112. నూట పన్నెండవ అధ్యాయము

వేశ్యను మునికుమారుడు అని భావించిన ఋష్యశృంగుడు తండ్రితో తన ఆసక్తి తెలియజేయుట.

ఋష్యశృంగ ఉవాచ
ఇహాగతో జటిలో బ్రహ్మచారీ
న వై హ్రస్వో నాతిదీర్ఘో మనస్వీ ।
సువర్ణవర్ణః కమలాయతాక్షః
స్వతః సురాణామివ శోభమానః ॥ 1
ఋష్యశృంగుడు చెప్పాడు.
ఇక్కడకు ఒక జడధారి, బ్రహ్మచారి, ఉదారుడు, పొట్టిపొడుగు కానివాడు, బంగారు రంగు, కమలదళాలవంటి కళ్ళు కల్గి దేవతల వలె ప్రకాశించేవాడు వచ్చాడు. (1)
సమృద్ధరూపః సవితేవ దీప్తః
సుశ్లక్ష్ణకృష్ణాక్షిరతీవ గౌరః ।
నీలః ప్రసన్నాశ్చ జటాః సుగంధా
హిరణ్యరజ్జుగ్రథితాః సుదీర్ఘాః ॥ 2
అతని రూపం సుందరం, సూర్యునివలె వెలుగుతున్నాడు. స్వచ్ఛత, నల్లధనం కల నేత్రాలు, తెల్లని రంగు, నల్లని జడలు, సుగంధం, బంగారం సూత్రాలచే బంధింపబడిన పొడవైన జుట్టు కలవాడు. (2)
ఆశ్చర్యరూపా పునరస్య కంఠే
విభ్రాజతే విద్యుదివాంతరిక్షే ।
ద్వౌ చాస్య పిణ్డావధరేణ కంఠా
దజాతరోమౌ సుమనోహరౌ చ ॥ 3
అతని మెడలో కంఠాభరణం, ఆకాశంలో మెరుపువలె మెరుస్తోంది. అతని వక్షః స్థలంపై రెండుమాంసపు ముద్దలు ఉన్నాయి. వాటిపై రోమాలు లేవు. అతడు చాల అందంగా కనిపించాడు. (3)
విలగ్నమధ్యశ్చ స నాభిదేశే
కటిశ్చ తస్యాతికృతప్రమాణా ।
తథాస్య చీరంతరతః ప్రభాతి
హిరణ్మయీ మేఖలా మే యథేయమ్ ॥ 4
ఆ బ్రహ్మచారి నడుము సన్నగా ఉంది. నితంబం మిక్కిలి పెద్దగా ఉంది. నాకౌపీనం క్రిందుగా ముంజమేఖల ఉన్నట్లుగా ఉన్న వస్త్రాలకు పైన బంగారం మొలనూలు కనిపించింది. (4)
అన్యచ్చ తస్యాద్భుతదర్శనీయం
వికూజితం పాదయోః సంప్రభాతి ।
పాణ్యోశ్చ తద్వత్ స్వనవన్నిబద్ధౌ
కలాపకావక్షమాలా యథేయమ్ ॥ 5
పాదాలపై ధ్వనించే ఆభరణం ఎంతో చూడముచ్చటగా ఉంది. చేతులకు నేను రుద్రాక్షలు ధరించినట్లు అతడు కడియాలు ధరించాడు. వాటి నుంచి శ్రవణపేయమైన ధ్వని వస్తోంది. (5)
విచేష్టమానస్య చ తస్య తాని
కూజంతి హంసాః సరసీవ మత్తాః ।
చీరాణి తస్యాద్భుతదర్శనాని
నేమాని తద్వన్మమ రూపవంతి ॥ 6
అతడు అటు ఇటు కదలేటప్పుడు అతని ఆభరణాలు సరస్సులో మత్తహంసల ధ్వనులు వలె ఉన్నాయి. అతని వస్త్రాలు అద్భుతంగా కనిపించాయి. నా బట్టలు అంత అందంగా లేవు. (6)
వక్త్రం చ తస్యాద్భుతదర్శనీయం
