298. రెండువందల తొంబది ఎనిమిదవ అధ్యాయము

సావిత్రి సత్యవంతులు ఆశ్రమమునకు వచ్చుట.

మార్కండేయ ఉవాచ
ఏతస్మిన్నేవ కాలే తు ద్యుమత్సేనో మహాబలః ।
లబ్ధచక్షుః ప్రసన్నాయాం దృష్ట్యాం సర్వం దదర్శహ ॥ 1
మార్కండేయుడిలా అన్నాడు అదే సమయంలో మహాబలుడైన ద్యుమత్సేనునకు చూపు వచ్చింది. చూపులోని లోపం తొలగిపోవటంతో అంతా చూడసాగాడు. (1)
స సర్వానాశ్రమాన్ గత్వా శైబ్యయా సహ భార్యయా ।
పుత్రహేతోః పరామార్తిం జగామ భరతర్షభ ॥ 2
భరతర్షభా! ద్యుమత్సేనుడు తన భార్య శైబ్యతో కలిసి సత్యవంతునికై అన్ని ఆశ్రమాలు తిరిగాడు. అతనిని గూర్చి తీవ్రవేదనం పొందాడు. (2)
తావాశ్రమాన్ నదీశ్చైవ వనాని చ సరాంసి చ ।
తస్యాం నిశి విచిన్వంతౌ దంపతీ పరిజగ్మతుః ॥ 3
ఆ దంపతులు ఆ రాత్రి సత్యవంతుని వెదకుతూ ఆశ్రమాలు, నదులు, వనాలు, సరస్సులు అన్నీ తిరిగారు. (3)
శ్రుత్వా శబ్దం తు యం కంచిద్ ఉన్ముఖౌ సుతశంకయా ।
సావిత్రీసహితోఽభ్యేతి సత్యవానిత్యభాషతమ్ ॥ 4
ఏ చప్పుడు వినిపించినా కొడుకే అనుకొని, అటుతిరిగి 'సావిత్రితో కలిసి సత్యవంతుడు వస్తున్నాడు' అని ఒకరికొకరు చెప్పుకొనసాగారు (4)
భిన్నైశ్చ పరుషైః పాదైః సవ్రణైః శోణితోక్షితైః ।
కుశకంటకవిద్ధాంగౌ ఉన్మత్తావివ ధావతః ॥ 5
కాళ్ళు పగిలి కఠినంగా ఉన్నాయి. పరుగెత్తటంతో గాయమై నెత్తురు కారుతున్నాయి. దర్భలు, ముళ్ళు వాళ్ళ శరీరంలో గ్రుచ్ఛుకొంటున్నాయి. అయినా సరే వాళ్ళు పిచ్చివాళ్ళవలె అటు ఇటు పరుగెత్తుతూనే ఉన్నారు. (5)
తతోఽభిసృత్య తైర్విప్రైః సర్వైరాశ్రమవాసిభిః ।
పరివార్య సమాశ్వాస్య తావానీతౌ స్వమాశ్రమమ్ ॥ 6
అప్పుడు ఆశ్రమవాసులయిన విప్రులందరూ వచ్చి, చుట్టూ చేరి, వాళ్ళను ఓదార్చి ఆశ్రమానికి తీసికొనివచ్చారు. (6)
తత్ర భార్యాసహాయః సః వృతో వృద్ధైస్తపోధనైః ।
ఆశ్వాసితోఽపి చిత్రార్థైః పూర్వరాజ్ఞాం కథాశ్రయైః ॥ 7
తతస్తౌ పునరాశ్వస్తౌ వృద్ధౌ పుత్రదిదృక్షయా ।
బాల్యవృత్తాని పుత్రస్య స్మరంతౌ భృశదుఃఖితౌ ॥ 8
తపోధనులయిన వృద్ధులు శైబ్యాద్యుమత్సేనుల చుట్టూ చేరి చిత్రార్థాలు గల ప్రాచీనరాజకథలను చెప్పి వారిని ఓదార్చారు. అయినా ఆ వృద్ధులు శైబ్యాద్యుమత్సేనులు కుమారుని చూడాలన్న తహతహతో సత్యవంతుని బాల్యవృత్తాలను తలచుకొంటూ మరీ దుఃఖించారు. (7,8)
పునరుక్త్వా చ కరుణాం వాచం తౌ శోకకర్శితౌ ।
హా పుత్ర హా సాధ్వి వధూః క్వాసి క్వాసీత్యరోదతామ్ ।
బ్రాహ్మణః సత్యవాక్ తేషామ్ ఉవాచేదం తయోర్వచః ॥ 9
మాటిమాటికి దీనంగా విలపిస్తూ "హా కుమారా! హా సాధ్వి-కోడలా! ఎక్కడున్నావు" అంటూ రోదించసాగారు. అప్పుడు సత్యవచనుడైన ఒక బ్రాహ్మణుడు వారితో ఇలా అన్నాడు. (9)
సువర్చా ఉవాచ
యథాస్య భార్యా సావిత్రీ తపసా చ దమేన చ ।
ఆచారేణ చ సంయుక్తా తథా జీవతి సత్యవాన్ ॥ 10
సువర్చసుడు ఇలా అన్నాడు.
