25. ఇరువది అయిదవ అధ్యాయము
మార్కండేయ మహర్షి పాండవులకు ధర్మమునుపదేశించి, ఉత్తరదిక్కుగా వెళ్ళుట.
వైశంపాయన ఉవాచ
తత్ కాననం ప్రాప్య నరేంద్రపుత్రాః
సుఖోచితా వాసముపేత్య కృచ్ఛ్రమ్ ।
విజహ్రురింద్రప్రతిమాః శివేషు
సరస్వతీశాలవనేషు తేషు ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు - జనమేజయా! భోగాలనుభవించడానికి యోగ్యులైన పాండవులు కష్టమైన వనవాసానికి ఆ ద్వైతవనానికి చేరారు. ఇంద్రునితో సమానమైన తేజస్సంపన్నులైన ఆ పాండవులు సరస్వతీనదీతీరాన సాలవనంలో విహరించారు. (1)
యతీంశ్చ రాజా స మునీంశ్చ సర్వాన్
తస్మిన్ వనే మూలఫలైరుదగ్రైః ।
ద్విజాతిముఖ్యానృషభః కురూణాం
సంతర్పయామాస మహానుభావః ॥ 2
ఇష్టీశ్చ పిత్ర్యాణి తథా క్రియాశ్చ
మహావనే వసతాం పాండవానామ్ ।
పురోహితస్తత్ర సమృద్ధతేజః
చకార ధౌమ్యః పితృవన్నృపాణామ్ ॥ 3
కురుశ్రేష్ఠుడైన యుధిష్ఠిరుడు యతులను, మునులను, బ్రాహ్మణముఖ్యుల నందరిని ఉత్తమ మూలఫలాలతో సంతృప్తి పరిచాడు. మిక్కిలి తేజస్సంపన్నుడైన పురోహితుడు సంబంధించిన యజ్ఞాలను, పితృసంబంధక్రియలను చేశాడు. (2,3)
ఆపేత్య రాష్ట్రాద్ వసతాం తు తేషాం
ఋషిః పురాణోఽతిథిరాజగామ ।
తమాశ్రమం తీవ్రసమృద్ధతేజాః
మార్కండేయః శ్రీమతాం పాండవానామ్ ॥ 4
రాజ్యానికి దూరంగా వనంలో నివసిస్తూన్న పాండవుల ఆశ్రమానికి ఉన్నతమైన తేజస్సు కల ప్రాచీన మహర్షి మార్కండేయుడు అతిథిగా వచ్చారు. (4)
తమాగతం జ్వలితహుతాశనప్రభం
మహామనాః కురువృషభో యుధిష్ఠిరః ।
అపూజయత్ సురఋషిమానవార్చితం
మహామునిం హ్యనుపమసత్త్వవీర్యవాన్ ॥ 5
మార్కండేయుడు మండుతున్న అగ్నిలా ప్రకాశిస్తున్నాడు. దేవతలచే, ఋషులచే, మానవులచే పూజింపబడే మహాముని మార్కండేయుడు మహర్షి. మహామనస్వి కురుశ్రేష్ఠుడు, సాటిలేని బలపరాక్రమశాలి అయిన యుధిష్ఠిరుడు మహర్షిని సముచితంగా పూజించాడు. (5)
స సర్వవిద్ ద్రౌపదీం వీక్ష్య కృష్ణాం
యుధిష్ఠిరం భీమసేనార్జునౌ చ ।
సంస్మృత్య రామం మనసా మహాత్మా
తపస్విమధ్యేఽస్మయతామితౌజః ॥ 6
సర్వజ్ఞుడు, మహాత్ముడు, మేరలేని తేజస్సుకలవాడు ఆ మార్కండేయ మహర్షి. అక్కడి తపస్వులందరి మధ్యలో ద్రౌపదిని, యుధిష్ఠిరుని, భీమార్జునులను, నకులసహదేవులను చూసి మనసులో శ్రీరామచంద్రుని స్మరించి చిరునవ్వు నవ్వాడు. (6)
తం ధర్మరాజో విమనా ఇవాబ్రవీత్
సర్వే హ్రియా సంతి తపస్వినోఽమీ ।
భవానిదం కిం స్మయతీవ హృష్టః
తపస్వినాం పశ్యతాం మాముదీక్ష్య ॥ 7
