263. రెండువందల అరువది మూడవ అధ్యాయము
శ్రీకృష్ణుడు పాండవులను దుర్వాసుని బారినుండి రక్షించుట.
వైశంపాయన ఉవాచ
తతః కదాచిద్ దుర్వాసాః సుఖాసీనాంస్తు పాండవాన్ ।
భుక్త్వా చావస్థితాం కృష్ణాం జ్ఞాత్వా తస్మిన్ వనే మునిః ॥ 1
అభ్యాగచ్ఛత్ పరివృతః శిష్యైరయుతసమ్మితైః ।
వైశంపాయనుడు చెప్పసాగాడు - "ఇలా ఉండగా ఒకసారి పాండవులందరూ సుఖాసీనులై ఉండడం, ద్రౌపది కూడా భోజనం చేసి కూర్చుని ఉండడం తెలుసుకొని దుర్వాసమహాముని పదివేలమంది శిష్యులతో కూడి ఆ వనానికి వచ్చాడు. (1 1/2)
దృష్ట్వాఽఽయాంతం తమతిథిం స చ రాజా యుధిష్ఠిరః ॥ 2
జగామాభిముఖః శ్రీమాన్ సహ భ్రాతృభిరచ్యుతః ।
తస్మై బద్ధ్వాంజలిం సమ్యగ్ ఉపవేశ్య వరాసనే ॥ 3
విధివత్ పూజయిత్వా తమ్ ఆతిధ్యేన న్యమంత్రయత్ ।
ఆహ్నికం భగవన్ కృత్వా శీఘ్రమేహీతి చాబ్రవీత్ ॥ 4
వచ్చిన ఆ అతిథిని చూచి యుధిష్ఠిరుడు ధర్మానుసారం తమ్ముళ్లతో కలిసి ఎదురువెళ్లాడు. అతనికి చేతులు జోడించి నమస్కరించి ఉత్తమాసనం మీద చక్కగా కూర్చుండపెట్టి విధిపూర్వకంగా పూజించి ఆతిథ్యం ఇవ్వదలచి భోజనానికి పిలిచాడు. పైగా "భగవాన్! మీరు మీ ఆహ్నికం పూర్తిచేసుకొని శీఘ్రంగా రండి" అని కూడా చెప్పాడు. (2-4)
జగామ చ మునిః సోఽపి స్నాతుం శిష్యైః సహానఘః ।
భోజయేత్ సహశిష్యం మాం కథమిత్యవిచింతయన్ ॥ 5
న్యమజ్జత్ సలిలే చాపి మునిసంఘః సమాహితః ।
అనఘుడైన మహాముని కూడా "శిష్యసహితుడనైన నాకు ఇప్పుడు ఎలా భోజనం పెట్టగలడు" అని ఆలోచించకుండానే శిష్యులతో కలిసి స్నానానికి వెళ్లాడు. మునులందరూ స్నానం చేసి ధ్యాననిమగ్నులయ్యారు. (5 1/2)
ఏతస్మిన్నంతరే రాజన్ ద్రౌపదీ యోషితాం వరా ॥ 6
చింతామవాప పరమామ్ అన్న హేతోః పతివ్రతా ।
రాజా! ఈ లోపల ఇక్కడ స్త్రీ రత్నమూ, పతివ్రతా అయిన ద్రౌపది అన్నం గురించి మిక్కిలిగా వ్యాకులపడింది. (6 1/2)
సా చింతయంతీ చ యదా నాన్నహేతుమవిందత ॥ 7
మనసా చింతయామాస కృష్ణం కంసనిఘాదనమ్ ।
ఆమెకు ఎంత ఆలోచించినా అన్నం దొరికే ఉపాయం కనిపించలేదు. ఇక కంసారి అయిన కృష్ణుని మనసులో ధ్యానించసాగింది. (7 1/2)
కృష్ణ కృష్ణ మహాబాహో దేవకీనందననావ్యయ ॥ 8
వాసుదేవ జగన్నాథ ప్రణతార్తివినాశన ।
విశ్వాత్మన్ విశ్వజనక విశ్వహర్తః ప్రభోఽవ్యయ ॥ 9
ప్రపన్నపాల గోపాల ప్రజాపాల పరాత్పర ।