సత్యవంతుని భార్య సావిత్రి తపస్సు, ఇంద్రియనిగ్రహమూ, సదాచారమూ గలది. ఆ శక్తితో సత్యవంతుడు జీవించియే ఉంటాడు. (10)
గౌతమ ఉవాచ
వేదాః సాంగా మయాధీతాః తపో మే సంచితం మహత్ ।
కౌమారబ్రహ్మచర్యం చ గురవోఽగ్నిశ్చ తోషితాః ॥ 11
సమాహితేన చీర్ణాని సర్వాణ్యేవ వ్రతాని మే ।
వాయుభక్షోపవాసశ్చ కృతో మే విధివత్ పురా ॥ 12
అనేన తపసా వేద్మి సర్వం పరచికీర్షితమ్ ।
సత్యమేతన్నిబోధధ్వం ధ్రియతే సత్యవానితి ॥ 13
గౌతముడిలా అన్నాడు.
నేను వేదాంగాలతోపాటు వేదాలను అభ్యసించాను. ఎంతో తపస్సు చేశాను. కౌమారంలో బ్రహ్మచర్యంతో గురుజనులను అగ్నిని సంతోషపెట్టాను. ఏకాగ్రచిత్తంతో వ్రతాల నన్నింటినీ పూర్తి చేశాను. గతంలో శాస్త్రోక్తంగా వాయుభక్షణ చేస్తూ ఉపవాసాలు చేశాను. ఈ తపశ్శక్తితో నేను పరులచేష్టల నన్నింటినీ గ్రహించగలను సత్యవంతుడు బ్రతికియే ఉన్నాడు. ఇది సత్యం. తెలుసుకోండి. (11-13)
శిష్య ఉవాచ
ఉపాధ్యాయస్య మే వక్త్రాద్ యథా వాక్యం వినిఃసృతమ్ ।
నైవ జాతు భవేన్మిథ్యా తథా జీవతి సత్యవాన్ ॥ 14
శిష్యుడిలా అన్నాడు.
మా గురువుగారి నోటి నుండి వెలువడిన మాట ఎప్పుడూ మిథ్య కాదు. కాబట్టి సత్యవంతుడు బ్రతికియే ఉంటాడు. (14)
ఋషయ ఊచుః
యథాస్య భార్యా సావిత్రీ సర్వైరేవ సులక్షణైః ।
అవైధవ్యకరైర్యుక్తా తథా జీవతి సత్యవాన్ ॥ 15
ఋషులు ఇలా అన్నారు.
సత్యవంతుని భార్య సావిత్రి, సుమంగళిగా నిలువటానికి అవసరమయిన మంచిలక్షణాలన్నీ కలది. కాబట్టి సత్యవంతుడు జీవించేయుంటాడు. (15)
భారద్వాజ ఉవాచ
యథాస్య భార్యా సావిత్రీ తపసా చ దమేన చ ।
ఆచారేణ చ సంయుక్తా తథా జీవతి సత్యవాన్ ॥ 16
భారద్వాజుడిలా అన్నాడు.
సత్యవంతుని భార్య తపస్సు, ఇంద్రినిగ్రహం, సదాచారాలతో కూడినది. కాబట్టి సత్యవంతుడు జీవించియుంటాడు. (16)
దాల్భ్య ఉవాచ
యథా దృష్టిః ప్రవృత్తా తే సావిత్య్రాశ్చ యథా వ్రతమ్ ।
గతాఽఽహారమకృత్వా చ తథా జీవతి సత్యవాన్ ॥ 17
దాల్భ్యుడిలా అన్నాడు.
నీకు చూపు వచ్చింది. సావిత్రి వ్రతాన్ని పూర్తి చేసింది. నేడు ఆహారం తీసికోకుండానే వనానికి వెళ్ళింది వీటిని బట్టి సత్యవంతుడు జీవించియే ఉంటాడు. (17)
ఆపస్తంబ ఉవాచ
యథా వదంతి శాంతాయాం దిశి వై మృగపక్షిణః ।
పార్థివీ చ ప్రవృత్తిస్తే తథా జీవతి సత్యవాన్ ॥ 18
ఆపస్తంబుడిలా అన్నాడు.