అపుడు యుధిష్ఠిరుడు విమనస్కుడైనట్లుగా ఇలా అడిగాడు - మునివరా! ఇక్కడి తపస్వులంతా నా అవస్థను చూసి జాలి పడుతున్నారు. కాని వీరందరూ చూస్తుండగా, నన్ను చూసి నీవు ఆనందంతో నవ్వుతున్నావు. ఎందుకు? (7)
మార్కండేయ ఉవాచ
న తాత హృష్యామి న చ స్మయామి
ప్రహర్షజో మాం భజతే న దర్పః ।
తవాపదం త్వద్య సమీక్ష్య రామం
సత్యవ్రతం దాశరథిం స్మరామి ॥ 8
మార్కండేయుడిలా అన్నాడు - నాయనా! నేను ఆనందించటమూలేదు. నవ్వటమూ లేదు. ఆనందం వల్ల కలిగే గర్వం నన్నెప్పుడూ తాకదు. ఇపుడు నీకు కలిగిన కష్టాన్ని చూసి సత్యవ్రతుడు, దశరథనందనుడు అయిన రాముని స్మరించాను. (8)
స చాపి రాజా సహ లక్ష్మణేన
వనే నివాసం పితురేవ శాసనాత్ ।
ధన్వీ చరన్ పార్థ మయైవ దృష్టః
గిరేః పురా ఋష్యమూకస్య సానౌ ॥ 9
అతడు కూడా తండ్రి శాసనం వల్లనే రాజకుమారుడైనా సోదరుడు లక్ష్మణునితో కలిసి వనంలో నివసించాడు. పార్థా! ధనుర్ధరుడై ఋష్యమూక పర్వతసానువులందరు తిరుగుతున్న అతనిని పూర్వం నేను చూశాను. (9)
సహస్రనేత్రప్రతిమో మహాత్మా
యమస్య నేతా నముచేశ్చ హంతా ।
పితుర్నిదేశాదనఘః స్వధర్మం
వాసం వనే దాశరథిశ్చకార ॥ 10
దశరథనందనుడైన ఆ శ్రీరాముడు ఇంద్రునితో సమానమైనవాడు, మహాత్ముడు, యముని నియంత్రించినవాడు, నముచి అనే రాక్షసుని చంపినవాడు, పాపరహితుడు. అట్టివాడు తండ్రి ఆజ్ఞచే స్వధర్మాన్ని గుర్తించి వనవాసం చేశాడు. (10)
స చాపి శక్రస్య సమప్రభావో
మహానుభావః సమరేష్వజేయః ।
విహాయ భోగానచరద్ వనేషు
నేశే బలస్యేతి చరేదధర్మమ్ ॥ 11
అతడు కూడా ఇంద్రునితో సమానమైన ప్రభావం కలవాడు. మహానుభావుడు, యుద్ధంలో అజేయుడు, అట్టివాడు భోగాలన్నింటిని విడిచి వనంలో సంచరించాడు. అందువల్ల బలం కలిగినంత మాత్రాన అధర్మం చేయకూడదు. (11)
భూపాశ్చ నాభాగభగీరథాదయో
మహీమిమాం సాగరాంతాం విజిత్య ।
సత్యేన తేఽప్యజయంస్తాత లోకాన్
నేశే బలస్యేతి చరేదధర్మమ్ ॥ 12
నాయనా! నాభాగుడు, భగీరథుడు మున్నగువారు సాగరాంతం వరకు కల ఈ భూమిని జయించి, సత్యంతో ఈ లోకాలను కూడా వారు జయించారు. అందువల్ల బలముంది కదా అని అధర్మం చేయకూడదు. (12)
అలర్కమాహుర్నరవర్య సంతం
సత్యవ్రతం కాశికరూషరాజమ్ ।
విహాయ రాజ్యాని వసూని చైవ
నేశే బలస్యేతి చరేదధర్మమ్ ॥ 13
నరశ్రేష్ఠా! కాశీ, కరూషదేశాలకురాజైన అలర్కుని సత్పురుషునిగ, సత్యవ్రతునిగ చెపుతున్నారు. అతడు రాజ్యాలను సంపదలను త్యాగం చేసి ధర్మాన్ని ఆశ్రయించాడు. అందువల్ల బలవంతుణ్ణి కదా అని అధర్మం చేయకూడదు. (13)
