78. డెబ్బది ఎనిమిదవ అధ్యాయము

యుధిష్ఠిర వనప్రస్థానము.

యుధిష్ఠిర ఉవాచ
ఆమంత్రయామి భరతాన్ తథా వృద్ధం పితామహమ్ ।
రాజానం సోమదత్తం చ మహారాజం చ బాహ్లికమ్ ॥ 1
ద్రోణం కృపం నృపాంశ్చాన్యాన్ అశ్వత్థామానమేవ చ ।
విదురం ధృతరాష్ట్రం చ ధార్తరాష్ట్రాంశ్చ సర్వశః ॥ 2
యుయుత్సుం సంజయం చైవ ధార్తరాష్ట్రాంశ్చ సర్వశః ॥ 2
యుయుత్సుం సంజయం చైవ తథైవాన్యాన్ సభాసదః ।
సర్వానామంత్ర్య గచ్ఛామి ద్రష్టాస్మి పునరేత్య వః ॥ 3
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
భరతవంశస్థులందరి దగ్గర సెలవు తీసికొంటున్నాను. వృద్ధుడైన భీష్ముడు, రాజైన సోమదత్తుడు, మహారాజైన బాహ్లికుడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, విదురుడు, ధృతరాష్ట్రుడు, ధార్తరాష్ట్రులు, యుయుత్సుడు, సంజయుడు, ఇతర నరపాలురు, సభాసదులు - అందరి దగ్గర సెలవు తీసికొని వెళ్తున్నాను. తిరిగివచ్చి దర్శనం చేసికొంటాను. (1-3)
వైశంపాయన ఉవాచ
న చ కించిదథోచుస్తం ప్రియాసన్నా యుధిష్ఠిరమ్ ।
మనోభిరేవ కళ్యాణమ్ దధ్యుస్తే తస్య ధీమతః ॥ 4
వైశంపాయనుడిలా అన్నాడు.
అప్పుడు సిగ్గుతో కుంచించుకొనిపోయిన కౌరవులందరు యుధిష్ఠిరునితో ఏమీ అనలేకపోయారు. మనస్సులలోనే ఆ ధీమంతునకు శుభం కలగాలనుకొన్నారు. (4)
విదుర ఉవాచ
ఆర్యా పృథా రాజపుత్రీ నారణ్యం గంతుమర్హతి ।
సుకుమారీ చ వృద్ధా చ నిత్యం చైవ సుఖోచితా ॥ 5
ఇహ వత్స్యతి కల్యాణీ సత్కృతా మమ వేశ్మని ।
ఇతి పార్థా విజానీధ్వమ్ అగదం వోఽస్తు సర్వశః ॥ 6
విదురుడిలా అన్నాడు. కౌంతేయులారా! రాజకుమారి అయిన ఈ కుంతి అరణ్యాలలో ఉండదగదు. సుకుమారి, వృద్ధురాలు అయిన ఈమె ఎప్పుడూ సుఖాల ననుభవించదగినదే. కాబట్టి ఈమె ఇక్కడే మా ఇంటిలో గౌరవంగా ఉంటుంది. ఇది మీకు తెలిసినది గదా! మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకొంటున్నాను. (5,6)
పాండవా ఊచుః
తథేత్యుక్త్వాబ్రువన్ సర్వే యథా నోవదసేఽనఘ ।
త్వం పితృవ్యః పితృసమో వయం చ త్వత్పరాయణాః ॥ 7
పాండవులిలా అన్నారు. అనఘా! అలాగే! నీవు చెప్పినట్లే చేస్తాం. నీవు మా పినతండ్రివి. తండ్రివంటివాడివి. మేము నీ శారణులో ఉన్నవారం. (7)
యథాఽఽజ్ఞాపయసే విద్వన్ త్వం హి నః పరమో గురుః ।
యచ్చాన్యదపి కర్తవ్యం తద్ విధత్స్వ మహామతే ॥ 8
పండితా! నీవు ఆజ్ఞాపించినట్లే చేస్తాం. మాకు పరమగురువు నీవే. మహామతీ! మా కర్తవ్యం మరేదైనా ఉంటే ఆజ్ఞాపించు. (8)
