297. రెండువందల తొంబది ఏడవ అధ్యాయము

సావిత్రీ యమ సంవాదము ; సత్యవంతుడు మరల బ్రతుకుట.

మార్కండేయ ఉవాచ
అథ భార్యాసహాయః సః ఫలాన్యాదాయ వీర్యవాన్ ।
కఠినం పూరయామాస తతః కాష్ఠాన్యపాటయత్ ॥ 1
మార్కండేయుడిలా అన్నాడు. అప్పుడు శక్తిశాలి అయిన ఆ సత్యవంతుడు భార్య సహకారంతో పండ్లను ఏరి, పాత్రను నింపాడు. తరువాత కట్టెలు కొట్టసాగాడు. (1)
తస్య పాటయతః కాష్ఠం స్వేదో వై సమజాయత ।
వ్యాయామేన చ తేనాస్య జజ్ఞే శిరసి వేదనా ॥ 2
సోఽభిగమ్య ప్రియాం భార్యామ్ ఉవాచ శ్రమపీడితః ।
కట్టెలు కొడుతున్న సత్యవంతునకు చెమటపట్టింది. ఆ శ్రమతో అతనికి శిరోవేదన కలిగింది. శ్రమతో అలసిపోయిన అతడు ప్రియపత్ని దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. (2 1/2)
సత్యవానువాచ
వ్యాయామేన మమానేన జాతా శిరసి వేదనా ॥ 3
అంగాని చైవ సావిత్రి హృదయం దూయతీవ చ ।
అస్వస్థమివ చాత్మానం లక్షయే మితభాషిణి ॥ 4
శూలైరివ శిరో విద్ధమ్ ఇదం సంలక్షయామ్యహమ్ ।
తత్ స్వప్తుమిచ్ఛే కల్యాణి న స్థాతుం శక్తిరస్తి మే ॥ 5
సత్యవంతుడిలా అన్నాడు.
కట్టెలు కొట్టిన శ్రమతో నాకు తలనొప్పి వచ్చింది. సావిత్రీ! ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నాయి. మనస్సు దహించుకొని పోతోంది మితభాషిణీ! తలను శూలాలతో గ్రుచ్ఛుతున్నట్టుంది. కళ్యాణీ! కొంచెంసేపు నిదురించాలి. నాకిక నిలిచే శక్తి లేదు. (3-5)
సా సమాసాద్య సావిత్రీ భర్తారముపగమ్య చ ।
ఉత్సంగేఽస్య శిరః కృత్వా నిషసాద మహీతలే ॥ 6
అది విని సావిత్రి భర్త దగ్గరకు వచ్చి, ఆయన తలను తన ఒడిలోనికి తీసికొని, నేలపై కూర్చున్నది. (6)
తతః సా నారదవచః విమృశంతీ తపస్వినీ ।
తం ముహూర్తం క్షణం వేలాం దివసం చ యుయోజ హ ॥ 7
అప్పుడు ఆ తపస్విని నారదవచనాన్ని తలచుకొంటూ ఆ ముహూర్తాన్ని, క్షణాన్ని, సమయాన్ని, దినాన్ని పోల్చి చూచుకొన్నది. (7)
ముహూర్తాదేవ చాపశ్యత్ పురుషం రక్తవాససమ్ ।
బద్ధమౌలిం వపుష్మంతమ్ ఆదిత్యసమతేజసమ్ ॥ 8
శ్యామావదాతం రక్తాక్షం పాశహస్తం భయావహమ్ ।
స్థితం సత్యవతః పార్శ్వే నిరీక్షంతం తమేవ చ ॥ 9
ముహూర్తకాలంలోనే ఒక దివ్యపురుషుడు ఆమెకు కనిపించాడు రక్తవస్త్రాలు, తలపై కిరీటం, సూర్యతేజస్సు, శ్యామ శరీర కాంతి, ఎర్రటి కళ్ళు, చేతిలో పాశం ధరించి భయంకరంగా ఉన్న ఆ పురుషుడు సత్యవంతుని ప్రక్కన నిలిచి అతనినే చూస్తున్నాడు. (8,9)
తం దృష్ట్వా సహసోత్థాయ భర్తుర్న్యస్య శనైః శిరః ।
కృతాంజలిరువాచార్తా హృదయేన ప్రవేపతీ ॥ 10
ఆ పురుషుని చూసి, భర్తశిరస్సును మెల్లగా ప్రక్కకు జరిపి, వెంటనే లేచి, చేతులు జోడించి, మనస్సు అదురుతుండగా దీనస్వరంతో ఇలా అన్నది. (10)
సావిత్య్రువాచ
దైవతం త్వాభిజానామి వపురేతద్ధ్యమానుషమ్ ।
కామయా బ్రూహి దేవేశ కస్త్వం కిం చ చికీర్షిసి ॥ 11
సావిత్రి ఇలా అన్నది.
తమ శరీరం అమానుషంగా ఉన్నది. తమరెవరో దేవతయే అయి ఉండాలి. దేవేశా! తమకు అభ్యంతరం లేకపోతే ఎవరో ఎందుకు వచ్చారో చెప్పండి. (11)
యమ ఉవాచ
పతివ్రతాసి సావిత్రి తథైవ చ తపోఽన్వితా ।
అతస్త్వామభిభాషామి విద్ధిం మాం త్వం శుభే యమమ్ ॥ 12
యముడిలా అన్నాడు.
సావిత్రీ! నీవు పతివ్రతవు. తపస్వినివి! అందుకే నీతో మాటాడుతున్నాను. కళ్యాణీ! నేను యముడను. (12)
అయం తే సత్యవాన్ భర్తా క్షీణాయుః పార్థివాత్మజః ।
నేష్యామి తమహం బద్ ధ్వా విద్ధ్యేతన్మే చికీర్షితమ్ ॥ 13
ఈ నీ భర్త, రాజకుమారుడు అయిన సత్యవంతుని ఆయుస్సు ముగిసింది. అతనిని బంధించి తీసికొనిపోతాను. అదే నేను చేయదలచినది. గ్రహించు. (13)
సావిత్య్రువాచ
శ్రూయతే భగవన్ దూతాః తవాగచ్ఛంతి మానవాన్ ।
నేతుం కిల భవాన్ కస్మాద్ ఆగతోఽసి స్వయం ప్రభో ॥ 14
సావిత్రి ఇలా అన్నది.
స్వామీ! మానవులను కొనిపోవటానికి తమ దూతలు వస్తారని వింటుంటాం. ప్రభూ! తమరు స్వయంగా ఎందుకు వచ్చారు? (14)
మార్కండేయ ఉవాచ
ఇత్యుక్తః పితృరాజస్తాం భగవాన్ స్వచికీర్షితమ్ ।
యథావత్ సర్వమాఖ్యాతుం తత్ప్రియార్థం ప్రచక్రమే ॥ 15
మార్కండేయుడిలా అన్నాడు.
