29. ఇరువది తొమ్మిదవ అధ్యాయము

కృపాచార్యుని సమ్మతి - దుర్యోధనుని నిశ్చయము.

వైశంపాయన ఉవాచ
తత శ్శారద్వతో వాక్యమ్ ఇత్యువాచ కృప స్తదా।
యుక్తం ప్రాప్తం చ వృద్ధేన పాండవాన్ ప్రతిభాషితమ్॥ 1
వైశంపాయనుడు అన్నాడు.
రాజా! తరువాత మహర్షి శరద్వంతుని కుమారుడు కృపాచార్యుడిలా చెప్పాడు."రాజా! వయోవృద్ధుడైన భీష్ముడు పాండవుల విషయంలో చెప్పిన మాట యుక్తియుక్తం. ఈ సమయానికి తగినది. (1)
ధర్మార్థసహితం శ్లక్ష్ణం తత్త్వతశ్చ సహేతుకమ్।
తత్రానురూపం భీష్మేణ మమాప్యత్ర గిరం శృణు॥ 2
భీష్ముని వాక్యాలు ధర్మార్థాలు రెండింటితో కూడినవి. అవి మధురమైనవి, తాత్త్వికమైనవి, సకారణమైనవి. ఈవిషయంలో నేను చెప్పేది కూడా భీష్మ వచనాలకు అనుగుణమే. నామాట విను. (2)
తేషాం చైవ గతి స్తీర్థైః వాసశ్చైషాం ప్రచింత్యతామ్।
నీతిర్విధీయతాం చాపి సంప్రతం యా హితా భవేత్॥ 3
మీరు గూఢచారుల ద్వారా పాండవులెక్కడకు వెళ్ళారో, ఎక్కడ ఉన్నారో గుర్తించండి. ఈ సమయంలో హితాన్ని కలిగించే నీతిని ఆశ్రయించండి. (3)
నావజ్ఞేయో రిపుస్తాత ప్రాకృతోఽపి బుభూషతా।
కిం పునః పాండవాస్తాత సర్వాస్త్రకుశలా రణే॥ 4
సమ్రాట్టు కావాలనే కోరిక ఉంటే సాధారణ శత్రువును కూడా అవహేళన (చులకన) చేయకూడదు. యుద్ధంలో అన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగించడంలో నిపుణులయిన పాండవుల మాట చెప్పేదేమిటి? (4)
తస్మాత్ సత్త్రం ప్రవిష్టేషు పాండవేషు మహాత్మసు।
గూఢభావేషు ఛన్నేషు కాలే చోదయమాగతే॥ 5
స్వరాష్ట్రే పరరాష్ట్రే చ జ్ఞాతవ్యం బలమాత్మనః॥
ఉదయః పాండవానాం చ ప్రాప్తే కాలే న సంశయః॥ 6
మహాత్ములయిన పాండవులు ప్రతిజ్ఞాపాలన ధర్మంలో నిమగ్నులై మారువేషాన్ని ధరించి రహస్యంగా దాగి ఉన్నారు. అజ్ఞాతవాసకాలం అయిపోతోంది. కాబట్టి మన దేశంలోను, ఇతర దేశాల్లోను మనకెంత శక్తి ఉందో తెలుసుకోవాలి. అనుకూలసమయం వచ్చినపుడు పాండవులు ప్రకట మవుతారనే విషయంలో సంశయం లేదు. (5,6)
నివృత్త సమయాః పార్థాః మహాత్మానో మహాబలాః।
మహోత్సాహా భవిష్యంతి పాండవా హ్యమితౌజసః॥ 7
అజ్ఞాతవాసం పూర్తయ్యాక మహాబలవంతులు, అమితపరాక్రమవంతులు, మహాత్ములు అయిన కుంతీ కుమారులు మహోత్సాహం పొందుతారు. (7)
తస్మా ద్బలం చ కోశశ్చ నీతిశ్చాపి విధీయతామ్।
యథా కాలోదయే ప్రాప్తే సమ్యక్ తైః సందధామహే॥ 8
అందుచేత మీరు మీ సైన్యాన్ని, కోశాన్ని, నీతిని సమయం వచ్చినపుడు సంధి(ఒప్పందం/బాణ సంధానం) చేసుకోవడానికి వీలుగా ఏర్పరచుకోవాలి. (8)
తాత బుద్ధ్యాపి తత్సర్వం బుద్ధ్యస్వ బలమాత్మనః।
