82. ఎనుబది రెండవ అధ్యాయము
భీష్మునికి పులస్త్యుడు చెప్పిన తీర్థయాత్రా మహాత్మ్యము.
పులస్త్య ఉవాచ
అనేన తవ ధర్మజ్ఞ ప్రశ్రయేణ దమేన చ ।
సత్యేన చ మహాభాగ తుష్టోఽస్మి తవ సువ్రత ॥ 1
పులస్త్యుడు ఇలా పలికాడు. ధర్మజా! వ్రతశీలీ! నీ వినయం, ఇంద్రియనిగ్రహం, సత్యపాలనలచే మిక్కిలి సంతోషించాను. (1)
యస్యేదృశస్తే ధర్మోఽయం పితృభక్త్యాశ్రితోఽనఘ ।
తేన పశ్యసి మాం పుత్ర ప్రీతిశ్చ పరమా త్వయి ॥ 2
పాపరహితుడా! నీ పితృభక్తితో గూడిన ధర్మం కారణంగా నా దర్శనం అయింది. నీపై నాకు ప్రేమ పెరిగింది. (2)
అమోఘదర్శీ భీష్మాహం బ్రూహి కిం కరవాణి తే ।
యద వక్ష్యసి కురుశ్రేష్ఠ తస్య దాతాస్మి తేఽనఘ ॥ 3
భీష్మా! నాదర్శనం అమోఘం. చెప్పు, నేను నీకు తీర్చవలసిన కోరిక ఏది? నీవు ఏది కోరినా ఇస్తాను. (3)
భీష్మ ఉవాచ
ప్రీతే త్వయి మహాభాగ సర్వలోకాభిపూజితే ।
కృతమేతావతా మన్యే యదహం దృష్టవాన్ ప్రభుమ్ ॥ 4
భీష్ముడు ఇలా చెప్పాడు.
మీరు ముల్లోకాల పూజలను పొందేవారు. మీరు ప్రసన్నులైతే చాలు. నాకే కోరికలూ లేవు. ప్రతిభావంతులైన మీదర్శనం చేత నేను ధన్యతను పొందాను. (4)
యది త్వహమనుగ్రాహ్యః తవ ధర్మభృతాం వర ।
సందేహం తే ప్రవక్ష్యామి తన్మే త్వం ఛేత్తుమర్హసి ॥ 5
ధర్మాచరణపరాయణా! మీముందు నాసందేహాన్ని ఉంచుతాను. అనుగ్రహింప తగినవాడనైతే మీరు దానిని తీర్చండి. (5)
అస్తి మే హృదయే కశ్చిత్ తీర్థేభ్యో ధర్మసంశయః ।
తమహం శ్రోతుమిచ్ఛామి తద్ భవాన్ వక్తుమర్హతి ॥ 6
నాహృదయంలో తీర్థాలను గూర్చి ధర్మ సందేహం ఒకటి ఉంది. మీరు సమాధానం చెప్పి నన్ను అనుగ్రహించండి. (6)
ప్రదక్షిణాం యః పృథివీం కరోత్యమరసన్నిభ ।
కిం ఫలం తస్య విప్రర్షే తన్మే బ్రూహి సునిశ్చితమ్ ॥ 7
దేవసమానా! తీర్థయాత్రలతో భూప్రదక్షిణం చేసిన వానికి ఏ ఫలం దక్కుతుంది? నిశ్చయించి నాకు తెల్పండి. (7)
పులస్త్య ఉవాచ
హంత తే కథయిష్యామి యదృషీణాం పరాయణమ్ ।
తదేకాగ్రమనాః పుత్ర శృణు తీర్థేషు యత్ ఫలమ్ ॥ 8
పులస్త్యుడు ఇలా చెప్పాడు.
తీర్థయాత్రలు మునులకు ఆశ్రయాలు, ఈ విషయం నీకు వివరిస్తాను. తీర్థయాత్రలచే కలిగే ఫలాన్ని గూర్చి సావధానంగా విను. (8)
యస్య హస్తౌ చ పాదౌ చ మనశ్చైవ సుపంయతమ్ ।
విద్యా తపశ్చ కీర్తిశ్చ స తీర్థఫలమశ్నుతే ॥ 9
ఎవని చేతులు, కాళ్ళు, మనస్సు స్వాధీనంలో ఉంటాయో, విద్య, తపస్సు, కీర్తి కలిగి ఉంటాడో వాడు తీర్థయాత్రల ఫలాన్ని పొందుతాడు. (9)
ప్రతిగ్రహాదపావృత్తః సంతుష్టో యేన కేనచిత్ ।
అహంకారనివృత్తశ్చ స తీర్థఫలమశ్నుతే ॥ 10
ప్రతిగ్రహానికి (దానం పుచ్చుకొనుట) దూరమై, ఆనందంగా అహంకార రహితంగా ఉండేవాడు తీర్థయాత్రా ఫలాన్ని అందుకొంటాడు. (10)
అకల్కకో నిరారంభః లఘ్వాహారో జితేంద్రియః ।
విముక్తః సర్వపాపేభ్యః స తీర్థఫలమశ్నుతే ॥ 11
దాంభికత్వం, కర్త్నత్వాహంకారం లేనివాడై; మితాహారం, జితేంద్రియత్వం కలవాడు పాపాల నుంచి విముక్తి పొంది తీర్థయాత్రాఫలాన్ని సాధిస్తాడు. (11)
అక్రోధనశ్చ రాజేంద్ర సత్యశీలో దృఢవ్రతః ।
ఆత్మోపమశ్చ భూతేషు స తీర్థఫలమశ్నుతే ॥ 12
రాజేంద్రా! క్రోధం లేనివాడు, సత్యవంతుడు, నియమశీలి, ప్రాణులందరిని తనవలె చూడగలవాడు తీర్థఫలాన్ని పొందుతాడు. (12)
ఋషిభిః క్రతవః ప్రోక్తాః దేవేష్విహ యథాక్రమమ్ ।
ఫలం చైవ యథాతథ్యం ప్రేత్య చేహ చ సర్వశః ॥ 13
ఋషులు దేవతలనుద్దేశించి యోగ్యతను బట్టి యాగాలను విధించారు. వాటిఫలాన్నీ వివరించారు. చెప్పినవాటిని చెప్పినట్లుగా మానవుడు ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఫలాలన్నీ యాథాతథంగా పొందుతాడు. (13)
న తే శక్యా దరిద్రేణ యజ్ఞాః ప్రాప్తుం మహీపతే ।
బహూపకరణా యజ్ఞా నానాసంభారవిస్తరాః ॥ 14
దరిద్రులు ఆ యజ్ఞాలను చేయలేరు. చాలా సంభరాలు, సాధనాలూ అవసరం కనుక ఆచరించలేరు. (14)
ప్రాప్యంతే పార్థివైరేతే సమృద్ధైర్వా నరైః క్వచిత్ ।
నార్థన్యూనైర్నావగణైః ఏకాత్మభిరసాధనైః ॥ 15
రాజులు, సమర్థులైన కొందరూ మాత్రమే యజ్ఞాలను ఆచరించగలరు. ఒంటరివారు, అసహాయులు, సాధనసామగ్రి లేనివారు, నిర్ధనులు యజ్ఞాలను ఆచరించలేరు. (15)
యో దరిద్రైరపి విధిః శక్యః ప్రాప్తుం నరేశ్వర ।
