188. నూట ఎనుబది ఎనిమిదవ అధ్యాయము.
కలి ప్రభావము - మార్కండేయుడు వటపత్రశాయిని దర్శించుట.
వైశంపాయన ఉవాచ
తతః స పునరేవాథ మార్కండేయం యశస్వినమ్ ।
పప్రచ్ఛ వినయోపేతః ధర్మరాజో యుధిష్ఠిరః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
అటు తరువాత యుధిష్ఠిరుడైన ధర్మరాజు వినయంతో యశస్వి అయిన మార్కండేయుని మరలా ప్రశ్నించాడు. (1)
నైకే యుగసహస్రాంతాః త్వయా దృష్టా మహామునే ।
న చాపీహ సమః కశ్చిద్ ఆయుష్మాన్ దృశ్యతే తవ ॥ 2
మహర్షీ! నీవు వేల వేలయుగాల లయాలను చూచావు. ఈ లోకంలో నీవంటి ఆయుష్మంతుడు మరొకడు కనిపించడు. (2)
వర్జయిత్వా మహాత్మానం బ్రహ్మాణం పరమేష్ఠినమ్ ।
న తేఽస్తి సదృశః కశ్చిద్ ఆయుషా బ్రహ్మవిత్తమ ॥ 3
బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడా! మహాత్ముడూ పరమేష్ఠి అయిన బ్రహ్మ తప్ప మరెవ్వడూ ఆయుస్సులో నీకు సమానమైనవాడు లేడు. (3)
అనంతరిక్షే లోకేఽస్మిన్ దేవదానవవర్జితే ।
త్వమేవ ప్రలయే విప్ర బ్రహ్మాణముపతిష్ఠసే ॥ 4
బ్రాహ్మణా! ఈ విశ్వంలో దేవతలూ, దానవులూ, అంతరిక్షం కూడా లేని ప్రలయవేళలో నీవు మాత్రమే బ్రహ్మసన్నిధిలో ఆయన నుపాసించగలవు. (4)
ప్రలయే చాపి నిర్వృత్తే ప్రబుద్ధే చ పితామహే ।
త్వమేకః సృజ్యమానాని భూతానీహ ప్రపశ్యసి ॥ 5
చతుర్విధాని విప్రర్షే యథావత్ పరమేష్ఠినా ।
వాయుభూతా దిశః కృత్వా విక్షిప్యాపస్తతస్తతః ॥ 6
బ్రహ్మర్షీ! ప్రళయం ముగిసిన తర్వాత బ్రహ్మదేవుడు మేల్కొనిఇ, దిక్కులనన్నింటిని మాత్రమే గాలి కలవానినిగా చేసి నీటిని అటు ఇటూ చిమ్మి, చతుర్విధప్రాణులను యథాపూర్వకంగా మరల సృష్టించటాన్ని నీవు మాత్రమే చూడగలవు. (5,6)
త్వయా లోకగురుః సాక్షాత్ సర్వలోకపితామహః ।
ఆరాధితో ద్విజశ్రేష్ఠ తత్పరేణ సమాధినా ॥ 7
స్వప్రమాణమథో విప్ర త్వయా కృతమనేకశః ।
ఘోరేణావిశ్వ తపసా వేధసో నిర్జితాస్త్వయా ॥ 8
ద్విజోత్తమా! నీవు సమస్తలోకాలకూ పితామహుడైన సాక్షాత్తు బ్రహ్మను తత్పరతతో ఏకాగ్రతతో ఆరాధించగలిగావు. బ్రాహ్మణా! నీవు ఎన్నోమార్లు సృష్టిప్రారంభాన్ని సందర్శించగలిగావు. ఘోరతపస్సుతో ప్రజాపతులను కూడా నీవు వశపరచుకొన్నావు. (7,8)
నారాయణాంకప్రఖ్యస్త్వం సాంపరాయేఽతిపఠ్యసే ।
భగవాననేకశః కృత్వా త్వయా విష్ణోశ్చ విశ్వకృత్ ॥ 9
కర్ణికోద్ధరణం దివ్యం బ్రహ్మణః కామరూపిణః ।
రత్నాలంకారయోగాభ్యాం దృగ్భ్యాం దృష్టస్త్వయా పురా ॥ 10
విశ్వస్రష్టలు, భవగత్ స్వరూపులు అయిన మీరు పరబ్రహ్మ యొక్క నివాసస్థానమైన హృదయపద్మము తెరచి ఆంతరదృష్టితో ఎన్నో మారులు ఆ పరబ్రహ్మను చూశారు. అలాగే కామరూపుడైన చతుర్ముఖబ్రహ్మకు కారణమైన విష్ణు నాభి కమలమును బహిర్దృష్టితో చూసిన మహాత్ములు మీరు. (వైరాగ్య యోగములను రెండు దృష్టులతో వేరు వేరుగా ఇద్దరిని చూసినారని భావము) (9,10)
తస్మాత్ తవాంతకో మృత్యుః జరా వా దేహనాశినీ ।
న త్వాం విశతి విప్రర్షే ప్రసాదాత్ పరమేష్ఠినః ॥ 11
అందువలననే బ్రహ్మర్షీ! ఆ పరమేష్ఠి అనుగ్రహం వలన ప్రాణాంతకమయిన మృత్యువు కానీ, దేహాన్నీ శిథిలం చేసే వార్ధక్యం కానీ నిన్ను తాకలేవు. (11)
యదా వైవ రవిర్నాగ్నిః న వాయుర్న చ చంద్రమాః ।
వైవాంతరిక్షం నైవోర్వీ శేషం భవతి కించన ॥ 12
తస్మిన్నేకార్ణవే లోకే నష్టే స్థావరజంగమే ।
నష్టే దేవాసురగణే సముత్సన్నమహోరగే ॥ 13
శయానమమితాత్మానం పద్మోత్పలనికేతనమ్ ।
త్వమేకః సర్వభూతేశం బ్రహ్మాణముపతిష్ఠసి ॥ 14
మహాప్రలయకాలంలో సూర్యుడు, అగ్ని, వాయువు, చంద్రుడు, అంతరిక్షం, భూమీ ఏమీ మిగలని వేళలో లోకమంతా ఏకార్ణవమై స్థావరజంగమప్రాణులు,
దేవాసురగణాలూ, మహానాగాలూ అన్నీ నశించిన వేళలో కమలంపై, కలువపై శయనించిన మహాత్ముడు, సర్వభూతేశుడు అయిన బ్రహ్మను నీవు ఒక్కడవే ఉపాసింపగలవు. (12-14)
ఏతత్ ప్రత్యక్షతః సర్వం పూర్వం వృత్తం ద్విజోత్తమ ।
తస్మాదిచ్ఛామ్యహం శ్రోతుం సర్వహేత్వాత్మికాం కథామ్ ॥ 15
ద్విజోత్తమా! గతంలో జరిగిన ఈ వృత్తాంతమంతా నీకు ప్రత్యక్షమే. కాబట్టి అన్నింటికి కారణమైన కాలాన్ని నిరూపించే ఆ కథను నీ నుండి వినగోరుతున్నాను. (15)
అనుభూతం హి బహుశః త్వయైకేన ద్విజోత్తమ ।
న తేఽస్త్వవిదితం కించిత్ సర్వలోకేషు నిత్యదా ॥ 16
ద్విజశ్రేష్ఠా! నీవు మాత్రమే అనేకపర్యాయాలు దానిని అనుభవించినవాడవు. సర్వలోకాలలో, సర్వకాలాలలో నీవెరుగనది ఏదీ లేదు. (16)
మార్కండేయ ఉవాచ
హంత తే వర్ణయిష్యామి నమస్కృత్వా స్వయంభువే ।
పురుషాయ పురాణాయ శాశ్వతాయావ్యయాయచ ॥ 17
అవ్యక్తాయ సుసూక్ష్మాయ నిర్గుణాయ గుణాత్మనే ।
స ఏష పురుషవ్యాఘ్ర పీతవాసా జనార్దనః ॥ 18
ఏష కర్తా వికర్తా చ భూతాత్మా భూతకృత్ ప్రభుః ।
అచింత్యం మహదాశ్చర్యం పవిత్రమితి చోచ్యతే ॥ 19
మార్కండేయుడిలా అన్నాడు.