ఆమె అలా అనగానే పితృరాజు అయిన యముడు ఆమె ముచ్చట తీర్చడానికి తాను చేయదలచినదంతా యథాతథంగా చెప్పనారంభించాడు. (15)
అయం చ ధర్మసంయుక్తః రూపవాన్ గుణసాగరః ।
నార్హో మత్పురుషైర్నేతుమ్ అతోఽస్మి స్వయమాగతః ॥ 16
ఈ సత్యవంతుడు ధర్మాత్ముడు, రూపవంతుడు, గుణసాగరుడు. కాబట్టి నాదూతలు ఇతనిని కొనిరావటం యోగ్యం కాదు. అందుకని నేనే స్వయంగా వచ్చాను. (16)
తతః సత్యవతః కాయాత్ పాశబద్ధం వశం గతమ్ ।
అంగుష్ఠమాత్రం పురుషం నిశ్చకర్ష యమో బలాత్ ॥ 17
ఆ తరువాత యముడు సత్యవంతుని శరీరం నుండి పాశబద్ధుడై తనకు వశమైన బొటనవ్రేలంత జీవుని బలంగా లాగాడు (17)
తతః సముద్ధృతప్రాణం గతశ్వాసం హతప్రభమ్ ।
నిర్విచేష్టం శరీరం తద్ బభూవాప్రియదర్శనమ్ ॥ 18
అప్పుడు ప్రాణాలను లాగగానే సత్యవంతుని ఊపిరి ఆగిపోయింది. శరీరం నిర్విచేష్టం శరీరం చేష్టలుడిగి పోయింది. దేహకాంతి నశించింది. శరీరం చూడ వీలు కానట్లయింది. (18)
యమస్తు తం తతో బద్ధ్వా ప్రయాతో దక్షిణాముఖః ।
సావిత్రీ చైవ దుఃఖార్తా యమమేవాన్వగచ్ఛత ।
నియమవ్రతసంసిద్ధా మహాభాగా పతివ్రతా ॥ 19
ఆపై యముడు ఆ జీవుని బంధించి దక్షిణంవైపు బయలుదేరాడు. సావిత్రి కూడా దుఃఖార్తయై యముని అనుసరించింది. ఆమె సౌభాగ్యవతి, పతివ్రత, వ్రతసిద్ధిని పొంది ఉన్నది. కాబట్టి వెళ్ళగలిగింది. (19)
యమ ఉవాచ
నివర్త గచ్ఛ సావిత్రి కురుష్వాస్యౌర్ధ్వదైహికమ్ ।
కృతం భర్తుస్త్వయాఽఽనృణ్యం యావద్ గమ్యం గతం త్వయా ॥ 20
యముడిలా అన్నాడు. సావిత్రీ వెనుదిరిగి పో! ఇతనికి ఔర్ధ్వదైహిక క్రియలు జరిపించు. పతివెంట రాగలిగినంత దూరం వచ్చావు. ఋణం తీరిపోయింది (20)
సావిత్య్రువాచ
యత్ర మే నీయతే భర్తా స్వయం వా యత్ర గచ్ఛతి ।
మయా చ తత్ర గంతవ్యమ్ ఏష ధర్మః సనాతనః ॥ 21
సావిత్రి ఇలా అన్నది.
నా భర్త ఎక్కడకు వెళ్ళినా, ఎక్కడకు కొనిపోబడినా నేను కూడా అక్కడకు వెళ్ళాలి. ఇది సనాతన ధర్మం. (21)
తపసా గురుభక్త్యా చ భర్తుః స్నేహాద్ వ్రతేన చ ।
తవ చైవ ప్రసాదేన న మే ప్రతిహతా గతిః ॥ 22
తపస్సువలనా, గురుభక్తివలనా, భర్తృప్రేమవలనా, వ్రతసిద్ధివలనా నీ అనుగ్రహం వలనా కూడా నా దారి అడ్డగింపబడదు. (22)
ప్రాహుః సాప్తపదం మైత్రం బుద్ధాస్తత్త్వార్థదర్శినః ।
మిత్రతాం చ పురస్కృత్య కించిద్ వక్ష్యామి తచ్ఛ్రృణు ॥ 23
తత్త్వార్థద్రష్టలయిన పండితులు ఏడడుగుల నడకతో మైత్రి కలుగుతుందంటారు ఆ మైత్రిని పురస్కరించుకొని నేను చెప్పేది ఈ కొంచెం విను. (23)
నానాత్మవంతస్తు వనే చరంతి
ధర్మం చ వాసం చ పరిశ్రమం చ ।
విజ్ణానతో ధర్మముదాహరంతి
తస్మాత్ సంతో ధర్మమాహుః ప్రధానమ్ ॥ 24
జితేంద్రియులు కాని వారు వనంలో నివసిస్తూ, ధర్మపాలన చేస్తూ, గురుకులవాసాన్ని శ్రమను భరించలేరు. విజ్ణానంతో ధర్మసిద్ధి అని పెద్దలంటారు. కాబట్టి సజ్జనులు ధర్మాన్నే ప్రమాణమన్నారు. (24)
వి॥సం॥ ఆత్మవిజ్ణానమే ధర్మఫలం. 'తమేతం వేదానువచనేన బ్రాహ్మణా వివిదషంతి యజ్ఞేన దానేన తపసాఽనాశకేన' అని శ్రుతివచనం. (నీల)
ఏకస్య ధర్మేణ సతాం మతేన
సర్వే స్మ తం మార్గమనుప్రపన్నాః ।
మా వై ద్వితీయం మా తృతీయం చ వాంఛేత్
తస్మాత్ సంతో ధర్మమాహుః ప్రధానమ్ ॥ 25
సజ్జనసమ్మతమయిన ఒక ఆశ్రమ ధర్మాన్ని శ్రద్ధగా పాటిస్తే అందరూ ఆ మార్గాన్ని అనుసరించి జ్ఞానం పొందుతారు. నైష్ఠిక బ్రహ్మచర్యము, సన్యాసము అక్కరలేదు. కాబట్టి సజ్జనులు ఆశ్రమధర్మాన్ని ప్రధానమన్నారు. (25)
యమ ఉవాచ
నివర్త తుష్టోఽస్మి తవానయా గిరా
స్వరాక్షరవ్యంజనహేతుయుక్తయా ।
వరం వణీష్వేహ వినాస్య జీవితం
దదాని తే సర్వమనిందితే వరమ్ ॥ 26
యముడిలా అన్నాడు.
అనిందితా! వెళ్ళు. నీ ఈ మాటలతో సంతోషించాను. ఈ మాట స్వర, అక్షర, వ్యంజన హేతుబద్ధమై ఉన్నది. నీ భర్తజీవితాన్ని తప్ప మరేదయినా వరం కోరుకో. ఇస్తాను. (26)
సావిత్య్రువాచ
చ్యుతః స్వరాజ్యాద్ వనవాసమాశ్రితః
వినష్టచక్షుః శ్వశురో మమాశ్రమే ।
స లబ్ధచక్షుర్బలవాన్ భవేన్నృపః
తవ ప్రసాదాజ్జ్వలనార్కసంనిభః ॥ 27
సావిత్రి ఇలా అన్నది.
నా మామగారు రాజ్యాన్ని కోల్పోయారు. వనవాసం చేస్తున్నారు. కళ్ళు లేవు. నీ అనుగ్రహం వలన ఆయనకు చూపు రావాలి. సూర్యాగ్ని సమానుడై వెలుగొందాలి. (27)
యమ ఉవాచ
దదాని తేఽహం తమనిందితే వరం
యథా త్వయోక్తం భవితా చ తత్ తథా ।
తవాధ్వనా గ్లానిమివోపలక్షయే
నివర్త గచ్ఛస్వ న తే శ్రమో భవేత్ ॥ 28
యముడిలా అన్నాడు.