తుల్యో యజ్ఞఫలైః పుణ్యైః తం నిబోధ యుధాం వర ॥ 16
యోధులలో శ్రేష్ఠుడా! రాజా! దరిద్రులు కూడా సత్కర్మరూపంగా యజ్ఞాలు చేయవచ్చు. యజ్ఞాలతో సమానమైన ఫలితాలే వాటి వల్ల కలుగుతాయి. దానిని చెపుతూ విను. (16)
ఋషీణాం పరమం గుహ్యమ్ ఇదం భరతసత్తమ ।
తీర్థాభిగమనం పుణ్యం యజ్ఞైరపి విశిష్యతే ॥ 17
భరతశ్రేష్ఠా! ఇది ఋషులు చెప్పిన చాలా రహస్యమైన విషయం. తీర్థయాత్రలు యజ్ఞాల కంటె ఎక్కువ ఫలాన్ని ఇస్తాయి. (17)
అనుపోష్య త్రిరాత్రాణి తీర్థాన్యనభిగమ్య చ ।
అదత్త్వా కాంచనం గాశ్చ దరిద్రో నామ జాయతే ॥ 18
తీర్థాలలో మూడు రాత్రులు ఉపవాసం చేయకపోయినా, తీర్థయాత్రలు చేయకపోయినా, సువర్ణదానం, గోదానం చేయకపోయినా మానవుడు దరిద్రుడై పుడతాడు. (18)
అగ్నిష్టోమాదిభిర్యజ్ఞైః ఇష్ట్వా విపులదక్షిణైః ।
న తత్ ఫలమవాప్నోతి తీర్థాభిగమనేన యత్ ॥ 19
సమృద్ధిగా దక్షిణలిచ్చి అగ్నిష్టోమాది యాగాలు చేసినా తీర్థయాత్రలు చేసిన ఫలం దక్కదు. (19)
నృలోక దేవదేవస్య తీర్థం త్రైలోక్యవిశ్రుతమ్ ।
పుష్కరం నామ విఖ్యాతం మహాభాగః సమావిశేత్ ॥ 20
మానవలోకంలో దేవదేవుని బ్రహ్మతీర్థం పరమపవిత్రమైంది. దాని పేరు పుష్కరతీర్థం. అందు మహాభాగుడైన నరుడే ప్రవేశించగలడు. (20)
దశకోటిసహస్రాణి తీర్థానాం వై మహామతే ।
సాన్నిధ్యం పుష్కరే యేషాం త్రిసంధ్యం కురునందన ॥ 21
కురునందనా! పుష్కరతీర్థంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పదివేల కోట్ల తీర్థాల శక్తి కలిసి ఉంటుంది. (21)
ఆదిత్యా వసవో రుద్రాః సాధ్యాశ్చ సమరుద్గణాః ।
గంధర్వాప్సరసశ్చైవ నిత్యం సన్నిహితా విభో ॥ 22
ఆ తీర్థంలో ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, సాధ్యులు, మరుత్తులు, గంధర్వులు, అప్సరసలు నిత్యమూ ఉంటారు. (22)
యత్ర దేవాస్తపస్తస్త్వా దైత్యా బ్రహ్మర్షయస్తథా ।
దివ్యయోగా మహారాజ పుణ్యేన మహతాన్వితాః ॥ 23
మహారాజా! అక్కడ తపస్సు చేసి దేవతలు, దైత్యులు, బ్రహ్మర్షులు ఆ పుణ్యం చేత యోగశ్రేష్ఠులు అవుతారు. (23)
మనసాప్యభికామస్య పుష్కరాణి మనస్వినః ।
పూయంతే సర్వపాపాని నాకృపష్ఠే చ పూజ్యతే ॥ 24
మనస్సులో అయినా పుష్కరతీర్థానికి వెళ్లాలని సంకల్పిస్తే అతని స్వర్గగమనానికి అడ్డుపడే పాపాలు పోయి స్వర్గానికి చేరి పూజలందుకొంటాడు. (24)
తస్మింస్తీర్థే మహారాజ నిత్యమేవ పితామహః ।
ఉవాస పరమప్రీతః భగవాన్ కమలాసనః ॥ 25
మహారాజా! పుష్కరంలో కమలాసనుడైన బ్రహ్మ ప్రసన్నతతో సదా నిత్యమూ నివసిస్తాడు. (25)
పుష్కరేషు మహాభాగ దేవాః సర్షిగణాః పురా ।
సిద్ధిం సమభిసంప్రాప్తాః పుణ్యేన మహతాన్వితాః ॥ 26
మహాభాగా! ఈ తీర్థంలో పూర్వం ఎందరో దేవతలు, ఋషులు తపస్సు చేసి గొప్ప గొప్ప సిద్ధులను పొందారు. (26)
తత్రాభిషేకం యః కుర్యాత్ పితృదేవార్చనే రతః ।
అశ్వమేధాద్ దశగుణం ఫలం ప్రాహుర్ననీషిణః ॥ 27
అక్కడ స్నానం చేసి దేవతలకు, పితరులకు అర్చన చేసిన వాడు అశ్వమేధయాగఫలం కంటె పదిరెట్లు ఫలం సాధిస్తాడు. (27)
అప్యేకం భోజయద్ విప్రం పుష్కరారణ్యమాశ్రితః ।
తేనాసౌ కర్మణా భీష్మ ప్రేత్య చేహ చ మోదతే ॥ 28
భీష్మా! పుష్కరారణ్యంలో ఒక్కనికైనా అన్నదానం చేస్తే ఆ పుణ్యం చేత ఇహలోక, పరలోకాలలో ఆనందాన్ని పొందుతాడు. (28)
శాకైర్మూలైః ఫలైర్వాపి యేన వర్తయ్తే స్వయమ్ ।
తద్ వై దద్యాద్ బ్రాహ్మణాయ శ్రాద్ధవాననసూయకః ॥ 29
శాక, ఫల, మూలాలతో స్వయంగా జీవిస్తూ అదే శ్రద్ధతో పరులదోషాలను ఎంచక బ్రాహ్మణులకు దానం చెయ్యాలి. (29)
తేనైవ ప్రాప్నుయాత్ ప్రాజ్ఞః హయమేధఫలం నరః ।
బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రా వా రాజసత్తమ ॥ 30
న వై యోనౌ ప్రజాయంతే స్నాతాస్తీర్థే మహాత్మనః ।
ఆ దానంతో తెలివైనవాడు అశ్వమేధయాగఫలాన్ని సాధిస్తాడు. రాజేంద్రా! బ్రాహ్మణక్షత్రియ వైశ్యశూద్రులెవరైనా ఈ తీర్థాన మునిగితే వారికి పునర్జన్మ ఉండదు. (30 1/2)
కార్తికీంతు విశేషేణ యోఽభిగచ్ఛతి పుష్కరమ్ ॥ 31
ప్రాప్నుయాత్ స నరో లోకాన్ బ్రహ్మణః సదనేఽక్షయాన్ ।
ప్రత్యేకించి కార్తికపూర్ణిమనాడు పుష్కరస్నానం చేసిన మనుష్యుడు బ్రహ్మసన్నిధిలో అక్షయలోకాల్లో జీవిస్తాడు. (31 1/2)