స్వయంభువు, సనాతనుడు, శాశ్వతుడు, అవ్యయుడు, అవ్యక్తుడు, పరమసూక్ష్ముడు, నిర్గుణుడు, గుణ స్వరూపుడు అయిన పురాణపురుషున్కు నమస్కరించి నీకు అంతా చెపుతాను. మన సన్నిధిలో పీతాంబరుడై ఉన్న పురుషోత్తముడు ఈ జనార్దనుడే సృష్టికి కారణం.
ఈ ప్రభువే ప్రాణుల అంతర్యామి, ప్రాణిసృష్టికర్త. పవిత్రమూ, అచింత్యమూ, మహాశ్చర్యకరమూ అయిన తత్త్వం ఈయనయే. (17-19)
అనాదినిధనం భూతం విశ్వమన్యయమక్షయమ్ ।
ఏష కర్తా న క్రియతే కారణం చాపి పౌరుషే ॥ 20
ఈయనకు మొదలు, తుది లేవు. భూతస్వరూపుడూ, విశ్వరూపుడూ, అవ్యయుడూ, అక్షయుడూ ఇతడే. అన్నింటికీ ఈయనయే కర్త కానీ తనకు ఎవరూ కర్తకాదు. పురుషార్థప్రాప్తిలో కూడా కారణమీయనయే. (20)
యద్యేష పురుషో వేద వేదా అపి న తం విదుః ।
సర్వమాశ్చర్యమేవైతద్ నిర్వృత్తం రాజసత్తమ ॥ 21
ఆదితో మనుజవ్యాఘ్ర కృత్స్నస్య జగతః క్షయే ।
రాజశ్రేష్ఠా! ఈయన పరమపురుషుడు. వీనిని తెలుసుకొనిన వానిని వేదములు కూడా తెలుసుకొనలేవు. నరోత్తమా! ప్రళయకాలంలో సమస్తవిశ్వమూ నశించిన తరువాత ఈయన ద్వారానే ఆశ్చర్యకరమైన జగమంతా మరల జనిస్తుంది. (21 1/2)
చత్వార్యాహుః సహస్రాణి వర్షాణాం తత్ కృతం యుగమ్ ॥ 22
తస్య తావచ్ఛతీ సంధ్యా సంధ్యాంశశ్చ తథావిధః ।
నాలుగువేల సంవత్సరాలు కృతయుగమవుతుంది. అలాగే నాలుగువందల సంవత్సరాళు ఆయుగసంధి, మరో నాలుగు వందల సంవత్సరాలు దాని సంధ్యాంశం. (మొత్తం కృతయుగం 4800 సంవత్సరాలు) (22 1/2)
కలిః శయానో భవతి సంజిహానస్తు ద్వాపరః ।
ఉత్తిష్ఠంస్త్రేతా భవతి కృతం సంపద్యతే చరన్ ॥ అని శ్రుతి. (నీల)
త్రీణి వర్షసహస్రాణి త్రేతాయుగమిహోచ్యతే ॥ 23
తస్యాపి ద్విశతే సంధ్యా సంధ్యాంశశ్చ తథావిధః ।
మూడువేల సంవత్సరాలు త్రేతాయుగం, త్రేతాయుగ సంధ్య మూడువందల సంవత్సరాలు. సంధ్యాంశం మూడువందల సంవత్సరాలు. (మొత్తం 3600 సంవత్సరాలు త్రేతాయుగం) (23 1/2)
తథా వర్షసహస్రే ద్వే ద్వాపరం పరిమాణతః ॥ 24
తస్యాపి ద్విశతీ సంధ్యా సంధ్యాంశశ్చ తతఃపరమ్ ।
అదేరీతిగా రెండువేలసంవత్సరాలు ద్వాపరయుగ పరిమాణం. దాని సంధ్య రెండువందల సంవత్సరాలు. సంధ్యాంశం రెండు వందల సంవత్సరాలు (మొత్తం ద్వాపరయుగపరిమాణం 2400 సంవత్సరాలు). (24 1/2)
సహస్రమేకం వర్షాణాం తతః కలియుగం స్మృతమ్ ॥ 25
తస్య వర్షశతం సంధిః సంధ్యాంశశ్చ తతః పరమ్ ।
సంధిసంధ్యాంశయోస్తుల్యం ప్రమాణముపధారయ ॥ 26
ఆ తరువాత కలియుగం వేయిసంవత్సరాలు. దాని సంధ్య వంద సంవత్సరాలు. సంధ్యాంశం వంద సంవత్సరాలు. (మొత్తం కలియుగం 1200 సంవత్సరాలు). సంధ్య సంధ్యాంశాల ప్రమాణం సమానంగానే ఉంటుంది. (25,26)
క్షీణే కలియుగే చైవ ప్రవర్తేత కృతం యుగమ్ ।
ఏషా ద్వాదశసాహస్రీయుగాఖ్యా పరికీర్తితా ॥ 27
కలియుగానంతరం మరల కృతయుగం ప్రారంభమవుతుంది. ఈ రీతిగా చతుర్యుగి పండ్రెండు వేల సంవత్సరాలు నడుస్తుంది. (27)
ఏతత్ సహస్రపర్యంతమ్ అహో బ్రాహ్మముదాహృతమ్ ।
విశ్వం హి బ్రహ్మభవనే సర్వతః పరివర్తతే ॥ 28
లోకానాం మనుజవ్యాఘ్ర ప్రలయం తం విదుర్బుధాః ।
నరోత్తమా! ఇటువంటి చతుర్యుగాలు వేయి గడిస్తే బ్రహ్మకు ఒక రోజు అవుతుంది. ఆ బ్రహ్మదినం వరకే ఈ విశ్వం తిరుగుతుంది. ఆ పై నశిస్తుంది. దానినే ప్రళయమంటారు పండితులు. (28 1/2)
అల్పావశిష్టే తు తదా యుగాంతే భరతర్షభ ॥ 29
సహస్రాంతే నరాః సర్వే ప్రాయశోఽనృతవాదినః ।
యజ్ఞప్రతినిధిః పార్థ దానప్రతినిధిస్తథా ॥ 30
వ్రతప్రతినిధిశ్చైవ తస్మిన్ కాలే ప్రవర్తతే ।
భరతర్షభా! సహస్రయుగం సమాప్తమయ్యే ముందు కొద్దికాలం మిగిలి ఉన్నప్పుడు కలియుగాంతంలో ప్రజలందరూ దాదాపు అసత్యభాషణులవుతారు. ఆ సమయంలో యజ్ఞ, దాన, వ్రతాలు ప్రత్యామ్నాయప్రధానాలై నామమాత్రంగా మిగిలిపోతాయి. (29, 30 1/2)
బ్రాహ్మణాః శూద్రకర్మాణః తథా శూద్రా ధనార్జకాః ॥ 31
క్షత్రధర్మేణ వాప్యత్ర వర్తయంతి గతే యుగే ।
ఆ యుగసమాప్తికాలంలో బ్రాహ్మణులు శూద్రకర్మలను ఆచరిస్తారు. క్షాత్రధర్మంతో కూడ శూద్రులు ధనార్జనపరులవుతారు. (31 1/2)
నివృత్తయజ్ఞస్వాధ్యాయాః దండాజినవివర్జితాః ॥ 32
బ్రాహ్మణాః సర్వభక్షాశ్చ భవిష్యంతి కలౌ యుగే ।
అజపా బ్రాహ్మణాస్తాత శూద్రా జపపరాయణాః ॥ 33
నాయనా! కలియుగాంతంలో బ్రాహ్మణులు యజ్ఞస్వాధ్యాయాలనూ, దండాజినాలనూ వదలి సర్వభక్షకులై చరిస్తారు. బ్రాహ్మణులు జపాలను వీడితే శూద్రులు జపాసక్తులవుతారు. (32,33)
విపరీతే తదా లోకే పూర్వరూపం క్షయస్య తత్ ।
బహవో మ్లేచ్ఛరాజానః పృథివ్యాం మనుజాధిప ॥ 34
నరోత్తమా! లోకంలోని ఈ విపరీతప్రవర్తన ప్రళయానికి పూర్వరూపం. అప్పుడు మ్లేచ్ఛరాజులెందరో పృథివీపాలకులవుతారు. (34)