ధాత్రా విధిర్యో విహితః పురాణః
తం పూజయంతో నరవర్య సంతః ।
సప్తర్షయః పార్థ దివి ప్రభాంతి
నేశే బలస్యేతి చరేదధర్మమ్ ॥ 14
నరశ్రేష్ఠా! పార్థా! పురాతనాలైన వేదాలలో ధాత (బ్రహ్మ) విధించిన దానిని గౌరవించి ఆచరించటం చేతనే సత్పురుషులైన సప్తర్షులు దేవలోకంలో ప్రకాశిస్తున్నారు. అందువలన బలవంతుణ్ణి కదా అని అధర్మం చేయకూడదు. (14)
మహాబలాన్ పర్వతకూటమాత్రాన్
విషాణినః పశ్య గజాన్ నరేంద్ర ।
స్థితాన్ నిదేశే నరవర్య ధాతః
నేశే బలస్యేతి చరేదధర్మమ్ ॥ 15
నరేంద్రా! పర్వతశిఖరాల వలె ఉన్న మహాబలిష్ఠలైన దంతాలున్న ఈ ఏనుగులను చూడు! ఇవి కూడా బ్రహ్మ యొక్క ఆజ్ఞను పాటిస్తున్నాయి. (15)
సర్వాణి భూతాని నరేంద్ర పశ్య
తథా యథావద్ విహితం విధాత్రా ।
స్వయోనితః కర్మ సదా చరంతి
నేశే బలస్యేతి చరేదధర్మమ్ ॥ 16
నరేంద్రా! సమస్తప్రాణులూ బ్రహ్మయొక్క విధానం ప్రకారంగా తమతమ పుట్టుకలకు అనుగుణంగా విహితకర్మలను ఆచరిస్తున్నాయి. చూడు! అందువల్ల బలవంతుణ్ణి కదా అని అధర్మం చేయకూడదు. (16)
సత్యేన ధర్మేణ యథార్హవృత్యా
హ్రియా తథా సర్వభూతాన్యతీత్య ।
యశశ్చ తేజశ్చ తవాపి దీప్తం
విభావసోర్భాస్కరస్యేవ పార్థ ॥ 17
కుంతీనందనా! నీవు నీ సత్యంచేత, ధర్మంచేత, యథాయోగ్యమైన ప్రసంగంచేత, లజ్జమున్నగు సద్గుణాల చేత అన్ని ప్రాణుల కంటె ఉన్నతంగా ఉన్నావు, నీ కీర్తి, దీప్తమైన ప్రకాశమూ అగ్ని సూర్యుల ప్రకాశంలా ఉంది. (17)
యథాప్రతిజ్ఞం చ మహానుభావ
కృచ్ఛ్రం వనే వాసమిమం నిరుష్య ।
తతః శ్రియం తేజసా తేన దీప్తమ్
ఆదాస్యసే పార్థివ కౌరవేభ్యః ॥ 18
మహానుభావా! పార్థివా! నీవు ప్రతిజ్ఞ చేసినవిధంగా కష్టమైన ఈ వనవాసాన్ని గడిపి, అనంతరం నీ పరాక్రమంతో ప్రకాశిస్తూన్న రాజ్యలక్ష్మిని కౌరవుల నుండి పొందుతావు. (18)
వైశంపాయన ఉవాచ
తమేవముక్త్వా వచనం మహర్షిః
తపస్విమధ్యే సహితం సుహృద్భిః ।
ఆమంత్ర్య ధౌమ్యం సహితాంశ్చ పార్థా
స్తతః ప్రతస్థే దిశముత్తరాం సః ॥ 19
వైశంపాయనుడిలా అన్నాడు - జనమేజయా! మార్కండేయ మహర్షి తపస్వులమధ్య, స్నేహితులతో ఉన్న యుధిష్ఠిరునికి ఈ విధంగా చెప్పి, ధౌమ్య, పాండవుల అనుమతి గోరి, ఉత్తరదిక్కునకు బయలుదేరాడు. (19)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అర్జునాభిగమనపర్వణి ద్వైతవనప్రవేశే పంచవింశోఽధ్యాయః ॥ 25 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున అర్జునాభిగమన పర్వమను ఉపపర్వమున ద్వైతవన ప్రవేశమను ఇరువది ఐదవ అధ్యాయము. (25)