అనిందితా! ఈ వరాన్ని నీకిస్తున్నాను. నీవు అడిగినదంతా అలాగే జరుగుతుంది బాటలో నడిచి అలసిపోయినట్లున్నావు. తిరిగివెళ్ళు. శ్రమపడట మెందుకు? (28)
సావిత్య్రువాచ
శ్రమః కుతో భర్తృసమీపతో హి మే
యతో హి భర్తా మమ సా గతిర్ధ్రువా ।
యతః పతిం నేష్యసి తత్ర మే గతిః
సురేశ భూయశ్చ వచో నిబోధ మే ॥ 29
సావిత్రి ఇలా అన్నది.
భర్త దగ్గర ఉంటే నాకు శ్రమ ఏమిటి? భర్త ఎక్కడుంటే అక్కడే నేను. భర్తను ఎక్కడకు తీసికొనిపోతే అక్కడకే నేను కూడా! సురేశా! మరొక్కమాట చెపుతా విను. (29)
సతాం సకృత్సంగతమీప్సితం పరం
తతః పరం మిత్రమితి ప్రచక్షతే ।
న చాఫలం సత్పురుషేణ సంగతం
తతః సతాం సన్నివసేత్ సమాగమే ॥ 30
సజ్జనులతో ఒక్కసారి కలవటం కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. వారితో మైత్రి అంతకన్న గొప్పది. సజ్జన సమాగమం ఎప్పుడూ నిరర్థకం కాదు. అందుకే ఎప్పుడూ సజ్జనసాంగత్యంలో నిలవాలి. (30)
యమ ఉవాచ
మనోఽనుకూలం బుధబుధ్ధివర్ధనం
త్వయా యదుక్తం వచనం హితాశ్రయమ్ ।
వినా పునః సత్యవతోఽస్య జీవితం
వరం ద్వితీయం వరయస్వ భామిని ॥ 31
యముడిలా అన్నాడు.
భామినీ! నీవు చెప్పిన హితోక్తి నాకు బాగా నచ్చింది. అది పండితుల బుద్ధికి కూడా పదును పెట్టగలది. సత్యవంతుని ప్రాణాలు కాకుండా మరేదయినా రెండోవరం కోరుకో. (31)
సావిత్య్రువాచ
హృతం పురా మే శ్వశురస్య ధీమతః
స్వమేవ రాజ్యం లభతాం స పార్థివః ।
జహ్యాత్ స్వధర్మం న చ మే గురుర్యథా
ద్వితీయమేతద్ వరయామి తే వరమ్ ॥ 32
సావిత్రి ఇలా అన్నది.
ధీమంతుడైనా నా మామగారి రాజ్యాన్ని అపహరించారు. ఆయన తన రాజ్యాన్ని మరలా పొందాలి. పూజ్యులైన నా మామగారు ఎప్పుడూ స్వధర్మాన్ని విడువ కూడదు. ఇది నేను కోరుకొనే రెండో వరం. (32)
యమ ఉవాచ
స్వమేవ రాజ్యం ప్రతిపత్స్యతేఽచిరా
న్న చ స్వధర్మాత్ పరిహాస్యతే నృపః ।
కృతేన కామేన మయా నృపాత్మజే
నివర్త గచ్ఛస్వ న తే శ్రమో భవేత్ ॥ 33
యముడిలా అన్నాడు.
రాజకుమారీ! వెంటనే ద్యుమత్సేనుడు తన రాజ్యాన్ని పొందుతాడు ఎప్పుడూ స్వధర్మపరిత్యాగం చేయడు. నీ కోరిక తీరిందిగదా! ఇక వెనుదిరిగి వెళ్ళు. ఎందుకు శ్రమపడతావు? (33)
సావిత్య్రువాచ
ప్రజాస్త్వయైతా నియమేన సంయతా
నియమ్య చైతా నయసే నికామయా ।
తతో యమ త్వం తవ దేవ విశ్రుతం
నిబోధ చేమాం గిరమీరితాం మయా ॥ 34
సావిత్రి ఇలా అన్నది.
దేవా! ఈ ప్రజలందరినీ నియమంగా ఉంచుతున్నావు. నీ ఇష్టానుసారం వారిని కొనిపోతున్నావు. అందుకే నిన్ను యముడన్నారు. మరొక్కమాట చెపుతాను. ఇది కూడా విను. (34)
అద్రోహః సర్వభూతేషు కర్మణా మనసా గిరా ।
అనుగ్రహశ్చ దానం చ సతాం ధర్మః సనాతనః ॥ 35
సర్వప్రాణులకూ మనసా, వాచా, కర్మణా కూడా ద్రోహం చేయకుండటం, అనుగ్రహం చూపటం దానం చేయటం ఇది సత్పురుషుల సనాతనధర్మం. (35)
ఏవం ప్రాయశ్చ లోకోఽయం మనుష్యాః శక్తిపేశలాః ।
సంతస్త్వేవాప్యమిత్రేషు దయాం ప్రాఫ్తేషు కుర్వతే ॥ 36
ఈ లోకులు అల్పాయుష్కులు. మనుష్యుల శక్తి కూడా గట్టిది కాదు. తమవంటి సజ్జనులు శరణుకోరితే శత్రువులపై కూడా దయ చూపుతారు. (36)
యమ ఉవాచ
పిపాసితస్యేవ భవేద్ యథా పయః
తథా త్వయా వాక్యమిదం సమీరితమ్ ।
వినా పునః సత్యవతోఽస్య జీవితం
వరం వృణీష్వేహ శుభే యదిచ్ఛసి ॥ 37
యముడిలా అన్నాడు. దప్పిక గొన్నవానికి నీళ్ళవలె నీవు చెప్పినమాట ఆనందకరం. కళ్యాణీ! నీకిష్టమయితే సత్యవంతుని ప్రాణాలు తప్ప మరేదయినా వరం కోరుకో. (37)
సావిత్య్రువాచ
మమానపత్యః పృథివీపతిః పితా
భవేత్ పితుః పుత్రశతం తథౌరసమ్ ।
కులస్య సంతానకరం చ యద్ భవేత్
తృతీయమేతద్ వరయామి తే వరమ్ ॥ 38
సావిత్రి ఇలా అన్నది.
మా నాన్నకు కొడుకులు లేరు. ఆయనకు ఔరస పుత్రులు వందమంది కలగాలి. వారు వంశపరంపరను కొనసాగించగలగాలి. ఇది నీనుండి కోరుతున్న మూడవ వరం. (38)
యమ ఉవాచ
కులస్య సంతానకరం సువర్చసం
శతం సుతానాం పితురస్తు తే శుభే ।
కృతేన కామేన నరాధిపాత్మజే
నివర్త దూరం హి పథస్త్వమాగతా । 39
యముడిలా అన్నాడు.
