4. నాలుగవ అధ్యాయము

ద్రుపదుని అంగీకారము.

ద్రుపద ఉవాచ
ఏవమేతన్మహాబాహో భవిష్యతి న సంశయః।
న హి దుర్యోధనో రాజ్యం మధురేణ ప్రదాస్యతి॥ 1
అనువర్త్స్యతి తం చాపి ధృతరాష్ట్రః సుతప్రియః।
భీష్మద్రోణౌ చ కార్పణ్యాద్ మౌర్ఖ్యాద్ రాధేయసౌబలౌ॥ 2
ద్రుపదుడు ఇలా అన్నాడు. మహాబాహూ! సాత్యకీ! నీవు అన్నట్లుగానే జరుగుతుంది. సందేహం లేదు. దుర్యోధనుడు రాజ్యాన్ని మృదుపద్ధతిలో ఇవ్వడు.
కొడుకును ప్రేమించే ధృతరాష్ట్రుడు అతనినే అనుసరిస్తాడు. భీష్మద్రోణులు నిస్సహాయతతోనూ, కర్ణ శకునులు మూర్ఖత్వంతోనూ అతనితోనే ఉంటారు. (1-2)
వి॥తె॥ "బల విక్రమ సంపన్నుండును, సహాయ సంపన్నుండును, దుష్టాత్ముండును నైన దుర్యోధనుండు, ప్రియవచనంబుల రాజ్యంబు పాలిచ్చుట కియ్యకొనమి సిద్ధంబు" అన్నాడు తిక్కన.
సుతప్రియః అన్న దాన్ని తిక్కన "తనూజ తృష్ణనూనినవాడు" అని వివరించాడు.
బలదేవస్య వాక్యం తు మమ జ్ఞానే న యుజ్యతే।
ఏతద్ధి పురుషేణాగ్రే కార్యం సునయమిచ్ఛతా॥ 3
న తు వాచ్యో మృదువచః ధార్తరాష్ట్రః కథంచన।
న హి మార్దవసాధ్యోఽసౌ పాపబుద్ధిర్మతో మమ॥ 4
బలరాముని సూచన సరికాదు అని నాకనిపిస్తోంది. న్యాయాన్ని, నీతిని కోరే మహాపురుషుడు ఈ పని సాధించాలి. దుర్యోధనుడు ఎన్నటికీ మెత్తని మాటలతో చెప్పదగినవాడు కాదు. ఆ పాపబుద్ధి మెత్తదనానికి లొంగేవాడు కాదని నా అభిప్రాయం. (3,4)
వి॥తె॥ 'బలదేవుని మాట మాట కాదు' - అని తిక్కన తెనిగింపు - అనగా "శకునిలో తప్పు లేదు". ఇది ఆమాట.
గర్ధభే మార్దనం కుర్యాత్ గోషు తీక్ష్ణం సమాచరేత్।
మృదు దుర్యోధనే వాక్యం యో బ్రూయాత్ పాపచేతసి॥ 5
పాపాత్ముడైన దుర్యోధనునితో మృదువుగా మాట్లాడాలనుకునేవాడు గాడిదపట్ల మెత్తదనాన్ని, ఆవుపట్ల కఱుకుదనాన్ని చూపేవాడు. (5)
మృదుం నై మన్యతే పాపః భాషమాణమశక్తికమ్।
జితమర్థం విజానీయాత్ అబుధో మార్దవే సతి॥ 6
పాపాత్ముడు మెత్తగా మాట్లాడేవానిని అశక్తుడుగా భావిస్తాడు. మూర్ఖుడు ఎదుటివారి మృదుత్వం చూచి తాను గెలిచా ననుకొంటాడు. (6)
వి॥తె॥ దీన్ని తిక్కన మరింత వివరించాడు.
మృదుభాషణముల దుర్జన
హృదయములు ప్రసన్నతా మహిమఁబొందునె? యె
ల్లిదముగఁగొని యంతంతకు
మద మెక్కుంగాక దురభిమానము పేర్మిన్.
