261. రెండువందల అరువది ఒకటవ అధ్యాయము

ముద్గలుడు స్వర్గలోకమును నిరాకరించుట - వ్యాసుడు యుధిష్ఠిరుని ఓదార్చి వెడలుట.

దేవదూత ఉవాచ
మహర్షే ఆర్యబుద్ధిస్త్వం యః స్వర్గసుఖముత్తమమ్ ।
సంప్రాప్తం బహు మంతవ్యం విమృశస్యబుధో యథా ॥ 1
దేవదూత ఇలా అన్నాడు - మహర్షీ! నీవు ఉత్తమమైన బుద్ధి కలవాడవు. స్వర్గసుఖాలు ఉత్తమమైనవని చాలామంది అనుకొంటూ ఉంటారు. దానిని నీవు పొందావు. అయినా పామరుని వలె గుణదోషాలను గూర్చి ఆలోచిస్తున్నావు. (1)
ఉపరిష్టాదసౌ లోకో యోఽయం స్వరితి సంజ్ఞితః ।
ఊర్ధ్వగః సత్పథః శశ్వద్ దేవయానచరో మునే ॥ 2
మునీ! స్వర్లోకమని చెప్పబడే లోకం ఇక్కడికి చాలాపైన ఉంది. ఆ మార్గం చాలా ఉత్తమం. కనుకనే దానిని ఊర్ధ్వగమని, సత్పథమని అంటారు. అక్కడి వారు ఎల్లప్పుడూ విమానాల మీద విహరిస్తూ ఉంటారు. (2)
వి॥సం॥ స్వర్లోకమంటే సుఖలోకం.
యన్న దుఃఖేన సంభిన్నం న చ గ్రస్తమనంతరమ్ ।
అభిలాషోపనీతం యత్ తత్సుఖం స్వఃపదాస్పదమ్ ॥ అను శ్రుతివచనం, సుఖప్రధానమైనది కాబట్టి సుఖలోకానికి కూడా సుఖమని వ్యవహారం. (నీల)
నాతప్తతపసః పుంసః నామహాయజ్ఞయాజినః ।
నానృతా నాస్తికాశ్చైవ తత్ర గచ్ఛంతి ముద్గల ॥ 3
ముద్గలా! తపస్సు చేయనివారు, గొప్పగొప్ప యజ్ఞాలు చేయనివారు, అసత్యవాదులు, నాస్తికులు అక్కడికి వెళ్లలేరు. (3)
ధర్మాత్మానో జితాత్మానః శాంతా దాంతా విమత్సరాః ।
ధానధర్మరతా మర్త్యాః శురాశ్చాహవలక్షణాః ॥ 4
తత్ర గచ్ఛంతి ధర్మాగ్ర్ర్యం కృత్వా శమదమాత్మకమ్ ।
లోకాన్ పుణ్యకృతాం బ్రహ్మన్ సద్భిరాచరితాన్ నృభిః ॥ 5
బ్రాహ్మణోత్తమా! ధర్మాత్ములు, మనసును అదుపుతో ఉంచుకొన్నవారు, శాంతులు, దాంతులు, మాత్సర్యం లేనివారు, దానధర్మపరాయణులు, యుద్ధకళాకుశలులైన శూరులు - వీరు మాత్రమే శమదమాత్మకమైన ధర్మాన్ని ప్రధానంగా చేసుకొని, సత్పురుషులు సంచరించే పుణ్యలోకాలను చేరుకొంటారు. (4,5)
దేవాః సాధ్యాస్తథా విశ్వే తథైవ చ మహర్షయః ।
యామా ధామాశ్చ మౌద్గల్య గంధర్యాప్సరసస్తథా ॥ 6
ఏషాం దేవనికాయానాం పృథక్ పృథగనేకశః ।
భాస్వంతః కామసంపన్నాః లోకాస్తేజోమయాః శుభాః ॥ 7
మౌధ్గల్యా! అక్కడ దేవతలు, సాధ్యులు, విశ్వేదేవులు, మహర్షులు, యాములు, ధాములు, గంధర్వులు, అప్సరసలు - మొదలైన దేవసమూహాలకు వేరువేరుగా అనేకములైన లోకాలున్నాయి. అవి ప్రకాశమానములైనవి; ఇచ్ఛారూపమైన భోగాలతో కూడినవి, తేజోమయములు, మంగళప్రదములూ. (6,7)
త్రయస్త్రింశత్సహస్రాణి యోజనాని హిరణ్మయః ।
మేరుః పర్వతరాడ్ యత్ర దేవోద్యానాని ముద్గల ॥ 8
