60. అరువదియవ అధ్యాయము
కర్ణార్జునుల సంవాదము - కర్ణుడు ఓడిపోయి పారిపోవుట.
అర్జున ఉవాచ
కర్ణ యత్తే సభామధ్యే బహు వాచా వికత్థితమ్।
న మే యుధి సమోఽస్తీతి తదిదం సముపస్థితమ్॥ 1
అర్జునుడిలా అంటున్నాడు. 'కర్ణా! యుద్ధంలో నా అంతటివాడు లేడని కౌరవసభామధ్యంలో ఎన్నో ప్రగల్భాలు పలికి నిన్ను నీవు పొడగుకొన్నావు. ఇదిగో ఇప్పుడు దానికి సరియైన పరీక్షాకాలం వచ్చింది. (1)
సోఽద్య కర్ణ మయా సార్ధం వ్యవహృత్య మహామృధే।
జ్ఞాస్యస్యబలమాత్మానం చ చాన్యానవమంస్యసే॥ 2
కర్ణా! అలా ప్రగల్భాలు పలికిన నీవు ఈరోజు ఈమహాసంగ్రామంలో నాతో యుద్ధం చేసి నీ బలహీనతను నీవే తెలిసికొంటావు. అంతేగాదు ఇక మీదట ఇతరులను పరాభవించవు. (2)
అవోచః పరుషా వాచః ధర్మముత్సృజ్య కేవలమ్।
ఇదం తు దుష్కరం మన్యే యదిదం తే చికీర్షితమ్॥ 3
ఇంతకు మునుపు నీవు ధర్మాన్ని వీడు పరుషంగా మాటాడావు. అయితే నీవు చేయదలచుకొన్న ఆ పని నీకు అసాధ్యమని నేను భావిస్తున్నాను. (3)
యత్ త్వయా కథితం పూర్వం మామనాసాద్య కించన।
తదద్య కురు రాధేయ కురుమధ్యే మయా సహ॥ 4
రాధేయా! నాతో తలపడకముందే కౌరవసభలో నీవు ఏవేవో మాటాడావు. ఇప్పుడు ఈ కౌరవులమధ్య నాతో యుద్ధం చేసి వాటిని నిరూపించుకో. (4)
యత్సభాయాం స పాంచాలీం క్లిశ్యమానాం దురాత్మభిః।
దృష్టవానపి తస్యాద్య ఫలమాప్నుహి కేవలమ్॥ 5
కౌరవసభలో దురాత్ములయిన కౌరవులచే బాధింప బడుతున్న పాంచాలిని చూషూ మిన్నకున్నావు. దానికి తగిన ఫలితాన్నే నీ వీనాడు అనుభవించు. (5)
ధర్మపాశనిబద్ధేన యన్మయా మర్షితం పురా।
తస్య రాధేయ కోపస్య విజయం పశ్య మే మృధే॥ 6
ధర్మపాశానికి కట్టుబడి నాడు నేను అన్నీ సహించాను. కర్ణా! ఆ కోపానికి తగిన ఫలితాన్ని నాగెలుపు రూపంలో నేటి యుద్ధంలో చూస్తావు. (6)
వనే ద్వాదశ వర్షాణి యాని సోఢాని దుర్మతే।
తస్యాద్య ప్రతికోపస్య ఫలం ప్రాప్నుహి సంప్రతి॥ 7
దుర్బుద్ధీ! పండ్రెండు సంవత్సరాలు అరణ్యంలో మేము భరించిన కష్టాలకు ప్రతీకారంగా ఈ యుద్ధంలో ఆ కోపఫలితాన్ని అనుభవిస్తావు. (7)
ఏహి కర్ణ మయా సార్ధం ప్రతియుధ్యస్వ సంగరే।
ప్రేక్షకాః కురవః సర్వే భవంతు తవ సైనికాః॥ 8
కర్ణా! రా! యుద్ధంలో నన్నెదిరించు. అందరు కౌరవులు, నీ సైనికులు ప్రేక్షకులై మన యుద్ధాన్ని తిలకిస్తారు.' (8)
కర్ణ ఉవాచ
బ్రవీషి వాచా యత్ పార్థ కర్మణా తత్సమాచర।
అతిశేతే హి తే వాక్యం కర్మైతత్ ప్రథితం భువి॥ 9
కర్ణుడిలా అంటున్నాడు. 'పార్థా! నీ మాటల్ నన్నింటినీ క్రియలో చూపించు. నీ మాట పనిని మించి పోతుంది. ఇది లోకంలో అందరికీ తెలిసిందే. (9)
