127. నూట ఇరువది యేడవ అధ్యాయము

సోమక- జంతువుల కథ.

యుధిష్ఠిర ఉవాచ
కథంవీర్యః స రాజాభూత్ సోమకో వదతాం వర ।
కర్మాణ్యస్య ప్రభావం చ శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ॥ 1
యుధిష్ఠిరుడు అడిగాడు - రాజు సోమకుడు ఎలాంటి పరాక్రమం కలవాడు. అతని పనులు, వాటి ప్రభావం వినాలనుకొంటున్నాను. (1)
లోమశ ఉవాచ
యుధిష్ఠిరాసీన్నృపతిః సోమకో నామ ధార్మికః ।
తస్య భార్యాశతం రాజన్ సదృశీనామభూత్ తదా ॥ 2
లోమశుడు చెప్పాడు.
యుధిష్ఠిరా! సోమకుడనే రాజు ఉండేవాడు. అతడు ధార్మికుడు. అతడు వందమంది భార్యలు. అందరూ ఒకే స్థాయి వారు. (2)
స వై యత్నేన మహతా తాసు పుత్రం మహీపతిః ।
కంచిన్నాసాదయామాస కాలేన మహతా హ్యపి ॥ 3
చాలకాలం గొప్పగొప్ప ప్రయత్నాలు చేసినా అతని రాణులకు గర్భం కలుగలేదు. (3)
కదాచిత్ తస్య వృద్ధస్య ఘటమానస్య యత్నతః ।
జంతుర్నామ సుతస్తస్మిన్ స్త్రీశతే సమజాయత ॥ 4
సోమకుడు వృద్ధుడు అయిన పిదప ఒకానొక సమయంలో ప్రయత్నాలు ఫలించి నూరుగురు భార్యలకు ఒకడే కుమారుడు జంతువు అనేవాడు కలిగాడు. (4)
తం జాతం మాతరః సర్వాః పరివార్య సమాసతః ।
సతతం పృష్ఠతః కృత్వా కామభోగాన్ విశాంపతే ॥ 5
అతడు పుట్టిన పిదప రాణులందరు అతని చుట్టూ చేరి కామభోగాలను కల్పించాలని ఎల్లప్పుడు ప్రయత్నం చేసేవారు. (5)
తతః పిపీలికా జంతుం కదాచిదదశత్ స్ఫిచి ।
స దష్టో వ్యనదన్నాదం తేన దుఃఖేన బాలకః ॥ 6
ఒకానొకనాడు ఒక చీమ అతని కటిభాగంలో కుట్టింది. ఆ దుఃఖంతో బాలకుడు గుక్కపట్టి ఏడ్చాడు. (6)
తతస్తా మాతరః సర్వాః ప్రాక్రోశన్ భృశదుఃఖితాః ।
ప్రవార్య జంతుం సహసా స శబ్దస్తుములోఽభవత్ ॥ 7
తల్లులందరు అతని దుఃఖంచే అతని చుట్టూ మూగి ఆక్రోశించసాగారు. ఆరోదనతో గొప్ప కలకలం బయలుదేరింది. (7)
తమార్తనాదం సహసా శుశ్రావ స మహీపతిః ।
అమాత్యపర్షదో మధ్యే ఉపవిష్టః సహర్త్విజా ॥ 8
ఆ సమయంలో రాజు ఆస్థానంలో మంత్రి, పురోహితుల మధ్య సభలో ఉండి ఈ ఆర్తనాదం విన్నాడు. (8)
తతః ప్రస్థాపయామాస కిమేతదితి పార్థివః ।
తస్మై క్షత్తా యథావృత్తమ్ ఆచచక్షే సుతం ప్రతి ॥ 9
వింటూనే రాజు 'ఏమైంది' అని ద్వారపాలకుని తెలుసుకోమని పంపాడు. అతడు తిరిగి వచ్చి రాజకుమారుని వృత్తాంతాన్ని రాజుకు వినిపించాడు. (9)
త్వరమాణః స చోత్థాయ సోమకః సహ మంత్రిభిః ।
ప్రవిశ్యాంతఃపురం పుత్రమ్ ఆశ్వాసయదరిందమః ॥ 10
శత్రుతాపనుడైన సోమకుడు త్వరగా సభనుంచి బయటపడి, మంత్రులతో కలిసి, అంతఃపురానికి వచ్చి, కుమారుని సముదాయించాడు. (10)
సాంత్వయిత్వా తు తం పుత్రం నిష్క్రమ్యాంతఃపురాన్నృపః । 11
రాజా! కుమారుని ఊరడించి అంతఃపురం నుంచి బయటకు వచ్చి పురోహిత, మంత్రులతో కలిసి సభలో తిరిగి కూర్చున్నాడు. (11)
సోమక ఉవాచ
ధిగస్త్విహైకపుత్రత్వమ్ అపుత్రత్వం వరం భవేత్ ।
నిత్యాతురత్వాద్ భూతానాం శోక ఏవైక పుత్రతా ॥ 12
సోమకుడు పలికాడు - ఈ ప్రపంచంలో ఒక్క కుమారుడు ఉండటం తగినది కాదు. ఇంతకన్నా పుత్రులు లేకపోవటమే మంచిది. ప్రాణులకు ఒకే కుమారుడు ఉండడం నిత్యమూ, భయాన్ని, దుఃఖాన్నీ కలిగిస్తుంది. (12)
