13. పదమూడవ అధ్యాయము
నహుషుడు ఇంద్రాణికి గడువు ఇచ్చుట. ఇంద్రుడు బ్రహ్మహత్యనుండి విముక్తుడగుట.
శల్య ఉవాచ
అథ తామబ్రవీద్ దృష్ట్వా నహుషో దేవరాట్ తథా।
త్రయాణామపి లోకానామ్ అహమింద్రః శుచిస్మితే॥ 1
భజస్వ మాం వరారోహే పతిత్వే వరవర్ణిని।
శల్యుడు అన్నాడు. యుధిష్ఠిరా! అప్పుడు దేవరాజు నహుషుడు ఇంద్రాణిని చూచి ఇలా అన్నడు. చక్కని నగుమోముదానా! నేను మూడులోకాలకు అధిపతియైన ఇంద్రుడను. రంగు రూపుగల సుందరీ! నన్ను నీ భర్తగా స్వీకరించు.(1 1/2)
ఏవముక్తా తు సా దేవీ నహుషేణ పతివ్రతా॥ 2
ప్రావేపత భయోద్విగ్నా ప్రవాతే కదలీ యథా।
ప్రణమ్య సా హి బ్రహ్మాణం శిరసా తు కృతాంజలిః॥ 3
దేవరాజ మథోవాచ నహుషం ఘోరదర్శనమ్।
కాలమిచ్ఛామ్యహం లబ్ధుం త్వత్తః కంచిత్ సురేశ్వరః॥ 4
నహుషుని పలుకులు విని పతివ్రత అయిన శచీదేవి పెనుగాలిలో అరటిచెట్టువలె భయంతో వణికిపోయింది. ఆమె బ్రహ్మదేవునికి చేతులు జోడించి నమస్కరించి, కఱకు చూపులు చూస్తున్న నహుషునితో "సురేశ్వరా! నీ నుండి కొంతకాలం గడువు కోరుతున్నాను" అని పలికింది. (2,3,4)
న హి విజ్ఞాయతే శక్రః కింవా ప్రాప్తః క్వ వా గతః।
తత్త్వమేతత్ తు విజ్ఞాయ యది న జ్ఞాయతే ప్రభో॥ 5
తతో ఽహం త్వాముపస్థాస్యే సత్యమేతద్ బ్రవీమి తే।
ఏవముక్తః స ఇంద్రాణ్యా నహుషః ప్రీతిమానభూత్॥ 6
"ఇంద్రుడు ఏ స్థితిలో ఉన్నాడో ఎక్కడికి వెళ్లాడో ఇప్పటికీ తెలియరావటం లేదు ప్రభూ! ఆయన ఆచూకీని స్పష్టంగా తెలుసుకొని, ఒకవేళ తెలియకపోతే అప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను. నేను సత్యం చెపుతున్నాను." శచీదేవి ఇలా పలుకగా నహుషుడు ఎంతో సంతోషించాడు. (6)
నహుష ఉవాచ
ఏవం భవతు సుశ్రోణి యథా మామిహ భాషసే।
జ్ఞాత్వా చాగమనం కార్యం సత్యమేతదనుస్మరేః॥ 7
నహుషుడు ఇలా అన్నాడు. సుందరీ! నీవు నాతో అన్నట్లుగానే కానియ్యి. దీని ప్రకారం ఇంద్రుని సమాచారం తెలియగానే నీవు నా దగ్గరకు వచ్చేయాలి. ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకోవాలి. (7)
నహుషేణ విసృష్టా చ నిశ్చక్రామ తతః శుభా।
బృహస్పతినికేతం చ సా జగామ యశస్వినీ॥ 8
నహుషుని అనుమతితో శుభలక్షణ, యశస్విని అయిన శచీదేవి బృహస్పతి నివాసానికి వెళ్లింది. (8)
తస్యాః సంశ్రుత్య చ వచః దేవాశ్చాగ్నిపురోగమాః।
చింతయామాసురేకాగ్రాః శక్రార్థం రాజసత్తమ॥ 9
రాజోత్తమా! ఇంద్రాణి మాటలు విని అగ్ని మొదలైన దేవతలందరు ఏకాగ్రతతో ఇంద్రుని కొఱకు వెదికారు. (9)