ఆకూతీనాం చ చిత్తీనాం ప్రవర్తక నతాస్మి తే ॥ 10
హే కృష్ణా! మహాబాహూ! దేవకీనందనా! అవినాశీ! వాసుదేవా! నమస్కరించిన వారి ఆర్తిని పోగొట్టేవాడా! జగన్నాథా! విశ్వాత్మా! విశ్వజనకా! విశ్వహర్తా! ప్రభూ! అవ్యయా! దీనులను కాపాడేవాడా! గోపాలా! ప్రజాపాలా! పరాత్పరా! మనోబుద్ధులను ప్రేరేపించే నీకు నమస్కరిస్తున్నాను. (8-10)
వరేణ్య వరదానంత అగతీనాం గతిర్భవ ।
పురాణపురుష ప్రాణమనోవృత్త్యాద్యగోచర ॥ 11
సర్వాధ్యక్ష్య పరాధ్యక్ష త్వామహం శరణం గతా ।
పాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల ॥ 12
వరేణ్యా! వరదా! అనంతా! దిక్కులేని వారికి దిక్కు అయినవాడా! పురాణపురుషా! ప్రాణమనోవృత్తులకు గోచరించనివాడా! సర్వాధ్యక్షా! పరాధ్యక్షా! నేను నీ శరణు పొందాను. శరణాగతవత్సలా! దేవా! దయతో నన్ను రక్షించు. (11,12)
నీలోత్పలదలశ్యామ పద్మగర్భారుణేక్షణ ।
పీతాంబరపరీధాన లసత్కౌస్తుభభూషణ ॥ 13
త్వమాదిరంతో భూతానాం త్వమేవ చ పరాయణమ్ ।
పరాత్పరతరం జ్యోతిః విశ్వాత్మా సర్వతోముఖః ॥ 14
నల్లకలువ రేకుల వంటి శ్యామవర్ణం కలవాడా! పద్మగర్భంలోని ఎరుపువంటి కన్నులు కలవాడా! పితాంబరధారీ! ప్రకాశించే కౌస్తుభం ఆభరణంగా కలవాడా! సమస్తప్రాణులకు ఆద్యంతములు నీవే. నీవే వారికి పరమాశ్రయుడవు. నీవు పరాత్పరుడవు. జ్యోతిస్స్వరూపుడవు. విశ్వాత్ముడవు. సర్వతోముఖుడవు. (13,14)
త్వామేవాహుః పరం బీజం నిధానం సర్వసంపదామ్ ।
త్వయా నాథేన దేవేశ సర్వాపద్భ్యో భయం న హి ॥ 15
పండితులు నిన్నే పరమబీజమని, సర్వసంపదలకు నిధానమని అంటారు. దేవేశ్వరా! నీవు నాథుడివి (రక్షకుడివి) అయితే ఎన్ని ఆపదలు వచ్చినా భయం ఉండదు. (15)
దుఃశాసనాదహం పూర్వం సభాయాం మోచితా యథా ।
తథైవ సంకటాదస్మాద్ మాముద్ధర్తుమిహార్హసి ॥ 16
భగవంతుడా! పూర్వం సభలో దుశ్శాసనుని బారి నుండి నన్ను తప్పించినట్లే ఈ సంకటం నుండి కూడా నన్ను ఉద్ధరించడానికి ఇప్పుడు నీవే తగినవాడివి". (16)
వైశంపాయన ఉవాచ
ఏవం స్తుతస్తదా దేవః కృష్ణాయా భక్తవత్సలః ।
ద్రౌపద్యాః సంకటం జ్ఞాత్వా దేవదేవో జగత్పతిః ॥ 17
పార్శ్వస్థాం శయనే త్యక్త్వా రుక్మిణీం కేశవః ప్రభుః ।
తత్రాజగామ త్వరితో హ్యచింత్యగతిరీశ్వరః ॥ 18