మృషానుశాసినః పాపాః మృషావాదపరాయణాః ।
ఆంధ్రాః శకాః పులిందాశ్చ యవనాశ్చ నరాధిపాః ॥ 35
కాంబోజా బాహ్లికాః శూరాః తథాఽఽభీరా నరోత్తమ ।
న తదా బ్రాహ్మణః కశ్చిత్ స్వధర్మముపజీవతి ॥ 36
నరోత్తమా! ఆ పాలకులు అందరూ వంచకులూ, పాపులూ, అసత్యవాదులై ఆంధ్ర, శక, పులింద, యవన, కాంబోజ, బాహ్లిక, శూర, ఆభీరదేశాలను పాలిస్తారు. (35,36)
క్షత్రియాశ్చాపి వైశ్యాశ్చ వికర్మస్థా నరాధిప ।
అల్పాయుషః స్వల్పబలాః స్వల్పవీర్యపరాక్రమాః ॥ 37
నరాధిపా! క్షత్రియులూ, వైశ్యులు కూడా స్వధర్మాన్ని వీడి అన్యకర్మల నాశ్రయించి అల్పాయుష్కులూ, అల్పబలులూ, అల్పవీర్యులూ, అల్పపరాక్రములూ అవుతారు. (37)
అల్పసారాల్పదేహాశ్చ తథా సత్యాల్పభాషిణః ।
బహుశూన్యా జనపదాః మృగవ్యాలావృతా దిశః ॥ 38
మనుజుల బలం, శారీరక శక్తి తగ్గుతుంది. వారి మాటలలో కొంచమే సత్యముంటుంది. జనపదాలన్నీ జనశూన్య ప్రాయాలవుతాయి. దిక్కులన్నీ జంతువులతో, సర్పాలతో నిండిపోతాయి. (38)
యుగాంతే సమనుప్రాప్తే వృథా చ బ్రహ్మవాదినః ।
భోవాదినస్తథా శూద్రా బ్రాహ్మణాశ్చార్యవాదినః ॥ 39
యుగాంతమేర్పడినప్పుడు అందరూ నిరర్థకంగా బ్రహ్మను గురించి మాటాడుతారు. శూద్రులు బ్రాహ్మణులను ఏరా (ఒరే) అంటారు. బ్రాహ్మణులు శూద్రులను తమరని సంబోధిస్తారు. (39)
యుగాంతే మనుజవ్యాఘ్ర భవంతి బహుజంతవః ।
న తథా ఘ్రాణయుక్తాశ్చ సర్వగంధా విశాంపతే ॥ 40
నరోత్తమా! రాజా! యుగాంతవేళలో రకరకాల ప్రాణులు ఉద్భవిస్తాయి. పరిమళద్రవ్యాలు పరిమళహీనాలుగా నాసికలకు తోస్తాయి. (40)
రసాశ్చ మనుజవ్యాఘ్ర న తథా స్వాదుయోగినః ।
బహుప్రజా హ్రస్వదేహాః శీలాచారవివర్జితాః ।
ముఖే భగాః స్త్రియో రాజన్ భవిష్యంతి యుగక్షయే ॥ 41
అట్టశూలా జనపదాః శివశూలాశ్చతుష్పథాః ।
కేశశూలాః స్త్రియో రాజన్ భవిష్యంతి యుగక్షయే ॥ 42
నరోత్తమా! రసవంతమయిన పదార్థాలు కూడా వెనుకటి వలె రుచించవు. రాజా! యుగాంతంలో స్త్రీలు పొట్టివారుగా ఉంటారు. సంతానమెక్కువ. వారు శీలాచారాలను విడిచివేస్తారు. నోటి నుండి బూతులనే పలుకుతారు.
రాజా! యుగాంతంలో జనపదాలలో అన్నాన్ని అమ్ముతారు. బ్రాహ్మణులు వేదాన్ని అమ్ముతారు. స్త్రీలు శీలాన్ని అమ్ముకొంటారు. (41,42)
అల్పక్షీరాస్తథా గావః భవిష్యంతి జనాధిప ।
అల్పపుష్పఫలాశ్చాపి పాదపా బహువాయసాః ॥ 43
బ్రహ్మవధ్యానులిప్తానాం తథా మిథ్యాభిశంసినామ్ ।
నృపాణాం పృథివీపాల ప్రతిగృహ్ణంతి వై ద్విజాః ॥ 44
రాజా! గోవులు తక్కువపాలనిస్తాయి. చెట్లపై పూలు, పండ్లు కూడా తగ్గుతాయి. చెట్లపై కాకులే ఎక్కువవుతాయి. రాజా! బ్రహ్మహత్య మొదలయిన పాపాలు చేస్తూ, అసత్యాలు పలికే ప్రభువుల నుండి బ్రాహ్మణులు స్వీకరిస్తారు. (43,44)
లోభమోహపరీతాశ్చ మిథ్యాధర్మధ్వజావృతాః ।
భిక్షార్థం పృథివీపాల చంచూర్యంతే ద్విజైర్దిశః ॥ 45
రాజా! బ్రాహ్మణులు లోభమోహాలకు గురియై, మిథ్యాచారమనే పతాకల్ను కప్పుకొని భిక్షకోసం దిక్కుల నన్నింటినీ (అందరినీ) పీడిస్తారు. (45)
కరభారభయాద్ భీతా గృహస్థాః పరిమోషకాః ।
మునిచ్ఛద్మాకృతిచ్ఛన్నాః వాణిజ్యముపజీవినః ॥ 46
మిథ్యా చ నఖరోమాణి ధారయంతి తదా ద్విజాః ।
గృహస్థులు పన్నుభారానికి భయపడి తప్పించుకొని తిరుగుతారు. బ్రాహ్మణులు మునివేషాల మాటున వ్యాపారాలు సాగిస్తారు. అప్పుడు నమ్మకం కలిగించటానికి గోళ్ళూ, గడ్డాలూ పెంచుకొంటారు. (46 1/2)
అర్థలోభాన్నరవ్యాఘ్ర తథా చ బ్రహ్మచారిణః ॥ 47
ఆశ్రమేషు వృథాచారాః పానపా గురుతల్పగాః ।
ఇహ లౌకికమీహంతే మాంసశోణీతవర్ధనమ్ ॥ 48
నరోత్తమా! ధనలోభంతో బ్రహ్మచారులు కూడా ఆశ్రమాల్లో దంభాచారులై, మద్యపానం చేస్తూ గురుపత్నులతో సంగమిస్తారు. మాంసాన్ని, రక్తాన్నీ పెంపొందించే ఐహిక సుఖాలనే ప్రజలు కోరుకొంటారు. (47,48)
బహుపాషండసంకీర్ణాః పరాన్నగుణవాదినః ।
ఆశ్రమా మనుజవ్యాఘ్ర భవిష్యంతి యుగక్షయే ॥ 49
నరోత్తమా! యుగాంతవేళలో ఆశ్రమాలన్నీ పాషండులతో నిండిపోతాయి. ఇతరుల ద్వారా లభించే భోజనాన్నే అందరూ గొప్పగా చెబుతారు. (49)
యథర్తువర్షీ భగవాన్ న తథా పాకశాసనః ।
న చాపి సర్వభీజాని సమ్యగ్ రోహంతి భారత ॥ 50
ఇంద్రుడు కూడా సకాలంలో వర్షాలు కురిపించడు. భారతా! అన్నిగింజలు సరిగా మొలకెత్తవు. (50)
హింసాభిరామశ్చ జనః తథా సంపద్యతేఽశుచిః ।
అధర్మఫలమత్యర్థం తదా భవతి చానఘ ॥ 51
అనఘా! జనులందరూ హింసను ఇష్టపడతారు. అపవిత్రులై మొలగుతారు. అధర్మఫలితం కూడా అప్పుడెక్కువగానే ఉంటుంది. (51)
తదా చ పృథివీపాల యో భవేద్ ధర్మసంయుతః ।
అల్పాయుః స హి మంతవ్యః న హి ధర్మోఽస్తి కశ్చన ॥ 52
