవంతుడూ అయిన శిశుపాలుడు భీష్ముని, ధర్మరాజును ఆ సభలో నిందించి, వాసుదేవుని కూడ నిందించాడు. (32)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి అర్ఘాభిహరణ పర్వణి శ్రీకృష్ణార్ఘ్యదానే షట్ త్రింశోఽధ్యాయః ॥ 36 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున అర్ఘాభిహరణపర్వమను
ఉపపర్వమున శ్రీకృష్ణార్ఘ్యదానమను ముప్పది ఆరవ అధ్యాయము. (36)