ప్రవ్యాహృతం హ్లాదయతీవ చేతః ।
పుంస్కోకిలస్యేవ చ తస్య వాణీ
తాం శృణ్వతో మే వ్యథితోఽంతరాత్మా ॥ 7
అతని ముఖం చూడముచ్చటగా ఉంది. ఆ బ్రహ్మచారి ఒక్కొక్కమాట మనస్సును ఆనందసాగరంలో ముంచుతోంది. అతని మాట కోకిల కూతలను మించి ఉంది. ఒకసారి వింటే నా మనస్సు మళ్ళీ మళ్ళీ ఆ మాటలు వినాలి అంటోంది. (7)
యథా వనం మాధవమాసి మధ్యే
సమీరితం శ్వసనేనేవ భాతి ।
తథా స భాత్యుత్తమపుణ్యగంధీ
నిషేవ్యమాణః పవనేన తాత ॥ 8
తండ్రీ! వసంతఋతువులో గాలిచే కదలాడే ఉద్యానంలా ఆ అందం ప్రకాశిస్తోంది. వాయువుచే సేవింపబడే ఆ బ్రహ్మచారి పవిత్రగంధంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. (8)
సుసంయతాశ్చాపి జటా విషక్తా
ద్వైధీకృతా నాతిసమా లలాటే ।
కర్ణౌ చ చిత్రైరివ చక్రవాకైః
సమావృతౌ తస్య సురూపవద్భిః ॥ 9
అతని జటలు బిగింపబడి రెండుగా వేరై నుదుటి మీద విషమంగా ఉన్నాయి. కుండలాల చెవులు చిత్రవిచిత్ర రూపం కల చక్రవాక పక్షుల్లా కనబడ్డాయి. (9)
తథా ఫలం వృత్తమథో విచిత్రం
సమాహరత్ పాణినా దక్షిణేన ।
తద్ భూమిమాసాద్య పునః పునశ్చ
సముత్పతత్యద్భుతరూపముచ్చైః ॥ 10
అతని వద్ద విచిత్రం అయిన గోళాకారపు ఫలం (బంతి) ఉంది. కుడిచేతితో ఆ బంతిని కొట్టుతున్నాడు. ఆ ఫలం భూమిపై పడి మాటిమాటికి పైకి లేచి అతని చేతిలో పడుతోంది. ఆ సమయంలో అతని ముఖం చాల అందంగా కనిపించింది. (10)
తచ్చాభిహత్య పరివర్తతేఽసౌ
వాతేరితో వృక్ష ఇవావఘూర్ణన్ ।
తం ప్రేక్షతః పుత్రమివామరాణాం
ప్రీతిః పరా తాత రతిశ్చ జాతా ॥ 11
గాలికి కదలాడే చెట్టు వలె అతడు బంతిని కొడుతూ నాలుగువైపులా తిరగసాగాడు. దేవపుత్రుని వలె ఉన్న ఆ బ్రహ్మచారిని చూస్తే నామనస్సు ప్రేమతో నిండుతోంది. నాకు ఆ బ్రహ్మచారిపట్ల ఆసక్తి కలిగింది. (11)
స మే సమాశ్లిష్య పునః శరీరం
జటాసు గృహ్యాభ్యవనామ్య వక్ర్తమ్ ।
వక్త్రేణ వక్త్రం ప్రణిధాయ శబ్దం
చకార తన్మేఽజనయత్ ప్రహర్షమ్ ॥ 12
అతడు మాటిమాటికి నన్ను కౌగిలించుకొని నా జటలను పట్టి తన ముఖానికి నా ముఖాన్ని ఆనించాడు. ఇలా ముఖానికి ముఖం కలిపి ఒక శబ్దం చేస్తే (ముద్దు) నా హృదయంలో మిక్కిలి ఆనందం కలిగింది. (12)
దీనికి నన్నయగారు చక్కని అనువాదం చేశారు.