నియతం సర్వమిత్రేషు బలవత్స్వబలేషుచ॥ 9
నాయనా! నీవు స్వయంగా నీబుద్ధితో విచారించి 'మన సంపూర్ణశక్తి యెంత' అనే విషయం తెలుసుకో. బలవంతులు, బలహీనులు అయిన నీ మిత్రులందరి బలం ఎంతో నిశ్చితంగా తెలుసుకో. (9)
ఉచ్చావచం బలం జ్ఞాత్వా మధ్యస్థం చాపి భారత।
ప్రహృష్టమప్రహృష్టం చ సందధామ తథా పరైః॥ 10
భారతా! ఉత్తమమూ, మధ్యమమూ, అధమమూ అయిన మూడు రకాలయిన సైన్యస్థితి తెలుసుకో. ఉత్తమమధ్యముల్లో మనపట్ల సంతోషంతో ఉన్నవారు, మనవిషయంలో సంతోషంగా లేనివారు ఎవరెవరో తెలుసుకోవాలి. అపుడు మనం శత్రువులతో సంధి (ఒప్పందం-బాణసంధానం) చేయగలం. (10)
సామ్నా దానేన భేదేన దండేన బలికర్మణా।
న్యాయేనాక్రమ్య చ పరాన్ బలాచ్చానమ్య దుర్బలాన్॥ 11
సాంత్వయిత్వా తు మిత్రాణి బలం చాభాష్యతాం సుఖమ్।
సుకోశబలసంవృద్ధః సమ్యక్ సిద్ధిమవాప్స్యసి॥ 12
సామదానభేదదండోపాయాల నుపయోగించి, పన్నులను పెంచి బలవంతులను లోబరుచుకొనడం; దుర్బలులను బలంతో ఆక్రమించుకొనడం; సైన్యాన్ని మంచిమాటలతో అదుపులో ఉంచుకొనడం ద్వారా కోశబలాలను పెంపొందించుకొని మంచి ఫలితాన్ని పొందగలవు. (11,12)
యోత్స్యసే చాపి బలిభిః అరిభిః ప్రత్యుపస్థితైః।
అన్యైస్త్వం పాండవై ర్వాపి హీనైః సబలవాహనైః॥ 13
ఆ దశలో బలవంతులయిన శత్రువులు పాండవులయినా, ఇతరులయినా దండెత్తి వస్తే వారికి సేన, వాహనాలు నీకంటె తక్కువ కాబట్టి నీవు వారందరితో యుద్ధం చేయగలుగుతావు. (13)
ఏవం సర్వం వినిశ్చిత్య వ్యవసాయం స్వధర్మతః।
యథాకాలం మనుష్యేంద్ర చిరం సుఖమవాప్స్యసి॥ 14
నరేంద్రా! ఈ విధంగా ధర్మానికి అనుకూలంగా సంపూర్ణంగా కర్తవ్యనిశ్చయం చేసి, కాలానుగుణంగా దానిని పాలించినట్లయితే చిరకాలం సుఖాన్ని అనుభవిస్తావు.' (14)
(వైశంపాయన ఉవాచ
తతో దుర్యోధనో వాక్యం శ్రుత్వా తేషాం మహాత్మనామ్।
మూహూర్తమివ సంచింత్య సచివానిదమబ్రవీత్॥
వైశంపాయనుడు అన్నాడు. రాజా! దుర్యోధనుడు ఆ మహాత్ముల వచనాన్ని విన్న తరువాత కొద్దిసేపు ఆలోచించాడు. మళ్ళీ మంత్రులతో ఇలా అన్నాడు.
దుర్యోధన ఉవాచ
శ్రుతం హ్యేత న్మయా పూర్వం కథాసు జనసంసది।
వీరాణాం శాస్త్రవిదుషాం ప్రాజ్ఞానాం మతినిశ్చయే॥
కృతినాం సారఫల్గుత్వం జానామి నయచక్షుషా।
దుర్యోధనుడు అన్నాడు - 'మంత్రులారా! నేను పూర్వం జనులు సమావేశమయి మాట్లాడుకునే సమయంలో శాస్త్రవిద్వాంసులు, జ్ఞానులు, వీరులు, పుణ్యాత్ములు అయిన వారి నిశ్చితాభిప్రాయం ఒకటి విన్నాను. దానివల్ల నీతి దృష్టిచే మనుష్యుల బలాబలాలు తెలుసుకొన్నాను.