రాజకుమారీ! కళ్యాణీ! నీ తండ్రికి వంశపరంపరను కొనసాగించే తేజస్వంతులైన కొడుకులు వందమంది పుడతారు. నీ కోరిక తీరినది గదా! చాలా దూరం వచ్చావు. ఇక మరలిపో. (39)
సావిత్య్రువాచ
న దూరమేతన్మమ భర్తృసంనిధౌ
మనో హి మే దూరతరం ప్రధావతి ।
అథ వ్రజన్నేవ గిరం సముద్యతాం
మయోచ్యమానాం శృణు భూయ ఏవ చ ॥ 40
సావిత్రి ఇలా అన్నది.
నా భర్తసన్నిధిలో ఇది నాకు దూరమేమీ కాదు.నా మనస్సు ఇంకా దూరం వెళుతోంది. తమరు నడుస్తూనే మరొకసారి నా మాట నాలకించండి.(40)
వివస్వతస్త్వం తనయః ప్రతాపవాన్
తతో హి వైవస్వత ఉచ్యసే బుధైః ।
సమేన ధర్మేణ చరంతి తాః ప్రజాః
తతస్తవేహేశ్వర ధర్మరాజతా ॥ 41
దేవేశ్వరా! తమరు సూర్యుని తనయులు కాబట్టి పండితులు తమరిని వైవస్వతుడంటారు. ప్రజలను సమానధర్మంతో నడుపుతారు కాబట్టి తమరికి ధర్మరాజత్వం తగినదే. (41)
ఆత్మన్యపి న విశ్వాసః తథా భవతి సత్పు యః ।
తస్మాత్ సత్పు విశేషేణ సర్వః ప్రణయమిచ్ఛతి ॥ 42
మనుష్యులకు మంచివారిపై ఉన్నంత నమ్మకం తమ మీద కూడా ఉండదు. అందుకే మంచివారి నందరూ ప్రేమిస్తారు. (42)
సౌహృదాత్ సర్వభూతానాం విశ్వాసో నామ జాయతే ।
తస్మాత్ సత్సు విశేషేణ విశ్వాసం కురుతే జనః ॥ 43
సర్వప్రాణులకు సౌహార్దం వలన విశ్వాసమేర్పడుతుంది. కాబట్టియే ప్రజలు మంచివారినే విశేషించి నమ్ముతారు. (43)
యమ ఉవాచ
ఉదాహృతం తే వచనం యదంగనే
శుభే న తాదృక్ త్వదృతే శ్రుతం మయా ।
అనేన తుష్టోఽస్మి వినాస్య జీవితం
వరం చతుర్ధం వరయస్వ గచ్ఛ చ ॥ 44
యముడిలా అన్నాడు.
కళ్యాణి! నీవన్నమాట ఇంతవరకు మరెవ్వరి నోటా నేను వినలేదు. ఆనందించాను. సత్యవంతుని ప్రాణాలను తప్ప మరేదైనా నాలుగో వరం కోరుకో. వెళ్ళు. (44)
సావిత్య్రువాచ
మమాత్మజం సత్యవతస్తథౌరసం
భ వేదుభాభ్యామిహ యత్ కులోద్వహమ్ &
శతం సుతానాం బలవీర్యశాలినామ్
ఇదం చతుర్ధం వరయామి తే వరమ్ ॥ 45
సావిత్రి ఇలా అన్నది.
నాకూ, సత్యవంతుడికీ వంశవర్ధనులూ, బలవీర్యసంపన్నులూ అయిన వందమంది ఔరసపుత్రులు కావాలి. ఇదే నేను కోరుకొనే నాల్గవవరం. (45)
యమ ఉవాచ
శతం సుతానాం బలవీర్యశాలినాం
భవిష్యతి ప్రీతికరం తవాబలే ।
పరిశ్రమస్తే న భవేన్నృపాత్మజే
నివర్త దూరం హి పథస్త్వమాగతా ॥ 46
యముడిలా అన్నాడు.
అబలా! బలవీర్యసంపన్నులై ఆనందాన్ని కల్గించే కొడుకులు వందమంది నీకు పుడతారు. రాజకుమారీ! ఎందుకీ శ్రమ. చాలా దూరం వచ్చావు. ఇక వెళ్ళు. (46)
సావిత్య్రువాచ
సతాం సదా శాశ్వతధర్మవృత్తిః
సంతో న సీదంతి న చ వ్యథంతి ।
సతాం సద్భిర్నాఫలం సంగమోఽస్తి
సద్భ్యో భయం నానువర్తంతి సంతః ॥ 47
సావిత్రి ఇలా అన్నది.
సజ్జనులు ఎప్పుడూ ధర్మబద్ధంగానే ప్రవర్తిస్తారు. సత్పురుషులు బాధపడరు. కలత పడరు. సజ్జనులతో కలయిక నిష్ఫలం కాదు. సత్పురుషుల వలన సజ్జనుల కెప్పుడూ భయం లేదు. (47)
సంతో హి సత్యేన నయంతి సూర్యం
సంతో భూమిం తపసా ధారయంతి ।
సంతో గతిర్భూతభవ్యస్య రాజన్
సతాం మధ్యే నావసీదంతి సంతః ॥ 48
సత్పురుషులు సత్యబలంతో సూర్యుని నడిపించగలరు. తపస్సుతో భూమిని భరించగలరు. రాజా! భూతభవిష్యత్తులకు సత్పురుషులే గతి. సజ్జనులకు సజ్జనుల మధ్య దుఃఖముండదు (48)
ఆర్యజుష్టమిదం వృత్తమ్ ఇతి విజ్ఞాయ శాశ్వతమ్ ।
సంతః పరార్థం కుర్వాణాః నావేక్షంతి పరస్పరమ్ ॥ 49
ఇది సజ్జనులు సేవించిన సనాతనధర్మం. ఇది గ్రహించి సజ్జనులు ఎప్పుడూ పరోపకారం చేస్తారు. ఒకరినొకరు స్వార్థదృష్టితో చూడరు. (49)
న చ ప్రసాదః సత్పురుషేషు మోఘో
న చాప్యర్థో నశ్యతి నాపి మానః ।
యస్మాదేతన్నియతం సత్సు నిత్యం
తస్మాత్ సంతో రక్షితారో భవంతి ॥ 50
సత్పురుషుల అనుగ్రహం వ్యర్థం గాదు. అది ఎవ్వరి ప్రయోజనాన్ని భంగపరచదు. అభిమానాన్ని దెబ్బతీయదు. అనుగ్రహమూ, అర్థ మానాలు సజ్జనులతో నిత్యమూ నిలుస్తాయి. అందుకే వారు సర్వరక్షకులు. (50)
యమ ఉవాచ
యథా యథా భాషసి ధర్మసంహితం
మనోఽనుకూలం సుపదం మహార్థవత్ ।
తథా తథా మే త్వయి భక్తిరుత్తమా
వరం వృణీష్వాప్రతిమం పతివ్రతే ॥ 51
యముడిలా అన్నాడు.
పతివ్రతా! నీవు ధర్మసమ్మతంగా, అర్థవంతంగా, మనోనుకూలంగా, చక్కగా మాటాడుతున్న కొద్దీ నాకు నీపై ఉత్తమభక్తి పెరుగుతోంది. సాటిలేని వరమేదైనా కోరుకో. (51)
సావిత్య్రువాచ
న తేఽపవర్గః సుకృతాద్ వినాకృతః
స్తథా యథాన్యేషు వరేషు మానద ।
వరం వృణే జీవతు సత్యవానయం
యథా మృతా హ్యేవమహం పతిం వినా ॥ 52
సావిత్రి ఇలా అన్నది.