సాయంప్రాతః స్మరేద్ యస్తు పుష్కరాణి కృతాంజలిః ॥ 32
ఉపస్పృష్టం భవేత్ తేన సర్వతీర్థేషు భారత ।
భారతా! ఉదయాన, సాయంసమయాన రెండు చేతులు జోడించి మూడుపుష్కర తీర్థాలను తలచే వాడు సర్వతీర్థాలలో స్నానం చేసినవాడే అవుతాడు. (32 1/2)
జన్మప్రభృతి యత్ పాపం స్త్రియా వా పురుషేణ వా ॥ 33
పుష్కరే స్నాతమాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి ।
పుట్టినది మొదలు ఇప్పటివరకు చేసిన పాపాలు స్త్రీవైనా, పురుషుడివైనా పుష్కర స్నానంతో అన్నీ నశిస్తాయి. (33 1/2)
యథా సురాణాం సర్వేషామ్ ఆదిస్తు మధుసూదనః ॥ 34
తథైవ పుష్కరం రాజన్ తీర్థానామాదిరుచ్యతే ।
సమస్త దేవతల్లో విష్ణువు ఎట్లు మొదటివాడో అట్లే సర్వతీర్థాల్లో పుష్కరమే మొదటిది. (34 1/2)
ఉష్ట్వా ద్వాదశ వర్షాణి పుష్కరే నియతః శుచిః ॥ 35
ఋతూన్ సర్వానవాప్నోతి బ్రహ్మలోకం స గచ్ఛతి ।
పుష్కరతీర్థంలో పండ్రెండేండ్లు గడిపిన మానవుడు అన్ని యాగాలు చేసిన ఫలాన్ని పొంది, చివరలో బ్రహ్మలోకాన్ని చేరతాడు. (35 1/2)
యస్తు వర్షశతం పూర్ణమ్ అగ్నిహోత్రముపాసతే ॥ 36
కార్తికీం వా వసేదేకాం పుష్కరే సమమేవ తత్ ॥ 37
పూర్తిగా వంద ఏండ్లు అగ్నిహోత్రం చేసినవాడూ, కార్తిక పూర్ణిమనాడు పుష్కరతీర్థంలో నివసించినవాడూ సమానం. (36,37)
త్రీణి శృంగాణి శుభ్రాణి త్రీణి ప్రస్రవణాని చ ।
పుష్కరాణ్యాదిసిద్ధాని న విద్మస్తత్ర కారణమ్ ॥ 38
మూడు పర్వతశిఖరాలు, మూడు నదులు, మూడు తీర్థాలు ఇవన్నీ లోకంలో సిద్ధాలై ఉన్నాయి. వీటిని ఎందుకు తీర్థాలంటున్నామో తెలియడం లేదు. (38)
దుష్కరం పుష్కరే గంతుం దుష్కరం పుష్కరే తపః ।
దుష్కరం పుష్కరే దానం వస్తుం చైవ సుదుష్కరమ్ ॥ 39
పుష్కరతీర్థానికి వెళ్లటం, తపస్సు ఆచరించటం, దానం చేయటం, నివసించటం కష్టసాధ్యాలు. (39)
ఉష్య ద్వాదశరాత్రం తు నియతో నియతాశనః ।
ప్రదక్షిణముపావృత్య జంబూమార్గం సమావిశేత్ ॥ 40
ఇంద్రియ సంయమనంతో, మితాహారంతో పండ్రెండు రాత్రులు అక్కడ గడపి, ప్రదక్షిణం చేసి, జంబూమార్గానికి పోవాలి. (40)
జంబూమార్గం సమావిశ్య దేవర్షిపితృసేవితమ్ ।
అశ్వమేధమవాప్నోతి సర్వకామసమన్వితః ॥ 41
జంబూమార్గం దేవపితృ ఋషులచే సేవింపబడే తీర్థం. అక్కడకు పోయి మనోరథాలన్నింటిని పొంది, అశ్వమేధఫలం పొందుతాడు. (41)
తత్రోష్య రజనీః పంచ పూతాత్మా జాయతే నరః ।
న దుర్గతిమవాప్నోతి సిద్ధిం ప్రాప్నోతి చోత్తమామ్ ॥ 42
అక్కడ ఐదురాథ్రులు నివసించిన నరుడు పవిత్రమైన మనస్సును పొందుతాడు. దుర్గతిని పొందక ఉత్తమసిద్ధిని గ్రహిస్తాడు. (42)
జంబూమార్గాదుపావృత్య గచ్ఛేత్ తందులికాశ్రమమ్ ।
న దుర్గతిమవాప్నోతి బ్రహ్మలోకం చ గచ్ఛతి ॥ 43
జంబూమార్గం నుంచి మరలి, తందులికాశ్రమం చేరి, దుర్గతిని వీడి, చివరకు బ్రహ్మలోకం చేరతాడు. (43)
ఆగస్త్యం సర ఆసాద్య పితృదేవార్చనే రతః ।
త్రిరాత్రోపోషితో రాజన్ అగ్నిష్టోమఫలం లభేత్ ॥ 44
అగస్త్య సరోవరంలో మూడు రాత్రులు ఉపవాసంతో పితృ, దేవతలను అర్చించి అగ్నిష్టోమయాగాన్ని ఆచరించిన ఫలం పొందుతాడు. (44)
శాకవృత్తిః ఫలైర్వాపి కౌమారం విందతే పరమ్ ।
కణ్వాశ్రమం తతో గచ్ఛేత్ శ్రీజుష్టం లోకపూజితమ్ ॥ 45
శాకాలతో, ఫలాలతో అక్కడ గడపి కౌమార లోకాన్ని అందుకొంటాడు. అక్కడ నుంచి లక్ష్మిచే సేవింపబడే కణ్వుని ఆశ్రమంలో ప్రవేశించాలి. (45)
ధర్మారణ్యం హి తత్ పుణ్యమ్ ఆద్యం చ భరతర్షభ ।
యత్ర ప్రవిష్టమాత్రో వై సర్వపాపైః ప్రముచ్యతే ॥ 46
భరతర్షభా! ఆ ప్రదేశాన్ని ధర్మారణ్యం అంటారు. అది పరమపవిత్రం అయిన ఆది తీర్థం. దానిని ప్రవేశించిన వెంటనే మనుష్యునికి పాపాలు పోతాయి. (46)
అర్చయిత్వా పితౄన్ దేవాన్ నియతో నియతాశనః ।
సర్వకామసమృద్ధస్య యజ్ఞస్య ఫలమశ్నుతే ॥ 47
నియమాలతో, నియతాహారంతో దేవతలను, పితరులను అర్చించి అన్నికోరికలు తీర్చగల యజ్ఞఫలాన్ని వశం చేసుకొంటాడు. (47)
ప్రదక్షిణం తతః కృత్వా యయాతిపతనం వ్రజేత్ ।
హయమేధస్య యజ్ఞస్య ఫలం ప్రాప్నోతి తత్ర వై ॥ 48
ఆ తీర్థాన ప్రదక్షిణం చేసి యయాతిపతనం అనే పేరు గల తీర్థాన్ని చేరుతాడు. అక్కడకు చేరిన పిదప అశ్వమేధయాగఫలాన్ని పొందుతాడు. (48)