ఉద్యో -1-34
ఏతచ్పైవ కరిష్యామః యత్నశ్చ క్రియతామిహ।
ప్రస్థాపయామ మిత్రేభ్యః బలాన్యుద్యోజయంతు నః॥ 7
ఇలాగే చేద్దాం. దానికి తగిన ప్రయత్నం చేయండి. మన మిత్రుల వద్దకు వెళదాం. మన బలాలను సమకూర్చండి. (7)
శల్యస్య ధృష్టకేతోశ్చ జయత్సేనస్య వా విభో।
కేకయానాం చ సర్వేషాం దూతా గచ్ఛంతు శీఘ్రగాః॥ 8
మహారాజా! శల్యుడు, ధృష్టకేతువు, జయత్సేనుడు, కేకయులు మొదలైనవారందరి వద్దకు త్వరగా వెళ్లగలిగిన దూతలను పంపండి. (8)
వి॥ 1) శల్యుడు = మద్రదేశపు రాజు - నకుల సహదేవుల మేనమామ.
2) ధృష్టకేతువు = చేదిదేశపురాజు, శిశుపాలుని కొడుకు.
3) జయత్సేనుడు = మగధ దేశపురాజు, జరాసంధుని కొడుకు.
4) కేకయులు = వీరు కేకయ దేశపురాజులు - వీరిలో అయిదుగురు పాండవ పక్షాన, అయిదుగురు కౌరవ పక్షాన చేరారు.
స చ దుర్యోధనో నూనం ప్రేషయిష్యతి సర్వశః।
పూర్వాభిపన్నాః సంతశ్చ భజంతే పూర్వచోదనమ్॥ 9
దుర్యోధనుడు కూడా తప్పకుండా అన్నివైపులకు దూతలను పంపుతాడు. సజ్జనులు ముందుగా వచ్చినవానికే సహాయం చేస్తారు. (9)
తత్ త్వరధ్వం నరేంద్రాణాం పూర్వమేవ ప్రచోదనే।
మహద్ధి కార్యం వోఢవ్యమ్ ఇతి మే వర్తతే మతిః॥ 10
అందువలన ముందుగానే రాజులందరికీ ఆహ్వానాలు పంపేటందుకు త్వరపడాలి. ఇక్కడ ఉన్న వారందరూ చాలా పెద్ద కార్యభారాన్నే మోయవలసి ఉందని నా అభిప్రాయం. (10)
శల్యస్య ప్రేష్యతాం శీఘ్రం యే చ తస్యానుగా నృపాః।
భగదత్తాయ రాజ్ఞే చ పూర్వసాగరవాసినే॥ 11
శల్యుని వద్దకు, అతనిని అనుసరించే రాజుల వద్దకు, పూర్వసముద్రతీరనివాసియైన మహారాజు భగదత్తుని వద్దకు వెంటనే దూతలను పంపండి. (11)
అమితౌజసే తథోగ్రాయ హార్దిక్యాయాంధకాయ చ।
దీర్ఘప్రజ్ఞాయ శూరాయ రోచమానాయ వా విభో॥ 12
భగవాన్! అలాగే అమితౌజసుడు, ఉగ్రుడు, కృతవర్మ, అంధకుడు, దీర్ఘప్రజ్ఞుడు, శూరుడు, రోచమానుడు వీరందరి వద్దకు కూడా దూతలను త్వరగా పంపాలి. (12)
వి॥ 1) అమితౌజసుడు = ఒక రాజు - పాండవ పక్షంలో ఉన్న మహారథులలో ఇతనిపేరు ఉంది. (5-171-11)
2) ఉగురుడు = ఒక యాదవ రాజు
3) శూరుడు = ఒకరాజు
4) అంధకుడు = ఒకరాజు
5) దీర్ఘ ప్రజ్ఞుడు = వృషపర్వుడనే రాక్షసుని అంశతో పుట్టిన రాజు(1-67-16)
6) రోచమానుడు = ఒక రాజు - మహారథులలో పరిగణింపబడినవాడు(5-172-1)
ఆనీయతాం బృహంతశ్చ సేనాబిందుశ్చ పార్థివః।
సేనజిత్ ప్రతివింధ్యశ్చ చిత్రవర్మా సువాస్తుకః॥ 13
బాహ్లికో ముంజకేశశ్చ చైద్యాధిపతిరేవ చ।
సుపార్శ్వశ్చ సుబాహుశ్చ పౌరవశ్చ మహారథః॥ 14