మానదా! ఇతరవరాల వలె గాక తమరు నాకిచ్చిన నాలుగవ వరం దాంపత్యజీవనం లేకుండా అసాధ్యమైనది. కాబట్టి సత్యవంతుని బ్రతికించు. భర్త లేకుంటే నేను బ్రతుకను. (52)
న కామయే భర్తృవినాకృతా సుఖం
న కామయే భర్తృవినాకృతా దివమ్ ।
న కామయే భర్తృవినాకృతా శ్రియం
న భర్తృహీనా వ్యవసామి జీవితుమ్ ॥ 53
భర్తలేకపోతే నాకు సుఖం అక్కడ లేదు. స్వర్గమక్కర లేదు. సంపద అక్కర లేదు. భర్త లేకుండా బ్రతకాలని కూడా లేదు. (53)
వరాతిసర్గః శతపుత్రతా మమ
త్వయైవ దత్తో హ్రియతే చ మే పతిః ।
వరం వృణే జీవతు సత్యవానయం
తవైవ సత్యం వచనం భవిష్యతి ॥ 54
నాకు నూర్గురు కొడుకులు పుడతారని వరమిచ్చారు. కానీ తమరు నాభర్తను కొనిపోతున్నారు. ఈ సత్యవంతుడు జీవించాలని కోరుకొంటున్నాను. అప్పుడు తమరివరమే యథార్థమవుతుంది. (54)
మార్కండేయ ఉవాచ
తథేత్యుక్త్వా తు తం పాశం ముక్త్వా వైవస్వతో యమః ।
ధర్మరాజః ప్రహృష్టాత్మా సావిత్రీమిదమబ్రవీత్ ॥ 55
మార్కండేయుడిలా అన్నాడు.
'అలాగే' అని వైవస్వతుడైన యమధర్మరాజు పాశాన్ని విడిపించి ఆనందంగా సావిత్రితో ఇలా అన్నాడు. (55)
ఏష భద్రే మయా ముక్తః భర్తా తే కులనందిని ।
(తోషితోఽహం త్వయా సాధ్వి వాక్యైర్ధర్మార్ధసంహితైః)
అరోగస్తవ నేయశ్చ సిద్ధార్థః స భవిష్యతి ॥ 56
కళ్యాణీ! నీ భర్తను పాశవిముక్తుని చేశాను. కులనందినీ! ధర్మార్థాలతో కూడిన నీ మాటలతో ఆనందించాను. సాధ్వీ! సత్యవంతునకు క్షేమం, మనోరథ సిద్ధి కలుగుతాయి. తీసికొనిపో. (56)
చతుర్వర్షశతాయుశ్చ త్వయా సార్ధమవాప్స్యతి ।
ఇష్ట్వా యజ్ఞైశ్చ ధర్మేణ ఖ్యాతిం లోకే గమిష్యతి ॥ 57
నీతో కలిసి నాలుగువందల సంవత్సరాలు జీవిస్తాడు సత్యవంతుడు. యాగాలు చేసి, ధర్మబద్ధంగా జీవించి లోకంలో ప్రసిద్ది పొందగలడు. (57)
త్వయి పుత్రశతం చైవ సత్యవాన్ జనయిష్యతి ।
తే చాపి సర్వే రాజానః క్షత్రియాః పుత్రపౌత్రిణః ॥ 58
సత్యవంతునకు నీ ద్వారా వందమంది కొడుకులు పుడతారు. ఆ రాజకుమారులు రాజులై పుత్రపౌత్రులతో వర్ధిల్లుతారు. (58)
ఖ్యాతాస్త్వన్నామధేయాశ్చ భవిష్యంతీహ శాశ్వతాః ।
పితుశ్చ తే పుత్రశతం భవితా తవ మాతరి ॥ 59
నీపేరుతోనే వారికి శాశ్వతకీర్తి లభిస్తుంది. నీ తండ్రికి నీ తల్లియందు నూర్గురు కొడుకులు పుడతారు. (59)
మాలవ్యాం మాలవా నామ శాశ్వతాః పుత్రపౌత్రిణః ।
భ్రాతరస్తే భవిష్యంతి క్షత్రియాస్త్రిదశోపమాః ॥ 60
నీ తల్లి మాలవి కాబట్టి నీ సోదరులు మాలవులని ప్రసిద్ధికెక్కి పుత్రపౌత్రులను పొందుతారు. ఆ నీ సోదరులు దేవతాతుల్యులైన క్షత్రియులు కాగలరు. (60)
ఏవం తస్యై వరం దత్త్వా ధర్మరాజః ప్రతాపవాన్ ।
నివర్తయిత్వా సావిత్రీం స్వమేవ భవనం యయౌ ॥ 61
ప్రతాపవంతుడైన యమధర్మరాజు సావిత్రికి ఆ రీతిగా వరమిచ్చి, ఆమెను వెనుకకు మరల్చి, తాను తన లోకానికి వెళ్ళిపోయాడు. (61)
సావిత్య్రపి యమే యాతే భర్తారం ప్రతిలభ్య చ ।
జగామ తత్ర యత్రాస్యాః భర్తుః శావం కలేవరమ్ ॥ 62
యముడు వెళ్ళగానే సావిత్రి భర్తను పొంది భర్తదేహమున్న చోటికి వెళ్ళింది. (62)
సా భూమౌ ప్రేక్ష్య భర్తారమ్ ఉపసృత్యోపగృహ్య చ ।
ఉత్సంగే శిర ఆరోప్య భూమావుపవివేశ హ ॥ 63
ఆమె నేలపై పడియున్న భర్తను చూసి దగ్గరకు వెళ్ళి, కూర్చొని, భర్త తలను తన ఒడిలో పెట్టికొన్నది. (63)
సంజ్ఞాం చ స పునర్లబ్ధ్వా సావిత్రీమభ్యభాషత ।
ప్రోష్యాగత ఇవ ప్రేమ్ణా పునః పునరుదీక్ష్య వై ॥ 64
సత్యవంతుడు చైతన్యాన్ని పొంది పొరుగూరికి వెళ్ళి తిరిగివచ్చిన వానివలె ఆమెను ప్రేమగా అదేపనిగా చూస్తూ ఆమెతో ఇలా అన్నాడు. (64)
సత్యవానువాచ
సుచిరం బత సుప్తోఽస్మి కిమర్థం నావబోధితః ।
క్వ చాసౌ పురుషః శ్యామో యోఽసౌ మాం సంచకర్ష హ ॥ 65
సత్యవంతుడిలా అన్నాడు
అరే! చాలాసేపు నిద్రించాను. ఎందుకు లేపలేదు? నన్ను పట్టి లాగిన ఆ నల్లటి మనిషి ఎక్కడ? (65)
సావిత్య్రువాచ
సుచిరం త్వం ప్రసుప్తోఽసి మమాంకే పురుషర్షభ ।
గతః స భగవాన్ దేవః ప్రజాసంయమనో యమః ॥ 66
పురుషోత్తమా! నా ఒడిలో చాలాసేపు నిదురించావు. పూజ్యుడు, ప్రజానియంత అయిన ఆ యమధర్మరాజు వెళ్ళిపోయారు. (66)
విశ్రాంతోఽసి మహాభాగ వినిద్రశ్చ నృపాత్మజ ।
యది శక్యం సముత్తిష్ఠ విగాఢాం పశ్య శర్వరీమ్ ॥ 67
మహాభాగా! చాలాసేపు విశ్రమించావు. నిద్రనుండి మేల్కొన్నావు. రాజకుమారా! లేవగలిగితే లే. చూడు! ప్రొద్దుక్రుంకి చీకట్లు క్రమ్మాయి. (67)
మార్కండేయ ఉవాచ
ఉపలభ్య తతః సంజ్ఞం సుఖసుప్త ఇవోత్థితః ।
దిశః సర్వా వనాంతాంశ్చ నిరీక్ష్యోవాచ సత్యవాన్ ॥ 68
ఫలాహారోఽస్మి నిష్క్రాంతః త్వయా సహ సుమధ్యమే ।
తతః పాటయతః కాష్ఠం శిరసో మే రుజాభవత్ ॥ 69
మార్కండేయుడిలా అన్నాడు.