సత్త్వే బాహుబలే ధైర్యే ప్రాణే శారీరసంభవే।
సాంప్రతం మానుషే లోకే సదైత్యనరరాక్షసే॥
చత్వారస్తు నరవ్యాఘ్రాః బలే శక్రోపమా భువి।
ఉత్తమాః ప్రాణినాం తేషాం నాస్తి కశ్చిత్ బలే సమః।
సమప్రాణబలా నిత్యం సంపూర్ణబలపౌరుషాః।
బలదేవశ్చ భీమశ్చ మద్రరాజశ్చ వీర్యవాన్।
చతుర్థః కీచక స్తేషాం పంచమం నానుశ్రుశ్రుమః।
అన్యోన్యానంతరబలాః పరస్పరజయైషిణః॥
బాహుయుద్ధమభీప్సంతః నిత్యం సంరబ్ధమానసాః।
తేనాహమవగచ్ఛామి ప్రత్యయేన వృకోదరమ్।
మనస్యభినివిష్టం మే వ్యక్తం జీవంతి పాండవాః।
ఈ కాలంలో మనుష్యలోకంలో దైత్య, మానవ, రాక్షసులలో నలుగురు పురుషశ్రేష్ఠులున్నారు. వారీభూమిపై ఆత్మబలం, బాహుబలం, ధైర్యం, శారీరకశక్తులలో ఇంద్రునితో సమానులు. వారు ప్రాణు లందరిలో ఉత్తములు. బలంలో వారితో సమానులు మరొకరు లేరు. వారు సమానమైన ప్రాణశక్తి గలవారు. సంపూర్ణ బలపరాక్రమ సంపన్నులు. వారు బలదేవుడు, భీమసేనుడు, శల్యుడు, కీచకుడు. వారితో సమానుడయిన అయిదవ వీరుడిని గురించి నేను వినలేదు. వీరు పరస్పరం సమానబలం కలవారు. ఒకరు మరొకరిని జయించడానికి ఉత్సుకతతో ఉంటారు. వీరి మనస్సులో ఒకరికి రెండవ వారిపై రోషం నిండి ఉంటుంది.
వీరు పరస్పరం బాహుయుద్ధం చేయాలని కోరుతారు. ఈ ఆధారం ద్వారా నేను భీమసేనుని గుర్తిస్తాను. నామనస్సులో ఈమాట స్పష్టంగా ఉంది. పాండవులు నిశ్చయంగా జీవించి ఉన్నారు.
తత్రాహం కీచకం మన్యే భీమసేనేన మారితమ్।
సైరంధ్రీం ద్రౌపదీం మన్యే నాత్ర కార్యవిచారణా॥
విరాటనగరంలో కీచకుని భీమసేనుడు చంపాడు. సైరంధ్రి ద్రౌపది అనుకొంటున్నాను. ఈవిషయంలో ఎక్కువ ఆలోచించ నక్కరలేదు.
శంకే కృష్ణా నిమిత్తం తు భీమసేనేన కీచకః।
గంధర్వవ్యపదేశేన హతో నిశి మహాబలః॥
కో హి శక్తః పరో భీమాత్ కీచకం హంతుమోజసా॥
శస్త్రం వినా బాహువీర్యాత్ తథా సర్వాంగచూర్ణనే।
మర్దితుం వా తథా శీఘ్రం చర్మమాంసాస్థిచూర్ణితమ్॥
ద్రౌపదికోసం భీమసేనుడు గంధర్వుడనే పేరు పెట్టుకొని రాత్రివేళ మహాబలవంతుడయిన కీచకుని చంపి ఉంటాడని నా సందేహం. భీమసేనుడు కాకుండా మరో వీరుడు అస్త్రశాస్త్రాలు లేకుండా కేవలం బాహుబలంతో, శారీరకశక్తితో కీచకుని చంపగలడా? కీచకుని అన్ని అవయవాలను చూర్ణం చేసి వేగంగా ఎముకలు, మాంసం, చర్మం చూర్ణం చేసి మాంసం ముద్దలా చేయడం మరొకరికి వీలుకాదు.