రాజా! ఆ సమయంలో ధర్మతత్పరుడైనవాడు అల్పాయుష్కుడవుతాడు. ఎందుకంటే అప్పుడు ధర్మమంటూ ఏదీ ఉండదు. (52)
భూయిష్ఠం కూటమానైశ్చ పణ్యం విక్రీణతే జనాః ।
వణిజశ్చ నరవ్యాఘ్ర బహుమాయా భవంత్యుత ॥ 53
నరోత్తమా! జనులు దొంగతూకాలతో వస్తువులను అమ్ముతుంటారు. వర్తకులు కూడా రకరకాల మోసాలు చేస్తుంటారు. (53)
ధర్మిష్ఠాః పరిహీయంతే పాపీయాన్ వర్థతే జనః ।
ధర్మజ్య బలహానిః స్యాద్ అధర్మశ్చ బలీ తథా ॥ 54
ధర్మాత్ములు వెనుకబడతారు. పాపాత్ములు వర్ధిల్లుతారు. ధర్మం బలాన్ని కోలుపోతుంది. అధర్మం బలాన్ని పుంజుకొంటుంది. (54)
అల్పాయుషో దరిద్రాశ్చ ధర్మిష్ఠా మానవాప్తాథా ।
దీర్ఘాయుషః సమృద్ధాశ్చ విధర్మాణో యుగక్షయే ॥ 55
యుగాంతంలో ధర్మాత్ములు అల్పాయుష్కులూ, దరిద్రులూ అవుతారు. ధర్మభ్రష్టులు దీర్ఘాయుష్కులూ సమృద్ధులూ అవుతారు. (55)
నగరాణాం విహారేషు విధర్మణో యుగక్షయే ।
అధర్మిష్ఠైరుపాయైశ్చ్ ప్రజా వ్యవహరంత్యుత ॥ 56
యుగాంతవేళలో ధర్మభ్రష్టులు నగరవిహారాల్లో స్థావరాలు ఏర్పరచుకొని అధర్మపాయాలతో వ్యవహారాలు నడుపుతుంటారు. (56)
సంచయేన తథాల్పేన భవంత్యాఢ్యమదాన్వితాః ।
ధనం విశ్వాసతో న్యస్తం మిథో భూయిష్ఠశో నరాః ॥ 57
హర్తుం వ్యవసితా రాజన్ పాపాచారసమన్వితాః ।
నైతదస్తీతి మనుజాః వర్తంతే నిరపత్రపాః ॥ 58
రాజా! కొద్దిగా డబ్బు సమకూరగానే సంపన్నులమై పోయినట్లు పొగరు పడతారు. విశ్వాసంతో తమ దగ్గర ఇతరులు దాచుకొన్న ధనాన్ని చాలా మంది కాజేయాలని ప్రయత్నిస్తారు. పాపాత్ములై సిగ్గువిడిచి "మాదగ్గర నీదేమీ లేదు" అంటూ మోసగిస్తారు. (57,58)
పురుషాదాని సత్త్వాని పక్షిణోఽథ మృగాస్తథా ।
నగరాణాం విహారేషు చైత్యేష్వసి చ శేరతే ॥ 59
మనుష్యులను తినే జంతువులు, పక్షులు నగరాలలోని విహారస్థలాలలోనూ, దేవాలయాలలోనూ శయనిస్తాయి. (59)
సప్తవర్షాష్టవర్షాశ్చ స్త్రియో గర్భధరా నృప ।
దశద్వాదశవర్షానాం పుంసాం పుత్రః ప్రజాయతే ॥ 60
రాజా! స్త్రీలు ఏడెనిమిది సంవత్సరాల వయస్సులోనే గర్భాన్ని ధరిస్తారు. పది పండ్రెండు సంవత్సరాల వయస్సులోనే పురుషులకు పిల్లలు పుడతారు. (60)
భవంతి షోడశే వర్షే నరాః పలితినస్తథా ।
ఆయుఃక్షయో మనుష్యాణాం క్షిప్రమేవ ప్రపద్యతే ॥ 61
పదహారు సంవత్సరాల వయస్సులోనే తలనెరుస్తుంది. మనుష్యుల ఆయుస్సు త్వరగా క్షీణిస్తుంది. (61)
క్షీణాయుషో మహారాజ తరుణా వృద్ధశీలినః ।
తరుణానాం చ యచ్ఛీలం తద్ వృద్ధేషు ప్రజాయతే ॥ 62
మహారాజా! ఆయువు మందగించి యువకులే వృద్ధస్వభావానికి లోనవుతారు. వృద్ధులు యువకుల వలె ప్రవర్తిస్తారు. (62)
విపరీతాస్తదా నార్యః వంచయిత్వార్హతః పతీన్ ।
వ్యుచ్చరంత్యపి దుఃశీలాః దాసైః పశుభిరేవ చ ॥ 63
యుగాంతవేళలో విపరీతప్రవృత్తి గల స్త్రీలు యోగ్యులయిన తమ భర్తలను మోసగించి దుష్ప్రవర్తనలై సేవకులతోనూ, పశువులతోనూ వ్యభిచరిస్తారు. (63)
వీరపత్న్యస్తథా నార్యః సంశ్రయంతి నరాన్ నృప ।
భర్తారమపి జీవంతమ్ అన్యాన్ వ్యభిచరంత్యుత ॥ 64
రాజా! వీరపత్నులు కూడా పరపురుషులను ఆశ్రయిస్తారు. భర్త బ్రతికి ఉండగానే ఇతరులతో వ్యభిచరిస్తారు. (64)
తస్మిన్ యుగసహస్రాంతే సంప్రాప్తే చాయుషఃక్షయే ।
అనావృష్టిర్మహారాజ జాయతే బహువార్షికీ ॥ 65
మహారాజా! ఈ రీతిగా ఆయుఃక్షీణానికి కారణమైన సహస్రయుగాంతంలో చివరిదశ ముగియగానే దీర్ఘకాలం అనావృష్టి ఏర్పడుతుంది. (65)
తతస్తాన్యల్పసారాణి సత్త్వాని క్షుధితాని వై ।
ప్రలయం యాంతి భుయిష్ఠం పృథివ్యాం పృథివీపతే ॥ 66
భూపాలా! దానితో అల్పశక్తులయిన ప్రాణులలో చాలా భాగం ఆకలితో అలమటించి, నశించిపోతుంది. (66)
తతో దినకరైర్దీప్తైః సప్తభిర్మనుజాధిప ।
పీయతే సలిలం సర్వం సముద్రేషు సరిత్సు చ ॥ 67
నరపతీ! అప్పుడు ప్రజ్వరిల్లే కిరణాలు గల ఏడుగురు సూర్యులూ, నదులలో, సముద్రాలలో ఉన్న నీటినంతా త్రాగేస్తారు. (67)
యచ్చ కాష్ఠం తృణం చాపి శుష్కం చార్ద్రం చ భారత ।
సర్వం తద్ భస్మసాద్ భూతం దృస్యతే భరతర్షభ ॥ 68
భరతశ్రేష్ఠా! అప్పుడు తడిసిన, ఎండిన పుల్లలు, గడ్డీ మొత్తం భస్మమై కనిపిస్తుంది. (68)
తతః సంవర్తకో వహ్నిః వాయువా సహ భారత ।
లోకమావిశతే పూర్వమ్ ఆదిత్యైరుపశోషితమ్ ॥ 69
భారతా! ఆ తరువాత సంవర్తకమనే అగ్ని గాలితో కలిసి అంతకు ముందు సూర్యులు ఎండగట్టిన ఈ లోకంలో ప్రవేశిస్తుంది. (69)
తతః స పృథివీం భిత్త్వా ప్రవిశ్య చ రసాతలమ్ ।
దేవదానవయక్షాణాం భయం జనయతే మహత్ ॥ 70
ఆ తరువాత సంవర్తకాగ్ని భూమిని చీల్చుకొని రసాతలంలో ప్రవేశించి దేవతలకూ, దానవులకూ, యక్షులకూ మహాభయాన్ని కలిగిస్తుంది. (70)
