271. రెండు వందల డెబ్బది ఒకటవ అధ్యాయము

జయద్రథుడు ద్రౌపదిని విడిచి పారిపోవుట - భీమార్జునులు అతనిని వెన్నంటుట.

వైశంపాయన ఉవాచ
సంతిష్ఠత ప్రహరత తూర్ణం విపరిధావత ।
ఇతి స్మ సైంధవో రాజా చోదయామాస తాన్ నృపాన్ ॥ 1
వైశంపాయన చెపుతున్నాడు - "సింధురాజు తన వెంట వచ్చిన ఆ రాజులందరినీ - "నిలవండి ఎదుర్కోండి. ముందుకు దూసుకువెళ్లండి" అని ఉత్సాహపరచసాగాడు. (1)
తతో ఘోరతమః శబ్దః రణే సమభవత్ తదా ।
భీమార్జునయమాన్ దృష్ట్వా సైన్యానాం సయుధిష్ఠిరాన్ ॥ 2
ఆ సమయంలో యుద్ధభూమిలో యుధిష్ఠిరునితో సహితంగా భీమార్జుననకుల సహదేవులను చూసి జయద్రథుని సైనికులలో దారుణమైన కోలాహలం చెలరేగింది. (2)
శిబిసౌవీరసింధూనాం విషాదశ్చాప్యజాయత ।
తాన్ దృష్ట్వా పురుషవ్యాఘ్రాన్ వ్యాఘ్రానివ బలోత్కటాన్ ॥ 3
పెద్దపులుల వలె బలవంతులైన ఆ పురుష పుంగవులను చూచి శిబి, సౌవీర, సింధురాజుల మనసులలో కూడా విషాదం అలముకొంది. (3)
హేమచిత్రసముత్సేధాం సర్వశైక్యాయసీం గదామ్ ।
ప్రగృహ్యాభ్యద్రవద్ భీమః సైంధవం కాలచోదితమ్ ॥ 4
బంగారు తాపడంతో చిత్రవర్ణశోభితమైన, శైక్యమనే ఇనుముతో చేయబడిన గదను తీసుకొని భీముడు కాలప్రేరితుడైన సింధురాజువైపు ఉరికాడు. (4)
తదంతరమథావృత్య కోటికాస్యోఽభ్యహారయత్ ।
మహతా రథవంశేన పరివార్య వృకోదరమ్ ॥ 5
ఇంతలో కోటికాస్యుడు గొప్ప రథసైన్యంతో భీముని అన్నివైపుల నుండి చుట్టుముడుతూ ఇరువురి మధ్య దూరాన్ని ఎక్కువ చేశాడు. (5)
శక్తితోమరనారాచైః వీరబాహుప్రచోదితైః ।
కీర్యమాణోఽపి బహుభిః న స్మ భీమోఽభ్యకంపత ॥ 6
వీరభుజులైన ఆ యోధులు ప్రయోగించిన శక్తి, తోమర, నారాచాలు అధికంగా వెదచల్లబడినప్పటికీ భీముడు ఏ మాత్రం చలించలేదు. (6)
గజం తు సగజారోహం పదాతీంశ్చ చతుర్దశ ।
జఘాన గదయా భీమః సైంధవధ్వజినీముఖే ॥ 7
భీముడు సైంధవసేనాముఖంలోకి వెళ్లి మావటివానితో పాటుగా ఒక ఏనుగును, పద్నాలుగు మంది పదాతులను గదతో మోది చంపివేశాడు. (7)
పార్థః పంచ శతాన్ శూరాన్ పర్వతీయాన్ మహారథాన్ ।
పరీప్సమానః సౌవీరం జఘాన ధ్వజినీముఖే ॥ 8
అర్జునుడు సౌవీర రాజు అయిన జయద్రథుని పట్టుకోవాలనే కోరికతో సేనాగ్రభాగాన నిలిచిన శూరులైన, ఐదువందలమంది పార్వతీయులను చంపివేశాడు. (8)
రాజా స్వయం సువీరాణాం ప్రవరాణాం ప్రహారిణామ్ ।
నిమేషమాత్రేణ శతం జఘాన సమరే తదా ॥ 9