అప్పుడు చైతన్యాన్ని పొంది, గాఢ నిద్ర పోయినవానివలె లేచి, అరణ్యప్రాంతంలో అన్నివైపులా దృష్టిసారించి సత్యవంతుడిలా అన్నాడు. సుమధ్యమా! పండ్లు తెచ్చేందుకు నీతో కలిసి బయలుదేరాను. ఆపై కట్టెలు కొడుతుంటే తలనొప్పి వచ్చింది. (68,69)
శిరోఽభితాపసంతప్తః స్థాతుం చిరమశక్నువన్ ।
తవోత్సంగే ప్రసుప్తోఽస్మి ఇతి సర్వం స్మరే శుభే ॥ 70
తలనొప్పితో బాధపడుతూ ఎక్కువసేపు నిలువలేక నీ ఒడిలో నిదురించాను. కళ్యాణీ! అంతా గుర్తుకు వస్తోంది. (70)
త్వయోపగూఢస్య చ మే నిద్రయాపృహృతం మనః ।
తతోఽపశ్యం తమో ఘోరం పురుషం చ మహౌజసమ్ ॥ 71
నీ శరీర స్పర్శ తగులగానే నా మనస్సు నిద్రావశమైంది. అప్పుడు గాఢాంధకారాన్నీ, మహాతేజస్వి అయిన పురుషునీ చూచాను. (71)
తద్ యది త్వం విజానాసి కిం తద్ బ్రూహి సుమధ్యమే ।
సప్నో మే యది వా దృష్టః యది వా సత్యమేవ తత్ ॥ 72
సుమధ్యమా! అదేమిటో నీవెరుగుదువా? నాకు చెప్పు. నేను చూచినది కలా? నిజమా? (72)
తమువాచాథ సావిత్రీ రజనీ వ్యవగాహతే ।
శ్వస్తే సర్వం యథావృత్తమ్ ఆఖ్యాస్యామి నృపాత్మజ ॥ 73
అప్పుడు సావిత్రి అతనితో ఇలా అన్నది. రాజకుమారా! రేయి గడచిపోతోంది. రేపు జరిగినదంతా నీకు వివరంగా చెపుతాను. (73)
ఉత్తిష్ఠోత్తిష్ఠ భద్రం తే పితరౌ పశ్య సువ్రత ।
విగాఢా రజనీ చేయం నివృత్తశ్చ దివాకరః ॥ 74
లేలే! అంతా మేలే జరిగింది సువ్రతా! వెళ్ళి నీ తల్లిదండ్రులను చూడు. రేయి గాఢమవుతుంది. సూర్యుడెప్పుడో అస్తమించాడు. (74)
నక్తంచరాశ్చరంత్యేతే హృష్టాః క్రూరాభిభాషిణః ।
శ్రూయంతే పర్ణశబ్ధాశ్చ మృగాణాం చరతాం వనే ॥ 75
క్రూరంగా మాటాడే నిశాచరులు ఆనందంగా తిరుగుతున్నారు. అరణ్యంలో మృగాల సంచారంతో కదిలే ఆకులసవ్వడులు వినిపిస్తున్నాయి. (75)
ఏతా ఘోరం శివా నాదాన్ దిశం దక్షిణపశ్చిమామ్ ।
ఆస్థాయ విరువంత్యుగ్రాః కంపయంత్యో మనో మమ ॥ 76
అదిగో! నక్కలు నైఋతికి చేరి ఘోరంగా, భీకరంగా అరుస్తున్నాయి. నా మనస్సు వణుకుతోంది. (76)
సత్యవానువాచ
వనం ప్రతిభయాకారం ఘనేన తమసాఽఽవృతమ్ ।
న విజ్ఞాస్యసి పంథానం గంతుం చైవ వ శక్ష్యసి ॥ 77
సత్యవంతుడిలా అన్నాడు.
అరణ్యం గాఢాంధకారంతో భయంకరంగా ఉంది. దారి కనిపించదు. వెళ్ళటం కష్టం. (77)
సావిత్య్రువాచ
అస్మిన్నద్య వనే దగ్ధే శుష్కవృక్షః స్థితో జ్వలన్ ।
వాయునా ధమ్యమానోఽత్ర దృశ్యతేఽగ్నిః క్వచిత్ క్వచిత్ ॥ 78
సావిత్రి ఇలా అన్నది.