ద్రౌపది ఈ విధంగా ప్రార్థించగానే అచింత్యగతి, పరమేశ్వరుడు, దేవాధిపుడు, జగన్నాథుడు, భక్తవత్సలుడు, భగవంతుడు అయిన కృష్ణుడు ద్రౌపది యొక్క ఆపదను గ్రహించి ప్రక్కనే శయనం మీద ఉన్న రుక్మిణిని కూడా వదిలి త్వరగా అక్కడికి వచ్చాడు. (17,18)
తతస్తం ద్రౌపదీ దృష్ట్వా ప్రణమ్య పరయా ముదా ।
అబ్రవీద్ వాసుదేవాయ మునేరాగమనాదికమ్ ॥
అప్పుడు ద్రౌపది అతనిని చూసి పరమసంతోషంతో అతనికి నమస్కరించి, వాసుదేవునితో ముని రావడం మొదలైన విషయమంతా చెప్పింది. (19)
తతస్తామబ్రవీత్ కృష్ణః క్షుధితోఽస్మి భృశాతురః ।
శీఘ్రం భోజయ మాం కృష్ణే పశ్చాత్ సర్వం కరిష్యసి ॥ 20
నిశమ్య తద్వచః కృష్ణా లజ్జితా వాక్యమబ్రవీత్ ।
స్థాల్యాం భాస్కరదత్తాయామ్ అన్నం మద్భోజనావధి ॥ 21
భుక్తవత్యస్మ్యహం దేవ తస్మాదన్నం న విద్యతే ।
అపుడు కృష్ణుడు ఆమెతో "నాకు భరించరానంత ఆకలివేస్తుంది. ముందు వెంటనే అన్నం పెట్టు. తరువాత అంతా చేస్తాను." అన్నాడు. ఆ మాటలు విని ద్రౌపది సిగ్గుతో - "సూర్యదేవుడిచ్చిన అక్షయపాత్ర నా భోజనం అయ్యేవరకే పనిచేస్తుంది. దేవా! ఇప్పుడు నా భోజనం అయిపోయింది. అందుకని అన్నం దొరకదు" అంది. (20 21 1/2)
తతః ప్రోవాచ భగవాన్ కృష్ణాం కమలలోచనః ॥ 22
కృష్ణే న నర్మకాలోఽయం క్షుచ్ర్ఛమేణాతురే మయి ।
శీఘ్రం గచ్ఛ మమ స్థాలీమ్ ఆనీయ త్వం ప్రదర్శయ ॥ 23
ఇతి నిర్బంధతః స్థాలీమ్ ఆనాయ్య స యదూద్వహః ।
స్థాల్యాః కంఠేఽథ సంలగ్నం శాకాన్నం వీక్ష్య కేశవః ॥ 24
ఉపయుజ్యాబ్రవీదేనామ్ అనేన హరిరీశ్వరః ।
విశ్వాత్మా ప్రీయతాం దేవః తుష్టశ్చాస్త్వితి యజ్ఞభుక్ ॥ 25
అప్పుడు కమలలోచనుడూ భగవానుడూ అయిన కృష్ణుడు ద్రౌపదితో - "ద్రౌపదీ! ఇది వేళాకోళానికి సమయం కాదు. నేను ఆకలితో ఎంతో అలసిపోయి ఉన్నాను. వెళ్లు. వెంటనే ఆ పాత్ర తెచ్చి నాకు చూపించు" అని బలవంతంగా పాత్రను తెప్పించి, కేశవుడు పాత్రయొక్క అంచుకు అంటుకొని ఉన్న తోటకూర ఆకుముక్కను చూచి దానిని తిని - "దీనితో విశ్వాత్ముడు, యజ్ఞభోక్త, సర్వేశ్వరుడు అయిన భగవంతుడు శ్రీహరి సంతోషించుగాక తృప్తిచెందునుగాక" అన్నాడు. (22-25)
ఆకారయ మునీన్ శీఘ్రం భోజనాయేతి చాబ్రవీత్ ।
సహదేవం మహాబాహుః కృష్ణః క్లేశవినాశనః ॥ 26
ఇలా అని మహాబాహువు కష్టాలను పోగొట్టేవాడు అయిన కృష్ణుడు సహదేవునితో "మునులందరినీ వెంటనే భోజనానికి రమ్మని పిలువు" అని చెప్పాడు. (26)
