262. రెండువందల అరువది రెండవ అధ్యాయము

(ద్రౌపదీహరణ పర్వము)

దుర్యోధనుడు దుర్వాసుని యుధిష్ఠిరుని కడకు పంపుట.

జనమేజయ ఉవాచ
వసత్స్యేవం వనే తేషు పాండవేషు మహాత్మసు ।
రమమాణేషు చిత్రాభిః కథాభిర్మునిభిః సహ ॥ 1
సూర్యదత్తాక్షయాన్నేవ కృష్ణాయా భోజనావధి ।
బ్రాహ్మణాంస్తర్పమాణేషు యే చాన్నార్థముపాగతాః ॥ 2
ధార్తరాష్ట్రా దురాత్మానః సర్వే దుర్యోధనాదయః ।
కథం తేష్వన్వవర్తంత పాపాచారా మహామునే ॥ 3
దుఃశాసనస్య కర్ణస్య శకునేశ్చ మతే స్థితాః ।
ఏతదాచక్ష్వ భగవన్ వైశంపాయన పృచ్ఛతః ॥ 4
జనమేజయుడు అడుగుతున్నాడు - "వైశంపాయన మహర్షీ! మహాత్ములైన పాండవులు ఈ రీతిగా అడవులలో నివసిస్తూ; మునులతో కలిసి విచిత్రమైన కథలు వింటూ ఆనందిస్తూ; సూర్యుడు ఇచ్చిన పాత్రలో ద్రౌపదీదేవి భుజించేంతవరకు అక్షయంగా ఉండే అన్నంతో అన్నార్థులై వచ్చిన బ్రాహ్మణులను తృప్తిపరుస్తూ కాలం గడుపుతూ ఉండగా దుశ్శాసన కర్ణశకునుల మతాన్ని అనుసరించి నడుచుకొనే పాపాచారులు, దుష్టులు, ఆ దుర్యోధనాదులు అందరూ ఆ పాండవుల పట్ల ఎలా ప్రవర్తించారు? నేను అడిగిన విషయాలన్నీ చెప్పండి." (1-4)
వైశంపాయన ఉవాచ
శ్రుత్వా తేషాం తథా వృత్తిం నగరే వసతామివ ।
దుర్యోధనో మహారాజ తేషు పాపమరోచయత్ ॥ 5
వైశంపాయనుడు చెప్పసాగాడు - "మహారాజా! వారు అడవులలో కూడా పట్టణంలో ఉన్నట్లుగానే ఆనందంగా ఉంటున్నారని విని దుర్యోధనుడు వారికి అపకారం చేయాలని భావించాడు. (5)
తథా తైర్నికృతిప్రజ్ఞైః కర్ణదుఃశాసనాదిభిః ।
నానోపాయైరఘం తేషు చింతయత్సు దురాత్మసు ॥ 6
అభ్యాగచ్ఛత్ స ధర్మాత్మా తపస్వీ సుమహాయశాః ।
శిష్యాయుతసమోపేతో దుర్వాసా నామ కామతః ॥ 7
ఆ రీతిగా ఆలోచించివారు ఆరితేరిన కర్ణదుశ్శాసనాదులతో కలిసి పాండవులకు అపకారం చేయడానికి అనేక ఉపాయాలు ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు మహాయశస్వి, ధర్మాత్ముడు, తాపసి అయిన దుర్వాస మహాముని పదివేలమంది శిష్యులతో కలిసి యథేచ్ఛగా వారి వద్దకు వచ్చాడు. (6,7)
తమాగతమభిప్రేక్ష్య మునిం పరమకోపనమ్ ।
దుర్యోధనో వినీతాత్మా ప్రశ్రయేణ దమేన చ ॥ 8
సహితో భ్రాతృభిః శ్రీమాన్ ఆతిథ్యేన న్యమంత్రయత్ ।
ముక్కోపి అయిన ఆ మునిరాకను చూచి శ్రీమంతుడయిన దుర్యోధనుడు ఒళ్లు దగ్గరపెట్టుకొని నమ్రభావంతో వినీతాత్ముడై తమ్ముళ్లతో కలిసి అతనిని ఆతిథ్యం కోసం ఆహ్వానించాడు. (8 1/2)
విధివత్ పూజయామాస స్వయం కింకరవత్ స్థితః ॥ 9
అహాని కతిచిత్ తత్ర తస్థౌ స మునిసత్తమః ।
దుర్యోధనుడు స్వయంగా సేవకునివలె నిలబడి విధిపూర్వకంగా ఆ మునిని పూజించాడు. ఆ మునిపుంగవుడు అక్కడ కొన్నిరోజులపాటు ఉన్నాడు. (9 1/2)
తం చ పర్యచరద్ రాజా దివారాత్రమతంద్రితః ॥ 10
దుర్యోధనో మహారాజ శాపాత్ తస్య విశంకితః ।