నిర్దహాన్ నాగలోకం చ యచ్చ కించిత్ క్షితావిహ ।
అధస్తాత్ పృథివీపాల సర్వం నాశయతే క్షణాత్ ॥ 71
రాజా! నాగలోకాన్ని పూర్తిగా దహిస్తూ భూమికి అడుగున ఉన్న సమస్తాన్నీ క్షణకాలంలో అగ్ని నాశనం చేస్తాడు. (71)
తతో యోజన వింశానాం సహస్రాణి శతాని చ ।
నిర్దహత్యశివో వాయుః స చ సంవర్తకోఽనలః ॥ 72
అశుభకారణమైన ఆ గాలీ, ఆ సంవర్తకాగ్నీ కలసి అనేక వేల యోజనాల వరకు లోకాలను దహిస్తాయి. (72)
సదేవాసురగంధర్వం సయక్షోరగరాక్షసమ్ ।
తతో దహతి దీప్తః స సర్వమేవ జగద్ విభుః ॥ 73
ఈ విధంగా వ్యాపించి మండిపడే సంవర్తకాగ్ని దేవ, అసుర, గంధర్వ, యక్ష, నాగ, రాక్షసులతో సహా సమస్తజగత్తును భస్మం చేస్తుంది. (73)
తతో గజకులప్రఖ్యాః తడిన్మాలావిభూషితాః ।
ఉత్తిష్ఠంతి మహామేఘాః నభస్యద్భుతదర్శనాః ॥ 74
ఆపై గగనతలంలో మహామేఘసమూహాలు అద్భుతంగా కనిపిస్తాయి. అవి విద్యున్మాలలతో విభాసిస్తూ ఏనుగుల గుంపులవలె ప్రకాశిస్తాయి. (74)
కేచిన్నీలోత్పలశ్యామాః కేచిత్ కుముదసన్నిభాః ।
కేచిత్ కింజల్కసంకాశాః కేచిత్ పీతాః పయోధరాః ॥ 75
కేచిద్ధారిద్రసంకాశాః కారండవనిభాస్తథా ।
కేచిత్ కమలపత్రాభాః కేచిద్ధింగులసప్రభాః ॥ 76
కొన్నిమేఘాలు నల్లకలువల వంటివి. కొన్ని తెల్లకలువలవంటివి. కొన్ని కేసరాల వంటివి. కొన్ని పసుపువలె పచ్చనివి. కొన్ని గోరోచనవర్ణం కలవి. కొన్ని కారండవపక్షుల వంటివి. కొన్ని తామర రేకుల వంటివి. కొన్ని ఇంగిలీకం వలె కనిపించేవి. (75,76)
కేచిత్ పురవరాకారాః కేచిద్ గజకులోపమాః ।
కెచిదంజనసంకాశాః కేచిన్మకరసన్నిభాః ॥ 77
కొన్ని గొప్పనగరాలవలె కన్పించేవి. కొన్ని ఏనుగుల గుంపులను పోలినవి. కొన్ని కాటుకవలె నల్లనివి. కొన్ని మొసళ్ళ ఆకారంలో ఉండేవి. (77)
విద్యున్మాలాపినద్ధాంకాః సముత్తిష్ఠంతి వై ఘనాః ।
ఘోరరూపా మహారాజ ఘోరస్వననినాదితాః ।
తతో జలధారాః సర్వే వ్యాప్నువంతి నభస్తలమ్ ॥ 78
మహారాజా! ఆ మేఘాలు విద్యున్మాలలను అలంకరించుకొని ఎగిసి వస్తాయి. భయంకరంగా ఉరుముతూ, భీకరరూపంతో ఆ మేఘాలన్నీ గగనతలమంతా వ్యాపిస్తాయి. (78)
తైరియం పృథివీ సర్వా సపర్వతవనాకరా ।
ఆపూర్యతే మహారాజ సలిలౌఘపరిప్లుతా ॥ 79
మహారాజా! ఆ మేఘాలు కురిసి పర్వతాలకూ, అరణ్యాలకూ, అగాధాలకూ నెలవయిన ఈ భూమి అంతా జలప్రవాహంలో మునుగుతుంది. మొత్తం నీటితోనే నిండిపోతుంది. (79)
తతస్తే జలదా ఘోరాః రావిణః పురుషర్షభ ।
సర్వతః ప్లావయంత్యాశు చోదితాః పరమేష్ఠినా ॥ 80
నరోత్తమా! అప్పుడు ఉరుములతో భయంకరంగా ఉన్న ఆ మేఘాలు పరమేశ్వర ప్రేరణచే వెంటనే సమస్తాన్నీ జలమయం చేస్తాయి. (80)
వర్షమాణా మహత్ తోయం పూరయంతో వసుంధరామ్ ।
సుఘోరమశివం రౌద్రం నాశయంతి చ పావకమ్ ॥ 81
కుంభవృష్టి కురిపిస్తూ భూమిని ముంచెత్తుతూ ఆ మేఘాలు దారుణంగా, భీకరంగా, అమంగళకరంగా ఉన్న ఆ అగ్నిని చల్లార్చుతాయి. (81)
తతో ద్వాదశవర్షాణి పయోదాస్త ఉపప్లవే ।
ధారాభిః పూరయంతో వై చోద్యమానా మహాత్మనా ॥ 82
ఆపై ఆ ప్రళయపయోధరాలు బ్రహ్మప్రేరణతో పండ్రెండు సంవత్సరాల పర్యంతం ధారావాహికంగా వర్షిస్తాయి. (82)
తతః సముద్రః స్వాం వేలామతిక్రామతి భారత ।
పర్వతాశ్చ విదీర్యంతే మహీ చాప్సు నిమజ్జతి ॥ 83
భారతా! అప్పుడు సముద్రం తన హద్దులను అతిక్రమిస్తుంది. పర్వతాలు బ్రద్దలవుతాయి. భూమి నీట మునుగుతుంది. (83)
పర్వతః సహసా భ్రాంతాః తే పయోదా నభస్తలమ్ ।
సంవేష్టయిత్వా నశ్యంతి వాయువేగపరాహతాః ॥ 84
ఆకాశాన్ని కప్పి, వేగంగా అంతటా వ్యాపించిన ఆ మేఘాలు గాలితాకిడిచే ఛిన్నాభిన్నమై నశిస్తాయి. (84)
తతస్తం మారుతం ఘోరం స్వయంభూర్మనుజాధిప ।
ఆదిః పద్మాలయో దేవః పీత్వా స్వపితి భారత ॥ 85
నరోత్తమా! భారతా! ఆ తరువాత ఆదిదేవుడు, పద్మాలయుడు అయిన బ్రహ్మదేవుడు ఆ భీకరమారుతాన్ని మ్రింగి, నిద్రిస్తాడు. (85)
తస్మిన్నేకార్ణవే ఘోరే నష్టే స్థావరజంగమే ।
నష్టే దేవాసురగణే యక్షరాక్షసవర్జితే ॥ 86
రాజా! ఏకార్ణవజలంగా మారిన ఆ జగత్తులో స్థావర జంగమాలు నశించాయి. దేవాసురులు నశించారు. యక్షరాక్షసులు కనిపించలేదు. మనుష్యులు లేరు. (86)
నిర్మనుష్యే మహీపాల నిఃశ్వాపదమహీరుహే ।
అనంతరిక్షే లోకేఽస్మిన్ భ్రమామ్యేకోఽహమాహతః ॥ 87
జంతువులు లేవు. చెట్లు లేవు. అంతరిక్షం లేదు. అప్పుడు నేను ఒంటరిగా అటు ఇటూ తిరుగాడుతున్నాను. (87)
ఏకార్ణవే జలే ఘోరే విచరన్ పార్థివోత్తమ ।
అపశ్యన్ సర్వభూతాని వైక్లవ్యమగమం తతః ॥ 88
రాజోత్తమా! ఆ ఘోరమైన ఏకార్ణవజలంలో తిరుగుతున్న నాకు ప్రాణులేవీ కనిపించలేదు. దానితో కలతపడ్డాను. (88)