ప్రశాంతంగా ఉన్న దిక్కులో మృగాలు, పక్షులు సూచనలిస్తూ అరుస్తున్నాయి. నీవు రాజధర్మాన్ని పాటిస్తున్నావు. కాబట్టి సత్యవంతుడు జీవించియే ఉండాలి. (18)
ధౌమ్య ఉవాచ
సర్వైర్గుణైరుపేతస్తే యథా పుత్రో జనప్రియః ।
దీర్ఘాయుర్లక్షణోపేతః తథా జీవతి సత్యవాన్ ॥ 19
ధ్యౌముడిలా అన్నాడు.
నీ కుమారుడు సర్వసద్గుణాలు గలవాడు. చిరకాలం జీవించే లక్షణాలు గలవాడు. జనులకిష్టమైనవాడు. కాబట్టి సత్యవంతుడు బ్రతికియుంటాడు. (19)
మార్కండేయ ఉవాచ
ఏవమాశ్వాసితస్తైస్తు సత్యవాగ్భిస్తపస్విభిః ।
తాంస్తాన్ విగణయన్ సర్వాన్ తతః స్థిర ఇవాభవత్ ॥ 20
మార్కండేయుడిలా అన్నాడు.
సత్యవచనులయిన తాపసులు ఈ రీతిగా తనను ఊరడించగా ఆయా మాటలను పరిగణిస్తూ ద్యుమత్సేనుడు కుదుటబడినట్లు అయ్యాడు. (20)
తతో ముహూర్తాత్ సావిత్రీ భర్త్రా సత్యవతా సహ ।
ఆజగామాశ్రమం రాత్రౌ ప్రహృష్టా ప్రవివేశ హ ॥ 21
తరువాత రెండు ఘడియలలోనే సావిత్రి సత్యవంతునితో కూడా వచ్చి రాత్రివేళలోనే ఆనందంగా ఆశ్రమంలో ప్రవేశించింది. (21)
బ్రాహ్మణా ఊచుః
పుత్రేణ సంగతం త్వాం తు చక్షుష్మంతం నిరీక్ష్య చ ।
సర్వే వయం వై పృచ్ఛామః వృద్ధిం వై పృథివీపతే ॥ 22
బ్రాహ్మణులిలా అన్నారు.
రాజా! నీకొడుకు వచ్చి చేరాడు. నీకు చూపు వచ్చింది. ఇది చూచి మేము నీ అభ్యుదయాన్ని భావిస్తున్నాం. (22)
సమాగమేన పుత్రస్య సావిత్య్రా దర్శనేన చ ।
చక్షుషశ్చాత్మనో లాభాత్ త్రిభిర్దిష్ట్యా వివర్ధసే ॥ 23
నీ అదృష్టం కొద్దీ కొడుకు వచ్చాడు. కోడలు కనిపించింది. చూపు వచ్చింది. ఈ మూడు నీ అభ్యుదయాన్ని తెలుపుతున్నాయి. (23)
సర్వైరస్మాభిరుక్తం యత్ తథా తన్నాత్ర సంశయః ।
భూయో భూయః సమృద్ధిస్తే క్షిప్రమేవ భవిష్యతి ॥ 24
మేము చెప్పినదంతా అలాగే జరిగింది. నిస్సందేహంగా త్వరలోనే నీకు ఇంకా ఇంకా అభివృద్ధి కలుగుతుంది. (24)
తతోఽగ్నిం తత్ర సంజ్వాల్య ద్విజాస్తే సర్వ ఏవ హి ।
ఉపాసాంచక్రిరే పార్థ ద్యుమత్సేనం మహీపతిమ్ ॥ 25
ఆ తరువాత ఆ బ్రాహ్మణులంతా అగ్నిని ప్రజ్వలింపజేసి ద్యుమత్సేన నరపతి ప్రక్కనే కూర్చున్నారు. (25)
శైబ్యా చ సత్యవాంశ్చైవ సావిత్రీ చైకతః స్థితాః ।
సర్వైస్తైరభ్యనుజ్ఞాతా విశోకాః సముపావిశన్ ॥ 26
శైబ్య, సత్యవంతుడు, సావిత్రి ఒక ప్రక్క నిలిచి ఆ అందరి అనుమతితో బాధనంతా మరచిపోయి కూర్చున్నారు. (26)
తతో రాజ్ఞా సహాసీనాః సర్వే తే వనవాసినః ।