మహారాజా! రాజైన దుర్యోధనుడు అతడు శపిస్తాడేమోనని శంకించి దివారాత్రాలు జాగరూకుడై ఆతనికి సేవలు చేశాడు. (10 1/2)
క్షుధితోఽస్మి దదస్వాన్నం శీఘ్రం మమ నరాధిప ॥ 11
ఇత్యుక్త్వా గచ్ఛతి స్నాతుం ప్రత్యాగచ్ఛతి వై చిరాత్ ।
న భోక్ష్యామ్యద్య మే నాస్తి క్షుధేత్యు క్త్వైత్యదర్శనమ్ ॥ 12
ఆ ముని ఒక్కొక్కసారి "రాజా! నాకు ఆకలిగా ఉంది. వెంటనే భోజనం పెట్టు" అని చెప్పి స్నానానికి వెళ్లిపోయి, చాలాసేపటికి తిరిగివస్తాడు. వచ్చి, "ఈరోజు అన్నం తినను. నాకు ఆకలిలేదు." అని చెప్పి అదృశ్యమైపోతాడు. (11,12)
ఆకస్మాదేత్య చ బ్రూతే భోజయాస్మాంస్త్వరాన్వితః ।
కదాచిచ్చ నిశీథే స ఉత్థాయ నికృతౌ స్థితః ॥ 13
పూర్వవత్ కారయిత్వాన్నం న భుంక్తే గర్హయన్ స్మ సః ।
ఒక్కొక్కసారి ఎక్కడినుండో అకస్మాత్తుగా వచ్చి తొందరపడిపోతూ "మాకు భోజనం పెట్టు" అంటాడు. ఒక్కొక్కసారి అర్థరాత్రివేళ లేచి బెదిరించేవాడు. ఎప్పటిమాదిరిగానే సిద్ధం చేయించిన అన్నాన్ని దూషిస్తూ తినడు. (13 1/2)
వర్తమానే తథా తస్మిన్ యదా దుర్యోధనో నృపః ॥ 14
వికృతిం నైతి న క్రోధం తదా తుష్టోఽభవన్మునిః ।
ఆహ చైనం దురాధర్షో వరదోఽస్మీతి భారత ॥ 15
భారతా! అతడు అలా ప్రవర్తిస్తున్నప్పటికీ దుర్యోధన మహారాజు ఏమాత్రం చిరాకును, కోపాన్ని ప్రదర్శించలేదు. అప్పుడు దుర్థర్షుడైన ముని సంతుష్టుడై అతనితో "వరం ఇస్తాను" అని అన్నాడు. (14,15)
దుర్వాసా ఉవాచ
వరం వరయ భద్రం తే యత్ తే మనసి వర్తతే ।
మయి ప్రీతే తు యద్ ధర్మ్యం నాలభ్యం విద్యతే తవ ॥ 16
"రాజా! నీకు శుభమగుగాక! నీ మనసులో ఏదైనా ఉంటే అది వరంగా అడుగు. నేను సంతోషించాక ధర్మానుకూలమైనది ఏదీ నీకు లభించకుండా ఉండదు." (16)
వైశంపాయన ఉవాచ
ఏతచ్ర్ఛుత్వా వచస్తస్య మహర్షేర్భావితాత్మనః ।
అమన్యత పునర్జాతమ్ ఆత్మానం స సుయోధనః ॥ 17
శుద్ధాంతః కరణుడైన ఆ మహర్షి యొక్క మాటలు విని సుయోధనుడు తన్ను పునర్జీవితునిగా భావించుకొన్నాడు. (17)
ప్రాగేవ మంత్రితం చాసీత్ కర్ణదుఃశాసనాదిభిః ।
యాచనీయం మునేస్తుష్టాద్ ఇతి నిశ్చిత్య దుర్మతిః ॥ 18
అతిహర్షాన్వితో రాజన్ వరమేనమయాచత ।
శిష్యైః సహ మమ బ్రహ్మన్ యథా జాతోఽతిథిర్భవాన్ ॥ 19
అస్మత్కులే మహారాజః జ్యేష్ఠః శ్రేష్ఠో యుధిష్ఠిరః ।
వనే వసతి ధర్మాత్మా భ్రాతృభిః పరివారితః ॥ 20
గుణవాన్ శీలసంపన్నః తస్య త్వమతిథిర్భవ ।
ముని సంతుష్టడయితే వరం అడగాలని నిశ్చయించుకొని అంతకుముందే కర్ణదుశ్శాసనాదులతో మంత్రాంగం జరిపి ఉన్నాడు ఆ దుష్టుడు. అందుకని రాజా! అతిసంతోషంతో ఇలా వరం అడిగాడు. "బ్రాహ్మణోత్తమా! శిష్యులతో కలిసి మీరు నాకు అతిథి అయ్యారు. మావంశంలో జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు అయినవాడు యుధిష్ఠిరమహారాజు; ఆ ధర్మాత్ముడు తమ్ములతో పరివేష్టింపబడి అడవులలో నివసిస్తున్నాడు. శీలసంపన్నుడు గుణవంతుడు అయిన అతనికి మీరు అతిథులు కండి. (18-20 1/2)