నందనాదీని పుణ్యాని విహారాః పుణ్యకర్మణామ్ ।
న క్షుత్పిపాసే న గ్లానిః న శీతోష్ణే భయం తథా ॥ 9
ముద్గలా! ఆ స్వర్గంలో ముప్పది మూడువేల యోజనాలు విస్తృతికల బంగారుమయమైన మేరుపర్వతం ఉంది. పుణ్యాత్ములు విహరించే నందనం మొదలైన దేవోద్యానాలు ఉన్నాయి. అక్కడ ఆకలిదప్పులు గాని, అలసటగాని, శీతోష్ణాల వలన భయంకాని ఉండవు. (8,9)
బీభత్సమశుభం వాపి తత్ర కించిన్న విద్యతే ।
మనోజ్ఞాః సర్వతో గంధాః సుఖస్పర్శాశ్చ సర్వశః ॥ 10
శబ్దాః శ్రుతిమనోగ్రాహ్యాః సర్వతస్తత్ర వై మునే ।
న శోకో న జరా తత్ర నాయాసపరిదేవనా ॥ 11
అక్కడ జుగుప్సాపూరితమైన, అమంగళకరమైన వస్తువులు ఏవీ ఉండవు. సుగంధాలు మనసును మురిపిస్తాయి. అంతటా స్పర్శ సుఖకరమై ఉంటుంది. శబ్దాలు అక్కడంతటా చెవిని, మనసును ఆకట్టుకొనేలా ఉంటాయి. మునీ! అక్కడ శోకం ఉండదు. అలసట గాని, విలాపాలు గాని ఉండవు. (10,11)
ఈదృశః స మునే లోకః స్వకర్మఫలహేతుకః ।
సుకృతైస్తత్ర పురుషాః సంభవంత్యాత్మకర్మభిః ॥ 12
మహర్షీ! ఇటువంటి స్వర్గలోకం తమతమ సత్కర్మలకు ఫలంగానే పొందదగింది. మానవులు తాము చేసిన పుణ్యకర్మల వలన అక్కడ ఉండగలుగుతారు. (12)
తైజసాని శారీరాణి భవంత్యత్రోపపద్యతామ్ ।
కర్మజాన్యేవ మౌద్గల్య న మాతృపితృజాన్యుత ॥ 13
ముద్గలా! అక్కడివారి శరీరాలు తేజోరూపాలుగా ఉంటాయి. అంతేకాని మాతాపితరుల యొక్క రజోవీర్యాల వలన కలిగినవి కావు. (13)
న సంస్వేదో న దౌర్గంధ్యం పురీషం మూత్రమేవ చ ।
తేషాం న చ రజో వస్త్రం బాధతే తత్ర వై మునే ॥ 14
మునీ! అక్కడ ఉన్నవారికి చెమటపట్టదు. దుర్వాసన ఉండదు. మల మూత్రాలు ఉండవు. వారి వస్త్రాలు మాసిపోవు. (14)
న మ్లాయంతి స్రజస్తేషాం దివ్యగంధా మనోరమాః ।
సంయుజ్యంతే విమానైశ్చ బ్రహ్మన్నేవంవిధైశ్చ తే ॥ 15
దివ్యమైన సువాసనలు వెదచల్లుతూ, మనోజ్ఞంగా ఉండే వారి పూలమాలలు వాడిపోవు. ఆ రీతిగా ఉండే విమానాలే వారందరికీ ఉంటాయి. (15)
ఈర్ష్యాశోకక్లమాపేతాః మోహమాత్సర్యవర్జితాః ।
సుఖం స్వర్గజితస్తత్ర వర్తయంతే మహామునే ॥ 16
వారు అసూయకు, శోకానికి, అలసటకు దూరంగా ఉంటారు. మోహం, మాత్సర్యం వారికి ఉండవు. మహామునీ! తమ సత్కర్మల చేత స్వర్గాన్ని పొందినవారు సుఖంగా జీవిస్తారు. (16)
తేషాం తథావిధానాం తు లోకానాం మునిపుంగవః ।
ఉపర్యుపరి లోకస్య లోకా దివ్యా గుణాన్వితాః ॥ 17
మునిపుంగవా! పైన వర్ణింపబడిన దేవతల యొక్క ఆ లోకాలకు పైన గుణసంపన్నమైన దివ్యలోకాలెన్నో ఉన్నాయి. (17)