యత్ త్వయా మర్షితం పూర్వం తదశక్తేన మర్షితమ్।
ఇతో గృహ్ణీమహే పార్థ తవ దృష్ట్వా పరాక్రమమ్॥ 10
పార్థ! ఇంతకు ముందు నీవు సహించినవన్నీ నీ చేతకానితనం వలన సహించినవే. ఇప్పుడు నీ పరాక్రమాన్ని ప్రదర్శిస్తే చూసి దాని నంగీకరిస్తాము. (10)
ధర్మపాశనిబద్ధేన యత్ త్వయా మర్షితం పురా।
తథైవ బద్ధమాత్మానమ్ అబద్ధమివ మన్యసే॥ 11
ధర్మానికి కట్టుబడి గతంలో అన్నీ సహించావు నీవు. నిజమే ఇప్పుడుకూడా నీవు బద్ధుడవే. కానీ బంధవిముక్తుడనని నీవు అనుకొంటున్నావు. (11)
యది తావద్వనే వాసః యథోక్తశ్చరితస్త్వయా।
తత్త్వం ధర్మార్థవిత్ క్లిష్టః స మయా యోద్ధుమిచ్ఛసి॥ 12
మాటమేరకు నీవు వనవాసాన్ని పూర్తి చేశావు. ధర్మార్థాలు తెలిసిన వాడవు కాబట్టి కష్టపడ్డావు. పాపం! అటువంటి వాడవు. ఇప్పుడు నాతో యుద్ధం చేయగోరుతున్నావు. (12)
యది శక్రః స్వయం పార్థ యుధ్యతే తవ కారణాత్।
తధాపి న వ్యథా కాచిత్ మమ స్యాద్విక్రమిష్యతః॥ 13
పార్థా! ఒకవేళ ఇంద్రుడే వచ్చి నీ కోసం యుద్ధం చేసినా పరాక్రమించగల నాకు ఇసుమంత కూడా బాధ కలుగదు. (13)
అయం కౌంతేయ కామస్తే న చిరాత్ సముపస్థితః।
యోత్స్యసే హి మయా సార్ధం అద్య ద్రక్ష్యసి మే బలమ్॥ 14
కౌంతేయా! నాతో యుద్ధం చేయాలన్న నీ కోరిక ఇదిగో ఇప్పుడే సమకూరింది. నాతో యుద్ధం చేసి ఈ నాడు నా బలాన్ని చూస్తావు.' (14)
అర్జున ఉవాచ
ఇదానీ మేవ తావత్ త్వమ్ అపయాతో రణాన్మమ।
తేన జీవసి రాధేయ నిహతస్త్వనుజస్తవ॥ 15
అర్జునుడన్నాడు. 'రాధేయా! ఇప్పుడే గదా నీవు నాతో యుద్ధం చేస్తూ పారిపోయింది. పారిపోయావు కాబట్టే ఇంకా బ్రతికి ఉన్నావు. కానీ నీ తమ్ముడు మరణించాడు. (15)
భ్రాతరం ఘాతయిత్వా కః త్యక్త్వా రణశిరశ్చ కః।
త్వదన్యః కః పుమాన్ సత్సు బ్రూయాదేవం వ్యవస్థితః॥ 16
తమ్ముణ్ణి చంపించి, యుద్ధంనుండి పారిపోయి పెద్దలమధ్యలో నిలిచి ఈ విధంగా మాటాడగలవాడు నీవు తప్ప మరెవ్వడూ ఉండడు.' (16)
వైశంపాయన ఉవాచ
ఇతి కర్ణం బ్రువన్నేవ బీభత్సురపరాజితః।
అభ్యయాద్ విసృజన్ బాణాన్ కాయావరణభేదినః॥ 17
వైశంపాయను డిలా అన్నాడు. అలా కర్ణునితో మాటాడుతూనే ఓటమినెరుగని అర్జునుడు కవచాన్ని కూడా భేదించగల బాణాలను వదులుతీ కర్ణునివైపు దూసుకొని పోయాడు. (17)
ప్రతిజగ్రాహ తం కర్ణః ప్రీయమాణో మహారథః।
మహతా శరవర్షేణ వర్షమాణమివాంబుదమ్॥ 18
మహారథుడైన కర్ణుడు ఆనందించి, వర్షించే మేఘంలాగా గొప్పగా బాణవర్షాన్ని కురిపిస్తూ అర్జునుని ఎదుర్కొన్నాడు. (18)
ఉత్పేతుః శరజాలాని ఘోరరూపాణి సర్వశః।