జాతకౌతూహలాః పార్థ పప్రచ్ఛుర్నృపతేః సుతమ్ ॥ 27
రాజా! అప్పుడు రాజుతో కలిసి ఆసీనులయిన ఆ వనవాసులందరూ కుతూహలంతో రాజకుమారుని ప్రశ్నింపసాగారు. (27)
ఋషయ ఊచుః
ప్రాగేవ నాగతం కస్మాత్ సభార్యేణ త్వయా విభో ।
విరాత్రే చాగతం కస్మాత్ కోఽనుబంధస్తవాభవత్ ॥ 28
ఋషులు ఇలా అన్నారు
ప్రభూ! నీవు, నీ భార్యా ఇంతకుముందే ఎందుకు రాలేదు? అపరరాత్రిలో ఎందుకు వచ్చారు? మీకు ఏ అడ్డంకి కలిగింది? (28)
సంతాపితః పితా మాతా వయం చైవ నృపాత్మజ ।
కస్మాదితి న జానీమః తత్ సర్వం వక్తుమర్హసి ॥ 29
రాజకుమారా! మీ అమ్మ, నాన్న ఎంతో బాదపడ్డారు. మాదీ అదే స్థితి. ఎందుకు ఆలస్యమవుతోందో మాకు తెలియదు. అదంతా చెప్పు. (29)
సత్యవానువాచ
పిత్రాహమభ్యనుజ్ఞాతః సావిత్రీసహితో గతః ।
అథ మేఽభూచ్ఛిరోదుఃఖం వనే కాష్ఠాని భిందతః ॥ 30
సత్యవంతుడిలా అన్నాడు.
నాన్న అనుమతితో సావిత్రితో కలిసి నేను వెళ్ళాను. అరణ్యంలో కట్టెలు కొడుతుంటే నాకు తలనొప్పి వచ్చింది. (30)
సుప్తశ్చాహం వేదనయా చిరమిత్యుపలక్షయే ।
తావత్ కాలం న చ మయా సుప్తపూర్వం కదాచన ॥ 31
ఆ బాధతో నేను చాలాసేపు నిదురపోయినట్లుంది. ఇంతకు ముందెప్పుడూ నేను అంతసేపు నిదురించలేదు. (31)
సర్వేషామేవ భవతాం సంతాపో మా భవేదితి ।
అతో విరాత్రాగమనం నాన్యహస్తీహ కారణమ్ ॥ 32
మీరంతా బాధపడకూడదని అపరరాత్రి అయినా వచ్చాం. మరే కారణమూ లేదు. (32)
గౌతమ ఉవాచ
అకస్మాచ్చక్షుషః ప్రాప్తిః ద్యుమత్సేనస్య తే పితుః ।
నాస్య త్వం కారణం వేత్సి సావిత్రీ వక్తుమర్హతి ॥ 33
గౌతముడిలా అన్నాడు.
నీ తండ్రి ద్యుమత్సేనునకు అకస్మాత్తుగా చూపు వచ్చింది. దీనికి కారణం నీవెరుగవు. సావిత్రియే చెప్పాలి. (33)
శ్రోతుమిచ్చామి సావిత్రి త్వం హి వేత్థ పరావరమ్ ।
త్వాం హి జానామి సావిత్రి సావిత్రీమివ తేజసా ॥ 34
త్వమత్ర హేతుం జానీషే తస్మాత్ సత్యం నిరుచ్యతామ్ ।
రహస్య యది తే నాస్తి కించిదత్ర వదస్వ నః ॥ 35
సావిత్రీ! దీనిగురించి నీద్వారా వినగోరుతున్నాను. ముందువెనుకలు నీకు తెలుసు. తేజస్సులో నీవు సావిత్రీదేవి వంటి దానవని నాకు తెలుసు. దీనికి కారణం నీకు తెలుసు. సత్యం చెప్పు. ఇది చెప్పరాని రహస్యమేమీ కాకపోతే మాకు తప్పక చెప్పాలి. (34,35)
సావిత్య్రువాచ
ఏవమేతద్ యథా వేత్థ సంకల్పో నాన్యథా హి వః ।
న హి కించిద్ రహస్యం మే శ్రూయతాం తథ్యమేవ యత్ ॥ 36
సావిత్రి ఇలా అన్నది.