దేవదేవేన సంగమ్య విష్ణునా ప్రభవిష్ణునా।
ఊచుశ్చైనం సముద్విగ్నాః వాక్యం వాక్యవిశారదాః॥ 10
దేవదేవుడు, సమస్తసృష్టికి కారణభూతుడు అయిన విష్ణువును కలిసి సంభాషణచతురులు అయిన దేవతలు కలతపడుతూ ఇలా పలికారు. (10)
బ్రహ్మవధ్యాభిభూతో వై శక్రః సురగణేశ్వరః।
గతిశ్చ నస్త్వం దేవేశ పూర్వజో జగతః ప్రభుః॥ 11
దేవదేవా! సురపతి అయిన ఇంద్రుడు బ్రహ్మహత్యతో దోషి అయినాడు. జగత్తుకు మూల పురుషుడవు. ప్రభువువు అయిన నీవే మాకు దిక్కు. (11)
రక్షార్థం సర్వభూతానాం విష్ణుత్వముపజగ్మివాన్।
త్వద్వీర్యనిహతే వృత్రే వాసవో బ్రహ్మహత్యయా॥ 12
వృతః సురగణశ్రేష్ఠ మోక్షం తస్య వినిర్దిశ।
అన్ని ప్రాణులను రక్షించటానికి నీవు విష్ణుత్వాన్ని పొందావు. నీ పరాక్రమంతో వృత్రుడు మరణించగా ఇంద్రునికి బ్రహ్మహత్యాదోషం చుట్టుకొంది. సురశ్రేష్ఠా! అతనికి దానినుండి బయటపడే మార్గం చూపించు. (12 1/2)
తేషాం తద్వచనం శ్రుత్వా దేవానాం విష్ణురబ్రవీత్॥ 13
మామేవ యజతాం శక్రః పావయిష్యామి వజ్రిణమ్।
పుణ్యేన హయమేధేన మామిష్ట్వా పాకశాసనః॥ 14
పునరేష్యతి దేవానామ్ ఇంద్రత్వమకుతోభయః।
స్వకర్మభిశ్చ నహుషా నాశం యాస్యతి దుర్మతిః॥ 15
కించిత్ కాలమిదం దేవాః మర్షయధ్వమతంద్రితాః।
దేవతలు చెప్పినది విని విష్ణువు ఇలా అన్నాడు. ఇంద్రుడు నన్ను పూజిస్తే నేను ఆ వజ్రిని పవిత్రుని చేస్తాను. పుణ్యప్రదమైన అశ్వమేధయాగంతో పాకశాసనుడు నన్ను అర్చించి, నిర్భయుడై దేవేంద్రపదవిని తిరిగి పొందుతాడు. దుర్మతి అయిన నహుషుడు తన పనులతో తానే నాశనం అవుతాడు. దేవతలందరు కొద్దికాలం ప్రశాంతంగా ఓపిక పట్టండి. (13,14, 15 1/2)
శ్రుత్వా విష్ణోః శుభాం సత్యాం వాణీం తామమృతోపమామ్॥ 16
తతః సర్వే సురగణాః సోపాధ్యాయాః సహర్షిభిః।
యత్ర శక్రో భయోద్విగ్నః తం దేశముపచక్రముః॥ 17
శుభప్రదము, సత్యము అమృతసమానము అయిన విష్ణుమూర్తి వాక్కును విని, బృహస్పతిని, మహర్షులను వెంటబెట్టుకొని దేవతలు అందరూ కలసి ఇంద్రుడు భయంతో దాగిఉన్న చోటికి వెళ్లారు. (16,17)
తత్రాశ్వమేధః సుమహాన్ మహేంద్రస్య మహాత్మనః।
వవృతే పావనార్థం వై బ్రహ్మహత్యాపహో నృప॥ 18
ధర్మజా! అక్కడ మహాత్ముడైన మహేంద్రుని పవిత్రుని చేయటానికి బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టే అశ్వమేధయాగాన్ని పెద్దఎత్తున చేశాడు. (18)
విభజ్య బ్రహ్మహత్యాం తు వృక్షేషు చ నదీషు చ।
పర్వతేషు పృథివ్యాం చ స్త్రీషు చైవ యుధిష్ఠిర॥ 19
