265. రెండు వందల అరువది అయిదవ అధ్యాయము
కోటికాస్యుడు ద్రౌపదికి తన్ను పరిచయము చేసికొని ఆమెను గూర్చి అడుగుట.
కోటిక ఉవాచ
కా త్వం కదంబస్య వినామ్య శాఖమ్
ఏకాఽఽశ్రమే తిష్ఠసి శోభమానా ।
దేదీప్యమానాగ్నిశిఖేవ నక్తం
వ్యాధూయమానా పవనేన సుభ్రూః ॥ 1
కోటికాస్యుడు అడుగుతున్నాడు - "సుందరీ! కడిమి చెట్టుకొమ్మను వంచి విలాసంగా పట్టుకొని ఈ ఆశ్రమంలో ఒంటరిగా ఉన్న నీవు ఎవరవు? రాత్రివేళ గాలికి చెలరేగిన దేదీప్యమానంగా ఉన్న అగ్నిజ్వాలలా శోభిల్లుతున్నావు. (1)
అతీవ రూపేణ సమన్వితా త్వం
న చాప్యరణ్యేషు బిభేషి కిం ను ।
దేవీ ను యక్షీ యది దానవీ వా ।
వరాప్సరా దైత్యవరాంగనా వా ॥ 2
చాలా అందగత్తెవు. ఈ అరణ్యంలో నీకు భయంలేదా? నీవు దేవతవా? యక్షిణివా? దానవివా? లేక అప్సరసవా? దైత్యాంగనవా? (2)
వపుష్మతీ వోరగరాజకన్యా
వనేచరీ వా క్షణదాచరస్త్రీ ।
యద్యేవ రాజ్ఞో వరుణస్య పత్నీ
యమస్య సోమస్య ధనేశ్వరస్య ॥ 3
దివ్యరూపధారిణివి అయిన నాగరాజ కన్యవా? అడవులలో తిరిగే రాక్షసుని భార్యవా? కాకుంటే యమ వరుణ కుబేర చంద్రులలో ఒకరి భార్యవా? (3)
ధాతుర్విధాతుః సవితుర్విభోర్వా
శక్రస్య వా త్వం సదనాత్ ప్రపన్నా ।
న హ్యేవ నః పృచ్ఛసి యే వయం స్మ
న చాపి జానీమ తవేహ నాథమ్ ॥ 4
లేక ధాత, విధాత, సవిత, ఇంద్రుడు - వీరిలో ఎవరి భవనం నుండి అయినా వచ్చావా? మా గురించి నీవు అడగవు. నీ పతి గురించి మేము కూడా ఎరుగము. (4)
వయం హి మానం తవ వర్దయంతః ।
పృచ్ఛామ భద్రే ప్రభవం ప్రభుం చ ।
ఆచక్ష్వ బంధూశ్చ పతిం కులం చ
తత్త్వేన యచ్చేహ కరోషి కార్యమ్ ॥ 5
భద్రా! మేము నీ గౌరవాన్ని పెంపుచేస్తూ నీ తండ్రిని, భర్తను గూర్చి అడుగుతున్నాం. నీ బంధువులను గూర్చి, భర్త, వంశం గురించి కూడా చెప్పు. ఇంకా ఇక్కడ నిజంగా నీవేమి చేస్తున్నావో చెప్పు. (5)
అహం తు రాజ్ఞః సురథస్య పుత్రో
యం కోటికాస్యేతి విదుర్మనుష్యాః ।
అసౌ తు యస్తిష్ఠతి కాంచనాంగే
రథే హుతోఽగ్నిశ్చయనే యథైవ ॥ 6
త్రిగర్తరాజః కమలాయతాక్షి
క్షేమంకరో నామ స ఏష వీరః ।
కమలాయతాక్షీ! నేను సురథుడనే రాజు కొడుకును. నన్ను ప్రజలు కోటికాస్యుడని అంటారు. బంగారుమయమైన రథం మీద వేదియందు వేల్చబడిన అగ్నిలా ప్రకాశించే ఆ వీరుడు త్రిగర్తరాజు క్షేమంకరుడు. (6 1/2)
అస్మాత్ పరస్త్వేష మహాధనుష్మాన్
పుత్రః కులిందాధిపతేర్వరిష్ఠః ॥ 7
నిరీక్షతే త్వాం విపులాయతాక్షః
సుపుష్పితః పర్వతవాసనిత్యః ।
