264. రెండువందల అరువది నాలుగవ అధ్యాయము
జయద్రథుడు ద్రౌపదిని మోహించి కోటికాస్యుని ఆమెకడకు పంపుట.
వైశంపాయన ఉవాచ
తస్మిన్ బహుమృగేఽరణ్యే అటమానా మహారథాః ।
కామ్యకే భరతశ్రేష్ఠాః విజహ్రుస్తే యథామరాః ॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు - బహుమృగాకీర్ణమైన ఆ కామ్యకవనంలో భరతశ్రేష్ఠులు దేవతల వలె అంతటా తిరుగుతూ విహరించసాగారు. (1)
ప్రేక్షమాణా బహువిధాన్ వనోద్దేశాన్ సమంతతః ।
యథర్తుకాలరమ్యాశ్చ వనరాజీః సుపుష్పితాః ॥ 2
ఎన్నో అరణ్యప్రాంతాలను ఆయా ఋతువులలో రమణీయంగా పుష్పించిన వనపంక్తులను చూశారు. (2)
పాండవా మృగయాశీలాః చరంతస్తన్మహద్ వనమ్ ।
విజహ్రురింద్రప్రతిమాః కంచిత్ కాలమరిందమ ॥ 3
శత్రుసూదనా! జనమేజయా! మృగయాసక్తులైన పాండవులు ఆ మహారణ్యంలో తిరుగుతూ కొంతకాలం దేవేంద్రునిలా విహరించారు. (3)
తతస్తే యౌగపద్యేన యయుః సర్వే చతుర్దిశమ్ ।
మృగయాం పురుషవ్యాఘ్రాః బ్రాహ్మణార్థే పరంతపాః ॥ 4
ద్రౌపదీమాశ్రమే న్యస్య తృణబిందోరనుజ్ఞయా ।
మహర్షేర్దీప్తతపసో ధౌమ్యస్య చ పురోధసః ॥ 5
ఒకసారి తమ పురోహితుడు, గొప్ప తపస్వి అయిన ధౌమ్యుని యొక్క, తృణబిందు మహర్షి యొక్క అనుమతి తీసుకొని ద్రౌపదిని ఆశ్రమంలో ఉంచి, పురుషసింహులు అయిన వారంతా బ్రాహ్మణరక్షణార్థం ఒకేసారి వేటకోసం నలుదిక్కులకు వెళ్లారు. (4,5)
తతస్తు రాజా సింధూనాం వార్ ద్ధక్షత్రిర్మహాయశాః ।
వివాహకామః శాల్వేయాన్ ప్రయాతః సోఽభవత్ తదా ॥ 6
మహతా పరిబర్హేణ రాజయోగ్యేన సంవృతః ।
రాజభిర్బహుభిః సార్థమ్ ఉపాయాత్ కామ్యకం చ సః ॥ 7
అదేసమయంలో సింధుదేశపు రాజు మహాకీర్తిశాలి, వృద్ధక్షత్రుని కొడుకు అయిన జయద్రథుడు వివాహేచ్ఛతో శాల్వదేశానికి వెడుతున్నాడు. అతడు రాజోచితమైన ఆభరణాలు అలంకరించుకొని ఉన్నాడు. పెక్కుమంది రాజులతో కూడి ప్రయాణిస్తూ కామ్యకవనాన్ని చేరుకొన్నాడు. (6,7)
తత్రాపశ్యత్ ప్రియాం భార్యాం పాండవానాం యశస్వినీమ్ ।
తిష్ఠంతీమాశ్రమద్వారి ద్రౌపదీం నిర్జనే వనే ॥ 8
అక్కడ అతడు నిర్జనారణ్యంలో ఆశ్రమ ద్వారం వద్ద నిల్చున్న యశస్విని, పాండవుల ప్రియపత్ని అయిన ద్రౌపదిని చూశాడు. (8)
విభ్రాజమానాం వపుషా బిభ్రతీం రూపముత్తమమ్ ।
భ్రాజయంతీం వనోద్దేశం నీలాభ్రమివ విద్యుతమ్ ॥ 9
మెఱుపు నల్లని మబ్బులను వెలిగించినట్లుగా ఆమె అతిసుందర రూపంతో శరీరకాంతితో ఆ అరణ్యప్రాంతాన్నంతటినీ ప్రకాశింపజేస్తూ ఉంది. (9)
అప్సరా దేవకన్యా వా మాయా వా దేవనిర్మితా ।