ఆవిధ్యదశ్వాన్ బాహ్వోశ్చ హస్తావాపం పృథక్పృథక్॥ 19
సోఽమృష్యమాణః కర్ణస్య నిషంగస్యావలంబనమ్।
చిచ్ఛేద నిశితాగ్రేణ శరేణ నతపర్వణా॥ 20
ఆకాశమంతా భయంకర శరసమూహం ఎగసి పడుతోంది. దీనిని సహించలేని అర్జునుడు కర్ణుని గుఱ్ఱాలను, చేతితొడుగులను కొట్టటంతో పాటు భుజాలపై గాయపరిచాడు. వంపుగలిగి కణుపులున్న వాడి బాణంతో కర్ణుని అంపపొదిత్రాటిని కూడా తెగనరికాడు. (19,20)
ఉపాసంగాదుపాదాయ కర్ణో బాణానథాపరాన్।
వివ్యాథ పాండవం హస్తే తస్య ముష్టిరశీర్యత॥ 21
అప్పుడు కర్ణుడు విడిగా దగ్గరగా ఉన్న అంపపొది నుండి వేరు బాణాలను తీసి అర్జునుని చేతిపై కొట్టాడు. అర్జునుని పిడికిలి శిథిలమైంది. (21)
తతః పార్థో మహాబాహుః కర్ణస్య ధనురచ్ఛినత్।
స శక్తిం ప్రాహిణోత్ తస్మై తాం పార్థో వ్యధమచ్ఛరైః॥ 22
అప్పుడు మహాబాహువైన అర్జునుడు కర్ణుని ధనుస్సును విరగ గొట్టాడు. కర్ణుడు శక్తిని ప్రయోగించాడు. అర్జునుడు దానిని బాణాలతో నశింపజేశాడు. (22)
తతోఽనుపేతు ర్బహవః రాధేయస్య పదానుగాః।
తాంశ్చ గాండీవనిర్ముక్తైః ప్రాహిణోద్ యమసాదనమ్॥ 23
అప్పుడు కర్ణుని సైనికులు చాలా మంది అక్కడకు వచ్చి పడ్డారు. అర్జునుడు గాండీవంనుండి వెలువడిన బాణాలతో వారిని యమలోకానికి పంపాడు. (23)
తతోఽస్యాశ్వాన్ శరైస్తీక్ష్ణైః బీభత్సుర్భారసాధనైః।
ఆకర్ణముక్తైరవధీత్ తే హతాః ప్రాపతన్ భువి॥ 24
అప్పుడు అర్జునుడు శత్రువుల దెబ్బను కాచుకొనగల తీక్ష్ణబాణాలతో నారిని చెవివరకు లాగి సంధించి కర్ణుని గుఱ్ఱాలను కొట్టాడు. అవి చచ్చి నే;అ కూలాయి. (24)
అథాపరేణ బాణేన జ్వలితేన మహౌజసా।
వివ్యాధ కర్ణం కౌంతేయః తీక్ష్ణేనోరసి వీర్యవాన్॥ 25
అంతట పరాక్రమశాలి అయిన అర్జునుడు కాంతితో జ్వలిస్తున్న మరో వాడిబాణంతో కర్ణుని వక్షస్థలంపై కొట్టాడు. (25)
తస్య భిత్త్వా తనుత్రాణం కాయమభ్యగమచ్ఛరః।
తతః స తమసాఽఽవిష్టః న స్మ కించిత్ ప్రజజ్ఞివాన్॥ 26
ఆ బాణం కర్ణుని కవచాన్ని చీల్చి శరీరాన్ని తాకింది. ఆ కర్ణుడు మూర్ఛిల్లి నిశ్చేతనుడయ్యాడు. (26)
స గాఢవేదనో హిత్వా రణం ప్రాయాదుదఙ్ముఖః।
తతోఽర్జున ఉదక్రోశత్ ఉత్తరశ్చ మహారథః॥ 27
ఆ బాధను భరించలేని కర్ణుడు వెన్ను చూపి రణ భూమి నుండి నిష్క్రమించాడు. అపుడు మహారథుడు అర్జునుడు, ఉత్తరుడు సింహనాదాలు చేశారు. (27)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణ పర్వణి కర్ణాపయానే షష్టితమోఽధ్యాయః॥ 60 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణ పర్వమను ఉపపర్వమున
కర్ణపలాయన మను అరువదియవ అధ్యాయము. (60)