పరస్తాద్ బ్రాహ్మణాస్తత్ర లోకాస్తేజోమయాః శుభాః ।
యత్ర యాన్త్యృషయో బ్రహ్మన్ పూతాః స్త్వైః కర్మభిః శుభైః ॥ 18
అన్నిటికంటెపైన తేజోమయమైన మంగళకరమైన బ్రహ్మలోకం ఉంది. అక్కడకు శుభకర్మలు చేసి పవిత్రులైన ఋషులు వెడతారు. (18)
ఋభవో నామ తత్రాన్యే దేవానామపి దేవతాః ।
తేషాం లోకాత్ పరతరే యాన్ యజంతీహ దేవతాః ॥ 19
దేవతల లోకాలకంటే ఉత్కృష్టమైన ఇంకొక లోకం ఉంది. దేవతలకు కూడా ఆరాధ్యులైన ఋభువులు అనే దేవతలు అక్కడ ఉంటారు. దేవతలు వారిని పూజిస్తూ ఉంటారు. (19)
స్వయంప్రభాస్తే భాస్వంతో లోకాః కామదుఘాః సరే ।
న తేషాం స్త్రీకృతాస్తాపః న లోకైశ్వర్యమత్సరః ॥ 20
ఆ ఉత్తమమైన లోకాలు స్వయంప్రకాశాలు, తేజస్వంతాలు. కోరికలను తీర్చేవి. అక్కడున్నవారికి స్త్రీసంబంధమైన బాధలు లేవు. లోకాలలోని ఐశ్వర్యాని గూర్చి, వారికి మాత్సర్యం లేదు. (20)
న వర్తయంత్యాహుతిభిః తే నాప్యమృతభోజనాః ।
తథా దివ్యశరీరాస్తే న చ్ విగ్రహమూర్తయః ॥ 21
వారు ఆహుతులతో జీవించరు. అమృతాన్ని భుజించవలసిన అవసరం కూడా లేదు. వారు దివ్యశరీరులు. ఆకారాలు లేనివారు. (21)
న సుఖే సుఖకామాస్తే దేవదేవాః సనాతనాః ।
న కల్పపరివర్తేషు పరివర్తంతి తే తథా ॥ 22
వారు సుఖంలోనే ఉంటారు. కాని సుఖాన్ని కోరుకోరు. దేవతలకు కూడా దేవతలైన వారు సనాతనులు. కల్పాలు మారినా వారు మాత్రం మారరు. ఎప్పటిలాగే ఉంటారు. (22)
జరా మృత్యుః కుతస్తేషాం హర్షః ప్రీతిః సుఖం న చ ।
న దుఃఖం న సుఃఖం చాపి రాగద్వేషా కుతో మునే ॥ 23
మునీ! హర్షం, ప్రీతి, సుఖం మొదలైన భావాలే వారికి ఉండవు. ఇక చావు పుట్టుకలు ఎక్కడివి? ఇక సుఖం, దుఃఖం, రాగద్వేషాలు ఎక్కడుంటాయి? (23)
దేవానామపి మౌద్గల్య కాంక్షితా సా గతిః పరా ।
దుష్ర్పాపా పరమా సిద్ధిః అగమ్యా కామగోచరైః ॥ 24
మౌద్గల్యా! స్వర్గవాసులైన దేవతలు కూడా ఆ ఉత్తమగతిని పొందాలని కోరుకొంటారు. ఆ పరమ సిద్ధి పొందడం దుర్లభం. కామవాసనలు గలవారు చేరలేనిది. (24)
త్రయస్త్రింశదిమే దేవాః యేషాం లోకా మనీషిభిః ।
గమ్యంతే నియమైః శ్రేష్ఠైః దానైర్వా విధిపూర్వకైః ॥ 25
ముప్పది మూడు మంది దేవతలు ఉండే ఈ లోకాలను మనుషులు ఉత్తమనియమాల ద్వారా గాని విధిపూర్వకమైన దానాల ద్వారా గాని చేరుకోగలరు. (25)
సేయం దానకృతా వ్యుష్టిః అనుప్రాప్తా సుఖం త్వయా ।
తాం భుంక్ష్వ సుకృతైర్లబ్ధాం తపసా ద్యోతితప్రభః ॥ 26
ఆ సుఖసంపత్తిని నీవు నీ దానకారణం ద్వారా పొందగలిగావు. తపస్సుచేత విరాజమానుడవై పుణ్యం చేత లభించే దానిని అనుభవించు. (26)