ఇదిగో. అడవిలో ఈ రోజు తగులబడిన ఎండుచెట్టు ఇంకా మండుతోంది. గాలితాకిడికి అక్కడక్కడ అగ్ని కనిపిస్తోంది. (78)
తతోఽగ్నిమానయిత్వేహ జ్వాలయిష్యామి సర్వతః ।
కాష్ఠానీమాని సంతీహ జహి సంతాపమాత్మనః ॥ 79
అక్కడ నుండి నిప్పుతెచ్చి ఇక్కడ కట్టెలున్నాయి గదా, అన్నీ తగులబెడతాను నీవు చింతించనవసరం లేదు. (79)
యది నోత్సహసే గంతుం సరుజం త్వాం హి లక్షయే ।
న చ జ్ఞాస్యసి పంథానం తమసా సంవృతే వనే ॥ 80
శ్వః ప్రభాతే వనే దృశ్యే యాస్యావోఽనుమతే తవ ।
వసావేహ క్షపామేకాం రుచితం యది తేఽనఘ ॥ 81
నీవు ఇంకా అస్వస్థతలో ఉన్నావు. వెళ్ళాలనిపించటం లేదా? అంధకారబంధురమైన అరణ్యంలో దారి కూడా కనిపించేటట్లు లేదు. అనఘా! నీకిష్టమయితే రేపు ఉదయం వనం కనిపించేటప్పుడే వెళదాం. ఈ రాత్రి ఇక్కడే గడుపుదాం. (80,81)
సత్యవానువాచ
శిరోరుజా నివృత్తా మే స్వస్థాన్యంగాని లక్షయే ।
మాతాపితృభ్యామిచ్ఛామి సంగమం త్వత్ప్రసాదజమ్ ॥ 82
సత్యవంతుడిలా అన్నాడు. నా తలనొప్పి తగ్గిపోయింది. ఒళ్ళు స్వస్థంగానే ఉన్నట్టుంది. నీ అనుగ్రహం వలన కలిగిన మాతాపితృసందర్శనాన్ని కోరుకొంటున్నాను. (82)
న కదాచిద్ వికాలం హి గతపూర్వో మయాఽఽశ్రమః ॥
అనాగతాయాం సంధ్యాయాం మాతా మే ప్రరుణద్ధి మామ్ ॥ 83
ఎప్పుడూ కూడా ఆశ్రమాన్ని వీడి ఇంతకాలముండలేదు. చీకటి పడబోయేముందే అమ్మ నన్ను ఎక్కడకు వెళ్ళకుండా వారించేది. (83)
దివాపి మయి నిష్క్రాంతే సంతప్యేతే గురూ మమ ।
విచినోతి హి మాం తాతః సహైవాశ్రమవాసిభిః ॥ 84
పగలయినా నేను వెళ్ళగానే అమ్మనాన్న బాధపడేవారు. ఆశ్రమవాసులతో కలిసి నాన్న నాకై వెదుకుతాడు. (84)
మాత్రా పిత్రా చ సుభృశం దుఖితాభ్యామహం పురా ।
ఉపాలబ్ధశ్చ బహుశః చిరేణాగచ్ఛసీతి హ ॥ 85
గతంలో చాలాసార్లు అమ్మా, నాన్నా బాగా బాధపడి "ఆలస్యంగా వస్తున్నా" వని నన్ను కోపగించారు కూడా. (85)
కా త్వవస్థా తయోరద్య మదర్థమితి చింతయే ।
తయోరదృశ్యే మయి చ మహద్ దుఃఖం భవిష్యతి ॥ 86
నా కోసం వారిద్దరు ఇప్పుడు ఏ అవస్థలో ఉన్నారో? వారు కనిపించకపోతే నాకు ఎంతో దుఃఖం కలుగుతుంది. (86)
పురా మామూచతుశ్చైవ రాత్రావస్రాయమాణకౌ ।
భృశం సుదుఃఖితౌ వృద్ధౌ బహుశః ప్రీతిసంయుతౌ ॥ 87
ఇంతకుముందొకసారి ఎంతో బాధపడుతూ కంటతడిపెడుతూ ఆ వృద్ధులు ఎంతో ప్రేమతో నాతో ఇలా అన్నారు. (87)
త్వయా హీనౌ న జీవావః ముహూర్తమపి పుత్రక ।
యావద్ ధరిష్యసే పుత్ర తావన్నౌ జీవితం ధ్రువమ్ ॥ 88
నాయనా! నీవు లేకుండా క్షణం కూడా మేము బ్రతుకలేము. నీవు బ్రతికినంతకాలం నిశ్చయంగా మేమూ బ్రతికి ఉంటాం. (88)
వృద్ధయోరంధయోర్ధృష్టిః త్వయి వంశః ప్రతిష్ఠితః ।
త్వయి పిండశ్చ కీర్తిశ్చ సంతానం చావయోరితి ॥ 89
మేము ముసలివారమూ, గ్రుడ్డివారమూ, మాకు చూపు నీవే. వంశప్రతిష్ఠ నీ మీద ఆధారపడి ఉన్నది. మాకు పిండమూ, కీర్తి, వంశవృద్ధి అన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి. (89)
మాతా వృద్ధా పితా వృద్ధః తయోర్యష్టిరహం కిల ।
తౌరాత్రౌ మామపశ్యంతౌ కామవస్థాం గమిష్యతః ॥ 90
అమ్మ వృద్ధురాలు. నాన్న వృద్ధుడు. వాళ్ళకు ఊతకర్ర నేను. ఈ రాత్రి నేను కనిపించక వారు ఎటువంటి స్థితికి లోనవుతారో? (90)
నిద్రాయాశ్చాభ్యసూయామి యస్యా హేతోః పితా మమ ।
మాతా చ సంశయం ప్రాఫ్తా మత్కృతేఽనపకారిణీ ॥ 91
నిద్రమీదే నాకు కోపం వస్తోంది. దీనివలన నా తండ్రిని గురించి, నాకెప్పుడూ బాధ కలిగించని నా తల్లిని గురించి ఆందోళన కలుగుతోంది. (91)
అహం చ సంశయం ప్రాఫ్తః కృచ్ఛ్రామాపదమాస్థితః ।
మాతాపితృభ్యాం హి వినా నాహం జీవితుముత్సహే ॥ 92
నేను కూడా తీవ్రమైన ఆపద నెదుక్కొని ప్రాణసంకట స్థితిలో ఉన్నాను. తల్లిదండ్రులు లేకపోతే నేను బ్రతుకలేను. (92)
వ్యక్తమాకులయా బుద్ధ్యా ప్రజ్ఞాచక్షుః పితా మమ ।
ఏకైకమస్యాం వేలాయాం పృచ్ఛత్యాశ్రమవాసినమ్ ॥ 93
ప్రజ్ఞాచక్షువయిన నా తండ్రి వ్యాకుల హృదయంతో ఆశ్రమవాసులనందరినీ విడివిడిగా నాగురించి అడుగుతుంటాడు. (93)
నాత్మానమనుశోచామి యథాహం పితరం శుభే ।
భర్తారం చాప్యనుగతాం మాతరం పరిదుర్బలామ్ ॥ 94
కళ్యాణి! నా గురించి బాధపడటం లేదు. నా తండ్రిని గురించి, ఆయననే అనుసరించే దీనురాలు నా తల్లిని గురించి బాధపడుతున్నాను. (94)
మత్కృతేన హి తావద్య సంతాపం పరమేష్యత ।
జీవంతావనుజీవామి భర్తవ్యౌ తౌ మయేతి హ ॥ 95
తయోః ప్రియం మే కర్తవ్యమ్ ఇతి జానామి చాప్యహమ్ ।
నా కోసమే వారిప్పుడు ఎంతో బాధపడుతుంటారు. వారు బ్రతికి ఉన్నారు కాబట్టి నేనూ బ్రతుకుతున్నాను. వారిని పోషించవలసినది నేనే గదా! వారికి ఆనందాన్ని కల్గించటమే నా కర్తవ్యమని నాకు తెలుసు. (95 1/2)
మార్కండేయ ఉవాచ
ఏవముక్త్వా స ధర్మాత్మా గురుభక్తో గురుప్రియః ॥ 96
ఉచ్ఛ్రిత్య బాహూ దుఃఖార్తః సుస్వరం ప్రరురోద హ ।
మార్కండేయుడిలా అన్నాడు.