ఆ తరువాత మహాధనుర్ధారి, విశాలమైన కన్నులతో చక్కని పూలమాలలు ధరించి, నిన్ను చూస్తూ ఉన్నవాడు కుళిందరాజు పెద్దకొడుకు. నిత్యమూ పర్వతమే వాసస్థానంగా ఉన్నవాడు. (7 1/2)
అసౌ తు యః పుష్కరిణీసమీపే
శ్యామో యువా తిష్ఠతి దర్శనీయః ॥ 8
ఇక్ష్వాకురాజ్ఞః సుబలస్య పుత్రః
స ఏవ హంతా ద్విషతాం సుగాత్రి ।
సుందరాంగీ! పుష్కరిణీ సమీపంలో నల్లని యువకుడు చూడచక్కనివాడు ఉన్నాడే వాడు ఇక్ష్వాకురాజైన సుబలుని సుతుడు. ఇతడు శత్రువులను మట్టుపెట్టగల సమర్థుడు. (8 1/2)
యస్యానుచక్రం ధ్వజినః ప్రయాంతి
సౌవీరకా ద్వాదశ రాజపుత్రాః ॥ 9
శోణాశ్వయుక్తేషు రథేషు సర్వే
మఖేషు దీప్తా ఇవ హవ్యవాహాః ।
అంగారకః కుంజరో గుప్తకశ్చ
శత్రుంజయః సంజయసుప్రవృద్ధౌ ॥ 10
భయంకరోఽథ భ్రమరో రవిశ్చ
శూరః ప్రతాపః కుహనశ్చ నామ ।
యం షట్ సహస్రా రథినోఽనుయాంతి
నాగా హయాశ్చైవ పదాతినశ్చ ॥ 11
జయద్రథో నామ యది శ్రుతస్తే
సౌవీరరాజః సుభగే స ఏషః ।
ఎఱ్ఱనిగుఱ్ఱాలు పూన్చిన రథాలలో యజ్ఞాలలోని అగ్నుల వలె ప్రకాశిస్తూ సౌవీరరాజకుమారులు అంగారకుడు, కుంజరుడు, గుప్తకుడు, శత్రుంజయుడు, సంజయుడు, సుప్రవృద్ధుడు, భయంకరుడు, భ్రమరుడు, రవి, శూరుడు, ప్రతాపుడు, కుహనుడు - అనే పన్నెండుమంది ధ్వజాలు చేతధరించి రథం వెనుక నడువగా, ఆరువేల రథాలు, ఏనుగులు, గుఱ్ఱాలు, పదాతులు అనుసరిస్తున్నాయే అక్కడ ఉన్న ఆ సుభగుడు సౌవీరరాజు జయద్రథుడు. అతని పేరు నీవు వినే ఉంటావు. (9-11 1/2)
తస్యాపరే భ్రాతరోఽదీనసత్త్వా
బలాహకానీకవిదారణాద్యాః ॥ 12
అతని యొక్క ఇతరసోదరులు దృఢచిత్తులు అయిన బలాహక, అనీక, విదారణ మొదలైన వారు కూడా అతనితో ఉన్నారు. (12)
సౌవీరవీరాః ప్రవరా యువానో
రాజానమేతే బలినోఽనుయాంతి ।
ఏతైః సహాయైరుపయాతి రాజా
మరుద్గణైరింద్ర ఇవాభిగుప్తః ॥ 13
యువకులు, బలిష్ఠులు అయిన ఈ సౌవీర వీరప్రముఖులు రాజైన జయద్రధుని వెన్నంటి నడుస్తారు. ఈ సహయకులతో ఇంద్రుడు మరుద్గణాల చేత రక్షింపబడుతూన్నట్లు రాజు ప్రయాణిస్తున్నాడు. (13)
అజానతాం ఖ్యాపయ నః సుకేశి
కస్యాసి భార్యా దుహితా చ కస్య ॥ 14
సుకేశీ! మాకు నీ గురించి తెలియదు. కాబట్టి నీవు ఎవరి భార్యవో, ఎవరి కుమార్తెవో చెప్పు. (14)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ద్రౌపదీహరణపర్వణి కోటికాస్యప్రశ్నే పంచషష్ట్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 265 ॥
ఇది శ్రీ మహాభారతమున వనపర్వమున ద్రౌపదీహరణపర్వమను ఉపపర్వమున కోటికాస్యుడు ప్రశ్నించుట అను రెండువందల అరువది అయిదవ అధ్యాయము. (265)