తతః సుదీర్ఘం గత్వాహం ప్లవమానో నరాధిప ।
శ్రాంతః క్వచిన్న శరణం లభామ్యహమతంద్రితః ॥ 89
రాజా! అప్పుడు నేను జాగుచేయకుండా చాలాదూరం ఈదుతూ పోయాను. బాగా అలిసిపోయాను. అయితే నాకు ఆగటానికి ఆశ్రయం దొరకలేదు. (89)
తతః కదాచిత్ పశ్యామి తస్మిన్ సలిలసంచయే ।
న్యగ్రోధం సుమహాంతం వై విశాలం పృథివీపతే ॥ 90
రాజా! ఆ తరువాత ఒకదినాన ఆ జలసంచయంలో బాగా పెద్దగా ఉన్న ఒక మర్రిచెట్టును చూచాను. (90)
శాఖాయాం తస్య వృక్షస్య విస్తీర్ణాయాం నరాధిప ।
పర్యంకే పృథివీపాల దివ్యాస్తరణసంస్తృతే ॥ 91
ఉపవిష్టం మహారాజ పద్మేందుసదృశాననమ్ ।
పుల్లపద్మవిశాలాక్షం బాలం పశ్యామి భారత ॥ 92
నరోత్తమా! నరపతీ! విశాలమైన ఆ మర్రిచెట్టు కొమ్మమీద దివ్యమైన పరుపు పరిచిన ఊయలలో కూర్చొని ఉన్న ఒక బాలుని చూచాను. కమలాలను కలువలను పోలిన వదనంతో, వికసించిన తామరరేకుల వంటి కన్నులతో ఆ బాలుడు కనిపించాడు. (91,92)
తతో మే పృథివీపాల విస్మయః సుమహానభూత్ ।
కథం త్వయం శిశుః శేతే లోకే నాశముపాగతే ॥ 93
రాజా! 'లోకమంతా నశిస్తే ఈ బాలుడిక్కడ ఎలా శయనించి ఉన్నా'?డని నాకు చాలా విస్మయం కలిగింది. (93)
తపసా చింతయంశ్చాపి తం శిశుం నోపలక్షయే ।
భూతం భవ్యం భవిష్యం చ జానన్నపి నరాధిప ॥ 94
నరాధిపా! నేను భూతవర్తమానభవిష్యత్తులు తెలిసినవాడను. అయినా తపోబలంతో ఆలోచించినా ఆ బాలుని గురించి తెలిసికొనలేకపోయాను. (94)
అతసీపుష్పవర్ణాభః శ్రీవత్సకృతభూషణః ।
సాక్షాల్లక్ష్మ్యా ఇవావాసః స తదా ప్రతిభాతి మే ॥ 95
అవిసిపూలవంటి దేహకాంతితో, శ్రీవత్సలాంఛనంతో ఆ బాలుడు సాక్షాత్తు లక్ష్మికి నివాసస్థానం వలె కనిపించాడు. (95)
తతో మామబ్రవీద్ బాలః స పద్మనిభలోచనః ।
శ్రీవత్సధారీ ద్యుతిమాన్ వాక్యం శ్రుతిసుఖావహమ్ ॥ 96
జానామి త్వాం పరిశ్రాంతం తతో విశ్రామకాంక్షిణమ్ ।
మార్కండేయ ఇహాస్స్వత్వం యావదిచ్ఛసి భార్గవ ॥ 97
అప్పుడు కమలలోచనుడు, శ్రీవత్సధారి, కాంతిమంతుడు అయిన ఆ బాలుడు చెవులకింపుగూర్చుతూ నాతో ఇలా అన్నాడు.
మార్కండేయా! నీవు అలిసి ఉన్నావు. విశ్రాంతిని కోరుతున్నావు. నాకు తెలుసు. నీ ఇష్టం వచ్చినంతసేపు ఇక్కడ కూర్చో. (96,97)
అభ్యంతరం శరీరే మే ప్రవిశ్య మునిసత్తమ ।
ఆస్ప్వభో విహితో వాసః ప్రసాదస్తే కృతో మయా ॥ 98
మునిసత్తమా! నిన్ను అనుగ్రహిస్తున్నాను. నాశరీరంలోనికి ప్రవేశించి కూర్చో. నీవసతికై అక్కడ ఏర్పాటు చేశాను. (98)
తతో బాలేన తేనైవమ్ ఉక్తస్యాసీత్ తదా మమ ।
నిర్వేదో జీవితే దీర్ఘే మనుష్యత్వే చ భారత ॥ 99
భారతా! ఆ బాలుడు ఆ విధంగా పలుకగానే నాకు జీవితం మీద, మనుష్యత్వం మీదా ఎంతో విరక్తి కలిగింది. (99)
తతో బాలేన తేనాస్యం సహసా వివృతం కృతమ్ ।
తస్యాహమవశో వక్త్రే దైవయోగాత్ ప్రవేశితః ॥ 100
అప్పుడు ఆ బాలుడు వెంటనే నోరు తెరిచాడు. నేను నాకు తెలియకుండానే దైవికంగా ఆ బాలుని నోట ప్రవేశించాను. (100)
తతః ప్రవిష్టస్తత్కుక్షిం సహసా మనుజాధిప ।
సరాష్ట్రనగరాకీర్ణాం కృత్స్నాం పశ్యామి మేదినీమ్ ॥ 101
రాజా! నోట ప్రవేశించిన వెంటనే నేను ఆ బాలుని ఉదరంలోనికి వెళ్ళాను. అక్కడ రాష్ట్రాలు, నగరాలతో కూడిన సమస్తపృథివీ నాకు కనిపించింది. (101)
గంగాం శతద్రుం సీతాం చ యమునామథ కౌశికీమ్ ।
చర్మణ్వతీం వేత్రవతీం చంద్రభాగాం సరస్వతీమ్ ॥ 102
సింధుం చైవ విపాశాం చ నదీం గోదావరీమపి ।
వస్వోకసారాం నలినీం నర్మదాం చైవ భారత ॥ 103
నదీం తామ్రాం చ వేణాం చ పుణ్యతోయాం శుభావహామ్ ।
సువేణాం కృష్ణవేణాం చ ఇరామాం చ మహానదీమ్ ॥ 104
వితస్తాం చ మహారాజ కావేరీం చ మహానదీమ్ ।
శోణం చ పురుషవ్యాఘ్ర విశల్యాం కింపునామపి ॥ 105
ఏతాశ్చాన్యాశ్చ నద్యోఽహం పృథివ్యాం యా నరోత్తమ ।
పరిక్రమన్ ప్రపశ్యామి తస్య కుక్షౌ మహాత్మనః ॥ 106
నరోత్తమా! మహాత్ముడైన ఆ బాలుని కుక్షిలో తిరుగుతూ నేను గంగ, శతద్రువు, సీత, యమున కౌశికి, చర్మణ్వతి, వేత్రవతి, చంద్రభాగ, సరస్వతి, సింధువు, విపాశ, గోదావరి, వస్వోకసార, నలిని, నర్మద, తామ్రపర్ణి, వేణ, పుణ్యతోయ, శుభావహ, సువేణ, కృష్ణవేణ, ఇరామ, మహానది, వితస్త, కావేరి, శోణ, విశల్య, కింపున మొదలుగా గల నదులను, భూలోకంలో ఉన్న ఇతరనదులను చూచాను. (102-106)
తతః సముద్రం పశ్యామి యాదోగణనిషేవితమ్ ।
రత్నాకరమమిత్రఘ్న పయసో నిధిముత్తమమ్ ॥ 107
శత్రుసంహారా! ఆపై జల జంతుసమూహాలతో నిండి ఉన్న గొప్ప సముద్రాన్ని కూడా చూచాను. అది పయోనిధి, రత్నాలకు నిలయం కూడా. (107)
తత్ర పశ్యామి గగనం చంద్రసూర్యవిరాజితమ్ ।
జాజ్వల్యమానం తేజోభిః పావకార్కసమప్రభమ్ ॥ 108