విదుర ఉవాచ
యుధిష్ఠిర విజానీహి మమేదం భరతర్షభ ।
నాధర్మేణ జితః కశ్చిద్ వ్యథతే వై పరాజయే ॥ 9
విదురుడిలా అన్నాడు. భరతశ్రేష్ఠా! యుధిష్ఠిరా! మరొక విషయం తెలిసికో. అధర్మం వలన ఓడిపోయినవారు తన పరాజయానికి దుఃఖించకూడదు. (9)
త్వం వై ధర్మం విజానీషే యుద్ధే జేతా ధనంజయః ।
హంతారీణాం భీమసేనః నకులస్త్వర్థసంగ్రహే ॥ 10
నీవు ధర్మం తెలిసినవాడవు. అర్జునుడు యుద్ధంలో గెలువగలవాడు. భీమసేనుడు శత్రుసంహారం చేయగలవాడు. నకులుడు అర్థాన్ని సమకూర్చుగలవాడు. (10)
సంయంతా సహదేవస్తు ధౌమ్యో బ్రహ్మవిదుత్తమః ।
ధర్మార్థకుశలా చైవ ద్రౌపదీ ధర్మచారిణీ ॥ 11
సహదేవుడు సహనం గలవాడు. ధౌమ్యుడు బ్రహ్మజ్ఞులలో శ్రేష్ఠుడు. మీ సహధర్మచారిణి అయిన ద్రౌపది ధర్మార్థాలలో నేర్పుగలది. (11)
అన్యోన్యస్య ప్రియాః సర్వే తథైవ ప్రియదర్శనాః ।
పరైరభేద్యాః సంతుష్టాః కో వో న స్పృహయేదిహ ॥ 12
మీరు ఒకరంటే మరొకరు ఇష్టపడేవారు. మిమ్ములను చూస్తే అందరు ముచ్చటపడతారు. మిమ్ము ఎవ్వరూ విడదీయలేరు. లోకంలో మిమ్ములను ఇష్టపడనివాడు లేడు. (12)
ఏష వై సర్వకళ్యాణః సమాధిస్తవ భారత ।
నైనం శత్రుర్విషహతే శక్రేణాపి సమోఽప్యుత ॥ 13
భారతా! నీ సహనమే నీకు సర్వశుభాలనూ సమకూర్చగలది. శత్రువు ఇంద్రుడంతటివాడైనా నీ సహనం ముందు నిలువలేడు. (13)
హిమవత్యనుశిష్టోఽసి మేరుసావర్ణినా పురా ।
ద్వైపాయనేవ కృష్ణేన నగరే వారణావతే ॥ 14
భృగుతుంగే చ రామేణ దృషద్వత్యాం చ శంభునా ।
అశ్రౌషీరసితస్యాపి మహర్షేరంజనం ప్రతి ॥ 15
గతంలో మేరుసావర్ణి హిమాలయాలలో నీకు ఉపదేశించాడు. వారణావతంలో కృష్నద్వైపాయనుడు, భృగుతుంగంలో పరశురాముడు, దృషద్వతిలో సాక్షాత్తు శంకరుడు, అంజనపర్వతంపై అసితమహర్షి నీకు జ్ఞానోపదేశం చేశారు. (14,15)
కల్మాషీతీరసంస్థస్య గతస్త్వం శిష్యతాం భృగోః ।
ద్రష్టా సదా నారదస్తే ధౌమ్యస్తేఽయం పురోహితః ॥ 16
కల్మాషీనదీ తీర్థంలో నున్న భృగుమహర్షికి నీవు శిష్యుడవు అయ్యావు. నారదమహర్షి ఎప్పుడూ నిన్ను కనిపెట్టి ఉంటాడు. ఈ ధౌమ్యుడు నీకు పురోహితుడు. (16)
మా హాసీః సాంపరాయే త్వం బుద్ధిం తామృషిపూజితామ్ ।
పురూరవసమైలం త్వం బుద్ధ్యా జయసి పాండవ ॥ 17
మహర్షుల ద్వారా సంక్రమించిన ఆ పారలౌకిక విజ్ఞానాన్ని నీవు ఎప్పుడూ విడువవద్దు. యుధిష్ఠిరా! నీవు నీ బుద్ధితో ఇలానందనుడైన పురూరవుని కూడా జయించగలవు. (17)