ఇతి కృత్వాంజలిం సర్వే దదృశుస్తామనిందితామ్ ॥ 10
అప్సరయో, దేవకన్యయో, లేక దేవతలు కల్పించిన మాయయో అనుకొని చేతులు జోడించి అందరూ ఆ మచ్చలేని సుందరిని చూశారు. (10)
తతః స రాజా సింధూనాం వార్ ద్ధక్షత్రిర్జయద్రథః ।
విస్మితస్త్వనవద్యాంగీం దృష్ట్వా తాం దుష్టమానసః ॥ 11
తీరైన అవయవసంపద కల ఆ ద్రౌపదిని చూచి సింధురాజు వృద్ధక్షత్రుని కొడుకు అయిన జయద్రథుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. అతనిలో దుష్టభావనలు కలిగాయి. (11)
స కోటికాస్యం రాజానమ్ అబ్రవీత్ కామమోహితః ।
కస్య త్వేషానపద్యాంగీ యది వాపి న మానుషీ ॥ 12
అతడు కామమోహితుడై కోటికాస్యుడనే రాజుతో ఈ అనవద్యాంగి మానుషస్త్రీ కాకపోతే ఎవరిది అయి ఉంటుంది?" (12)
వివాహార్థో న మే కశ్చిదిమాం ప్రాప్యాతిసుందరీమ్ ।
ఏతామేవాహమాదాయ గమిష్యామి స్వమాలయమ్ ॥ 13
వివాహంకోసం వెళ్లే నాకు ఈ అతిలోకసుందరిని పొందితే వేరెవరితోనూ పనిలేదు. ఈమెనే నేను తెచ్చుకొని ఇంటికి తిరిగివెళ్తాను. (13)
గచ్ఛ జానీహి సౌమ్యేమాం కస్య వాత్ర కుతోఽపి వా ।
కిమర్థమాగతా సుభ్రూః ఇదం కంటకితం వనమ్ ॥ 14
సౌమ్యుడా! వెళ్లు. ఈమె ఎవరికి చెందినదో ఎక్కడిదో, (అందమైన కనుబొమలు కల) ఈమె కంటకావృతమైన ఈ అడవికి ఎందుకువచ్చిందో తెలుసుకో. (14)
అపి నామ వరారోహా మామేషా లోకసుందరీ ।
భజేదద్యాయతాపాంగీ సుదతీ తనుమధ్యమా ॥ 15
చక్కని పలువరుస, సన్నని నడుము, విశాలమైన కన్నులు కలిగిన ఈ అతిలోక సుందరి వరారోహ ఇప్పుడు నన్ను వరిస్తుందా? (15)
అప్యహం కృతకామః స్యామ్ ఇమాం ప్రాప్య వరస్త్రియమ్ ।
గచ్ఛ జానీహి కో న్వస్యాః నాథ ఇత్యేవ కోటిక ॥ 16
స కోటికాస్యస్తచ్ర్ఛుత్వా రథాత్ ప్రస్కంద్య కుండలీ ।
ఉపేత్య పప్రచ్ఛ తదా క్రోష్టా వ్యాఘ్రవధూమివ ॥ 17
ఈ స్త్రీరత్నాన్ని పొంది నేను కృతార్థుడనవుతానా? కోటికా! వెళ్లు. ఈమె నాథుడెవరో కనుక్కో." అన్నాడు. కుండలాలంకృతుడైన కోటికాస్యుడు ఆమాటలను విని రథం నుండి దూకి నక్క ఆడుపులిని సమీపించినట్లుగా వచ్చి ద్రౌపదిని ఇలా అడిగాడు. (16,17)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ద్రౌపదీహరణపర్వణి జయద్రథాగమనే చతుఃషష్ట్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 264 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున వ్రీహిద్రౌణికపర్వమను ఉపపర్వమున జయద్రథాగమనము అను రెండు వందల అరువదియవ అధ్యాయము. (264)