అక్కడ తేజస్సుతో వెలుగుతూ సూర్యాగ్నులవంటి కాంతి కలిగి చంద్రసూర్య విరాజితమైన గగనాన్ని చూచాను. (108)
పశ్యామి చ మహీం రాజన్ కాననైరుపశోభితామ్ ।
(సపర్వతవనద్వీపాం నిమ్నగాశతసంకులామ్ ।)
యజంతే హి తదా రాజన్ బ్రాహ్మణా బహుభిర్మఖైః ॥ 109
రాజా! అక్కడున్న నేలను చూచాను. అది అడవులతో, పర్వతాలతో, ద్వీపాలతో, వందలనదులతో విరాజిల్లుతోంది. అక్కడి బ్రాహ్మణులు వివిధయాగాలను నిర్వహిస్తున్నారు. (109)
క్షత్రియాశ్చ ప్రవర్తంతే సర్వవర్ణానురంజనైః ।
వైశ్యాః కృషిం యథాన్యాయం కారయంతి నరాధిప ॥ 110
రాజా! అన్ని వర్ణాలను అలరింపజేస్తూ క్షత్రియులు ప్రవర్తిస్తున్నారు. వైశ్యులు న్యాయమార్గంలో వ్యవసాయ వ్యాపారాలు చేస్తున్నారు. (110)
శుశ్రూషాయాం చ నిరతాః ద్విజానాం వృషలాస్తదా ।
తతః పరితపన్ రాజన్ తస్య కుక్షౌ మహాత్మనః ॥ 11
హిమవంతం చ పశ్యామి హేమకూటం చ పర్వతమ్ ।
నిషధం చాపి పశ్యామి శ్వేతం చ రజతాన్వితమ్ ॥ 112
పశ్యామి చ మహీపాల పర్వతం గంధమాదనమ్ ।
మందరం మనుజవ్యాఘ్ర నీలం చాపి మహాగిరిమ్ ॥ 113
పశ్యామి చ మహారాజ మేరుం కనకపర్వతమ్ ।
మహేంద్రం చైవ పశ్యామి వింధ్యం చ గిరిముత్తమమ్ ॥ 114
మలయం చాపి పశ్యామి పారియాత్రం చ పర్వతమ్ ।
ఏతే చాన్యే చ బహవః యావంతః పృథివీధరాః ॥ 115
తస్యోదరే మయా దృష్టాః సర్వే రత్నవిభూషితాః ।
సింహాన్ వ్యాఘ్రాన్ వరాహాంశ్చ పశ్యామి మనుజాధిప ॥ 116
శూద్రులు ద్విజుల శుశ్రూషలో ఆసక్తులై ఉన్నారు.
రాజా! ఇదంతా చూస్తూ నేను ఆ మహాత్ముని ఉదరంలో పరిభ్రమిస్తూ హిమవంతునీ, హేమకూట పర్వతాన్నీ, నిషధగిరినీ, తెల్లని వెండి కొండనూ, గంధమాదనపర్వతాన్నీ, మందరగిరినీ, నీలగిరినీ, స్వర్ణమయమైన మేరుపర్వతాన్నీ, మహేంద్రగిరినీ, శ్రేష్ఠమైన వింధ్యపర్వతాన్నీ, మలయపర్వతాన్నీ, పారియాత్రపర్వతాన్నీ చూశాను. వీటితోపాటు మరెన్నో కొండలను ఆ బాలకుని కుక్షిలో చూశాను. అవన్నీ కూడా రత్నాలనలంకరించుకొని ఉన్నాయి. రాజా! సింహాలనూ, పులులనూ, పందులనూ కూడా అక్కడ చూశాను. (111-116)
పృథివ్యాం యాని చాన్యాని సత్త్వాని జగతీపతే ।
తాని సర్వాణ్యహం తత్ర పశ్యన్ పర్యచరం తదా ॥ 117
రాజా! భూమిపై నున్న సమస్తప్రాణులనూ ఆ బాలకుని ఉదరంలో చూస్తూ ఆ సమయంలో పరిభ్రమించాను. (117)
కుక్షౌ తస్య నరవ్యాఘ్ర ప్రవిష్టః సంచరన్ దిశః ।
శక్రాదీంశ్చాపి పశ్యామి కృత్స్నాన్ దేవగణానహమ్ ॥ 118
నరోత్తమా! ఆ బాలకుని కుక్షిలో ప్రవేశించి దిక్కులన్నీ తిరుగుతూ దేవేంద్రుడు మొదలుగా గల సమస్తద్వగణాలనూ నేను చూశాను. (118)
సాధ్యాన్ రుద్రాంస్తథాఽఽదిత్యాన్ గుహ్యకాన్ పితరస్తదా ।
సర్పాన్ నాగాన్ సుపర్ణాంశ్చ వసూనప్యశ్వినావపి ॥ 119
గంధర్వాప్సరసో యక్షా నృషీంశ్చైవ మహీపతే ।
దైత్యదానవసంఘాంశ్చ నాగాంశ్చ మనుజాధిప ॥ 20
సింహికాతనయాంశ్చాపి యే చాన్యే సురశత్రవః ।
యచ్చ కించిన్మయా లోకే దృష్టం స్థావరజంగమమ్ ॥ 121
సర్వం పశ్యామ్యహం రాజన్ తస్య కుక్షౌ మహాత్మనః ।
చరమాణః ఫలాహారః కృత్స్నం జగదిదం విభో ॥ 122
రాజా! పండ్లనే ఆహారంగా తీసికొంటూ ఆ మహాత్ముని కుక్షిలో సంచరిస్తూ సాధ్యులను, రుద్రులను, ఆదిత్యులను, గుహ్యకులను, పితృదేవతలను, సర్పాలను, నాగులను, సుపర్ణులను, వసువులను, అశ్వినీదేవతలను, గంధర్వులను, అప్సరసలను, యక్షులనూ, మహర్షులను, దైత్యదానవ సమూహాలను, నాగులను, రాహువు మొదలయిన సింహికాపుత్రులను చూశాను. దేవతాశత్రువుల నందరినీ చూశాను. భూలోకంలో నేను చూసిన స్థావరజంగమాత్మకమైన సమస్తవిశ్వాన్ని నేను అక్కడ చూశాను. (119-122)
అంతః శరీరే తస్యాహం వర్షాణామధికం శతమ్ ।
న చ పశ్యామి తస్యాహం దేహస్యాంతం కదాచన ॥ 123
నూరుసంవత్సరాలకు పైగా ఆ బాలుని శరీరంలోనే ఉన్నాను. కానీ ఎప్పుడూ ఆ శరీరపు అంచులను నేను చూడలేదు. (123)
సతతం ధావమానశ్చ చింతయానో విశాంపతే ।
(భ్రమంస్తత్ర మహీపాల యదా వర్షగణాన్ బహూన్ ।)
ఆసాదయామి వైవాంతం తస్య రాజన్ మహాత్మనః ॥ 124
తతస్తమేవ శరణం గతోఽస్మి విధివత్ తదా ।
వరేణ్యం వరదం దేవం మనసా కర్మణైవ చ ॥ 125
రాజా! అదేపనిగా సంచరిస్తూ, ఆలోచిస్తూ ఎన్నో సంవత్సరాలు తిరిగినా ఆ శరీరానికి అంతాన్ని నేను చూడలేకపోయాను. అందువలన అప్పుడు వరేణ్యుడు, వరదుడు అయిన ఆ దేవునే మనసా, కర్మణా కూడా శాస్త్రోక్తరీతిలో శరణుకోరాను. (124,125)
తతోఽహం సహసా రాజన్ వాయువేగేణ నిఃసృతః ।
మహాత్మనో ముఖాత్ తస్య వివృతాత్ పురుషోత్తమ ॥ 126
పురుషోత్తమా! రాజా! అప్పుడు నేను వెంటనే వాయువేగంతో, తెరిచిన ఆ మహాత్ముని నోటినుండి వెలుపలికి వచ్చాను. (126)