ఏతత్ స్వర్గసుఖం విప్ర లోకా నానావిధాస్తథా ।
గుణాః స్వర్గస్య ప్రోక్తాస్తే దోషానపి నిబోధ మే ॥ 27
విప్రవర్యా! ఇదీ స్వర్గసుఖం అంటే. ఈ లోకాలు రకరకాలుగా ఉంటాయి. స్వర్గంలో ఉండే గుణాలు చెప్పాను. దోషాలు కూడా నీకు చెప్తాను విను. (27)
కృతస్య కర్మణస్తత్ర భుజ్యతే యత్ ఫలం దివి ।
న చాన్యత్ క్రియతే కర్మ మూలచ్ఛేదేన భుజ్యతే ॥ 28
చేసినపనికి ఫలితాన్నే ఆ స్వర్గంలో అనుభవిస్తారు. అంతే తప్ప వేరే ఏ కర్మా చేయడానికి వీలుకాదు. ఆ ఫలితం అంతా తరిగిపోయేవరకు భోగాలు ప్రాప్తిస్తాయి. (28)
సోఽత్ర దోషో మమ మతః తస్యాంతే పతనం చ యత్ ।
సుఖవ్యాప్తమనస్కానాం పతనం యచ్చ ముద్గల ॥ 29
ముద్గలా! పుణ్యకర్మలకు భోగాలు అనుభవించడం పూర్తి అయ్యాక అక్కడి నుండి పతనం కాకతప్పదు! ఇదే స్వర్గంలోని దోషమని నా ఉద్దేశ్యం. సుఖాలలో మనస్సు లగ్నమయిన వారికి పతనం కావడం ఎంతోకష్టం. (29)
అసంతోషః పరీతాపః దృష్ట్వా దీప్తతరాః శ్రియః ।
యద్ భవత్యవరే స్థానే స్థితానాం తత్ సుదుష్కరమ్ ॥ 30
స్వర్గంలో కూడా క్రిందిస్థాయిలో ఉన్నవారు తమకంటె పైలోకాలలో ఉన్నవారి సముజ్జ్వల సంపత్తిని చూచి అసంతుష్టిని, పరితాపాన్ని పొందడం చాలా బాధాకరమైన విషయం. (30)
సంజ్ఞామోహశ్చ పతతాం రజసా చ ప్రధర్షణమ్ ।
ప్రమ్లానేషు చ మాల్యేషు తతః పిపతిషోర్భయమ్ ॥ 31
స్వర్గాన్నుండి జారిపోయేసమయంలో వారికి తెలివి లోపించిపోతుంది. రజోగుణం చేత బుద్ధి నశిస్తుంది. హారాలు వాడిపోవడం ద్వారా వారికి తమపతనం గురించి తెలిపి, మనసులో మహాభయం కలుగుతుంది. (31)
ఆ బ్రహ్మభవనాదేతే దోషా మౌద్గల్య దారుణాః ।
నాకలోకే సుకృతినాం గుణాస్త్వయుతశో నృణామ్ ॥ 32
మౌద్గల్యా! బ్రహ్మలోకపర్యంతం అన్నిలోకాలలోను ఈ దారుణమైన దోషాలు ఉన్నాయి. స్వర్గలోకంలో ఉండే పుణ్యాత్ముల గుణాలు మాత్రం పదివేలు. (32)
అయం త్వన్యో గుణః శ్రేష్ఠః చ్యుతానాం స్వర్గతో మునే ।
శుభానుశయయోగేన మునుష్యేషూపజాయతే ॥ 33
మునీ! స్వర్గం నుండి పతనమయ్యేవారిలో ఇంకొక మంచిగుణం ఉంది. తాముచేసిన పుణ్యకర్మల యొక్క సంస్కారం వలన మనుష్యులలోనే జన్మిస్తారు. (33)
తత్రాపి స మహాభాగః సుఖభాగభిజాయతే ।
న చేత్ సంబుధ్యతే తత్ర గచ్ఛత్యధమతాం తతః ॥ 34
అక్కడ కూడా ఆ మహాభాగుడు సుఖసాధనసంపత్తితోనే జన్మిస్తాడు. అప్పుడు మాత్రం తన కర్తవ్యం గుర్తించలేకపోతే అంతకంటె అధమగతిని పొందుతాడు. (34)
ఇహ యత్ క్రియతే కర్మ తత్ పరత్రోపభుజ్యతే ।
కర్మభూమిరియం బ్రహ్మన్ ఫలభూమిరసౌ మతా ॥ 35