స్వయంగా యుధిష్ఠిర మహారాజుకూడా యుద్ధంలో తనపై ప్రహారాలు కురిపిస్తున్న ప్రముఖ సౌవీర క్షత్రియులను వందమందిని రెప్పపాటుకాలంలో వధించాడు. (9)
దదృశే నకులస్తత్ర రథాత్ ప్రస్కంద్య ఖడ్గదృక్ ।
శరాంసి పాదరక్షాణాం బీజవత్ ప్రవపన్ ముహుః ॥ 10
నకులుడు ఖడ్గధారియై రథం నుండి దూకి పాదరక్షకుల యొక్క తలలను నరికి విత్తనాలవలె భూమిపై పాతిపెట్టడం కనిపించింది. (10)
సహదేవస్తు సంయాయ రథేన గజయోధినః ।
పాతయామాస నారాచైః ద్రుమేభ్య ఇవ బర్హిణః ॥ 11
సహదేవుడు రథంతో ముందుకు కదిలి వేటకాడు చెట్ల నుండి నెమళ్లను పడగొట్టినట్లుగా నారాచాలతో గజయోధులను నేలకూల్చాడు. (11)
తతస్త్రిగర్తః సధనుః అవతీర్య మహారథాత్ ।
గదయా చతురో వాహాన్ రాజ్ఞస్తస్య తదావధీత్ ॥ 12
అంతలో త్రిగర్తరాజు ధనుర్ధరుడై పెద్దరథాన్నుండి దిగి, గదతో యుధిష్ఠిర మహారాజు యొక్క నాలుగు గుఱ్ఱాలను కూల్చివేశాడు. (12)
తమభ్యాశగతం రాజా పదాతిం కుంతినందనః ।
అర్థచంద్రేణ బాణేన వివ్యాధోరసి ధర్మరాట్ ॥ 13
కాలి నడకన తనకు దగ్గరగా వచ్చిన అతనిని కుంతీనందనుడు యుధిష్ఠిరుడు అర్ధచంద్రబాణంతో రొమ్ముపై కొట్టాడు. (13)
స భిన్నహృదయో వీరః వక్త్రాచ్ఛోణితముద్వమన్ ।
పపాతాభిముఖః పార్థం ఛిన్నమూల ఇవ ద్రుమః ॥ 14
గుండెబ్రద్దలయి ఆ వీరుడు నోటినుండి రక్తాన్ని కక్కుకుంటూ యుధిష్ఠిరుని ఎదుటనే మొదలు నరికిన చెట్టులా పడిపోయాడు. (14)
ఇంద్రసేనద్వితీయస్తు రథాత్ ప్రస్కంద్య ధర్మరాట్ ।
హతాశ్వః సహదేవస్య ప్రతిపేదే మహారథమ్ ॥ 15
తన గుఱ్ఱాలు చనిపోగా యుధిష్ఠిరుడు సారథి అయిన ఇంద్రసేనునితో కలిసి రథాన్నుండి దూకి సహదేవుని పెద్దరథాన్ని ఎక్కాడు. (15)
నకులం త్వభిసంధాయ క్షేమంకరమహాముఖౌ ।
ఉభావుభయతస్తీక్ష్ణ్రైః శరవర్షైరవర్షతామ్ ॥ 16
మరొకవైపు క్షేమంకరుడు, మహాముఖుడు అనే రాజులిద్దరూ నకులుని లక్ష్యంగా చేసుకొని రెండువైపుల నుండి బాణవర్షాన్ని కురిపించారు. (16)
తోమరైరభివర్షంతౌ జీమూతావివవ వార్షికౌ ।
ఏకైకేన విపాఠేన జఘ్నే మాద్రవతీసుతః ॥ 17
వర్షాకాలంలోని మేఘాలవలె తోమరాలను వర్షిస్తున్న ఆ ఇద్దరిని మాద్రీసుతుడైన నకులుడు విపాఠమనే ఒక్కొక్క బాణంతో నేలకూల్చాడు. (17)
త్రిగర్తరాజః సురథః తస్యాథ రథధూర్గతః ।
రథమాక్షేపయామాస గజేన గజయానవిత్ ॥ 18
ఏనుగులను నడపటంలో దిట్ట అయిన త్రిగర్తరాజు సురథుడు నకులుని రథాగ్రం దగ్గరకు చేరి తన ఏనుగుచేత రథాన్ని దూరంగా విసిరివేయించాడు. (18)