తతో జగామ త్వరితః సహదేవో మహాయశాః ।
ఆకారితుం తు తాన్ సర్వాన్ భోజనార్థం నృపోత్తమ ॥ 27
స్నాతుం గతాన్ దేవనద్యాం దుర్వాసఃప్రభృతీన్ మునీన్ ।
నరేశ్వరా! అంతట మహాయశస్వి అయిన సహదేవుడు దేవనదిలో స్నానం చేయడానికి వెళ్లిన దుర్వాసుడు మొదలైన ఆ మునులందరినీ భోజనం కోసం పిలువడానికి త్వరగా వెళ్లాడు. (27 1/2)
తే చావతీర్ణాః సలిలే కృతవంతోఽఘమర్షణమ్ ॥ 28
దృష్ట్వోద్గారాన్ సాన్నరసాన్ తృప్త్యా పరమయా యుతాః ।
ఉత్తీర్య సలిలాత్ తస్మాద్ దృష్టవంతః పరస్పరమ్ ॥ 29
దుర్వాససమభిప్రేక్ష్య తే సర్వే మునయోఽబ్రువన్ ।
రాజ్ఞా హి కారయిత్వాన్నం వయం స్నాతుం సమాగతాః ॥ 30
ఆకంఠతృప్తా విప్రర్షే కింస్విద్ భుంజామహే వయమ్ ।
వృథా పాకః కృతోఽస్మాభిః తత్ర కిం కరవామహే ॥ 31
అక్కడ నీటిలో దిగి అఘమర్షణ మంత్రాన్ని జపిస్తున్న ఆ మునులందరికీ పరమతృప్తి కలిగి, అన్నరసంతో కూడిన త్రేనుపులు వచ్చాయి. అది గమనించి నీటిలో నుండి బయటికి వచ్చి ఒకరినొకరు చూసుకొంటూ దుర్వాసమునిని చూచి వారంతా ఇలా అన్నారు - "విప్రోత్తమా! యుధిష్ఠిరునికి అన్నం సిద్ధం చేయించమని చెప్పి మనం స్నానానికి వచ్చాం. గొంతువరకు తృప్తిగా ఉన్న మనం ఏం తింటాం? మనం సిద్ధం చేయించిన అన్నమంతా వ్యర్థం అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి?" అని అడిగారు. (28-31)
దుర్వాసా ఉవాచ
వృథా పాకేన రాజర్షేః అపరాధః కృతో మహాన్ ।
మాస్మానధాక్షుర్దృష్ట్వైవ పాండవాః క్రూరచక్షుషా ॥ 32
స్మృత్వానుభావం రాజర్షేః అంబరీషస్య ధీమతః ।
బిభేమి సుతరాం విప్రా హరిపాదాశ్రయాజ్జనాత్ ॥ 33
పాండవాశ్చ మహాత్మానః సర్వే ధర్మపరాయణాః ।
శూరాశ్చ కృతవిద్యాశ్చ వ్రతినస్తపసి స్థితాః ॥ 34
సదాచరరతా నిత్యం వాసుదేవపరాయణాః ।
క్రుద్ధాస్తే నిర్దహేయుర్వై తూలరాశిమివానలః ।
తత ఏతానపృష్ట్వైవ శిష్యాః శీఘ్రం పలాయత ॥ 35
దుర్వాసుడు అంటున్నాడు - "అనవసరంగా అన్నం వండించి రాజర్షి అయిన యుధిష్ఠిరునిపట్ల గొప్ప అపరాధమే చేశాం. పాండవులు క్రూరదృష్టితో చూచి మనలను భస్మం చేయరుకదా! ధీమంతుడు రాజర్షి అయిన అంబరీషునితో కలిగిన అనుభవం గుర్తుకు వచ్చి హరిపాదాలను ఆశ్రయించిన భక్తజనులను గూర్చి చాలా భయపడుతూ ఉంటాను. పాండవులు కూడా అందరూ మహాత్ములు, ధర్మపరాయణులు. శూరులు, పండితులు, వ్రతపరాయణులు, తపస్వులు, సదాచారరతులు, నిత్యమూ వాసుదేవుని పరమాశ్రయంగా పొందినవారు. వారు కోపగిస్తే నిప్పు దూదిరాశిని కాల్చినట్లుగా దహించివేస్తారు సుమా! కనుక శిష్యులారా! వారిని ఏమీ అడుగకుండానే వెంటనే పారిపొండి." (32-35)