మహాకాలం తతో గచ్ఛేత్ నియతో నియతాశనః ।
కోటితీర్థముపస్పృశ్య హయమేధఫలం లభేత్ ॥ 49
అక్కడ నుంచి మహాకాలతీర్థం పోయి నియమితాహారంతో, జితేంద్రియుడై ఉండాలి. కోటితీర్థంలో మునిగి అశ్వమేధఫలాన్ని పొందుతాడు. (49)
తతో గచ్ఛేత్ ధర్మజ్ఞః స్థాణోస్తీర్థముమాపతేః ।
నామ్నా భద్రవటం నామ త్రిషు లోకేషు విశ్రుతమ్ ॥ 50
ధర్మజ్ఞుడైన నరుడు ముల్లోకాలలో భద్రవట మనే పేర ప్రసిద్ధిపొందిన ఉమావల్లభుని శివతీర్థాన్ని అక్కడ నుంచి చేరాలి.. (50)
తత్రాభిగమ్య చేశానం గోసహస్రఫలం లభేత్ ।
మహాదేవప్రసాదాచ్చ గాణపత్యం చ విందతి ॥ 51
సమృద్ధమసపత్నం చ శ్రియా యుక్తం నరోత్తమః ।
శివుని దగ్గరగా చూసి నరోత్తముడు మహాదేవుని అనుగ్రహంతో వేయిగోవులను దానం చేసిన ఫలాన్ని గణాధిపత్యాన్ని కూడ పొందుతాడు. అది లక్ష్మీసమృద్ధిగలది. శత్రురహితమైనది. (51 1/2)
నర్మదాం తు సమాసాద్య నదీం త్రైలోక్యవిశ్రుతామ్ ॥ 52
తర్పయిత్వా పితౄన్ దేవాన్ అగ్నిష్టోమఫలం లభేత్ ।
అక్కడ ముల్లోకాల్లో ప్రసిద్ధి పొందిన నర్మదా నదీతీరంలో దేవతలకు, పితరులకు అర్చన చేసి అగ్నిష్టోమయాగ ఫలాన్ని అందుకొంటాడు. (52 1/2)
దక్షిణం సింధుమాసాద్య బ్రహ్మచారీ జితేంద్రియః ॥ 53
అగ్నిష్టోమమవాప్నోతి విమానం చాధిరోహతి ।
బ్రహ్మచర్యం, జితేంద్రియత్వంతో దక్షిణసముద్రయాత్ర చేసిన మనుజుడు అగ్నిష్టోమఫలాన్ని పొంది, విమానాన్ని అధిరోహిస్తాడు. (53 1/2)
చర్మణ్వతీం సమాసాద్య నియతో నియతాశనః ।
రంతిదేవాభ్యనుజ్ఞాతమ్ అగ్నిష్టోమఫలం లభేత్ ॥ 54
ఇంద్రియ సంయమనంతో, మితాహారంతో, శౌచాదులను పాటించి చర్మణ్వతీనదిలో స్నానమాచరించి రంతిదేవునిచే అనుగ్రహించబడిన అగ్నిష్టోమయాగఫలాన్ని సాధిస్తాడు. (54)
తతో గచ్ఛేత్ ధర్మజ్ఞ హిమవత్సుతమర్బుదమ్ ।
పృథివ్యాం యత్ర వై ఛిద్రం పూర్వమాసీద్ యుధిష్ఠిర ॥ 55
ధర్మజ్ఞా! అక్కడి నుంచి హిమాలయ పుత్రుడైన అర్బుదానికి యాత్ర సాగించాలి. పూర్వకాలంలో ఆ ప్రదేశంలో భూమికి రంధ్రం ఏర్పడి ఉంది. (55)
తత్రాశ్రమో వసిష్ఠస్య త్రిషు లోకేషు విశ్రుతః ।
తత్రోష్య రజనీమేకాం గోసహస్రఫలం లభేత్ ॥ 56
ఆ స్థలంలో వసిష్ఠుని ఆశ్రమం ఉంది. అది ముల్లోకాల్లో ప్రసిద్ధమైనది. అక్కడ ఒకరాత్రి గడపి గోసహస్రదానఫలాన్ని మానవుడు పొందుతాడు. (56)
పింగతీర్థముపస్పృశ్య బ్రహ్మచారీ జితేంద్రియః ।
కపిలానాం నరశ్రేష్ఠ శతస్య ఫలమశ్నుతే ॥ 57
నరోత్తమా! పింగతీర్థాన జితేంద్రియుడై స్నానాచమనాలు చేసిన మానవుడు వంద కపిలగోవులను దానం చేసిన ఫలం పొందుతాడు. (57)
తతో గచ్ఛేత రాజేంద్ర ప్రభాసం తీర్థముత్తమమ్ ।
తత్ర సన్నిహితో నిత్యం స్వయమేవ హుతాశనః ॥ 58
దేవతానాం ముఖం వీర జ్వలనోఽనిలసారథిః ।
రాజేంద్రా ఆ ప్రదేశం నుంచి ప్రభాసతీర్థానికి చేరాలి. అక్కడ దేవతల ముఖస్వరూపుడు, వాయుసారథి, అయిన అగ్నిదేవుడు నివసిస్తాడు. (58 1/2)
తస్మింస్తీర్థే నరః స్నాత్వా శుచిః ప్రయతమానః ॥ 59
అగ్నిష్టోమాతిరాత్రాభ్యాం ఫలం ప్రాప్నోతి మానవః ।
ఆ తీర్థంలో శుచిగా ఆసక్తితో మునిగిన మానవుడు అగ్నిష్టోమ, అతిరాత్ర యాగాల ఫలితాన్ని పొందుతాడు. (59 1/2)
తతో గత్వా సరస్వత్యాః సాగరస్య చ సంగమే ॥ 60
గోసహస్రఫలం తస్య స్వర్గలోకం చ విందతి ।
ప్రభయా దీప్యతే నిత్యమ్ అగ్నివద్ భరతర్షభ ॥ 61
భరతర్షభా! అక్కడి నుంచి పోయి సరస్వతీ సాగరసంగమంలో స్నానం చేసి వేయిగోవులను దానం చేసిన ఫలాన్ని పొంది ఎల్లపుడూ అగ్నివలె ప్రకాశిస్తాడు. (60,61)
తీర్థే సలిలరాజస్య స్నాత్వా ప్రయతమానసః ।
త్రిరాత్రముషితః స్నాతః తర్పయేత్ పితృదేవతాః ॥ 62
పరిశుద్ధచిత్తంతో మానవుడు వరుణతీర్థంలో స్నానం చేసి మూడురాత్రులు ఉపవాసంతో పితరులకు, దేవతలకు తర్పణం చెయ్యాలి. (62)
ప్రభాసతే యథా సోమః సోఽశ్వమేధం చ విందతి ।
వరదానం తతో గచ్ఛేత్ తీర్థం భరతసత్తమ ॥ 63
భరతశ్రేష్ఠా! ఇలా చేసే యాత్రికుడు చంద్రునితో సమానంగా ప్రకాశిస్తూ అశ్వమేధయాగఫలాన్ని పొందుతాడు. అక్కడి నుంచి వరదాన తీర్థానికి పోవాలి. (63)
విష్ణోర్దుర్వాససా యత్ర వరో దత్తో యుధిష్ఠిర ।
వరదానే నరః స్నాత్వా గోసహస్రఫలం లభేత్ ॥ 64