నకులస్త్వపభీస్తస్మాద్ రథాచ్చర్మాసిపాణిమాన్ ।
ఉద్భ్రాంతం స్థానమాస్థాయ తస్థౌ గిరిరివాచలః ॥ 19
కాణి నకులుడు ఏమాత్రం భయపడక కత్తిని డాలును ధరించి రథం నుండి దూకి క్షేమంగా ఉండే చోట కొండవలె నిశ్చలంగా నిలబడ్డాడు. (19)
సురథస్తం గజవరం వధాయ నకులస్య తు ।
ప్రేషయామాస సక్రోధమ్ అత్యుచ్ఛ్రితకరం తతః ॥ 20
అంతట సురథుడు క్రోధంతో ఘీంకరిస్తూ తొండం పైకెత్తిన గజరాజును నకులుని చంపడానికి అతని మీదికి తోలాడు. (20)
నకులస్తస్య నాగస్య సమీపపరివర్తినః ।
సవిషాణాం భుజం మూలే ఖడ్గేన నిరకృంతత ॥ 21
కాని నకులుడు తనకు దగ్గరగా వచ్చిన ఆ ఏనుగు యొక్క తొండాన్ని దంతాలతో సహా మొదలంటా కత్తితో నరికేశాడు. (21)
స వినద్య మహానాదం గజః కింకిణిభూషణః ।
పతన్నవాక్శిరా భూమౌ హస్త్యారోహమపోథయత్ ॥ 22
చిరుమువ్వలతో అలంకరింపబడిన ఆ ఏనుగు పెద్దగా ఘీంకరిస్తూ తలకిందికి వాల్చి భూమి మీదికి ఒరిగిపోతూ తనపైనున్న వానిని కూడా కిందికి కూలదోసింది. (22)
స తత్ కర్మ మహత్ కృత్వా శూరో మాద్రవతీసుతః ।
భీమసేనరథం ప్రాప్య శర్మ లేభే మహారథః ॥ 23
ఆ ఘనకార్యాన్ని సాధించి మహారథి అయిన నకులుడు భీమసేనుని రథాన్ని ఎక్కి ఊపిరి పీల్చుకున్నాడు. (23)
భీమస్త్వాపతతో రాజ్ఞః కోటికాస్యస్య సంగరే ।
సూతస్య మదతో వాహాన్ క్షురేణాపాహరచ్ఛిరః ॥ 24
భీమసేనుడు యుద్ధంలో తన మీదికి వచ్చిన కోటికాస్యుని యొక్క గుఱ్ఱాలను తోలుతున్న సారథిని ఒక్క క్షురంతో తలను నరికేశాడు. (24)
న బుబోధ హతం సూతం స రాజా బాహుశాలినా ।
తస్యాశ్వా వ్యద్రవన్ సంఖ్యే హతసూతాస్తతస్తతః ॥ 25
తన సూతుడు బాహుశాలి అయిన భీమునిచేత చంపబడినట్లు ఆ రాజుకు తెలియనే లేదు. సారథి చనిపోగా అతని గుఱ్ఱాలు యుద్ధభూమిలో అటు ఇటు పరుగులు తీశాయి. (25)
విముఖం హతసూతం తం భీమః ప్రహరతాం వరః ।
జఘాన తలయుక్తేన ప్రాసేనాభ్యేత్య పాండవః ॥ 26
సూతుడు చనిపోగా యుద్ధవిముఖుడైన అతనిని శస్త్రధారులలో మేటి అయిన భీముడు సమీపించి తొడుగు కలిగిన ప్రాసమనే ఆయుధంతో చంపివేశాడు. (26)
ద్వాదశానాం తు సర్వేషాం సౌవీరాణాం ధనంజయః ।
చకర్త నిశితైర్భల్లైః ధనూంషి చ శిరాంసి చ ॥ 27
ధనంజయుడు పన్నెండు మంది సౌవీరరాజుల యొక్క ధనుస్సులను, శిరస్సులను కూడా వాడి భల్లాలతో నరికివేశాడు. (27)