గురుభక్తుడు, గురుప్రియుడు, ధర్మాత్ముడూ అయిన ఆ సత్యవంతుడు అలా అని చేతులు రెండూ పైకెత్తి బాధతో పెద్దగా ఏడువసాగారు. (96 1/2)
తతోఽబ్రవీత్ తథా దృష్ట్వా భర్తారం శోకకర్శితమ్ ॥ 97
ప్రమృజ్యాశ్రూణి నేత్రాభ్యాం సావిత్రీ ధర్మచారిణీ ।
యది మేఽస్తి తపస్తప్తం యది దత్తం హుతం యది ॥ 98
శ్వశ్రూశ్వశురభర్తృణాం మమ పుణ్యాస్తు శర్వరీ ।
శోకతప్తుడైన భర్తను చూచి, కన్నీరు తుడిచి ధర్మచారిణి అయిన సావిత్రి ఇలా అన్నది. నేను ఏదైనా తపస్సు చేసి ఉంటే, ఎప్పుడైనా అగ్నికి ఆహుతులను అర్పించి ఉంటే తత్ఫలంగా ఈ రాత్రి నా అత్తమామలకూ, నాభర్తకూ, నాకూ శుభంగా జరిగిపోవుగాక! (97-98 1/2)
న స్మరామ్యుక్తపూర్వం వై స్వైరేష్వప్యనృతాం గిరమ్ ॥ 99
తేన సత్యేన తావద్య ధ్రియేతాం శ్వశురౌ మమ ।
నేను క్రీడావినోద సమయంలో కూడా అసత్యమాడినట్లు నాకు గుర్తులేదు. ఆ సత్యఫలం వలన నా అత్తమామలు ఈ రాత్రి జీవించి యందురు గాక! (99 1/2)
సత్యవానువాచ
కామయే దర్శనం పిత్రోః యాహి సావిత్రి మా చిరమ్ ॥ 100
(అపి నామ గురూ తౌ హి పశ్యేయం ప్రీయమాణకౌ।)
సత్యవంతుడిలా అన్నాడు.
సావిత్రీ! అమ్మానాన్నలను చూడాలనుకొంటున్నాను. బయలుదేరు. ఆలస్యం చేయవద్దు. ఆనందంగా ఉన్న వాళ్లను నేను చూడగలుగుతానో? లేదో? (100)
పురా మాతుః పితుర్వాపి యది పశ్యామి విప్రియమ్ ।
న జీవిష్యే వరారోహే సత్యేనాత్మానమాలభే ॥ 101
నా శరీరాన్ని తాకుతూ సత్యం మీద ఒట్టువేసి చెపుతున్నాను. అమ్మనాన్నలకు ఏదైనా జరగకూడనిది జరిగితే నేను బ్రతుకలేను. (101)
యది ధర్మే చ తే బుద్ధిః మాం చేజ్జీవంతమిచ్చసి ।
మమ ప్రియం వా కర్తవ్యం గచ్ఛావాశ్రమమంతికాత్ ॥ 102
నీకు ధర్మం మీదనే బుద్ధి ఉంటే, నేను బ్రతకాలనుకొంటే నాకిష్టమైనట్టు చేయాలనిపిస్తే ఇప్పుడే ఆశ్రమం దగ్గరకు వెళదాం. (102)
మార్కండేయ ఉవాచ
సావిత్రీ తత ఉత్థాయ కేశాన్ సంయమ్య భావినీ ।
పతిముత్థాపయామాస బాహుభ్యాం పరిగృహ్య వై ॥ 103
మార్కండేయుడిలా అన్నాడు.
భావిని అయిన సావిత్రి అప్పుడు లేచి, జుట్టు సవరించుకొని చేతులతో పట్టి భర్తను లేవదీసింది. (103)
ఉత్థాయ సత్యవాంశ్చాపి ప్రమృజ్యాంగాని పాణినా ।
సర్వా దిశః సమాలోక్య కఠినే దృష్టిమాదధే ॥ 104
సత్యవంతుడు కూడా లేచి, చేతితో ఒళ్ళంతా తుడుచుకొని, అంతటా కలియజూచి పండ్లగంపపై దృష్టిపెట్టాడు. (104)
తమువాచాథ సావిత్రీ శ్వః ఫలాని హరిష్యసి ।
యోగక్షేమార్థమేతం తే నేష్యామి పరశుం త్వహమ్ ॥ 105
అప్పుడు సావిత్రి సత్యవంతునితో ఇలా అన్నది - పండ్లు రేపు తేవచ్చు. నీ యోగక్షేమాలకోసం గొడ్డలిని ఇప్పుడు తీస్తున్నాను. (105)
కృత్వా కఠినభారం సా వృక్షశాఖావలంబినమ్ ।
గృహీత్వా పరశుం భర్తుః సకాశే పునరాగమత్ ॥ 106
ఆమె పండ్లగంపను చెట్టుకొమ్మను వ్రేలాడదీసి, గొడ్డలి పట్టుకొని భర్తదగ్గరకు మరల వచ్చింది. (106)
వామే స్కంధే తు వామోరూః భర్తుర్బాహుం నివేశ్య చ ।
దక్షిణేన పరిష్వజ్య జగామ గజగామినీ ॥ 107
సావిత్రి ఎడమభుజంపై భర్త చేతిని ఉంచుకొని, కుడిభుజంతో భర్తను పట్టుకొని మెల్లగా బయలుదేరింది. (107)
సత్యవానువాచ
అభ్యాసగమనాద్ భీరు పంథానో విదితా మమ ।
వృక్షాంతరాలోకితయా జ్యోత్స్నయా చాపి లక్షయే ॥ 108
సత్యవంతుడిలా అన్నాడు.
పిరికిదానా! ఎన్నిసార్లు వచ్చానో! దారి నాకు గుర్తే. చెట్లమాటు నుండి పడుతున్న వెన్నెలలో దారి కనిపిస్తోంది. (108)
ఆగతౌ స్వః పథా యేన ఫలాన్యవచితాని చ ।
యథాగతం శుభే గచ్ఛ పంథానం మా విచారయ ॥ 109
కళ్యాణి! మనం వచ్చి పండ్లు ఏరుకొన్న దారి ఇదే. వచ్చిన బాటనే వెళదాం. దారిని గురించిన ఆలోచన వద్దు. (109)
పలాశఖండే చైతస్మిన్ పంథా వ్యావర్తతే ద్విధా ।
తస్యోత్తరేణ యః పంథాః తేన గచ్ఛ త్వరస్వ చ ॥ 110
స్వస్థోఽస్మి బలవానస్మి దిదృక్షుః పితరావుభౌ ।
పలాశవృక్షాలు గల ఈ చోట బాట రెండుగా చీలుతుంది. ఉత్తరం వైపు తిరిగిన దారిలో వెళ్ళు. త్వరగా నడు, అమ్మనాన్నలను చూడాలన్న తహతహతో నాకు బాగానే ఉంది. శక్తి కూడా వచ్చింది. (110 1/2)
మార్కండేయ ఉవాచ
బ్రువన్నేవం త్వరాయుక్తః సంప్రాయాదాశ్రమం ప్రతి ॥ 111
మార్కండేయుడిలా అన్నాడు.
ఇలా అంటూనే త్వరత్వరగా ఆశ్రమం వైపు నడిచాడు. (111)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి పతివత్రామాహాత్మ్యపర్వణి సావిత్య్రుపాఖ్యానే సప్తనవత్యధిక ద్విశతతమోఽధ్యాయః ॥ 297 ॥
ఇది శ్రీ మహాభారతమున వనపర్వమున పతివ్రతా మాహాత్మ్యపర్వమను ఉపపర్వమున సావిత్య్రుపాఖ్యానమను రెండువందల తొంబది యేడవ అధ్యాయము. (297)
(దాక్షిణాత్య అధికపాఠం 1 శ్లోకంతో కలిపి మొత్తం 112 శ్లోకాలు.)