యుధిష్ఠిరా! మునిశ్రేష్ఠుడు దుర్వాసుడు ఇక్కడ శ్రీకృష్ణునికి వరాన్ని ఇచ్చాడు. కావున దీనికి వరదాన తిర్థమని పేరు. ఇందు మునిగినవాడు వేయి ఆవులను దానమిచ్చిన ఫలాన్ని అందుకొంటాడు. (64)
తతో ద్వారవతీం గచ్ఛేత్ నియతో నియతాశనః ।
పిండారకే నరః స్నాత్వా లభేద్ బహు సువర్ణకమ్ ॥ 65
ఆ ప్రదేశం నుంచి ద్వారవతీతీర్థానికి చేరి మితాహారం, జితేంద్రియత్వంతో ఉండాలి. పిండారకతీర్థంలో స్నానం చేస్తే లెక్కలేనంత సువర్ణాన్ని సొంతం చేసుకొంటాడు. (65)
తస్మింస్తీర్థే మహాభాగ పద్మలక్షణలక్షితాః ।
అద్యాపి ముద్రా దృశ్యంతే తదద్భుతమరిందమ ॥ 66
మహారాజా! ఈ తీర్థంలో ఇప్పటికీ కమలాలవంటి ముద్రలు కనిపిస్తాయి. ఇది ఒక అద్భుతం. (66)
త్రిశూలాంకాని పద్మాని దృశ్యంతే కురునందన ।
మహాదేవస్య సాన్నిధ్యం తత్ర వై పురుషర్షభ ॥ 67
కురునందనా! ఎక్కడ త్రిశూల చిహ్నాలు కల తామరపూలను చూస్తామో అదియే శివుని నివాసభూమి. (67)
సాగరస్య చ సింధోశ్చ సంగమం ప్రాప్య భారత ।
తీర్థే సలిలరాజస్య స్నాత్వా ప్రయతమానసః ॥ 68
తరొఅయిత్వా పితౄన్ దేవాన్ ఋషీంశ్చ భరతర్షభ ।
ప్రాప్నోతి వారుణం లోకం దీప్యమానం స్వతేజసా ॥ 69
భరతర్షభా! సింధునది, సాగరం కలిసినచోట మునిగి శుద్ధచిత్తుడై దేవతలకు, ఋషులకు తర్పణం సాగించాలి. ఇలా చేస్తే దివ్యకాంతులతో వరుణలోకానికి చేరతాడు. (68,69)
శంకుకర్ణేశ్వరం దేవమ్ అర్చయిత్వా యుధిష్ఠిర ।
అశ్వమేధాద్ దశగుణం ప్రవదంతి మనీషిణః ॥ 70
యుధిష్ఠిరా! అక్కడ శంకుకర్ణేశ్వరుని పూజిస్తే మనుజుడు అశ్వమేధఫలం కంటె పదిరెట్లు ఫలానికి అర్హుడు అవుతాడు అని చెప్పారు. (70)
ప్రదక్షినముపావృత్య గచ్ఛేత భరతర్షభ ।
తీర్థం కురువరశ్రేష్ఠ త్రిషు లోకేషు విశ్రుతమ్ ॥ 71
దమతీ నామ్నా విఖ్యాతం సర్వపాపప్రణాశనమ్ ।
తత్ర బ్రహ్మాదయో దేవాః ఉపాసంతే మహేశ్వరమ్ ॥ 72
భరతర్షభా! అక్కడ స్నానమాచరిమ్చి ముల్లోకాల్లో ప్రసిద్ధిగాంచిన సర్వపాపాలన్ తొలగించే 'దమీ' తీర్థానికి చేరాలి. బ్రహ్మాదిదేవతలు ఆ ప్రదేశంలో మహాశివుని ఆరాధిస్తారు. (71,72)
తత్ర స్నాత్వా చ పీత్వా చ రుద్రం దేవగణైర్వృతమ్ ।
జన్మప్రభృతి యత్ పాపం తత్ స్నాతస్య ప్రణశ్యతి ॥ 73
దేవగణసహితుడైన శివుని అర్చించి, స్నానం, జలపానం చేసినవాడు పుట్టినప్పటి నుండి స్నానం చేసిన సమయం వరకు గల పాపాలను పోగొట్టుకొంటాడు. (73)
దమీ చాత్ర నరశ్రేష్ఠ సర్వదేవైరభిష్టుతః ।
తత్ర స్నాత్వా నరవ్యాఘ్ర హయమేధమవాప్నుయాత్ ॥ 74
నరోత్తమా! దమీ తీర్థాన్ని దేవతలందరు స్తుతిస్తారు. అక్కడ స్నానం చేస్తే అశ్వమేధయాగఫలం వస్తుంది. (74)
గత్వా యత్ర మహాప్రాజ్ఞ విష్ణునా ప్రభవిష్ణునా ।
పురా శౌచం కృతం రాజన్ హత్వా దైతేయదానవాన్ ॥ 75
మహాప్రాజ్ఞా! రాజా! సర్వశక్తిసంపన్నుడైన విష్ణువు లోకసంగ్రహణానికై దానవసంహారం ఆచరించి ఈ క్షేత్రంలో స్నాన చేసి పవిత్రుడు అయ్యాడు. (75)
తతో గచ్ఛేత ధర్మజ్ఞ వసోర్ధారామభిష్ణుతామ్ ।
గమనాదేవ తస్యాం హి హయమేధఫలం లభేత్ ॥ 76
తరువాత అందరిచే కీర్తింపబడే వసుధారా తీర్థానికి వెళ్ళాలి. అక్కడికి చేరటం వలననే అశ్వమేధ యాగఫలం దక్కుతుంది. (76)
స్నాత్వా కురువరశ్రేష్ఠ ప్రయతాత్మా సమాహితః ।
తర్ప్య దేవాన్ పితౄంశ్చైవ విష్ణులోకే మహీయతే ॥ 77
కురువరశ్రేష్ఠా! ఆ ప్రదేశంలో సావధానమనస్కుడై స్నానమాచరించి దేవ పితరులకు తర్పణం చేస్తే విష్ణులోకానికి చేరుకొంటాడు. (77)
తీర్థే చాత్ర సరః పుణ్యం వసూనాం భరతర్షభ ।
తత్ర స్నాత్వా చ పీత్వా చ వసూనాం సమ్మతో భవేత్ ॥ 78
సింధూత్తమమితి ఖ్యాతం సర్వపాపప్రణాశనమ్ ।
తత్ర స్నాత్వా నరశ్రేష్ఠ లభేద్ బహు సువర్ణకమ్ ॥ 79
భరతర్షభా! ఆ తీర్థంలోనే అష్టవసువుల పవిత్ర సరోవరం ఉంది. అక్కడ స్నానం, జలపానం చేస్తే వసువులకు ప్రీతిపాత్రుడు అవుతాడు. దానిపేరు సర్వపాపాల్ని పోగొట్టగల సింధూత్తమ తీర్థం. అది సర్వపాపాలనూ పోగొట్ట గలది. అక్కడ మునిగితే అంతులేని సువర్ణాన్ని పొందవచ్చు. (78,79)
భద్రతుంగం సమాసాద్య శుచిః శీలసమన్వితః ।
బ్రహ్మలోకమవాప్నోతి గతిం చ పరమాం వ్రజేత్ ॥ 80
భద్రతుంగ తీర్థానికి వెళ్ళి పవిత్రుడు, శీలసంపన్నుడై స్నానవిధిని ఆచరిస్తే బ్రహ్మలోకానికి చేరి ఉత్తమగతులను పొందుతాడు. (80)