శిబీనిక్ష్వాకుముఖ్యాంశ్చ త్రిగర్తాన్ సైంధవానపి ।
జఘానాతిరథః సంఖ్యే బాణగోచరమాగతాన్ ॥ 28
అతిరథుడైన అర్జునుడు యుద్ధంలో తన బాణాలకు అడ్డువచ్చిన త్రిగర్తులను, సైంధవులను, శిబి ఇక్ష్వాకు ప్రముఖులందరినీ చంపివేశాడు. (28)
సాదితాః ప్రత్యదృశ్యంత బహవః సవ్యసాచినా ।
సపతాకాశ్చ మాతంగాః పధ్వజాశ్చ మహారథాః ॥ 29
అర్జునుడు చంపిన పతాకాలతో కూడిన ఏనుగులు, అలాగే ధ్వజాలతో కూడిన మహారథాలు ఎన్నో కనిపించాయి. ఆయుద్ధభూమిలో అనేకం దర్శనమిచ్చాయి. (29)
ప్రచ్ఛాద్య పృథివీం తస్థుః సర్వమాయోధనం ప్రతి ।
శరీరాణ్యశిరస్కాని విదేహాని శిరాంసి చ ॥ 30
ఆ సమయంలో తలలు లేని మొండెములు, శరీరాలు లేని తలలు ఆ యుద్ధభూమి నిండా పరుచుకొని, చెల్లా చెదురుగా పడిపోయాయి. (30)
శ్వగృధ్రకంకకాకోలభాసగోమాయువాయసాః ।
అతృప్యంస్తత్ర వీరాణాం హతానాం మాంసశోణితైః ॥ 31
ఆ రణభూమిలో చనిపోయిన వీరుల రక్తమాంసాలతో కుక్కలు, గద్దలు, బొల్లిగద్దలు, కొండ కాకులు, గృధ్రాలు, నక్కలు, కాకులు అన్నీ తృప్తి పొందాయి. (31)
హతేషు తేషు వీరేషు సింధురాజో జయద్రథః ।
విముచ్య కృష్ణాం సంత్రస్తః పలాయనపరోఽభవత్ ॥ 32
ఆ వీరులందరూ చనిపోగా సింధురాజు జయద్రథుడు భయపడి ద్రౌపదిని వదిలి పారిపోసాగాడు. (32)
స తస్మిన్ సంకులే సైన్యే ద్రౌపదీమవతార్య తామ్ ।
ప్రాణప్రేప్సురుపాధావద్ వనం యేన నరాధమః ॥ 33
నరాధముడైన జయద్రథుడు ఆ సంకులసైన్యమధ్యంలో ద్రౌపదిని రథం నుండి దించివేసి తన ప్రాణలు రక్షించుకోవాలని అడవిలోకి పారిపోయాడు. (33)
ద్రౌపదీం ధర్మరాజస్తు దృష్ట్వా ధౌమ్యపురస్కృతామ్ ।
మాద్రీపుత్రేణ వీరేణ రథమారోపయత్ తదా ॥ 34
ధౌమ్యముని ముందు నడవగా వెనుక వస్తున్న ద్రౌపదిని చూచి ధర్మరాజు మాద్రీసుతుడైన సహదేవుని పంపి ఆమెను రథంలో ఎక్కించాడు. (34)
తతస్తద్ విద్రుతం సైన్యమ్ అపయాతే జయద్రథే ।
ఆదిశ్యాదిశ్య నారాచైః ఆజఘాన వృకోదరః ॥ 35
జయద్రథుడు తొలగిపోగానే చిందరవందర అయిన సైన్యాన్ని భీముడు తనపేరు చెప్పి చెప్పి మరీ బాణాలతో కొట్టి సంహరించాడు. (35)
సవ్యసాచీ తు తం దృష్ట్వా పలాయంతం జయద్రథమ్ ।
వారయామాస నిఘ్నంతం భీమం సైంధవసైనికాన్ ॥ 36
జయద్రథుని పలాయనాన్ని చూచిన అర్జునుడు ఆ సైంధవుని సైనికులను చంపుతున్న భీముని వారించాడు. (36)
అర్జున ఉవాచ
యస్యాపచారాత్ ప్రాప్తోఽయమ్ అస్మాన్ క్లేశో దురాసదః ।