శకానాం పహ్లవానాం చ దరదానాం చ యే నృపాః।
సురారిశ్చ నదీజశ్చ కర్ణవేష్టశ్చ పార్థివః॥ 15
నీలశ్చ వీరధర్మా చ భూమిపాలశ్చ వీర్యవాన్।
దుర్జయో దంతవక్త్రశ్చ రుక్మీ చ జనమేజయః॥ 16
ఆషాఢో వాయువేగశ్చ పూర్వపాలీ చ పార్థివః।
భూరితేజా దేవకశ్చ ఏకలవ్యః సహాత్మజైః॥ 17
కారూషకాశ్చ రాజానః క్షేమధూర్తిశ్చ వీర్యవాన్।
కాంబోజా ఋషికా యే చ పశ్చిమానూపకాశ్చయే॥ 18
జయత్సేనశ్చ కాశ్యశ్చ తథా పంచనదా నృపాః।
క్రాథపుత్రశ్చ దుర్ధర్షః పార్వతీయాశ్చ యే నృపాః॥ 19
జానకిశ్చ సుశర్మా చ మణిమాన్ యోఽతిమత్సకః।
పాంశురాష్ట్రాధిపశ్చైవ ధృష్టకేతుశ్చ వీర్యవాన్॥ 20
తుండశ్చ దండధారశ్చ బృహత్సేనశ్చ వీర్యవాన్।
అపరాజితో నిషాదశ్చ శ్రేణిమాన్ వసుమానపి॥ 21
బృహద్బలో మహౌజాశ్చ బాహుః పరపురంజయః।
సముద్రసేనో రాజా చ సహపుత్రేణ వీర్యవాన్॥ 22
ఉద్భవః క్షేమకశ్చైవ వాటధానశ్చ పార్థివః।
శ్రుతాయుశ్చ దృఢాయుశ్చ శాల్వపుత్రశ్చ వీర్యవాన్॥ 23
కుమారశ్చ కలింగానామ్ ఈశ్వరో యుద్ధదుర్మదః।
ఏతేషాం ప్రేష్యతాం శీఘ్రమ్ ఏతద్ధి మమ రోచతే॥ 24
బృహంతుని పిలిపించండి. రాజులు సేనాబిందువు, సేనాజిత్తు, ప్రతివింధ్యుడు, చిత్రవర్మ, సువాస్తుకుడు, బాహ్లికుడు, ముంజకేశుడు, చైద్యరాజు, సురారి, నదీజుడు, కర్ణవేష్టుడు, నీలుడు, వీరధర్ముడు, పరాక్రమవంతుడైన భూమిపాలుడు, దుర్జయుడు, దంతవక్త్రుడు, రుక్మి, జనమేజయుడు, ఆషాఢుడు, వాయువేగుడు, పూర్వపాలి, భూరితేజుడు, దేవకుడు, పుత్రులతో సహా ఏకలవ్యుడు, కారూషక రాజులు, బలవంతుడైన క్షేమధూర్తి, కాంబోజ, ఋషిక, పశ్చిమద్వీపరాజులు, జయత్సేనుడు, కాశ్యుడు, పంచనదరాజులు, క్రాథపుత్రుడు, దుర్ధర్షుడు, పార్వతీయ రాజులు, జానకి, సుశర్మ, మణిమంతుడు, యోతిమత్సకుడు, పాంశురాజ్యాధిపతి, పరాక్రమ వంతుడైన ధృష్టకేతువు, తుండుడు, దండధారుడు, బృహత్సేనుడు, అపరాజితుడు, నిషాదుడు, శ్రేణిమంతుడు, వసుమంతుడు, బృహద్బలుడు, మహౌజుడు, శత్రునగరవిజేత అయిన బాహువు, పుత్రులతో సహా పరాక్రమశాలియైన సముద్రసేనుడు, ఉద్భవుడు, క్షేమకుడు, వాటధానుడు, శ్రుతాయువు, దృఢాయువు, శాల్వపుత్రుడు, యుద్ధతీవ్రుడు, యువకుడు అయిన కళింగరాజు మొదలైన ముఖ్యులందరి వద్దకు త్వరగా దూతలను పంపి యుద్ధంలో సహాయానికి ఆహ్వానించాలి. ఇదే నా అభిప్రాయం. (13-24)
13 శ్లో
వి॥ 1) బృహంతుడు : ఒకరాజు - (ద్రౌపదీ స్వయంవరంలో కూడా ఉన్నాడు)
2) సేనాబిందుడు : ఒక రాజు - 5-171-20 శ్లోకంలో కూడా వీని పేరు ఉంది.