నన్నును కౌగిలించుకొని నావదనంబునకున్ నిజాస్యమా
సన్నము జేసి యొక్క మృదుశబ్దము సేసె మనోహరంబుగా నెన్నడు నిట్టిశబ్దము మునీశ్వర! మున్ విని యే నెఱుంగ న
య్యన్నువ బ్రహ్మచారిముఖ మంబురుహంబు సమంబు చూడఁగన్ ॥
శ్రీ మదాంధ్రమహాభారతము ఆరణ్యపర్వము 3/107
న చాపి పాద్యం బహు మన్యతేఽసౌ
ఫలాని చేమాని మయాఽహృతాని ।
ఏవంవ్రతోఽస్మీతి చ మామవోచత్
ఫలాని చాన్యాని సమాదదన్మే ॥ 13
నేను సమర్పించిన పాద్యానికి అతడు విలువ చూపలేదు. నేనిచ్చిన పండ్లను స్వీకరించలేదు. నాకిది వ్రతసమయమని నాతో అంటూ చాలారకాల పండ్లను నాకు ఇచ్చాడు. (13)
మయోపయుక్తాని ఫలాని యాని
నేమాని తుల్యాని రసేన తేషామ్ ।
న చాపి తేషాం త్వగియం యథైషాం
సారాణి నైషామివ సంతి తేషామ్ ॥ 14
ఆ బ్రహ్మచారి ఇచ్చిన పండ్లలోని రసం నేను ఇచ్చిన పండ్లలో లేదు. ఆ పండ్లతోలు అడవిపండ్లవలె లేదు. నేను అర్పించిన పండ్లలోని సారం కంటె ఆ పండ్లసారం విలక్షణంగా, ఉత్తమంగా అనిపించింది. (14)
తోయాని చైవాతిరసాని మహ్యం
ప్రాదాత్ స వై పాతుముదారరూపః ।
పీత్వైవ యాన్యభ్యధికః ప్రహర్షః
మమాభవద్ భూశ్చలితేవ చాసీత్ ॥ 15
ఉదారస్వభావుడయిన ఆ బ్రహ్మచారి త్రాగటానికి ఆ స్వాదయోగ్యమయిన జలం ఇచ్చాడు. ఆ జలం త్రాగుతూనే ఆనందం అవధులు దాటింది. నాకు ఈ భూమి కంపించిందా అన్నట్లు అనిపించింది. (15)
ఇమాని చిత్రాణి చ గంధవంతి
మాల్యాని తస్యోద్ర్గథితాని పట్టైః ।
యాని ప్రకీర్యేహ గతః స్వమేవ
స ఆశ్రమం తపసా ద్యోతమానః ॥ 16
చిత్రాలు, సుగంధయుతాలు అయిన మాలలు పట్టుదారాలతో నేసినట్లు ఉన్నాయి. వాటిని ఇక్కడే విడచి ఆ బ్రహ్మచారి తన ఆశ్రమానికి వెళ్ళాడు. (16)
గతేన తేనాస్మి కృతో విచేతా
గాత్రం చ మే సంపరిదహ్యతీవ ।
ఇచ్ఛామి తస్యాంతికమాశు గంతుం
తం చేహ నిత్యం పరివర్తమానమ్ ॥ 17
అతను వెళ్ళాక నేను చైతన్యం కోల్పోయాను. నా శరీరం మండుతున్నట్లు అయ్యింది. ఆ బ్రహ్మచారి వద్దకు వెళ్ళాలి అని లేదా, ఎల్లప్పుడు అతడు నా దగ్గరే ఉండాలి అని భావిస్తున్నాను. (17)
గచ్ఛామి తస్యాంతికమేవ తాత
కా నామ సా బ్రహ్మచర్యా చ తస్య ।
ఇచ్ఛామ్యహం చరితుం తేన సార్ధం
యథా తపః స చరత్యార్యధర్మా ॥ 18
నేను అతని సమీపానికి వెళ్ళుతున్నాను. అతని బ్రహ్మచర్య సాధన ఎట్టిది? ఆర్యధర్మాన్ని పాలించే ఆ బ్రహ్మచారి ఏ తపస్సు ఆచరిస్తున్నాడు? అతనితో ఉండి నేనూ అలాంటి తపస్సు చేస్తాను. (18)
చర్తుం తథేచ్ఛా హృదయే మమాస్తి
దునోతి చిత్తం యది తం న పశ్యే ॥ 19
అలాంటి తపస్సు చెయ్యాలనే కోరిక నాహృదయంలో బలంగా ఉంది. అతనిని చూడకపోతే నా మనస్సు ఎక్కువగా తపించిపోతుంది. (19)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయామృష్యశృంగోపాఖ్యానే ద్వాదశాధికశతతమోఽధ్యాయః ॥ 112 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రయందు ఋష్యశృంగోపాఖ్యానము అను నూట పన్నెండవ అధ్యాయము. (112)