తమస్మిన్ సమరోద్దేశే న పశ్యామి జయద్రథమ్ ॥ 37
అర్జునుడు అన్నాడు - ఏ దురాత్ముని వలన మనకు ఈ కష్టం కలిగిందో ఆ జయద్రథుడు ఈ రణభూమిలో కనిపించడం లేదు. (37)
తమేవాన్విష భద్రం తే కిం తే యోధైర్నిపాతితైః ।
అనామిషమిదం కర్మ కథం వా మన్యతే భవాన్ ॥ 38
సోదరా! నీకు మేలగుగాక. అతనినే అన్వేషించు. ఈ యోధులను చంపడం వలన నీకేమి లాభం? ఇది వ్యర్థం కదా! నీకేమనిపిస్తోంది? (38)
వైశంపాయన ఉవాచ
ఇత్యుక్తో భీమసేనస్తు గుడాకేశేన ధీమతా ।
యుధిష్ఠిరమభిప్రేక్ష్య వాగ్మీ వచనమబ్రవీత్ ॥ 39
వైశంపాయనుడు చెపుతున్నాడు - బుద్ధిమంతుడయిన అర్జునుడు ఇలా అనగానే మాటలలో నేర్పుకల భీముడు యుధిష్ఠిరుని చూచి ఇలా అన్నాడు. (39)
హతప్రవీరా రిపవో భూయిష్టం విద్రుతా దిశః ।
గృహీత్వా ద్రౌపదీం రాజన్ నివర్తతు భవానితః ॥ 40
"రాజా। శత్రువులలో ముఖ్యులందరూ చపిపోయారు. సైనికులలో చాలామంది దిక్కులుపట్టి పారిపోయారు. ద్రౌపదిని తీసుకొని మీరు ఇక్కడి నుండి వెనుకకు మరలండి. (40)
యమాభ్యాం సహ రాజేంద్ర ధౌమ్యేన చ మహాత్మనా ।
ప్రాప్యాశ్రమపదం రాజన్ ద్రౌపదీం పరిసాంత్వయ ॥ 41
రాజేంద్రా! మహాత్ముడయిన ధౌమ్యునితో నకుల సహదేవులతో కలిసి ఆశ్రమానికి వెళ్లి ద్రౌపదిని ఓదార్చండి. (41)
న హి మే మోక్ష్యతే జీవన్ మూఢః సైంధవకో నృపః ।
పాతాలతలసంస్థోఽపి యది శక్రోఽస్య సారథిః ॥ 42
ఆ మూర్ఖుడు సైంధవుడు పాతాళప్రదేశంలో దాగున్నాసరే స్వయంగా ఇంద్రుడే అతనికి సారథిగా వచ్చినాసరే, ఇప్పుడు నా నుండి ప్రాణాలతో తప్పించుకో లేడు". (42)
యుధిష్ఠిర ఉవాచ
న హంతవ్యో మహాబాహో దురాత్మాపి స సైంధవః ।
దుఃశలామభిసంస్మృత్య గాంధారీం చ యశస్వినీమ్ ॥ 43
యుధిష్ఠిరుడు అంటున్నాడు - "మహాబాహూ! ఆ సైంధవుడు దురాత్ముడయినప్పటికీ యశస్విని అయిన గాంధారిని, దుశ్శలను తలచుకొని చంపకూడదు". (43)
వైశంపాయన ఉవాచ
తచ్ఛ్రుత్వా ద్రౌపదీ భీమమ్ ఉవాచ వ్యాకులేంద్రియా ।
కుపితా హ్రీమతీ ప్రాజ్ఞా పతీ భీమార్జునావుభౌ ॥ 44
వైశంపాయనుడు చెపుతున్నాడు - " ఆ మాటలు విని ద్రౌపదిని ఇంద్రియాలన్నీ వ్యాకులం చెందగా ప్రాజ్ఞురాలు, లజ్జావతి అయినప్పటికీ కోపగించి పతులయిన భీమార్జునులిద్దరినీ ఉద్దేశించి ఇలా అంది. (40)
కర్తవ్యం చేత్ ప్రియం మహ్యం వధ్యః స పురుషాధమః ।
సైంధవాపసదః పాపో దుర్మతిః కులపాంసనః ॥ 45