కుమారికాణాం శక్రస్య తీర్థం సిద్ధనిషేవితమ్ ।
తత్ర స్నాత్వా నరః క్షిప్రం స్వర్గలోకమవాప్నుయాత్ ॥ 81
శక్రకుమార్తెల తీర్థం సిద్ధుల నివాసం. అక్కడ స్నానం చేసిన నరుడు శీఘ్రంగా స్వర్గఫలాన్ని అందుకొంటాడు. (81)
రేణుకాయాశ్చ తత్రైవ తీర్థం సిద్ధనిషేవితమ్ ।
తత్ర స్నాత్వా భవేద్ విప్రః నిర్మలశ్చంద్రమా యథా ॥ 82
సిద్ధులచే సేవింపబడే రేణుకాతీర్థం అక్కడే ఉంది. అక్కడ స్నానం చేసిన బ్రాహ్మణుడు చంద్రునితో సమానంగా నిర్మలుడు అవుతాడు. (82)
అథ పంచనదం గత్వా నియతో నియతాశనః ।
పంచయజ్ఞానవాప్నోతి క్రమశో యేఽనుకీర్తితాః ॥ 83
శౌచం, సంతోషం మొదలయిన నియమాలను పాలించి, మితాహారుడై పంచనదతీర్థానికి పోయిన మనుజుడు పంచమహాయజ్ఞాలను చేసినట్లు అవుతుంది. వాటిని క్రమంగా ఆచరించిన ఫలం దక్కుతుంది. (83)
తతో గచ్ఛేత రాజేంద్ర భీమాయాః స్థానముత్తమమ్ ।
తత్ర స్నాత్వా తు యోన్యాం వై నరో భరతసత్తమ ॥ 84
దేవ్యాః పుత్రో భవేద్ రాజన్ తప్తకుండలవిగ్రహః ।
గవాం శతసహస్రస్య ఫలం ప్రాప్నోతి మానవః ॥ 85
అక్కడి నుంచి భీమతీర్థానికి పోయి యోనితీర్థంలో స్నానం చేస్తే మానవుడు దేవీపుత్రుడుగా అవతరిస్తాడు. అతని శరీరకాంతి బంగారంగా ఉంటుంది. ఆ తీర్థాలను సేవిస్తే వేయిగోవులు దానంచేసిన ఫలం సిద్ధిస్తుంది. (84,85)
శ్రీకుండం తు సమాసాద్య హ్రిషు లోకేషు విశ్రుతమ్ ।
పితామహం నమస్కృత్య గోసహస్రఫలం లభేత్ ॥ 86
ముల్లోకాల్లో ప్రసిద్ధం అయిన శ్రీకుండానికి పోయి, బ్రహ్మదేవునికి నమస్కరిస్తే గోసహస్రదానఫలం దక్కుతుంది. (86)
తతో గచ్ఛేత ధర్మజ్ఞ విమలం తీర్థముత్తమమ్ ।
అద్యాపి యత్ర దృశ్యంతే మత్స్యాః సౌవర్ణరాజతాః ॥ 87
ధర్మరాజా! అక్కడి నుంచి ముందుకు సాగి విమలతీర్థయాత్ర చెయ్యాలి. ఇప్పటికీ అక్కడ బంగారు, వెండి రంగులు గల చేపలు కనిపిస్తాయి. (87)
తత్ర స్నాత్వా నరః క్షిప్రం వాసవం లోకమాప్నుయాత్ ।
సర్వపాపవిశుద్ధాత్మా గచ్ఛేత పరమాం గతిమ్ ॥ 88
ఆ ప్రదేశంలో స్నానం చేసి శీఘ్రంగా ఇంద్రలోకానికి చేరతాడు. అన్నిపాపాలకు దూరమై ఉత్తమగతి పొందుతాడు. (88)
వితస్తాం చ సమాసాద్య సంతర్ప్య పితృదేవతాః ।
నరః ఫలమవాప్నోతి వాజపేయస్య భారత ॥ 89
భారతా! వితస్తా తీర్థానికి చేరి దేవతలకు, పితరులకు తర్పణం చేసి మనుష్యుడు వాజపేయయాగఫలం పొందుతాడు. (89)
కాశ్మీరేష్వేవ నాగస్య భవనం తక్షకస్య చ ।
వితస్తాఖ్యమితి ఖ్యాతం సర్వపాపప్రమోచనమ్ ॥ 90
కాశ్మీరదేశంలో నాగరాజు తక్షకుని నివాసమైన వితస్తా తీర్థం ఉంది. అది అన్ని పాపాలను నాశనం చేస్తుంది. (90)
తత్ర స్నాత్వా నరో నూనం వాజపేయమవాప్నుయాత్ ।
సర్వపాపవిశుద్ధాత్మా గచ్ఛేచ్చ పరమాం గతిమ్ ॥ 91
అక్కడ స్నానం చేసి నరుడు వాజపేయయాగఫలాన్ని పొందుతాడు. సర్వపాపాలను పోగొట్టుకొని ఉత్తమగతికి అర్హుడు అవుతాడు. (91)
తతో గచ్ఛేత వడవాం త్రిషు లోకేషు విశ్రుతామ్ ।
పశ్చిమాయాం తు సంధ్యాయామ్ ఉపస్పృశ్య యథావిధి ॥ 92
చరుం సప్తార్చిషే రాజన్ యథాశక్తి నివేదయత్ ।
పితౄణామక్షయం దానం ప్రవదంతి మనీషిణః ॥ 93
రాజా! ముల్లోకాల్లో ప్రసిద్ధి నొందిన బడబాతీర్థాన్ని అటుపైన చేరాలి. సూర్యాస్తమయసమయంలో సంధ్యను యథావిధిగా ఆచరించి, అగ్నికి హవ్యాన్ని నివేదన చెయ్యాలి. అక్కడ పితరులకు దానం చేస్తే అది అక్షయం అవుతుంది. అని విద్వాంసులు అంటారు. (92,93)
ఋషయః పితరో దేవాః గంధర్వాప్సరసాం గణాః ।
గుహ్యకాః కిన్నరా యక్షాః సిద్ధా విద్యాధరా నరాః ॥ 94
రాక్షసా దితిజా రుద్రాః బ్రహ్మా చ మనుజాధిప ।
నియతః పరమాం దీక్షామ్ ఆస్థాయబ్దసహస్రికీమ్ ॥ 95
విష్ణోః ప్రసాదనం కుర్వన్ చరుం చ శ్రపయంస్తథా ।
సప్తభిః సప్తభిశ్చైవ ఋగ్భిస్తుష్టావ కేశవమ్ ॥ 96
రాజా! ఋషులు, పితరులు, దేవతలు, గంధర్వులు, అప్సరసలు, గుహ్యకులు, కిన్నరులు, యక్షులు, సిద్ధులు, విద్యాధరులు, నరులు, రాక్షసులు, దైత్యులు, రుద్రుడు, బ్రహ్మ మొదలైనవారు ఇక్కడ నియమాలతో వేలకొలది సంవత్సరాలు దీక్షను గైకొని శ్రీమన్మహావిష్ణువునకు హవ్యాలను సమర్పించారు. ఏడేసి ఋగేద్వమంత్రాలతో ఆహుతులను ఇచ్చి భగవంతుడైన కేశవుని అర్చించారు. (94-96)
దదావష్టగుణైశ్వర్యం తేషాం తుష్టస్తు కేశవః ।