మీరనుకొంటున్నది నిజమే. మీ సంకల్పం మరొక రీతిగా జరుగదు. రహస్యమేమీ లేదు. జరిగినదంతా చెపుతా వినండి. (36)
మృత్యుర్మే పత్యురాఖ్యాతః నారదేన మహాత్మనా ।
స చాద్య దివసః ప్రాప్తః తతో నైనం జహామ్యహమ్ ॥ 37
మహాత్ముడైన నారదుడు నా భర్తమరణాన్ని గురించి ముందే చెప్పాడు. నేడే ఆ రోజు. అందుకే సత్యవంతుని నేను విడిచియుండలేదు. (37)
సుప్తం చైనం యమః సాక్షాత్ ఉపాగచ్ఛత్ సకింకరః ।
స ఏనమనయద్ బద్ధ్వా దిశం పితృనిషేవితామ్ ॥ 38
సత్యవంతుడు నిదురిస్తుంటే కింకరులతో సహా యముడే వచ్చాడు. ఈయనను బంధించి దక్షిణదిశగా కొనిపోయాడు. (38)
అస్తౌషం తమహం దేవమ్ సత్యేన వచసా విభుమ్ ।
పంచ వై తేన మే దత్తా వరాః శృణుత తాన్ మమ ॥ 39
ఆ దేవదేవుని సత్యవచనాలతో నేను స్తుతించాను. ఆయన నాకు ఐదువరాలు ఇచ్చాడు. వాటిని వినండి. (39)
చక్షుషీ చ స్వరాజ్యం చ ద్వౌ వరౌ శ్వశురస్య మే ।
లబ్ధం పితుః పుత్రశతం పుత్రాణాం చాత్మనః శతమ్ ॥ 40
మా మామగారికి సంబంధించి నేత్రప్రాప్తి, రాజ్యలాభం - ఈ రెండు వరాలు. నా తండ్రికి వందమంది కొడుకులు, నాకూ వందమంది కొడుకులు. (40)
చతుర్వర్షశతాయుర్మే భర్తా లబ్ధశ్చ సత్యవాన్ ।
యథావృత్తం సుఖోదర్కమ్ ఇదం దుఃఖం మహన్మమ ॥ 41
నా భర్త సత్యవంతునకు నాలుగువందల సంవత్సరాల ఆయుస్సు లభించింది. నాకు కల్గిన తీవ్రదుఃఖం సుఖోదర్కమయింది. (41)
ఏతత్ సర్వం మయాఖ్యాతం కారణం విస్తరేణ వః ।
యథావృత్తం సుఖోదర్కమ్ ఇదం దుఃఖం మహన్మమ ॥ 42
మేము ఆలస్యంగా రావటానికి ఏర్పడిన కారణాన్ని ఉన్నదున్నట్టుగా వివరంగా చెప్పాను. అది నాకు చాలా దుఃఖాన్ని కలిగించినా సుఖాంతమే అయినది. (42)
ఋషయ ఊచుః
నిమజ్జమానం వ్యసనైరభిద్రుతం
కులం నరేంద్రస్య తమోమయే హ్రదే ।
త్వయా సుశీలవ్రతపుణ్యయా కులం
సముద్ధృతం సాధ్వి పునః కులీనయా ॥ 43
ఋషులు ఇలా అన్నారు.
సాధ్వీ! ద్యుమత్సేనుని వంశం బాధలకు లోనై అంధకారమనే ఊబిలో మునగబోతుంటే కులీనవయిన నీవు సౌశీల్యవ్రతపుణ్యంతో దాన్ని పునరుద్ధరించావు. (43)
మార్కండేయ ఉవాచ
తథా ప్రశస్య హ్యభిపూజ్యచైవ
వరస్త్రియం తామృషయః సమాగతాః ।
నరేంద్రమామంత్య్ర సపుత్రమంజసా
శివేన జగ్ముర్ముదితాః స్వమాలయమ్ ॥ 44
మార్కండేయుడిలా అన్నాడు. అక్కడ కూడియున్న ఋషులు స్త్రీ రత్నమయిన సావిత్రిని ఆ రీతిగా ప్రశంసించి, సత్కరించి, ద్యుమత్సేన సత్యవంతుల అనుమతితో సుఖంగా, ఆనందంగా తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. (44)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి పతివ్రతామాహాత్మ్యపర్వణి
సావిత్య్రుపాఖ్యానే అష్టనవత్యధికశతతమోఽధ్యాయః ॥ 298 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున పతివ్రతా మాహాత్మ్యపర్వమను ఉపపర్వమున
సావిత్య్రుపాఖ్యానమను రెండువందల తొంబది యెనిమిదవ అధ్యాయము. (298)