వైశంపాయన ఉవాచ
ఇత్యుక్తాస్తే ద్విజాః సర్వే మునినా గురుణా తదా ।
పాండవేభ్యో భృశం భీతా దుద్రువుస్తే దిశో దశ ॥ 36
తమ గురువైన దుర్వాసమహాముని ఇలా చెప్పగానే ఆ బ్రాహ్మణులందరూ పాండవులకు మిక్కిలిగా భయపడి, పదిదిక్కులకు పారిపోయారు. (37)
సహదేవో దేవనద్యామ్ అపశ్యన్ మునిసత్తమాన్ ।
తీర్థేష్వితస్తతస్తస్యా విచచార గవేషయన్ ॥ 37
సహదేవుడు దేవనదిలో ఆ మునీశ్వరులు కనిపించక, అటు ఇటు ఉన్న ఆ నదీతీర్థాలలో వారికోసం వెదుకుతూ తిరగసాగాడు. (37)
తత్రస్థేభ్యస్తాపసేభ్యః శ్రుత్వా తాంశ్చైవ విద్రుతాన్ ।
యుధిష్ఠిరమథాభ్యేత్య తం వృత్తాంతం న్యవేదయత్ ॥ 38
అక్కడ ఉండే తాపసుల వలన వారంతా పారిపోయారని విని, యుధిష్ఠిరుని వద్దకు వచ్చి ఆ వృత్తాంతాన్ని నివేదించాడు. (38)
తతస్తే పాండవాః సర్వే ప్రత్యాగమనకాంక్షిణః ।
ప్రతీక్షంతః కియత్కాలం జితాత్మనోఽవతస్థిరే ॥ 39
తరువాత జితేంద్రియులయిన పాండవులందరూ వారు తిరిగివస్తారనే ఆశతో కొంతసేపటివరకు ఎదురుచూస్తూ ఉండిపోయారు. (39)
నిశీథేఽభ్యేత్య చాకస్మాద్ అస్మాన్ స ఛలయిష్యతి ।
కథం చ నిస్తరేమాస్మాత్ కృచ్ర్ఛాద్ దైవోపసాదితాత్ ॥ 40
ఇతి చింతాపరాన్ దృష్ట్వా నిఃశ్వసంతో ముహుర్ముహుః ।
ఉవాచ వచనం శ్రీమాన్ కృష్ణః ప్రత్యక్షతాం గతః ॥ 41
"అర్థరాత్రివేళ వచ్చి అకస్మాత్తుగా అతడు మనలను మోసగిస్తాడు. దైవవశాత్తు వచ్చిపడిన ఈ కష్టం నుండి మనం ఎలా బయటపడగలం?" అని మాటిమాటికీ నిట్టూర్పులు విడిస్తూ చింతాపరులై ఉన్నవారిని చూచి శ్రీకృష్ణుడు వారికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు - (40,41)
శ్రీకృష్ణ ఉవాచ
భవతామాపదం జ్ఞాత్వా ఋషేః పరమకోపనాత్ ।
ద్రౌపద్యా చింతతః పార్థాః అహం సత్వరమాగతః ॥ 42
న భయం విద్యతే తస్మాత్ ఋషేర్దుర్వాససోఽల్పకమ్ ।
తేజసా భవతాం భీతః పూర్వమేవ పలాయితః ॥ 43