యథాభిలషితానన్యాన్ కామాన్ దత్త్వా మహీపతే ॥ 97
తత్రైవాంతర్దధే దేవః విద్యుదభ్రేషు వై యథా ।
నామ్నా సప్తచరుం తేన ఖ్యాతం లోకేషు భారత ॥ 98
గవాం శతసహస్రేణ రాజసూయశతేన చ ।
అశ్వమేధసహస్రేణ శ్రేయాన్ సప్తార్చిషే చరుః ॥ 99
తతో నివృత్తీ రాజేంద్ర రుద్రం పదమథావిశేత్ ।
అర్చయిత్వా మహాదేవమ్ అశ్వమేధఫలం లభేత్ ॥ 100
రాజేంద్రా! వారిపట్ల ప్రసన్నుడై శ్రీహరి వారందరికి అణిమాద్యష్టసిద్ధులను ఎనిమిదిరెట్లు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. వారివారి కోరికల కనుగుణంగా వరాలనిచ్చి అక్కడే మేఘాల రాశిలో విద్యుత్తువలె అంతర్ధానం అయ్యాడు. అదియే సప్త చరు తీర్థం అయింది. అక్కడ అగ్నికి సమర్పించిన హవ్యం లక్షగోదానాలు, వంద రాజసూయయాగాలు, ఏడు అశ్వమేధ యాగాలకంటె గొప్పది, కళ్యాణకారి కూడ. అక్కడి నుంచి తిరిగి వచ్చి రుద్రతీర్థానికి చేరి మహాదేవుని పూజించిన యాత్రికుడు అశ్వమేధఫలాన్ని దక్కించుకొంటాడు. (97-100)
మణిమంతం సమాసాద్య బ్రహ్మచారీ సమాహితః ।
ఏకరాత్రోషితో రాజన్ అగ్నిష్టోమఫలం లభేత్ ।
బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఏకాగ్రచిత్తంతో మణిమంతమనే తీర్థంలో ఒకరాత్రి నివసిస్తే అశ్వమేధయాగఫలం పొందుతాడు. (101)
అథ గచ్ఛేత రాజేంద్ర దేవికాం లోకవిశ్రుతామ్ ।
ప్రసూతిర్యత విప్రాణాం శ్రూయతే భరతర్షభ ॥ 102
రాజేంద్రా! లోకవిఖ్యాతమైన దేవికాతీర్థానికి ఆపై చేరి బ్రాహ్మణుల ఉత్పత్తిని గురించి వినవచ్చు. (102)
త్రిశూలపాణేః స్థానం చ త్రిషు లోకేషు విశ్రుతమ్ ।
దేవికాయాం నరః స్నాత్వా సమభ్యర్చ్య మహేశ్వరమ్ ॥ 103
యథాశక్తి చరుం తత్ర నివేద్య భరతర్షభ ।
సర్వకామసమృద్ధస్య యజ్ఞస్య లభతే ఫలమ్ ॥ 104
అది త్రిశూలపాణి శివుని స్థానమని ముల్లోకాల్లో ప్రసిద్ధి చెందింది. భరతర్షభా! దేవికాతీర్థంలో స్నానం చేసి శివునికి హవ్యాన్ని సమర్పిస్తే అన్ని కోరికలు తీర్చ గల యజ్ఞఫలం వస్తుంది. (103,104)
కామాఖ్యం తత్ర రుద్రస్య తీర్థం దేవనిషేవితమ్ ।
తత్ర స్నాత్వా నరః క్షిప్రం సిద్ధిం ప్రాప్నోతి భారత ॥ 105
అక్కడ దేవతలు పూజించే శివుని కామతీర్థం ఉంది. అక్కడ స్నానం ఆచరించిన నరుడు శీఘ్రంగా సిద్ధిని పొందుతాడు. (105)
యజనం యాజనం చైవ తథైవ బ్రహ్మ వాలుకామ్ ।
పుష్పాంభచ ఉపస్పృశ్య న శోచేన్మరణం గతః ॥ 106
యాగాలు చేయటం, చేయించటం, వేదాధ్యయనం, అక్కడ చేస్తే మృత్యుశోకం పొందడు. అక్కడి ఇసుక, పుష్పాలు, జలం స్పృశిస్తే మృత్యువు సమీపించినా శోకాన్ని పొందడు. (106)
అర్థయోజనవిస్తారా పంచయోజనమాయతా ।
ఏతావతీ వేదికా తు పుణ్యా దేవర్షిసేవితా ॥ 107
అక్కడ ఐదుయోజనాల పొడుగు, అరయోజనం వెడల్పు గల పవిత్రవేదిక ఉంది. అది దేవతలచే, మునులచే సేవింపబడుతోంది. (107)
తతో గచ్ఛేత ధర్మజ్ఞ దీర్ఘసత్రం యథాక్రమమ్ ।
తత్ర బ్రహ్మాదయో దేవాః సిద్ధాశ్చ పరమర్షయః ॥ 108
ధర్మజ్ఞా! క్రమంగా దీర్ఘసత్రతీర్థానికి చేరాలి. అక్కడ బ్రహ్మ, దేవతలు, సిద్ధులు, ఋషులు ఉంటారు. (108)
దీర్ఘసత్రముపాసంతే దీక్షితా నియతవ్రతాః ॥ 109
వారు నియమాలతో దీక్షితులై సత్రయాగాన్ని ఆచరిస్తున్నారు. (109)
గమనాదేవ రాజేంద్ర దీర్ఘసత్రమరిందమ ।
రాజసూయాశ్వమేధాభ్యాం ఫలం ప్రాప్నోతి భారత ॥ 110
రాజేంద్రా! ఆ తీర్థయాత్ర చేస్తేన్ యాత్రికులకు రాజసూయాశ్వమేధాలు చేసిన ఫలం లభిస్తుంది. (110)
తతో వినశనం గచ్ఛేత్ నియతో నియతాశనః ।
గచ్ఛత్యంతర్హిత్ యత్ర మేరుపృష్ఠే సరస్వతీ ॥ 111
ఆపై శౌచాది నియమశీలుడై, మితాహారుడై యాత్రికుడు వినశన తీర్థానికి వెళ్ళాలి. అక్కడ సరస్వతీదేవి ప్రచ్ఛన్నంగా సంచరిస్తూ ఉంటుంది. (111)
చమసేఽథ శివోద్భేదే నాగోద్భేదే చ దృశ్యతే ।
స్నాత్వా తు చమసోద్భేదే అగ్నిష్టోమఫలం లభేత్ ॥ 112
అక్కడి మిగిలిన చమసోద్భేద, శివోద్భేద, నాగోద్భేద తీర్థాల్లో సరస్వతి దర్శనం పొందుతాడు. చమసోద్భేదంలో స్నానమాచరిమ్చి అగ్నిష్టోమఫలాన్ని గైకొంటాడు. (112)
శివోద్భేదే నరః స్నాత్వా గోసహస్రఫలం లభేత్ ।
నాగోద్భేదే నరః స్నాత్వా నాగలోకమవాప్నుయాత్ ॥ 113
నరుడు శివోద్భేదంలో స్నానం చేసి గోసహస్రదానఫలాన్ని, నాగోద్భేదంలో స్నానమాచరించి నాగలోకాన్ని పొందుతాడు. (113)