బ్రాహ్మణోత్తమా! ఇక్కడ కర్మలు చేస్తారు. ఫలితాలు అక్కడ అనుభవిస్తారు. ఇది కర్మభూమి, అది ఫలభూమి అని భావిస్తారు. (35)
ముద్గల ఉవాచ
మహాంతస్తు అమీ దోషాః త్వయా స్వర్గస్య కీర్తితాః ।
నిర్దోష ఏవ యస్త్వన్యో లోకం తం ప్రవదస్వ మే ॥ 36
ముద్గలుడు అడుగుతున్నాడు - "స్వర్గంలో ఉండే ఈ మహాదోషం గురించి నీవు చెప్పావు. కాని దోషం లేని వేరే ఇంకొక లోకమేదైనా ఉంటే దానిని గురించి చెప్పు." (36)
దేవదూత ఉవాచ
బ్రహ్మణః సదనాదూర్ధ్వం తద్ విష్ణోః పరమం పదమ్ ।
శుద్ధం సనాతనం జ్యోతిః పరం బ్రహ్మేతి యద్ విదుః ॥ 37
దేవదూత చెపుతున్నాడు - "బ్రహ్మలోకానికి పైన విష్ణువుయొక్క పరమపదం ఉంది. అది శుద్ధము, సనాతనము, జ్యోతిర్మయము అయినది. దానిని పరబ్రహ్మ అని కూడా అంటారు. (37)
న తత్ర విప్ర గచ్ఛంతి పురుషా విషయాత్మకాః ।
దంభలోభమహాక్రోధమోహద్రోహైరభిద్రుతాః ॥ 38
విప్రుడా! విషయలాలసులైన వారు అక్కడకు వెళ్లలేరు. దంభం, లోభం, మహాక్రోధం, మోహం, ద్రోహం - ఈ దోషాలతో కూడినవారు కూడా అక్కడకు చేరుకోలేరు. (38)
నిర్మమా నిరహంకారాః నిర్ద్వంద్వాః సంయతేంద్రియాః ।
ధ్యానయోగపరాశ్చైవ తత్ర గచ్ఛంతి మానవాః ॥ 39
అహంకారం, మమకారం లేనివారు, ద్వంద్వరహితులు, ఇంద్రియనిగ్రహం కలవారు, ధ్యానయోగపరులు అయిన వారు మాత్రమే అక్కడకు వెళ్లగలరు. (39)
ఏతత్ తే సర్వమాఖ్యాతం యన్మాం పృచ్ఛసి ముద్గల ।
తవానుకంపయా సాధో సాధు గచ్ఛామ మాచిరమ్ ॥ 40
ముద్గలా! నీవు నన్ను అడిగినదంతా నీకు చెప్పాను. సాధుపురుషా! ఇక నీవు దయచూపితే మనం చక్కగా స్వర్గానికి వెడదా. ఆలస్యం చేయకు. (40)
వ్యాస ఉవాచ
తచ్ర్ఛుత్వా తు మౌద్గల్యః వాక్యం విమమృశే ధియా ।
విమృశ్య చ మునిశ్రేష్ఠః దేవదూతమువాచ హ ॥ 41
ఇదంతా విని మౌద్గల్యుడు తనబుద్ధితో ఆలోచించాడు. అలా ఆలోచించి ఆ మునిశ్రేష్ఠుడు దేవదూతతో ఇలా అన్నాడు. (41)
దేవదూత నమస్తేఽస్తు గచ్ఛ తాత యథాసుఖమ్ ।
మహాదోషేణ మే కార్యం న స్వర్గేణ సుఖేన వా ॥ 42
"దేవదూతా! నీకు నమస్కారం. తండ్రీ! ఇక నీవు సుఖంగా వెళ్లిరా. మహాదోషంతో కూడిన ఆ స్వర్గంతో కాని, సుఖంతో కాని నాకు పనిలేదు. (42)
పతనాంతే మహద్ దుఃఖం పరితాపః సుదారుణః ।
స్వర్గభాజశ్చరంతీహ తస్మాత్ స్వర్గం న కామయే ॥ 43
స్వర్గాన్ని పొందినవారు పతనమయ్యాక అతిభయంకరమైన మహాదుఃఖాన్ని పరితాపాన్ని పొందుతారు. మళ్లీ ఇక్కడే తిరుగుతూ ఉంటారు. కాబట్టి నేను స్వర్గాన్ని కోరుకోను. (43)
యత్ర గత్వా న శోచంతి న వ్యథంతి చలంతి వా ।