యుధిష్ఠిరా! ఇంద్రుడు చెట్లు, నదులు, కొండలు, భూమి, స్త్రీలకు బ్రహ్మహత్యా దోషాన్ని పంచి ఇచ్చాడు. (19)
సంవిభజ్య చ భూతేషు విసృజ్య చ సురేశ్వరః।
విజ్వరో ధూతపాప్మాచ వాసవో ఽ భవదాత్మవాన్॥ 20
ఈ విధంగా అన్నిభూతాలకు బ్రహ్మహత్యను పంచి ఇచ్చి దేవేంద్రుడు పాపరహితుడు నిశ్చింతుడై మనసును చక్కబరుచుకొన్నాడు. (20)
అకంపన్నహుషం స్థానాద్ దృష్ట్వా బలనిషూదవః।
తేజోఘ్నం సర్వభూతానాం వరదానాచ్చ దుస్సహమ్॥ 21
బలాసురుని సంహరించిన మహావీరుడైన దేవేంద్రుడు తన పదవిని పొందటానికి స్వర్గానికి వచ్చి, అక్కడ వర ప్రభావంతో తనదృష్టి సోకిన ప్రాణులన్నిటి తేజస్సును వశ పరుచుకొని విఱ్ఱవీగుతున్న నహుషుని చూచి వణికి పోయాడు. (21)
తతః శచీపతిర్దేవః పునరేవ వ్యనశ్యత।
అదృశ్యః సర్వభూతానాం కాలాకాంక్షీ చచార హ॥ 22
శచీపతి ఎవరికీ కనబడకుండా అదృశ్యుడై తగినకాలంకోసం ఎదురుచూస్తూ తిరుగసాగాడు. (22)
ప్రణష్టే తు తతః శక్రే శచీ శోకసమన్వితా।
హా శక్రేతి తదా దేవీ విలలాప సుదుఃఖితా॥ 23
ఇంద్రుడు అదృశ్యుడు కాగానే శచీదేవి దుఃఖితురాలై హా! ఇంద్ర! హా! ఇంద్ర! అంటూ ఏడ్చింది. (23)
యది దత్తం యది హుతం గురవస్తోషితా యది।
ఏకభర్తృత్వమేవాస్తు సత్యం ఉంటే నా పాత్రివ్రత్యం నిలుచుగాక! (24)
పుణ్యాం చేమామహం దివ్యాం ప్రవృత్తముత్తరాయణే।
దేవీం రాత్రిం నమస్యామి సిధ్యతాం మే మనోరథః॥ 25
ఉత్తరాయణంలో ఒకనాడు వచ్చే పుణ్యదాయిని, దివ్యస్వరూపిణి అయిన రాత్రిదేవికి నమస్కరిస్తున్నాను. నా కోరిక తీరుగాక! (25)
ప్రయతా చ నిశాం దేవీమ్ ఉపాతిష్ఠత తత్ర సా।
పతివ్రతాత్వాత్ సత్యేన సోపశ్రుతిమథాకరోత్॥ 26
యత్రాస్తే దేవరాజో ఽ సౌ తం దేశం దర్శయస్వ మే।
ఇత్యాహోపశ్రుతిం దేవీం సత్యం సత్యేన దృశ్యతే॥ 27
శచీదేవి మనస్సును ఇంద్రియాలను నిగ్రహించి రాత్రిదేవిఉపాసన చేసింది. పాతివ్రత్యం, సత్యవ్రతంతో ఉపశ్రుతి అనేపేరుగల రాత్రిదేవిని ఆవాహన చేసింది. ఆమెతో "దేవి! దేవరాజు ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడో ఆ చోటు నాకు చూపించు. సత్యం సత్యంతోనే కనబడుతుంది." - అనే మంత్రంతో శచీదేవి ఉపశ్రుతిని పిలిచింది. (నీల)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగ పర్వణి ఉపశ్రుతియాచనే త్రయోదశోఽధ్యాయః॥ 13 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సేనోద్యోగపర్వము ఉపపర్వమున ఉపశ్రుతియాచన మను పదమూడవ అధ్యాయము. (13)