3) సేనజిత్తు = ఒక రాజు
4) ప్రతివింధ్యుడు = ఒకరాజు
5) చిత్రవర్మ = పాంచాల రాజు యొక్క కొడుకు
6) సువాస్తుకుడు = ఒకరాజు
14 శ్లో
వి॥ 1) బాహ్లికుడు = ప్రతీపుని కుమారుడు - దేవాపి శంతనుల సోదరుడు
2) ముంజకేశుడు = ప్రాచీనమయిన రాజు - విచంద్రుడనే అసురుని అంశతో పుట్టినవాడు (1-67), (25-26)
3) సుపార్శ్వుడు = ఒకరాజు - కుపథుడనే అసురుని అంశతో పుట్టిన వాడు 1-67-29
4) సుబాహుడు - ఒకరాజు
5) పౌరవుడు - ఒకరాజు
15 శ్లో
వి॥ 1) సురారి - ఒకరాజు
2) నదీజుడు - ఒకరాజు
3) కర్ణవేష్టుడు - ఒకరాజు
16 శ్లో
వి॥ 1) నీలుడు - మాహిష్మతిరాజు - క్రోధవశుల అంశతో పుట్టినవాడు
2) వీరధర్ముడు - ఒకరాజు
3) భూమిపాలుడు - ఒకరాజు. క్రోధవశులనే రాక్షసుల అంశతో పుట్టినవాడు
4) దుర్జయుడు = ఒకరాజు
5) దంతవక్త్రుడు = క్రోధవశనామకులయిన రాక్షసుల అంశతో పుట్టినవాడు - కరూశ దేశాధిపతి, దిగ్విజయంలో సహదేవునిచేత పరాజితు డయ్యాడు.
6) రుక్మి - రుక్మిణి అన్న
7) జనమేజయుడు - ఒకరాజు
17 శ్లో
వి॥ 1) ఆషాఢుడు = క్రోధవశాంతతో పుట్టిన రాజు
2) వాయువేగుడు = క్రోధవశుల అంశతో పుట్టినరాజు
3) పూర్వపాలి = ఒకరాజు
4) భూరితేజుడు = ఒకరాజు(క్రోధవశాంశ)
5) ఏకలవ్యుడు = నిషాదరాజు హిరణ్యధన్వుని కుమారుడు - కృష్ణుడు వీనిని సంహరించాడు.
18 శ్లో
వి॥ 1) కారూషకులు = క్రోధవశులనే వారి అంశతో పుట్టినరాజులు
2) క్షేమధూర్తి = క్రోధవశులనే వారి అంశతో పుట్టినరాజు
3) కాంబోజులు - భారత ఖండంలో పశ్చిమోత్తర (వాయవ్య) భాగంలో ఒక జనపదం కాంబోజం - దానిలో నివసించేవారు కాంబోజులు
4) ఋషికులు = ఋషికమని ఒక జనపదం - అచ్చటి రాజులు - దిగ్విజయం చేసినపుడు అర్జునునికి వశమయ్యారు వీరు - 2-17-25
19 శ్లో
వి॥ 1) జయత్సేనః = మగధరాజు, జరాసంధుని పుత్రుడు
2) కాశ్యః = యుధిష్ఠిరుని సమకాలికుడు - ఒకరాజు. రథికుడుగా పరిగణింపబడినవాడు - (5-171-22)
3)పంచనదాః = అయిదు నదులున్నదేశపు రాజులు
4) క్రాథపుత్రః = ఒకరాజు - రాహువు అంశతోపుట్టినవాడు.
ఇతడు చివరకు కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు. అభిమన్యుని చేతిలో చనిపోయాడు. (7-14-25)
5) దుర్ధర్షః = ఒక రాజు
6) పార్వతీయాః = పార్వతీయ రాజులు - చివరకు వీరు దుర్యోధనుని పక్షాన యుద్ధం చేసి అర్జునుని చేతిలో చనిపోయారు.