యదా చ రాజపుత్రీ సా సుకుమారీ యశస్వినీ ॥ 21
భోజయిత్వా ద్విజాన్ సర్వాన్ పతీంశ్చ వరవర్ణినీ ।
విశ్రాంతా చ స్వయం భుక్త్వా సుఖాసీనా భవేద్ యదా ॥ 22
తదా త్వం తత్ర గచ్ఛేథాః యద్యనుగ్రాహ్యతా మయి ।
ఆ సుకుమారి, యశస్విని, రాజపుత్రి ద్రౌపదీ సతి విప్రులందరికీ, భర్తలకు భోజనం పెట్టి, తాను కూడా భుజించి విశ్రాంతిగా సుఖంగా కూర్చున్నపుడు, నా మీద మీకు అనుగ్రహం ఉంటే ఆ సమయంలో మీరు అక్కడకు వెళ్లండి. (21,22 1/2)
తథా కరిష్యే త్వత్ర్పీత్యేత్యేవముక్త్వా సుయోధనమ్ ॥ 23
దుర్వాసా అపి విప్రేంద్రో యథాగతమగాత్ తతః ।
కృతార్థమపి చాత్మానం తదా మేనే సుయోధనః ॥ 24
"నీకు ప్రతి కలిగించడానికి అలాగే చేస్తాను" అని సుయోధనునికి చెప్పి బ్రాహ్మణోత్తముడైన దుర్వాసుడు కూడా ఎలా వచ్చినవాడు అలాగే వెళ్లిపోయాడు. అప్పుడు సుయోధనుడు తన్ను తాను కృతార్థునిగా భావించాడు. (23,24)
కరేణ చ కరం గృహ్య కర్ణస్య ముదితో భృశమ్ ।
కర్ణోఽపి భ్రాతృసహితమ్ ఇత్యువాచ నృపం ముదా ॥ 25
అతడు తన చేతితో కర్ణుని చేతిని పట్టుకొని మిక్కిలిగా సంతోషించాడు. కర్ణుడు కూడా తమ్ముళ్లతో కలిసి ఉన్న రాజుతో సంతోషంగా ఇలా అన్నాడు. (25)
కర్ణ ఉవాచ
దిష్ట్యా కామః సుసంవృత్తః దిష్ట్యా కౌరవ వర్ధసే ।
దిష్ట్యా తే శత్రవో మగ్నాః దుస్తరే వ్యసనార్ణవే ॥ 26
కర్ణుడు అంటున్నాడు - "కౌరవా! అదృష్టం కొద్దీ మనకోరిక నెరవేరింది. అదృష్టం కొద్దీ నీవు వృద్ధి పొందుతున్నావు. అదృష్టం కొద్దీ నీ శత్రువులు దాటలేని దుఃఖసముద్రంలో మునిగిపోయారు. (26)
దుర్వాసఃక్రోధజే వహ్నౌ పతితాః పాండునందనాః ।
స్వైరేవ తే మహాపాపైః గతా వై దుస్తరం తమః ॥ 27
పాండుకుమారులు దుర్వాసునియొక్క క్రోధం వలన పుట్టిన అగ్నిలో పడిపోయారు. వారు తాము చేసిన మహాపాపాల వల్లనే దుస్తరమైన నరకంలో పడిపోయారు." (27)
వైశంపాయన ఉవాచ
ఇత్థం తే నికృతిప్రజ్ఞా రాజన్ దుర్యోధనాదయః ।
హసంతః ప్రీతమనసో జగ్ముఃస్వం స్వం నికేతనమ్ ॥ 28
వైశంపాయనుడు చెపుతున్నాడు.
"రాజా! కాపట్యనిపుణులైన దుర్యోధనాదులు ఈ రీతిగా నవ్వుకొంటూ సంతోషచిత్తులై తమతమ ఇళ్లకు వెళ్లారు. (28)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ద్రౌపదీహరణపర్వణి దుర్వాస ఉపాఖ్యానే ద్విషష్ట్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 262 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ద్రౌపదీహరణపర్వమను ఉపపర్వమున దుర్వాసుని ఉపాఖ్యానమను రెండు వందల అరువది రెండవ అధ్యాయము. (262)