"మీరు నాకు ప్రియం చేయదలచుకొంటే ఆ నరాధముని వధించండి. ఆ పాపాత్ముడు, దుర్బుద్ధి సింధుదేశానికి కళంకం. కులంలో చిచ్చు వంటివాడు. (45)
భార్యాభిహర్తా వైరీ యో యశ్చ రాజ్యహరో రిపుః ।
యాచమానోఽపి సంగ్రామే న మోక్తవ్యః కథంచన ॥ 46
భార్యను అపహరించిన శత్రువుగాని, రాజ్యాన్ని హరించిన శత్రువుగాని యుద్ధంలో ప్రాణదానం చేయమని ప్రాధేయపడినా వదిలిపెట్టకూడదు". (46)
ఇత్యుక్తౌ తౌ వరవ్యాఘ్రౌ యయతుర్యత్ర సైంధవః ।
రాజా నివవృతే కృష్ణామ్ ఆదాయ సపురోహితః ॥ 47
ద్రౌపది ఇలా చెప్పగానే ఆ పురుషసింహులు ఇద్దరూ సైంధవుడు వెళ్లిన వైపుకు వెళ్లారు. యుధిష్ఠిరమహారాజు ద్రౌపదిని తీసుకొని పురోహిత సహితంగా వెనుకకు తిరిగాడు. (47)
స ప్రవిశ్యాశ్రమపదమ్ అపవిద్ధబృసీమఠమ్ ।
మార్కండేయాదిభిర్వప్రైః అనుకీర్ణం దదర్శ హ ॥ 48
అతడు ఆశ్రమాన్ని చేరుకొనే సరికి కూర్చుండే ఆసనాలు ఇతరవస్తువులూ చిందరవందరగా పడి ఉన్నాయి. మార్కండేయాది విప్రులందరూ అక్కడ గుమికూడి ఉన్నారు. (48)
ద్రౌపదీమనుశోచద్భిః బ్రాహ్మణైస్తైః సమాహితైః ।
సమియాయ మహాప్రాజ్ఞః సభార్యో భ్రాతృమధ్యగః ॥ 49
అక్కడి వారందరూ మనసులలో పదేపదే ద్రౌపదిని గూర్చి విచారిస్తున్నారు. అంతలో మహాప్రాజ్ఞుడు అయిన యుధిష్ఠిరుడు భార్యను వెంటపెట్టుకొని సోదరులతో కలిసి అక్కడికి వచ్చాడు. (49)
తే స్మ తం ముదితా దృష్ట్వా పునః ప్రత్యాగతం నృపమ్ ।
జిత్వా తాన్ సింధుసౌవీరాన్ ద్రౌపదీం చాహృతాం పునః ॥ 50
సింధు సౌవీరరాజులను జయించి, అపహరింపబడిన ద్రౌపదిని తీసుకొని తిరిగి మరలివచ్చిన రాజును చూచి వారందరూ సంతోషించారు. (50)
స తైః పరివృతో రాజా తత్రైవోపవివేశ హ ।
ప్రవివేశాశ్రమం కృష్ణా యమాభ్యాం సహ భావినీ ॥ 51
వారందరూ పరివేష్టించగా రాజు అక్కడే కూర్చుండిపోయాడు. భూమిని ద్రౌపది కవలతో కలిసి ఆశ్రమం లోపలికి వెళ్లింది. (51)
భీమసేనార్జునౌ చాపి శ్రుత్వా క్రోశగతం రిపుమ్ ।
స్వయమశ్వాంస్తుదంతౌ తౌ జవేనైవాభ్యధావతామ్ ॥ 52
ఇక్కడ భీమార్జునులు కూడా శత్రువు క్రోసెడు దూరం వెళ్లాడని విని స్వయంగా గుఱ్ఱాలను తోలుకొంటూ వేగంగా ముందుకు సాగిపోయారు. (52)
ఇదమత్యద్భుతం చాత్ర చకార పురుషోఽర్జునః ।
క్రోశమాత్రగతానశ్వాన్ సైంధవస్య జఘాన యత్ ॥ 53
స హి దివ్యాస్త్రసంపన్నః కృచ్ఛ్రకాలేఽప్యసంభ్రమః ।
అకరోద్ దుష్కరం కర్మ శరైరస్త్రానుమంత్రితైః ॥ 54