శక్త్యా జయసి రాజ్ఞోఽన్యాన్ ఋషీన్ ధర్మోపసేవయా ।
ఇంద్రే జయే ధృతమనా యామ్యే కోపవిధారణే ॥ 18
నీవు శక్తితో రాజులందరినీ, ధర్మసేవనంలో ఋషులనందరినీ మించిపోగలవు. విజయోత్సాహాన్ని ఇంద్రుని ద్వారా, క్రోధనివారణను యమధర్మరాజు ద్వారా గ్రహించు. (18)
తథా విసర్గే కౌబేరే వారుణే చైవ సంయమే ।
ఆత్మప్రదానం సౌమ్యత్వమ్ అద్భ్యశ్చైవోపజీవనమ్ ॥ 19
అలాగే దానంలో కుబేరుని, సంయమనంలో వరుణుని ఆదర్శంగా తీసుకో. ఇతరులకై తనను తగ్గించుకోవటం, సౌమ్యత్వం, జీవనప్రదానం నీటిద్వారా గ్రహించు. (19)
భుమేః క్షమా చ తేజశ్చ సమగ్రం సూర్యమండలాత్ ।
వాయోర్బలం ప్రాప్నుహి త్వం భూతేభ్యశ్చాత్మసంపదమ్ ॥ 20
భూమి నుండి సహనాన్ని, సూర్యమండలం నుండి తేజస్సును, వాయువు నుండి బలాన్ని, సమస్త భూతాల నుండి ఆత్మసంపదను పొందు. (20)
అగదం వోఽస్తు భద్రం వః ద్రష్టాస్మి పునరాగతాన్ ।
ఆపద్ధర్మార్థకృచ్ర్ఛేషు సర్వకార్యేషి వా పునః ॥ 21
యాథావత్ ప్రతిపద్యేథాః కాలే కాలే యుధిష్ఠిర ।
ఆపృష్టోఽసీహ కౌంతేయ స్వస్తి ప్రాప్నుహి భారత ॥ 22
నీకు ఆరోగ్యం సమకూరుగాక. నీకు శుభమ్ చేకూరుగాక. వనవాసం నుండి మరలివచ్చిన మిమ్ము చూడగలను. యుధిష్ఠిరా! ఆపత్కాలంలో ధర్మార్థాలకు సంబంధించిన క్లిష్టపరిస్థితులలో సమస్తకార్యాలలో ఆయా సమయాలకు తగినట్లు కర్తవ్యాన్ని పరిపాలించు. కౌంతేయా! నీకు చెప్పవలసినది చెప్పాను. నీకు మేలు జరుగుతుంది. (21,22)
కృతార్థం స్వస్తిమంతం త్వాం ద్రక్ష్యామః పునరాగతమ్ ।
న హి వో వృజినం కించిద్ వేద కశ్చిత్ పురా కృతమ్ ॥ 23
కృతార్థుడవై క్షేమంగా తిరిగి వచ్చినపుడు మిమ్ము చూస్తాం. గతంలో మీరే దోషాలు చేశారో ఎవ్వరికీ తెలియదుగదా! అది జరగవలసినదే. (23)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తథేత్యుక్త్వా పాండవః సత్యవిక్రమః ।
భీష్మద్రోణా నమస్కృత్య ప్రాతిష్ఠత యుధిష్ఠిరః ॥ 24
వైశంపాయనుడిలా అన్నాడు. విదురుడా రీతిగా మాటడిన తర్వాత సత్యవిక్రముడైన యుధిష్ఠిరుడు భీష్మద్రోణులకు నమస్కరించి బయలుదేరాడు. (24)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి అనుద్యూతపర్వణి యుధిష్ఠిరవనప్రస్థానేఽష్టసప్తతితమోఽధ్యాయః ॥ 78 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున అనుద్యూతపర్వమను ఉపపర్వమున యుధిష్ఠిరవనప్రస్థానమను డెబ్బది యెనిమిదవ అధ్యాయము. (78)