20 శ్లో
వి॥ 1) జానకిః చంద్ర వినాశనుడనే అసురుని అంశతో పుట్టిన రాజు - (1-67-39)
2) సుశర్మా = త్రిగర్త దేశపురాజు. దక్షిణ గోగ్రహణం చేసిన వాడు
3) మణిమాన్/మణిమంతుడు = ఒక రాజు - ద్రౌపదీ స్వయంవరానికి వచ్చాడు - దిగ్విజయం చేస్తూ భీమునికి వశమయ్యాడు
4) యోతిమత్సకః = ఈ పేరు మహాభారత కోశమందు లేదు - ఒక వేళ ఇది మణిమాన్ యోతి మత్సరః - అని అయితే మణిమంతునికి విశేషణమవుతుంది. అపుడు అతిమత్సరుడయిన మణిమంతుడని అర్థం. (పూతిమత్స్యకః అని దాక్షిణాత్యపాఠం)
5) పాంశురాష్ట్రాధిపః = పాంశురాష్ట్రానికి రాజు - వసుదానుడు - ధర్మరాజు సేనలో చేరాడు - ద్రోణుని చేతిలో చనిపోయాడు.
6) ధృష్టకేతుడు = శిశుపాలుని కొడుకు
21 శ్లో
వి॥ తుండః = ఒకరాజు
దండధారః = ఒకరాజు - ద్రోణునిచేతిలో చనిపోయాడు(7-6-13)
బృహత్సేనః = క్రోధవశుల అంశతో పుట్టిన ఒకరాజు
అపరాజితః = కాలేయులనే రాక్షసులెనమండుగిరి అంశలతో పుట్టినవాడు
నిషాదః = నిషాదుల రాజు
శ్రేణిమాన్, శ్రేణిమంతుడు = ఒక రాజు. ద్రౌపదీ స్వయంవరానికి వచ్చాడు - దిగ్విజయం చేస్తూ భీమునికి వశమయ్యాడు
వసుమాన్, వసుమంతుడు = ధర్మరాజు సమకాలికుడు - ఒకరాజు
22 శ్లో
బృహద్బల = కోసలరాజు. దిగ్విజయంలో వీనిని భీముడు జయించాడు. కౌరవ పక్షాన పాల్గొన్నాడు. భారతయుద్ధంలో అభిమన్యుడు వీనిని వధించాడు.
మహౌజసుడు = ఒక రాజు - దిగ్విజయంలో వీనిని భీముడు జయించాడు.
బాహువు = ఒకరాజు
సముద్రసేనః = ఒకరాజు - దిగ్విజయంలో భీమపరాజితుడు.
కౌరవుల పక్షాన పోరాడాడు.
సహపుత్రేణ = సముద్రసేనుని పుత్రుడు సాముద్ర సేనుడు - భారత యుద్ధంలో చిత్రసేనుడు వీరిద్దరినీ చంపాడు.
23 శ్లో
ఉద్భవః = ఒకరాజు
క్షేమకః = యుధిష్ఠిరుని సభలోని ఒకరాజు(2-4-22)
వాటధానః = క్రోధవశులనే రాక్షసుల అంశతో జన్మించినవాడు
శ్రుతాయః = రాజు - కౌరవసేనలో చేరాడు. ధర్మరాజు ఓడించాడు. అర్జునుడు సంహరించాడు.
దృఢాయుః = ఒకరాజు
శాల్వపుత్రః = ఒకరాజు - శాల్వరాజుపుత్రుడు, దుర్యోధనుని పక్షాన చేరాడు.
24 శ్లో
వి॥ కుమారః = ఒక కళింగరాజు
అయం చ బ్రాహ్మణో విద్వాన్ మమ రాజన్ పురోహితః।
ప్రేష్యతాం ఢ్Hఋతరాష్ట్రాయ వాక్యమస్మై ప్రదీయతామ్॥ 25
మత్స్యరాజా! విద్వాంసుడైన ఈ బ్రాహ్మణుడు నా పురోహితుడు. మన మాటలు ఇతనికి చెప్పి ధృతరాష్ట్రుని వద్దకు దూతగా పంపండి. (25)
యథా దుర్యోధనో వాచ్యః యథా శాంతనవో నృపః।
ధృతరాష్ట్రో యథా వాచ్యః ద్రోణశ్చ రథినాం వరః॥ 26
దుర్యోధనునికి, భీష్మునికి, ధృతరాష్ట్రునికి, వీరాగ్రేసరుడైన ద్రోణునికి ఎవరెవరికి ఎలా చెప్పాలో వివరంగా చెప్పండి. (26)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగ పర్వణి ద్రుపదవాక్యే చతుర్థోఽధ్యాయః॥ 4 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సేనోద్యోగపర్వమను ఉపపర్వమున ద్రుపదవాక్యమను నాలుగవ అధ్యాయము. (4)