నరోత్తముడయిన అర్జునుడు ఇక్కడ ఒక అత్యద్భుత కార్యం చేశాడు. కోసెడు దూరంలో ఉన్న సైంధవుని గుఱ్ఱాలను చంపి వేశాడు. అతడు దివ్యాస్త్ర సంపన్నుడు. సంకటస్థితిలో కూడా తడబాటుపడడు. అస్త్రాలతో అభిమంత్రించిన బాణాలను ఉపయోగించి ఈ దుష్కరకార్యాన్ని చేశాడు. (53,54)
తతోఽభ్యధావతాం వీరావుభౌ భీమధనంజయౌ ।
హతాశ్వం సైంధవం భీతమ్ ఏకం వ్యాకులచేతసమ్ ॥ 55
గుఱ్ఱాలు చనిపోగా భయంతో వ్యాకులచిత్తుడూ ఒంటరివాడూ అయిన సైంధవుని ఆ భీమార్జునులు ఇద్దరూ వెంబడించారు. (55)
సైంధవస్తు హతాన్ దృష్ట్వా తథాఽశ్వాన్ స్వాన్ సుదుఃఖితః ।
అతివిక్రమకర్మాణి కుర్వాణం చ ధనంజయమ్ ॥ 56
చనిపోయిన తన గుఱ్ఱాలను, వెనుక వస్తున్న అలౌకిక పరాక్రమం చూపిన అర్జునుని చూచి సైంధవుడు ఎంతో దుఃఖించాడు. (56)
పలాయనకృతోత్సాహః ప్రాద్రవద్ యేన వై వనమ్ ।
సైంధవం త్వభిసంప్రేక్ష్య పరాక్రాంతం పలాయనే ॥ 57
అనుయాయ మహాబాహుః ఫాల్గునో వాక్యమబ్రవీత్ ।
కేవలం పారిపోవాలనే తపనతోనే సైంధవుడు అడవిలోకి పరుగెత్తాడు. పారిపోవడంలో పరాక్రమం చూపుతున్న సైంధవుని చూచి మహాబాహువు అయిన అర్జునుడు అతనిని వెంబడించి ఇలా అన్నాడు. (57 1/2)
అనేన వీర్యేణ కథం స్త్రియం ప్రార్థయసే బలాత్ ॥ 58
రాజపుత్ర నివర్తస్వ న తే యుక్తం పలాయనమ్ ।
కథం హ్యనుచరాన్ హిత్వా శత్రుమధ్యే పలాయసే ॥ 59
"రాజకుమారా! ఇలాంటి పరాక్రమంతోనే పరస్త్రీని బలవంతంగా పొందాలనుకొన్నావా? వెనక్కి తిరుగు. పారిపోవడం నీకు తగదు. శత్రుమధ్యంలో నీ సేవకులను వదిలి ఎలా పారిపోతావు? (58,59)
ఇత్యుచ్యమానః పార్థేన సైంధవో న న్యవర్తత ।
తిష్ఠ తిష్ఠేతి తం భీమః సహసాభ్యద్రవద్ బలీ ।
మా వధీరితి పార్థస్తం దయావాన్ ప్రత్యభాషత ॥ 60
అర్జునుడు ఇలా నిందించినా సైంధవుడు వెనక్కి తిరగలేదు. బలిష్ఠుడయిన భీముడు వెంటనే "ఆగు ఆగు" అంటూ అతని వెంటపడ్డాడు. దయాళువు అయిన అర్జునుడు "అతని ప్రాణాలు తీయకు" అని అతనిని హెచ్చరించాడు. (60)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ద్రౌపదీహరణపర్వణి జయద్రథపలాయనే ఏకసప్తత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 271 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ద్రౌపదీహరణపర్వమను ఉపపర్వమున జయద్రథపలాయనమను రెండువందల డెబ్బది ఒకటవ అధ్యాయము. (271)