తతస్తస్యైవ శాఖాయాం న్యగ్రోధస్య విశాంపతే ।
ఆస్తే మనుజశార్దూల కృత్స్నమాదాయ వై జగత్ ॥ 127
తేనైవ బాలవేషేణ శ్రీవత్సకృతలక్షణమ్ ।
ఆసీనం తం నరవ్యాఘ్ర పశ్యామ్యమితతేజసమ్ ॥ 128
నరోత్తమా! రాజా! ఆ మర్రిచెట్టు కొమ్మమీదనే శ్రీవత్సలాంఛనంతో, బాలవేషంతో, అమితతేజస్సుతో విశ్వాన్ని అంతా తనలో నింపుకొని కూర్చొని ఉన్న ఆ మహాత్ముని చూశాను. (127,128)
తతో మామబ్రవీద్ బాలః స ప్రీతః ప్రహసన్నివ ।
శ్రీవత్సధారీ ద్యుతిమాన్ పీతవాసా మహాద్యుతిః ॥ 129
అప్పుడు శ్రీవత్సధారి, కాంతిమంతుడు, పీతాంబరుడు, తేజస్స్వరూపుడు అయిన ఆ బాలుడు సమ్తసించి నవ్వుతూ నాతో ఇలా అన్నాడు. (129)
అపీదానీం శరీరేఽస్మిన్ మామకే మునిసత్తమ ।
ఉషితస్త్వం సువిశ్రాంతః మార్కండేయ బ్రవీహి మే ॥ 130
మునివరా! మార్కండేయా! నా శరీరంలో ఉండి చక్కడా విశ్రాంతిని పొందావా? నాకు చెప్పు. (130)
ముహూర్తాదథ దృష్టిః ప్రాదుర్భూతా పునర్నవా ।
యయా నిర్ముక్తమాత్మానమ్ అపశ్యం లబ్ధచేతసమ్ ॥ 131
ముహూర్తకాలంలో నాకు మరల క్రొత్తదృష్టి వచ్చింది. దానితో మాయనుండి వెలువడి నేను చైతన్యాన్ను పొందాను. (131)
తస్య తామ్రతలౌ తాత చరణౌ సుప్రతిష్ఠితౌ ।
సుజాతౌ మృదురక్తాభిః అమ్గులీభిర్విరాజితౌ ॥ 132
ప్రయత్నేన మయా మూర్ధ్నా గృహీత్వా హ్యభివందితౌ ।
నాయనా! మృదువుగా రక్తవర్ణంతో ప్రకాశిస్తున్న వ్రేళ్ళతో వెలుగొందుతూ బాగా ఎఱ్ఱగా ఉన్న ఆ బాలుని సుందరసుప్రతిష్ఠిత పాదాలను ప్రయత్నపూర్వకంగా నేను శిరసా వహించి నమస్కరించాను. (132 1/2)
దృష్ట్వాఽపరిమితం తస్య ప్రభావమమితౌజసః ॥ 133
వినయేనాంజలిం కృత్వా ప్రయత్నేనోపగమ్య హ ।
దృష్టో మయా స భూతాత్మా దేవః కమలలోచనః ॥ 134
అమితతేజోమూర్తియైన ఆయన అపరిమిత ప్రభావాన్ని గ్రహించి, వినయంతో చేతులు జోడించి, ప్రయత్నపూర్వకంగా సమీపించి సర్వప్రాణి స్వరూపుడయిన ఆ దేవుని పుండరీకాక్షుని చూశాను. (133,134)
తమహం ప్రాంజలిర్భూత్వా నమస్కృత్యేదమబ్రువమ్ ।
జ్ఞాతుమిచ్ఛామి దేవ త్వాం మాయాం చైతాం తవోత్తమామ్ ॥ 135
చేతులు జోడించి నమస్కరించి ఆయనతో ఇలా పలికాను. దేవా! నిన్నూ, ఉత్తమమైన నీ మాయనూ తెలియగోరుతున్నాను. (135)
ఆస్యేనానుప్రవిష్టోఽహం శరీరే భగవంస్తవ ।
దృష్టవానఖిలాన్ సర్వాన్ సమస్తాన్ జఠరే హి తే ॥ 136
స్వామీ! నీ నోటిద్వారా నీ శరీరంలోనికి ప్రవేశించిన నేను నీ ఉదరంలోనే సమస్తసంసార స్వరూపాన్నీ చూశాను. (136)
తవ దేవ శరీరస్థాః దేవదానవరాక్షసాః ।
యక్షగంధర్వనాగాశ్చ జగత్ స్థావరజంగమమ్ ॥ 137
దేవా! దేవతలు, దానవులు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు, నాగులు - స్థావరజంగమాత్మకమయిన జగత్తంతా నీశరీరంలోనే ఉన్నది. (137)
త్వత్ర్పసాదాశ్చ మే దేవ స్మృతిర్న పరిహీయతే ।
ద్రుతమంతఃశరీరే తే సతతం పరివర్తినః ॥ 138
దేవా! నీ అనుగ్రహం వలననే నీ శరీరంలో నిరంతరంగా వేగంగా పరిభ్రమిస్తున్నా నాకు స్పృతి తొలగిపోలేదు. (138)
నిర్గతోఽహమకామస్తు ఇచ్ఛయా తే మహాప్రభో ।
ఇచ్ఛామి పుండరీకాక్ష జ్ఞాతుం త్వాహమనిందితమ్ ॥ 139
మహాప్రభూ! పుండరీకాక్షా! నేను కోరుకొనకపోయినా నీ ఇచ్చననుసరించి వెలుపలికి వచ్చాను. సర్వోన్నతుడవైన నిన్నుగురించి తెలియగోరుతున్నాను. (139)
ఇహ భూత్వా శిశుః సాక్షాత్ కిం భవానవతిష్ఠతే ।
పీత్వా జగదిదం సర్వమ్ ఏతదాఖ్యాతుమర్హసి ॥ 140
సమస్త విశ్వాన్నీ లోపల నిలుపుకొని కూడా సాక్షాత్తూ శిశురూపంలో ఇక్కడ ఎందుకున్నావు? దానిని చెప్పవలసినది. (140)
కిమిర్థం చ జగత్ సర్వం శరీరస్థం తవానఘ ।
కియంతం చ త్వయా కాలమిహ స్థేయమరిందమ ॥ 141
అనఘా! జగత్తంతా నీ శరీరంలో ఎందుకున్నది? అరిందమా! ఎంతకాలం నీవిక్కడే ఉండవలసి ఉన్నది? (141)
ఏతదిచ్ఛామి దేవేశ శ్రోతుం బ్రాహ్మణకామ్యయా ।
త్వత్తః కమలపత్రాక్ష విస్తరేణ యథాతథమ్ ॥ 142
దేవేశా! పుండరీకాక్షా! బ్రాహ్మణుడను కాబట్టి జిజ్ఞాస వలన నీనుండి దీనిని యథాతథంగా వినగోరుతున్నాను. (142)
మహద్ధ్యేతదచింత్యం చ యదహం దృష్టవాన్ ప్రభో ।
ఇత్యుక్తః స మయా శ్రీమాన్ దేవదేవో మహాద్యుతిః ।
సాంత్వయన్ మామిదం వాక్యమువాచ వదతాం వరః ॥ 143
నేను చూచినదంతా ఊహకందని మహావిషయం. నేనలా అనగానే వాగ్మి, దేవదేవుడు, కాంతిమంతుడు అయిన విష్ణువు నన్ను అనునయిస్తూ ఇలా అన్నాడు. (143)
ఇతి శ్రీమహాభారతే వనపర్వని మార్కండేయసమాస్యాపర్వణి అష్టాశీత్యధికశతతమోఽధ్యాయః ॥ 188 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున నూటఎనుబది యెనిమిదవ అధ్యాయము. (188)
(దాక్షిణాత్య అధికపాఠం 1 శ్లోకం కలిపి మొత్తం 144 శ్లోకాలు.)