"కుంతీపుత్రులారా! పరమకోపనుడైన దుర్వాసమహర్షి వలన మీకు కలిగిన ఆపదను గుర్తించి ద్రౌపది నన్ను ప్రార్థిస్తే నేను వెంటనే వచ్చాను. ఆ దుర్వాస మహర్షి వలన మీకు కొంచెమైనా భయం లేదు. మీ తేజస్సుకు భయపడి ఇంతకు పూర్వమే పారిపోయాడు. (42,43)
ధర్మనిత్యాస్తు యే కేచిద్ న తే సీదంతి కర్హిచిత్ ।
ఆపృచ్ఛే వో గమిష్యామి నియతం భద్రమస్తు వః ॥ 44
నిత్యమూ ధర్మతత్పరులై ఉండేవారు ఎప్పుడూ కూడా నశించిపోరు. మీనుండి సెలవు తీసుకొంటున్నాను. ఇక నేను వెళ్తాను. మీకు ఎల్లప్పుడూ శుభమగుగాక. (44)
వైశంపాయన ఉవాచ
శ్రుత్వేరితం కేశవస్య బభూవుః స్వస్థమానసాః ।
ద్రౌపద్యా సహితాః పార్థాః తమూచుర్విగతజ్వరాః ॥ 45
త్వయా నాథేన గోవింద దుస్తరామాపదం విభో ।
తీర్ణాః ప్లవమివాసాద్య మజ్జమానా మహార్ణవే ॥ 46
వైశంపాయనుడు చెపుతున్నాడు - కేశవుడు చెప్పినది విని కుంతీపుత్రులు కుదుటపడిన మనసులతో తమ చింతతొలగి, ద్రౌపదీసహితంగా కృష్ణునితో ఇలా అన్నారు - "గోవిందా!ప్రభూ! మహాసాగరంలో మునిగిపోతున్న వారికి నావ దొరికినట్లుగా నిన్ను మేము రక్షకునిగా పొంది అతికష్టమైన ఈ ఆపద నుండి గట్టెక్కాము. (45,46)
స్వస్తి సాధయ భద్రం తే ఇత్యాజ్ఞాతో యయౌ పురీమ్ ।
శుభం. బయలుదేరు. నీకు కల్యాణమగుగాక" - అని పాండవులు అనుమతించారు. కృష్ణుడు తన నగరానికి బయలుదేరాడు. (46 1/2)
పాండవాశ్చ మహాభాగ ద్రౌపద్యా సహితాః ప్రభో ॥ 47
ఊషుః ప్రహృష్టమనసో విహరంతో వనాద్ వనమ్ ।
జనమేజయా! మహాత్ములైన పాండవులు కూడా ద్రౌపదితో కలిసి సంతోషమనస్కులై ఒక వనం నుండి మరొక వనానికి తిరుగుతూ గడుపసాగారు. (47 1/2)
ఇతి తేఽభిహితం రాజన్ యత్ పృష్టోఽహమిహ త్వయా ॥ 48
ఏవంవిధాన్యలీకాని ధార్తరాష్ట్రైర్దురాత్మభిః ।
పాండవేషు వనస్థేషు ప్రయుక్తాని వృథాభవన్ ॥ 49
రాజా! ఇప్పుడిక్కడ నీవు అడిగినదంతా నీకు చెప్పాను. ఈరీతిగా దుర్బుద్ధులయిన ధార్తరాష్ట్రులు అడవులలో నివసించే పాండవుల పట్ల చేసిన మోసాలన్నీ వ్యర్థం అయ్యాయి. (48,49)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ద్రౌపదీహరణపర్వణి దుర్వాస ఉపాఖ్యానే త్రిషష్ట్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 263 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ద్రౌపదీహరణపర్వమను ఉపపర్వమున దుర్వాసోపాఖ్యానమను రెండువందల అరువది మూడవ అధ్యాయము. (263)