నరుడు శివోద్భేదంలో స్నానం చేసి గోసహస్రదానఫలాన్ని, నాగోద్భేదంలో స్నాన మాచరించి నాగలోకాన్ని పొందుతాడు. (113)
శశయానం చ రాజేంద్ర తీర్థమాసాద్య దుర్లభమ్ ।
శశరూపప్రతిచ్ఛన్నాః పుష్కరా యత్ర భారత ॥ 114
సరస్వత్యాం మహారాజ అనుసంవత్సరం చ తే ।
దృశ్యంతే భరతశ్రేష్ఠ వృత్తాం వై కార్తీకీం సదా ॥ 115
తత్ర స్నాత్వా నరవ్యాఘ్ర ద్యోతతే శశివత్ సదా ।
గోసహస్రఫలం చైవ పాప్నుయాద్ భరతర్షభ ॥ 116
రాజేంద్రా! దుర్లభం అయిన శశయాన తీర్థానికి చేరి, స్నానం చేస్తే సరస్వతీ నదిలో ప్రతిసంవత్సరం కార్తీకపూర్ణిమనాడు శశరూపంలో దాగిన పుష్కర తీర్థాన్ని చూడవచ్చు. (శశము = కుమ్దేలు) అక్కడ స్నానమాచరించి చంద్రుని కాంతి వంటి కాంతిని పొందుతాడు. దానివలన సహస్రగోదానఫలం లభిస్తుంది. (114-116)
కుమారకోటిమాసాద్య నియతః కురునందన ।
తత్రాభిషేకం కుర్వీత పితృదేవార్చనే రతః ॥ 117
కురునందనా! మితాహారియై కుమార కోటి తీర్థాన్ని చేరి, స్నానం చేసి, పితరులను దేవతలను ఆసక్తితో అర్చించాలి. (117)
గవామయుతమాప్నోతి కులం చైవ సముద్ధరేత్ ।
తతో గచ్చేత ధర్మజ్ఞ రుద్రకోటిం సమాహితః ॥ 118
పురా యత్ర మహారాజ మునికోటిః సమాగతా ।
హర్షేణ మహతావిష్టా రుద్రదర్శనకాంక్షయా ॥ 119
అహం పూర్వమహం పూర్వం ద్రక్ష్యామి వృషభధ్వజమ్ ।
ఏవం సంప్రస్థితా రాజన్ ఋషయః కిల భారత ॥ 120
ధర్మజ్ఞా! ఇట్లు చేసిన మానవుడు పదివేల గోవులను దానమిచ్చినట్లే. కులాన్ని ఉద్ధరించినవాడు అవుతాడు. అక్కడి నుండి ఏకాగ్రచిత్తంతో రుద్రకోటి తీర్థానికి పోయి అక్కడి విశేషాలను చూడాలి. పూర్వకాలాన ఒక కోటిమంది ఋషులు అక్కడకు రుద్రదర్శనానికై వచ్చారు. వారందరూ నేను ముందు నేను ముందు అంటూ వృషభధ్వజుని దర్శనానికి వచ్చారు. (118-120)
తతో యోగేశ్వరేణాపి యోగమాస్థాయ భూపతే ।
తేషాం మన్యుప్రణాశార్థమ్ ఋషీణాం భావితాత్మనామ్ ॥ 121
సృష్టా కోటీతి రుద్రాణామ్ ఋషీణామగ్రతః స్థితా ।
మయా పూర్వతరం దృష్ట ఇతి తే మేనిరే పృథక్ ॥ 122
తేషాం తుష్టో మహాదేవః మునీనాం భావితాత్మనామ్ ।
భక్త్యా పరమయా రాజన్ వరం తేషాం ప్రదిష్టవాన్ ॥ 123
యోగేశ్వరుడు అయిన శివుడు యోగాన్ని ఆశ్రయిమ్చి ఆ ఋషులందరి ముందు వారి శాంతి కొరకు కోటి శివలింగాలను ఆవిర్భవింపచేశాడు. వారు ఎవరికి వారే తామే శివుని ముందుగా సంతుష్టిని పొంది శివుడు వారికి వరాలను ఇచ్చాడు. (121-123)
అద్యప్రభృతి యుష్మాకం ధర్మవృద్ధిర్భవిష్యతి ।
తత్ర సాత్వా నరవ్యాఘ్ర రుద్రకోట్యాం నరః శుచిః ॥ 124
అశ్వమేధమవాప్నోతి కులం చైవ సముద్ధరేత్ ।
ఈ రోజు నుంచి మీ ధర్మాచరణం పెరుగుతుంది. ఈ రుద్రకోటితో స్నానమాచరించిన నరుడు అశ్వమేధయాగఫలాన్ని, కులోద్ధరణాన్ని పొందుతాడు. (124)
తతో గచ్ఛేత రాజేంద్ర సంగమం లోకవిశ్రుతమ్ ॥ 125
సరస్వత్యా మహాపుణ్యం కేశవం సముపాసతే ।
యత్ర బ్రహ్మదయో దేవా ఋషయశ్చ తపోధనాః ॥ 126
రాజేంద్రా! అక్కడి నుంచి పవిత్రం, లోకవిశ్రుతమ్ ॥ 125
సరస్వత్యా మహాపుణ్యం కేశవం సముపాసతే ।
యత్ర బ్రహ్మాదయో దేవా ఋషయశ్చ తపోధనాః ॥ 126
రాజేంద్రా! అక్కడి నుంచి పవిత్రం, లోకవిఖ్యాతం అయిన సరస్వతీ సంగమతీర్థానికి వెళ్ళాలి. ఆ ప్రదేశంలో బ్రహ్మాది దేవతలు, తపోధనులు కేశవుని ఉపాసిస్తుంటారు. (125,1266)
అభిగచ్ఛంతి రాజేంద్ర చైత్రశుక్లచతుర్దశీమ్ ।
తత్ర స్నాత్వా నరవ్యాఘ్ర విందేద్ బహుసువర్ణకమ్ ।
సర్వపాపవిశుద్ధాత్మా బ్రహ్మలోకం చ గచ్ఛతి ॥ 127
రాజేంద్రా! చైత్రశుక్లచతుర్దశినాడు జనులకు అక్కడ చేరుతారు. అక్కడ స్నానం చేస్తే ఎంతో బంగారం లభిస్తుంది. పాపవిముక్తి. బ్రహ్మలోకం ప్రాప్తిస్తాయి. (127)
ఋషీణాం యత్ర సత్రాణి సమాప్తాని నరాధిప ।
తత్రావసానమాసాద్య గోసహస్రఫలం లభేత్ ॥ 128
రాజా! ఋషుల సత్రయాగాలు పరిసమాప్తం అయ్యే అవసానతీర్థానికి చేరి నరుడు గోసహస్రదానఫలాన్ని అందుకొంటాడు. (128)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి పులస్త్యతీర్థయాత్రాయాం ద్వ్యశీతితమోఽధ్యాయః ॥ 82 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున పులస్త్యతీర్థయాత్ర అను ఎనుబది రెండవ అధ్యాయము. (82)