ఇదం భార్యాశతం బ్రహ్మన్ పరీక్ష్య సదృశం ప్రభో ।
పుత్రార్థినా మయా వోఢం న తాసాం విద్యతే ప్రజా ॥ 13
నేను బాగా ఆలోచించి, పుత్రార్థినై నూరుగురు భార్యలను వివాహమాడాను. కాని వారికి సంతానం కలుగలేదు. (13)
ఏకః కథంచిదుత్పన్నః పుత్రో జంతురయం మమ ।
యతమానాసు సర్వాసు కిం తు దుఃఖమతః పరమ్ ॥ 14
నా రాణులు సంతానం కోసం యత్నశీలలై ఉన్నారు. అయినా ఎలాగో వారికి ఈ ఒక్క కుమారుడు పుట్టాడు. ఇంతకన్న లోకంలో ప్రాణులకు దుఃఖం లేదు. (14)
వయశ్చ సమతీతం మే సభార్యస్య ద్విజోత్తమ ।
ఆసామ్ ప్రాణాః సమాయత్తా మమ చాత్రైకపుత్రకే ॥ 15
నాకు, నా రాణులకు యౌవనం గడచిపోయింది. మా ప్రాణాలు ఈ ఒకే ఒక్క కుమారునిపై లగ్నమయి ఉన్నాయి. (15)
స్యాత్తు కర్మ తథా యుక్తం పుత్రశతం భవేత్ ।
మహతా లఘునా వాపి కర్మణా దుష్కరేణ వా ॥ 16
నూరుగురు కుమారులు కలుగునట్లు ఆదేశించండి. అది గొప్పదైనా, చిన్నదైనా, అసాధ్యమయినా ఆచరిస్తాను. (16)
ఋత్వి గువాచ
అస్తి చైతాదృశం కర్మ యేన పుత్రశతం భవేత్ ।
యది శక్నోషి తత్ కర్తుమ్ అథ వక్ష్యామి సోమక ॥ 17
పురోహితుడు పలికాడు - నూరుగురు పుత్రులను పొంద గల ఒక యజ్ఞకర్మ ఉన్నది. అది నీకిష్టం అయితే దాన్ని వివరించి చెబుతాను. (17)
సోమక ఉవాచ
కార్యం వా యది వాకార్యం యేన పుత్రశతం భవేత్ ।
కృతమేవేతి తద్ విద్ధి భగవాన్ ప్రబ్రవీతు మే ॥ 18
సోమకుడు అన్నాడు - అది చేయ తగినది అయినా, తగనిది అయినా నూరుగురు పుత్రులు మాత్రం కలిగేదైతే ఆచరిస్తాను. నాకు చెప్పు. (18)
ఋత్విగువాచ
యజస్వ జంతునా రాజన్ త్వం మయా వితతే క్రతౌ ।
తతః పుత్రశతం శ్రీమద్ భవిష్యత్యచిరేణ తే ॥ 19
పురోహితుడు పలికాడు.
రాజా! జంతునితో యాగం చెయ్యి. నేను క్రతువు ప్రారంభిస్తాను. అందు పశువు జంతుడే. దీనివల్ల నీకు నూరుమంది కుమారులు పుడతారు. (19)
వి॥సం॥ "సవరుణం రాజానముపసార పుత్రోమే జాయతాం తేన త్వాయజా" అని బహ్వ్నచ బ్రాహ్మణవచనం కుమారుని కూడా యజ్ఞపశువుగా చేయటాన్ని ప్రస్తావించింది. (నీల)
వపాయాం హూయమానాయాం ధూమమాఘ్రాయ మాతరః ।
తతస్తా సుమహావీర్యాన్ జనయిష్యంతి తే సుతాన్ ॥ 20
యజ్ఞసమయంలో జంతుడిని చంపి అతని శరీరంలోని వపను హోమం చేస్తే ఆ పొగను ఆఘ్రానించిన రాణులందరు గర్భవతులై పరాక్రమవంతులయిన కుమారులను కంటారు. (20)
తస్యామేవ తు తే జంతుః భవితా పునరాత్మజః ।
ఉత్తరే చాస్య సౌవర్ణం లక్ష్మ పార్శ్వే భవిష్యతి ॥ 21
మళ్ళీ జంతువు ఆమెకే కుమారుడుగా పుడతాడు. అతని ఎడమప్రక్కన బంగారు రంగు మచ్చ ఉంటుంది. (21)
ఇది శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి
లోమశతీర్థయాత్రాయాం జంతూపాఖ్యానే సప్త వింశత్యధికశతతమోఽధ్యాయః ॥ 127 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున లోమశతీర్థయాత్రా పర్వమను ఉపపర్వమున జంతూపాఖ్యానమను నూట ఇరువది ఏడవ అధ్యాయము. (127)