రూపమన్యత్ సమాస్థాయ భీమస్యైతద్విచేష్టితమ్।
ధ్రువం కృష్ణానిమిత్తం తు భీమసేనేన సూతజాః॥
గంధర్వవ్యపదేశేన హతా యుధి న సంశయః।
భీముడు మరొక రూపాన్ని ధరించి యీ పరాక్రమం చూపించాడని నిశ్చయంగా చెప్పవచ్చు. గంధర్వనామాన్ని ధరించిన భీముడే ద్రౌపదికోసం రాత్రివేళ సూతపుత్రులను కూడ చంపాడు. ఈ విషయంలో సందేహం లేదు.
పితామహేన యే చోక్తాః దేశస్య చ జనస్య చ।
గుణాస్తే మత్స్యరాష్ట్రస్య బహుశోఽపి మయా శ్రుతాః।
విరాటనగరే మన్యే పాండవాశ్ఛన్నచారిణః।
నివసంతి పురే రమ్యే తత్ర యాత్రా విధీయతామ్।
ధర్మరాజు నివసించడం వల్ల ఆ దేశానికి, జనసమూహానికి ఏ సుగుణాలు కలుగుతాయని పితామహుడు చెప్పాడో అవన్నీ మత్స్యదేశంలో ఉన్నట్లు గూఢచారుల ద్వారా విన్నాను. కాబట్టి పాండవులు విరాటరాజు రమణీయ నగరంలో మారువేషాన్ని ధరించి నివసిస్తున్నారని నేను భావిస్తున్నాను. అందుచేత ఆ దేశంపై దండయాత్ర చేయాలి.
మత్స్యరాష్ట్రం హనిష్యామః గ్రహీష్యామశ్చ గోధనమ్।
గృహీతే గోధనే నూనం తేఽపి యోత్స్యంతి పాండవాః।
అపూర్ణే సమయే చాపి యది పశ్యేమ పాండవాన్।
ద్వాదశాన్యాని వర్షాణి ప్రవేక్ష్యంతి పునర్వనమ్॥
మనవారు అక్కడకు వెళ్ళి మత్స్యదేశాన్ని ధ్వంసం చేయాలి. వాళ్ళ ఆవులను వశం చేసుకోవాలి. గోధనాన్ని మనం పట్టుకొంటే నిశ్చయంగా పాండవులు మనవారితో యుద్ధం
చేస్తారు. ఈస్థితిలో వారి అజ్ఞాతవాసం పూర్తి కావడానికి ముందు మనం పాండవులను చూసినట్లయితే, మరోసారి పన్నెండు సంవత్సరాలు వారు వనప్రవేశం చేయాలి.
తస్మా దన్యతరేణాపి లాభోఽస్మాకం భవిష్యతి।
కోశవృద్ధిహాస్మాకం శత్రూణాం నిధనం భవేత్॥
కథం సుయోధనం గచ్ఛేత్ యుధిష్ఠిరభృత పురా।
ఏతచ్చాపి వదత్యేషః మాత్స్యః పరిభవాన్మయి।
కాబట్టి రెండింటిలో ఒకదానిచేత నయినా మనకు లాభం కలుగుతుంది. ఈ దండయాత్ర వల్ల మన ధనాగారం వృద్ధిపొందుతుంది. శత్రునాశమవుతుంది. మత్స్యదేశరాజు విరాటుడు నాయెడల తిరస్కార భావంతో "పూర్వం యుధిష్ఠిరుడు చేసిన పాలన పోషణాలు దుర్యోధనుని అధికారంలో ఎలా అవుతాయి?" అన్నాడు.
తస్మాత్ కర్తవ్య మేతద్వై తత్ర యాత్రా విధీయతామ్।
ఏతత్సునీతం మన్యేఽహం సర్వేషాం యది రోచతే॥)
కాబట్టి మత్స్యదేశంపై దండయాత్ర చేయాలి. దాన్ని ఆక్రమించడం కర్తవ్యం. మీకందరకూ నచ్చితే, ఈ కార్యం నీతికి అనుకూలమని భావిస్తాను.
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణ పర్వణి చారప్రత్యాచారే కృపవాక్యే ఏకోనత్రింశోఽధ్యాయః॥ 29 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున కృపాచార్యుని సమ్మతి, దుర్యోధనుని నిర్ణయము అను ఇరువది తొమ్మిదవ అధ్యాయము. (29)
(దాక్షిణాత్య అధికపాఠం 20 శ్లోకాలు కలిపి మొత్తం 34 శ్లోకాలు.)