తదహం స్థానమత్యంతం మార్గయిష్యామి కేవలమ్ ॥ 44
శోకం లేనిచోటికి, వ్యధ లేనిచోటికి, చలనం లేనిచోటికి వెళ్లాలని దాని కోసం అన్వేషిస్తున్నాను. (44)
ఇత్యుక్త్వా స మునిర్వాక్యం దేవదూతం విసృజ్యతమ్ ।
శిలోంఛవృత్తిర్ధర్మాత్మా శమమాతిష్ఠదుత్తమమ్ ॥ 45
ఆ ముని దేవదూతకు ఇలా చెప్పి అతనికి వీడ్కోలు ఇచ్చాడు. తాను యథాప్రకారం శిలోంఛవృత్తిని స్వీకరించి, ధర్మాత్ముడై ఉత్తమమైన శమాదిగుణాలను పాటించసాగాడు. (45)
తుల్యనిందాస్తుతిర్భూత్వా సమలోష్టాశ్మకాంచనః ।
జ్ఞానయోగేన శుద్ధేన ధ్యాననిత్యో బభూవ హ ॥ 46
నిందాస్తుతులను సమానంగా పరిగణిస్తూ, కొయ్య, రాయి, బంగారాలయందు సమభావం చూపుతూ, శుద్ధమైన యోగంతో నిత్యధ్యానంతో కాలం గడపసాగాడు. (46)
ధ్యానయోగాద్ బలం లబ్ధ్వా ప్రాప్య బుద్ధిమనుత్తమామ్ ।
జగామ శాశ్వతీం సిద్ధిం పరాం నిర్మాణలక్షణామ్ ॥ 47
ధ్యానయోగ బలం చేత అత్యుత్తమమైన బుద్ధిని పొంది మోక్షస్వరూపమైన శాశ్వతమైన పరమసిద్ధిని పొందాడు. (47)
తస్మాత్ త్వమపి కౌంతేయ న శోకం కర్తుమర్హసి ।
రాజ్యాత్ స్ఫీతాత్ పరిభ్రష్టః తపసా తదవాప్స్యసి ॥ 48
కాబట్టి కౌంతేయా! చక్కని రాజ్యం నుండి భ్రష్టుడవైనందుకు నీవు కూడా విచారించకు. తపస్సు చేత దానిని పొందగలవు. (48)
సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖమ్ ।
పర్యాయేణోపసర్పంతే నరం నేమిమరా ఇవ ॥ 49
సుఖానంతరం దుఃఖం, దుఃఖానంతరం సుఖం చక్రంలోని ఆకుల లాగ మనిషికి పర్యాయక్రమంలో తారసపడుతూ ఉంటాయి. (49)
పితృపైతామహం రాజ్యం ప్రాప్స్యస్యమితవిక్రమ ।
వర్షాత్ త్రయోదశాదూర్ధ్వం వ్యేతు తే మానసో జ్వరః ॥ 50
అమితవిక్రముడా! పదమూడేళ్లు గడిచాక ఆపై సంవత్సరంలో నీవు నీ తండ్రి తాతల రాజ్యాన్ని పొందగలవు, నీ మనసులోక్ని చింతను దూరం చేసుకో. (50)
వైశంపాయన ఉవాచ
స ఏవముక్త్వా భగవాన్ వ్యాసః పాండవనందనమ్ ।
జగామ తపసే ధీమాన్ పునరేవాశ్రమం ప్రతి ॥ 51
వైశంపాయనుడు చెప్పసాగాడు - ధీమంతుడైన వ్యాసభగవానుడు ఈ రీతిగా పాండునందనునికి చెప్పి తిరిగి తపస్సు చేసుకోవడానికి ఆశ్రమానికి మరలిపోయాడు. (51)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి వ్రీహిద్రౌణికపర్వణి ముద్గలదేవదూతసంవాదే ఏకషష్ట్యధికశతతమోఽధ్యాయః ॥ 261 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున వ్రీహిద్రౌణికపర్వమను ఉపపర్వమున ముద్గలదేవదూతసంవాదమను రెండువందల అరువది ఒకటవ అధ్యాయము. (261)
॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